విజయవాడ

అ’పరాజిత (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఉష ఆంటీ ఇప్పటికి నీకోసం మూడుసార్లు ఫోన్ చేశారమ్మా. నీ సెల్ స్విచ్ ఆఫ్‌లో వుందట. నీ ప్రయాణమెపుడని అడిగారు’
‘కాలేజీలో సెల్ ఆఫ్‌లో పెడ్తామని చెప్పకపోయావా? వొస్తూ టికెట్స్ తీసుకుని వొచ్చాను. ఈపూటే వెళ్తాను. రేపు నైట్‌కి రిటర్న్ అవుతాను. నేను ఉషతో మాట్లాడతాలే. ఇంతకీ నువ్వు మీ స్నేహితులని ఇక్కడికి రమ్మని చెప్పావా, లేదా ఈ రెండ్రోజులూ..’
‘కాసేపట్లో వొస్తారు వాళ్లు. ఆ హాస్టల్ వదిలి రావడమంటే పంజరంలోంచి తప్పించుకున్నట్లు ఫీల్ అవుతారు’
‘క్రింద మామీకి చెప్పి వెళ్తున్నాను. మీ అందరి భోజనం ఏర్పాట్లు ఆవిడ చూస్తారు. పరీక్షలకు బాగా ప్రిపేరవండి. ఈ ఎగ్జామ్స్ లేకపోతే నిన్నూ తీసుకువెళ్లేదాన్ని నాతో’
‘ఉష అడిగేది కూడా న్యాయమే. తనకు ఎవరూ లేరు. ఉన్న ఒక్క స్నేహితురాల్ని నేనయినా, కలిసి ఇరవై ఏళ్లు. తన పెళ్లితో సహా ఏ సంతోషాన్నీ మేం పంచుకోలేదు. ఇపుడైనా వెళ్లకపోతే తాను ఫీలవుతుంది. ఓకే మాఁ.. ఒక గంటలో బయలుదేరుతాను నేను’
‘మమీ! నీ బ్యాగ్ నేనే సర్దుతాను. నువ్వు యిష్టపడి ఏ ఫంక్షనుకు వెళ్లగా నేను చూడలేదు. ఎంజాయ్ దిస్ ఫంక్షన్ హార్ట్ఫుల్లీ మమీ’.
చిన్నగా నవ్వి శ్రీజ తలపై ముద్దు పెట్టుకున్నాను.
‘్థ్యంక్యూ మై బేబీ. ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఫైవ్ మినిట్స్’ అంటూ స్నానానికి వెళ్లాను.
***
అనుకున్నట్లే తెల్లవారుఝాముకల్లా ఉష వాళ్లింటి బెల్లు మోగించాను. అప్పటికే ఉష హడావుడిగా వుంది. తలుపు తీసి నన్ను చూడగానే ఒక్కసారిగా భోరుమంది.
‘ఇంకొంచెం ముందు రారాదూ..! నీకూ నేను బరువయ్యాను వుత్తరాలూ, ఫోన్లు తప్ప. మాయమైనావు పూర్తిగా’
‘అభిమానంకొద్దీ నిష్టూరమాడతావు గానీ నీ భర్తా, కూతురూ నాతో రిలాక్స్ అయ్యే వ్యవధి నీకెక్కడిచ్చారు చెప్పు’
‘వెల్! ఏదీ నీ కూతురూ.. కాబోయే పెళ్లికూతురు’
‘అదింకా నిద్ర లేవలేదు. ఈరోజు దాని బాధ్యతంతా నీదే. సాయంత్రం ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేదాకా అది నీ కూతురే అనుకో! ఇంకే హెల్ప్ వద్దు నీనుంచి’
‘మీ ఆయన లేరా? పరిచయమైనా చేయవా!’
‘ఆయన ఇంకా టూర్‌లోనే వున్నారు. నగేష్ తన బిజినెస్ తప్ప నా వూసే పట్టదు. ఈరోజు రావాలి. ఇద్దరం కలిసి వెళ్లి పిలవవలసిన పిలుపులు వున్నాయి. ఆల్బమ్ చూస్తావా?’
