ఉత్తర తెలంగాణ

సీతమ్మ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సార్! మీకోసం ఎవరో వచ్చారండీ!’ చెప్పాడు అటెండర్. ‘సరే! లోపలికి రమ్మను’ అనుమతి ఇచ్చాడు ప్రభాకర్ రావు. ‘నమస్కారం సార్’ అంటూ వచ్చి నిలబడింది నడీవయసు స్ర్తి - ‘చెప్పండమ్మా! ఏం పని మీద వచ్చారు?’
ఈమధ్య కాలం చేసిన ‘సత్యం మాస్టారు భార్యనండి నా పేరు సీతమ్మ’ భర్త గూర్చి చెబుతుంటే ఆమె గొంతు పూడుకుపోయింది.
‘విన్నానమ్మా! మీ వారి గూర్చి. వారు పిల్లలను స్వంత బిడ్డల్లా చూసుకుంటారని, బడిని దేవాలయంలా భావించే వారని, మీ వారితో పనిచేసిన ఉపాధ్యాయులు ఇప్పటికీ చెప్పుకుంటారు. మీకు నా వల్ల ఏం సాయం కావాలో చెప్పండి!’ మర్యాదపూర్వకంగా అన్నాడు ప్రిన్సిపాల్. ఒక్కసారి గతమంతా కనుల ముందు మెదిలింది సీతమ్మకు.
***
తన భర్త సత్యంకు పిల్లలంటే ప్రాణం. ఎంతసేపు తను పనిచేస్తున్న పాఠశాల, విద్యార్థులు, సహ ఉపాధ్యాయులు అతని లోకం. ఇతర వ్యాపకాలు ఏవీ ఉండేవి కావు. తమ కుటుంబం ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్న పేద పిల్లల సానుభూతి చూపేవాడు. పాఠశాల ఫీజులు కట్టలేని వారికి ఆర్థికంగా సహకరించేవాడు. అలాంటి తన భర్త రిటైర్మెంటు దగ్గర పడేకొద్దీ దిగులు పడటం ప్రారంభించాడు. భోజనం సరిగా చేసేవాడు కాదు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉండేవాడు. రిటైర్డ్ అయిన మరుక్షణం నుండి మరింత కుంగిపోవడం ప్రారంభించాడు. తన ఓదార్పు మాటలు అంతగా పనిచేయలేదు. రిటైర్ అయిన ఆరు నెలల లోపే తమను అనాధలను చేసి వెళ్లిపోయాడు. ఆ పాఠశాలపై అంత(లా)గా మమకారం పెంచుకున్నాడు. తన భర్త జ్ఞాపకార్థం ఆ పాఠశాలకు ఏమైనా చేయాలనుకున్నది సీతమ్మ. ఆ విషయం ప్రిన్సిపాల్ గారికి చెప్పడానికే వచ్చింది.
***
గతంలోంచి బయటపడ్డ సీతమ్మ.
‘ప్రిన్సిపాల్ గారూ! మీతో ఒక విషయం ప్రస్తావించడానికి వచ్చాను.’ చెప్పింది ప్రశాంతంగా. ‘మావారి తృప్తికోసం ఒక చిన్నపని చేయాలనుకుంటున్నాను. అందుకు మా అనుమతి తప్పక లభిస్తుందని భావిస్తున్నాను.’
‘చెప్పండమ్మా! నావంతు సాయం నేను తప్పక చేస్తాను.’
‘మరేం లేదండీ! మా వారి పేరున పదివేలు పేద విద్యార్థుల కోసం ఇవ్వదలచుకున్నాను. దానిని బ్యాంకులో వేయించి, వచ్చే వడ్డీ పేద పిల్లలకు ఇవ్వండి. అర్హమైన వారెవరో మీరే నిర్ణయించండి’ అని పదివేల రూపాయలున్న కవరు ప్రిన్సిపాల్ బల్లపై ఉంచుతూ, ఇవి కేవలం మావారి ఆత్మశాంతి కోసమే వినయంగా చెప్పింది సీతమ్మ.
ప్రిన్సిపాల్ గారు ఆమెను, కుటుంబ సభ్యులను అభినందించాడు. ఆ దాతృత్వం సదుపయోగమైంది.

