ఉత్తర తెలంగాణ

గురుదక్షిణ ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నమస్తే మేడం’ అన్న పిలుపుతో నోట్స్ దిద్దుతున్న వీణాపాణి తలఎత్తి చూసింది.
‘బాగున్నారా మేడం?’ అంటూ ఎదురుగా ఇద్దరు యువకులు నవ్వుతూ నిలబడ్డారు.
ఎవరా? అని ఆలోచిస్తుంటే ‘మేడం మమ్మల్ని గుర్తుపట్టలేదా? మేం నరేశ్, సురేష్’ అన్నారు వాళ్లు.
వెంటనే వీణాపాణి గతం గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేసింది! అది జనవరి ఏడో తేదీ 2003వ సంవత్సరం! సాయంత్రం ఐదు దాటింది! చలికాలం కావడం వల్ల చీకట్లు తొందరగా ముసరసాగాయి. వడివడిగా స్కూల్ నుండి ఇంటికి నడుస్తుంది వీణాపాణి ఇంటి దగ్గర బాబు ఏం చేస్తున్నాడో ఆకలికి పాల కొరకు ఏడుస్తున్నాడో ఏమో అనే ఆలోచనతో..
ఇంతలో గీతాభవన్ హోటల్ వెనకవైపునున్న సందులోకి అడుగుపెట్టింది. ఆ సందు చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. ఆ సందులో ఒక్క ఇల్లుకూడా ఉండదు. రణగొణ ధ్వనులు అసలే ఉండవు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మెయిన్ రోడ్ నుండి కాకుండా ప్రతి రోజు ఆ సందు గుండానే ఇంటికి వెళ్తుంది వీణాపాణి.
ఆ రోజు ఆమె ఆ సందులోకి అడుగుపెట్టేసరికి ఎదురుగా సందు చివరి నుండి నేరుగా ఆమె వైపే నడిచి వస్తూ కన్పించాడు. ఎందుకో ఆమెకు ఒక్కసారిగా భయం వేసింది. అయినా వాడిని చూడనట్టే చేస్తూ మెల్లగా వెనక్కి వెళ్లి పోదామా అని వెనక్కి తిరిగి చూసింది. వెంటనే ఆమె గుండె భయంతో వేగంగా కొట్టుకోసాగింది. ఎందుకంటే వెనక నుండి సురేష్ వస్తున్నాడు.
అంతలో ఆమెకు ఉదయం స్కూల్లో జరిగిన సంఘటన గుర్తొచ్చింది. వీణపాణి కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మ్యాథ్స్ టీచర్. ఈ మధ్యనే ఆ స్కూల్‌కి ట్రాన్స్‌ఫర్ మీద వచ్చింది. ఆమె 8వ తరగతి క్లాస్ టీచర్. అది బాయ్స్ హైస్కూల్.
ఆ క్లాసులో 30మంది వరకు అబ్బాయిలున్నారు. అందులో నరేష్, సురేష్‌లు ఇద్దరు అన్నదమ్ములు. వారు రౌడీ వెధవలు. ఈ వయసులోనే వారు సిగరెట్లు తాగడం, అమ్మాయిల్ని చిడాయించడం, టీచర్లకు ఎదురు తిరగడం లాంటి అల్లరి చిల్లర పనులు చేస్తుంటారు. వారి తండ్రి పోలీస్ డిపార్టుమెంటులో పనిచేస్తాడు. ఇక వారికి అందుకే ఎవరి భయం లేదు. క్లాసులు జరుగుతున్నప్పుడు వాళ్లు చిల్లర వేషాలు వేస్తూ క్లాసులో కూర్చోకుండా గ్రౌండులో తిరుగుతుంటారు.
ఆ రోజు ఉదయం ఆమె క్లాసుకు వెళ్లగానే మిగతా స్టూడెంట్స్ లేచి ‘మేడం నరేష్, సురేష్‌లు గ్రౌండులో కూర్చొని సిగరెట్లు తాగుతూ, అమ్మాయిల్ని ఏడిపిస్తున్నారు’ అని వీణపాణికి ఫిర్యాదు చేశారు.
వెంటనే ఆమె కట్టె తీసుకొని గ్రౌండుకి వెళ్లి వారిని కొడుతూ క్లాసుకి తీసుకొచ్చింది. అంతేకాదు ప్రతి రోజు స్కూల్ టైములో క్లాసు విడిచి గ్రౌండులో ఉండకూడదని గట్టి వార్నింగిచ్చింది. అంతలోనే వారు ఏడుస్తుంటే వారితో ప్రేమగా మాట్లాడుతూ ‘ఎలారా నానా? ఈ వయసులోనే సిగరెట్లు తాగితే లంగ్స్ పాడవుతాయి. మీరు వేరే అమ్మాయిల్ని ఏడిపిస్తే మీ చెల్లెల్ని వేరే వాళ్లేడిపిస్తారు. తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి స్కూల్‌కి పంపిస్తే మీరు ఇలా చదువుకోకుండా తల్లిదండ్రులను మోసగించడం తప్పని, తల్లిదండ్రులకు తెలిస్తే ఎంత బాధపడతారో’నని మెల్లగా వాళ్లకి నాలుగు మంచి మాటలు ప్రేమతో చెప్పింది. ఇంతలో బెల్లవగానే స్ట్ఫా రూమ్‌కి వెళ్లింది.