‘ఆల్బమ్ తిరగేసే టైము లేదులే. డైరెక్టుగా పరిచయం చేద్దువు’
‘ఓకే! అదుగో ఆ పైనున్న డూప్లెక్స్ బెడ్‌రూమ్ నా కూతురిది. నువ్వూ అక్కడే రెస్ట్ తీసుకుని దానిక్కావల్సిన ప్రిపరేషన్స్ చూడు’
‘నీ కూతురికి నేనొక సర్‌ప్రైజ్ ఇస్తా చూడు’
‘లెక్చరర్‌వి కదా! టీనేజర్లను బానే హేండిల్ చేస్తావులే. ముందు కొంచెం ఫ్రెష్ అవ్వు’
మెట్లెక్కి పైకి వెళ్లాను.
***
అరగంటలో మానసను రెడీ చేశాను. బ్యూటీపార్లర్‌కు వెళ్లిరావడం, టైలర్ నుంచి డ్రెస్ తెచ్చుకోవడం.. వరసగా పెద్ద లిస్టే తయారుచేసింది మానస. గబగబా బ్రేక్‌ఫాస్ట్ చేసి ఈవెనింగ్ పార్టీ మెనూ ఒకసారి చెక్ చేసి మేం బయలుదేరాం. ఉష ఇంకా డెకరేషన్ హడావుడిలో వుంది. ఫోన్లో ఎవరినో పెద్దగా కోప్పడుతోంది. కంగారుగా చూశాను మానస వంక.
‘మా డేడీ లేటు చెయ్యడమూ, అమ్మ అరవడమూ మామూలే ఆంటీ! మనం వెళ్దాం రండి’
మానస బైటకు నడిచింది. తోడుగా నేనూ..
‘ఆయనకి ఇల్లూ, బాధ్యతలూ పట్టవు. డబ్బు సంపాదన తప్ప. ఒక్కదాన్నీ ఎంతకని చచ్చేది’ ఉష గొణుగుతూనే వుందింకా. పనులన్నీ ముగించుకొని, నేనూ, మానస ఇల్లు చేరేసరికి లంచ్ టైం అయింది. వంటమనిషి మా ఇద్దరికీ భోజనం వడ్డించింది.
‘అమ్మావాళ్లేరీ..’ అడిగింది మానస.
‘మీ నాన్నగారు వచ్చేసరికి 9 గంటలయ్యింది. ఇద్దరూ కలిసి పిలుపులకు వెళ్లారు. పెళ్లివారు సాయంత్రంగానీ రారట. కేటరింగ్ వాళ్లనీ అప్పుడే రమ్మన్నారు. మీ ఇద్దర్నీ లంచ్ తినేసి రెస్ట్ తీసుకోమన్నారు’ వంటావిడ గబగబా విషయమంతా ఒప్పచెప్పేసింది.
‘మీరు మా డాడీని ఇప్పటివరకు చూడలేదట గదా! మమీ మీకు ఆల్బమ్ చూపమంది. చూస్తారా?’
‘ఇట్స్ ఓకే..! కాసేపట్లో ఎటూ కలుస్తాం కదా! ముందు ఇంట్లో కార్యక్రమం ముఖ్యం. భోజనం చేసి కాసేపు నిద్రపోతే నువ్వు ఫ్రెష్ అవుతావు కదా’
‘నిజమే ఆంటీ!’
‘గుత్తివంకాయ కూరా, సాంబారు, కందిపచ్చడి, బెండకాయ వేపుడు.. మీ అమ్మకి నా ఇష్టాలింకా గుర్తున్నాయి మానసా’
‘ఓహ్ ఆంటీ! ఇవన్నీ మా డాడీ స్పెషల్స్. ఆయన కోసం మమీ చేయిస్తుంది. మా వంటావిడ చేస్తే అమృతమే వండి వార్చినట్లు’
‘మీ డేడీవి కూడా నా రుచులేనన్నమాట. పరిచయం చేస్కోవాలి తప్పక’
