విశాఖపట్నం

అన్నదాత దత్తత (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోలు, రాజకీయ నాయకులు, కార్పొరేట్ ఉద్యోగస్థులు ఊర్లు దత్తత తీసుకోవడంతో హీరో ప్రశాంత్ మీద ఒత్తిడి పెరిగింది.
ప్రశాంత్ ఎక్కడికెళ్లిన మీడియా వచ్చి ‘‘సార్ మీరు ఏ ఊరు దత్తత తీసుకుంటున్నారు?’’ అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏం సమాధానం చెప్పాలో తెలియక జవాబు చాలాసార్లు దాటవేశాడు. కొన్నిసార్లు మీడియాకు కన్పించకుండా తిరిగినా ప్రభుత్వం నుండి, ఫ్రెండ్స్ నుండి, ఇతర నటుల నుండి కూడా ఇదే ప్రశ్న వినాల్సి వచ్చేది.
ఒక రోజు రాత్రి ప్రశాంత్ చాలాసేపు ఆలోచించాడు. పల్లెటూళ్ల అభివృద్ధి అనేది ప్రభుత్వం చేయాల్సిన పని. వాళ్లు చేయాల్సిన పనిని వేరే ఎవరో చేయడం ఏమిటి? కానీ దత్తత అనేది మంచి ప్రక్రియ. కొందరు నాయకులు దత్తత అని చెప్పి ప్రకటనలు చేయడం... తర్వాత మర్చిపోవడం అలవాటుగా మారింది. కొందరు నాయకులు అభివృద్ధి చెందిన ఊరిని దత్తత తీసుకుంటున్నానని చెప్పడం విడ్డూరం. మరి కొందరు దత్తత తీసుకుని ముందు అనేక పనులు ప్రారంభించి తర్వాత వదిలేస్తున్నారు. మరికొందరు అభివృద్ధి అని చెప్పి బిల్డింగులు కట్టి అమ్ముతున్నారు. దత్తత కన్నా దత్తత ప్రకటనలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.
అప్పుడే ప్రశాంత్‌కి మంచి ఆలోచన వచ్చింది వెంటనే మీడియాకి ఫోన్ చేసి ‘‘రేపు ఉదయం 9 గంటలకి ప్రెస్‌మీట్ ఉంది’’ అని చెప్పాడు. అలాగే తన 13 జిల్లాల అభిమాన సంఘాలకి ఫోన్ చేశాడు. దత్తతకు సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకున్నాడు.
ఉదయం అయింది. మీడియా మొత్తం ప్రశాంత్ ఇంటి ముందు వాలిపోయింది.
ప్రశాంత్ ఏ ఊరు దత్తత తీసుకుంటారు అనే చర్చ మీడియాలో మొదలయింది.
ప్రశాంత్ ఇంటి నుండి వచ్చి ప్రెస్‌మీట్‌లో కూర్చున్నాడు అందరూ ఒకటే ప్రశ్న వేస్తున్నారు. ‘‘మీరు ఏ ఊరిని దత్తత తీసుకుంటున్నారు?’’ అని.
ప్రశాంత్ నవ్వుతూ ‘‘దత్తత తీసుకోవడం అనేది నిజమే. అయితే ఏదో ఒక ఊరిని కాదు. రైతుని’’ అని సమాధానం చెప్పాడు.
మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
‘‘రైతునా?’’ అని ప్రశ్న వేసారు.
‘‘అవును పదమూడు జిల్లాల్లోనూ ఒక్కొక్క రైతుని దత్తత తీసుకుంటున్నాను. మొత్తం పదమూడుమంది రైతులన్నమాట’’ అన్నాడు.
అప్పటికీ మీడియా వాళ్లకి అర్థం కాలేదు.
‘‘ఊళ్ల అభివృద్ధి అనేది ప్రభుత్వం చూడాల్సిన పని. కానీ రైతులను సంరక్షించే బాధ్యత మనది. రైతు దేశానికే వెనె్నముక. రైతు లేకపోతే మన జీవనం ఉండదు. జీవితమే ఉండదు. అలాంటి రైతులను ప్రభుత్వం విస్మరిస్తోంది. అందుకే నేను రైతులను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. మన రాష్ట్రంలో తెలివితేటల గల రైతులు చాలామంది ఉన్నారు. వర్షాల ప్రభావం వలన, కరవువల్ల, అనేక కారణాల వల్ల సమస్యలు రావడంతో రైతులు వ్యవసాయానికి దూరంగా ఉంటున్నారు. వాళ్లలో చైతన్యం కల్పించి సహాయం చేయడం ద్వారా వారు తిరిగి వ్యవసాయం వైపు అడుగులు వేసేలా చేస్తాను. అందరూ ఉద్యోగాలు చేస్తుంటే పంటలు పండించే వాళ్లు ఎవరుంటారు? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని వివరించాడు ప్రశాంత్.
మీడియా ప్రతినిధులు చప్పట్లు కొట్టారు.
ప్రశాంత్ తన అభిమానుల సంఘాల వారిచ్చిన వివరాల ప్రకారం వరి రైతును, చెరకు రైతును, పశువులు మేపే రైతులను ఇంకా అనేక రకాలకు చెందిన రైతులను దత్తత తీసుకుని వారికి అనేక సౌకర్యాలు కల్పించాడు.
రైతులు కూడా మంచి అవకాశం దొరికిందని గ్రహించి శ్రద్ధతో పంటలు పండించారు. అనేక మందికి ఆహారం అందడంతో పాటు ధరలు కూడా అందుబాటులోకి రావడంతో ప్రశాంత్‌కి మరి కొంతమంది హీరోలు జత కలిశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆంధ్రా ఆహారం అందించే రాష్టమ్రనే కాకుండా రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా కూడా పేరు తెచ్చుకుంది. ప్రభుత్వం ప్రశాంత్‌ని పద్మశ్రీతో సత్కరించింది.

