రాజమండ్రి

ముల్లును ముల్లుతోనే... (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగావళి నది ఒడ్డున ఉన్న గ్రామం అది. పేరు కరజాడ. ఆ వూర్లోని గ్రామీణ బ్యాంకు మేనేజరుగా వరప్రసాద్ బదిలీపై వచ్చాడు. వచ్చీ రావడంతోనే బ్యాంకులో పాత రుణాలు ఇంకా ఎవరెవరు చెల్లించారో లేదో అని ఓ లిస్టు ముందేసుకు పరిశీలిస్తున్నాడు. పాతబకాయిల వసూలులో అశ్రద్ధగా ఉంటే ప్రధాన కార్యాలయం వారు పీక్కు తినేస్తారు. అందుకే ఆ బ్యాంకు శాఖలో ఉన్న ముదరా కేసుల్ని వరప్రసాద్ పరిశీలించడం మొదలుపెట్టాడు.
లిస్టులో అన్ని ఖాతాల కన్నా సత్తిరాజు బాకీ ఎక్కువగా ఉంది. బ్యాంకు నుండి మూడేళ్ల క్రితం లక్ష రూపాయలు పంట రుణం తీసుకుని మళ్లీ రెన్యువల్ చేయలేదు. ఆ డబ్బు బ్యాంకుకు కట్టనేలేదు.
‘‘ఈ సత్తిరాజు విషయం ఏమిటి?’’ ఫీల్డ్ ఆఫీసర్ ముకుందరావుని అడిగాడు వరప్రసాద్.
‘‘ఏం చెప్పమంటారు సార్? ఎన్నోసార్లు అతని చుట్టూ తిరిగాం కానీ అలాగే అలాగే అంటూ చెబుతున్నాడు కానీ పంట రుణం రెన్యువల్ చేయలేదు. పైగా అతను ఈ ఊరి ప్రెసిడెంట్. గట్టిగా అడగలేం. అలాగని ఊరుకోలేం’’ అన్నాడు ముకుందం.
‘‘అలా అయితే మనం రేపే అతని ఇంటికి వెళదాం’’ హకుం జారీ చేశాడు వరప్రసాద్.
బ్యాంకులో అనేక రకాలైన కస్టమర్లు ఉంటారు. గ్రామీణ బ్యాంకుకైతే చెప్పనే అక్కర్లేదు. మంచితనంతో గ్రామ ప్రాంతాల్లో పని చేయించుకోవాలి. లేదా చమత్కారంతో పని చుట్టుకు రావాలి. పద్ధతి, హోదా, రూలు అంటే గ్రామాల్లో పనులు కావు. పైగా పల్లెటూరి రాజకీయాల్లో ఇరుక్కుపోవలసిందే. వరప్రసాద్‌కు అదంతా అనుభవమే.
మర్నాడు రికార్డులతో గ్రామ సర్పంచ్ సత్తిరాజు ఇంటికి వెళ్లారు వరప్రసాద్, ముకుందం. సత్తిరాజు వారిని సాదరంగా ఆహ్వానించాడు. కుశలప్రశ్నలు వేశాడు.
అంతా అయ్యాక వరప్రసాద్ పంట రుణం రెన్యువల్ గురించి అడిగాడు.
‘‘అదా... ఎంత మాట సార్! ఆ డబ్బు కట్టేస్తాను. ఏదీ నాకస్సలు తీరికే ఉండడం లేదు’’ అన్నాడు.
అతని వాలకం చూస్తుంటే రుణం రెన్యువల్ చేసే ఉద్దేశం లేనట్లు అనిపిస్తోంది.
‘‘రేపు మీరొక్కసారి బ్యాంకు రండి. అన్నీ రెడీ చేసి అయిదారు నిముషాల్లో మిమ్నల్ని పంపించేస్తాం’’ అన్నాడు వరప్రసాద్.
‘‘రేపంటే అవదండీ! పార్టీ మీటింగు ఉంది. ఎల్లుండి, అవతలి నాడు మా బంధువుల పెళ్లి. పోనీ ఆ తర్వాతి రోజన్నా అవుతుందా అంటే లేదు. తిరుపతి క్యాంపు. ఆ తర్వాత ధాన్యం నూర్పులు. అటు తర్వాత పంచాయతీ మీటింగులు. చాలా కష్టం సార్. చూస్తా ఈ మధ్యలో ఏమాత్రం ఖాళీ ఉన్నా వస్తా’’ బ్యాంకు సిబ్బంది మాట్లాడకుండా సత్తిరాజే మాట్లాడేసాడు.
‘‘సర్లెండి చూద్దాం! మీకు ఖాళీ ఉన్నప్పుడే చేద్దాం’’ అన్నాడు వరప్రసాద్. ఇంతలో సత్తిరాజు టీ తెమ్మని చెప్పడానికి లోపలికి వెళ్లాడు. ‘‘మీరేంటండి సార్ అతన్ని అలా వదిలేశారు. మాకు చెప్పినట్లే మీకూ తెలివిగా సమాధానం చెప్పేసాడు’’ ముకుందరావు అన్నాడు.