***
ఉష పెళ్లి జరిగిన రోజులు గుర్తొచ్చాయి. వాళ్ల నాన్నగారు అప్పట్లో కోటీశ్వరుడు. తల్లిలేని పిల్ల అని గారాబంగా పెంచారు ఉషను. ఆయనకు హృద్రోగం రావడం, అప్పటికప్పుడు వాళ్ల బంధువులబ్బాయి నగేష్‌ని పిలిచి ఉషనూ, ఆస్తినీ కట్టబెట్టడం.. సినిమాల్లో లాగానే జరిగాయి. అప్పటికి మా కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో వుండటంతో నేను రాలేకపోయాను. నిజానికి అప్పటికి శ్రీజ కడుపులో పడింది. నా మనసులో గడచిన 20 ఏళ్లు గిర్రున తిరిగాయి. నేను, నా చదువు, తర్వాత ఉద్యోగం బిజీబిజీ.. ఇదిగో, ఇన్నాళ్లకి వీలయ్యింది తన కుటుంబాన్ని కలుసుకోడానికి. తృప్తిగా భోజనం ముగించి, పైనున్న బెడ్‌రూమ్‌కి వెళ్లి నడుం వాల్చాం. రాత్రి ప్రయాణ బడలిక వల్ల నిద్ర నన్ను కమ్మేసింది.
మెలకువ వచ్చేసరికి ఉదయం 4 గంటలయ్యింది. బ్యూటీపార్లర్ నుంచి మానసకు మేకప్ వేయడానికి ఒక మహిళ వొచ్చింది. పూలజడ వేయడానికి హెల్ప్ చేస్తూ కూర్చున్నాను. చూస్తుండగానే సాయంత్రమైపోయింది. క్రింద ఉష గలగలా మాట్లాడుతూ ఆహ్వానితులను రిసీవ్ చేసుకోవడం వినపడుతోంది.
‘ఆంటీ! నేను కిందికి వెళ్తున్నాను. మీరు రెడీ అయి వచ్చేయ్యండి’ అని చెప్పి మానస క్రిందికెళ్లింది.
పెళ్లికళ వచ్చేసింది. ఆడపిల్లలు చూస్తూండగానే ఎదిగిపోతారు. డాక్టరు చదువుతున్న నా కూతురు శ్రీజ కళ్లముందు మెదిలింది. అప్రయత్నంగా నిట్టూర్చాను.
‘ఈ చీరా, నెక్లెసూ నీకు చాలా బావుంటాయి మమీ! ఫంక్షన్ టైములో ఇవే కట్టుకో’.. నా బ్యాగ్ సర్దుతూ శ్రీజ చెప్పిన విషయం గుర్తొచ్చింది. వంగపూవు రంగు చీరకు ముత్యాల డిజైన్ బోర్డరు.. దానిపైకి ముత్యాల సెట్టు.. శ్రీవాత్సవకూ ఇదే రంగు ఇష్టం. ఒక్కొక్కసారి శ్రీజ వాళ్ల నాన్న శ్రీవాత్సవ నోటి నుండి వూడిపడ్డట్టు తోస్తుంది!.
చెరిగిపోయిన స్మృతులేవో కళ్లముందు నిజాలయి కదిలితే.. మనసు గతి తప్పిన విహంగమవుతుంది! సుడిగాలిలో చిక్కిన నావలా.. నా జీవితానికి నా కూతురే ఒక చుక్కానిలా మారింది. నా కూతుర్ని యోగ్యురాలిగా పెంచడం అనే తపస్సులో మునిగి, నన్ను నేను బతికించుకున్న రోజులే నా గతమంతా..!
‘నువ్వలా కూర్చుండి పోయావేమే? పెళ్లివారొచ్చేశారు. తెమిలి రావేమే..?’ ఉష కేకతో ఉలిక్కిపడ్డాను.
‘ఇదుగో! పది నిమిషాల్లో..’ బాత్రూంలో దూరాను.
***
ఉష స్వయంగా ఇంటీరియర్ డెకరేటర్ కావడంతో తన ప్రతిభ అంతా మేళవించి చేయించిన అలంకరణతో క్రింద హాలంతా ఏదో ఫైవ్‌స్టార్ హోటలు ఫంక్షన్ హాలును తలపించేలా వుంది. రకరకాల రంగుల లైట్లు, మంద్రంగా వినిపించే మ్యూజిక్, సెంట్రల్ ఎసితో అద్భుతంగా వుంది హాలు, వేదిక. ఉష, ఆమె భర్త నగేష్ పెళ్లివారితో మాట్లాడుతూ బిజీగా వున్నారు. వేదికపై గణపతి పూజతో కార్యక్రమం ఆరంభం కానుంది. పైగది మెట్ల పైనుండి నెమ్మదిగా దిగివస్తున్న నాపై లైటు ఫోకస్ అయింది.