- నల్లపాటి సురేంద్ర,
17-2-13/1
డల్లివీధి, పెదగంట్యాడ
విశాఖపట్నం-44.
సెల్ : 9490792553.

మనోగీతికలు

నా పల్లెసీమ
నా పల్లెసీమకి జయహో
చూడముచ్చటగా ఉన్న నా పల్లెసీమ
పచ్చని పైర్లతో ఆకాశాన్ని చుంబించే
వృక్షరాజాలతో పచ్చని తివాచీలా ఉంటుంది
సుతారమైన గాలులు మేనిని తాకుతూ
మనసును మురిపిస్తూ ముచ్చట్లాడుతుంది
నా పల్లెసీమలో ఎక్కడ చూసినా
అందమైన పుష్పాలు చిరునవ్వుతో
అందరికీ స్వాగతం పలుకుతాయి
అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు
ఆలంబనగా నిలిచే నదీ తాటాకాలు
పిల్ల కాలువలు, చెలమలు
నదీ సెలయేళ్లు... వాటి చెంత
ఇమిడి ఉంటుంది స్వర్గం
అక్కడ తనవూ, మనసూ సేదదీరుతాయి
నా పల్లెసీమలో ఎలిమెంటరీ స్కూళ్లు
పలకా బలపం పట్టి అక్షరాలు దిద్దించే
సరస్వతీ నిలయాలు
నా పల్లెసీమ ఒక సంగీత జనకులం
పాడినందించే పశువులు, కిలకిలమంటూ
పాటలు పాడే పక్షుల సంగీతంతో
వీనుల విందు బహు పసందు
పొలాల గట్లే అక్కడ ఆకట్టుకునే పార్కులు
సంధ్య, సూర్యోదయాల్లో నా పల్లెసీమలు
చిత్రకారుడు గీచిన తైలవర్ణ చిత్రాలు
రచ్చబండ రాజకీయాలు,
అమ్మలక్కల హడావుడి
నా పల్లెసీమలను నిత్యం చైతన్యంగా ఉంచే
మధురమైన ఊహలు
అందుకే పల్లెసీమల అస్తిత్వాలను
పాడుచేయకండి
పల్లెసీమలే ప్రగతికి మెట్లు
భావితరాలకు జీవనాడులు!