‘‘సర్లే చూద్దాం’’ అని వరప్రసాద్ అన్నాడు.
ఇంతలో సత్తిరాజు టీతో వచ్చాడు.
అంతా టీ తాగుతుండగా తాను ఒక చెక్కు మార్పించడానికి అర్జెంటుగా టౌనుకు వెళుతున్నానని, టౌను బ్యాంకులో చెక్కు మార్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని సత్తిరాజు చెప్పాడు. ఆ చెక్కు విలువ రెండు లక్షలని అన్నాడు.
వెంటనే వరప్రసాద్ అందుకున్నాడు. ‘‘అరె ఈ చిన్న పనికి మీరెందుకు టౌనుకు వెళ్లాలి. నాకు ఇక్కడే ఇచ్చెయ్యండి. రేపు ఈ టైముకి మా బ్యాంకుకు వచ్చి ఆ డబ్బు తీసుకోండి’’ అన్నాడు.
‘‘అలా ఇంకో బ్యాంకు చెక్కు ఇక్కడ డబ్బుగా అంత వేగంగా మారుతుందా?’’ సత్తిరాజు అమాయకంగా అన్నాడు.
‘‘్భలేవారు సార్! రోజురోజుకి బ్యాంకుల పద్ధతులు మారిపోతున్నాయి. ఇప్పుడంతా ఆన్‌లైన్ కదా. రేపు ఈ టైముకి రండి డబ్బు తప్పకుండా ఇస్తాం’’ అన్నాడు వరప్రసాద్.
సత్తిరాజు ఆనందంగా చెక్కు వెనుక సంతకం చేసి ఇచ్చాడు.
బ్యాంకుకు తిరిగి వస్తుండగా దారిలో ఫీల్డ్ఫాసర్ ముకుందరావు ‘‘అదేంటి సార్? పాతలోను తీర్చని వాడికి ఈ లేనిపోని సర్వీసులు మనమెందుకు చెయ్యాలి?’’ అన్నాడు.
దానికి వరప్రసాద్ మాట్లాడలేదు. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు.
మర్నాడు అనుకున్నట్టుగానే చెక్కు మార్చి ప్రెసిడెంట్ సత్తిరాజు ఖాతాలో జమ చేశాడు వరప్రసాద్.
డబ్బు తియ్యడానికి సత్తిరాజు వచ్చాడు.
అతన్ని చూడగానే మేనేజర్ చిరునవ్వుతో ‘‘రండి సత్తిరాజుగారూ!’’ అన్నాడు.
‘‘నిన్న నేనిచ్చిన చెక్కు డబ్బు ఇప్పించండి సార్’’ అన్నాడు సత్తిరాజు.
‘‘డబ్బు అయితే మీ ఖాతాలో జమ అయింది గానీ బ్యాంకులో అంత క్యాష్ లేదు’’ అన్నాడు వరప్రసాద్.
‘‘అయితే రేపు వస్తాను’’ అన్నాడు సత్తిరాజు.
‘‘లేదు లేదు రేపు నాకు మా రీజనల్ మేనేజర్‌తో మీటింగు ఉంది. ఎల్లుండి, అవతలినాడు మా క్యాషియర్‌గారు సెలవు పెట్టారు. క్యాష్ తెప్పించడానికి సిబ్బంది ఉండరు. ఇక ఆ మర్నాడు బ్యాంకుకు సెలవులు. ఆ తర్వాత ముంబై ట్రైనింగుకి వెళ్లాలి. అటు తర్వాత...’’
‘‘బాబ్బాబు! అలా అనీకండి. నేనేదో పంట రుణం రెన్యువల్ కోసం వస్తే అన్నానని మీరూ నేను చెప్పినట్లే చెబుతున్నారు. దానికీ దీనికి ముడిపెట్టకండి. ఆ డబ్బు ఓ కాంట్రాక్టు పనిది. అర్జెంటుగా పంచకపోతే నా కొంప మునుగుతుంది’’ సత్తిరాజు ఆందోళనగా అన్నాడు.
‘‘అదే సత్తిరాజుగారూ! మాకు కూడా ఈ రెన్యువల్ కాని బకాయిల విషయంలో పై అధికారులతో చాలా తలనొప్పులు ఉంటాయి. మా బాధలు కూడా మీరు అర్థం చేసుకోవాలి’’ పాఠం చెప్పినట్లు చెప్పాడు వరప్రసాద్.
‘‘బాబూ బుద్ధొచ్చింది. మీరు ఎప్పుడంటే అప్పుడు పంట రుణం రెన్యువల్ చేయించుకుంటాను. ఆ చెక్కు డబ్బులు ఇవాళ జమ చేసేసుకుని నాకు రేపు ఎలాగైనా రుణం ఇస్తే మీ మేలు జన్మజన్మలకు మరిచిపోను’’ అన్నాడు సత్తిరాజు.
మేనేజర్ వరప్రసాద్ మనసులోనే ‘అలా రా దారికి’ అనుకుంటూ ‘‘సరే అలాగే కానిద్దాం’’ అన్నాడు.