అటువైపు చూసిన నగేష్ అప్రతిభుడయ్యాడు. నగేష్‌కు ఎంతో నచ్చే వంగపూవు రంగు చీరకు ముత్యాల చేరుల అల్లిక.. మెడలో మంచి ముత్యాల నెక్లెస్.. పొడవైన జడకు మల్లెల మాల.. ఉష సంతోషంగా దగ్గరకొచ్చింది.
‘రావే శారదా! మావార్ని ఇప్పటిదాకా చూడలేదు కదూ నువ్వు. ఈయనే మావారు.. నగేష్ శ్రీవాత్సవ! పరిచయం చేసింది’
‘శారదా!.. నువ్వా..? ఎన్నాళ్లకి’ అస్పష్టంగా అన్నాడు.
చూపు తిప్పుకోలేనంత అందంగా ఉన్నానేమో నేను.
చేతులు చాచాను. దగ్గరగా రాబోయాడు.
రెండు చేతులు జోడించి ‘నమస్తే’.. క్లుప్తంగా అన్నాను.
‘నా ఏకైక స్నేహితురాలు శారద. కాలేజీ లెక్చరర్. మీతో చెప్తుంటాగా ఈమె’.. నగేష్ చూపులు ఆర్తిగా నన్ను పైనుండి క్రిందకు తడుముతున్నాయి పోగొట్టుకున్న అపురూప వస్తువును మరలా చూస్తున్నట్లు.. జారిపోయిన అమృతపు చినుకులకు దోసిలి పట్టినట్లు అతని చూపులు ఆరాధనగా!
చటుక్కున తల తిప్పుకుని ‘ఎందాకా వొచ్చింది కార్యక్రమం?’ ఉష చేయి పట్టుకుని వేదిక వైపు అడుగులు వేశాను. వెనుక నుండి గుచ్చుతున్న చూపులు ఏదో అసౌకర్యం కలిగిస్తున్నాయి. పెళ్లికూతురి మేకప్ సర్దుతూన్న నా చెవిదగ్గర.. ‘అప్పటికన్నా ఇపుడే అందంగా.., కాదు..కాదు, అద్భుతంగా వున్నావు’ చిన్నగా వినపడింది. పక్కకి చూడబోయాను.
‘నిజంగానా డాడీ’? మానస ముందుకొచ్చి నగేష్ చేతులు పట్టుకుంది. కూతుర్ని దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దుపెట్టుకున్నాడు. (ముమ్మూర్తులా తనలాగే వుండే శ్రీజను చూస్తే ఏమంటాడో మరి).
‘ఆశీర్వదించండి డాడీ..!’ వంగి పాదాలు తాకింది మానస.
‘మెనీ హేపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రా..’ చెప్పింది కూతురికి, చూపులు నావైపు! తల తిప్పుకున్నాను. ‘అయ్యో డాడీ.. ఆయుష్మాన్ భవ’ అనాలి మీరు’ అంది.
‘ఏదోలేరా..! నిన్ను మళ్లీ వదులుకోడానికి సిద్ధంగా లేను నేను. నన్ను వదలి వెళ్లకురా..’ నగేష్ గొంతు గాద్గదికమైంది. తలదించుకుని వున్నానే్నను.
‘నేనూ ఈ వూర్లోనే కదా వుండేది. బాధపడకు డాడీ’ మానస తండ్రిని కౌగలించుకుంది ప్రేమగా.
‘నువ్వు వేదిక మీదికి వెళ్లమ్మా’ కూతురికి సూచించాడు.
‘నీతో కొంచెం మాట్లాడాలి శారదా. ప్లీజ్! కొంచెం వినవా?’
‘అమ్మా! మీరుభయులూ ఇలా రండి. ఆ తాంబూలాల పళ్లెం ఇలా తెండి’ పురోహితుని పిలుపుతో అటువెళ్లక తప్పలేదతనికి.
