విజయవాడ

తెలివికి పరీక్ష .. (కథ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాపురం గ్రామంలో గోపయ్య మంచి తెలివితేటలున్న మోతుబరి రైతు. తన పొలంలో పండించే పంటనంతా సొంత గోదాముల్లో నిల్వచేసి తను అనుకున్న ధర వచ్చినప్పుడు అమ్మి సొమ్ము చేసుకునేవాడు. ఆవులను పెంచి పోషించటం గోపయ్య కుటుంబానికి తరతరాలుగా వస్తున్న ఆచారం. ఇంటి ఆవరణలోనే పశువుల పాకలో వాటిని పెంచి పోషించేవాడు. వాటి పోషణకు తన పొలంలో వచ్చే ఎండుగడ్డి మొత్తం పాక పక్కన గడ్డివాములు వేయించేవాడు. ఆవుపాలు అమ్ముతూ మిగిలిన పాలతో పెరుగు, వెన్న, నెయ్యి వంటివి కూడా అమ్మేవాడు. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా హోమాలు, యజ్ఞాలు వంటివి చేస్తుంటే అవసరమైన వారు వాటికోసం గోపయ్య యింటికి వచ్చేవారు.
పశువులకు మేత వెయ్యటం, పాలు పితకటం, పాక శుభ్రం చేయటం, పొలం పనులు, ఇంటి పనులు చూసుకోవటానికి రామయ్య, సోమయ్య అనే ఇద్దరు నమ్మకమైన పనివాళ్లు వుండేవారు. కొంతకాలానికి అనారోగ్యంతో అనుకోకుండా రామయ్య చనిపోయాడు. సోమయ్య, గోపయ్య అందుకు చాలా బాధపడ్డారు. ఈ విషయం తెలిసి గోపయ్య దగ్గర పనికోసం పరిసర గ్రామాల నుంచి చాలామంది వస్తున్నారు. అందులో ఎవరు నమ్మకంగా, తెలివిగా పనిచేస్తారో తెలుసుకోవటం కష్టమై వచ్చేవాళ్ల వివరాలు కనుక్కొని తర్వాత కబురు పెడతానని చెప్పి పంపటమేగాని సరైన వ్యక్తి ఎవరనేది తెలుసుకోవటం కష్టమైంది. తనకు రామయ్య లాంటి మంచి పనివాడు దొరికితే తన దగ్గరున్న ఒక మంచి కోడెదూడను అమ్మి ఆ వచ్చిన డబ్బును తనకు గతంలో పరిచయం వున్న ఒక స్వామీజీకి ఇద్దామని అనుకున్నాడు. ఈ సంగతి ఎవరికీ చెప్పకుండా దాచాడు.
ఒకరోజు గోపయ్యే స్వయంగా సంతకు వెళ్లాల్సి వచ్చింది. వెళుతూ కోడెదూడ ధర ఎంత పలుకుతుందో చూద్దామని దాన్నికూడా తోలుకెళ్లి బేరం పెడితే 10వేల రూపాయల దాకా కొనటానికి ముందుకొచ్చారు. తాను డబ్బు ఇద్దామనుకుంటున్న స్వామీజీ మోసగాడని, అతను మంచివాడు కాదని అక్కడకు వచ్చినవాళ్లు చెప్పుకోవటం విన్నాడు. వెంటనే గోపయ్యకు ఒక ఆలోచన వచ్చి మిగతా పనులు చూసుకుని కోడెదూడతో ఇంటికి తిరిగి వచ్చేశాడు.
పనికోసం తనని కలిసిన వాళ్లలో పక్కవూరిలో ఉన్న రంగడు అనే వ్యక్తి పర్వాలేదనిపించి అతన్ని రమ్మని కబురు పంపాడు. మరుసటి రోజు రంగడు రానేవచ్చాడు. తను అనుకున్నది, సంతలో జరిగింది అంతా వివరంగా రంగడికి చెప్పాడు. ‘నేను అనుకున్న మాట తప్పకుండా, ఆ స్వామీజీకి డబ్బు ఇవ్వకుండా నీ తెలివితో ఈ సమస్యను పరిష్కరిస్తే పనిలో పెట్టుకుంటాను’ అని చెప్పాడు. అలాగేనని చెప్పి కోడెదూడతో పాటు అక్కడే వున్న కోడిపుంజునొకదానిని కూడా తీసుకుని ఆరోజు జరిగే సంతకు గోపయ్యతో కలిసి వెళ్లాడు. రంగడు కోడిపుంజును ఎందుకు తెచ్చాడో?, సంతలో ఏంచేస్తాడో అర్థంకాక అలాగే చూస్తుండిపోయాడు గోపయ్య.
అప్పుడు రంగడు తెలివిగా కోడెదూడను కొనటానికి వచ్చిన వాళ్లతో.. ‘కోడిపుంజు 10 వేలు, కోడెదూడ 10 రూపాయలు, కావలసిన వాళ్లు కొనుక్కోవచ్చు’ అని చాటింపు వేశాడు. అవి కావలసిన వ్యక్తి ఎలాగైతేనేం అని వెంటనే డబ్బు చెల్లించి కోడిని, కోడెదూడను తీసుకెళ్లాడు. అప్పుడు గోపయ్యతో రంగడు ‘అయ్యా! కోడిని అమ్మిన డబ్బు పదివేలు మీరు తీసుకొని, మీరు అనుకున్న ప్రకారం కోడెదూడను అమ్మితే వచ్చిన 10 రూపాయలు స్వామీజీ దగ్గరకు వెళ్లినప్పుడు హుండీలో వేయండి, సరిపోతుంది’ అన్నాడు. గోపయ్య మనసు తేలికపడింది. తన మాట, సొమ్ము పోకుండా తెలివిగా వ్యవహరించిన రంగడిని ఆరోజు నుండి పర్మినెంట్‌గా పనిలో పెట్టుకున్నాడు.
- కాకరపర్తి సుబ్రహ్మణ్యం
తెనాలి, గుంటూరు జిల్లా.
చరవాణి : 98482 97711

