విజయవాడ

జీవితాన్ని ప్రేమించు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మదాత ధర్మారావు తన తాతల నాటి బంగారం పండే వ్యవసాయ భూమిని తాత నివసిస్తున్న ఊళ్లోని మోతుబరి రైతుకు విక్రయించి ఆ డబ్బుతో కోనేటిపురం శివారులో అనాథలకు ఆశ్రయం కల్పించే సదాశయంతో ‘సదావర్తి సేవా శాంతి ఆశ్రమం’ ఏర్పాటు చేశారు. రాత్రిపూట పరాయి ఊరి వారికి నివాస సౌకర్యం కల్పిస్తున్నారు ధర్మారావు. నా అనేవారు ఎవరూ లేకపోవడం వల్ల ఆయనతో ఆశ్రమంలోనే ‘వారాలబ్బాయి’ వాసుదేవరావు కూడా ఉంటున్నాడు. సామాజిక సంక్షేమ పథకాల్లో భాగంగా రాజ్యాంగ నిబంధనల మేరకు సుప్రీంకోర్టు సేవాశ్రమాలకు కొంతమేర నిధులను కూడా సమకూరుస్తూ అనాథలను ఆదుకుంటోంది. వారాలబ్బాయి వాసుదేవరావు సమాజ నిరాదరణకు గురై తాను కష్టపడి చదువుతున్న బిఏ పరీక్ష పూర్తిచేసి జీవితంలో స్థిరపడాలని దీక్షబూనాడు. ప్రతి శుక్రవారం తన వారాల భోజనం విశ్రాంత విద్యావేత్త దయాసాగర్ ఇంట్లో కావడంతో 10 మంది పిల్లలకు ట్యూషన్లు ఏర్పాటు చేసుకున్నాడు. కోనేటిపురం సమీపంలోని రాజానగరంలో విదేశాల్లో మంచి పేరుప్రఖ్యాతులు సంపాదించి స్వదేశం తిరిగి వచ్చిన ఎన్నారై వైద్య ప్రముఖులు విశే్వశ్వరరావు గారి పిల్లలకు ట్యూషన్లు చెబుతూ మంచి గుర్తింపు కూడా పొందాడు వాసుదేవరావు. సాహితీ రంగంలో గట్టి పట్టున్న వాసుదేవరావు తాను రాసిన ‘జీవితాన్ని ప్రేమించు’ పరిశీలనాత్మక కథకు రాష్ట్ర సాహిత్య అకాడమీ ప్రథమ బహుమతితో పాటు రూ.50 వేల పారితోషికం పొందాడు. ఈసందర్భంగా ఎన్నారై డాక్టర్ విశే్వశ్వరరావు వాసుదేవరావుకు రవీంద్ర భారతిలో సత్కార సభ ఏర్పాటు చేశారు. సభకు ముఖ్యఅతిథిగా వచ్చిన రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. కడు పేదరికంతో ఉడుంపట్టుతో వారాలు చేస్తూ జీవితాన్ని అర్థం చేసుకున్న వాసుదేవరావు ‘జీవితాన్ని ప్రేమించు’ అనే తన కథ ద్వారా నేటి యువతకు గొప్ప సందేశమిచ్చారని, కార్పొరేట్, విదేశీ సంస్కృతిలో కొట్టుమిట్టాడుతున్న సంధియుగంలో జీవితపు వాస్తవాల్ని ఆయన విశదీకరించడం పెద్ద సంస్కరణ అని కొనియాడారు. జీవితంలో తాము కోరుకున్న ఉద్యోగం దొరకలేదనో, ప్రేమలో విఫలమయ్యామనో నిరాశానిస్పృహలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత మనిషిలో అంతర్గతంగా దాగివున్న శక్తిని సద్వినియోగం చేసుకుని జీవితాన్ని ప్రేమించడం ఎంత అవసరమో ఈ కథ ఓ మార్గదర్శిలా తెలియజెపుతోందన్నారు. ప్రభుత్వం తరపున ప్రత్యేక సాంస్కృతిక ప్రతినిధిగా నియమిస్తూ ప్రభుత్వానికీ, ప్రజలకు మధ్య వాసుదేవరావు వారధి వంటివారని మంత్రి ప్రశంసించారు. సాహిత్య అకాడమీ ప్రకటించిన ప్రతిభా అవార్డు, జ్ఞాపిక, పారితోషికాన్ని సభాముఖంగా వాసుదేవరావుకు అందజేశారు. విశిష్ట అతిథిగా హాజరైన ఎన్నారై డాక్టర్ విశే్వశ్వరరావు వారాల ద్వారా జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వాసుదేవరావును దత్తపుత్రునిగా స్వీకరిస్తున్నట్లు ప్రకటించి తన ఆశయాన్ని చాటుకున్నారు. సమాజాన్ని ప్రేమ, దయ, త్యాగం అనే ఆదర్శాలు, ఆశయాలతో ఇష్టపడే వారందరికీ ‘జీవితాన్ని ప్రేమించు’ కథ దిక్సూచిలా నిలుస్తుందని వక్తలు ప్రశంసలు కురిపించారు.