తాంబూలాలు మార్పించడం, వివాహ తేదీ నిర్ణయించి రాసిన ముహూర్త పత్రిక గట్టిగా చదివి ఉంగరాలు మార్పించడం... వగైరా తతంగం మరో గంట గడిచింది. ఉష కళ్లలో నీళ్లు. నిశ్చితార్థం అంటే సగం పెళ్లి అయినట్లే! ఒక్కతే కూతురాయె. వచ్చిన వారందరూ ఒక్కొక్కరే జంటను అభినందిస్తున్నారు. నేను తెచ్చిన ‘నెక్లెస్ సెట్’ ముందుగానే బహుమతిగా ఇచ్చాను. అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా జంటను ఆశీర్వదించాను.
ఆ ఎక్జయిట్‌మెంట్‌లో వున్న ఉషతో ‘వెళ్తున్నా’నని చెప్పాలని అన్పించలేదు. వారి మధ్య నుండి నేను వెళ్లిపోవాలని మాత్రమే తోచింది ఆ క్షణంలో! బహుశా ఎంతో ఆత్మీయులమైన మా మధ్య, మా స్నేహానికి ఈ దూరం ఇంతకాలం కలిగించడం కూడా భగవన్నిర్ణయమేమో? నా మనసంతా అల్లకల్లోలంగా వుంది. విరిగిపడిన కెరటంలా నేను!
నిశ్శబ్దంగా నా బ్యాగ్ తెచ్చుకుందామని మెట్లెక్కాను. ఎవరి పనుల్లో వారు బిజీగా వున్నట్లు తోచింది. మెట్ల మలుపులో క్రీనీడలో చేతులు కట్టుకుని నావంకే చూస్తూ.. ‘శ్రీ’! కొంచెం కంగుతిన్నాను.
‘నాతో ఒక్కమాటైనా మాట్లడలేదు నువ్వు. తప్పో, ఒప్పో.. జరిగిందేమిటో! నా సంజాయిషీనైనా వినవా శారదా?’
వౌనమే నా సమాధానంగా మిగిలింది.
‘ప్లీజ్ శారదా! ఒక్క అవకాశమివ్వు’
ముందుకే కదిలాను.
మామధ్య ఇంకా మిగిలున్న విలిపెములాంటి బంధమేదో పెనుత్రాటిగా నన్ను పెనవెయ్యక ముందే తుంచడం మంచిదని తోచింది. జరిగిన దానిలో నీ తప్పేమీ లేనపుడు బాధపడుతూ నిశ్శబ్దంగా, ఇలా నిష్క్రమించాల్సిన అవసరం నీకేంటని.. నా మనసు ప్రశ్నిస్తోంది నన్ను. ఏనాడో తెగిన బంధాన్ని అతికించుకునే ప్రయత్నం కన్నా స్వచ్ఛమైన మా స్నేహబంధాన్ని బతికించుకోవడం మేలని అన్పించింది ఆ క్షణం. బయటకు నడిచాను.
‘శారదా..! నేను డ్రాప్ చేస్తాను ఆగు. చీకట్లో వెళ్లకు ఒక్కదానివే!’
కారు కీస్ తీసుకుని శ్రీ బయటకు వచ్చేసరికి నేను ఆ సాయంత్రమే బుక్ చేసుకున్న ఓలా కాబ్ ఇంటిబైటే ఎదురుచూస్తోంది నా కోసం. ఎక్కాను.
‘వెళ్లొద్దు శారదా.. ప్లీజ్!’ అర్థిస్తున్నట్లు అడిగాడు.
‘మన చేతులసలు కలవనే లేదు. ఈ చప్పుడెందుకు? ఇక చప్పట్లెందుకు?’ చెప్పాలనుకున్నాను. మాటలైతే పెగల్లేదు.
వౌనానికి మాటల్లేకపోవచ్చు.. భాష లేకపోవచ్చు.. భావమైతే మనసుని తాకిందని.. మా ఇద్దరి చూపుల్లో ‘ఆరని తడి’ చెపుతూనే వుంది! క్యాబ్ పరుగుతీసింది రైల్వేస్టేషన్ వైపు!