బుద్ధా రామారావు, పాయకరావుపేట-531126.
సెల్ : 7675899290.
నాయకునికి వందనం
సమత్వం అనే నినాదంతో
పేద బతుకు నాదని తిండికి మెతుకు లేదని
జనుల సేవే పరమార్థమని ఊకదంపుడు
ఉపన్యాసమిచ్చిన నాయకా
గెలిచాక సిరులు పోగేసి దీనజనుల ఘోష విన్నావా?
పేద ప్రజల కడుపులు కొట్టి స్వార్థపరత పెంచుకుని
అరాచకాలు మొదలుపెట్టి నీతి పక్కదారి మళ్లినా
ప్రజల కోసం పాటు పడుతున్నానంటూ
అధికార దాహంతో అడ్డదారులు తొక్కి
చట్టం నా చుట్టమని చకచకా పరుగులెత్తే నాయకా
ఓసారి వెనుకకు చూడవోయి
నిర్భాగ్యుల వేదన
నిరుపేదల ఆక్రందన వినవోయి!

- కుబిరెడ్డి చెల్లారావు,
చోడవరం, విశాఖ జిల్లా.
సెల్ : 9885090752

నీ స్ఫూర్తితో...!
కనుసన్నల్లో నిను దాచుకునేందుకు నిదురపోని కలలా నేనున్నందుకు చీకటిని కాటుక చేసి, నను కప్పేస్తావు చిగురించే ప్రతి చిగురులోను
విరబూసే ప్రతి పువ్వులోను
ధ్వనించే ప్రతి రవళిలోను, నినే్న చూడాలనుకునే నేను, నీ చెంత వసంత రుతువునవుతాను
సిరిమువ్వల సవ్వడిలో నీ చిరునవ్వులు వినేందుకు
రాజహంసలా నడిచినపుడు, నీ పాదాల పారాణినై
నడిపిస్తావు. సంద్రమంత జంజాటాన్ని మోస్తున్నప్పుడు ఎగసిపడే కెరటంలా శ్రావణ మేఘమై నీలో దాచేస్తావు సన్నజాజిలా సన్నగా నవ్వేస్తావు
నీ స్ఫూర్తితో నన్ను నేను తీర్చిదిద్దుకునేందుకు
ఎదగది నిండా నినే్న నింపుకున్నందుకు నా ఆశలో
కిరణానివై, నా శ్వాసలో ప్రణవనాదమై
ప్రతిక్షణం రవళిస్తావు
నా అంతరంగంలో....

శివానీ, శృంగవరపుకోట

ఆచార్య దేవోభవ
అన్నదానం కన్నా విద్యాదానం మిన్న
గురువును మించిన దైవం లేడు
శిల్పి తన నైపుణ్యంతో
బండరాతిని చెక్కి శిల్పంగా తీర్చిదిద్ది
కనువిందు చేస్తాడు
గురువు కూడా తన నైపుణ్యంతో
విద్యార్థికి అక్షర సత్యాలను రంగరించి
మంచి నడవడికను నేర్పించి
అభివృద్ధి బాటలో పయనింపజేసి
ఎనలేని ఆనందాన్ని చవిచూస్తాడు
సమాజంలో అంతటి మహదానందాన్ని
పొందినవారు ఒక్క గురువులే
గురువులే ప్రతి ఒక్క ఒక్కరికి
మార్గదర్శకులు... అందుకే
గురుబ్రహ్మ గురువిష్ణు
గురుదేవో మహేశ్వర
అన్న ఆర్యోక్తి అక్షర సత్యాలు!