- గరిశకుర్తి శ్యామల
హైదరాబాద్, సెల్.నం.9490189081

పుస్తక సమీక్ష

ఏడాది చెప్పితే.. ఎద్దైనా వింటది!
పేజీలు: 137
వెల: 150/-
ప్రతులకు:
నడిమెట్ల రామయ్య
ఇం.నం.6-6-834
శివాజీనగర్
కరీంనగర్-505001
సెల్.నం.8106657657

కవి నడిమెట్ల రామయ్య ‘ఏడాది చెప్పితే..ఎద్దైనా వింటది’ పేరుతో ఓ గేయ శతకాన్ని వెలువరించారు. 1970లోనే ‘జై జవాన్-జైకిసాన్’ గేయ సంపుటిని ప్రకటించిన ఆయన 2010లో ‘యారాలు చిన్నదైతేను పాలు చిన్నదా!’ పేరుతో తెలంగాణ పాటలను ప్రచురించారు. తెలంగాణ భాషా సొబగులతో ముస్తాబై వచ్చిన ఈ గ్రంథంలోని గేయాలన్నీ తెలంగాణ గ్రామీణ భారతాన్ని ప్రతిబింబిస్తాయి! ప్రగతిశీల భావాలను పుణికి పుచ్చుకున్న నడిమెట్ల రామయ్య ప్రజల భాషలో రచనలు చేయడంలో నేర్పరి! మానవతావాది, హేతువాది అయిన రామయ్య తన కవిత్వం నిండా మూఢ నమ్మకాల నివారణకు ఉపయోగపడే నాలుగు మాటలు పొందుపరుస్తారు. వైజ్ఞానిక అంశాలపై దృష్టి పెట్టి.. సామాజిక రుగ్మతలపై ఆయన కలాన్ని ఎక్కుపెట్టడంలో దిట్ట! సమాజంలోని హిపోక్రసీని, పచ్చి బూటకత్వాన్ని పటాపంచలు చేసేందుకు ఇందలి గేయాలు దోహపడతాయి! ప్రతి గేయంలో జీవన సత్యాలను చూస్తాం.. లోకం పోకడలను గమనిస్తాం.. 3వ తరగతి వరకే విద్యాభ్యాసం చేసి నాలుగో తరగతిలో చదువు మానివేసిన రామయ్య గారు రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మలచుకుని.. సామాజిక చైతన్యానికి దోహదపడటం విశేషం! 106 గేయాలున్న ఈ గ్రంథం సమాజంలోని తీరుతెన్నులకు అద్దం పట్టేలా రూపుదిద్దబడింది.
రామయ్య అవ్వకు దండం పెట్టి రాసినా.. వేమన పద్యము ఎపుడు మరిచిపోకు అని వివరించినా.. ఎంతజేసినా కూటికే అని చాటి చెప్పినా ప్రతి మాటలో ఒక హితోపదేశం కానవస్తుంది. బిడ్డలొద్దని కొడుకులే కావాలని కొరుకున్న వారి బ్రతుకులు భారమయ్యే విషయాన్ని ఓ గేయంలో చక్కగా చిత్రించారు. కరువులు పరువులు కష్టాలు ఎదురైనా తలమీది అప్పులు తడిసి మోపెడు అయిన రైతన్నలు మీరు బ్రతకాలి బ్రతకాలి బహునాళ్లు బ్రతకాలి-బతికి సాధించాలి. భార్యాబిడ్డల భవిష్యత్తు చూడాలని మరో గేయం ద్వారా హితవుపలికారు. ‘అచ్చరాలు’ పేరుతో రాసిన గేయంలో..అచ్చరాలు..నా అచ్చరాలు చీకటి గుండెల్లో పేలుతాయి అంటూ..వివిధ కవులను, రచయితల రచనలను అక్షరాలను నెమరువేసుకున్నారు. కడుపుకూటికోసం మగాడు ఆడదా? మీద ఆధారపడవద్దనీ..ఆధారపడితే వాడు మగలాడెట్లవుతడు? అని ప్రశ్నించారు.
‘నమస్కారం’ యొక్క వైశిష్ట్యాన్ని తెలుపుతూ నమస్కారం సమస్యకు కొంత పరిష్కారమేనని తెలిపినారు. ఇలా ఇందులోని గేయాలన్నీ మంచి సందేశాన్ని మోసుకొచ్చాయి. సరదా సరదాగా చదువుకునే గేయాలున్నాయి.. అంతేగాక.. సీరియస్‌గా చదివి.. ఆలోచించాల్సిన అంశాలతో కూడిన గేయాలూ ఉన్నాయి. మత రస్యానికి దోహదపడే గేయాలున్నాయి. మద్యం వల్ల వచ్చే ముప్పులు తెలిపే గేయాలు ఇందులో ఉన్నాయి. తెలంగాణ మాండలిక పదాలను ఆయా గేయాల్లో చక్కగా ఒదిగి పోయేలా కవి నేర్పరితనం కానవస్తోంది. వీటిని లయబద్ధంగా గానం చేసుకోవచ్చు..అంతేగాక..పల్లె ప్రజలు..పట్టణ ప్రజలు అన్న తారతమ్యం లేకుండా ఎవరైనా చదవవచ్చు. కవిత్వాంశ కోసం వెతికే పాఠకులు నిరుత్సాహపడ్డప్పటికీ..కవి నడిమెట్ల రామయ్య ఉత్తమ సంస్కారాన్ని అభినందించకుండా ఉండలేరు. కొన్ని గేయాల్లో తిట్ల పురాణం లేకుండా జాగ్రత్తపడితే బాగుండునేమో అనిపిస్తుంది.

