నెల్లూరు

వయసు నవ్వింది (కథ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలైక్య పెరట్లో పేపర్ చదువుతూంది. తనకు వచ్చిన లెటర్‌ని అమ్మ అందిస్తే తీసుకొంది. అది వినోద్ నుండి వచ్చింది. అంతలో అలైక్య ఫ్రెండ్ లత వచ్చింది.
‘‘హాయ్ అలైక్య!’’ అంటూ వచ్చిన లతను చూసి ‘‘హలో! అడుగులో అడుగేస్తూ చప్పుడు చేయకుండా వస్తున్నావ్!’’ అంది.
‘‘అదేం లేదు! నేను మామూలుగా ఎప్పటిలాగానే వచ్చాను, నీవేమో బృందావనంలో కృష్ణుని కోసం ఎదురు చేసే రాధలా చేతిలో లెటర్‌తో పరధ్యానంలో ఉన్నావు!’’
‘‘ఈ బాధ కృష్ణుని గురించి కాదు అన్నయ్య గురించి...’’
లత కుర్చీలో కూర్చుంటూ -
‘‘వినోద్ అన్నయ్య గురించి! మరి దీపు తమ్ముడు...’ అంటూ ఆగింది.
‘‘వినోద్ అన్నయ్య, దీపు తమ్ముడు యిద్దరు నారెండూ కళ్ళు!’’
‘‘ఓహో అలాగా! మరి కృష్ణ!’’
‘‘కృష్ణ నా అణువణువు నిండిన మధురమూర్తి’’
‘‘ఐసీ... సరే ఆ లెటర్‌లో ఏముందో చదువు, యింతకీ టీ కాఫీల్లాంటి మర్యాదలేమైనా ఉన్నాయా లేదా’’
అంతలో అలేక్య అమ్మ -
‘అమ్మాయ్ లతా! టీ రెడీ, యిదిగో’ అంటూ వచ్చింది.
‘‘్థ్యంక్స్ ఆంటీ!’’ ఒక టీ తను తీసుకొని మరొకటి అలైక్యకీ యిచ్చింది. కొంచెం టీ తాగి -
‘‘మీ సోకాల్డ్ మీ ఆత్మీయులిచ్చినంత టేస్ట్ ఉండదేమో గాని టీ మాత్రం బావుంది!’’ అంది.
‘‘నీ వేళాకోళాలు యింకా మానలేదు! లెటర్ చదువుతా వినవే’’ అంటూ -
‘‘చెల్లీ మంచీ, మానవత్వానికి విలువలేని నేటి సమాజంలో ఎవరినో ఎక్కడి వాడినో నాపై చూపే ఆదరణ నా జీవిత పుటల్లో మరువలేని అధ్యాయం! నేను రేపు విజయవాడ వస్తున్నాను’’ చదవటం ఆపి -
‘‘చూడవే! తోడబుట్టినవాడు కాకున్నా నేనంటే ఎంతప్రేమో!’’ అంది.
అలైక్య మాటలకి పెద్దగా నవ్వింది లత
‘‘ ఎందుకా నవ్వు?’’
నవ్వటం ఆపి -
‘‘అలైక్యా, కృష్ణ నీవు కోరుకున్న వ్యక్తి! మరి ఈ వినోద్, దీపు నీ సొంత అన్నదమ్ములు కాదు, మరి ఈ సమాజం నీవు చెప్పే మాటలు నమ్ముతుందా! సమాజాన్ని కాదని మనం బ్రతకగలమా? నలుగురు వెళ్ళే బాటలో మనం నడవాలి గాని ఏటికి ఎదురీదగలమా?’’ అంది.
‘‘మంచో చెడో నాకు తెలియదు! నాకు నచ్చని విధంగా బ్రతకడం చేతకాదు’’
అలైక్య మాటలకు మధ్యలో కల్పించుకుంటూ -
‘‘నా మాటలు రుచించవేనీకు! నీకై నీవే తెలుసుకుంటే తప్ప....!’’
‘‘ఇది కంప్యూటర్ యుగం. పాత ఆచారాలకు ఫుల్‌స్టాపు పెట్టు!... ఆ! మరచాను! రేపు కృష్ణ వస్తున్నాడు!’’ అంది.
‘‘ఇంకే ఈ రాత్రంతా తీయని కలలుగను’’ అంది లత
కృష్ణ ఎప్పుడు విజయవాడ వచ్చినా కృష్ణానది ఒడ్డున అలైక్యని కలిసేవాడు. వినోద్ అలైక్యలు కృష్ణ కోసం ఎదురుచూస్తున్నారు.