- ఝుడ్తీల శ్రీనివాసరావు,
5-6-44, మెహర్‌కుటీర్, పుణ్యపువీధి,
శ్రీకాకుళం-532001.
సెల్ : 9440755932

పుస్తక సమీక్ష

గుండెను కడిగిన భగ్వాన్ కవితలు
ప్రతులకు:
జి.సుబ్బారావు,
రిటైర్డు పోస్టుమాస్టర్
కొత్తపేట
(వయా) రావులపాలెం
తూ.గో.జిల్లా
సెల్: 9959335876

సాహిత్యమంటే అదో ఇష్టం. కవిత్వం అంటే ఇంకా ఇష్టం. మంచి కవిత్వం అంటే మరీ ఇష్టం. దినపత్రికల్లో వచ్చే ప్రతి కవితపైనా తన దృష్టి ఉంటుంది. అది ఎవరిదైనా సరే నచ్చితే వెంటనే ఓ ఫోన్ కాల్ వెళుతుంది. ఓ నాలుగు ప్రశంసలు, రెండు ఆకాంక్షలు, మరో మూడు ప్రోత్సాహక మాటల. ఇవన్నీ ఇదంతా చేసేది మన కోనసీమ సాహితీ దిగ్గజం, కళాసాహితీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ కవి గిడ్డి సుబ్బారావు. ఎవరి కవిత తన కంట పడినా వెంటనే ఓ మెచ్చుకోలు సుబ్బారావు నుంచి తప్పక ఉంటుంది. ఇంతకుముందు బాగుంటే ఆ కవిత గురించి తనకు బాగా ఎరుకపడిన వారి చిరునామకు ఉత్తరం వాలొచ్చేది. ఇప్పుడు ఫోనొచ్చి వెళుతుంది అంతే తేడా. ఇది ఆయనకు కవిత్వం మీదున్న తపన.
ఎక్కడ నుంచి ఎవరు కొత్తగా కవిత్వం రాస్తున్నా ప్రాంతీయతా, జాతీయతా వర్ణ వర్గ బేధం లేకుండా వారిని తమ కళాసాహితీ ఉత్వసంలో మమేకం చేస్తారు. అది ఉగాది కవి సమ్మేళనం. ఉత్సవం అంటే తమ సంస్థ కార్యక్రమం అనుకునేరు. ఔత్సాహికుల్ని ఉత్సాహపర్చటం ఉంటుంది. పండగ అనుకుంటే కవికుల పండగలా నిర్వహిస్తారు. అంతా ఓ కోలాహలం ఓ నూతన సమరగానోత్సవంగా జరుపుతారు. పాతవారు పోగుపడి ఉంటే కొత్తవారు చాంతాడులా కళాసాహితీ ఆహ్వాన పత్రంలో చేరిపోతారు. పొద్దుటేళ నుండి సందేళ వరకు తీరికలేని కార్యక్రమాలు. అతిథుల్ని సంతృప్తిపరచాలని సంస్థకు, సీనియర్ కవులతో కుర్ర కవుల గౌరవ పలకరింపులు. తాము వేసుకున్న కవితా సంకలనాల విశేషాలు. ప్రతి వారి గుండెల్లోను తొణికిసలాడుతుంటాయి.
కోనసీమ ప్రభల తీర్థానికి ఓ ప్రత్యేకత ఉన్నట్టే, కళాసాహితీ నిర్వహించే ఉగాది కవి సమ్మేళనానికి అంత విశిష్టత ఉంది. క్రమం కార్యక్రమం అది. ఇరవై ఏళ్లకు పైగా పరిఢవిల్లుతున్న కళాసంస్థ. కొత్తపేట నుంచి తెలుగు కవిత్వపు వెలుగును విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ‘సుబ్బారావును చూస్తే చాలు కవితలు నాలో నాట్యం చేస్తాయి’ అంటారు భగ్వాన్ అందుకే ఇంత ఉపోద్ఘాతం. అనుభూపతిపరంగా బలంగా మంచి అభివ్యక్తికరణలతో కవిత్వం అల్లితే ఊరుకుంటారా సుబ్బారావుగారు. అదిగో అలా వివిధ పత్రికల్లో వచ్చిన భగ్వాన్ కవితలకు ముచ్చట పడిపోయి వ్యాసం రాసేశారు. ఒకటికాదు ఆరు వ్యాసాలు రాశారు. భగ్వాన్ రాసిన పుస్తకాల మీద సమీక్షలు కూడా ఉన్నాయి. భగ్వాన్ శబ్దాల్ని ప్రేమిస్తూ, వడ్లబండి, ఏటి ఒడ్డున నీటి ప్రయాణం, బల్లకట్టు ఆయన కవిత్వపు కావ్యాలు.
