విశాఖపట్నం

చావుగోల (కథానికలు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమీప బంధువు మరణవార్త సుందరాన్ని ఎంతగానో కలసివేసింది. అవును చావు ఎన్నో రకాలు. ఇంట్లో, వీధిలో, పూజగదిలో, ఆక్సిడెంట్‌లో, మనమెవరో గుర్తు పట్టలేని చోట... ఎన్నో ఎనె్నన్నో...
హార్ట్ ఎటాక్ వచ్చి బాత్‌రూంలో స్నానం చేస్తూ తలుపుకు అడ్డంగా పడి ప్రాణాలు వదిలేసినవారు, తాత అంత్యక్రియలకు వచ్చి చెరువులో స్నానం చేస్తూ మునిగిపోయి ప్రాణం వదిలిన మనుమడు. ఇడ్లీ ముక్క గొంతులో ఇరుక్కుని చనిపోయిన పిల్లవాడు, ఆటలాడుకుంటూ కార్‌డోర్ లాక్ చేసుకుని మరణించిన పిల్లలు, ప్లాట్‌ఫారంపై పడుకున్న అమాయకుల పైకి దూసుకుపోయిన లారీ, కారు... మృత్యువును కొత్తరకంగా పరిచయం చేస్తాయి.
చావును గురించి వర్ణించమంటే అందరూ చెప్పేదొకొక్కటే చావంత సుఖం లేదని. చనిపోవడం అనేది చనిపోయే వాడి అదృష్టం అనుకుంటారు చాలామంది. కానీ వారిపై ఆధారపడ్డ వారి స్థితి మర్నాటి నుండి ఎలా మారుతుందో ఎవరికీ అర్ధ్థం కాని, అంతుపట్టని స్థితి.
కారు ప్రమాదంలో తల్లీతండ్రీ చనిపోగా అనాథలైపోయిన కానె్వంట్ పిల్లలు, ఒక్క పిల్లాడితో ఆపరేషన్ చేసుకుని, ఆ పిల్లాడు సెల్‌ఫోన్ మోగితే ఛార్జింగ్ తీయలేక కొరికి కరెంట్‌తో ప్రాణం పోగొట్టుకుంటే విలవిలాడిన తల్లి, పరీక్షలకి టూవీలర్‌పై దిగబెడుతూ డివైడర్ గుద్దుకుని మరణించిన వాళ్లు అన్నీ బాధామయ దృశ్యాలే.
తన సమీప బంధువు ఎవరూ లేనట్లు అనాథగా చావును ఎవరికీ తెలీని చోట పంచుకోవడం మరింత కలతకు గురిచేసింది.
‘‘ఇక్కడెందుకు చనిపోయారు? ఎవరు ముందు చూశారు? చనిపోయే ముందు అతను డబ్బు, బంగారంతో ఉన్నాడా? లేదా ఎవరైనా అతన్ని హత్య చేశారా? ఇంట్లో ఏవైనా ఘర్షణలు జరిగాయా? తాగుబోతా?’’ ఇలాంటి వందల ప్రశ్నలు శవం దగ్గర కూర్చుని రోదిస్తున్న వాళ్ల పైకి శరపరంపరగా సంధించబడతాయి.
ఆత్మహత్య అయితే ఎందుకు చనిపోయాడు? ఏం తీసుకున్నాడు? ఎవరు పురిగొల్పారు? ఆ వ్యక్తికి కుటుంబంతో ఉన్న సంబంధ బాంధవ్యాలేమిటి? ఆర్థిక స్థితిగతులు ఎలాంటివి? ఆవిడ మంచిదేనా? అతనికి బయటి తిరుగుళ్లు ఏవైనా ఉన్నాయా?’’ ఇవన్నీ బయట మరణం పొందిన వ్యక్తి కుటుంబ సభ్యులు వినాల్సి ఉంటుంది.
ఇలాంటి ఎన్నో గండాలు దాటిన తర్వాత గానీ శరీరం దహనానికి నోచుకోదు.
జాలిగా చూస్తున్నట్టు నటిస్తూనే ఎన్నో అంశాల గురించి ఆరా తీసేవాళ్లు. వెటకారంగా మాట్లాడేవాళ్లు ఎందరో.
తాగి వచ్చి రోజూ కొట్టే భర్త మరణిస్తే ‘‘హమ్మయ్య! ఇన్నాళ్లకి ఆమె సుఖపడింది’’ అనేవాళ్లే కొద్ది రోజులు పోతే మరోలా అనేందుకు సిద్ధంగా ఉంటారు. డబ్బు ఉండీ ఆరోగ్యం బాగులేక మంచంపై అన్ని సపర్యలు చేయించుకుంటున్న ధనవంతుడి మరణం అతను రాసే వీలునామాపై ఆధారపడ్డా ఆశ్చర్యంలేదు.