అక్కడ కూర్చున్న మిగతా స్ట్ఫా అంతా ‘ఏంటి? వీణా.. కట్టె తీసుకొని గ్రౌండ్‌కి ఎందుకు వెళ్లావు?’ అని అడిగారు. వాళ్లతో జరిగిందంతా చెప్పింది. వెంటనే వాళ్లు ‘అయ్యో! ఎంత పని చేసావమ్మా. ఇక్కడ ఎవరెటుపోతే నీకేంది? వాళ్లని ఎందుకు కొట్టావు? వాళ్లు పెద్ద రౌడీవెధవలు. వాళ్లెళ్లి ఇంట్లో చెబితే వాళ్ల నాన్న కూడా స్కూల్‌కొచ్చి బాగా గొడవ చేస్తాడు. అందుకే వాళ్లని ఎవరూ ఏమీ అనరు. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు’ అని చెప్పారు. వాళ్ల మాటలకి వీణాపాణి నవ్వుతూ తేలికగా ‘ఆ పరిస్థితి వస్తే చూద్దాంలెండి. మీరందరూ లేదా నాకు’ అంది.
కాని సాయంత్రం వాళ్లిద్దర్ని అలా సందులో చూడగానే భయం వేయసాగింది ఆమెకు. కాళ్లు, చేతులు ఆడడం లేదు. భయంతో గుండె వేగంగా కొట్టుకోసాగింది. లోపల భయపడుతూనే పైకి ధైర్యంగా ముందుకు నడవసాగింది.
ముందు నుండి నరేష్, వెనక నుండి సురేష్ ఆమెను సమీపించారు. వాళ్ల మొహాలు ఎర్రగా కందిపోయి ఉన్నాయి.
వీణాపాణి చుట్టూ చూసింది ఆశతో ఎవరైనా కనిపిస్తే పిలుద్దామని. కానీ ఎవరూ కనిపించట్లేదు.
భయంతో నడక ఆపి ఏదైతే అదవుతుందని వారిని ‘ఏరా ఎందుకొచ్చారు?’ అని అడిగింది.
వెంటనే వాళ్లు ఏడుస్తూ ఆమె కాళ్లపైబడ్డారు. ‘మేడం మమ్మల్ని క్షమించండి. ఇంకోసారి మేం పిచ్చి వేషాలు వేయం. చక్కగా చదువుకుంటాం. ప్రతి రోజు స్కూల్‌కి వస్తాం. మమ్మల్ని చూసి భయపడేవాళ్లే అందరూ. కాని మీలా మంచి మాటలు చెప్పేవాళ్లు ఎవరూ లేరు ఇప్పటివరకు. ఈ విషయం స్కూల్లోనే మీకు చెపుదామంటే అందరి ముందు సిగ్గన్పించింది’ అన్నారు వాళ్లు.
వీణాపాణి ఒక్కసారి స్థాణువులా నిలబడిపోయింది. వాళ్లు ఆ రోజు నుండి ప్రతి రోజు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చి బాగా చదువుకోసాగారు.
ఇంతలో కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వీణావాణి లాంగ్ లీవ్ పెట్టడం, తరువాత ట్రాన్స్‌ఫరై వేరే స్కూల్‌కి వెళ్లడం జరిగింది.
ఇక ఆ పిల్లల గురించిన విషయాలేమీ ఆమెకు తెలియలేదు. దాదాపుగా ఐదారు సంవత్సరాలు గడిచాయి. తరువాత వారిలా ఆమెకు తారసపడడం వల్ల గతం గుర్తుకొచ్చింది ఆమెకు!
‘మేడం! ఇంకా మేం ఇంకా మీకు గుర్తు రాలేదా?’ అన్న పిలుపుతో గతం నుండి ఈ లోకంలోకి వచ్చింది వీణాపాణి.
మేడం ఈ రోజు ‘టీచర్స్ డే’ కదా అందుకే మీకు ‘గురుదక్షిణ’ తెచ్చాం తీసి చూడండి అన్నారు వాళ్లు.
‘ఇపుడు ఏం చేస్తున్నారు నాన్నా?’ అంటూ ఆ కవర్ని తీసుకొంది. ‘నేను ఉస్మానియా హాస్పిటల్‌లో కార్డియాలజిస్టుని, సురేష్ ఆర్‌కెబిలో ఇంజనీర్’ అన్నాడు నరేష్, ‘మీవల్లె మేమిలా బాగుపడ్డాం. అందుకే వద్దనకుండా మా ఈ గురుదక్షిణ స్వీకరించండి ప్లీజ్’ అన్నారు వాళ్లు.
ఆ కవర్లో ఒక పూలదండ, శాలువా, ఒక చీర ఉన్నాయి. ఎవరి వద్ద ఏమీ తీసుకోని వీణాపాణి ఆ కవర్ని ఎంతో అపురూపంగా తీసుకొంది! ఆమె కళ్లలో ఆనందబాష్పాలు చెమ్మగిల్లాయి!