- డిఆర్ రాజ్‌పాల్,
తెనాలి, గుంటూరు జిల్లా.
చరవాణి : 9502032202

సర్వం నీవే జగన్మాతా..

విజయములనిచ్చు విజయదశమి!
కాంతారేష్య పపన్నానం, మగ్నానాంచ మహర్ణవే!
దుష్యుభిర్వానిరుద్దానాం త్వంగతిః పరమానృణామ్!!
త్రిశక్తులకు మూలభూతమైన పరమారాధ్య దేవత ఆ జగన్మాత. శ్రీ మహాకాళీ, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహాసరస్వతి అని పిలుచుకునే త్రిశక్తులకు మూలపుటమ్మగా వెలుగొందుతోంది. అందుకనే జగన్మాతను ‘ముగురమ్మల కన్న మూలపుటమ్మ మా అమ్మ దుర్గమ్మ’.. అంటూ మనం భక్తితో ఈ నవరాత్రులూ కొలుచుకుంటాం. ఈ ఆదిపరాశక్తి సాత్విక, రాజస, తామస శక్తులైన మూలభూతము, ఈ మూడు గుణాల సమ్మేళనమై మూర్త్భీవించిన దుర్గమ్మను ఆరాధించటమంటే సర్వదేవతలను పూజించినట్లే! దేవీ నవరాత్రుల్లో అమ్మను పూజించటం వల్ల ఇహపర సుఖాలను త్వరగా పొందగలమని చెపుతారు.
భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి జగన్మాతను ఈ ఆశ్వయుజ మాసంలో నవరాత్రులూ కొలుస్తారు. అశ్వనీ దేవతల అధిష్ఠానమైన, అశ్వనీ నక్షత్ర ప్రధానమైనది ఆశ్వయుజ మాసం. ఈ మాసంలో అమ్మవారిని తొమ్మిదిరోజులూ తొమ్మిది అవతారాల్లో పూజించటాన్ని నవరాత్రులు అంటారు. అమ్మ మహిమలను గురించి వివరించటం ఎవరివల్లా కాదు. అది అనుభవించి తీరాల్సిందే. తల్లి ప్రేమను గురించి చెప్పమంటే చెప్పగలమా? ఆ ప్రేమను ఎవరికి వారు అందుకోవలసిందే. అదేవిధంగా ఆ జగన్మాత కరుణాకటాక్షాలను అందుకోవాలంటే ఆ మాతను పూజించే విధానాన్ని బట్టి ఆ తల్లి ప్రేమను, దయను, కటాక్షాన్ని పొందవచ్చు.
దేవీ నవరాత్రులను మూడు రకాలుగా జరుపుకోవటం ఆనవాయితీ. అందులో మొదటిది చైత్రశుద్ధ పాడ్యమి నుంచి మొదలయ్యే శ్రీరామ నవరాత్రులు. వీటినే వసంత నవరాత్రులూ అంటారు. భాద్రపద మాసంలో వచ్చే చవితి నుంచి ప్రారంభమయ్యే వినాయక నవరాత్రులు రెండోవి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి జరుపుకునే నవరాత్రులను దేవి నవారాత్రోత్సవాలుగా జరుపుకుంటాము. భక్తిశ్రద్ధలతో నియమబద్ధ జీవితం గడుపుతూ బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ అకుంఠిత దీక్షతో ఈ నవరాత్రులూ ఆ తల్లిని ఆరాధిస్తే సకల పాపాల నుంచి విముక్తులవుతారని శాస్త్రం చెబుతోంది.
మనకున్న రుతువుల్లో వసంత రుతువు, శరద్రుతువు గడ్డుకాలమని చెబుతారు. ఈ రెండూ యమదంష్టల్రు. ఈ కాలంలో మనుషులు రోగ పీడితులవుతుంటారు. ఈ రుతువుల్లో జననాశనం అవుతుందనీ, అందుకే రెండు రుతువుల్లోనూ దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. దేవీ నవరాత్రుల్లో ఏకభుక్త వ్రతం (ఒంటిపూట భోజనం) చేయాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఎక్కడా లోభితనం చూపకూడదు. అలా అని విచ్చలవిడిగా, తనకు మించిన ఖర్చుతో వైభవంగా ఆచరించమని కాదు. ఉన్నంతలో యథాశక్తిగా అమ్మవారిని పూజించాలి. యథాశక్తి పూజ వల్ల మాత్రమే ఆ మాత అనుగ్రహం లభించి పాపవిముక్తులు అవుతారు. భగవతి తత్వాన్ని మాతృభావంతో నవరాత్రులూ నవమూర్తులుగా ఆరాధించటం ప్రధానం.
దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని మొదటిరోజు మహాకాళిగా, రెండోరోజు మహిషాసురమర్దనిగా, మూడోరోజు మహాసరస్వతిగా, నాలుగోరోజు నంద అవతారంగా, ఐదోరోజు రక్తదంతిగా, ఆరోరోజు శాకంబరిగా, ఏడోరోజు దుర్గావతారంగా, ఎనిమిదోరోజు మాతంగిగా, తొమ్మిదోరోజు భ్రామరిగా కొలుచుకుంటాం.
మహకాళి : శ్రీమహావిష్ణువు చెవిలోని గుబిలి నుంచి మధుకైటభులనే రాక్షసులు ఉద్భవించారు. వారు దేవతలను ఓడించగా శ్రీమహావిష్ణువు శరణు వేడారు. ఆయన 6 వేల సంవత్సరాలు వారితో యుద్ధం చేయగా, మహాకాళి సహాయంతో మధుకైటభులను శ్రీమహావిష్ణువు సంహరించాడు.
మహిషాసురమర్దని : మాయాదేవి రెండో అవతారం మహిషాసురమర్దని. మహిషాసురుడనే రాక్షసుడు బలగర్వంతో దేవతలందరినీ జయించాడు. దేవతలు పరమేశ్వరుని, విష్ణువును ప్రార్థించగా, వారి నోటి నుంచి మంటలు వెలువడ్డాయి. ఆ మంటల నుంచి మహాశక్తి ఉద్భవించి తన వాహనమైన సింహంపై మహిషాసురుడిని వధించింది. ఈమె మహిషాసురమర్దని అయింది. ఈమెకు మహాలక్ష్మి అనే పేరూ వుంది.
మహాసరస్వతి: మూడో అవతారం శ్రీ మహాసరస్వతి. రుగ్వేదంలో, దేవీ భాగవతంలోనూ బ్రహ్మ వైవర్త పురాణంలో సరస్వతీ మాత గురించి అనేక గాధలున్నాయి. సృష్టికార్యంలో తనకు తోడుగా వుండటానికి తన జిహ్వపై బ్రహ్మ ఆమెను ధరించాడని ఒక గాధ.
నంద అవతారం : ఇక నాలుగో అవతారంగా దేవి నందుని ఇంట ‘నంద’ అనే పేరుతో జన్మించింది. శ్రీకృష్ణుని రక్షించటానికి వసుదేవుడు నందుని ఇంటి నుంచి నందని తీసుకొని చెరసాలకు చేరుస్తాడు. అష్టమ గర్భం వల్ల మరణం వుందని తెలుసుకున్న కంసుడు నందను చంపబోగా, ఆమె పైకి ఎగిరి కంసుని హెచ్చరించటం నాలుగో అవతారం.
రక్తదంతి : జగన్మాత ఐదో అవతారం రక్తదంతి. దంతి అంటే దంతాలు కలది. రక్తదంతి అంటే రక్తంతో కూడిన దంతాలు కలది. జగన్మాత అనేక మంది రాక్షసులను, అనేక రూపాలలో ఒక్కొక్కరిని ఒక్కో విధంగా సంహరించటం వల్ల అదే ఆమె రూపంగా, నామంగా పిలవబడుతోంది. జగన్మాత రాక్షసులను తన దంతాలతో సంహరించటం వల్ల ఆమె దంతాలు రక్తసిక్తములయ్యాయి. అందువల్ల ఆమెకు రక్తదంతి అనే పేరొచ్చింది.