మనిషికి తనది కాని దానిపై ఆశ, స్వార్ధం, వ్యామోహం నశిస్తే తప్ప సమాజం బాగుపడదు అనుకున్నాడు సుందరం.
బతికేందుకు కొద్దిపాటి సౌకర్యం, చనిపోయాక మంచివాడన్న గుర్తింపు లేకపోతే అలాంటి బతుకు వ్యర్థం అంటారు.
కరెంట్ ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, పిడుగు, వరదలు, కరువులు మనిషిని తన పొరపాట్లకు తానే బాధ్యుడిని చేస్తూ చావు పరిచయం చేస్తాయి.
ప్రతి ఒక్కరు అనాయాస మరణాన్ని కోరుకునేవారే.
భగవంతుడికీ తెలుసునేమో కొందరికి ధనం ఇస్తే ఇంకొందరికి ఆరోగ్యం ఇస్తాడు. కొందరు ఎంత ఉన్నా చాలని పిసినారి జీవితం, ఒక్కోసారి అడుక్కుతినే జీవితం కూడా గడిపితే ఇంకొందరు కలో గంజో తాగి గుట్టుగా బతుకీడుస్తారు.
‘మరణం జీవితాన్ని పరిచయం చేస్తుంది నలుగురికీ’ అంటారు అందుకే అనుకున్నాడు సుందరం.
పొలంలో మంచాలు, ఎరువులు జల్లుతూ చనిపోయినవారు, గాదెల్లో దాచిన దాన్నో, బావిలో పూడిక తీయాలనో, పొలంలో పాము కాటుకో, సెప్టిక్‌ను నిర్లక్ష్యం చేసి ప్రాణం మీదకు తెచ్చుకునో, కాలేయం మార్పుల్ని గమనించకుండానో, పచ్చకామెర్లతోనో వర్ణించలేని రూపాల్లో మృత్యువు మనతో దొంగాటలాడుతుంది.
బతకాలనే తపన మనిషిది... ఎలా బతికామన్నది కాదు ఎలాంటి పేరు తెచ్చుకున్నామన్నదే ముఖ్యం. కొందరికైనా తమ జీవితం మార్గదర్శకం అయితే చాలన్నట్లు బతకాలి.
సాధువులు, సన్యాసుల విషయానికి వస్తే చావు, బతుకుల్ని తేలిగ్గా తీసుకుంటారు వాళ్లలో చాలామంది. పుట్టిన దగ్గరి నుండి ఎందరికి ఎన్ని రకాల సహాయాలు అందించగలిగాం, మరి కొంత కాలం ఉంటే ఈ సహాయం విస్తరించేది అనుకున్నా వారసుడికి బాధ్యతల్ని అప్పగించి సంతృప్తిగా మరణాన్ని ఆహ్వానించగలిగే సంఘసేవకులు కొందరు.
అధికార పీఠాల్ని అధిరోహించి, అన్ని సుఖాలు అనుభవించి ప్రమాదంలో అకస్మాత్తుగా కనుమరుగైపోయిన వాళ్లూ ఉన్నారు.
అందరూ మృత్యువు జీవితాన్ని వేరు చేస్తుంది అని శాపనార్థాలు పెడితే మృత్యుదేవత భగవంతుడిని వేడుకుందట భగవంతుడు అనేక కారణాలు చూపించి ఇక నిన్ను నిందించరని అభయమిచ్చాడంటారు కొందరు.
అందుకే కాబోలు ఈ రోగాలు, ప్రాణాలు తీసే మందులు, మాకులు, ఎలక్ట్రిక్ ఉపకరణాలు, ఆక్సిడెంట్లు.
నవరంధ్రాలతో జన్మించిన మనిషి నవరంధ్రాల తేడాతోనే పోతాడంటారు. శరీరంలోకి ప్రాణం ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. ఎలా పోతుందో తెలియదు. వైద్య పరిభాషలో రోగం పేరు చెప్పి పోయాడంటారు అంతే.