- సల్వాజి వాణి, కరీంనగర్
సెల్.నం. 9000282372

అంతరంగం

శ్రమజీవుల స్వేదం...
నా కవిత్వానికి ఆలంబనం!

- డా. దామెర రాములు

కవి చిరునామా:
నిర్మల్ నర్సింగ్ హోం,
తిరుమల టాకీస్ ఎదురుగా,
నిర్మల్ (పోస్టు),
ఆదిలాబాద్ జిల్లా-504106
సెల్.నం. 9866422494

ఎంత గానం చేసినా.. వొడువని మానవ జీవితంలోని చిక్కుదారుల తీరుతెన్నులు.. శ్రమజీవుల చమట చుక్కలు తమ కవిత్వానికి ఆలంబనమని ప్రముఖ కవి దామెర రాములు అంటున్నారు! ఆయన పుట్టింది వరంగల్ జిల్లా హవేలి శాయంపేట అయినా.. గత మూడు దశాబ్దాలుగా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో వైద్యునిగా తమ సేవలను అందిస్తున్నారు. చిన్న చిన్న ఉద్యమాలు మొదలుకుని, చిట్టచివరగా రాజ్యాధికారం కైవసం చేసుకునే.. ఏ పోరాట రూపమైనా.. అస్తిత్వ ఉద్యమమైనా ఆయన కవిత్వానికి ప్రేరణ అంటూ.. ఎన్ని కాన్వాసుల్లో చిత్రించినా.. ఎన్ని గ్రంథాలు రాసినా.. తన సాహిత్య సృజన దాహం తీరదని సవినయంగా ప్రకటించుకునే ఆయనకు కవిత్వంతో పాటు కథలు, నవలలు రాసిన అనుభవముంది.
‘కోరస్’, ‘నెత్తుటి వెనె్నల’, ‘జయహే తెలంగాణ’, ‘కొర్రాయి’, ‘అసలు ముఖం’, ‘ఉద్యమకారునికి వంద ప్రశ్నలు - జవాబులు’, ‘్ఫర్ బీ దిల్ హై హిందూస్తానీ’ వంటి గ్రంథాలను వెలువరించి సాహితీ లోకంలో కవిగా తమ స్థానాన్ని పదిలపరుచుకున్నారు..
అభ్యుదయ భావాలను అణువణువునా పుణికి పుచ్చుకున్న ఆయన తెలంగాణ ఉద్యమానికి తమ రచనల ద్వారా ఊపిరులూదారు. పీడిత జనపక్షాన నిలిచి వారి వ్యథలను కవిత్వంలో బంధించారు..
ప్రపంచీకరణ నేపథ్యంలో.. తమ కవిత్వం ద్వారా సామాజిక చైతన్యానికి కృషి చేసిన ఘనత ఆయనకుంది!
సాహిత్య గ్రూపులకు, లాబీయింగులకు దూరంగా వుండే దామెర రాములు తీరిక లేని వైద్య వృత్తిలో ఉంటూనే.. రచనా వ్యాసాంగాన్ని ప్రవృత్తిగా మలుచుకుని నిత్య సాహితీ కృషీవలుడిగా భాసిల్లుతున్నారు. అదరని బెదరని ధిక్కార స్వరం ఆయనది! అభ్యుదయ, విప్లవ కవిత్వాలు రెండూ ప్రజాస్వామ్య దృక్పథం కలిగినవే అయినప్పటికీ.. అభ్యుదయ, విప్లవ కవులు తమలో తాము కుమ్ములాడుకోవడం, అసలు లక్ష్యాన్ని విస్మరించడంపై తమ ఆవేదన వ్యక్తపరుస్తారు.
కవిగా.. వివిధ సాహితీ, సామాజిక, సాంస్కృతిక సంఘాల్లో క్రియాశీల పాత్రను పోషిస్తున్న ఆయనను ఎన్నో అవార్డులు వరించాయి. వాటిలో సినారె కవితాపురస్కారం, అలిశెట్టి ప్రభాకర్ అవార్డు, ఎక్స్‌రే అవార్డు, తెలంగాణ ఆవిర్భావ ప్రథమ ఉత్సవాల అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం ప్రముఖమైనవి.
