ఉత్తర తెలంగాణ

తీపి జ్ఞాపకం! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిసెంబర్ నెల చలి కాస్త ఎక్కువగానే వుంది. మంచుదుప్పటి సూర్యుడు మెల్లగా బయటకు తొంగిస్తున్నాడు. ఊరపిచ్చుకల అరుపులు కిటికి పక్కనే ఉన్న జామచెట్టుపైన రివ్వున ఎగురుతూ ఆడుతున్న చప్పుడు వినబడుతోంది. అప్పుడే తలంటుపోసుకోవడంతో కురుల నుండి కారే నీటిబొట్లను తుడుచుకుంటూ గోడకు వేలాడుతున్న అద్దంలో ఒకసారి ముఖాన్ని చూసుకున్నాను. చామనఛాయ రూపంలో ఉన్న తనలో ఎక్కడా ఏ చిన్నలోపం లేదు. పైగా పెదవిపైనున్న పుట్టుమచ్చ తన మొహాన్ని ఇంకాస్త ద్విగుణీకృతం చేస్తోంది.
రాత్రి నాన్న చెప్పిన కాన్నుండి అమ్మకు నా అందం మీద భయం పట్టుకుంది. ‘అనసూర్య, శృతివాళ్లు అందరు బ్యూటిపార్లర్ల చుట్టూ తిరుగుతూ ఒక్కొక్కరు ఒక్కోతీరున వాళ్ల ఆకృతులను, రూపురేఖలకు మెరుగులద్దుకుంటుంటే.. పాత చింతకాయ పచ్చడిబొమ్మలా నేను ఇలానే బాగున్నానంటివి.. వచ్చేవాడికి నువ్ నచ్చితే.. నరసింహస్వామిని దర్శించుకుని వంద టెంకాయలు సమర్పిస్తానని.. మొక్కుకున్నాను అంటూ అమ్మ జడలు వేస్తూ రుసరుసలాడింది. నిజమే అమ్మ చెప్పిన మాటల్లో కూడా నిజముందేమో! వచ్చేవాడికి నేను నచ్చుతానో లేదో! ఒకింత మనసు కలవరపడుతోంది. అద్దంలో నా ప్రతిబింబం మళ్లీ ఒక్కసారి చూసుకున్నాను. నన్ను వెక్కిరించినట్టనిపించింది. ఆలోచిస్తూనే.. కిటికి వద్దకు వచ్చాను. జాజిమల్లె, కనకాంబరాలు మంచుకు తడిసి ముడుచుకున్నవి. అవి ఇప్పుడిప్పుడే తగులుతున్న సూర్యరశ్మి నులివెచ్చని స్పర్శతో విచ్చుకుంటూ ఎంత సహజత్వంగా పులకరిస్తూ తమ అందాన్ని ప్రదర్శిస్తూ ఉట్టిపడుతున్నాయి. పైపై మెరుగులు దిద్దుకునే అసహజత్వం కన్నా సహజత్వం ఎంతోమిన్న, ప్రకృతిని చూసి మనిషి ఎంతో నేర్చుకోవలసి వుంది. చూసే మనసునుబట్టి వారి భావాలను బట్టి మనిషైనా! ప్రకృతైనా! అందంగా గోచరిస్తుంది. ఇప్పుడు అద్దం వద్దకు వెళ్లి ఇంకోసారి చూసుకున్నాను.
అప్పుడే విరిసిన పూవ్వులా ఎంత అందంగా ఉన్నానో! ఇక నా మనసులో ఒకటే నిశ్చయించుకున్నాను. ‘నేను నాలానే ఉంటాను. ఎవరికోసమో నేను మారను. ఆడపిల్లకు సహజత్వం ఓ కుసుమం. నాకు స్వేచ్ఛ వుంది. నాకు కొన్ని హక్కులున్నాయి. దాన్ని కాలరాసే అధికారం ఎవరికీ లేదు’ అనుకుంటూ టేబుల్ మీద కనకాంబరం మాలను జడలో పెట్టుకున్నాను.