చిన్ని కథ

నువ్వు నా కొడుకువేగా...
‘మీ నాన్న వాళ్లూ మా వీధిలో అద్దెకున్నారు’ అని ప్రకాశం చెబితే నమ్మలేదు. ‘నీకు తెలీదా? మీ నాన్నగారు ఇల్లు అమ్మేసి రెండేళ్లయింది. కేన్సర్ వచ్చి చాలా డబ్బు ఖర్చయింది. పోనీలే.. మనిషి కోలుకుని హాయిగా నవ్వుతూ తిరుగుతున్నారు. అయినా కన్నకొడుకువి నీకు ఈ విషయాలు తెలియకపోవడం ఏమిటి?’ వాడి ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయాను. తాత ఆస్తికి వారసుడిని నాకు చెప్పకుండా..’
‘చెపితే ఏం చేసేవాడివిరా? 68 తరువాత ఇంకెన్నాళ్లు బతుకుతావు? తెలుగు రాష్ట్రం విడిపోయి ఇళ్ల రేట్లు కొండంతగా పెరిగిపోయాయి. నేను ఇల్లు కొనుక్కోగలనా? నువ్వుపోతే బంధువుల రాక... కర్మకాండలకి లక్షలు తేవాలి. బతికితే నిన్ను చూడాలని మన బంధువులందరూ క్యూ కడతారు. వాళ్లకి వండి వార్చలేక నా భార్య చచ్చే చాకిరీతో సతమతమవుతుంది అంటావు. ఆపరేషన్ జరగనివ్వవు. కుంగి కృశించి చావమంటావు. నువ్వు నా కొడుకువేగా..! నేను మా నాన్నని ఇలాగే నాన్న రెండు కిడ్నీలు చెడిపోతే అక్క ఒక కిడ్నీ ఇస్తానంటే ఆపరేషన్ ఖర్చులకి ఇల్లు అమ్మాల్సిందే. ఎనభై తరువాత నువ్వు బతికి ఎవరిని ఉద్ధరించాలి? అని కఠినంగా మాట్లాడాను. నా మాటలకి బాధపడి తెల్లారేసరికి చనిపోయారు. నేను కూడా మా నాన్నలా అందుకే డబ్బడుగుతానని నువ్వు నీ అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ మార్చుకున్నావు. అది నాకు మరీ కలిసివచ్చింది. లేకపోతే నువు ఇల్లు అమ్మకుండా అడ్డుపడేవాడివి. నా చెల్లెళ్లు ఇద్దరి సాయంతో ఇల్లమ్మి కేన్సర్ నయం చేయించుకున్నాను. కొంత డబ్బు మీ అక్కకిచ్చి నా తరువాత మీ అమ్మని జాగ్రత్తగా చూసుకోమన్నాను. మిగిలిన డబ్బు బ్యాంకులో వేసి దానిమీద వచ్చే వడ్డీతో హాయిగా ఉన్నాం. నామినీగా నీ కొడుకుని పెట్టేను. తండ్రి మాటలకు స్థాణువయ్యాడు ప్రభాకరం.
- చావలి సూర్యం, కార్పొరేషన్ ఆఫీసు, విజయవాడ.