- శ్రీనివాస భారతి,
శ్రీకాకుళం.
స్వగతంలో..

తప్పు పాలకులది..
పచ్చని పొలాలని గుంజుకుని కాంక్రీటు జంగిల్‌గా మార్చి.. ఫ్యాక్టరీలు కట్టించి.. కృష్ణమ్మ జలాలను కలుషితం చేసి, నీ నీరు తాగి ఆరోగ్యంగా వున్న మమ్మల్ని, నీ నీటిని వ్యర్ధాలతో నింపి, ఆరోగ్యాన్ని హరించి, ప్రజలను కార్పొరేట్ ఆస్పత్రులకి చేర్చి, ఇళ్లు, పొలాలు అమ్మినా తగ్గని మాయదారి రోగాలను మాకు రప్పించకండి. శ్రావణంలో గ్రీష్మాన్ని తలపించే ఎండలు.. అయినా పుష్కరాల్లో స్నానం చేసి తమ పాపాలన్నీ పోగొట్టుకుందామని భక్తులు జనసంద్రాన్ని తలపిస్తున్నారు. ప్రభ్వుం హజ్‌యాత్రకి ముస్లిములకి సాయం అందించినట్లు మాకు కూడా ఉచిత బస్సులు, ఉచిత భోజనాలు. ఎన్నో సౌకర్యాలతో పనె్నండు రోజులూ! మరువలేము ఈ పుష్కరాలను మళ్లీ పనె్నండేళ్లకి! కానీ నగరం అప్పటిలా లేదు. పొలాలు లేవు. అరటి, నిమ్మతోటలు లేవు. పచ్చని పైర్లు లేవు! పైరగాలి పీల్చి ఆరోగ్యంగా వున్నాం ఆరోజుల్లో. ఇక ఇప్పుడు అభివృద్ధి పేరుతో పొలాల ధరలు పెరిగి, అయినవాళ్లు డబ్బు కోసం గొడవలు పడి, దూరమైన రక్తసంబంధాలతో.. నగరం అందంగానే వుంది కానీ, అనుబంధాలు తెగిపోతున్నాయి! అందరూ డబ్బు మనుషులుగా మారిపోతున్నారు. ఒక తల్లీ పిల్లల మధ్య కూడా ఏవిధమైన బంధాలు మిగల్చకుండా.. ఇదా అభివృద్ధి? నగరం అభివృద్ధి చెందింది. కానీ మనుషులే మమతలకు దూరమయ్యారు!

- కోట సావిత్రి, విజయవాడ.