‘‘అమ్మా! అలైక్యా! పునర్జన్మ అనేది ఉంటే నీ గారాల బిడ్డగా పుట్టి గోరు ముద్దలు తినిపించే తల్లిలా నిన్ను చూడాలని ఉంది!’’ అలైక్య కళ్ళలోకి అమాయకంగా చూస్తూ అన్నాడు వినోద్.
‘‘నిజం, నీవు అప్పుడప్పుడు చిన్నపిల్లాడిలా అనిపిస్తావన్నయ్యా’’ అంది అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణ అలైక్య మాటలు విని ఆగాడు. చీకటిగా ఉన్నందువల్ల అలైక్య, వినోద్‌లు కృష్ణను గమనించలేదు. కృష్ణ వాళ్ళ దగ్గరికి వెళ్ళటమా మానటమా అని ఆలోచిస్తూ మరికొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ యిద్దరు ఫ్రెండ్స్ మాటలు వింటాడు.
‘‘గిరీ! నీ ఉద్దేశంలో బంధాలు అనుబంధాలకి అర్ధం లేదంటావా!
‘‘హరీ! అర్ధం ఉంది. అక్క, తమ్ముడు అన్న, చెల్లెలు అని చెప్పుకుంటూ ఏకాంత ప్రదేశాల్లో సమావేశమవటం ఒక్క ప్రేయసీ ప్రియులకు తప్ప సోదరభావం అంటే సమాజం నమ్మదు!’’
‘‘నీవు చాలా దారుణంగా మాట్లాడుతున్నావ్ గిరీ!’’
‘‘చూడు హరీ! రోజా పూలు పొదలో ఉన్నంత వరకే అందంగా ఉంటాయి! పొదనుండి బయటపడిన మరుక్షణం...’’
కృష్ణ యిక వాళ్ళ మాటలు వినదల్చుకోలేదు! అలైక్య వినోద్‌ను కలుసుకోకుండానే వెళ్లిపోయాడు.
కృష్ణ విజయవాడకు వస్తున్నానని ఎందుకు రానట్లు! వస్తే తనని తప్పక కలిసేవాడు! అలా జరగలేదంటే ఏదో బలవత్తరమైన కారణం ఉండాలి! ఆలోచిస్తూ హాల్లోకి వచ్చింది అలైక్య, ఎప్పుడొచ్చిందో హాల్లో టి.వి. చూస్తుంది లత! అలైక్యని చూస్తూనే -
‘‘నీకో లెటర్ మా ఇంటినుండి వస్తుంటే పోస్ట్‌మాన్ నీకిమ్మని ఇచ్చాడు!’’ అంటూ యిచ్చింది.
‘‘నీవే చదువు నాకభ్యంతరం లేదు!’’ అంది అలైక్య లత చదవసాగింది.
అలైక్య! మీ అన్నా చెల్లెళ్ళు యిచ్చిపుచ్చుకొనే ప్రేమ వ్యవహారాన్ని మొన్న కృష్ణానది దగ్గర చూశాను! సమాజం నైజం గమనించాను. నాలో నేను తర్కించుకున్నాను! పర్యవసానంగా నేనో నిర్ణయానికి వచ్చాను! చదవటం ఆపి అలైక్య వైపు చూసింది. ఆమె కళ్ళలో నీళ్ళు తిరగటం గమనించింది. లత అలైక్య భుజంపై చేయివేసి ఏడవకన్నట్లుగా తలూపింది.
‘‘అయామ్ ఓకే. కంటిన్యూ! అంది లత మరలా చదవసాగింది.
‘‘నన్ను మనసులేని మరమనిషి అనుకో! కాని సభ్య సమాజాన్ని కాదని ఒక్క అడుగు ముందుకు వేయలేను! నీ ఆశలు ఆశయాలేంటో అలా నడుచుకో నీ కొంగు పట్టుకొని వెనకాల నడిచే బాలుడిగా నన్ను ఊహించుకోకు! నేటి నుండి నీకు గుడ్‌బై! నీకు ఏమికాని కృష్ణ!’’
వెక్కి వెక్కి ఏడుస్తున్న అలైక్యని ఎలా ఊరడించాలో తెలియలేదు లతకి!
అలైక్య గతంలోకి వెళ్ళింది.
ఆరోజు వినోద్ బస్‌లో వెళ్తుంటే వీడ్కోలు చెప్పి యింటికి వెళ్ళేందుకు వెనుదిరిగింది. ఆమెకెదురుగా ఇద్దరు వచ్చారు.
‘‘హలో మేడం! ఆ బస్‌లో వెళ్ళిన వ్యక్తి మీ బంధువా!’’ ఒకతను అన్నాడు.