భాష, భావ దారిద్య్రం లేకపోతే.. స్పాంటేనియస్‌గా కవిత్వం వస్తుందని భావించే ఆయనతో ‘మెరుపు’ ముచ్చటించింది. ఆయన అంతరంగంలోని సాహితీ సంబంధ అంశాలను ఆవిష్కరింప యత్నించింది. ముఖాముఖి వివరాలు ఆయన మాటల్లోనే..
ఆ కవిత్వం వల్ల ప్రయోజనమేమిటి?
కవిత్వం మనసుకు సాంత్వననిస్తుంది. మనిషికి అన్ని వేళలా అండగా వుంటుంది. పాట, పద్యం, తత్వం ఏ ప్రక్రియ అయినా ఆనందాన్నిస్తుంది.. ఉత్తేజపరుస్తుంది. ఉద్రేకపరుస్తుంది. మనిషి నిరాశా నిస్పృహల్లో ఉన్నప్పుడు ఉపశమనం కలిగిస్తుంది. మానవ జీవితంలోని అన్ని పార్శ్వాలను స్పృశించడానికి చక్కని సాధనం కవిత్వం!
ఆ అదరని బెదరని ధిక్కార స్వరం మీది!
అది అలవడటానికి కారణం?
నేను సహజంగా పీడిత వర్గానికి చెందిన దళితున్ని.. కులం కారణంగా, ఆగర్భ దరిద్రం కారణంగా ఎన్నో అవమానాలకు, అవహేళనలకు గురయ్యాను. నా జీవిత కాలంలో ఎన్నో విద్యార్థి, శ్రామికవర్గ పోరాటాలు కెరటాల్లా విరుచుకుపడ్డాయి. సంకెళ్లతో కాన్‌సెంట్రేషన్ క్యాంపుల్లో నిర్బంధానికి గురైన సంఘటనల తడి ఇంకా ఆరిపోలేదు.. పాలకులకు ఊడిగం చేసే మనస్తత్వం లేనివాడ్ని.. ప్రజల పక్షాన నిలిచేవాడిని కనుక సహజంగానే నా కవిత్వంలో ధిక్కార స్వరం ప్రతిబింబిస్తుంది.
ఆ నేటి కవులకు మీరిచ్చే సూచనలు ఏమిటి?
కవులు అధ్యయనం పట్ల శ్రద్ధ చూపాలి.. తమ కలాలకు పదును పెట్టుకుని.. ప్రతీకలు, పదచిత్రాలు, జాతీయాలు, నుడికారాలు, సామెతలు, పద విన్యాసాలు, అలంకారాలు, పుష్టిగా కవిత్వంలో ఒంప ప్రయత్నించాలి. శిల్ప సౌందర్యం కవిత్వాన్ని నిట్టాడులా నిలబెడుతుంది. ఉపమ, ఉత్ప్రేక్షలు, నవరసాలు కవిత్వంలో ఉంటేనే అది మనగలిగి మనుసుల్ని దోచుకోగలుగుతుందని గ్రహించాలి. ప్రాచీన, ఆధునిక సాహిత్యాన్ని విశే్లషణాత్మకంగా చదవాలి.
ఆ అసలు కవిత్వం సమాజాన్ని మార్చగలుగుతుందా?
పాఠకుల హృదయపుటంచుల్ని మీటగలిగే విధంగా కవిత్వం పండించగలిగితే తప్పక సమాజ మార్పుకు దోహదపడుతుంది.
ఆ తెలంగాణ పునర్నిర్మాణంలో సాహిత్యకారుల పాత్ర
ఎలా వుండాలనుకుంటున్నారు?
ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేసేందుకు కవులు రచయితలు ప్రజల పక్షాన నిలిచి ప్రతిపక్షపాత్ర పోషించాలి. ప్రజా ప్రయోజనాలను కాంక్షిస్తూ తమ కలాలను పాలకులపై ఎక్కుపెట్టాలి.