‘అన్నయ్యా అబ్బాయివాళ్లు వచ్చారు’ బాబాయి కేక వేశాడు. అమ్మా, నాన్నా ఇంకాస్త హడావుడి ఎక్కువ చేస్తున్నారు. నా మనసుకు రెక్కలు వచ్చాయి. ఆనందంతో నేను గుమ్మంపై వున్న కిటికి వద్ద వాలాను. మోటర్ బైక్‌పైన వచ్చిన ముగ్గురు వ్యక్తులు లోనికి వస్తున్నారు. అందులో ఒకతను ఓరగా నావైపు చూస్తు లోనికి వచ్చాడు. బహుశా ఆ చూపులు బట్టి అతనే నేమో! చూడడానికైతే బాగానే ఉన్నాడు. మనసు నన్ను సమాధానపరుస్తోంది. సరదాగా అందరూ హాల్లో మాట్లాడుకుంటున్నారు. అమ్మ వంటింట్లో నుండి పిలిచింది. నేను ట్రేలో టీ, స్నాక్స్ తీసుకుని నడిచాను. అమ్మ, పిన్ని నన్ను అనుసరించారు.
నేను టీ కప్పు ఇస్తుండగా ‘అతనేనమ్మా అబ్బాయి’ అన్నాడు బాబాయి.
అతను తల ఎత్తి నావైపు చూస్తున్నాడు. నేను మెల్లగా అతని కళ్లలోకి చూశాను. ఆ చూపులో ఏదో మత్తు ఉన్నట్లుంది. గమ్మత్తుగా సిగ్గుతో ముడుచుకునేలా చేశాయి.
ట్రే అక్కడే పెట్టి గదిలోనికి పరుగెత్తాను. నాన్న-బాబాయి గదిలోకి వచ్చి ‘అబ్బాయి నచ్చాడా!’ అన్నారు. నేను సీతమ్మలా సిగ్గుపడుతూ ‘నచ్చాడు’ అన్నాను.
‘అబ్బాయితో ఏమైనా మాట్లాడతావా’ బాబాయి ప్రశ్న పూర్తికాకముందే తల అడ్డంగా ఊపాను.
‘నిజమే ఆడపిల్లకు అబ్బాయిపైన ఎన్నో సందేహాలుంటాయి, వాటిని నివృత్తి చేసుకోవటంలో తప్పులేదు. కాని అతను పిన్నివాళ్ల బంధువు. అన్ని రకాలుగా ఆరా తీసి ఆలోచించాకే కబురుచేస్తే వచ్చారు. నేను మాత్రం అతనితో ఓ ప్రత్యేకమైన రోజున మాత్రమే మాట్లాడాలనుకున్నాను. అది జీవితంలో ఓ తీపి జ్ఞాపకంలా ఉంటుంది!
కొద్దిసేపు ఆ ముచ్చట ఈ ముచ్చట మాట్లాడుకుని ‘మంచి ముహూర్తం చూసుకుని మీ ఇంటికి వస్తాం’ అని నాన్న చెప్పటంతో వాళ్లు తిరుగు ప్రయాణం అయ్యారు.
నేను సహజంగానే జామచెట్టు క్రిందికి వెళ్లాను. శ్రీరామచంద్రుడిలా వున్న నా మనోహరుడు బైక్‌పై మధ్యలో కూర్చుండి మన్మధుడి బాణాలతో నా మనసును గుచ్చుతూ నా మనోఫలకంపై ముద్రవేస్తూ కదిలాడు. భూమి పరిభ్రమిస్తుందో లేదో తెలియటంలేదు. ఆకాశం రాత్రి పగలును ఆవిష్కరిస్తుందో లేదో తెలియటం లేదు. పదిహేను రోజులుగా సందిగ్ధత, తనతో ఎప్పుడు మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనేక సందేహాలు ఆశలు, కోరికలతో మనసు విరహంతో గిలిగింతలు పెడుతోంది!
అర్ధరాత్రి 12 గంటలు దాటింది. నాన్న సెల్‌ఫోన్ తెచ్చి నా చేతికిచ్చాడు. బయట టపాకాయల చప్పుడు హోరెత్తింది. ఆ శబ్దాలను చీల్చుకుంటూ ‘హలో.. హ్యాపీ న్యూ ఇయర్’ అని చిన్నగా అన్నాను.
‘సేమ్ టు యు’ అవతల నుండి అన్నాడు. ఈ క్షణం ఇలాగే ఆగిపోతే ఎంత బాగుండునో.. నేను తనతో మొదటిసారిగా మాట్లాడినందుకు ఉప్పొంగిపోయాను. ఆ జ్ఞాపకం మనో ఫలకంపై తీపి జ్ఞాపకమై ఆకాశంలో మిరుమిట్లు గొలుపుతూ కొత్త సంవత్సరానికి కొత్త జీవితానికి ఆహ్వానం పలికింది!