‘‘మా అన్న!’’ అంది తను
అతను పెద్దగా నవ్వి -
‘‘అన్న.. అతను అన్న అంటూంది!’’ అన్నాడు రెండవ వ్యక్తితో..
‘‘అన్న అంటే ఎవరో తెలుసా!’’ మరలా అన్నాడు ‘‘ ఎవరు?’’ రెండవ వ్యక్తి అన్నాడు
‘‘అ... అంటే అన్ని విధాలా న అంటే నచ్చిన వాడు అని అర్ధం!’’
‘‘దయచేసి అలా మాట్లాడకండి!’’ అంది అలేక్య
‘‘ఒకసారి కాదు వందసార్లు అంటాం! ఏం!’’ రెండవ వ్యక్తి అన్నాడు.
అంతలో అక్కడికి వచ్చి ఈ తతంగాన్ని చూస్తున్న కృష్ణ వాళ్ళతో -
‘‘తప్పు! అలా మాట్లాడకండి!’’ అన్నాడు
‘‘ ఓహో, నువ్వు ఇంకో అన్నవా!’’
కృష్ణ వైపు ఎగాదిగా చూసి అన్నాడు, కృష్ణ అతని చెంపమీద ఈడ్చికొట్టాడు.
‘‘వాళ్ళతో మాటలేంటి బాబూ! పోలీసులకు పట్టివ్వక, చుట్టూ చేరిన వాళ్ళలో అన్నాడో ముసలాయన తలా ఒక మాట మాట్లాడుతుంటే వాళ్ళిద్దరూ తలదించుకొని వెళ్ళిపోయారు.
అలైక్య ఆలోచనలకంతరాయం కలిగిస్తూ
‘‘కమ్! అలైక్య! ఎక్కడున్నావ్!’’ అంది లత!
‘‘చివరిసారిగా తీపి గుర్తులను మననం చేసుకుంటున్నాను! నీకు తెలుసా లతా! ఒకరోజు పార్కులో కూర్చొని ఉన్నాను! కృష్ణ చప్పుడు చేయకుండా వెనకగా వచ్చి నా కళ్ళు మూసాడు! ఈ చేతులు ఇంత చల్లగా ఉన్నాయంటే అవి నా హృదయ వీణనిమీటే మధురహస్తాలు అన్నాను. కృష్ణ చేతులు తీసి ‘అలై’ నేనిక్కడికి వస్తానని తెలియదు కదా! అన్నాడు అప్పుడు నేనేమన్నానో తెలుసా!
‘‘నీవు ఎదుట లేకున్నా నాలోనే ఉన్నావు! నిన్ను మరచిందెప్పుడు!’’ అప్పుడు కృష్ణ -
‘‘అలైక్యు!’’ అన్నాడు
‘‘ప్రొనౌనేషన్ సరిగా లేదు ! నా పేరు అలైక్య’’! అన్నాను.
‘‘నేను సరిగానే అన్నాను! నీవు వినటంలోనే పొరపాటు! ఐ ...లైక్...యు!’’ అన్నాడు.
యిద్దరం మనసారా నవ్వుకున్నాం! నవ్వు ఆపి లత వైపు చూసింది.
‘‘వింటున్నాను! ఏం జరిగింది?’’
‘‘ఓసారి దీపు వచ్చాడు! ఈ బీద తమ్ముడ్ని మరచిపోవు కదూ!’’ అన్నాడు.
‘‘మరచిపోవటమా! నన్ను నేను మరచినపుడు చెప్పలేను!’’ అని నేనంటూంటే అప్పుడే వచ్చిన కృష్ణ -
‘‘ఎవర్ని మరచిపోవటం! ననే్ననా!’’ అన్నాడు
‘‘కాదు! నన్ను నేను!’’ అని నవ్వాను
‘‘మీ మధ్య నేనెందుకు! మరలా వస్తా! అని దీపు వెళ్తుంటే -
‘‘మేము గుసగుసలు మాట్లాడే సమయంలో మాత్రం రాకు!’’ అన్న కృష్ణ మాటలకు దీపుతో మేము నవ్వాం!’’ ఆ తీపి గురుతులు ఎలా మరచి పోతాం లతా! అంది.
కాలగమనంలో రెండు సంవత్సరాలు గడిచాయి! అలైక్య యాంత్రిక జీవనానికి అలవాటు పడింది. మునుపటిలా చలాకీగా కనిపించటంలేదు. లత దీపు వినోద్‌లు కనిపించినా కనిపించకోపోయినా పెద్దగా ఆలోచించటం మానేసింది. తన గదిలో పరధ్యానంగా ఉండడానికి అలవాటు పడింది!