- దుగ్గిరాల రాజ్యలక్ష్మి,
ఎర్రబాలెం, గుంటూరు జిల్లా.
చరవాణి : 9493851988

రాజకీయ గల్పిక..

ఓ చంటిగాడు!
ఓ మనిషీ! నా దగ్గరకు రావడానికి నీకు జీవితకాలం పట్టింది!.. అన్నదట మహాప్రస్థానం. గాలి ఉన్నంతవరకే లారీ చక్రాల్లా హైవేపై పరిగెడతాడు టైగర్‌లా మనిషి. ఎలాంటి వాడినైనా తలవంచేలా చేసేది రోగం ఒక్కటే. చంటిగాడి కథలోకి వెళితే ప్రేతాల దిబ్బపై బేతాళ ప్రశ్నలతో శవపంజరాన హోరెత్తిపోతున్నాడు.
ఒకింట్లో అన్నదమ్ముల ఉలిపికట్టెల పోట్లాట అది.
‘నేను వాకిలి చిమ్మాను.. నువు ముగ్గెట్టావా?’
‘మరి నేను గినె్నలు తోమాను. నువు అన్నం ఉడకేశావా?’.. ఈ కుమ్ములాటలో అన్నం ఉడికేదెప్పుడు? ఇంటివారి కడుపులు నిండేదెప్పుడు? ఒకప్పుడు తెల్లవాడి వేధింపులకేడ్చాము. ఇప్పుడు వర్గపోరాటాలు, ఆధిపత్య పోరులు. ప్రజల ఏలుబడేదీ? చైతన్యం తలవాలుస్తోంటే ‘నీ కంట్లో నా వేలు.. నానోట్లో నీ వేలు’ అనే రాజకీయ తంత్రాలతోనే కడుపులు నింపుకుంటారా? తెగడక, ముడిపడక బంగారు ఇటుకలతో భవిత మెరిసేదెప్పుడు? బ్రిటీష్ దౌర్భాగ్యుల చేతుల్లో గుండెల్లో కదిలే భావావేశం సమాధి స్థితికి చేరుకుందానాడు. అంతరంగ అగాథంలో లోతైన ప్రతీకారం తెల్లవాడిని తోలెయ్యడంతో తీరిపోయిందనుకున్నాం. రామరాజ్యం మనం చూడలేదు. కనీసం పడమర కిరణాలనైనా చూడగలమా? నేటి రాజ్యంలో కొత్తగా గుప్పుమన్న పాత వాసనది చంటిగాడి చుట్ట! గాలిలో తేలివచ్చి, వెకిలి నవ్వులతో రెచ్చగొడుతున్న పాత నేస్తాలని, ఆడ నేస్తాలని ముఖం తిప్పుకు తప్పుకుంటున్నా! కవి చౌడప్ప పద్యాల్లో కూడా దొరకని బూతుపదాల్ని అక్షింతల్లా చిలకరిస్తూ నీ మూలాలను తవ్వి కథ చెప్పమంటూ మారాము చేశాయే! అర్ధాంతర జబ్బులతో అసువుల్ని బాసి, వేటగాళ్ల వలలోన వయస్సు, వగరు పిండిపోసిన అభాగినులు వారు, ఆడదెయ్యాలు వారు! వోట్లు బాగానే ఉన్నాయ్’ పాతపల్లవే పదేపదే పాడింది.
‘పాడెల్తో విలసిల్లే పాడు రాజ్యానికి ప్రభువు తాననుకుంటూ’.. శవాల దిబ్బెక్కి తన కథ మొదలు పెట్టాడు. ఈ శ్మశానవాటికకే రాజుననుకుంటూ!
