విజయవాడ

అంతర్మథనం ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెల్లవారింది. టైము ఆరవ్వొస్తోంది. శేఖర్‌కి హఠాత్తుగా మెలకువ వచ్చింది. పక్కకి తిరిగి చూశాడు. భార్య సంధ్య లేదు. అప్పటికే లేచి పనులు చేసుకుంటున్నట్లుంది. గడియారం వైపు చూశాడు. తను లేవటానికి పెట్టుకున్న అలారం మోగడానికి ఇంకా గంట టైముంది. తల భారంగా అనిపించింది. అతి గాఢంగా ఏడు గంటల వరకు నిద్రపోయే తనకి ఈమధ్య అలారం మోగకముందే మెలకువ వస్తోంది. లేవగానే ఆఫీసులోని పనుల ఒత్తిడి గుర్తుకొస్తుంది. ఇంతలో నెలరోజుల్లో తను సబ్మిట్ చెయ్యాల్సిన రిపోర్ట్, అదింకా పూర్తి చేయడానికి నెలరోజుల పైన పట్టవచ్చన్న ఆందోళన తనని సుఖంగా నిద్రపోనివ్వడం లేదు.
కాసేపలాగే దొర్లుతూ పడుకున్నాడు. చివరికి విసుగనిపించి లేచాడు. బయటికి వచ్చి బాత్రూమ్ వైపు వెళుతుంటే సంధ్య చూసింది. బోలెడు ఆశ్చర్యంతో ‘ఏమిటి అప్పుడే లేచారు?’ అంది. సమాధానం చెప్పకుండా బాత్రూమ్‌లోకి దూరాడు శేఖర్.
శేఖర్, సంధ్యలది ప్రేమ వివాహం. పెళ్లయిన తర్వాత ఇరవై ఐదేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇద్దరమ్మాయిలు పుట్టారు. ఆదర్శ దాంపత్యం కాకపోయినా పెద్ద సమస్యలు లేకుండా సాఫీగా సాగిపోతున్న సంసారం. శేఖర్ ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. జీతం బాగానే వస్తుంది. సంధ్య స్కూల్లో టీచర్‌గా చేస్తోంది. పెద్దమ్మాయి నందిని ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో, చిన్నమ్మాయి కావ్య రెండో సంవత్సరంలోనూ ఉన్నారు.
ముఖం కడుక్కుని వచ్చి సంధ్య ఇచ్చిన టీ తాగుతూ న్యూస్‌పేపర్ చూడసాగాడు శేఖర్. ఇంతలో ఫోను మోగింది. ‘ఇంత పొద్దునే్న ఎవరు చేశారు’ అనుకుంటూ ఫోను తీసి ‘హలో’ అన్నాడు. అవతలి నుంచి సుధాకర్ అన్నయ్య గొంతు గుంటూరు నుంచి. అన్నయ్య గొంతులో ఆందోళనతో కూడిన విచారం. ‘శేఖర్.. నాన్నకసలు ఒంట్లో బాగోలేదురా! తిండి సరిగ్గా తినడం లేదు. కాళ్లు కూడా స్వాధీనం తప్పినయ్. మంచం మీద నుంచి లేవలేకపోతున్నాడు. నిన్ను గురించి ఒకటే అడుగుతున్నాడు. నువ్వు వెంటనే సెలవు పెట్టి ఇక్కడికి వచ్చేయ్’ అన్నాడు. మామూలుగా అయితే సుధాకర్ అన్నయ్య అలా తొందరపెట్టడు. నిజంగానే పరిస్థితి సీరియస్‌గా ఉండి ఉంటుంది అనుకున్నాడు శేఖర్. ఇంకా కొన్ని ప్రశ్నలు వేసి వివరాలు తెలుసుకున్నాడు. వెంటనే రావడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చాడు.