- సాన్వి
కరీంనగర్, సెల్.నం.9440525544

అంతరంగం

తెలుగు సాహిత్య
అకాడమీని నెలకొల్పాలి
- దేవులపల్లి ప్రభాకర్‌రావు,
తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు

రచయిత చిరునామా
దేవులపల్లి ప్రభాకర్ రావు
2-1-415/3, రాజేష్ నిలయం
వీధి నం.3, నల్లకుంట, హైదరాబాద్-44
సెల్.నం.9133335055

మస్తిష్కంలో మథనానికి ఆవేశాత్మక అక్షర రూపం కవిత్వమని తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీ దేవులపల్లి ప్రభాకర్ రావు అభిప్రాయపడ్డారు. వరంగల్లు పట్టణం మట్టెవాడలో జన్మించిన ఆయన 1969-74 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పలు ఉద్యమ పత్రికలకు సంపాదకులుగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార, పౌర సంబంధ శాఖలో, రాష్ట్ర ప్రభుత్వ కుటుంబ సంక్షేమ శాఖ మాస్ మీడియా విభాగంలో సంపాదకులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన అనేక ప్రముఖ దినపత్రికల్లో చాలా సంవత్సరాలుగా కాలమిస్టుగా వ్యవహరిస్తున్నారు. ఆయన వెలువరించిన ‘మహాకవి గురజాడ’ గ్రంథానికి యునెస్కో అవార్డు, జాతీయ సమైక్యత అంశంపై ఆయన రాసిన ‘నేను ఎవరు’ పుస్తకానికి భారత ప్రభుత్వం అవార్డు, ‘అల్లూరు సీతారామారాజు’ రేడియో నాటికకు జాతీయ స్థాయి పురస్కారం లభించింది. విద్యార్థి దశ నుంచే గోలకొండ, విశాలాంధ్ర పత్రికల్లో పలు రచనలు చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, ఆంధ్రప్రభుత్వ సాహిత్య పురస్కారాలను అందుకున్నారు. సీనియర్ రచయిత అయిన ప్రభాకర్‌రావు గారి అంతరంగాన్ని ఆవిష్కరింప ‘మెరుపు’ యత్నించింది. వారితో జరిపిన ముఖాముఖీ వారి మాటల్లోనే మెరుపు పాఠకుల కోసం అందిస్తున్నాం.