- రాయవరపు సరస్వతి,
చోడవరం పోస్టు,
విశాఖ జిల్లా - 531036.

పుస్తక సమీక్ష

కృష్ణాతరంగాలు
కృష్ణానదీ... పావన నిధి

‘సర్వ పాపహరిణీ, ముక్తిప్రదాయిని కృష్ణవేణీ నమస్త్భ్యుం’ అంటూ కృష్ణా నది... పావన నిధి పేరుతో ప్రముఖ రచయిత, సాహిత్య విమర్శకులు డాక్టర్ దామెర వెంకట సూర్యారావు రాసిన ఈ పుస్తకం ఎంతో అమూల్యమైనదిగా పేర్కొనవచ్చు. తెలుగింటి విరిబోణిగా, సిరిబోణిగా ప్రశస్తికెక్కిన కృష్ణానది ప్రాశస్త్యం గురించి ఆమూలాగ్రం స్పృశించి ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారు. కృష్ణమ్మకు దివ్య హారతిగా ఈ పుస్తకం నిలుస్తుంది. ఆంధ్ర దేశ చరిత్ర, నాగరికతల్లో కృష్ణా నదీ ప్రాంత ప్రభావం అనుపమానైది. మన రాష్ట్ర రాజధాని అమరావతి ఈ నదీ తీరాన రూపుదిద్దుకుంటున్న విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. కృష్ణాలోయ దివ్యచరిత్ర, సంస్కృతి, నాగరికత, ఆధ్యాత్మిక అంశాలను రేఖామాత్రంగా పొందుపరిచారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో రాసిన ఈ పుస్తకం సమగ్రం కాకపోయినా అసమగ్ర గ్రంథం కాదని చెప్పవచ్చు. నదిని మహాశక్తికి రూపమని, చైతన్య స్రవంతి అని ప్రశంసిస్తూ పంచభూతాల్లో దీనిని అగ్రతాంబూలమిచ్చారు. భారతీయ విజ్ఞాన భాస్కరులైన మహర్షులు నదులకు దైవత్వాన్ని కల్పించారు. నదీతీరాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు వెలిసాయి. పర్యాటకులు, కళారాధకులు ఆ ప్రదేశానికి వెళ్లి నదీస్నానం చేసి దేవతామూర్తులను సేవించి తమ జీవితాలను సార్థకం చేసుకున్న వైనాన్ని ఈ పుస్తకంలో రాశారు. పడమటి కనుమలలోని సహ్యాద్రి శ్రేణిలోని మహాబలేశ్వరం కొండల్లో గోముఖ క్షేత్రం నుండి జన్మించి నాలుగు రాష్ట్రాల్లోని అనేక తీర్థప్రదేశాలను పునీతం చేస్తూ హంసల దీవి వద్ద సాగర సంమం చేస్తున్న కృష్ణవేణి లక్షలాది ఎకరాల్లో పైరు పచ్చల పసిడి కాంతులు నింపింది. తెలుగు ప్రజల జీవితాలను సుసంపన్నం చేసిన తీరును ముచ్చటించారు. కృష్ణానది ఆవిర్భావాన్ని గురించి పురాణాలను వివిధ గాథలను పొందుపరిచిన తీరు హృద్యంగా ఉంది. దీనికి తోడు శాతవాహనలు, ఇక్ష్వాకులు, శాలంకాయనులు, ఆనంద గోత్రజులు, విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, కాకతీయులు, విజయనగర గజపతి యుద్ధాలు, బహమనీ కుతుబ్‌షాహీల వంశ చరిత్రలు ఇందులో