వెంటాడే పద్యం

పలుకుబడుల ‘్ధనకుధర రామాయణం’

‘సీతారామ పదారవింద భజనాశేష ప్రభాభాసివై
ఖ్యాతింగాంచుమరణ్య దేశము నయోధ్యంగా, మహీజాతయున్
మాతృశ్రీగ, రఘూద్వహుం దశరథంగానెంచుమయ్యా! త్రిలో
కాతీతస్థిత భోగివౌదరిగి రమ్మా! సర్వ కల్యాణవౌ’
ఇది సుమిత్ర - అరణ్యాలకు వెళ్తున్న లక్ష్మణునితో పలికిన మాట. సీతారాముల పాదపద్మాలను సేవిస్తూ ఖ్యాతిని పొందుము. అరణ్యాన్ని అయోధ్యగా, సీతను తల్లిగా, రాముణ్ణి తండ్రి దశరథునిగా భావించి క్షేమంగా తిరిగిరా. నీకు శుభం- అని భావం. ఈసందర్భంలో వాల్మీకి రామాయణంలో ఉన్న ‘రామం దశరథం విద్ధి! మాంవిద్ధి జనకాత్మజామ్! అయోధ్యా మటవీం విద్ధి! గచ్ఛ! తాత! యథా సుఖవౌ’ అనే శ్లోకం సుప్రసిద్ధం. ఈ శ్లోకానికి పైపద్యం యథాతథానువాదం కాదు. ఆ శ్లోక భావానే్న అనుకరిస్తూ సర్వలోకాలలోనూ అతీతమైన స్థిరమైన వైభవాలను పొందే భోగివవుతావు అని లక్ష్మణుణ్ణి సుమిత్ర దీవిస్తున్నట్లుగా చెబుతూ ‘్భగి’ శబ్దాన్ని కవి ప్రయోగింపజేయడంలోని స్వతంత్రాంధ్రీకరణ రూపమైన ప్రతిభ కనిపిస్తోంది. భోగి అంటే భోగాలు గలవాడు. పడగగల సర్పము అని అర్థాలున్నాయి. లక్ష్మణుడు భోగియైన శేషుడే గదా! ఈ అవతార స్ఫూర్తిని సుమిత్ర నోట మూర్తి కట్టించారు- కవి. ఆమె కూడా సుతుని గొప్పతనాన్ని గుర్తించి పలికిందన్నమాట. ఇలా ‘్భగి’ అన్న పలుకు ఇక్కడ పలుకుబడిని పొందింది. అలా సమకూర్చిన కవి శ్రీ ధనకుధరం వెంకటాచార్యులుగారు. కావ్యం ‘్ధనకుధర రామాయణం’. వీరు గుంటూరు ఏసి కళాశాలలో ఆంధ్రోపన్యాసకునిగా ఉద్యోగించిన కవిత్వ మర్మజ్ఞులు. సంప్రదాయ పండితులు.
‘చిటికవైచి, మోము చిట్లించి, కనుబొమ లెగురవైచి, యంగలేసికొనుచు పోయిపోయి నిలిచిపోయె హఠాత్తుగా! కైకయెదుట బొమ్మ కట్టినట్లు!!’
రాముని పట్ట్భాషేకం భగ్నం అయ్యేలా దుర్బోధ చేయడానికి కైక దగ్గరికి వెళ్తున్న మంధర చేష్టలను ఈ కవి - దర్శకుడై నటికి సూచిస్తున్నట్లుగా పైపద్యంలో తెలుపుతున్నాడు. ఇదొక నాటకీయత. మంధర చేత ముందుగా చిటిక వేయించారు. దుష్ట స్ర్తిల చేష్టలిలాగే ఉంటాయి. ఈ వర్ణన ద్వారా కవి లోకజ్ఞత వ్యక్తం. ‘చిటిక వైచి’ అనడం ద్వారా ఒక్క చిటికలో రామ పట్ట్భాషేకాన్ని మంధర ఆపు చేయించబోతోందన్న భవిష్యత్ కథ ధ్వనిస్తోంది. ‘చిటికవైచి’ అన్న తెలుగు పలుకునకు ఇలా అక్షరమైన పలుకుబడి కలిగింది. ఇదీ కవి ప్రతిభ.
స్ర్తి సహజమైన అసూయా రూపాన్ని ఈ సందర్భంలోనే కైక మాటల్లో ఈ కవి ఎలా వ్యక్తం చేశారో చూడండి.