పుస్తక పరిచయం

కాలంతో సంఘర్షించే కవిత్వం ఎవరిదీ ముఖం

ఉత్తరాంధ్ర నుండి ఇప్పటికే అనేక రచనలు అందించిన రెడ్డి రామకృష్ణ అందించిన ‘ఎవరిదీ ముఖం’ కవితా సంపుటి నిర్మలత్వం, నిరాడంబరత, సున్నితత్వం మేళవింపుతో మనసుకు హత్తుకునేలా ఉంది. పినలకర్ర, గొడిముక్క, బీల-్భమి సముద్రం వంటి వచన, దీర్ఘ కవితలు అతి ముఖ్యమైనవి. ఇందులో ‘నం జమీమ్-జమీన్-సమందర్’ పేరుతో ఒక హిందీ అనువాదం కూడా వచ్చింది. ఉత్తరాంధ్ర మాండలిక యాసతో రాసిన రెండు దీర్ఘ కవితలూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందినవే. ఈ కవితా సంపుటి విషయానికి వస్తే 55 వచన కవితలు, రెండు పాటలు దర్శనమిస్తాయి. నిబద్ధత, నిజాయితీ, నిస్సంకోచత్వం పెట్టని ఆభరణాలుగా కనిపిస్తాయి. వ్యక్తిగత సంఘర్షణలతో పాటు సామూహిక సామాజిక చైతన్యాన్ని అంతర్లీనంగా ప్రేరేపించే సందర్భాలే కోకొల్లలు. మృదుత్వంతో సంభాషించే కథాకథన శైలి ఆకట్టుకుంటుంది.
‘నేను కవినైతే/నీ నెత్తుటితో తలసిన నేలను/నా అక్షరాల తలలకెత్తి/మేధావుల మెదళ్లపై చల్లుతాను’ అంటున్నప్పుడు కవిలోని ఆత్మగతమైన సంఘర్షణ బహుముఖాలుగా విస్తరించి సమూహంలో పరివ్యాప్తి చెందడం గమనిస్తాం. సందర్భమేదైనా ఇవాళ కవిత్వంతో మమేకం కావడం భావావేశానికి ఒక నిలువుటద్దం. బహిర్గమైన ఆవేశాన్ని అంతర్ముఖంగా వ్యక్తీకరించడానికి, సామాజిక ప్రపంచానికి నివేదించడానికి ఇదొక వాహిక. ఈ తపనలోంచి ఒక కొత్త చైతన్యదీప్తి వెలుగుతుందేమోనని కవిలో మెదులుతున్న ఆశ. ఈ స్ఫూర్తి చాలు- భావితరాల నుండి మేధావి వర్గాల దాకా ఆలోచనలు కళాత్మక భావాలతో విస్తరించడానికి.
‘బీడుపువ్వు’ కవితలో కవి ఆవేదన కొత్త ఆకృతి దాల్చుతుంది. ‘కాలం వీచే యానగాలి హోరు/ ఇసుక రేణువులు ఎగిరొచ్చి/చేపలపై పడుతుంటే/అప్పటికప్పుడు దులుపుతూ/బతుకు ఇసుక బారిపోకుండా...’ అంటుంటే కొవ్వాడ తీరంలోని మత్స్యకారుల జీవన స్థితిగతులు కళ్ల ముందు మెదులుతాయి. సముద్ర బీభత్సం వెనుక రాబోయే పెనువిప్లవాల నిశ్శబ్ద కాంతి ప్రతిఫలిస్తుంది. కలుషితమైన జలప్రాంతాల మనుగడ అణువిద్యుత్ ప్రాజెక్టుల భయోత్పాతాన్ని తేటతెల్లం చేస్తుంది. భవిష్యత్ విషాద దృశాన్ని చిత్రీకరించడంలో కవి వ్యూహాత్మక ముఖచిత్రాన్ని పసిగట్టవచ్చు. ‘హలో బాబూ’ కవితలో ఆధునిక సామాజిక పరిణామాన్ని వ్యంగ్య స్పృహతో ఎండగట్టే ప్రయత్నం చేస్తారు కవి. ‘నువ్వు ఎప్పుడైనా వచ్చి/మా ఊరెక్కడని వెతుకుతావేమోనని/ముందుగా చెప్తున్నా/జీవితాన్ని మోసుకుంటూ రేపు/మేమెక్కడుంటామో తెలియదు’ అని వాపోయే ప్రయత్నం చేస్తాడు కవి. వర్తమాన కాలాన్ని విషాదభరితంగా మలచడంలో ‘సెజ్’లు సృష్టిస్తున్న విధ్వంసాన్ని రేఖామాత్రంగా స్పృశిస్తాడు కవి. పంట భూముల కొనుగోళ్ల విషయంలో ఆకాశాన్ని అంటుకోవలసిన ధరలు అధ:పాతాళానికి తొక్కి, కనీస మద్దతు ధరలైనా చెల్లించలేకపోవడం ప్రభుత్వ యంత్రాంగ దుస్థితికి, దుర్నీతికి అద్దం పట్టిస్తుంది. ఈ నేపథ్యాన్ని ఎత్తిచూపడంలో ధ్వనిపూర్వకమైన సంభాషణాత్మక కవితా కథనాన్ని ఆవిష్కరిస్తాడు కవి. ఈ ఒడుపులో కొన్ని కొత్త మెరుపులు జ్వలిస్తాయి. ‘ ఆకలి ప్రేవుల తంబురా మీటుతూ/ ఆనందభైవి ఎలా పాడగలను/ నెత్తురు ఒలికిన చోట/ మెత్తని రాగాలనెలా విప్పగలను/నా కంఠం ఫ్యాక్టరీ పొగగొట్టం కాదు కదా’ అంటారు. ‘నెల్లిమర్ల కార్మికుడా’ కవితలో ఒకచోట గతంలో జరిగిన పోలీసు కాల్పుల నెత్తుటి పాదముద్రల్ని ఏరడంలో ఈ వాస్తవికత ధ్వనిస్తుంది. కార్మికులకు పెట్టుబడిదారులకు మధ్య సాగిన పరోక్ష యుద్ధ దృశ్యాన్ని ప్రతిబింబించడంలో నెల్లిమర్ల జ్యూట్‌మిల్లు సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా మిగిలిపోయింది. దీనిని కవితాత్మక స్పర్శతో అక్షరీకరించడానికి చేసిన ప్రయత్నం ఇది. ‘అతివృష్టి అనావృష్టి’ కవితలో రైతు దీనస్థితిని ‘కురిసింది వాన/నిండింది గాదె/రైతు కన్నీటితో’ అని వర్ణిస్తారు కవి. అతివృష్టి మూలం నీటిపాలై రైతు బతుకులో కన్నీటిని మిగిల్చినప్పుడు మెదిలిన విషాద దృశ్యమిది. కవిత్వపరమైన చరణాలను వాక్యాలుగా చిత్రించడంలో అక్కడక్కడా రామకృష్ణలో చెయ్యితిరిగిన తనాన్ని నిరూపిస్తుంది. అతడు బండిలో ఉన్నంత వరకు/నా మనసు తేనీటీగై/అతని చుట్టూ తిరుగుతుంటుంది’, ‘నేను ఒంటరినైనా/ ఒక జెండాలా/ ఆత్మవిశ్వాసాన్ని ఎగరేస్తూనే ఉంటాడు’, ‘ ఎడతెరిపిలేని వాన/నా లోపల/ ఎప్పుడూ కురుస్తూనే ఉంటుంది’, ‘చంద్రుని చుట్టూ వరద గుడి కట్టినట్టు/నీ శరీరం చుట్టూ/దు:ఖం గూడుకట్టిన దృశ్యం’ లాంటివి కొత్తకోణాన్ని ఆవిష్కరిస్తాయి. రోహితం, అతడొక వీస్తున్న పూలతోట, మాంసాహారపువ్వు, గదిలో సముద్రం, వర్తమానంలో జీవించు మున్నగు శీర్షికలు వైవిధ్యపూరితంగా ప్రతిధ్వనిస్తాయి. ఆకర్షణీయమైన ముఖచిత్రం ప్రత్యేకతను రుజువు చేస్తుంది. అన్ని పార్శ్యాలలోనూ తనదైన సృజనాత్మక కోణాల్ని అందించడంలో రామకృష్ణలోని నిశిత పరిశీలనా దృష్టికి దర్పణం పడుతుంది. మంచి ఇతివృత్తాలతో కూడిన కవితలను పాఠకలోకానికి అందించిన కవికి అభినందనలు.