శాకంబరీ : అమ్మవారి ఆరో అవతారం శాకంబరీ. దుర్గముడనే రాక్షసుడు దేవతలను జయించదలచి బ్రహ్మ నుంచి వరం పొందాడు. బ్రహ్మ వరంతో ముల్లోకాలను జయించి వేదాలు, మంత్రాలను తన స్వాధీనం చేసుకున్నాడు. దీంతో దేవతలు, బ్రాహ్మణులు పరమేశ్వరుని, జగన్మాతను ప్రార్థించారు. జగన్మాత మహాధనస్సు, తదితర ఆయుధాలతో దుర్గముని వధించి ఫలపుష్ప వనమూలికలను ధరించి ఆకలిదప్పికలు తీర్చే అమృత హస్తాలతో ఉద్భవించి లోకాన్ని అనావృష్టి నుంచి కాపాడింది. అందుకే ఆమెను శాకంబరిగా కొలుస్తాం.
దుర్గావతారం : జగన్మాత ఏడో అవతారం దుర్గావతారం. దుర్గముడనే రాక్షసుని గుండెను జగన్మాత ఐదు బాణాలతో చీల్చి సంహరించింది. దుర్గముడనే రాక్షసుణ్ని వధించటంతో ఆ తల్లి దుర్గామాతగా పూజలు అందుకుంటోంది.
మాతంగి : జగన్మాత తన ఎనిమిదో అవతారంగా మాతంగి రూపంలో దర్శనమిస్తుంది. మాతంగి మహర్షి పుత్రికగా అవతరించినందున ఈమెను మాతంగిగా కొలుచుకుంటాం.
భ్రామరి : జగన్మాత తొమ్మిదో అవతారం భ్రామరి. అరుణుడనే రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి ఎవ్వరి వల్లా మరణం లేకుండా వరం పొందాడు. వరగర్వంతో దేవతలను జయించాడు. అప్పుడు జగన్మాత భ్రమర రూపం ధరించి అరుణుడిని సంహరించింది. భ్రమర రూపంలో రాక్షసుని సంహరించినందున ఈమెను భ్రామరిమాతగా కొలుస్తారు.
ఈ నవరాత్రులు జగన్మాతను వివిధ రూపాల్లో పూజిస్తే చివరిగా విజయదశమితో దేవీ నవరాత్రులు ముగుస్తాయి. ఆరోజు శమీ వృక్షపూజ చేయటం ప్రశస్థము. ఎర్రని ముళ్లున్న శమీ వృక్షపూజ పాపాలను నశింపజేస్తుంది. మన హిందూ ధర్మశాస్త్రాల్లో, భారతీయ సంప్రదాయాల్లో స్ర్తిని పూజించటం, గౌరవించటం, వారికి సముచిత స్థానం కల్పించటం అనేవి మన పూర్వులు మనకు తెలియజెప్పారు. పురాణ ఇతిహాసాలు, వేదాలలోనూ స్ర్తిలను గౌరవించటం మన ఆచారంగా వుంది. అలాంటి మనదేశంలో స్ర్తిలను దేవతా స్వరూపులుగా కొలుచుకుంటామంటే వారికి ఉన్నత స్థానం కల్పించటమే!
జగన్మాతను నవరూపాలుగా ఈ నవరాత్రుల్లో కొలవటం వల్ల అన్ని పనులలో విజయాలు చేకూరతాయి. ఈ దసరా ఉత్సవాలు అందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకొని ఆ జగన్మాత కరుణాకటాక్షాలు పొందాలని ఆశిస్తూ..
‘సర్వం శ్రీ పరమేశ్వర జగన్మాతార్పణమస్తు’