‘మీసటలింక చెల్లవిట; మ్రింగిన చేదిది చాలు; మున్నుదే
వాసుర యుద్ధమందు తమకై తమరిడ్డ వరాల జంటకున్
నా సుతు రాజుసేయుడు; వనమ్ములలో పదనాలుగేడులా
కోసల రాజపుత్రి కొడుకున్ జటివృత్తి చరింపబంపుడీ!’
సటలంటే కపట వర్తనలని అర్థం. రాముణ్ణి ఎంతోప్రేమతో పెంచింది గదా కైక. అటువంటి ఆమె ఆ కోసల రాజపుత్రి కొడుకును అడవులకు పంపండి అన్నది. రాముని పేరు పలుకలేదు. అసూయ కలిగినప్పుడు ప్రేమాస్పద వస్తువును కూడా తృణీకరిస్తారు స్ర్తిలు సహజంగా. ఆ సహజత్వాన్ని ఈ కవి ఇక్కడ చూపారు. తద్వారా ‘కోసలరాజు పుత్రి కొడుకు’ అన్న పలుకులకు పలుకుబడి ఏర్పడింది. పలుకుబడులు అంటే కేవలం తెలుగు జాతీయాలూ, సామెతలే కానక్కరలేదు. అవికూడా ఈ కావ్యంలో సందర్భోచితాలుగా ఉన్నాయి. మామూలు పదాలను గూడా సందర్భోచిత సుందరంగా ప్రయోగించి వాటికి పలుకుబడిని సమకూరుస్తాడు - నిజమైన కవి.
సీతనపహరించాలనే భావనను రావణునికి బలంగా సమకూర్చే సందర్భంలో అకంపనుడనే రాక్షసుడు ‘మరచితి నొక్కమాట’ అనే పద్యంలో ‘ఆ మెఱపున కంద్రియాదులకు మేలగు రూపము గల్గెనేని ఆ మెఱపు పడంతి సీతయె సుమీ! సతి- మేఘ వినీల పంక్తికిన్’ అన్న పద్యంలో సీతను ‘మెఱపు కాంత’ అని అంటాడు. ఆ భావన బలపడిన రావణుడు సన్యాసి రూపంలో భిక్షకై వచ్చి సీతను ‘జంకుంగొంకును మానియో మెఱపు చానాలంక వెల్గింపుమా!’ అని మెరుపుకాంతగానే సంభోధిస్తాడు. ఇలా కథలో ఏకోవాక్యతకై ఈ కవి తగిన జాగరూకత వహించడం ఓ ప్రతిభా విశేషమే!
భవిష్యత్క్థా సూచకంగా సూర్యోదయాన్ని వర్ణించిన తీరు చూడండి.
‘ఒక దురిత స్వభావమెదియో నిశిచారిణి, పెన్‌దుషారమై
ప్రకృతిని రూపుమాపుటకు రా-గమనించి సహస్రభాను నా
మకము సుదర్శనమ్మున విమర్శన చేసెడు పురుషుండు పో
లికహరి తూర్పుదిక్కున వెలింగె నవారుణ కాంతిసంపదన్!
ఇక్కడ మంచు కమ్మిన ప్రకృతి - కామదృష్టి గలిగిన శూర్పణఖకు ప్రతీక. హరియే రాముడు గదా! ఆయనే ఇక్కడ తూర్పుదిక్కున ఉదయించిన సూర్యుడు. సౌందర్యం గలిగి సుదర్శనుడైన రాముని ఆయుధం ‘సుదర్శనం’ ఇక్కడి పదం ద్వారా కవి సూచిస్తున్నారు. రాముడు సూర్యవంశీయుడే గదా! కనుక శూర్పణఖ వధను సూచించబోయే ఈ సూర్యోదయ వర్ణనం సాభిప్రాయం, సందర్భోచిత సుందరం. ఇక్కడ హరి, సుదర్శనం అన్న పలుకులు భవిష్యత్ కథాసూచకములై పలుకుబడిని పొందాయి. మొత్తమీద సర్వజనామోదమై, జాతికి అభ్యుదయాన్ని కల్గించే పలుకుబడి కలిగిన కావ్యం - శ్రీ ధనకుధర రామాయణం.