- మానాపురం రాజా చంద్రశేఖర్,
సెల్ : 9440593910
తనికెళ్ల ‘నక్షత్ర దర్శనం’

తనికెళ్ల భరణి ప్రముఖ రచయిత, కవి, గాయకుడు, నిర్మాత. అన్నింటికీ మించి మంచి నటుడు. ఆయన రాసిన నక్షత్ర దర్శనం చక్కటి కావ్యమనే చెప్పాలి. ఏముందిలే సినిమా నటుల గురించే కదా అనుకుంటే పొరపాటు. సినీ నటీనటుల గురించి భరణి రాసిన కవితలు ఆకట్టుకునేలా ఉన్నాయి. శైలి, పదాల అమరిక, పోలికలు, సామ్యాలు, సద్గుణాలు చక్కటి అనుభూతినిస్తాయి. గొప్ప తారల గురించే కాకుండా ఇతర వ్యాపాకలలో ప్రసిద్ధులైన వారి గురించి కూడా ఇందులో ఉన్నాయి.
‘శివకేశవులను ఎమ్మెస్సే మగత నిద్ర నుండి లేపాలి సుప్రభాతంతో’ అంటారు ఒకచోట. భగవంతుడిని ఆరాధించే వారి పట్ల భరణికున్న గౌరవం ఇందులో మనకు కనిపిస్తుంది. అలాగే ‘జాకీర్ హుస్సేన్ వేళ్లు తబలాపై పంచవాక్యాలు’ అంటారు. ‘ద్వారం వారికి రెండయిదుల పది కళ్ల’ట. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ అయితే, చలం స్ర్తిస్ర్తి అంటారు. వీరిద్దరినీ ఒకే కవితలో కలపడం అసాధారణం. ఇలాంటివి భరణికి మాత్రమే సాధ్యం. హరిప్రసాద్ చౌరాసియా గురించి రాస్తూ ‘చౌరాసియా మనందరి నరాలతో స్వరాలు మీటుతాడు’ అంటారు. ఇక సినీ నటుల విషయానికి వస్తే ‘అక్కినేని చల్లతాగే దేవదాసు’ అంటారు. హాస్యానికి రేలంగి అనే పేరుందని, రేలంగికీ, హాస్యానికి కూడా తెలియదు అంటారు. అంతటి చమత్కారి ఆయన. నెల్లూరు యాసకి సూటేస్తే రమణారెడ్డి అవుతాడు. గయ్యాళి నటి సూర్యకాంతాన్ని ‘అందరినీ తన వేలితో బెదిరించే సూర్యకాంతం నటనను ఎవరూ వేలెత్తి చూపించలేనిది’ అంటారు. బాలసుబ్రహ్మణ్యం పాటలని పెళ్లి పందిరి తోరణాలతో పాటు కడతారని వర్ణిస్తారు. చిత్రసీమకి భానుమతిని ఒక కొలమానంగా చేసి భారమితితో పోల్చారు. పోలికలు అనేవి సాధారణంగా ఒకే రకమైన అలవాట్లు, జీవన విధానాలు ఉండే వారికి మాత్రమే కుదురుతాయి. కానీ విభిన్న ధోరణలు, మనస్తత్వాలు, జీవన విధానాలు, రచనా ప్రక్రియలతో సహా పోల్చలేని శ్రీశ్రీని, విశ్వనాథ సత్యనారాయణని పోలుస్తారు. అదే దారిలో రెండు మతాలకి సంబంధించిన హరి-హరుడు, జేసుదాసు, పోప్ పాల్ని శబరిమలనీ ఒకే గాటకి కట్టి సాహసించారని చెప్పవచ్చు. అయితే బాపు రమణల మీద, చార్లీచాప్లిన్ డిక్టేటర్ మీదా మరి కొంచెం రాసి ఉంటే బాగుండేదనిపిస్తుంది. కళాకారులంతా పచ్చగా ఉండాలనే కామెర్ల రోగికి ఈ పుస్తకాన్ని అంకితంగా ప్రకటించారు భరణి. ఇంకా ఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్రి, గురుదత్, కున్నకుడి, అల్లు, రాఘవేంద్రరావు, జంధ్యాల, ఆరుద్ర, వేటూరి ఇలా ఎవరినీ వదలక వారిపై కవితో, వ్యాసమో రాసి విడిచిపెట్టారు. కవితలకి ఇంపైన, సరైన, తేలికైన పదాలని వాడి తన ప్రజ్ఞను అలవోకగా చూపించారు. అందరూ కొని చదవదగిన వ్యాస కవితా ఝురి.

- కె.వి. సుబ్రహ్మణ్యం,
22-205, గణేష్‌కాలనీ,
శ్రీనివాసనగర్,
విశాఖపట్నం-530028.
సెల్ : 9440110483.

మనోగీతికలు
బాలల బ్రతుకులు
కాఫీ కొట్టులో కూలీలు
క్వారీ పనుల్లో కిరాయిలు
జీడిపప్పు బడ్డీలకు బానిసలు
పరిశ్రమలన్నింటికీ పనివారలు
వైన్‌షాపుల్లో పాలికాపులు
వెట్టిచాకిరీకి ఉదాహరణలు
బాలకార్మికుల నిర్మూలన
బాల్యవివాహాలకు అడ్డుకట్ట
పడితేనే బాలలకు భవిత
కన్నవారు బాలల బతుకులను
అమ్మేయడం కాదు...
వారి బతుకులను తీర్చిదిద్దాలి
రేపటి పౌరులుగా నేటి బాలలను
తయారు చేయాలి!
నేతలు, సంఘ సంస్కర్తలు
అంతా అడుగు ముందుకేయాలి
బాలల ప్రపంచాన్ని రంగుల మయం చేయాలి
నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించాలి!