ఇక అసలు విషయానికొస్తే కవి భగ్వాన్ మీద కవి సుబ్బారావు చాలా విశే్లషణాత్మకంగా రాసిన వ్యాసాల్ని ‘గుండెను కడిగే కవితలు’ పుస్తకంగా తీసుకొచ్చారు. వస్తువును ఎన్నుకోవడం దగ్గర్నుంచి ఎత్తుబడి, అభివ్యక్తత ఇలా చాలా అంశాల్లో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి భగ్వాన్ కవితలు. వడ్లబండి మీద ఏకంగా ఏడు పేజీల సమీక్ష, ఎంత నచ్చుంటే అది వచ్చిందంటారు? అలా అని మిగతా పుస్తకాల మీద ఇష్టం తక్కువేమి లేదు. హైకు ప్రక్రియలో భగ్వాన్ రాసిన ఏటి ఒడ్డున నీటి ప్రయాణం చదివితే చాలు ఆహ్లాదం అన్న పదానికి అర్ధం వేసుక్కోనవసరం ఉండదు. మన చుట్టూ ఉన్న వాటి నుంచి మనం ఎంత ఉత్తేజం పొందవచ్చో కవి నుంచి మనం ఎంత పులకించవచ్చో దానికి ఉదాహరణం ఏటి ఒడ్డున ప్రయాణం.
ఓ సున్నిత స్వభావుని కలం నుంచి జాలువారిన అనేక కవితా పాదాలు స్పృజిస్తూ ఎన్నో విశేషాలు తేటపరిచారు సుబ్బారావు. ‘బల్లకట్టు’ ఎక్కి నిలబడితే కాలువ దాటుతున్నట్టుండదు. నీళ్లపై నడుస్తున్నట్టుంటుంది. అనుబంధాల జలనిధిలో కాలుమోపినట్టుంటుంది. గడకర్ర నీటిలో వేసి ఒక్క తోపు తోస్తే బాల్యం ఒడిలో పడతాం. ఇది అనుబంధాల తడివున్న బల్లకట్టు అని కవిభావాన్ని పూసగుచ్చినట్టు సుబ్బారావు చెప్తారు. మనకు నచ్చిన కవితల పేజీలను ముడుచుకుంటూపోతే మడవనివి కనిపించవేమో?నని ప్రశ్నించిన ఆయన అద్భుతమనిపించిన వాక్యాల కింద గుర్తుపెట్టుకుంటూపోతే ఎన్నో గుర్తులు కనిపిస్తాయంటారు. అదీ భగ్వాన్‌లోని భావనాశక్తి, శిల్పచాతుర్యం, అభివ్యక్తి, సాంద్రమైన కవిత్వమూను. చాలా సరళమైన భాషలో పదునుగా రాయడం భగ్వాన్ ప్రత్యేకత. కవిత్వం అంటే కంపించిపోయే వారికి ఈయన కవిత ఒకటి వినిపిస్తే చాలు హాయిగా చదువుకుంటూపోతాడు. కాస్త లోతుగా పరిశీలిస్తే గాంధీజీ దృక్పథం ఆయనలో ప్రతిఫలిస్తుంది. ఒక నిరాడంబరత నిబద్ధతతోపాటు ప్రకృతి యెడల పశుపక్ష్యాదుల యెడల తన కారుణ్యతను స్పష్టపరుస్తారు. పర్యావరణ పరిరక్షత గురించి ఆయన ఎంత తపించిపోతారో ఆయా కవితలు చదివితే ఆర్థ్రమైపోతుంది హృదయం. ప్రాకృతిక సంబంధిత విషయాలపై మనలను భయపెట్టరుగాని బాగా హెచ్చరిస్తారు. వాతావరణం కలుషితం అవుతుంటే ముందు తరాలకు మిగిలేది మరణం. వాతావరణ కాలుష్యానికి కారకుడయ్యే మనిషి పట్ల క్రోధాగ్నులు చిమ్ముతారు. భూ విధ్వంసానికి ప్లాస్టిక్ మూలకారణం అన్నది యదార్థం. ‘ప్లాస్టిక్ వస్తువుల చెలిమితో ఎరువు / విషమవుతుందని తెలుసా’ అని అమాయక మూర్ఖత్వం మీద కొరడా ఝుళిపిస్తారు. పుస్తకంలో మొత్తం ఏడు వ్యాసాలు అయితే చివర్న ఒకటి కాటన్ అవార్డుకు భగ్వాన్ ఎందుకు అర్హులో తెలిపిన వ్యాసం. జలం రైతు గురించి కవి తపన ఇందులో కనిపిస్తుంది. ‘గోదావరి జ్ఞాపకం వస్తే’ కాటన్ ఎందుకు జ్ఞాపకం వస్తాడో తెలిపే కవిత. రైతు పాలిట భరోసా పలికే కవికి ఉందా ఆ అర్హత అంటూ తేల్చిన వ్యాసం. ఇరవై మూడేళ్ల సాక్షీభూతం ఈ పుస్తకం, కవిత్వ రససారంలో దివ్వెగా వెలిగిన స్నేహం, సుబ్బారావు భగ్వాన్‌లది. చిక్కని కవి చిరునామా వీరిద్దరి మిత్రత్వం వర్థిలుగాక!