శేఖర్ తండ్రి రామచంద్రయ్యకి తొంభై ఏళ్లుంటాయి. పెద్ద కొడుకు సుధాకర్ దగ్గరే ఉంటున్నాడు. సుధాకర్ రిటైరై నాలుగేళ్లవుతోంది. భార్య సుమిత్ర పదేళ్ల క్రితం ఏక్సిడెంట్‌లో పోయింది. వాళ్లకి పిల్లల్లేరు. మంచి ఉద్యోగం చేసి రిటైర్ కావడం వల్ల ఆర్థికంగా సుధాకర్‌కి సమస్యలేమీ లేవు. మంచి ఇల్లుంది. తండ్రిని ఎంతో బాగా చూసుకుంటాడని చుట్టుపక్కల వాళ్లు సుధాకర్‌ని చాలా మెచ్చుకుంటుంటారు. శేఖర్ అప్పుడప్పుడూ సెలవు పెట్టి ఒక్కోసారి వంటరిగా, ఒక్కోసారి కుటుంబంతో సహా వెళ్లి తండ్రిని చూసొస్తుంటాడు.
రెండు నెలల నుంచి నాన్నకి బాగోడం లేదని అన్నయ్య చెప్తూనే ఉన్నాడు. హఠాత్తుగా ఈ పరిస్థితి వస్తుందని తను ఊహించలేదు. ఫోన్ పెట్టేసి దిగాలుగా కూర్చున్నాడు. సంధ్య వచ్చి పక్కన కూర్చుని అసలు విషయం తెలుసుకుంది. అన్నయ్యకి హామీ అయితే ఇచ్చాడు గానీ, ఆఫీసులోని పని ఒత్తిడి గుర్తుకొచ్చింది. తను గుంటూరు వెడితే ఈ పనులన్నీ ఎప్పుడయ్యేను? బాసుకు ఏవిధంగా నచ్చచెప్పాలి? కానీ అన్నయ్య మాటల్నిబట్టి నాన్న బాగా నీరసించినట్టే అనిపిస్తోంది. ఏమయినా వెళ్లి తీరాలి.. అని నిశ్చయించుకున్నాడు. సంధ్య కూడా వెంటనే బయలుదేరమని సలహా ఇచ్చింది.
ఆఫీసులో బాసుని ఎలాగో సమాధానపరచి రెండురోజుల తర్వాత గుంటూరు వెళ్లాడు శేఖర్. స్టేషన్ నుంచి అన్న ఇల్లు అట్టే దూరం లేకపోవడంతో అరగంటలో చేరుకున్నాడు ఆటోలో. బయటి గేటు తీసుకుని లోపలికి వెళ్లాడు. ఇంటి ముందున్న తోటలోని రకరకాల పూలమొక్కలు ఎప్పటిలానే తనని స్వాగతిస్తున్నట్లనిపించింది. తలుపు తీసుకుని లోపలికి వెళ్లాడు. హాల్లో కూర్చున్న సుధాకర్ వెంటనే లేచి దగ్గరికొచ్చి శేఖర్ చెయ్యి పట్టుకున్నాడు. ‘నీకోసమే ఎదురుచూస్తున్నానురా? నాన్న నీ గురించి పదేపదే అడుగుతున్నాడు. ఇప్పడాయన నిద్ర పోతున్నాడులే. ఈలోగా నువ్వు భోంచెయ్యి’ అన్నాడు. దుస్తులు మార్చుకుని, భోంచేశాడు శేఖర్.
ఇద్దరూ మాట్లాడుకుంటుంటే ‘సుధా’ అన్న నాన్న పిలుపు వినిపించింది. ఆయన గదిలోకి వెళ్లారు. శేఖర్‌ని చూసిన ఆయన ముఖం వికసించింది. ‘వచ్చావా బాబూ’.. అంటూ దగ్గరికి పిలిచాడు. ఆయనలో ఎంతో మార్పు వచ్చింది. మనిషి సగానికి సగం అయిపోయాడు. తిండి తినటం బాగా తగ్గించాడని అన్నయ్య చెప్పిన విషయం నిజమేననిపించింది. ఆయన పక్కన మంచంమీద చాలాసేపు కూర్చున్నాడు శేఖర్.
ఇంతలో డాక్టరు చంద్రశేఖర్ గారు వచ్చారు. ఆయన రామచంద్రయ్యకు వైద్యపరీక్షలు చేశారు. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టడం లేదంటే నిద్ర మందు మార్చి గది బయటికి వచ్చారు. శేఖరని డాక్టర్‌కి పరిచయం చేశాడు సుధాకర్. ‘డాక్టర్‌గారూ! ఏదైనా మంచి ఆస్పత్రిలో చేర్పిస్తే బాగవుతుందేమో’ అన్నాడు శేఖర్. ‘అబ్బే! అదేంలేదు. ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్. మీరు రావడం మంచిదయింది. ఆయన ఇంకా ఎక్కువ రోజులుండకపోవచ్చు. మహా అయితే ఇంకో పది రోజులు’ అన్నాడు డాక్టరు స్వరం బాగా తగ్గించి. శేఖర్ ముఖం చిన్నబోయింది. డాక్టరు అది గమనించి శేఖర్ భుజం తట్టి బయటికి నడిచాడు.