ఒక రోజు తనకు పరిచయమున్న డాక్టర్ హసీనా దగ్గరకు వెళ్ళింది. మాటల్లో ‘‘ఒక పేషెంట్ సీరియస్‌గా ఉన్నాడు! అతనికి నీ బ్లడ్ గ్రూపు సరిపోతుంది!’’ అంది డాక్టర్. అందుకు అలైక్య అంగీకరించింది. బ్లడ్ యిచ్చిన తర్వాత పేషెంట్‌ని చూసింది అతను కృష్ణ!
ప్రమాదం నుండి బయటపడిన కృష్ణ తనకు బ్లడ్ యించ్చింది అలైక్య అని తెలిసి పశ్చాత్తాపంతో అలైక్య యింటికి వెళ్ళాడు.
‘‘నువ్వా! ఎందుకొచ్చావ్?’’ అంటుంది
‘‘సారీ అలైక్య! నేను తొందరపడ్డాను! నిన్ను బాధపెట్టాను’’
‘‘పాస్ట్ రుూజ్ పాస్ట్! యిప్పుడెందుకు వచ్చినట్లు?’’
‘‘నన్ను క్షమించు అలైక్య! తప్పుచేశాను!’’
‘‘ ఎవరు ఎవర్ని క్షమించటాలు ఆదరించటాలు అవసరంలేదు! ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది!’’
‘‘నీ భావాలు అర్ధం చేసుకోలేని మూర్ఖుడ్ని!’’
‘ఆ అలైక్య ఆనాడే పోయింది! ఈ అలైక్యకి కష్టసుఖాలు రెండూ ఒక్కటే! దేనికీ ప్రత్యేకత ఉండదు! వచ్చినపని అయిపోతే వెళ్లొచ్చు!’
‘అలైక్య’
‘తెలుగులోనే చెప్తున్నాను!’
‘నన్ను అర్థంచేసుకో! నేను పూర్తిగా మారాను! నీవు కాదంటే నేను...’
‘ఈ కబుర్లు మరోచోట ప్రారంభించు! దయచేసి వెళ్లిపో!
‘నా మాట...’
‘ఐ సే గెటౌట్! ఈ జన్మలో నీ ముఖం నాకు చూపించవద్దు!’ తలుపు విసురుగా వేసి గడివేస్తుంది!
కాలం తన పని తాను చేసుకుపోతుంది.
ఈమధ్యకాలంలో ఎన్నో మార్పులు! అలైక్య అనారోగ్యం! వైరాగ్యంతో ఆశ్రమంలో చేరి యోగినిలా ధ్యానంలో ఉండడం అలవాటుచేసుకుంది.
ఆరోజు వినోద్ దీపు లతలు అలైక్య వద్దకు వచ్చారు.
‘బాధలు ఎన్ని ఉన్నా ప్రశాంతంగా కనిపిస్తావమ్మా’ యువర్ ది గ్రేట్! అన్నాడు వినోద్
‘ఏనాడు ఏది జరగాలో అది జరిగిపోవాలి! ఇది విధి ధర్మం! విధి రాతని తప్పించలేం! ఈ జన్మకి ఇంతే! ఐయామ్ శాటీజ్‌ఫైడ్!’ మాట్లాడుతున్న అలైక్యకి దగ్గుపొరవచ్చి ఆయాసంతో రొప్పుతూంది.
‘నాట్ ఎట్! యూహావ్ టు స్క్వీజ్‌ది ఎంటైర్ లైఫ్! లత అంది.
‘చావుబ్రతుకుల మధ్య కొట్టుకులాడుతున్న దాన్ని! నాకిప్పుడు బ్రతకాలనే ఆశలేదు’
దీపు ముఖంపై కన్నీటి చారలు కనిపించాయి.
‘నీకేం కాదు! నాకు తెలిసిన మెడికల్ కాలేజి ప్రొఫెసర్ ఉన్నాడు! ఆ డాక్టర్ హస్తవాసి ఎందరో జీవితాల్ని కాపాడింది’ అన్నాడు అప్పుడే వచ్చిన ఆశ్రమం స్వామిజీ!
‘రేపొకసారి హాస్పిటల్‌కి వెళ్లాలమ్మా!’ అన్నాడు మరలా
‘రాలిపోవు పువ్వా నీకు రాగాలెందుకే!’ అనే పాట గుర్తొస్తోంది స్వామీ!’
జీవింతో రాగని రాగాలు సర్వసాధారణం! అంతమాత్రం చేత క్రుంగిపోవడం తప్పమ్మా!’
మీ ఇష్టం!’ అంది
----
అలైక్యని పరీక్షించిన డాక్టర్ మందులు రాసిచ్చి..