ఆ మీరు ఎన్నో ఏట రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించారు?
పదిహేనవ ఏట. హైదరాబాద్‌లో, కేశవ స్మారక ఉన్నత పాఠశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు విశాలాంధ్ర పత్రికలో (ఆ పత్రిక సంపాదకులు కోరగా, ప్రోత్సహించగా) వ్యాసాలు రాయడం మొదలయింది.

ఆ మీ దృష్టిలో కవిత్వం అంటే ఏమిటి?
మనసును మెప్పించగలిగేది. మెదడును రగిలించగలిగేది కవిత్వం. హృదయంలో స్పందనకు, మస్తిష్కంలో మధనానికి ఆవేశాత్మక అక్షర రూపం కవిత్వం. సామాజిక స్పృహ, సమాజం పట్ల బాధ్యత లేని కవిత్వం ఈ ఆధునిక ప్రజాస్వామ్య యుగంలో పది కాలాలు నిలువ లేదనుకుంటాను.

ఆ మిమ్మల్ని ప్రభావితం చేసిన గ్రంథం ఏది?
భక్తకవి పోతన భాగవతం.. ‘సత్కపుల్ హాలికులయిననేమి’ అన్న మాటలు నాకు అడుగడుగున స్ఫూర్తినిస్తాయి.

ఆ మీ ప్రచురిత, ప్రచురించనున్న గ్రంథాల వివరాలు తెలుపుతారా?
నేను కాలేజిలో చదువుతున్నప్పుడు గిడుగు సీతాపతి గారు హైదరాబాద్‌లో నిర్వహించిన బాలసాహిత్య రచనాలయంలో విద్యార్థిగా రచించిన ‘నేను ఎవరు?’ (జాతీయ సమైక్యతపై) చిన్న పుస్తకం ప్రచురితమయింది. అది నా మొదటి ప్రచురణ. తరువాత 1968లో అఖిలభారత స్థాయిలో యునెస్కో బహుమతి పొందిన నా ‘మహాకవి గురజాడ’ ఒక పుస్తకంగా ప్రచురితమయింది. 1974-76 సంవత్సరాలలో ‘ప్రజాతంత్ర’ వారపత్రికలో నేను వారం వారం రాసిన ‘చెప్పుకోదగ్గ మనుషులు’ (రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు వివిధ రంగాల వారి అక్షర రేఖాచిత్రాలు) ప్రచురితమయిన రెండవ గ్రంథం. వీటితో పాటు ఈనాడు, ప్రజాతంత్ర, వార్త, కళ, పెన్షనర్స్ మూవ్‌మెంట్ తదితర పత్రికలలో ప్రచురితమయిన వ్యాసాల సంకలనాలు 1.సమరం నుంచి స్వాతంత్య్రానికి, 2. పాళికేళి, 3.మాటకచేరి, 4. పారిజాతాలు గ్రంథాలుగా ప్రచురితమయినాయి. వేయి పేజీలకు మించిన గాంధీశకం మరో గ్రంథం, తెలంగాణ తేజోమూర్తులు, ముక్తసరి, కొన్ని సంపాదకీయాలు, మహనీయుడు పి.వి., ఈ వ్యాసాలు గ్రంథాలు ప్రచురణలో ఉన్నాయి.