ఆయన వెళ్లింతర్వాత అన్నదమ్ములిద్దరూ చాలాసేపు వౌనంగా కూర్చున్నారు. డాక్టరు చెప్పినదాన్ని జీర్ణించుకోడానికి ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు. ‘అన్నయ్యా! ఈ పది రోజులయినా ఆయనకి సేవ చేసి ఆయన రుణం తీర్చుకుందాం’ అన్నాడు శేఖర్. దానికి సుధాకర్ ‘అలాగే! పగలంతా నాన్నని నేను చూసుకుంటాను. రాత్రిళ్లు నువ్వు కొంచెం చూసుకో. నువ్వు సహాయంగా ఉంటావనే నిన్ను తొందరగా రమ్మన్నానురా!’ అన్నాడు. ‘అలాగే’ అన్నాడు శేఖర్.
ఆరోజు నుంచి అన్నదమ్ములిద్దరూ తండ్రిని చూసుకునే రొటీన్‌లో పడిపోయారు. రామచంద్రయ్య ఆహారం బాగా తగ్గించినా తీపి పదార్థాలు కొంచెం కొంచెం తినేవాడు. ఆయన కోసం రసగుల్లాలు, గులాబ్ జామూన్లు, లడ్డూలు తెచ్చి తినిపించేవారు. పక్కగుడ్డలు, దుస్తులు ఎప్పటికప్పుడు మారుస్తుండేవారు. యూరిన్‌కి వెళ్లినా, టాయిలెట్‌కి వెళ్లినా విసుక్కోకుండా వెంటనే శుభ్రపరిచేవారు. రూము శుభ్రంగా ఉంచి, టేబుల్ మీద వాజుల్లో పూలు అమర్చేవారు.
అన్నింటికీ వాళ్లు సర్దుకున్నా రామచంద్రయ్య నిద్రలేమి వాళ్లకి, ముఖ్యంగా శేఖర్‌కి సమస్యగా తయారయింది. ఆయన పగలు సరిగ్గా పడుకునేవాడు కాదు మధ్యాహ్నం గంటసేపు తప్పించి. అలా అని రాత్రిళ్లు పడుకుంటాడా అంటే అదీలేదు. ప్రతి అరగంటకి లేచి శేఖర్‌ని పిలుస్తూ ఉండేవాడు. దానికితోడు పెద్దగా మూలుగుతూ ఉండేవాడు. పక్కన పడుకునే శేఖర్‌కి అసలు నిద్ర ఉండేది కాదు. నిద్రమాత్రలు ఆయన మీద పనిచేసేవి కావు. ఎప్పుడూ కాళ్లు పట్టమనేవాడు. పడుతుంటే కొంచెం నిద్రపట్టేది. హమ్మయ్య! నిద్రపోయాడని శేఖర్ పడుకోడానికి ప్రయత్నిస్తే మళ్లీ లేచి కాళ్లు పట్టమనేవాడు. వారం రోజులయ్యేసరికి శేఖర్ పని అయిపోయింది. రాత్రిళ్లు ఒక్కరోజు కూడా నిద్ర లేకపోతే ఉండలేని శేఖర్ వారంరోజుల జాగారం వల్ల తనే పేషెంట్‌లా అయిపోయాడు. పగలు అలవాటు లేక సరిగ్గా నిద్రపట్టేదికాదు.
‘మహా అయితే ఇంకో వారం రోజులు’.. అని సరిపెట్టుకుని కాలం గడుపుతున్నాడు శేఖర్. రామచంద్రయ్య పరిస్థితిలో ఏమీ మార్పు లేదు. మరో పదిరోజులు గడిచాయి. నిద్రలేమి వల్ల, బడలిక వల్ల శేఖర్‌లో చిరాకు మొదలైంది. కదిలిస్తే కోప్పడుతున్నాడు. తండ్రిని విసుక్కోవడం మొదలుపెట్టాడు. రాత్రి బాగా నిద్రపోతాడేమోనని రెండు మూడు నిద్రమాత్రలు ఎక్కువగా మింగించేవాడు. కానీ అవికూడా ఆయన మీద ప్రభావం చూపేవికావు. ఆఫీసు నుంచి ఫోన్లు రావడం మొదలయ్యాయి ఎప్పుడు వస్తున్నావని. ‘ఆఫీసులో రిపోర్టు సబ్మిట్ చేస్తే తనకి ప్రమోషన్ గ్యారంటీ! కానీ ఇప్పుడెలా? ఎన్నాళ్లీ బాధలుపడాలి? ఒకవేళ ఆయన రెండు మూడు నెలల్లో కూడా పోకపోతే?’