- వజ్జీరు ప్రదీప్
పరకాల, వరంగల్ జిల్లా
సెల్.నం.9989562991

అంతరంగం

భావ అభివ్యక్తిలోని సౌందర్యమే కవిత్వం!

- ఆచార్య రావికంటి వసునందన్ -

చిరునామా:
ఆచార్య రావికంటి వసునందన్
6-35/26, మల్లారెడ్డి ఎంక్లేవ్,
సాయికాలనీ, బీరంగూడ,
హైదరాబాద్ - 502032
సెల్.నం.9849852182

ఛందోబద్ధ కావ్యాలు రాయడంలో ఆయన దిట్ట... భావ అభివ్యక్తిలోని సౌందర్యమే కవిత్వమని ఆయన ప్రగాఢ నమ్మకం... బోధన, రచన తీపి, కారం వంటివనీ, దేని రుచి దానిదేనంటారు కవి శిరోమణి, బహుగ్రంథకర్త ఆచార్య రావికంటి వసునందన్. కరీంనగర్ జిల్లాకు చెందిన ఆయన ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లోని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పదవీ విరమణ చేశారు. పద్దెనిమిదవ ఏటనే రచనా వ్యాసంగంలోకి అడుగు పెట్టిన రావికంటి వసునందన్‌తో ‘మెరుపు’ ముఖాముఖి...

ఆ ఎన్నో ఏట మీ మొదటి రచన వచ్చింది?
నా 18వ ఏట ప్రబంధ గద్యశైలిలో వున్న నా మొదటి రచన రతీప్రద్యుమ్నము వచ్చింది.

ఆ మీ రచనకు ప్రేరణ ఏమిటి?
ప్రేరణ అనేది అంతఃస్సిద్ధంగా, సహజంగా వస్తుదని నా నమ్మకం. బయటి కవిత్వాల పఠనం ఆసక్తిని పెంపొందిస్తుంది. నైశిత్యాన్ని పెంచుతుంది. ఆ దృష్టితో నాకు ప్రేరణ కలిగించిన మొదటి గ్రంథం ఎందరిలాగానో నాకూ, పోతన భాగవతం. పోతన కవిత్వ రచనలోని మాధుర్యం బహుశా అలా అనిపింపజేసిందేమో అనిపిస్తుందిప్పుడు.

ఆ మీకు బోధన, రచనల్లో ఏది తృప్తినిచ్చింది?
తీపి, కారాల్లో ఏది ఇష్టమంటే ఎలా చెపుతా.. దేనికదే ఇష్టం. దేని తృప్తిదానిదే. చూపు రెండు కన్నుల్లో ఉన్నట్టే!

ఆ కవిత్వమంటే ఏమిటి?
నా దృష్టిలో కవిత్వమంటే భావాలను అభివ్యక్తీకరించే పద్ధతి. ఒక అంశాన్ని ఎంత అందంగా, నర్మగర్భంగా చెప్పగలుగుతున్నామనేదే కవిత్వం. ఆ అభివ్యక్తి ఎంత చక్కగా, అంత చిక్కదనంలోనూ చక్కగా (సుస్పష్టంగా), ఎంత సాంద్రతలో వెలువడితే అంత గొప్ప కవిత్వవౌతుంది. భావాభివ్యక్తిలోని సౌందర్యమే కవిత్వం.
ఆ పద్యకృతులు ఈ కాలంలో అంతగా రాకపోవడానికి కారణం?
అలా అని ఎవరన్నారు? ఎన్నో వస్తున్నాయి. ఉదాహరణకు నా పద్యరచనలే ఎన్నో ఉన్నాయి. కానీ, అన్ని సాహిత్య ప్రక్రియలు అవసరమే కదా! ఐతే సుమారు 1200 ఏండ్ల నుండీ తెలుగు సాహిత్యంలో అనేక రూప బేధాల్లో వస్తున్న ప్రక్రియ నాడూ, నేడూ పద్యమొక్కటేనని నా అభిప్రాయం.