ఉన్నాయి. కృష్ణా తీరంలోని మత సంప్రదాయాలను ప్రస్తావిస్తూ బౌద్ధం, జైనం, వైదిక, శైవ, వైష్ణవ మతాలు కృష్ణాతీరంలో పరిఢవిల్లిన వైనాన్ని సమగ్రంగా పొందుపరిచారు. కృష్ణాలోయలో సాహిత్య, సంగీత, నృత్య వైభవాన్ని పేర్కొన్న తీరు మనసును దోచుకుంటుంది. ‘కృష్ణ లీలా తరంగిణి’ కావ్యాన్ని రాసిన నారాయణతీర్థులు, ‘మువ్వగోపాలుడు పదాలు’ రచించిన క్షేత్రయ్య, కూచిపూడి నాట్య పితామహుడు సిద్ధేంద్ర యోగి, శ్రీకాకుళం క్షేత్రంలో కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద ప్రబంధ రచనకు అంకురార్పణ చేసిన విధాన్ని, వినుకొండ వల్లభారాయుడు క్రీడాభిరామం కావ్యంలో శ్రీకాకుళపు తిరునాళ్లను వర్ణిస్తూ కృష్ణానది ప్రశస్తి చేసిన అంశాన్ని, జక్కన్న, అనంతామాత్యుడు, వెనె్నలకంటి సూరన, కొరవి గోపరాజు, మడికి సింగన, అల్లసాని పెద్దన తదితర కవులు ఆయా సందర్భాల్లో కృష్ణా నది వైభవాన్ని ఉటంకిస్తూ రాసిన విషయాలను ఇందులో పొందుపరిచారు. కృష్ణానదీ పరీవాహక ప్రాంతానికి చెందిన ఆత్మకూరు, గద్వాల, జటప్రోలు, వనపర్తి, అమరావతి, నూజివీడు, ముక్త్యాల, నరసరావుపేట, రాచూరు, రేపల్లె సంస్థానాధీశుల సాహిత్య పోషణ గురించి ప్రస్తావించారు. మంగళగిరి, అలంపురం, సంగమేశ్వరం, శ్రీశైలం, మోర్తోట, వెల్లటూరు, తోట్లవల్లూరు, నాగాయలంక, హంసలదీవి, పెదకళ్లేపలి, మోపిదేవి, ఘంటాల, వేదాద్రి, సత్రశాల, మొవ్వ వేదాద్రి తదితర పుణ్యక్షేత్రాల స్థలపురాణాలు ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి. అమరావతి ధాన్యకటకం, భట్టిప్రోలు, జగ్గయ్యపేట, విజయవాడ, వైకుంఠపురం, ఉండవల్లి తదితర చారిత్రక ప్రదేశాల చరిత్ర గతులను వివరించిన తీరు బాగుంది. ఘనచరితుల జన్మభూమి శీర్షికన బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, దామోదరం సంజీవయ్య, వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు, యలమర్తి నాయుడమ్మ, అక్కినేని, పింగళి వెంకయ్య, కొమర్రాజు లక్ష్మణరావు, ఘంటశాల వెంకటేశ్వరరావు, విశ్వనాథ సత్యనారాయణ వంటి ప్రముఖులను ప్రస్తావించడంతో పుస్తకానికి మరింత వనె్న చేకూరింది. ఈ పుస్తకాన్ని ప్రచురించిన ఘనత కనక మహాలక్ష్మి సహకార బ్యాంకు చైర్మన్ పరుచూరి రఘునాథరావు, లక్ష్మీకుమారి దంపతులకు దక్కుతుంది. ఈ పుస్తకం చదవాలనుకునేవారు రచయిత సెల్ 9885188431లో సంప్రదించాలి.