ఇంటర్వ్యూ : - దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544

నవ్వులు పువ్వులు

సామాజిక అంశాల సారం.. వీరభద్ర శతకం!
పేజీలు: 54,
వెల: 100/-
ప్రతులకు:
సుప్పని సత్యనారాయణ,
గ్రామం: కోనాపూర్
మండలం: బాన్స్‌వాడ
జిల్లా: నిజామాబాద్-503187
సెల్.నం.9492626910

‘అరుణిమ’ వచన కవితా సంపుటితో కవిగా అందరికీ పరిచయమైన సుప్పని సత్యనారాయణ వృత్తిరీత్యా తెలుగు ఉపన్యాసకులు. రచనా వ్యాసాంగాన్ని ప్రవృత్తిగా మలుచుకొని కవిత్వ సృజన చేస్తున్నారు. మంచి గాయకుడు. అంతేగాక ఆయనకు వీధి భాగవతం, యక్షగానం వంటి కళల్లో ప్రవేశముంది. నాటకాల్లో పాత్రలు పోషించిన అనుభవమూ ఉంది. భజన కార్యక్రమాలంటే అమితంగా ఇష్టపడే ఆయన మృదంగవాద్యం, తబల, హార్మోనియం వంటి వాయిద్యాలను వినియోగించడంలో, వాయించడంలో అనుభవాన్ని సంతరించుకోవడం విశేషం.. ఛందోబద్ధ పద్య రచన పట్ల ఆసక్తి చూపుతూ..‘శ్రీ వీరభద్ర శతకం’ గ్రంథాన్ని వెలువరించారు. నిజామాబాద్ జిల్లా కోనాపూర్‌లో కొలువుదీరిన ‘శ్రీ వీరభద్ర స్వామికి అంకితమిస్తూ..శ్రీ వీరభద్ర శతకాన్ని ప్రకటించారు. భగవంతుని పట్ల అత్యంత శ్రద్ధ్భాక్తులున్న కవి సుప్పని సత్యనారాయణ ఈ శతకాన్ని మహాశివరాత్రి పర్వదినం రోజు స్వామివారి సన్నిధిలో పూర్తి చేయడం విశేషం! ‘వీరభద్ర! కోనపౌరరుద్ర’ మకుటంలో సాగే ఈ శతకంలో కవి విభిన్న అంశాలను పద్యాలతో బంధించారు. ఈ గ్రంథానికి సురారం శంకర్ గీసిన చిత్రాలు నిండు శోభను కూర్చాయి!
అయితే ఈ కావ్యానికి నిర్ణయించిన వెల కొంచెం అయినా.. తెలుగు వైభవము.. వికాసము, భారతీయ సంస్కృతి- వైభవము, పల్లె-పట్టణ జీవన చిత్రం, మద్యపానం-భ్రూణహత్యలు, తల్లిదండ్రుల పట్ల పుత్రవాత్సల్యం, యువతరం కొత్త పోకడలు, స్ర్తి ప్రాతినిధం- ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై కవి పద్యాలను ఛందోబద్ధంగా రాసి పాఠకులను మెప్పించ యత్నించడం విశేషం! అక్కడక్కడ అక్షరదోషాలు అడ్డుపడుతుంటాయ. నేటి యువత అన్యభాషలపై మక్కువ చూపుతూ, తెలుగును విస్మరించడం జరుగుతోందని.. ఒక పద్యంలో చక్కగా ఆవిష్కరించారు.
అన్యభాషలేమో అతి మధురంబని
అసలు తెలుగు విషయమంత మరచి
కొత్త నాగరికత కొనితెచ్చి యువతయు