ఆ తెలుగు భాషను విస్తృతంగా వాడుకలోనికి
తేవడానికి ఏం చేయాలంటారు?
తెలుగు కవులు, రచయితలకు, వారి రచనలను ప్రచురించడానికి, వాటిని మార్కెట్ చేయడానికి ఇప్పుడున్న అవకాశాలు సంతృప్తికరంగా లేవు. ఇప్పటికంటే ఇంకా ఎక్కువ హార్దిక, ఆర్థిక ప్రోత్సాహం లభించాలి. వివిధ విషయాలపై తెలుగులో విస్తృతంగా పుస్తకాలు ప్రచురితం కావలసిన అవసరం ఉంది. తెలుగు భాష విస్తృతి పెరగాలంటే ఇప్పుడున్న దిన, వార, మాస పత్రికలు ఎంతమాత్రం సరిపోవు. ఎక్కువ వనరులతో రాష్ట్రంలో తెలుగు సాహిత్య అకాడమీ స్థాపించడం అత్యావశ్యం.

ఆ ప్రభుత్వ కార్యాలయాలలో ప్రస్తుతం తెలుగు
భాషా వినియోగంపై మీ అభిప్రాయం?
రాష్ట్ర ప్రభుత్వ సచివాలయ స్థాయి నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు అన్ని ప్రభుత్వ శాఖలలో పూర్తిగా తెలుగునే అధికార భాషగా ఉపయోగించడానికి ఇంకా ఎంతో కృషి జరుగవలసి ఉంటుందనడంలో సందేహం లేదు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు భాషలోనే పూర్తిగా వ్యవహారాలు జరగడానికి ఆయా శాఖలకు అవసరమయిన అధికార పారిభాషిక పదకోశాలు మొదట రూపొందాలె.

ఆ తెలుగును రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో అధికార భాషగా వినియోగించే
దిశలో రాష్ట్ర అధికార భాషా సంఘం చేపట్టబోయే కార్యక్రమాలు ఏమిటి?
తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయిన పిదప కేవలం రెండు సంవత్సరాలలోపునే గౌరవనీయ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు 2016 ఏప్రిల్ 26వ తేదీన రాష్ట్ర అధికార భాషా సంఘాన్ని నా అధ్యక్షతన నియమించారు. అధికార భాషా సంఘం సభ్యులను రాష్ట్ర స్థాయిలో, జిల్లాల స్థాయిలో నియమించగానే తెలుగు అధికార భాషగా ఏ విధంగా అమలు జరుగుతున్నదో పరిశీలించి, పూర్తి స్థాయిలో అన్ని కార్యాలయాల్లో అమలు జరుగడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

ఆ మరుగున పడ్డ తెలంగాణ సాహిత్యం వెలుగులోకి రావాలంటే ఏం చేయాలి?
మన తెలంగాణ ప్రాచీన కవులు, ఆధునిక కవులు, రచయితలు, పరిశోధకుల అమూల్య గ్రంథాలెన్నో ఈరోజు మనకు అందుబాటులో లేవు. వాటిని తిరిగి ముద్రించి తక్కువ ధరకు పాఠకులకు, విశేషించి కొత్త తరాలకు (పాఠశాలల, కళాశాలల విద్యార్థుల) అందుబాటులోకి తీసుకురావడం చాలా ముఖ్యం.

ఆ కొత్త తరం సాహిత్యంపై అభిరుచి కలిగించాలంటే ఏం చేయాలి?
కొత్త తరాలకు తెలుగు సాహిత్యంలో అభిరుచి కలుగడానికి ఇది చాలా అవసరం. యువతరం కవులు, రచయితలకు సలహాలు ఇవ్వగలిగినంత పెద్దవాన్ని కాను నేను, ఎంత ఎక్కువగా చదువగలిగితే అంత బాగా రాయగలుగుతామన్నది తెలంగాణ యువతరానికి నా వినయపూర్వక సూచన.

ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544

మనోగీతికలు

అమ్మానాన్న!
లాలించేది అమ్మ, పాలించేది నాన్న
నడక నేర్పేది అమ్మ, దారి చూపేది నాన్న
తప్పటడుగు వేయకుండా చూసేది అమ్మ
తప్పును సరిదిద్దేది నాన్న
ఆపదలో ఉంటే ఆదుకుంటుంది అమ్మ
ఆపద రాకుండా అడ్డుకునేది నాన్న
అమ్మంటే అనురాగం, నాన్నంటే మమకారం
అమ్మంటే తోడు, నాన్నంటే నీడ
ఈ తోడునీడల కలయికే - అమ్మా నాన్న!

- సంగీతం శ్రీలేఖ
కరీంనగర్, సెల్.నం.8331956602

వృద్ధాప్యం

ఓ మనిషీ
వృద్ధాప్యం వస్తుందని భయపడకు
ఓ వరంగా భావించుకో
వృద్ధాప్యంలో సంసార విముక్తి లభిస్తుంది
ఆత్మీయుల పరామర్శలు పెరుగుతాయి
ఓ మనిషి
వృద్ధాప్యాన్ని నీకు అనుకూలంగా మార్చుకో
నీ దినచర్యలో ఒత్తిడి లేకుండా చూసుకో
పుస్తక పఠనం అలవర్చుకో,
భక్త్భివం పెంచుకో
మహా రుషులు అందరూ వృద్ధాప్యంలో
ఆదికావ్యాలు రచించారు
తోడు కోసం తపించకు. అందరూ నీవారే
వృద్ధాప్యం మనిషికి కానీ,
మనసుకు కాదని తెలుసుకో
అద్ధంలో నీ ముఖంలోని ముడతలు చూడకు
అద్దం లాంటి మనసుతో
ఎదుటి వారిని,
నీ కుటుంబాన్ని ప్రేమించు

- చిలుకమర్రి విజయలక్ష్మి
ఇటిక్యాల, జగిత్యాల జిల్లా
సెల్.నం.9493210293

వల్లమాలిన ప్రేమ
మనిషొక్కడే
అంతటా తానే అయి
ఎగరని ఆకాశం లేదు
ఈదని సాగరం లేదు
పరుగెత్తని ప్రదేశం లేదు
చిత్రించని దృశ్యం లేదు
వర్ణించని కావ్యం లేదు
కూర్చని స్వర ఝరి లేదు!
భాషకీ భావ వ్యక్తీకరణకీ
అనుభవాలు అనుభూతుల పుట్ట
మనిషి మెదడు..
మెమొరీ బోర్డులో
వేల టన్నుల వెబ్ సైట్లని సృష్టిస్తాడు
అగణిత, డేటాని
భద్రపరుస్తాడు భావితరాలకు..
ఒకవైపు విశ్వనగరి
సరిహద్దుల్ని స్పృశించ సాహసిస్తాడు
సైబర్ ఆర్మీతో
సమీకరణాలు చేస్తాడు
సమరాలకు జంగ్ సైరన్ మోగిస్తాడు
మతాలు అభిమతాలంటూ కొందరు
పన్నిన చక్రవ్యూహాల్ని ఛేదిస్తాడు
ఇలా అంతటా తానే అయి
విశ్వాంతర్యామిగా వాలనీ
సమ్యక్ దృక్పథంతో
కలలు గనే మనిషంటే నాకు
వల్లమాలిన ప్రేమ!
వాడికిదే నా శాల్యూట్!!

- డాక్టర్ దామెర రాములు, నిర్మల్, సెల్.నం.9866422494

జై జవాన్!