ఆ మీకు ఇష్టమైన కవి ఎవరు?
పోతనతో సహా పూర్వ సంప్రదాయక కవులందరూ, నేటి సాహిత్యంలో కూడా సంప్రదాయపద్ధతిలో రాసే పద్య గేయ కవులందరూ ఇష్టమే. వచనానికి వస్తే డాక్టర్ సినారె, దాశరథి, కాళోజీ, తిలక్, కుందుర్తి వంటి దిగ్దంతులందరూ ఇష్టమే. నవ్య సంప్రదాయంలో అభినవపోతన, శ్రీమాన్ వానమామలై వరదాచార్యులు, విశ్వనాథ, అభ్యుదయ మానవతావాద కవిత్వాల్లో డాక్టర్ సి.నారాయణ రెడ్డి నాకు ఆదర్శప్రాయులైన గురువరేణ్యులు.

ఆ మీకు నచ్చిన గ్రంథాలు?
అన్నీ, అంటే గొప్ప కవిత్వ గ్రంథాలన్నీ నచ్చినా పక్షపాతం మాత్రం. పోతన భాగవతం, పోతన చరిత్రము, మహాప్రస్థానం, కర్పూర వసంతరాయలు, విశ్వంభర శివతాండవం.

ఆ సాహితీ పురస్కారాలపై మీ అభిప్రాయం?
మంచివే! ఐతే పొందినవారు వాటిని అదనపు బాధ్యతగా స్వీకరించి మరింత ఉత్సాహంతో రచనలు కొనసాగించాలి.

ఆ కొత్త కవులకు, రచయితలకు మీరిచ్చే సూచనలు?
చిత్తశుద్ధితో, ఏకాగ్రతగా ఇంతవరకూ తమ తమ అభీష్ట రంగాల్లో వచ్చిన రచనలను అధ్యయనం చెయ్యాలి. అది తమ తమ రచనా పద్ధతులకు ప్రోత్సాహాన్ని, నవ్యదృష్టినీ ప్రసాదిస్తుంది.

ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544

మనోగీతికలు

నది ఘోష

పుట్టిన చోటును పెరిగిన ప్రాంతాల్ని
తిరిగిన కొండలు కోనలు వనాల్ని వదిలి
కొన ఊపిరి ఉన్నంత వరకు
జనహితం అభిమతంగా ఎంచి
కొండరాళ్లు ముళ్లపొదలు కాయాన్ని గాయపరిచిన
ఎండిపోయిన ఎడారి భూముల మీదుగా
కరువును పారదోలేందుకు
పరవళ్లు తొక్కుతూ పరవశంగా వస్తున్నా
సకల ప్రాణికోటి దాహార్తిని తీర్చేందుకు
స్నేహ సౌహార్ద హృదయంతో
అలల చేతులెత్తి ఆశీర్వదిస్తూ
కలలు సాకారమొంది కలిమి కలుగ
తీయ తేనియ జల్లుల చిలుకరిస్తూ
మాయని మమతానురాగాల వెనె్నలనై ప్రవహిస్తున్నా..
చేసిన పాపాలన్నీ తొలగిపోతాయన్న మిషతో
కోపాలను ద్వేషాలను విడనాడకుండా
కొంత జపాలతో దొంగ వేశాలతో
కొంగున మలినాల్ని ముడివేసుకొని మునకలేస్తూ
కాలీ కాలని శవాల్ని తెప్పలుగా పడవేస్తూ
హోళీ పండుగ చిత్రవర్ణాల్ని కుప్పలుగా కడిగేస్తూ
నచ్చని నాయకుల్ని నయవంచనతో
మెచ్చిన వినాయకుల్ని మేళతాళాలతో
నిమజ్జనం గావిస్తూ నింపాదిగా ఉంటున్నారు
సనాతన సంప్రదాయాలతో
పిండప్రదానాలు ఒదిలేస్తున్నారు
ఇకనైనా.. నానావిధ చెత్త చెదారాలతో
నా చిత్తాన్ని చిర్రెక్కిస్తూ
నా నీరును కన్నీరుమయం చేయకండి
మతాలతో రాజకీయ కుతంత్రాలతో
సైతానులుగా అవతారమెత్తుతూ
నా గమనాన్ని నిరోధిస్తూ
నా పరిసరాల్ని అపరిశుభ్రం కానీయకండి