- రవికాంత్, సెల్: 9642489244

చిన్ని కథ

నారికేళోపాఖ్యానం

కోతికి కొబ్బరికాయ దొరికింది.. ఒక పిల్లవాడి చేతిలో. ఆతనికి మంచీ చెడూ తెలీదు. ఎలాగోలా తన ఆహారాన్ని సంపాదించుకుంది. దట్సాల్!
కోటయ్యకి కొబ్బరి బొండం దొరికింది. అదే కోతి చేతిలో. అతనికి పాపం పుణ్యం తెలుసు. కానీ ఫ్రీగా వస్తుంటే వదల్లేకపోయాడు. అంతే!
అనందంగా ముందుకు సాగిపోతుండగా రోడ్డుపక్కన బొండాల వ్యాపారి కనిపించాడు. ‘బరువు చేటెందుకు? తాగేస్తే పోలా!’ అనుకుని తన చేతిలోని కాయను అతనికిచ్చాడు. అతడు బొండాన్ని కొట్టి స్ట్రా వేసిచ్చాడు.
కోటయ్య తాగిన బొండాన్ని విసిరేస్తూ ‘కాయతోపాటు స్ట్రా కూడా ఫ్రీ. భలే మంచి బోణీ పొద్దునే్న!’ అనుకుంటూ వెళ్లబోతుంటే బొండాల కుర్రాడు ఆపి, చెయ్యి చాపి ‘డబ్బులు’ అన్నాడు.
కోటయ్య అయోమయంగా చూస్తూ ‘దేనికీ?’ అన్నాడు. ‘బొండం తాగినందుకు!’ కూల్‌గా చెప్పాడు కుర్రాడు. ‘అది నాది!’ కీచుగా అరిచాడు కోటయ్య. ‘కాదు నాది!’ అన్నాడు వ్యాపారి మరింత గట్టిగా.
వాగ్వివాదం మొదలైంది. చుట్టూ చేరిన జనం కోటయ్య వాదనను అంగీకరించలేదు. ఎందుకంటే తాటిచెట్టు కింద కూర్చుని ఎవరూ పాలు తాగరని వారికి తెలుసు కాబట్టి.
ఓడిపోయిన కోటయ్య డబ్బులిచ్చి ఉసూరుమని పోయాడు. అంతలో వ్యాపారి కొడుకు వచ్చాడు. ‘నాన్నా! నువ్విచ్చిన కొబ్బరి కాయని ఇంటికి తీస్కెళుతుంటే మధ్యలో ఒక కోతివచ్చి ఎత్తుకుపోయింది’ అన్నాడు.. ఏడుస్తూ...
భూమి గుండ్రముగా ఉండును అన్నది మరోమారు రుజువైంది.