డా.రామడుగు వేంకటేశ్వరశర్మ,
గుంటూరు.
చరవాణి : 98669 44287

మనోగీతికలు

ఓ మనిషీ.. నీకో హెచ్చరిక!

అవనిమాతకు సహనం సడలింది
ధరణీతలం క్షణాల పాటు
ఆగ్రహంతో ఊగిపోయింది
ఆ కోపాగ్నికి చెట్లూపుట్టలే కాదు
జంతువులు, మనుషులూ
చిగురుటాకుల్లా వణికిపోయారు
అమ్మ ఆగ్రహజ్వాలల్లో చిక్కుకొని
మృత్యుదేవత ముంగిట
శవాల గుట్టలుగా పేరుకుపోయారు!
అమ్మకు కోపం వచ్చింది
క్షమాగుణం నశించేంతగా
బిడ్డల తీరు బాధించింది!
నేలనిచ్చింది అమ్మ
దాహార్తిని తీర్చుకోడానికి
నీటిధారలిచ్చింది అమ్మ
పచ్చని పంట పొలాల్లో
ధాన్యం సిరులు పండించి
బిడ్డలను అన్నదాతలుగా
తీర్చిదిద్దింది అమ్మ
అమ్మ ప్రేమను
అమ్మ లాలనను
మరిచారు బిడ్డలు స్వార్థంతో
అమ్మ కడుపులో గునపాలు దించారు
ఖనిజ సంపద కోసం
కొండలను తొలిచారు
కొండల్ని మించిన భవనాలు కట్టారు
అడవుల్ని నరికారు
అటవీ సంపదను దోచుకున్నారు
అన్నం పెట్టే అమృత భాండాలను
ధాన్యాగారాలైన జరీబు భూములను
మల్లెల సుగంధ పరిమళాలను
వెదజల్లే హరిత వనాలను
కాంక్రీటు భవనాలుగా మారుస్తూ
దోపిడీదారులుగా మారిపోయారు!
ధరిత్రి కంట కన్నీరొలికింది
హేయమైన, హీనమైన బిడ్డల తీరును
స్వార్థంతో అమ్మగుండెను చీల్చుతోన్న
బిడ్డల అమానవీయ దుశ్చర్యలను
మన్నించ శక్యంకాక
క్షమార్హం కాని బిడ్డల తప్పులకు
శిక్ష తప్పదంటూ..
ఓ సూచన! ఓ హెచ్చరిక!
ఓ మనిషి.. తస్మాత్ జాగ్రత్త!

