విజయవాడ

చదువు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిల్లా కలెక్టర్ గారు ఆ కళాశాల సందర్శనకు వస్తున్నారు. ప్రాంగణమంతా ఒకటే హడావుడిగా వుంది. విద్యార్థులు, అధ్యాపకులు ప్రధాన ద్వారం నుండి బారులుదీరి స్వాగతం చెప్పడానికి వేచి ఉన్నారు. ఇంతలో కలెక్టర్‌గారి కారు వచ్చి ద్వారం ముందాగింది. అందరూ చప్పట్లతో తమ కళాశాల పూర్వ విద్యార్థికి ఘన స్వాగతం చెబుతుండగా కలెక్టర్ ఇందిర సరాసరి ప్రధానాచార్యుల దగ్గరకు వెళ్లి కిందికి వంగి ఆయన కాళ్లకు నమస్కారం చేసింది.
కళ్లల్లో నీరు నిండగా, మసక మసకగా కనిపిస్తోన్న ఇందిరను ఆప్యాయంగా భుజాలు పట్టుకొని పైకిలేపి ఆశీర్వదించారాయన. ‘ఆ రోజు మీరు నా పెళ్లి ఆపి నాకెంతో మేలు చేశారు. మీ సలహా నన్నింతదాన్ని చేసింది’ అని ఇందిర అంటుండగా నాటి సంఘటన ప్రధానాచర్యుల వారి మదిలో మెదిలింది.
***
‘మీరు పెళ్లికి తప్పకుండా రావాలి సార్!’ అంది ఇందిర వివాహ ఆహ్వాన పత్రిక అందిస్తూ.
‘మీ అక్కదా పెళ్లి? తప్పక వస్తాను!’ అన్నారు ముక్తసరిగా ఇందిర చదువుకుంటున్న కళాశాల ప్రధానాచార్యులు.
‘లేదండీ నాదే’ సిగ్గుపడుతూ చెప్పింది ఇందిర.
‘నీదా?’ అన్నారు ఆశ్చర్యంగా ఆయన. ‘నీ వయస్సెంతమ్మా? పదిహేనో, పదహారో కదా! లేదు.. లేదు, ఇది బాల్య వివాహం అవుతుంది’’ అన్నారు ప్రధానాచార్యులు కాస్త కోపంగా.
‘నేనూ ఒప్పుకోలేదండీ! కానీ మా నాన్న నా అభిప్రాయాన్ని తోసిపుచ్చారు. ఏం చేస్తాను మరి?’ అంది ఇందిర నిస్సహాయంగా.
‘కాదు ఇందిరా! నేను మీ నాన్నతో మాట్లాడతాను. నీ లాంటి తెలివైన అమ్మాయి బాగా చదువుకోవాలి. బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేయాలి. అంతేగానీ, పిల్లల్నికనే యంత్రాలు కాకూడదు. నేను నచ్చచెబుతాను. మీ నాన్నను ఒకసారి పంపించు’ అన్నారాయన.
‘ఇప్పుడు వీలుకాదండీ! ఎంతో ఖర్చు పెట్టేశారు. పెళ్లి పిలుపులు కూడా చాలావరకు జరిగిపోయాయి’ చెప్పింది ఇందిర.
‘అంటే? నీకూ ఈ పెళ్లి ఇష్టమేనన్నమాట’! అన్నారాయన.
‘నా ఇష్టం ఎవరికి కావాలి సార్?’ నిర్వేదంగా అన్నది ఇందిర.
‘నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగదు! అంతేకాదు, ఒకవేళ నువ్వు ఈ పెళ్లికి ఇష్టపడినా బాల్య వివాహం నేను జరగనివ్వను’ దృఢంగా అన్నారాయన.
‘ఇప్పుడీ పెళ్లి జరక్కపోతే మా నాన్న చస్తారు’ గొంతు పూడుకుపోయింది ఇందిరకు.
‘ఓ..! అలా బెదిరించి ఒప్పించాడన్నమాట. సరే! నువ్వు వెళ్లు’ అన్నారు ఏదో ఆలోచిస్తూ..
‘మీరు కుటుంబమంతా కలిసి తప్పకుండా రండి!’ అంటూ మరోసారి చెప్పి వెళ్లిపోయింది ఇందిర.
కళాశాల ప్రధానాచార్యులు వెంటనే పోలీసు ఎస్సైగారికి ఫోను చేసి విషయం చెప్పారు. ఎస్సై కుటుంబ సలహా సభ్యుల్ని (్ఫ్యమిలీ కౌన్సిలర్స్) తీసుకొని ఇందిర ఇంటికి వెళ్లారు. రెండు, మూడు గంటలు చర్చలు, సలహా, సంప్రదింపుల తరువాత మొత్తానికి ఇందిర తల్లిదండ్రుల్ని ఒప్పించారు. వరుడినీ, వారి తల్లిదండ్రుల్నీ ఒప్పించి పెళ్లి ఆపేశారు.
***
ఇందిర యథావిధిగా చదువు కొనసాగించింది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంక్ సాధించింది. ఆ కళాశాల ప్రధానాచార్యుల సలహాతో డిగ్రీలో చేరింది. విశ్వవిద్యాలయంలో ప్రథమ ర్యాంక్ సాధించి బంగారు పతకం సొంతం చేసుకుంది. డిగ్రీ కాగానే సివిల్స్‌కు చదువుకుంటూనే దూరవిద్య ద్వారా ఎంబిఏ పూర్తి చేసింది. తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో విజేతగా నిలిచి జిల్లాకు కలెక్టర్‌గా వచ్చింది.
‘హరీ! ఇటు రండి!’ అంటూ కారులో కూర్చున్న వారిని పిలిచింది. హరి వచ్చి ఇందిర పక్కన నిలుచున్నాడు.
‘ఆరోజు మీరు ఆపిన పెళ్లి వరుడు మాస్టారూ! నాకోసం ఈ ఎనిమిదేళ్లు తన పెళ్లిని వాయిదా వేసుకున్నారు. మమ్మల్ని ఆశీర్వదించండి’.. అంటూ ఇద్దరూ తలలు వంచి నిల్చున్నారు ప్రధానాచార్యుల ముందు వినయంగా!