- విష్ణ్భుట్ల రామకృష్ణ,
విజయవాడ.
చరవాణి : 9440618122

మనోగీతికలు

సామ్యవాదాన్ని ఆహ్వానిస్తూ...

ఉ. అచ్చట - వింత గొల్పుచు విహాయస మంటెడి హర్మ్యమందునన్
లచ్చిమి ముద్దు సంతతి విలక్షణ భోగము లాస్వదింపగన్
అచ్చులు గట్టినట్టి వెతలందున బుట్టు అధోజగజ్జనుల్
నొచ్చుచు గిట్టు దుస్థితిటు నుండుట భావ్యమ సామ్యవాదమా?

చ. ప్రగతి ఫలమ్ము నిత్యమొక వర్గము సంగతమున్ వరించుచున్
మిగిలిన వారి మేలునకు మేకొన నట్టి స్వరాజ్యమందు నే
పగిది ననేక దీనజన పక్షము వృద్ధి గడింపగల్గునో
నిగదము జేయవే, నిజమునే ప్రకటింపవె సామ్యవాదమా!

ఉ. వేడుక తోడ జన్మగొని విశ్రుతి నొందెడి వారి సేవలో
వాడుక కోసమై వెలయు వస్తువులై నిరుపేద జీవితాల్
వాఁడి వెతల్ భరించి వసివాడు స్వదేశమునందు వారి కె
వ్వాడిక దిక్కు? సంశయ నివారణ జేయవె సామ్యవాదమా!

ఉ. మంత్రుల గాలిమాటల క్రమమ్మున నుందువు, ఓటు కోసమై
తంత్రము బన్ను వారి యెడదన్ బొడజూపెడి క్షుద్రవౌ మహా
తాంత్రిక విద్యలందు సతతమ్మగుపింతువు గాని ఎన్నడే
మంత్రము జేతనైనను సమక్షమునన్ గనరావె సత్యమై!

ఉ. అక్కట! ధర్మ దేవతకు హానిని గూర్చుచు అడ్డదారిలో
బొక్కెడి వారి బొక్కసము పోఁడిగ నిండగ, ధర్మబద్ధుడౌ
బక్కకు గంజినీళ్ల గతి పట్టిన రుూ కలికాలమందు నీ
నిక్కపు సంవిధానమును నిల్పెద వెట్లిక సామ్యవాదమా!