వీరభద్ర! కోనపౌరరుద్ర! అంటూ తమ ఆవేదనను వ్యక్తపరిచారు. భారతీయ సంస్కృతీ వైభవాన్ని ప్రతిబింబింప జేస్తూ రాసిన పద్యాలు పాఠకులను అలరిస్తాయి.
పల్లె తల్లివంటి పరమపావన మూర్తి
దేశమంత వెదక లేశమైన
కానరాదు భువికి ప్రాణమై తానిల్చు
వీరభద్ర! కోన్పూర రుద్ర! అంటూ పల్లె గొప్పతనాన్ని చక్కగా ఈ పద్యంలో చిత్రించారు.
కవి మద్యపానం - భ్రూణ హత్యలపై తమ కలాన్ని ఎక్కుపెట్టారు.
ఆడబిడ్డ యన్న అవనికె మూలమై
వెలుగునెపుడు ధరణి వెలుగుచుండు
నిత్య సత్యమిదియె నిజధర్మ వౌనిలన్
వీరభద్ర! కోనపౌరరుద్ర! అంటూ
ఆడబిడ్డతోనే ధరణి వెలుగుతుందనీ.. ఆడబిడ్డ అంటే అవనికె మూలమని ఈ పద్యం ద్వారా తేల్చిచెప్పారు.
పెళ్లికాగానే.. కన్న తల్లిదండ్రులకు దూరమవుతున్న వారికి హితవు పలికేలా.. కొన్ని పద్యాలను కవి ఇందులో పొందుపరిచారు. భార్య భ్రమలో పడి కన్నవారిని దూరం చేసుకోవద్దని సూచించారు.
భక్తి విడువ వలదు భార్య భ్రమలొజెంది
కన్నవారికెపుడు కలలోనైన
హాని చేయనట్టు మననీయులే సుతుల్
వీరభద్ర! కోనపౌరరుద్ర! అంటూ
కలలోనైనా కన్నవారి హాని తలపెట్టొద్దని కోరారు.
నేటి యువత కొత్త పోకడలను ఎత్తి చూపుతూ..
చేతిలోన ఎపుడు సెల్లు ఫోనుయుంటె
కానరాదు జగము కన్నులకును
ఆత్మగలవారు అందరు తొలిగేరు
వీరభద్ర! కోనపౌరరుద్ర! అంటూ
నడుస్తున్న చరిత్రకు అద్దం పట్టారు.
పెద్దవారి పట్ల పెసరగింజంతైనా భక్తి భయం లేకపోతే..యువత భవిత అంధకార బంధురమవుతుందని హెచ్చరించారు. స్ర్తి ప్రాతినిథ్యం-ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెడుతూ కొన్ని పద్యాలు ఇందులో కానవస్తాయి. అంతేగాక రాజకీయం తీరుతెన్నులపై కవి తమ కలాన్ని సంధించారు. ఓటు యొక్క ప్రాధాన్యతను పద్యాల ద్వారా విడమరిచి చెప్పిన తీరు బాగుంది. అవినీతి-లంచగొండితనంపై కవి తమ కలాన్ని ఝుళిపించారు.
‘మానవ మనుగడ - సన్మార్గ పయనం’పై రాసిన పద్యాల్లో కవి నీతిని ప్రబోధించిన తీరు అభినందనీయం! ఇలా.. సామాజికాంశాలను పద్యాల్లో బంధించిన తీరు పాఠకులను అలరింపజేస్తుంది. పై అంశాలతో పాటు కోనాపూర్ గ్రామ చరిత్రను తెలిపే పాటను ఇందులో పొందుపరిచారు. అంతేగాక.. శ్రీ వీరభద్రస్వామి ఆలయ చరిత్రను రేఖామాత్రంగా పరిచయం చేశారు. ఛందోబద్ధ పద్యరచన క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో సత్యనారాయణ పద్యరచన పట్ల మొగ్గు చూపడం ఆహ్వానింపదగింది!