‘వెలుగులేని బడిలో తెలుగు లేకున్నా
చదూకుంటానని నేను, అయ్యవారి కడకెళితే
ముడుపు కట్నాల మూట ఎక్కడన్నారు?
‘అయ్యా! ఎదగనోడిని నేను, ఎండుటాకును నేను’ నసుగుతూ నా తండ్రి వంగి నిలిచాడు.
‘పలుకుబడి లేకుండా పలకబడులెట్లంటూ
మానవత్వం మరచి మండిపడెనయ్యోరు’
‘అయ్యా! పొట్టలోన ఎలక పొయ్యిలోన పిల్లి
బక్కవాడినండీ కాలు మొక్కానే్నను’
తెల్లవాడి భాష తలకెక్కదు పొమ్మంటూ
బేతాళ ప్రశ్నలతో బాధించి పంపారు.
రాటుదేలిన నాకు రాజకీయ బడిలో సీటు దొరికింది.
‘నీ కంట్లో నావేలు.. నా నోట్లో నీ వేలంటూ’.. చాణక్య నీతిలో డిగ్రీలు పొందాను. పదవి తలపాగా నెత్తినెత్తాను నేను
పొగరు పొయ్యిలోన నెగడు అయ్యాను
రాజకీయ బడికి రాజునే అయ్యాను
మాయమాటలకు ఆస్కారులు.. నాకే అన్ని పురస్కారాలు..
నాకే పద్మశ్రీలు, పసిడి శాలువాలు నాకే
నాకెవరు ఎదురంటూ రెచ్చిపోయి అరిచాను
పసిడి శాలువాలు కప్పె, పద్మశ్రీలు ఇచ్చె
చాణక్యనీతిలో డిగ్రీలు పొందాను.. రాజకీయ బడికి రాజునయ్యాను
చదువులేని నేను రారాజునయ్యాను!

- యర్రంశెట్టి పాప, విజయవాడ.
చరవాణి : 9966771999
మనోగీతికలు

చిత్రమే మరి!
ముక్కలయిన గాజుముక్కలు
వివర్ణమయిన నగుమోము
వ్రక్కలయిన ఎద లోతులు
దేహాన్ని ప్రశ్నిస్తున్నాయి
నువ్వెందుకు బతికున్నావని?
జవాబులేని నిమిషం
వున్నా చెప్పలేని నైరాశ్యం
తలపులు తలుపులు తెరిచాయి
గోడకు కొట్టిన సున్నం వివర్ణమయింది
దూలాలకు పట్టిన బూజు వేలాడుతోంది
మనిషి బోర్లాపడి నిద్రిస్తున్నాడు
కనురెప్పల నుండి
రక్త బాష్పాలు రాలుతున్నాయి
నిమిషాల ముల్లు
గంటల ముల్లుతో జతకట్టింది
గడియారం ముల్లు ఎంత తిరిగినా
గుండ్రంగానే!
తన గీత దాటలేదు
తన మెడకు కొట్టిన సీల ఉరితాడైంది
అలసిపోయిన ఆకాశం ఆవలించింది
శీలవతి, గుణవతి ఇప్పుడు గర్భవతి అయింది
నిప్పుకణిక లాంటి నిజం చెప్పడానికి
ఆమెకు ‘ఇజం’ అడ్డొచ్చింది
దేవుడు ఏరోజు ఎవరిని ఎవరితో
జత కలుపుతాడో? చిత్రమే మరి!!