‘యువార్ పర్‌ఫెక్ట్‌లీ ఆల్‌రైట్, ఈ మందులు వాడుతూ పీరియాడికల్‌గా నాదగ్గరకు వస్తూ ఉండమ్మా!’ అన్నాడు. బయటికి వచ్చిన తర్వాత లత అడిగింది స్వామిజీని అసలు ప్రాబ్లమ్ ఏమిటని!
‘నథింగ్ ఎడతెగని ఆలోచనలు ఆమెను పేషెంట్‌గా మార్చాయి! ఇంకేం చెప్పను!’ అన్నాడు.
----
లత అలైక్య దగ్గరకెళ్లింది. అలైక్య రోజా చెట్లకు నీళ్లుపోసి పూలను చూస్తూ కూర్చుంది. లత కూడా పక్కనే కూర్చుంది.
లత! ఈ పూలు రోజూ నన్నుచూసి ఆనందంతో నవ్వుతాయి! నాకేదో ఊరట కలిగించేలా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. నేను సంతోషంగా ఉన్నప్పుడు పిల్లగాలులకి అలా అలా ఊగుతుంటే అవి డాన్స్ చేస్తున్నట్లు అనిపిస్తుంది! మొక్కలవైపు తదేకంగా చూస్తూ అంది.
‘అలైక్య! నాకున్న ఒకేఒక్క ఫ్రెండ్ నీవేనే! నీకేమైనా అయితే... గాద్గికంగా అంటుంది. చిన్నగా నిట్టూర్పు విడిచి.
ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా కావచ్చు! అందుకు మనం డీలా పడిపోకూడదు! నిబ్బరంగా దైవ నిర్ణయాన్ని ఆహ్లాదంగా ఆహ్వానించాలి! అయినా డాక్టర్ నాకేం రోగం లేదన్నారుగా!’ వేదాంతిలా అంది అలైక్య.
---
‘కృష్ణ ఎప్పుడూ నీగురించి బాధపడుతుంటాడు!’ లత అంది!
‘అతని పేరు నాదగ్గర ఎత్తకు!’ అంది అలైక్య
‘ఏం? మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్‌లో ఏంజోగ్రామ్ చేయించి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నాడనా!’
‘ఏమిటి! నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందా! ఎప్పుడు!’
లత జవాబు ఇవ్వకుండా
‘మీ ఇంటిని జప్తుచేసేందుకు కోర్టువాళ్లు వచ్చినప్పుడు ఆదుకొన్నాడనా!’
‘ఏయ్ లతా! ఏమంటున్నావ్, కోర్టువాళ్లు జప్తుకొచ్చారా! ఎప్పుడు?’
లేక నీ మానసిక స్థితి బాగులేదని డాక్టర్‌తో మాట్లాడి...!’
‘లతా’
‘అవును! నీకివన్నీ తెలిస్తే నీ ఆరోగ్యం క్షీణిస్తుందని కృష్ణ అన్నాడు. అంతేకాదు! ఆంటీ... అంటే మీ అమ్మ కూడా కృష్ణని సమర్ధించింది! తప్పుచేయని మనిషి ఉండడు! అయినా కృష్ణ ఏం తప్పుచేశాడు? అతని స్థానంలో ఎవరున్నా అలాగే చేసేవారు! తన తప్పు తెలుసుకుని క్షమించమని వచ్చినవాడ్ని ‘గెట్‌ఔట్’ అంటావా!’
‘లతా.. లతా!’ కన్నీరు చెంపల మీదుగా జారుతుంది.
‘అలైక్య! చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం’
అలైక్య వెక్కివెక్కి ఏడుస్తోంది
‘పిచ్చిదానా నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నావా, వయసు నవ్వుతోంది! ఇప్పటికైనా జ్ఞానోదయమైంది!’ అంది లత.
‘అంతేకాదు! మనసు కూడా కృష్ణ కావాలంటోంది!’ అంటూ వచ్చాడు స్వామి.
వెనె్నల విరబూసినట్లు నవ్వింది అలైక్య!
ఎదురుగా కృష్ణ అలైక్యని చూస్తూ కనిపించాడు.