-- మండవ సుబ్బారావు,
కొత్తగూడెం,
భద్రాద్రి జిల్లా.

స్వగతంలో..
తప్పు పాలకులది..
పచ్చని పొలాలని గుంజుకుని కాంక్రీటు జంగిల్‌గా మార్చి.. ఫ్యాక్టరీలు కట్టించి.. కృష్ణమ్మ జలాలను కలుషితం చేసి, నీ నీరు తాగి ఆరోగ్యంగా వున్న మమ్మల్ని, నీ నీటిని వ్యర్ధాలతో నింపి, ఆరోగ్యాన్ని హరించి, ప్రజలను కార్పొరేట్ ఆస్పత్రులకి చేర్చి, ఇళ్లు, పొలాలు అమ్మినా తగ్గని మాయదారి రోగాలను మాకు రప్పించకండి. శ్రావణంలో గ్రీష్మాన్ని తలపించే ఎండలు.. అయినా పుష్కరాల్లో స్నానం చేసి తమ పాపాలన్నీ పోగొట్టుకుందామని భక్తులు జనసంద్రాన్ని తలపిస్తున్నారు. ప్రభ్వుం హజ్‌యాత్రకి ముస్లిములకి సాయం అందించినట్లు మాకు కూడా ఉచిత బస్సులు, ఉచిత భోజనాలు. ఎన్నో సౌకర్యాలతో పనె్నండు రోజులూ! మరువలేము ఈ పుష్కరాలను మళ్లీ పనె్నండేళ్లకి! కానీ నగరం అప్పటిలా లేదు. పొలాలు లేవు. అరటి, నిమ్మతోటలు లేవు. పచ్చని పైర్లు లేవు! పైరగాలి పీల్చి ఆరోగ్యంగా వున్నాం ఆరోజుల్లో. ఇక ఇప్పుడు అభివృద్ధి పేరుతో పొలాల ధరలు పెరిగి, అయినవాళ్లు డబ్బు కోసం గొడవలు పడి, దూరమైన రక్తసంబంధాలతో.. నగరం అందంగానే వుంది కానీ, అనుబంధాలు తెగిపోతున్నాయి! అందరూ డబ్బు మనుషులుగా మారిపోతున్నారు. ఒక తల్లీ పిల్లల మధ్య కూడా ఏవిధమైన బంధాలు మిగల్చకుండా.. ఇదా అభివృద్ధి? నగరం అభివృద్ధి చెందింది. కానీ మనుషులే మమతలకు దూరమయ్యారు!