.. అనే అనుమానం వచ్చింది. ‘్ఛ నేను మనిషేనా? కన్నతండ్రి ఎప్పుడు పోతాడని ఎదురుచూసే నాలో అసలు మానవత్వం ఉందా?’ అనుకుంటూ కాసేపు తనను తానే అసహ్యించుకున్నాడు.
శేఖర్‌ను ఈ సంఘర్షణ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు తండ్రి ఎప్పుడు పోతాడోనని ఎదురుచూడటం, మరోవైపు ఇలాంటి ఆలోచన వచ్చినందుకు తన మీద తనకే అసహ్యం. ఇంకో వారం తర్వాత హఠాత్తుగా ఒకరోజు రామచంద్రయ్య పరిస్థితి విషమించింది. అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. మూలగటం పోయి శ్వాస తీసేటప్పుడు గురకలా రావడం మొదలయింది. డాక్టరు వచ్చి చూశాడు. ‘ఇక లాభం లేదనీ, ఎప్పుడయినా పోవచ్చ’నీ చెప్పాడు. ఇక ఎవరినీ ఇబ్బందిపెట్టని స్థితికి చేరుతున్నాడు రామచంద్రయ్య. శేఖర్‌కిపుడు ఏమీ తోచలేదు. మధ్యమధ్యలో తనను పిలిచే గొంతు మూగబోయింది. ఇక ఎప్పటికీ తనని పిలవడని అనుకుని బాధపడ్డాడు. తన ప్రవర్తన తనకే ఆశ్చర్యం కలిగిస్తోంది. అదివరకు తండ్రి ప్రతి నిముషానికి పిలుస్తున్నాడని విసుక్కునేవాడు. ఇప్పుడు పిలవడం లేదని విచారిస్తున్నాడు!
సుధాకర్, శేఖర్ డ్రాయింగ్ రూమ్‌లో కూర్చున్నారు. ఈ రాత్రి గడుస్తుందా! అనుకున్నారు. శేఖర్ మధ్యమధ్యలో వెళ్లి బరువుగా వచ్చే ఆయన శ్వాసని, గురకని గమనిస్తున్నాడు. అన్న సోఫాలో కళ్లు మూసుకుని పడుకున్నాడు. ఒక గంట తర్వాత మళ్లీ తండ్రి దగ్గరికి వెళ్లాడు శేఖర్. ఆయన నోరు తెరిచి దాహం అన్నట్లుగా పెట్టాడు. వెంటనే చెంచాతో నీళ్లు పోశాడు. ఆయన గుటక మింగాడు. ఇంకొంచెం పోశాడు. మళ్లీ తాగాడాయన. అపస్మారక స్థితిలో ఆయన అలా తాగడం శేఖర్‌కి విచిత్రమనిపించింది. కాసేపు కూర్చుని తిరిగి డ్రాయంగ్ రూమ్‌లోకి వచ్చి ఇంకో సోఫాలో పడుకున్నాడు. వెంటనే నిద్రపట్టేసింది.
తిరిగి మెలకువ వచ్చేసరికి టైము నాలుగయింది. తండ్రి గదిలోకి వెళ్లాడు. అంతా నిశ్శబ్దం. బరువైన శ్వాస వినపడలేదు. గురక వినిపించలేదు. చెయ్యి పట్టుకుని చూశాడు. చల్లగా వుంది. వెంటనే సుధాకర్‌ని లేపాడు. సుధాకర్ ఇంటిపక్కనే ఉన్న కుర్ర డాక్టర్‌ని పిలిపించి నాడి చూడమన్నాడు. ప్రాణం పోయి రెండు గంటలయి వుండవచ్చని చెప్పాడాయన.
‘నాన్న నోట్లో నీళ్లు పోసిన తర్వాత ఆయన చెయ్యి పట్టుకుని ప్రాణం పోయేవరకు దగ్గర కూర్చుని ఉంటే ఎంత బావుండేది? తనవాళ్లెవరూ దగ్గర లేకుండా ఒక అనామకుడిలా చనిపోయాడాయన’! అనుకుంటూ క్షమించరాని తప్పుచేసిన వాడిలాగా ఫీలయ్యాడు శాఖర్. నాన్నకి ఆఖరి క్షణాలు అని తెలిసినా కూడా నిద్రకి మొహం వాచినట్లు తను నిద్రపోవడం క్షమించరాని నేరంగా అనిపించింది.