- కౌలూరి ప్రసాదరావు,
వేళ్లచింతలగూడెం (పోస్టు), గోపాలపురం (మండలం),
ప.గో.జిల్లా - 534316, సెల్: 7382907677

వాళ్లకీ ఓ రోజుండాలి

సర్వేశ్వరశర్మగారు పేరున్న ఉపాధ్యాయుడు, సాహితీవేత్త. ఈ మధ్యనే ఉద్యోగ విరమణ చేశారు. పిల్లలిద్దరూ పెళ్లిళ్లు అయి అమెరికాలో ఉన్నారు. పక్షవాతం వచ్చిన భార్యకు అన్నీ తానై సేవలందిస్తున్నారు. ఇతర పనులు పనిమనిషి చేస్తుంది. పాచిపనులు, పాకీపనుల వంటివి చేసే పనిమనుషుల పట్ల ఆయనకి మెల్లగా మంచి అభిప్రాయం కలుగుతోంది. గతంలో ఇంటి పనుల్లో జోక్యం చేసుకోకపోవడం వల్ల ఇవేవీ ఆయనకి తెలియదు. మనవాళ్లకి చేసే పనుల పట్ల కూడా కొన్నిసార్లు ఏవగింపు కలుగుతుంది. అలాంటిది పరాయివాళ్ల కుళ్లును, చెత్తను చీదరించుకోకుండా శుభ్రపరిచే పారిశుద్ధ్య పనివాళ్లు ధన్యులు అనుకున్నారు.
రెండు రోజుల నుండి మున్సిపాలిటీ వాళ్లు సమ్మెకు దిగడంతో ఇంటి ముందు చెత్త అలాగే ఉండిపోయింది. వీధులన్నీ అపారిశుద్ధ్యంతో నిండిపోయాయి. ఆ మర్నాటికి వారి సమ్మె విరమించారు. ఉదయం పారిశుద్ధ్య కార్మికుడు వచ్చి తడిచెత్తను, పొడిచెత్తను వేరు చేసి తొట్టెల్లో నింపుతున్నాడు. దానిని వీధి చివర ఉన్న బండిలో వేస్తూ చేతులకు ఏది అంటినా పట్టించుకోకుండా, అసహ్యమనేదే కనబడకుండా అత్యంత ఆరాధనాభావంతో పని చేస్తున్నాడు.
ఆ సమయంలో ఆ పారిశుద్ధ్య కార్మికుడు జుగుప్సాకరమైన సర్పాలను వళ్లంతా చుట్టుకుని లోకహితం కొరకు హాలాహలాన్ని మింగిన శివుడిలా కనిపిస్తున్నాడు.
మాస్టారికి మెదడులో ఆలోచన మెదిలింది. అన్ని వృత్తుల వారికి సంవత్సరంలో ఏదో ఒక రోజు ప్రత్యేక దినంగా ఉంది. కార్మికుల దిన్సోవం మే1న జరుపుకుంటున్నాం. ఈ కార్మికులు మిగతా కార్మికుల కన్నా భిన్నం. వీరి కొరకు ప్రత్యేక దినం ఉందా? అని గూగుల్‌లో వెతికాడు. ప్చ్! వీరిని గుర్తించే దినం లేదు. తనకు తళుక్కున ఉపాయం తట్టింది. అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జన్మదినం. ప్రధాని మోదీ స్వచ్ఛ్భారత్ కార్యక్రమం ప్రారంభించిన దినం. సహనమూర్తి జన్మదినాన్ని పారిశుద్ధ్య కార్మికుల దినోత్సవంగా జరుపుకోవడం న్యాయమనిపించింది. ట్విట్టర్, ఫేస్‌బుక్ గూగుల్, ఇతర సామాజిక మాధ్యమాలలో ఈ విషయాన్ని అందంగా ప్రతిపాదించాడు. తన విశే్లషణాత్మక వివరణ అందరినీ ఆకట్టుకుంది. లక్షలాదిగా లైక్స్ వచ్చాయి. ఈ ప్రతిపాదనను ప్రధాన మంత్రికి, రాష్టప్రతికి, ఇతర కీలక మంత్రులకు, సంఘ సేవకులకు లేఖల రూపంలో తెలియజేశారు. ఈ విషయమై దేశమంతటా చర్చ మొదలయింది. ప్రధాని అంగీకారంతో అక్టోబర్ 2నాడు స్వచ్ఛ కార్మికుల దినోత్సవంగా జరుపుకోవడానికి నిర్ణయించారు. ఆ రోజు మంచి పారిశుద్ధ్య కార్మికులను ఎంపిక చేసి ప్రతి పట్టణం, జిల్లా స్థాయిల్లో సత్కారాలు కూడా చేయాలని సూచించారు. శర్మ మాస్టారి మెదడులో ఓ ఆలోచనా విత్తనం ఉద్దీపన వృక్షమై, స్వచ్ఛమైన భావనలకు అర్ధవంతమైన ఫలాన్ని ఇచ్చింది. పారిశుద్ధ్య కార్మికులకూ ఓ రోజొచ్చింది.