- సాన్వి, కరీంనగర్
సెల్.నం.9440525544

మనోగీతికలు

కదిలిన రాళ్లు
నిన్నటిదాకా తెలియదు వాటికి
మా స్థావరం స్థిరం కాదని
మా రాతి గుండెలకు కదలిక వుండదని
ఎన్నాళ్లనుండో ఆ నదీ తీరంలో
ఆ రాళ్లు జవరాళ్లై
ఎంతో ఏకాంతంగా
ఏవో ఊసులాడుకున్నవి!
ప్రశాంతంగా మిన్నును చూస్తూ
మన్నును కౌగిలిస్తూ కొలువైనాయక్కడ!
శిలలని పిలిచినా
స్థాణువులని పిలిచినా
పలకవవి.. కదలవవి
కానీ ఒక్క జోరువానకి
ఆ నదీ ప్రవాహంలో
ఎన్నాళ్లవో వాటి అల్లికలు
విడిచి వెడితే శిలలు!
ఆ ప్రవాహంలో
కల్సిపోయాయి వాటి కల(ళ)లు!
వాటి ముడి వీడింది
మళ్లెక్కడో అవి..
కొత్తగా సేద తీరుతాయి!
ఆ రాళ్లు
అలలతో పాటు కదిలి వెళ్లాయి!
ఆ జ్ఞాపకాలన్నీ నాకొదిలి!!

- నల్లగొండ రమేష్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా, సెల్.నం. 9441711832

భావ వీచిక..
నాలో భావావేశం
పొంగి, పొరలి, పొరలి
వొంగి, వొలికి, వొదిగిపోయే
తెల్లని మండేలాంటి కాగితంపైన
వల్లని నారుమళ్లనే, అక్షరాలుగా నిలచే!
చల్లని, చక్కని కవితగా
వలచె నన్ను, అంతా అక్షరమయం
ఓ కవితా! నీతోనే నా జత
నీవిక నడిపించాలి ‘నా కథ’!