- సీరపు మల్లేశ్వరరావు,
కాశీబుగ్గ.
సెల్ : 7680812592.

అనుకూల పవనాలు
నాలో విశాలమైన సముద్రం
అనంతమైన ఆకాశం ఉన్నాయి
హృదయం వికసితమై
మంచి మాటల స్వరలిపిలో
అంతా ఒక్కటైనట్లు
కోయిల పాడుతున్నప్పుడు
మొగ్గలు వికసిస్తున్నప్పుడు
పసిపాప నవ్వులు రువ్వుతున్నప్పుడు
ఒక విత్తనం మొలకెత్తి
కొమ్మలు శాఖోపశాఖలుగా విస్తరించినట్టు
సూర్యుని తేజస్సుతో దేదీప్యమానమైన కాంతి సంపద
ఒకే మూల ఉత్పన్నమయినట్టు
పైపై కుతూహలాన్ని దాటి
అంతరంగం పిలుపులా
విశ్వమంతా స్వంతంలా
అనుకూల పవనాలు వీస్తుంటే
నేను నీటిలోని రుచిని
గాలిలోని సువాసనని
గగనంలో ఇంద్రధనస్సుని
అన్ని రంగుల తెల్లకిరణాన్ని
శాంతికి చిహ్నంలా!

- బులుసు సరోజినీదేవి,
సెల్ : 9866190548.

మన స్నేహం
తియ్యనిది
మన స్నేహం తేనె కన్నా తీయనిది
మన స్నేహం మంచుకన్నా చల్లనిది
మన స్నేహబంధం స్వచ్ఛాప్రవాహంలాంటిది
మన స్నేహబంధం శాశ్వతమైన అనుబంధం
మన స్నేహానికి లేవు పేద ధనిక తారతమ్యాలు
మన స్నేహానికి లేదు చిన్నాపెద్దా తేడాలు
నెమలి నాట్యం మరచినా
కోకిల గానం మరచినా
మన కొండంత స్నేహాన్ని
ఎప్పటికీ మరువను
ఆకాశంలో ఏముంది నల్లని మబ్బులు తప్ప
నా గుండెల్లో ఏముంది నీ స్నేహసుధలు తప్ప
మన స్నేహానికి కావాలి కోటి నక్షత్రాల వెలుగు
మన స్నేహం ఆనందంగా నిలవాలి
స్వాతి చినుకుల్లా
ఆపదలో ఆదుకున్న అమ్మలా
అనురాగంతో నిండిన అమ్మలా
అందుకే నేను మరువను నీ స్నేహగీతికను

- ఉమాకవి,
శ్రీకాకుళం.

చదువుకుంటేనే భవిత

చదువుకుంటేనే భవిత బుజ్జిబాలల్లారా
చదువుంటే అన్నీ ఉన్నట్లే
చదువు లేకుంటే జీవితంలో
ముందుకెళ్లడం అసాధ్యం
నేటి చదువు భవితకు వెలుగు
బాల్యంలో దిద్దే అక్షరాలే
రేపటి వెలుగు దివ్వెలను
ప్రసరించే కాంతి కిరణాలు
అందుకే అందరూ చదువుకోవాలి
సరస్వతీ మాత కటాక్షం పొందాలి
అక్షరజ్ఞానంతో ఈ భూప్రపంచాన్ని
ఇట్టే చుట్టేసి రావచ్చు
అనుకున్నది సాధించవచ్చు
లేదంటే అంతా అయోమయమే
అందుకే మన విద్యాలయాలు వెలగాలి
అక్షరాల మెరుపులీనుతూ
బాలలని నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలి
అప్పుడే ఈ పుడమి పచ్చగా వెలుగుతుంది
విద్యా సౌరభాలు నలుదిక్కులకు విస్తరిస్తాయి!

- ప్రసాద్, విశాఖపట్నం.
సెల్ : 9502937180.
email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- శ్రీనివాస భారతి