- చావలి శేషాద్రి సోమయాజులు,
పాచిపెంట, విజయనగరం జిల్లా. సెల్ : 9032496575

మనోగీతికలు

ప్రతి మనిషి మంచివాడె

ప్రపంచంలో చెడ్డవారు ఎక్కడ లేనేలేరు
ప్రవహించే నదుల నీరు, నిర్మలంగ ఉండునట్లు
పసిపాపల బోసినవ్వు, స్వచ్ఛంగా ఉండునట్లు
వికసించిన విరజాజులు, పరిమళాలు పరచునట్లు
పుట్టిన ప్రతి మనిషిలోన..మంచితనం నిండి ఉండు
మధ్యల్న ఆవహించి, ఈ లోకపు మాయ
సుద్ధమైన మనసు చెరచి, మభ్యపెట్టి పాడుచేయు
అరిషడ్వార్గాలనే మురుగుచేరి, కలుష పరచు
కామమనే రాక్షసుడు, మనసుపైన దాడిచేసి
మంచితనం మంటగలిపి, వంచకునిగా మార్చివేయు
దాని వెంట వచ్చునట్టి, క్రోథమనే మదాంధుడు
మతిని బ్రష్టు పట్టించి, దుర్మార్గునిగా చేయును
లోభత్వం ప్రవేశించి, కుత్సితునిగ మార్చివేయు
మదమనే వైరిచేరి, దుష్టునిగా మలిచివేయు
మోహము వల విసిరి, చిక్కపట్టుకుని మానవుని
మనసు సంకుచిత పరచి, క్రూరునిగా చేస్తుంది
మాత్సర్యపు మురుగుచేరి, మదిని చెరచి కుళ్లబెట్టి
దుర్గంధం వెదజల్లే, నీచునిగా చేస్తుంది
స్వచ్ఛమైన నదులలోన, చేరునట్టి మురుగునీరు
నీటిలోని నిర్మలతను, చెరచిపాడుచేయునట్లు
దుష్టమైన గుణంచేరి, మంచి తనం మరుగుపరిచి
మూర్ఖునిగా, వంచకునిగా, దుర్మార్గునిగా, దొంగగా
కుత్సితునిగ - కోపిష్టిగ, మనసుమార్చి పాడుచేసి
పరిశుద్దత మంట గలిపి, వికృత రూపుని చేయును
సత్పురుషుల చెంత చేరి, సద్గ్రంథాలు చదివి
సుజ్ఞానపు వెలుగుపొంది, విజ్ఞానపు కత్తిపట్టి
మదిని కలుషితం చేసే, దుర్గుణాల దునుమాడి
నిర్మలంగ వెలుగొందే, నిజరూపం తెలుసుకుని
మాలిన్యం చేరనీక, మాయను తొలగించుకొనుచు
మనసు దిటవు పరచుకొన్న, ప్రతి మనిషీ మంచివాడె