- రాకుమార
గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా, సెల్.నం.9550184758

నీ చుట్టే!
సంస్కృతంలో రాసిన గ్రంథం వోలె
గంధాన్ని చెక్కిన సన్నుతాంగిగా
సనాతన సంస్కృతికి నిలువెత్తు
నిజ ప్రతిబింబంలా
మేఘాల రాపిడితో ప్రజ్వరిల్లిన
మెరుపు తీగలా
పవనుడి పరువాల మేనాపై
పరుగులు పెడుతున్న పసిడి లహరిలా
పచ్చని చిగురులను చిదిమిన సింగారంలా
వెనె్నల పండించిన వెండి వెలుగులనే వెక్కిరించే
తేట తెల్లని చలువ కాంతిలా
సుడిగాలిలా చుట్టేస్తున్న సుపరిమళంలా
సకల సుగుణాలు కలబోసిన కలశంలా
అందం ఆవరించి ముసుగేసుకున్న
అప్సరస అవతారంలా
చూపరుల మనసు పొరలను తొలిచి వేస్తుంటే
ఏకం కావా..
దృష్టి మరల్చుకోలేని ధ్రువాలన్నీ!
తిరుగదా..
ప్రపంచమంతా నీ చుట్టే!
ఊగదా..
నీ ఊగే జడల ఉయ్యాల!
- ఆచార్య కడారు వీరారెడ్డి
హైదరాబాద్
సెల్.నం.7893366363

రేపటి ఉదయానికి..
కొన్ని కలలూ.. కొన్ని కన్నీళ్లూ..
కొన్ని వైఫల్య సాఫల్యాల సమన్వయంలో
అన్య స్వరాలేవో అపశృతుల గీతాలై పల్లవిస్తుంటే
చుట్టూ నిశి రాల్చిన చిక్కని నుసి!
అజ్ఞానం..అంధకారం.. ప్రాదుర్భవించిన జడత్వ సంకేతాలై..
సంకెళ్లలాంటి జీవితంలో.. దిక్కూ దారి తెలియక
కొన్ని ఏకాంత సమూహాల్లోకి..
దిగులు తెరలాంటి ఒంటరి ప్రయాణం!
కంటక ప్రాయమైన జీవితంలో కఠిన నిజాలు!
కలలై కరిగిన మధుర స్మృతులు!
దారులన్నీ మూసుకొని స్తబ్దత కల్గించే
శూన్యమై నిన్నావహిస్తుంటే,
విధి ఆడే వింత నాటకంలో పాత్రలు, పరకాయ ప్రవేశాలు..
ఎడారి ముందు నుల్చుని వసంతాన్ని కోరినట్టు..
మళ్లీ మళ్లీ ఓడి సత్తువ చచ్చి
ఉత్సాహం నిర్వేదంగా మారి నిన్ను
నిలువునా కూలుస్తుంటే..
ఐనా.. మున్ముందుకేనంటూ పోరాడాలి
నీకు నీవే ఆయుధమై తళుక్కున మెరవాలి!
జడత్వపు ముసుగులను, అణగారిన అచేనత్వాలన్నీ
విసిరి మూలన కొట్టేస్తూ..
నీకు నీవే ఒక సాధన మార్గం!
నీకు నీవే ఒక శోధన గమ్యం!
నీకు నీవే ఉవ్వెత్తున ఎగసే జ్వాలా ప్రవాహానివై..
అంతర్గత ఉద్యమ చైతన్యశీలివై..
కన్నులు తెరువబోయే రేపటి ఉదయానికి..
చిగురించే కలల సామ్రాజ్యంలో
ఆశల విత్తనాలను నాటి..
భవిష్యత్ సాకార స్వప్న ఫలితాలకై
నిరీక్షిస్తూ.. చీకటి నుండి వెలుగుదారికి
పునరుజ్జీవనం చెందుతూ..!