- గుర్రాల రమణయ్య
చరవాణి - 9963921943
స్పందన

వాస్తవ కథలా మోసపోకు మిత్రమా..!
మోసపోకు మిత్రమా కథను మెరుపులో చదువుతున్నంత సేపు ఈ కథ ఎక్కడో జరిగినట్లు అనిపించింది. రచయిత కటారి రామయ్య గారు జరిగిన కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి పాఠకులు అందించినట్లు అనిపించింది. కథ మొదలైనప్పటి నుంచి చివరి వరకు సంభాషణలు అన్నీ బాగా కుదిరాయి. కథలోని పాత్రలు వాస్తవానికి దగ్గరగా వున్నాయి. అయితే ఉద్యోగం నిమిత్తం పక్క ఊరికి వెళ్లడం, అక్కడ ఓ అమ్మాయిని ఇష్టపడడం, ఆ అమ్మాయి అందం వెనుక ఘోరనిజం దాగడం, దాంతో అమ్మాయి చనిపోవడం వంటి పరిణామాలతో కథను మలిచిన విధం బాగుంది. అయితే కథలో అమ్మాయి చనిపోవడం తప్ప మరేవిధమైన ట్విస్టు లేకుండా సాదాసీదాగా సాగింది. అయితే ఒక్కవిషయం రచయిత చక్కగా చెప్పాడు అదేమిటంటే కనిపించే అందాల వెనుక ముళ్లలాంటి నిజాలు దాగి వుంటాయి అని. మంచి కథను అందించిన రచయితకు ధన్యవాదములు.
- అయితా హేమచందర్, నెల్లూరు
- ప్రసాదవర్మ, శ్రీకాళహస్తి

తల్లిదండ్రుల కవిత బాగుంది
మెరుపులో షారోన్ బేగం గారు రాసిన తల్లిదండ్రులు కవిత ఆలోచింపజేసేదిలా సాగింది. తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మనం వాళ్లకు ఏమిచేసినా వాళ్ల రుణం తీరదు. కవిత మొదటి నుంచి చివర వరకు చాలా గొప్ప పదాలతో అర్ధవంతంగా సాగింది.
- శ్యామలమ్మ, గుంటబడి, నెల్లూరు
- విల్లుపాక సిద్దయ్యాచారి, అద్దంకి

వింతరోధన గొప్పగా వుంది
పచ్చా పెంచలయ్య గారు ఆవేదనతో రాసిన వింతరోధన కవిత చాలా బాగుంది. మనం చేసే చెడ్డపనుల గురించి మన మనస్సు మనకు చెబుతూనే వుంటుంది, హెచ్చరిస్తూనే వుంటుంది. అయినా మనం విషమెక్కిన కళ్లతో ఆ తప్పులను చేస్తూనే వున్నాం. మన హృదయం వింతరోధన చేస్తూనే వుంటుంది. ఎంతో గొప్ప కవితను అందించిన పచ్చా పెంచలయ్య గారికి అభినందనలు.
- సూరిపోగు సరోజనమ్మ, మదనపల్లె
- చివుకుల బ్రహ్మాజీ, కావలి