- కోట సావిత్రి, విజయవాడ.

పుస్తక పరిచయం
సామాజిక చైతన్యస్ఫూర్తి.. ‘తార’తత్వ పంచశతి!

పుస్తకం : తారతత్వ పంచశతి
రచన: తాళ్లూరి రఘుపతి రెడ్డి
పేజీలు: 105
ప్రతులకు:
తాళ్లూరి రమాదేవి,
మైత్రీ నిలయం అండ్ కాంప్లెక్స్,
గంగవరం, సత్తుపల్లి మండలం
ఖమ్మం జిల్లా. చరవాణి : 9441881620

ఆంధ్ర వాంగ్మయంలో శతకాలకు ప్రత్యేక స్థానముంది. శత నామం సంఖ్యా బాహుళ్యాన్ని తెలుపుతుంది. త్రిశతులు, పంచశతులు, సప్తశతులు, సహస్ర శతులు కూడా ఉన్నాయి. శతక వాంఙ్మయం తెలుగు సాహిత్యంలో పెంపొందినట్లు మరే ఇతర భాషా సాహిత్యాల్లోనూ లేదని విమర్శకులు అంటారు. సాధారణంగా పూర్వం కవులు భగవదనుగ్రహ ప్రాప్తి కోసం శతకాలు రచించారు. ఆధునిక సాహిత్యంలో లోకానుభవాన్ని ఆధారంగా చేసుకొని రాసిన నీతి శతకాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ కోవకి చెందిన పంచశతిని తాళ్లూరి రఘుపతి రెడ్డిగారు ‘తారతత్వ పంచశతి’ పేరుతో 504 పద్యాలను తేటగీతి, ఆటవెలదులతో అలంకరించి లోకానికందించారు. ‘తారాభావధార తత్వమిదియే’ అనే మకుటంతో ఈ లోకంలోని అనేక అంశాలను స్పృశించి లోకరీతిని చదువరులకు తెలియజేశారు.
దైనందిన జీవనంలో అనుభవంలోకి వచ్చిన అనేక సంఘటనలకు ప్రతిస్పందించి సంఘటన వివరాన్ని భావశుద్ధితో పాఠకుల హృదయాన్ని తాకేలా, చైతన్యాన్ని పురిగొల్పేలా అక్షరబద్దం చేశారు కవి. తార మాస్టారుగా ఎందరో విద్యార్థుల్ని తీర్చిదిద్ది, విశ్రాంత ఉపాధ్యాయునిగా తన పని పూర్తి అయిందిలే అని అనుకోకుండా ఈ సమాజపు స్థితిగతుల్ని ఎత్తిచూపి మరింతమందిని చైతన్యవంతుల్ని చేసి తన గురుతర బాధ్యతను నెరవేరుస్తున్నారు.
పంచశతి ద్వారా సృష్టిని, స్ర్తిని గురించి, తల్లిదండ్రులు, భార్యాభర్తలు, జీవితం, శాస్త్రం, డబ్బు, రాజకీయం, లైంగికత, విద్య, మతం-్భక్తి, శభం, అప్పుడప్పుడు అనే శీర్షికలతో ప్రతి పద్యచమత్కృతిని మన ముందుంచారు.
సృష్టి అంతా దేవునిమయమే అంటూ ఆయా మత గ్రంథాలు వివరించాయి. ఏదో ఒక మూలపురుషుని ద్వారా సృష్టి క్రమం జరిగిందని ఆయా గ్రంథాలు చెపుతాయి. డార్విన్ సిద్ధాంతం ప్రకారం మానవ పరిణామ క్రమంలో ఈ సృష్టిలో భగవంతునికి స్థానం లేదు. పదార్థంలో జరిగే మార్పు ద్వారా ఏకకణజీవి, బహుకణజీవులు క్రమంగా ప్రైమేట్స్, తద్వారా మనిషి ఉద్భవించాడు. ఈ సృష్టి రహస్యాన్ని కవి తనదైన శైలిలో ఈవిధంగా చెప్పారు.
‘నేల, నీరు, గాలి, నిప్పును జతగూడ