- వాండ్రంగి కొండలరావు,
పొందూరు, శ్రీకాకుళం జిల్లా.
సెల్ : 9490528730.

కల్మషాలను పారద్రోలే ‘షిరిడినాథ’

ధరిత్రిపై పంచభూతాల సాక్షిగా మనుగడ సాగిస్తున్న మానవుడు- తాను చేపడుతున్న ప్రతి పనీ పవిత్రమైనదిగా ఉండాలి. అది ఎలా అంటే, ఈ గడ్డపై జీవిస్తున్న ఏదో ఒక జీవికి ప్రయోజనం కలిగించగలగాలి. శ్రద్ధ్భాక్తులతో నిర్వర్తించిన ఆ కార్యం పరమోత్కృష్టమైన ఈశ్వరాధాన అవుతుంది. అంటే ప్రతి పనిలోనూ ఆధ్యాత్మికత ఇమిడి ఉందన్నమాట. అప్పుడే అది నవ సమాజ నిర్మాణానికి పునాది రాయి అవుతుంది. అటువంటి సత్ప్రవర్తన అలవడాలంటే మనిషికి ఆధ్యాత్మిక పుష్పాలు అవశ్యం. రాగద్వేషాలు, అసూయ, అశ్రద్ధ, సోమరితనం, వ్యసనాలు జీవుడి నీడను సైతం తాకకూడదు. ఇవన్నీ వ్యక్తి అధోగతికి దగ్గరి దారులు. తులసి వనంలాంటి భారతీయ సమాజంలో మరింత సుగంధాలు వెల్లివెరియాలంటే సుద్గుణాలు అవసరం. అవి కేవలం దైవప్రార్థనతోనే సాధ్యమవుతాయి. ఇదే సత్యాన్ని గ్రహించిన విశాఖపట్నం(విశాలాక్షినగర్)లో ఉంటున్న రచయిత పంతుల సీతాపతిరావుతన రచనావ్యాసంగంలో ‘షిరిడినాథ’ అనే మరో అధ్యాత్మిక పద్యగ్రంథాన్ని వెలువరించారు. ఆపదలో ఉన్న భక్తులు రక్షణ కోసం షిరిడిసాయిని వేడుకుంటే ఎలా స్పందించి, ఆదుకుంటాడో ఇందులో రచయిత విపులీకరించారు. మొత్తం 110 పద్యాలు ఉన్నాయి. కోరుకున్నట్టి కోర్కెలు కూర్చు వాడు/పాపములు బాపి, పిలచిన పలుకు వాడు/వేడి నంతనె భక్తుల వెంట నుండు/షిరిడి నాథుని కొలిచెద శిరము వంచి
భక్తుడు పిలిచిన వెంటనే పలికి, తన కోర్కెలు తీరుస్తూ సన్మార్గాన నడిపించే షిరిడిసాయిని తలవొంచి నమస్కారములు చేయు.
కర్మలనుబట్టి శిక్షలు ఖాయమగును/శిక్ష పడునని కర్మలు చేయకుండ/విడువ రాదని ‘గీత’ విశద పరచు/షిరిడి నాథుని కొలిచెద శిరము వంచి
పుట్టిన ప్రతీ వ్యక్తీ బతుకులో తాను చేసిన పనులబట్టి దేవుడు శిక్షలు ఖరారు చేస్తాడు. అయితే, శిక్షలు ఉంటాయని ఏ ఒక్కరూ పనులు చేయక మానలేరు. ఈ సంగతి భగవద్గీత స్పష్టం చేస్తుందని రచయిత వివరించారు.
బద్ధకము వీడి మనసును పదిలపరచి / సహజ ప్రేమతో సాయిని అహము వీడి / కొలుచు కొనెడి భాగ్యము సమకూర్చు నటుల / షిరిడి నాథుని కొలిచెద శిరము వంచి
