రాజమండ్రి

అసలైన విద్య (కథానిక )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏరా! శ్రీకాంత్ ఎప్పుడొచ్చావ్?’ కొడుకుని చాలా రోజులకి చూస్తూ ఆనందంగా అడిగాడు రాఘవరావు. బయట నుండి వస్తున్నట్టున్నారాయన. ‘బాబు గారూ! మంచినీళ్లు’ అంటూ అందించింది గంగ. ‘నీ పిహెచ్‌డి అయిపోయింది కదా! మరిప్పుడు ఏం చేద్దామని?’ అడిగారాయన. ‘నాన్నగారూ! నాకు విదేశాలు వెళ్లి ఇంకా ఇంకా చదవాలని ఏంలేదు. లక్షలు లక్షలు సంపాదించాలని కూడా లేదు. నాకు, నా పిల్లలకు కూడా సరిపడినంత మీరు సంపాదించారు, ఇంకా సంపాదిస్తున్నారు. అలా అని మీ వారసునిగా మన కంపెనీల్లో కూడా జాయిన్ అవ్వాలని కూడా లేదు’ వౌనంగా కొడుకు మాటలు వింటున్నారాయన. ఈలోగా కాఫీలు పుచ్చుకొని శ్రీకాంత్ తల్లి పద్మ వచ్చింది.
‘ఏమండీ! వాడికి అందర్లాగా ఇంజినీరింగ్, మేనేజ్‌మెంటు కోర్సులవీ సరిపడవని ముందే చెప్పాడు. అంతా మామగారి గీతోపదేశాలనే చిలక పలుకుల్లా అప్పచెపుతున్నాడు. చివరాఖరికి వీడి గతి ఏమవుతుందోనని భయంగా ఉందండీ’ అంది గాబరాగా పద్మ.
‘అమ్మా! నేను కావాలనే ప్రభుత్వ పాఠశాలలో చదివాను. ప్రభుత్వ కళాశాలలో చదివాను. నాకు తెలుగు భాషంటే మక్కువ కలిగేలా తాతగారు చేశారు. తాతగారిని అనవసరంగా ఆడిపోసుకోకు. వారి సలహాలతోనే నేను వార్దా విశ్వవిద్యాలయంలో గాంధీయిజం మీద పిహెచ్‌డి చేసి వచ్చాను. మరి నేను చదివిన చదువును ఆచరణలో పెట్టాలనుకుంటున్నాను’ అన్నాడు శ్రీకాంత్. ‘ఏరా! అంతా నీ ఇష్టమేనా? మాకు నీమీదేమి ఆశలుండవనుకున్నావా? అన్నయ్యేమో ఇంజనీర్‌గా అమెరికాలో లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ మూడేళ్లలో వాడు పంపిన డబ్బుతో మీ నాన్నగారు ఓ ఫ్లాట్ కొన్నారు. వాడికి లక్షల కట్నంతో పిల్లనిస్తామని వెంట పడుతున్నారు. మరి నువ్వు గాంధీ గారంటావ్! పేద పిల్లలనుద్ధరించాలంటావ్! వాళ్లకి చదువు చెప్పి పైకి తీసుకొస్తే నీకు ఆత్మ తృప్తంటావ్! మరివన్నీ చేయాలన్నా డబ్బు కావాలి కదా’ అంది ఆవేశంగా పద్మ. ‘అమ్మా! నేను ఆచరించి చూపిస్తా కదా! నన్ను, నా ఆశయాలను అర్థం చేసుకొనే అమ్మాయిలుండకపోరు!’ అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ!
‘సరే! ఈ వాదనలకి అంతే ఉండదు. టిఫిన్ పెట్టు పద్మా! కంపెనీకి వెళ్లాలి’ అన్నారు రాఘవరావు. తండ్రీ కొడుకులు కలిసి టిఫిన్ తిన్నారు. గంగ ఓ పనె్నండేళ్ల పిల్ల. అటు, ఇటు తిరుగుతూ అలమార్లవీ సర్దుతూ, పద్మకు అవీ ఇవీ అందిస్తూ తిరుగుతోంది. ‘ఎవరమ్మా! ఈ చిన్నపిల్ల. పనులవీ చేస్తోంది? చదువుకొనే ఈడున్న పిల్లలను పనిలో ఎందుకు పెట్టుకున్నావు? వాళ్ల అమ్మానాన్నలని పిలువు. చదివించకుండా ఈ పనుల్లో పెట్టటం ఏమిటి?’ తల్లిని అడిగాడు. ‘సంక్రాంతి పండుగకు ఇక్కడ ఎవరూ పనిసాయం చేయటానికి దొరకలేదు. మన ఊరు కౌలు రైతు రంగన్న కూతురు ఈ గంగ. పండుగకు బట్టలు కొనుక్కోవటానికి తండ్రి వెంట వచ్చింది. నాకు పండుగకు సాయం ఉంటుందని ఇక్కడుంచి వెళ్లమంటే దింపి వెళ్లాడతను.’