- వెలగల ప్రదీప్ శంకర్‌రెడ్డి,
కొంకుదురు, , బిక్కవోలు మండలం, తూ.గో.జిల్లా

ఆ నలుగురూ...!
దారి వెంట నడిచిన మనుషులు
అప్రయత్నంగానే ఆ అదృశ్యశక్తి
వచనాలు విన్నారు!
ఒకడు వినీ విననట్టే
దృశ్యంలోంచి
జీవితంలోకి నడిచాడు!
మరొకడు
సాంసారిక బాధ్యతలలో నలుగుతూ
ఊహల్ని పరిచే దారిలో
ఆధ్యాత్మికంగా
జీవనాన్ని మలచుకోలేకపోయాడు!
ఇంకొకడు
బండపై రాలిన విత్తును
చిగురించబోయే ఆశలకు గుర్తుగా
మొలకెత్తించబోయికష్టాలకు తాళలేక
భవిష్యత్తును విడిచి పెట్టేశాడు!
చివరివాడు
సదవగాహనతో
భగవద్సంకల్పం వెంటాడుతుంటే
మహాత్ముడుగా ఎదిగిన క్షణం
కొత్తదారిన పరచిన దీపధారై
చరిత్రలో
సదా కృతార్థుడిగా నిలిచిపోయాడు!

- గునిశెట్టి ప్రసాద్, బాబి ఎన్‌క్లేవ్
విశాఖపట్నం. సెల్ : 7032395074.

ఓ భూమాతా క్షమించు!
తల్లి కడుపునుండి
నేలపై పడగానే
నీ ఒడిలో పడి, పాకి, నడచి
ఇంతవాళ్లమయ్యేము
నీగాలి పీల్చి నీ నీరుత్రాగి
నీపైరు పంటలనే తిని
మనుగడ కోసమై
అడవుల నరికేసి పర్వతాల పెకిలించి
విషపు ప్లాస్టిక్కులను
నీగుండెల్లో - కప్పేసి
రసాయనాల- వెదజల్లి
పండంటి భూమిని
ఎడారిగా మారుస్తున్నాం
గగనాన పొగ కాలుష్యాల నింపి
ఓజోన్‌ను- లేపుతున్నాం
మలినాలతో - జలకాలుష్యం చేస్తున్నాం
భూతాపాన్ని పెంచుతున్నాం
కనులు తెరచాము
కాలుష్యాలను నియంత్రించి
నీటిగుంటలు తవ్వి
నీ కోపాన్ని - తాపాన్ని
తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం
ఓ ధరణీలలామా! క్షమామణీ!
ఓ భూమాతా! మమ్ము క్షమించు
మానవాళిని - రక్షించు

- విద్వాన్ ఆండ్రకవి మూర్తి,
అనకాపల్లి. సెల్ : 9246666585

గిరుల సిరులు
వేకువజాము కిరణాల తాకిడి
ముంగిట కోడికూతల అలికిడి
జీవితం ప్రకృతి స్వరసవ్వడి
జీవనం మాత్రం అందమైన గారడి!
కాలమొక్కటే నిత్యనూతన ఒరవడి!
నీలిమేఘం పలకరింపు
చినుకు చినుకూ పలకరింపు
కొండల్లో కోయిలమ్మ
ఎంచక్కని ముద్దుగుమ్మ!
సెలయేటి గలగలలో
వరిసెపూల సొగసులతో
అలరారే లోయలలో
ఆనందం తూగుటూయల!
అడవితల్లి లాలిపాట
గిరిపుత్రుల పచ్చని ఊసుల బతుకుబాట
జనకోటికి జీవమిచ్చే
అడవుల రక్షణ ధ్యేయంగా
హృదయాంతర స్వరధుని!
లోయల్లో.....
బతుకు లోతుల్లో ప్రతిధ్వని

- మరడాన ధరణి, సెల్ : 9492853773.

email: merupurjy@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- ఝుడ్తీల శ్రీనివాసరావు