- విడదల సాంబశివరావు,
చిలకలూరిపేట, గుంటూరు జిల్లా.
చరవాణి : 9866400059

చరిత్ర తవ్వుకుంటూ..
మానవ బంధాలన్నీ
మనీ సంబంధాలవుతున్నప్పుడు
మనిషి తన మూలాల్ని
వెతుక్కుంటున్నాడు
మతములన్నీ మాసిపోవునని
కులములన్నీ కూలిపోవునని
అభ్యుదయవాదులు కన్న కలలు
కళ్లముందే కల్లలై పోతుంటే
మనిషి తన మూలాల్ని
తడుముకుంటున్నాడు
వన భోజనాలు కులాల విందులై
ఇంటి పేర్లతో ఒంటి పేర్లతో
గుంపులు గుంపులుగా విడిపోతూ
మనిషి తన మూలాల్ని
పరిశోధిస్తున్నాడు
చరిత్ర చదువులు పనికిరావని
సాంకేతిక శాస్తమ్రే అసలు చదువని
బాకాలూదిన బడాబాబుల
వాదనలన్నీ వీగిపోవగా
మనిషి తన చరిత్రను తవ్వుకుంటూ..
మూలాల్ని తడిమి
చూసుకుంటున్నాడు!

- మండవ సుబ్బారావు,
కొత్తగూడెం, ఖమ్మం జిల్లా

ప్రేమా! ఏదీ.. నీ చిరునామా !

ఈ ప్రపంచంలో
ప్రేమలేని వారెవ్వరు
మనిషై పుట్టినవారికే కాదు
మాయామర్మాలు తెలవని
పశుపక్ష్యాదులకు సైతం
ప్రేమలున్నాయి.. ప్రేరణలున్నాయి

పాశ్చాత్య పోకడలతో
పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే
ప్రేమలన్నీ వెలవెలబోతున్నాయి
వెక్కిరింపులకు గురవుతున్నాయి

ముందుగా..
నిన్ను నీవు ప్రేమించుకొని
నిన్ను నీవు ఉన్నతీకరించుకొని
నిన్ను నీవు మనిషిగా పూర్ణించుకొని
నీలో నిలువెల్లా
ప్రేమంటూ ఏమైనా వుంటే
కొంచెం కొంచెంగానైనా
పది మందికి పంచు!
క్షణం క్షణం ద్వేషాల్ని రగిలించుకొని
మరణం వైపు పయనించటమెందుకు?
ప్రేమను పంచకపోయినా
ద్వేషాన్ని చిమ్మటమెందుకు..
కుత్సితాలను కుతంత్రాలను
మనసు పొరల్లో మరిగించి
కలుషితమైపోతున్న దేహంతో
ఆపద్ధర్మ ఆలింగనాలెందుకు?
సముద్రమై ప్రవహించే వాడికి
ఆటుపోటుల్లోనూ
ప్రేమ ఆణిముత్యమే!

ప్రేమకాని ప్రేమలకు
ప్రేమ పేరు పెట్టటమెందుకు?
ఉన్మాదపు చర్యలను
ఈ చెలిమికి చుట్టటమెందుకు?
ప్రేమ చిరునామాలను
చరిత్రలో చెరపడమెందుకు?
స్వార్థం లేని ప్రేమల్ని
నీ హృదయ సౌధంలో
పచ్చని మొక్కలై మొలవనీ..
వెనె్నలై స్రవిస్తున్న మమకార బిందువుల్ని
నీ అంతరంగ ఆకాశంలో
వెచ్చని చుక్కలై వెలగనీ..!

- కటుకోఝ్వల రమేష్,
ఖమ్మం, చరవాణి : 9949083327

email: merupuvj@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

- కాకరపర్తి సుబ్రహ్మణ్యం