సుధాకర్ బంధువులకి ఫోన్లు చెయ్యడం మొదలెట్టాడు. శేఖర్‌ని ఇంకో గదిలో కాసేపు పడుకోమన్నాడు. శేఖర్ అసహనంగా పక్కమీద వాలాడు. మనసులో ఏదో నిర్లిప్తత. కళ్లు మూసుకున్నాడు. వెంటనే నిద్రపట్టింది. ఎన్నోరోజుల తర్వాత గాఢంగా నిద్రపోయాడు. 7 గంటలకు సుధాకర్ లేపితేగానీ నిద్ర లేవలేదు. శేఖర్ తన మనస్తత్వానికి కించపడ్డాడు. తండ్రి మరణం తనలో కలిగించిన ఈ నిశ్చలతకి తనని ఎలా అంచనా వేసుకోవాలో తెలియలేదు.
బంధువులంతా వచ్చారు. సంధ్య, పిల్లలు కూడా వచ్చారు. సాయంత్రానికల్లా రామచంద్రయ్య అంత్యక్రియలు జరిగిపోయాయి. సుధాకర్ చెయ్యవలసిన పెద్దదినం గురించి శేఖర్‌తో సంప్రదించాడు. శేఖర్‌కి ఆఫీసు గుర్తుకొచ్చింది. ఐదోరోజే పెట్టెయ్యమని పట్టుపట్టాడు. సుధాకర్‌కి ఒప్పుకోక తప్పలేదు. పెద్దదినం రోజు బంధువులంతా తనూ, సుధాకర్ తండ్రికి చేసిన సేవని మెచ్చుకుంటూ ‘ఇలాంటి కొడుకులని కన్న ఆయన చాలా అదృష్టవంతుడ’ని అన్నారు. వాళ్లలా పొగుడుతుంటే శేఖర్ చాలా గిల్టీగా ఫీలయ్యాడు.
దినం అయిన మరుసటి రోజే సంధ్య, పిల్లలతో కలిసి రైలెక్కాడు శేఖర్. రైల్లో కూర్చున్న దగ్గరి నుంచి ఆలోచనలు చుట్టుముట్టాయి. హైదరాబాదు వదిలిన దగ్గర నుంచి జరిగిన సంఘటనలను సింహావలోకనం చేసుకోసాగాడు. అతని గాంభీర్యాన్ని చూసిన ఎవరూ అతన్ని డిస్టర్బ్ చేయ్యలేరు.
చిన్నమ్మాయి కావ్య పేపరు మీద ఏదో గీస్తోంది. అది చిత్రకారిణి. చిన్నప్పటి నుంచి చిత్రాలు గీస్తూ, ప్రాక్టీసు చేస్తూ చెప్పుకోదగ్గ స్థాయికి చేరుకుంది. గీయడం పూర్తయిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి పక్కన కూర్చుంది. ‘నాన్నా! ఇది నీకు నా బహుమతి’ అంటూ చూపించింది. శేఖర్ అది అందుకున్నాడు. ఆ చిత్రంలో ఒక వృద్ధుడు పడుకుని ఉన్నాడు. ఒక నడివయస్కుడు ఆయన కాళ్లు పిసుకుతూ దగ్గర కూర్చున్నాడు. చిత్రం ఎంతో బాగా కుదిరింది. వృద్ధుని ముఖంలో సంతృప్తి, నడివయస్కుని ముఖంలో ప్రేమ, ఆప్యాయతలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. చిత్రం కింద ‘తాతయ్యకి ఎంతో సేవ చేసిన నాన్నకి! ప్రేమతో.. కావ్య’ అని రాసి వుంది. ‘నాన్నా! నువ్వు తాతయ్యని ఎంతో బాగా చూసుకున్నానని అందరూ అనుకుంటుంటే విన్నాను. నీకు తాతయ్య వయస్సు వచ్చినపుడు నేను కూడా నిన్ను బాగా చూసుకుంటాను’ అంది ఏదో నిశ్చయానికి వచ్చినట్లు. శేఖర్ మనస్సు తల్లడిల్లిపోయింది. ‘నేనీ ప్రశంసకి అర్హుడినేనా?’ అంటూ తనని తాను ప్రశ్నించుకున్నాడు.