సృష్టి కలిగెనండి, సుమతులార
సృష్టికర్త పేర సుద్దులాపండిక
తార భావధార తత్వమిదియె’ అంటారు. మరో పద్యంలో..
‘సెక్సు ఎక్స్ వైలు చేసిన చోద్యంబు
విశ్వమాయె వాస్తవమ్మిదండి
దీని వెనుకలేదు దైవత్వమేదియు’ అంటూ అసలైన విషయాన్ని సూటిగా తెలియజేశారు.
సృష్టిలోని ఎన్నో రహస్యాలను కనుగొన్న మనిషి ప్రతి వస్తువుని తన సుఖం కోసం వినియోగిస్తూ ప్రకృతిని ఎదిరించి మరీ జీవనం సాగిస్తున్నాడు. కానీ ప్రకృతి విలయతాండవం చేస్తే హాహాకారాలు, ఆర్తనాదాలు చేసే నేటి స్వార్థపరుల్ని ప్రకృతి పట్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే ఈ పద్యం చూడండి.
‘సృష్టియెల్ల తనకె సుఖమునివ్వాలని
వెంపరాడు నరులు వెర్రివాళ్లు!
ప్రకృతి విలయహేల పసిగట్టలేరొకో
తార భావధార తత్వమిదియె’ అని చెపుతారు.
36 ఆటవెలదులు, 7 తేటగీతులతో నేటి సమాజపు స్ర్తిల గురించి వివరించడమేగాక మహిళల్ని చైతన్యపరిచి సమాజ నిర్దేశకులుగా వెలుగొందమంటారు.
‘తెగువతోడ మహిళ తేవాలి మార్పులు
మహిళ మార్పెయగును మహికి మార్పు
ఇంట మార్పెయగును యిల మార్పునకు నాంది
తార భావధార తత్వమిదియె!’
పురుషాధిక్య ప్రపంచంలో స్ర్తి మనగలగాలంటే ముందుగా ప్రతి మహిళా తన ఇంటి నుండే మార్పు తేవాలని, అప్పుడే ఈ సమాజంలో మార్పు వచ్చి స్ర్తి పట్ల చిన్నచూపు పోతుందంటూ మహిళల్ని చైతన్యపరుస్తారు కవి. అంతేకాదు, మరో పద్యంలో ‘ఆస్తిహక్కు వచ్చింది తలెత్తుకు బతకండి’ అంటూ మహిళకు ధైర్యం చెబుతారు. ప్రస్తుత సమాజంలో స్ర్తి, పురుషుల నిష్పత్తిలో ఎంతో తేడా ఉంది. ఆడవాళ్ల సంఖ్య తగ్గిపోతోందని, చివరకు ఆడజాతి అంతరిస్తుందేమోననే ఆవేదనను వ్యక్తం చేస్తూనే సమాజానికి హెచ్చరిక చేస్తున్నారు.
అమ్మ ప్రేమను గురించి చెప్పని కవి లేడంటే అతిశయోక్తి కాదు.
‘అమ్మ ప్రేమకంటె అమృతతుల్యవౌ
ప్రేమయేది లేదు పుడిమి యందు
ప్రాణి సహజమైన పరమాద్భుతంబిదె’.. అంటూ ప్రతి ప్రాణి సహజ గుణం అమ్మ ప్రేమను పంచడమేనని, అమ్మ ప్రేమను మించిన అమృతం లేదని అంటారు.
‘అమ్మ నాన్న పిలుపు అవమాన మనురీతి
మమ్మి డాడి యెంతో మధురమాయె