భారతీయ ఘన చరిత భాష్యమిదని
శాంతి కాముకులముగాన సహన మెప్పు
శక్తి యుక్తులు శంకించ సబబుగాదు
గట్టిగా బుద్ధి చెప్పాలి ఘాతుకులకు
దిక్కు సరిహద్దులన్నియు దీక్ష తోడ
కంటి రెప్పలా కాపాడె కదన దళము
సింహ స్వప్నమే రిపులకు సీమలోన
జాతి శ్లాఘించె సేనలన్ జగతి యందు
ఉగ్ర నున్మాద చర్యల నుగ్గడించ
మనసు వికలత నొందును మాట రాక..
హేయ మగునట్టి దీదాడి హేతువేమో?
కఠినమగు దెబ్బదీయాలి కర్కశులను
దుష్కరమ్మగు చర్యల దున్ని వేయ
ప్రభుత్వ సన్నద్ధమవ్వాలి పలు విధముల
ప్రాణములు వీడి పరలోక పరములయిన
వీరపత్నుల కన్నీటి వీడుకోలు
అమరవీరులకు నివాళి యర్పితమ్ము

- గోవిందుల శ్యామసుందరాచార్య
నిర్మల్, సెల్.నం.9440620116

స్వప్న లోకం

స్వప్నలోకం..
రాజులా రాణింపచేయటలే కాదు
దరిద్రునిలా దర్శింపచేస్తుంది
అప్సరసల నడుమ ఆడించటమే కాదు
అధఃపాతాళానికి తోసేస్తుంది
జగమంతా తిప్పటమే కాదు
యుగాల్లోకి లాక్కెళ్లుతుంది
పాల సముద్రాలనే కాదు
రక్తపుటేరులను చూపిస్తుంది
ఆకాశంలో విహరింప చేయుటమే కాదు
ఆగకుండా పరుగులు తీయిస్తుంది
జలపాతాల్లో జలకాలాడించుటే కాదు
పర్వతాలపై నుండి పడవేస్తుంది
స్వప్న సుందరితో సరసాలాడించటమే కాదు
సముద్రాల్లో, లోయల్లో పడవేస్తుంది
వెంటాడుతుంది వేటాడుతుంది
తుంటరి పనులెన్నో చేయిస్తుంది
నవ్విస్తుంది నడిపిస్తుంది
కవ్విస్తుంది కలవరిపంజేస్తుంది
ఆశ్చర్యంలో ముంచేస్తూ
ఆనందం పంచుతుంటే
కలలు కల్లలే అయినా
కాసేపు భావోద్వేగాలకు లోనుచేస్తుంది
ఇలలో పొందలేనిది
కలలో కదలివస్తుంది
స్వప్నలోకం
సుందరం సుమధురం కాదు
అరవై నాలుగు అంశాలకు ఆలవాలం
చివరంటూ లేని చీకటి నేస్తం!

- రంగు గోవర్ధన్
కరీంనగర్, సెల్.నం.9849497679

సాహిత్య సమాచారం

కథ, కవితా పురస్కారాలకు
ఎంట్రీలు ఆహ్వానం
కరీంనగర్ తెలంగాణ కళావేదిక ఆధ్వర్యంలో కథ, కవితా పురస్కారాలకు ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అనుముల దయాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. సమకాలీన సంఘటనలపై కథలను చేతిరాతలో నాలుగు పేజీలకు మించకుండా ఉండాలి. కవితలు సామాజికాంశాలపై 30 పంక్తులకు మించకుండా రాయాలి. కథ, కవితల విభాగాల్లో ఉత్తమంగా నిలిచే వాటికి ప్రథమ, ద్వితీయ పురస్కారాలు ఇవ్వబడుతాయ. రచయతలు తమ పేరు, చిరునామాలను హామీపత్రంపైనే రాయాలి. ఎంట్రీలను నవంబర్ 26లోపు అనుముల దయాకర్, 10-1-181, రాంనగర్, కరీంనగర్ - 505 001 చిరునామాకు పంపించాలి. పురస్కారాలను డిసెంబర్ 4న కరీంనగర్‌లో నిర్వహించే సంస్థ ప్రథమ వార్షికోత్సవ సభలో అందజేస్తామని తెలిపారు. వివరాలకు 8886623533 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net
నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com
email : merupuknr@andhrabhoomi.net

- గరిశకుర్తి శ్యామల