- శాంతిశ్రీ బెనర్జీ,
కొత్త ఢిల్లీ.
చరవాణి: 91 9871989360

పుస్తక పరిచయం

ఆశావహ బతుకుల కోసం ‘పూవులు సమ్మె చేస్తాయి’!

‘అయ్యా దయచేసి క్షమించండి
కవిగా ఆత్మహత్య చేసుకోలేను’
ఆత్మహత్య అనేది మామూలుగా మనిషికి సంబంధించిన మానసిక వ్యాకులతకు పరాకాష్టే. కానీ మనిషి కవి అయి ఉన్నప్పుడు కనిపించిన దృశ్యాలనూ, కటిక దౌర్భాగ్యపు క్షణాలను కవిత్వంగా మలచి కళ్లకు కట్టినట్లు చూపించ గలిగినవాడై ఉన్నప్పుడు బహుశా పై రెండు వాక్యాలను రాసిందే వాడవుతాడు.
‘ఒక మరణించిన వాక్యంతో
నా పల్లె గుమ్మానికి పచ్చటి తోరణం కట్టే
మహాత్ముని రాక కోసం నిరీక్షిస్తున్నాను’.. అంటూనే కవిత్వ సంపుటి నిండా మరణించని, లేదా మరణమే తెలీని వాక్యాలను ఎన్నో రాసిన ఏటూరి నాగేందర్‌రావు అభినందనీయుడు. కవిగా ‘పూవులు సమ్మె చేస్తాయి’ పేరిట ప్రతి గుండె తలుపు తట్టి జాగ్తేరహో!.. అని హెచ్చరిస్తున్నాడు. ‘సంచారం చేయని రచయిత ప్రపంచాన్ని కుదపలేడు’ అని కవి సాగర్ అన్నట్లుగా అతడు నిత్య కవితా సంచార జీవి! నిశ్శబ్దంగా కవిత్వాన్ని శ్వాసిస్తూ, కవిత్వంలోని భావాలను మార్దవంగా శాసిస్తూ బతికేసే కవి.
‘కాలం నేరాయని కవిత్వంలో
నన్ను దహించేస్తుంది
ఎన్ని కష్టాలు
ఎన్ని దుఃఖాలు’ అంటూ కవిత్వం తనని దహించేస్తున్న వైనాన్ని అక్షరాల్లోకి పూర్తిగా ప్రతిష్ఠించాడు. తనే ఇలా చెప్పాడు.
తనకు ‘గులాబీలే కాదు
వాటి ముళ్లూ ఇష్టమే
వెలుతురే కాదు
చిమ్మచీకట్లన్నా ఇష్టమే
నిరాశల్ని భరించలేని వాడికి
ఆశల్ని శ్వాసించే అర్హత లేదు’ అంటూ తేల్చిచెప్పాడు. మనిషిగానే కాదు కవిగా ఇంకా ఎన్నో భరిస్తేనో, ఎనె్నన్ని అనుభవిస్తేనో ఆశల్ని శ్వాసించే అర్హత సాధించలేమని అతడికి బాగా తెలుసు.
బాధలనూ, విషాదాలనూ భరించడమూ, కవిత్వం చేయటమూ ఏటూరికి బాగా ఇష్టమనుకుంటా! అందుకే -
‘మరణం విషాదమైన చోట
కన్నీటి చుక్క కొండంత బరువు’ అన్నాడు. నిజమే బాగా తెలిసినదే ఐనా అదేంటోగానీ చివరిదాకా మోసి, అక్కడ పూడ్చో, కాల్చో వచ్చేసి మనం భద్రమే అనుకునే మనసుకూ.. విషాదాన్ని కొండంత భారంగా భావించి రోజుల తరబడి లోలోపలే కుమిలే మనసుకూ ఎంతటి తేడా! అది ఎందుకనో ‘మరణం నేపథ్యంలోంచి’ శీర్షికగా తత్వశాస్త్రం బోధించినట్లు చెప్పాడు. మనిషి మనిషికీ ఒక గూడు అవసరమే కదా. గూడులేని గువ్వలెన్నో మన కళ్లముందే అలా రెక్కలు రాల్చుకుంటున్నా ఇంకా కొంతమంది ఇప్పటికీ వుండేందుకు కాస్తంత జాగా కావాలి దొరా.. అన్నట్లు ఊరి చివరి నేల మీద తాటాకు పందిళ్లూ, వాటికి జెండాలూ కట్టి, పది అడుగుల నేలనైనా సంపాదించుకుందామనే తపనతో గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి దాకా తెగ పాకిన రాజకీయ గుర్రపుడెక్క ఆకుల మీద నడుస్తుంటారు. గుర్రపుడెక్క ఎప్పుడూ మనల్ని నడవనిచ్చేంత గట్టిగా ఉండదు. మనల్ని కిందికి, ఊబిలోకి జారవిడిచి తను ఠీవిగా నిలబడుతుంది. ఆశలు ఎన్నిసార్లు నిలువునా తగలబడిపోయినా కష్టజీవులెందుకో గాయాల రుతువులై ప్రవహిస్తూనే ఉంటారు.
‘అనేక విప్లవాల, యుద్ధాల
ఉద్యమాల ఆవేశ నాదాలన్నీ
ఇప్పుడు భూమిపొరల్లోకి..’
‘అన్ని దారులూ నిషేధించబడ్డాక
పేదవాడి ఊపిరే ఒక ఉద్యమం’.. అంటూనే, పేదవాడు ఊపిరి తీసుకున్నంత తప్పనిసరై ఉద్యమంలోకి వస్తాడనీ, ఏసి గదుల్లో మరీచికల్ని దర్శించే కళ్లెపుడూ ఆ ఉద్యమాల్ని, వాటి ఫలాల్నీ సొంతం చేసుకుంటూనే ఉంటాయనీ చెబుతాడు.
చక్కెర వ్యాధిని ‘తీపి చెద’గా కవిత్వం చేసిన తీరు అనన్యం. ‘ఇపుడు నా దేహమంతా చెరుకుగడే’ అంటూ ముగించి తీయదనపు చిరునామా మారిన వైనాన్ని మెత్తగా చెప్తాడు ఏటూరి.
‘నగరం నాలుగురోడ్ల కూడలిలో
మనిషి కోసం వెతుకుతున్నవాడు
మనం పారేసుకున్న చిరునవ్వుల్ని
వెతికి ఏరి తిరిగి తెచ్చి ఇవ్వాలని
తపిస్తున్నవాడు
చెక్కలు ముక్కలై చెదిరిన కలల్ని
తిరిగి అతకాలని తాపత్రయపడుతున్నవాడు’ కవి ఏటూరి నాగేంద్రరావు. అతనన్నట్లుగానే ‘ఊహల్ని ప్రేమించలేని వాడికి జీవించే అర్హత లేదు’. ఐతే ఇతను ఊహల్ని ప్రేమిస్తున్నాడు. ఊహలనూ, ఊహల్లోని నిజానిజాలనూ కళ్ల ముందు ప్రవహింపజేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇతడు కవి, సామాజిక చైతన్యపు దీపధారి. కవి ఏటూరికి అభినందనలు. ‘పూవులు సమ్మె చేస్తాయి’ని చదివి, తర్వాత అందరం అభినందిద్దామా!