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

బాలల కవిత

అమ్మభాష కావాలి
కడుపులోనే కదన కుతూహలుడై
పద్మవ్యూహ ప్రవేశం నేర్చాడు అభిమన్యుడు
కడుపులో పడకుండానే కేక పెట్టించి
కానె్వంట్ దగ్గర కన్నవాళ్లచే క్యూ కట్టించాడు నేటి వీరుడు
అద్ద్భోష కోసం అగచాట్లు పడుతూ
అమ్మనోటి వెంట కూడా వినని అమ్మభాషను
అస్థిపంజరాన్ని చేసి జమ్మిచెట్టు ఎక్కించాడు
బాపూజీ అంటే కర్రపట్టుకుని వంగిన తాతయ్య
చాచాజీ అంటే పావురాన్ని మోసే
టోపీ బాబయ్య
బాలల దినోత్సవం అంటే సెలవుదినం
ఇంతకు మించిన జ్ఞానం బహుశ శూన్యం
అందరికీ విద్యయని అరుస్తున్నాం
అంగట్లో పసివాడిని కూలీ చేస్తున్నాం
అటెండెన్స్‌లో వందమందిని చూపిస్తున్నాం
అందినంత ఆహారాన్ని స్వాహా చేస్తున్నాం
బాలకార్మిక చట్టాన్ని పోస్టర్ల మీద అద్ది
బాలల చేతనే వాటిని పేస్టు చేయిస్తున్నాం
నేతలమై గద్దెలెక్కి నీతులు చెబుతున్నాం
నెహ్రూజీ కన్న కలలని నీరుగారుస్తున్నాం
అరువుభాషకు హారతి పడుతున్నాం
అమ్మభాషకు ఆయువు తీస్తున్నాం
ఇకనైనా మేలుకోండి
పసిచేతులకు పలుగుపార యివ్వకండి
పలక బలపంతో బ్రతుకులు దిద్దండి
అమ్మభాష కావాలని నిరంతరం పోరాడండి
ఆ పిల్లల దేవుడి ఆత్మకు శాంతి చేకూర్చండి..!

- శింగరాజు శ్రీనివాసరావు
చరవాణి : 90520 48706

రేపటి పౌరులం
భారతరత్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ
ఆశయాల ఒడిలో...
ఒకే జాతి కొమ్మలమై
ఒకే కొమ్మ రెమ్మలమై
విరిసీవిరియని పసిమొగ్గలమై
వికసిస్తున్న గులాబి చిరునవ్వులమై
ధన్యభూమి పుత్రులమై
ధైర్యసాహసాలలో ధీరులమై
మాతృదేశ ప్రేమికులమై
బాధ్యతగల సేవకులమై
న్యాయానికి సాక్షులమై
అన్యాయాన్ని ఎదిరించే ఫిరంగులమై
నవశక స్థాపన సారథులమై
యువభారత నిర్మాణ పునాదులమై
ఉదయసంధ్యా వెలుగులమై
ఉద్యమబాటకు అడుగులమై
భరతమాత ముద్దుబిడ్డలమై
బాధ్యతగల భావిపౌరులమై
భావిభారత బాలలమై
చాచానెహ్రూ వారసులమై
ప్రపంచంలో భారతదేశాన్ని
అగ్రగామిగా నిలిపే
రేపటి పౌరులం..!

- హస్తి మోహన్‌రాజు,
చరవాణి : 8008511316

జ్ఞాపకాల వీచికలు
నీ హృదయ సరోవరం నుండి
ఉబికిన ప్రేమతరంగాలు
నా ఎదను తాకి
నన్ను పరవశాన ముంచిన ఆ క్షణం
జీవితంలో అనుకోని అనుభూతికి
లోనైన అపురూప జ్ఞాపకం

నీ కమల నయనాల నుండి
కదలిన ప్రేమ వీక్షణాలు
నా కనుపాపలను
పరవశాన ముంచిన ఆ క్షణం
కలలోనైనా కనని అనుభూతికి
లోనైన మధురమైన తీపి జ్ఞాపకం

నీ గళస్వరం
పలికిన ప్రేమసరాగాలు
నా వీనుల తంత్రులు మీటుతూ
పరవశాన ముంచిన ఆ క్షణం
అనుకోని ఆనందానికి
లోనైన అపురూప జ్ఞాపకం

- కైపు ఆదిశేషారెడ్డి
చరవాణి : 9985714281

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

email: merupunlr@andhrabhoomi.net

- గుర్రాల రమణయ్య