ఈ కంప్యూటర్ యుగంలో నీవు ఎంత విజ్ఞానవంతుడివైనా ముందును నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాల్సిందే. అప్పుడు సమాజానికి రవ్వంతైన ప్రయోజనకారిగా తయారవుతావు. ఇందుకు మొదటి మెట్టు బద్ధకాన్ని, సోమరితానాన్ని వీడడము. అప్పుడు నీ మనస్సు నీ చేతుల్లో ఉంటుంది ఆరోగ్యంగా. అహంకారం, స్వార్థం ఉండవు. ఆ సమయాన మనస్సు భక్తి, సేవా కార్యక్రమాలవైపు మళ్ళుతుంది. అదే భగవంతుని సేవ. ఆ సేవ నీకు ఊహించనంత సిరిసంపదలను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు రచయిత పంతుల సీతాపతిరావు ఈ పద్యంలో...
‘నేను-నీవను’ భావమ్ము కానరాక/మతము లందున సమభావ మనసు యున్న/ఈర్ష్య ద్వేషాలు కోపాలు నిమడ వనెడి/షిరిడి నాథుని కొలిచెద శిరము వంచి
నేను, నాది అనే స్వార్థాన్ని వీడాలి. అప్పుడే జనులందరూ సుఖంగా ఉంటారు. అలాకాకుంటే నాది, మాది, మా మాతము, మా వర్గమూ అంటూ విషపూరిత భావజాలాన్ని నెత్తికెక్కించుకుంటే సమస్త ప్రజానీకం మనస్సులు రోగగ్రస్తమై, ఉద్వేగాలకు లోనై విశ్వనాశనానికి మూలకారణంగా నిలుస్తాయి.
జంతు జాలాల పట్లను జాలి గొనియు/ఆకలిగ యున్న వారికి అన్నమిడుచు ఆర్తినాదుల నెల్లపు డాదు కొనుడి/షిరిడి నాథుని కొలిచెద శిరము వంచి
సృష్టిలో ఉన్న సంపదలు నీవొక్కడి సొంతమే కాదు. జీవికోటి అన్నింటికీ హక్కు ఉంది. ఈ పరమసత్యాన్ని గ్రహించి మసులుకోవాలి. నీతోపాటు ఉన్న ప్రకృతిని ఆరాధించు. జంతువులను బతకనీయు, ఆకలిగా ఉన్న వారిని ఆదరించు. అప్పుడే నీకు ఆ భగవంతుడు సర్వదా ఆశీర్వదించును అని పై పద్యం పలికెను.
కుష్ఠు వారికి సేవలు కూర్మిజేసి/రోగమును మాన్చి రోగుల రూపుమార్చి/కంటి చూపిచ్చి కనువిందు కలుగజేయు/షిరిడి నాథుని కొలిచెద శిరము వంచి
మనిషి బతికినంతకాలం సుఖసంతోషాలతో ఉండాలంటే ఒకే ఒక్క మార్గము ఉంది. అదే సేవా మార్గం. ఇందులో ప్రతిఫలం ఆశించకూడదు. జరుగుబాటు ఉన్నవారికి చేసే సేవ కంటే, దరిద్రులు, కుష్ఠు రోగులు, నిరుపేదలకు చేసే సేవే ఉత్తమమైనదిగా ఆ దేవుడు భావిస్తాడు. అందుకే మన పూర్వీకులు ‘మానవ సేవే-మాధవ సేవ’ అని బోధించారు. రచయిత పవిత్రంగా రూపొందించిన ఈ గ్రంథం సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. మనసులో ఉన్న కల్మషాలు సంపూర్ణంగా తుడిచిపెట్టుకుపోవాలంటే ఈ గ్రంథంలోని సుగంధాలు తప్పక గ్రహించాల్సిందే.