- కోసూరి, గుంటూరు.
చరవాణి : 8520009858

మనోగీతికలు
జలం మన బలం
నీటి చుక్కచుక్క లెక్కబెట్టి
పొదుపుగా వాడదాం
జలమే జీవం మన బలం
బతకటానికదే ఆధారం
మనిషి స్వార్థం, దురాశతో
అడవుల విధ్వంసం
సాగుతోంది నిరంతరం
రుతుపవనాలు గాడితప్పి
తగ్గుతోంది వర్షపాతం
వేడెక్కుతోంది భూమండలం
పంట దిగుబడులూ పడిపోయి
ప్రమాదంలో పడుతోంది జీవవైవిధ్యం
ఎల్‌నినో, లానినో విపరీత మార్పులతో
వణికిపోతోందీ ప్రపంచం
మనిషి ప్రకృతిలో భాగం
ఆరాధించాలి అదే మన దైవం
దురాలోచనతో నిర్లక్ష్యం చేస్తే
తప్పదు ప్రకృతి వైపరీత్యం
పుడమి తడారితే ఎడారే
అడవి వుంటేనే అన్నముంటుందని సూక్తి
అందరం మొక్కలు నాటుదాం
అవే రేపటికి మన వృక్ష సంపద
వృక్షరాశి పెరిగితేనే వర్షాలు
అప్పుడే మన నదులకు జలకళ
ప్రతి నీటిబొట్టూ విలువైందే
ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత
పంట భూముల్లో సేద్యపు గుంత
ఆనకట్టల దిగువన చెక్‌డ్యాంలు
పర్యావరణ పరిరక్షణతోనే
భూమిపై జీవుల మనుగడ
పచ్చని దుప్పటిలా మారాలి పుడమి
జలమే జీవం.. మన బలం
ఎప్పటికీ తరగని ధనం
జలం వున్నచోటే నాగరికత వృద్ధి
జరుగుతుంది జన జీవనాభివృద్ధి