- కూర్మాచలం వెంకటేశ్వర్లు
కరీంనగర్
సెల్.నం.7702261031

నేను..!
నేను ఈ సంవత్సరం
కుండలా నిండుగా నిండాను
పిల్ల కాలువలు ఉపనదులు
వాగులు నన్ను నిండుగా
నింపాయి!
సంతృప్తి చెందుతున్నా
నీళ్లకు కటకటలాడుతున్న
నా ఊరి ప్రజలకు నీరందిస్తా
సమృద్ధిగా..!
పంట పొలాలకు
ప్రజలకు నీళ్ల కరువు
లేకుండా చేస్తా..!
బీడుబడ్డ పొలాల్లో సైతం
పంటలు పండేలా చేస్తా!
ప్రజలకు కరువు కాటకాలు
లేకుండా చూస్తా!
వరుణుడు కరుణిస్తేనే కదా
నేను నిండుకుండనయ్యా

- రేగుంట పోచయ్య
బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా
ఫో.న్: 08735-225184

స్వర్ణ భారతి
ప్రజల మనసులు పరిమళించగ
ప్రతి గుండెలో ప్రేమ పొంగగ
చెట్టు పెరిగెడి రీతిగ
మనమంతా దేశభక్తిని
చాటుకుంటూ పెరుగుదాం
తల్లి భారతి కన్నబిడ్డల, కంటిపాపల వోలె
రక్షణ చేపట్టి మనము ముందుకడుగువేద్దాం!
అక్షరాలను నేర్చుకుంటూ
అందరము కలిసికట్టుగా
భారతావనిని ప్రపంచ పటమున..
ముందు వరుసల నిలుపుదాం!
అశోక చక్రపు జాతీయ జెండాను
గగనసీమలో చూపుదాం
స్వదేశీ వస్తువులన్నీ వాడుతూ
స్వచ్ఛతతో సాగుదాం!
లోకమంత మనవంక చూడగ..
మంచి పనులను చేద్దాం!
కాలానికి వనె్న తెచ్చే కీర్తి బావుటలెగురేద్దాం!
భక్తి తోటి దేశమాతను నిత్యము ప్రేమిద్దాం!
ప్రజల కొరకు ప్రజల చేతనే
ప్రజాహితము కోరుదాం
దేశమంటే నీవు నేను మనము
అనుకొని మసలుదాం
భరత మాత నుదుటి బంగరు దివ్వెల్లాగ
వెలుగొందుదాం!

- రాజేశ్వరి బొమ్మిదేని, పెద్దపల్లి-505172, కరీంనగర్ జిల్లా, సెల్.నం.9160908045

ముద్దుల మనుమరాలు!
మా ముద్దుల మనుమరాలు ముద్దుముద్దుగా
నన్ను పేరుపెట్టి పిలుస్తుంటే.. మా అమ్మే పిలిచినట్లుంటుంది!
బుడిబుడి అడుగులతో గునగునవచ్చి నా మీద వాలితే..
మా అమ్మ ఒడిలో ఓలలాడినట్లనిపిస్తుంది!
నవ్వుల పువ్వులు పంచుతూ కేరింతలతో నాతో ఆడుతుంటే..
చిన్ననాటి మధుర స్మృతుల మధురిమలు
నన్ను గిలిగింతలు పెడతాయి!
తెరలు తెరలుగా కనువిందు చేస్తూ.. నన్ను పులకరింపజేస్తాయి!
అమ్మలాలింపు..అదిలింపు ఆత్మీయ పలుకరింపు
కొంగుచాటు దోబూచులాటలు వీపున ఊగిన ఊయలలు
వేలు పట్టుకొని వేసిన బులి బులి నడకలు
ఎన్నని చెప్పను? ఏమనని చెప్పను?
తాతగా ఇప్పుడు మరో బాల్యంలోకి.. అడుగిడుతున్న నేను
‘బొమ్మలా’ కనిపిస్తున్న మనుమరాలిలో
చూస్తున్నా మా ‘అమ్మ’ను!!

- చెన్నమనేని ప్రేమసాగర్ రావు
కరీంనగర్, సెల్.నం.9912118554

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

email : merupuknr@andhrabhoomi.net

- సల్వాజి వాణి