- బి.కళాగోపాల్
నిజామాబాద్, సెల్.నం.9441631029

బాల్యం

సందె దీపం వెలిగించి
పెద్ద చాప వాల్చి
ప్రక్కనే ముక్కాళ్ల పీట మీద
దీపం పెట్టి
మా అమ్మ వెండి పూత పళ్లెంలో
అన్నం పెట్టి..
నెయ్యి వేసి ముద్దపప్పు వేసి
చారు పోసి..
అన్నం కలిపి ముద్దలు చేసి..
మొదటి ముద్ద నీకంటూ చాపిన చేతిలో
తాత ముద్ద అని పెడితే
ఆ అమృతాన్ని కడుపార భుజించిన
నా బాల్యాన్ని మరోమారు
కనులారా దర్శించనీ!
బాల్యమొక మధుర జ్ఞాపకం!
జీవితం ఒక అమూల్య వరం!
కలలాటి మెలకువలో
మేలుకొన్న ఓ కల నా బాల్యం!

- ముడుపు రత్నాదేవి
సిరిసిల్ల జిల్లా, సెల్.నం.9052973066

పుస్తక సమీక్ష

తెలంగాణ మట్టికి సొంతం

పల్లెల నుంచి పట్నాల దాకా
పెత్రామాస రోజున వాకిట్లను
పెండతోని అలికి అందంగా ముగ్గులేసి
ఎంగిలిపూల బతుకమ్మగా మొదలుపెట్టి
తొమ్మిది రోజులు దైవంగా కొలిచి
దుర్గాష్టమి రోజున
వెదురు సిబ్బితో ఆనిగెపు ఆకులుంచి
తంగేడు, గునుగు, కట్లపూలు
పట్టుకుచ్చుల మధ్య పసుపుతో గౌరమ్మను
బతుకమ్మలో అమర్చి తీరొక్కపూలతో
పూల దేవతను పేర్చి
లక్ష్మీపార్వతుల ఐక్యరూపంగా
సద్దుల బతుకమ్మను పూజిస్తూ
సత్తుపిండిని మూటకట్టుకొని
ఆడపడుచులంతా చుట్టూ
చప్పట్లు కొడుతూ తిరుగుతూ
చందమామ పాటల ఉయ్యాల పాటలు
జానపదశైలిలో మధురంగా పాడి
ఆటపూర్తి అయినంక వాయనాలిచ్చుకొని
దగ్గరిలోని చెరువును చేరి
పోయిరా బతుకమ్మ పోయి రావమ్మా
అంటూ నీటిలో వదిలి
ఆత్మీయ అనుబంధాలతో
అనురాగాన్ని పంచుకునే
ఎక్కడా లేని సంప్రదాయం
మన తెలంగాణ మట్టికే సొంతం