- బి వరప్రసాద్,
నరసరావుపేట, గుంటూరు జిల్లా.
చరవాణి : 9885631829

తూరుపు వెలుగు
తెలివి నీటి బిందువు
ఏకాగ్రత ఓ సూర్యకిరణం
వికసించింది..
విజ్ఞాన కమలం

వాడకుంటే
ఇనుము తుప్పుపడుతుంది
పని లేకుంటే
మెదడు మొద్దుబారుతుంది

ఓ సద్గుణముంటే
మరికొన్ని పురోగమిస్తాయి
దుర్గుణముందా..
అవన్నీ తిరోగమిస్తాయి

గతం గురించి దిగులెందుకు
భవిష్యత్తుపై బెంగెందుకు?
వర్తమానంలో అప్రమత్తమైతే
అపజయం తలవంచదా?

తాత్కాలిక సుఖానికి పరుగు
జీవితం దుఃఖమయం
చిన్న శ్రమకు ఓర్వకుంటే
బతుకు అయోమయం

సంపద కోసం
ఆరోగ్యం తగలేశాడు
ఆరోగ్యం కోసం
సంపదను ధారపోశాడు

చేదుమాత్ర మింగితేనే
జబ్బు హరిస్తుంది
కష్టనష్టాలను అధిగమిస్తేనే
విజయం వరిస్తుంది

నీ మతం అమ్మప్రేమ
పరమతం నాన్న లాలన
ఎందుకొచ్చిన గొడవ?
అంతా వసుధైక కుటుంబమే!

విద్యార్థీ! ఈ నీ దశ
భవిష్యత్తుకు రూపకల్పన
ఎదుగుదలకు నిచ్చెన
కలిగివుండు నిత్యం ఈ భావన

శ్రమను అనుసరిస్తే
విజయం సొంతం
బద్దకం ఆవహిస్తే
పతనం.. అంతం అనంతం

ధనం వల్లరానిది
విద్యవల్ల లేనిది
రూపం వల్ల కానిది
మంచి శీలంలోనే ఉన్నది

అపజయం పాలైనా
సమాజం క్షమిస్తుంది
అవకాశం ఉండీ
అందుకోకుంటే
క్షమార్హత లేనట్లే

భయమంటే పతనం
భయమంటే దుఃఖం
భయమంటే నరకం
తలఎత్తితే
దుఃఖం, నరకం పతనం

పరభాషను
అతిథిలా గౌరవించు
మాతృభాషను
అమ్మలా ప్రేమించు

మహిళ లేనిదే
మనుగడ లేదని తెలుసు
సమాజంలో
ఆమె అంటే
ఎందుకంత అలుసు?

సమస్యల్ని చూసి బెదరకు
ధైర్యంగా ఎదుర్కొంటే
వెనుకడుగు వేస్తాయి
సవాలు చేశామా..
తోకముడుస్తాయి!

- మాదిరాజు మాలతి, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా. చరవాణి: 9959133714

బతుకు పోరాటం
వైఫల్యాలు చుట్టుముట్టి
చిమ్మచీకట్లో చిక్కుకుని
నరకకూపంలో ఇరుక్కుని
మహోత్పాతం
తరుముకొస్తున్నా
మృత్యువు నీకు రెప్పపాటు
దూరంలో వున్నా
మనశ్శాంతి కరువైన
వారిని మాట్లాడనివ్వండి
వారి బాధను చెప్పనివ్వండి
ఏడ్వనివ్వండి
వెక్కివెక్కి ఏడ్చినా ఆపకండి
గుండెలోని బాధలు
కట్టలు తెంచుకుని
ప్రవహించనివ్వండి
ప్రవాహం ఆగిపోయాక
గుండె తేలికైపోతుంది
మనసు కుదుటపడ్డాక
వారి సమస్యలకు
పరిష్కారం కనుగొనండి
కబళించటానికి వచ్చిన
బలవస్మరణాన్ని
ఆత్మహత్యా ప్రయత్నాన్ని
సమాధి చేయండి
ఆ ఆలోచనను
అంతమొందించండి
దివ్యాంగులెప్పుడూ
ఆత్మహత్యకు తెగబడరు
మరి అన్నీవున్న
మీకెందుకు
తొందరపాటు నిర్ణయం
పోరాడండి.. పోరాడండి
జీవితంలో ఎదగడానికి
గెలవడానికి..
బతకటానికి!

- బుర్రి కుమార్‌రాజు,
గుంటూరు.
చరవాణి : 9848918141

email: merupuvj@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net

- శాంతిశ్రీ బెనర్జీ