- తూములూరి రాజేంద్రప్రసాద్,
విజయవాడ.
చరవాణి : 9490332323

చిగురాకు నవ్వెనట..!
‘ముదురాకు రాలెనని చిగురాకు నవ్వెనట
చిరకాల ముందునని తాను తలచెనట’
ముదురాకులెందుకు దండగ అనుకుంటే
చిగురాకుకు మూలమేది?

చిగురాకుల సవ్వడులు వినాలని
ఎగిరిపడే వాటి సోయగాలు చూడాలని
ఆశగా చూస్తోంది రాలిపడిన ఆ పండుటాకు
అది తెలుసుకోలేని చిగురాకు
ఎగురుతూ ఎగతాళి చేస్తోంది
ఇంకెందుకు నువ్వంటూ!

పండుటాకులని పారెయ్యకు బయట
పదిలంగా దాచితే పనికొస్తాయి ముందట
నింగినంటుతున్న సౌందర్య సౌధాలను చూసి
మురిసిపోతున్నావు గానీ
భారాన్ని మోస్తున్న పునాదుల్ని మరిచావు
గుర్తుందా?
మట్టిలో ఉంది మనకెందుకులే అనుకుంటే
సౌధానికి స్థానముంటుందా?

వృద్ధులు కారు వాళ్లు
నీ భవితకు పునాదిరాళ్లు
పునాది రాళ్లను పూజించినప్పుడే
నవీన రాళ్లు సౌధాలవుతాయి
మొన్నటిదాకా వృద్ధాప్యం
ముందు తరాలకు కాంతిదీపం
కానీ.. నేడది వికృత రూపం
భయంకర శాపం
నిశీధి నిశ్శబ్దం

రెక్కలొచ్చి పక్షులు
తలోదిక్కుకు ఎగిరిపోతే
ఒక్కముద్ద బువ్వ కోసం
ఓ ఆప్యాయమైన పిలుపు కోసం
గూటినంటి పెట్టుకుని
నిరీక్షిస్తూనే ఉంటే
నిన్నటి పెద్దరికం
నేడు వ్యర్థ పదార్థమైపోయిందా?

వృద్ధాశ్రమాలకు విరాళాలివ్వటం కాదు
వాటి ఆవిర్భావానికి
కారకులెవరో తెలుసుకోవాలి
శక్తినంతా ధారపోసి
అశక్తులయ్యారు వాళ్లు
జీవితాన్నంతా త్యాగం చేసి
జీవచ్ఛవాలుగా మిగిలారు నేడు
వృద్ధులు కారు వాళ్లు
జీవన సమరంలో అలసిన అభిమన్యులు
గతకాలపు చరిత్రకు సజీవ ఆనవాళ్లు

మలిసంధ్యా సమయంలో
మమతల్ని అందించి
మధుర స్మృతుల్ని వారికి
మణిహారంగా వేద్దాం
ఒక్కసారి ఆలోచిద్దాం
వాడిపోని చిరునవ్వులు
వారి మోముల్లో పూయిద్దాం!

- యనమాల సుందర్,
ఫిరంగిపురం, గుంటూరు జిల్లా.
చరవాణి : 9032319507

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

email: merupuvj@andhrabhoomi.net

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

- దుగ్గిరాల రాజ్యలక్ష్మి