- నూజెట్టి రవీంద్రనాథ్
జగిత్యాల జిల్లా
సెల్.నం.9948748982

వెలుగు నీడలు

పేజీలు: 80 వెల: 75/-
ప్రతులకు:
డాక్టర్ డి.రోహిణి
సెల్.నం.9849893395

మానవుని మహోన్నత స్థాయికి తీసుకెళ్లి అందమైన మనసుగల వ్యక్తిగా తీర్చిదిద్దే అమోఘ శక్తి ‘ప్రేమ’ అని ప్రకటించిన శ్రీమతి శ్రీకూర్మం గీతారఘురాం ‘వెలుగునీడలు’ పేరుతో ఓ కవితా సంపుటిని వెలువరించారు. కంటి పాప కబుర్లు వినక రెప్పవేయని కన్నుల వెనుక ఎదురు చూపులో సహనం దాగిన వ్యధిక హృదయం ఏ జన్మదో ఈ ‘బంధం’ అంటున్న గీతా రఘురాం - బ్రతుకు సుతిమెత్తని పాన్పుకాదంటూ తేల్చి చెప్పారు. మనిషికున్న ఒకే ఒక అదృష్టం గొప్ప ‘మనసు’ అంటూ.. మూగగా నా భావాలను మనసులో పొందుపరిచి కాగితంపై పెట్టేందుకు ప్రయత్నిస్తానని చెప్పడం బాగుంది. జీవితం ఒక ప్రేమ గానంగా భావించే కవయిత్రి గీతా రఘురాం కనుల నిండా నిండిన కలల్ని వెనక్కి వెళ్లి మళ్లీ కలవాలి జీవితాన్ని కలల్ని మళ్లీ పరిచయం చేయాలని కాంక్షించడం బాగుంది. సంధ్య ముసిరినా.. వెలుగు పొడిచినా.. నీ జ్ఞాపకమే నా మదిలో అంటూ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఎగిరిపడే కడలి కెరటంలా చెంగున దూకే లేడిలా.. ముద్దు మాటల రాచిలుకలా.. అదుపులేని గాలిలా.. నాలోని సంతోషం అడ్డులేకుండా ఉరుకుతోందనీ.. గూడు లేని గువ్వలా ఎక్కడెక్కడో ఎగురుతోందని ‘ఆనందం’ కవితను కవితాత్మకంగా మలిచారు. కళ్లుండీ మాత్రం ఎదుటి వ్యక్తికి సాయపడలేనప్పుడు.. సాధించేదేముంది? అని ప్రశ్నించారు. ‘నీ రాక’ కవితను రమణీయంగా తీర్చిదిద్దారు. ఇలా ఈ గ్రంథంలోని కవితలు సాదా సీదాగా రూపుదిద్దుకున్నప్పటికీ.. కవయిత్రి యొక్క అంతరంగంలో గూడుకట్టుకున్న భావాలను మనతో పంచుకోవడాన్ని అభినందించి తీరుతాం.

- సాన్వి, సెల్.నం.9440525544

హరిత హారం
వర్షపు చినుకు తాకిడికి
నేల తల్లి పొరలనుండి మొలకెత్తి..
ఉదయించే కొత్త లోకాన్ని చూస్తాయి..
కాలుష్యం కమ్మేసినా.. మానవాళికి ఆయుష్షునువోస్తాయి..
పంట చెరుకై తీపిని.. వంటచెరుకై ఆహారాన్ని..
ఆయుర్వేదమై ఆరోగ్యాన్ని.. సుగంధ ద్రవ్యమై పరిమళాన్ని..
మనకోసం ధారపోస్తాయి.. అక్షరాలు విచ్చుకొన్న కాగితాలై
రక్షణ కవచంలా హత్తుకొనే వస్త్రంలా..
కన్ను తెరిచి కన్నుమూసే వరకు..
వృక్షాలతో మనది జన్మజన్మల అనుబంధం..
బ్రతుకునిచ్చే పచ్చని చెట్టు బ్రతకనిద్దాం..
కోట్లాది మందికి హరితహారంతో జీవం పోద్దాం!

- గుండు రమణయ్య, పెద్దాపూర్, జూలపల్లి
పెద్దపల్లి జిల్లా, సెల్.నం.9440642809

సాహిత్య సమాచారం

‘కుదురు’ కథాసంకలనం
ఆవిష్కరణ 8న
కరీంనగర్ సాహితీ గౌతమి ఆధ్వర్యంలో ప్రచురింపబడిన ‘కుదురు’ కథా సంకలనాన్ని తెలంగాణ తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకరరావు నవంబర్ 8న ఉదయం 10 గంటలకు జగిత్యాలలోని ఎస్.కె.ఎల్.ఎన్.ఆర్. బిఇడి కళాశాలలో ఆవిష్కరిస్తున్నట్లు తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాస్యం సేనాధిపతి ఒక ప్రకటనలో తెలిపారు. కె.ఎస్.అనంతాచార్య అధ్యక్షతన జరిగే ఆవిష్కరణ సభకు ఎం.వి.నరసింహారెడ్డి, డా. గండ్ర లక్ష్మణరావు, వారాల ఆనంద్, మాడిశెట్టి గోపాల్ అతిథులుగా హాజరవుతారని తెలిపారు. డా. బి.వి.ఎన్.స్వామి గ్రంథ పరిచయం చేస్తారు. సాహితీ ప్రియులంతా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net
email : merupuknr@andhrabhoomi.net
నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

- వజ్జీరు ప్రదీప్