ఉ. రాజుల రాజ్యపంసదల రక్షణకై రణరంగ మందునన్
తేజమెలర్ప పోరి కడదేరిరి పేదలు మున్ను! నేటి సా
మాజిక పాలనమ్మున అమాత్యుల సేవల యందు వారలన్
రోజు అణంగద్రొక్కు చెడు రోజులు వచ్చెను సామ్యవాదమా!

చ. సములకె సామ్యవాదమను సంస్కృతి పెంచుచు, పెద్దలందరున్
తమదగు స్థాయి వారి సముదాయము నేర్పడ జేసి, అన్యులన్
క్రమముగ వేఱుపర్చెడి దురాకృతులన్నొనరించు ధాత్రి నీ
విమల హృదాశయమ్ము నెఱవేఱుట శక్యమె సామ్యవాదమా!

ఉ. మేలిమి రూపమున్ గొనిన మేడిని చేకొని పొట్టవిప్పగన్
వేలక్రిముల్ కనంబడుచు వేదన కల్గగజేసినట్లు నీ
వాలకమంత బాహ్యమున బాగుగ తోచిన, లోనలోన లో
పాలకు స్థావరమ్మగుట వంచన గదె సావ్యవాదమా!

ఉ. నీవు నిజస్వరూపమున నిండుగ ఆర్తుల నేలు చేవయున్
లావు గడించి వారల విలాపము మాన్పిననాడు నేలపై
దైవతలోక మేర్పడి సదా సుఖశాంతులు పెంపునొందెడిన్!
కావున వేగ మేల్కొనుచు కావగ రమ్మిక సామ్యవాదమా!

- ఎరుకలపూడి గోపీనాథరావు,
విజయవాడ.
చరవాణి : 9848293119

ఆలసించకురా! ప్రియా!
తే.గీ. ఆలసించకురా ప్రియా తాళలేను
నాదు జవసత్త్వమెల్ల యణంగి పోయె
నీ నిమిత్తమె నిలచియున్నాను రార
అంతిమ శ్వాస నీయంకమందు విడతు

ఉ. ఇప్పుడు నా హృదబ్జమున నీవొక భృంగము వోలె వ్రాలినన్
గుప్పిరసమ్ము బీల్చెడు బకానొక తీయని స్వప్నమేదియో
ఒప్పుగ గాంచుచుంటికల యుండగనే దయజూప రా ప్రియా
ఎప్పుటికీ కలే నిజమనే భ్రమ నిక్కమ వంగనిమ్మురా

సీ. పూర్ణిమా చంద్రిక భుగభుగాయితమునై
నిప్పులు జెఱిగెరా నింగినిండ
మలయమారుతమదే కొలిమియావిరి వోలె
సెగలు జిమ్మేనురా పగలుఱేయి
పాయసమ్మున వాన పాములున్నట్టుల
ఏవగింపు జనించె నేమిసేతు
అవరోధములనెల్ల యధిగమించుచు నీవు
సుడిగాలి వోలె నాడకు రార!

తే.గీ. నీవులేనిది జగమెల్ల నీరసముగ
దోచుచున్నది యింకదో బూచులాట
మానరా స్వామి నేను నీదాన నౌర
జాగుసేయక ననుగూడ వేగరార

శా. నీవీరేతిరి రాకపోవునెడ ఈ నీ ప్రేయసిన్ ఱేపుని
ర్జీవంజూతువు బాధనందెదవు మళ్లీ భావిజన్మమ్ములో
నీవేవౌదువొ నేను ఏమగుదునో - నిర్ధారణమ్మేమి ఆ
దైవీ నిర్ణయమేమి చెప్పగలమంతా ఎంతొ గోప్యమ్మురా!

- డా. మాదిరాజు రామసుందర్రావు,
విజయవాడ.
చరవాణి : 9441026360

email: merupuvj@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net

email: merupuvj@andhrabhoomi.net

- డిఆర్ రాజ్‌పాల్