ప్రతులకు
వేల : అమూల్యం
పంతుల సీతాపతిరావు,
జి1, మేఘనా ఎన్‌క్లేవ్,
విశాలాక్షినగర్, విశాఖపట్నం-530043,
స్థిరవాణి: 0891 2797512,
చరవాణి: 9885875958.

- జి.కృష్ణమూర్తి,
9493802010.

మినీకథ

పెద్దరికం పెళ్లి

ప్రవీణ్, కవిత పలాస కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు. ప్రవీణ్‌ది పలాసే. కవితది మాత్రం కాశీబుగ్గ. ఇద్దరూ చదువులో చక్కటి ప్రతిభ కనబరిచేవారు. అందరితో కలివిడిగా మసిలేవారు. వారిద్దరూ అంటే కాలేజీలోని స్టూడెంట్స్‌తో పాటు లెక్చరర్లు కూడా ఇష్టపడేవారు. ఎదుటి వారితో ఎంతో స్నేహంగా ఉండడం, ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ప్రవీణ్, కవిత ముందుండేవారు. అందుకే వారిద్దరు అంటే అందరికీ అభిమానం. ప్రవీణ్, కవిత ఇద్దరికీ కవితా రచనలో చక్కని అభినివేశం ఉంది. అనేక పత్రికల్లో వారి కవితలు అచ్చయ్యాయి. ఇద్దరూ అనేక బహుమతులు గెలుచుకున్నారు. ఈ క్రమంలో కొన్నాళ్లకు ప్రవీణ్, కవితల మధ్య స్నేహం ఏర్పడింది. ఇద్దరూ చదువు గురించి, సాహిత్యం గురించి, కవితల గురించి ఎక్కువగా మాట్లాడుకునేవారు.
ఒకరి స్ఫూర్తితో మరొకరు చదువులోను, కవితా రచనలోను చక్కటి ప్రతిభ కనబరుస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. వారి చదువు పూర్తి అయింది. కవిత సాంకేతిక విద్యా కోర్సులో చేరేందుకు కాకినాడ వెళ్లింది. ప్రవీణ్ కూడా ఇంట్లో వాళ్లని ఒప్పించి కాకినాడలోనే మరో కోర్సులో చేరాడు. అక్కడ వేర్వేరు హాస్టల్స్‌లో ఉంటూ, చదువుకుంటూ తమ స్నేహాన్ని కొనసాగించారు.
చదువు పూర్తయ్యే సరికి ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఒకరిని వదిలి ఒకరు ఉండలేని స్థితికి వచ్చారు. చివరికి పెద్దవాళ్లకి తమ ప్రేమ గురించి తెలియజేసి పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. చదువుకు సంబంధించిన పట్టాలు పుచ్చుకుని ఇద్దరూ వారివారి ఇళ్లకు చేరుకున్నారు. ప్రవీణ్ తన తల్లిదండ్రులకి, కవిత తన తల్లిదండ్రులకి తమ ప్రేమ గురించి వివరించి చెప్పారు. సహజంగానే ప్రేమలను అంగీకరించని ఇద్దరి తల్లిదండ్రులు దీనికి ఒప్పుకోలేదు. దీంతో ప్రవీణ్, కవిత తమ ఆవేదనను ఒకరికి ఒకరు చెప్పుకున్నారు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని తమ బాధను కవితారూపంలో వెలిబుచ్చారు. ఆ కవితలను వారి స్నేహితులు పత్రికలకి పంపారు. వాటిని చదివిన ప్రవీణ్, కవితల అభిమానులకు వారి ఎడబాటు అర్ధమయింది. వారంతా ప్రవీణ్, కవితల ఊళ్లకు చేరుకున్నారు. ఊర్లోని పెద్దలకు ఈ విషయం చెప్పారు. దాంతో పెద్దలు ప్రవీణ్, కవితల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ప్రేమించుకున్న వారిని విడదీయరాదని చెప్పారు. పోలీసులు కూడా రంగప్రవేశం చేయడంతో ప్రవీణ్, కవితల తల్లిదండ్రులకి ఈ ప్రేమ వివాహం చేయకతప్పలేదు.
అలా అభిమానులు, ఊరి పెద్దలు, పోలీసుల సహకారంతో ప్రవీణ్, కవితలు ఒక్కటయ్యారు.

- సీరపు మల్లేశ్వరరావు,
కాశీబుగ్గ.
సెల్ : 7680812592.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- నల్లపాటి సురేంద్ర