ప్రాచ్య సంస్కృతెంత పనికిమాలినదయ్యె’.. అనే పద్యం ద్వారా తల్లిదండ్రుల ప్రేమను గురించి చెబుతూనే నేటి పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి అమ్మా-నాన్న పిలుపులోని తియ్యదనాన్ని ఆస్వాదించని పిల్లలకు కనువిప్పు కలిగిస్తారు. ఈ పద్యం ద్వారా మాతృభాషపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు కవి. ప్రతి నిముషానికి ఒకరు చొప్పున పెరిగిపోతున్న నేటి జనాభా, వనరుల లేమితో ఉన్న మన దేశ అభివృద్ధికి ఆటంకంగా మారింది. అందుకే కుటుంబ నియంత్రణ పాటించమని చెప్పే పద్యంలో కవికి వున్న సామాజిక బాధ్యత ద్యోతకమవుతుంది. ఇంతేగాక భార్యాభర్తల అనుబంధాల గురించి 36 పద్యాలు అద్భుతంగా రాశారు.
క్షణభంగురమైనది ఈ మానవ జీవితం- అనే సత్యాన్ని ఎరుగని మనిషి తన స్వార్థంతో అనేక దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు. అలాంటి వారికి జీవిత రహస్యాన్ని తెలిపే పద్యాన్ని అందించారు.
‘ఉన్నదెంతయైన తిన్నదే దక్కును
పదవులెన్ని చేయి పధము ఒక్కటే
వెంటయెందరున్న ఒంటిరి పయనమే
తారభావ ధార తత్వమిదియె’.. అంటూ ఈ మానవ జీవితాన్ని విడమర్చి చెప్పారు.
నేటి మన అతిపెద్ద ప్రజాస్వామ్యంలో రాజకీయ రంగం భ్రష్టు పట్టింది. దీనికి కారణం స్వార్థ రాజకీయ నాయకులే. నేరచరిత్ర ఉన్నవారే మంత్రులుగా చలామణీ అవుతుంటే ఇక ప్రజాస్వామ్యపు విలువలెక్కడుంటాయి?
‘నేరగాళ్లు, నేత లేకమై దేశాన్ని
కొల్లగొట్టుచుండి రెల్లవేళ
యువత మిన్నకున్న భవిత మరేముంది
తార భావధార తత్వమిదియె’.. అంటూ యువతను చైతన్యపరిచి నేటి స్వార్థ రాజకీయం నుంచి దేశాన్ని రక్షించమంటున్నారు కవి.
గతంలో అందరూ ఒకేచోట కలిసి ఉండే సమష్టి కుటుంబాల్లో పిల్లలకు నైతిక విలువల్ని బోధించే అవకాశం ఉండేది. అంతేగాక మానవ సంబంధాలు, ప్రేమాభిమానాలు ఉండేవి. నేటి వ్యష్టి కుటుంబాల్లో అవి మచ్చుకైనా కానరావటం లేదు. అందుకే కవి ఇలా మథనపడుతున్నారు.
‘వేరు కాపురాలు విపరీత భావాలు
విద్యపేర వృత్తి విధుల పేర
బంధువర్గమెల్ల బహుదూరమైపోయె
తార భావధార తత్వమిదియె!’.. అంటూ నేటి మానవ సంబంధాల తీరును ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఇందులో మతతత్వం, టెర్రరిజం, ఎన్నికలు, ప్రజాస్వామ్యం, పాలకులు- వంటి అంశాలపై పదునైన ప ద్యాస్త్రాలను సంధించారు. ఈ పద్యాలను అవగాహన చేసుకున్న ప్రతివారు సామాజిక దృక్కోణాన్ని అలవర్చుకుంటారనడంలో సందేహం లేదు. ప్రతిఒక్కరూ తాత్విక చింతనను అలవర్చుకోవాలి. తద్వారా మనిషి కనీసంగానైనా ఆలోచించాలనే తపనతో కవి చేసిన ప్రయత్నం ఫలించాలని ఆకాంక్ష. ఇంత చక్కని, చిక్కని పద్యాలు రాసి ప్రతిఒక్కరూ చదువగలిగేలా పంచశతిని అందించిన ‘తార’ మాస్టారికి అభినందనలు.

- సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు,
అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా.
చరవాణి : 9491357842

మనోగీతికలు

కనుమరుగైన ఓ జ్ఞాపకం
కృష్ణమ్మ తీరాన
అమ్మఒడిలో
అరటి చెట్ల నీడన
హాయిగా సేదదీరిన
అందమైన జ్ఞాపకాలు
నా అంతరంగంలో
నిక్షిప్తమైన వున్నాయ్!
ఆకుపచ్చని లోకంలో
హరితవనాల నడుమ
వనకన్యలా విహరించి
ప్రకృతిలో ఓ భాగమై
పరవశించిన రోజులు
నా మనసు పొరల్లో
కదలాడుతూనే వున్నాయ్!
స్నేహ బృందంతో కలిసి
చెరువుగట్టుపై
గంతులేసిన రోజులు
అచ్చతెలుగు సంక్రాంతి మాసంలో
గొబ్బెమ్మలతో అలంకరించేందుకు
ఆవుపేడకు, గుమ్మడి పువ్వులకు
వేకువ చలిలో
పరుగులు తీసిన
తీపి జ్ఞాపకాలు
గుండెలోతుల్లో భద్రంగా వున్నాయ్!
కానీ.. ఇప్పుడు
నా జ్ఞాపకాల ఆనవాళ్లను
కాంక్రీటు రహదారుల నిర్మాణాలు
కర్కశంగా కాటేశాయ్!
నా ప్రేమ సామ్రాజ్యం లోగిళ్లు
హరితవనాలు నేలమట్టమై
బహుళ అంతస్థుల భవనాలకు
చిరునామాగా మిగిలిపోయాయ్!
విదేశీ భవనాల పునాదుల
అట్టడుగు భాగాన
నా గ్రామం శిథిలాలు
కన్నీరు కారుస్తున్నాయ్!

- విడదల సాంబశివరావు,
చిలకలూరిపేట, గుంటూరు జిల్లా.
చరవాణి : 9866400059

కలవని బంధం..!
కొన్ని బంధాలంతే
ఎప్పటికీ కలవవు
ఎక్కడో దూరాన
కలిసినట్టు కనిపిస్తాయంతే!
పక్కపక్కనే వుండి
పలకరిస్తున్నట్టుగానే వుంటాయి
మురిపంగా ముచ్చట పెడుతున్నట్టుగానే వుంటాయి
నీలాగే నేనూ..
నాలాగే నీవూ.. అంటూ
అపురూప ఆదర్శాలను వల్లిస్తుంటాయి
కరచాలనమైనా చేయని ఈ బతుకులపై
ఎన్నో బంధాలు కదిలిపోతుంటాయి
గమ్యాలకు చేరుకుంటూ వుంటాయి
నిశ్చలమైన ఈ జంట మాత్రం
బతుకు బోగీలను మోస్తూ
మహాప్రస్థానమై
అలాగే వుంటాయి
పవిత్రంగా!

- కటుకోఝ్వల రమేష్,
ఖమ్మం.
చరవాణి : 9949083327

నేర్వదగు వానిని
చూచిన..
నునుపు తేలి
గాజుగోళీల్లా
ఆ మెఱుపులెందుకో..
చూస్తే చాలు
కొరికి తినాలన్నంత
కోరిక రేపుతాయెందుకో..
మెత్తగా పిండి చేయాలని
మనసున ఉన్నా
దాచుకొని పోగేసుకొని
ఇంటిని అలంకరిస్తారెందుకో..
ఎన్నో కాలాలు చూసి
ఆటుపోట్లకు
తనువునర్పించి
ప్రకృతిలో మమేకమైనందుకో..
పడిలేచే కెరటాల జోరు
బాధించినా
వణికించే వరదల హోరు
దొర్లించినా
ఇసుక తినె్నల్లో గులకరాళ్లై
వజ్రాల్లా మురిపిస్తాయెందుకో..
ఉద్వేగమే ఊపిరైన
దురహంకార మానవులకు
స్థిత ప్రజ్ఞత
నేర్పేటందుకేనేమో!

- షేక్ బషీరున్నీసా బేగం,
గుంటూరు.
చరవాణి : 9985193970

నడక
జీవిత చక్రం ఎటువైపు ఎందుకు
తిరుగుతోందో ఎవరికీ తెలియదు
ఎట్లా తిరిగినా పరవాలేదు
ఇరిగి పోరాదు, ఒరిగి పోరాదు!
ఎత్తుపల్లాలు ఎదురైనా
వంకర టింకర రహదారులపై
నీ పయనం బాధ్యతకు చిహ్నం
అనుభవాలు మలుపులుగా
ముళ్లబాటనే పూలబాటగా
మార్చుకొని ముందుకు సాగాలి
విజయకేతనం ఎగురవేయాలి!
- శ్రీగరళకంఠ,
గన్నవరం, కృష్ణా జిల్లా.

email: merupuvj@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net

-- మండవ సుబ్బారావు