‘అమ్మా! తప్పుకదా! చదువుకొనే పిల్లని పండుగ సమయంలో ఇక్కడుంచుకొని పనులు చేయించుకోవడం? కిందటేడాది నీవు రాలేదుకదా! అప్పుడు కూడా ఇలాగే వచ్చి పనులవీ చేసి వెళ్లిందిరా! అందుకే నీకు కొత్తగా ఉంది.’
‘సరే కానీ!’ అంటూ కోపంగా గదిలోకెళ్లాడు శ్రీకాంత్!
‘సాయంత్రం గంగని కాస్సేపు పార్కు, గుడి అది తిప్పి చూపించుకొస్తాను. పని చేసి చేసి అలసిపోయి ఉంటుంది. బయటకెడితే పార్కులో తోటి పిల్లలతో కాస్సేపు గడిపి వస్తుంది’ అన్నాడు తల్లితో. ఏ కళనుందోగానీ పద్మ గంగను బయటకు పంపింది. పెద్ద పార్క్‌కి తీసుకెళ్లాడు. ‘గంగా! నేను ఈ బెంచీ మీద కూర్చుంటాను. నీకు ఎంతసేపు ఆడుకోవాలనిపిస్తే అంత సేపు ఆడుకొని రా!’ అంటూ ఉత్సాహపరిచాడు. లేడిపిల్లలా ఉత్సాహంగా వెళ్లింది పిల్లల దగ్గరకి. ఓ గంటయ్యాక తిరిగొచ్చింది. ఈ బాబు చాలా మంచివారు అనుకుంది గంగ.
‘ఏమైంది గంగా! ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయావు?’
‘బాబూ! కిందటేడాది పండుగకిక్కడే ఉన్నాను. పండుగ ఎలా వచ్చిందో, అలాగే వెళ్లిందని అమ్మ చెప్పింది. నువ్వు లేవుగా! సరదాయే లేదు. ఆడపిల్ల లేకుండా సంక్రాంతి పండుగ ఎట్లా చేసుకుంటాం అని అమ్మ చాలా బాధ పడిందట. ఈసారి కూడా నేను లేనని తమ్ముడు పండుగ చేసుకోనంటాడేమో! దాంతో అమ్మ బాధపడుతుంది. నా కోసం ఒంటరివాడయ్యాడు నా తమ్ముడు’ ఎంతో బాధతో, దిగులుతో చెప్పింది గంగ.
‘ఒక్క రెండురోజులు పండుగకు నన్ను ఊరు పంపిస్తే బాగుండును. పండుగయ్యాక అమ్మగార్కి బోలెడు పనులు చేసి పెడతాను’ ఉత్సాహంగా అంది గంగ.
ఇంటికెళ్లాక అమ్మ, నాన్నతో ఈ విషయం మాట్లాడాలనుకున్నాడు శ్రీకాంత్. రాత్రి భోజనాలయ్యాక అమ్మవాళ్లతో మాట్లాడుతూ, ‘నాన్నా! ఈసారి మనమంతా, మన ఊరెళ్లి నానమ్మ, తాతగారు, అత్తవాళ్లతో కలసి సంక్రాంతి పండుగ జరుపుకుందామా’ అడిగాడు. దానికి సమాధానంగా ‘ఆ పల్లెటూళ్లో ఏముంటుందిరా? పేడ కంపు, కోడిపందాలు ఇవేగా! మనింట్లో సంక్రాంతికి నీవెపుడూ ఉండవు. అందుకే నీకేం తెలియటంలేదు. ఈసారి చూస్తావుగా! ఎంత బాగుంటుందో’ అంది. ఇక వాళ్ల ఉద్దేశ్యం అర్ధమయ్యింది. ‘సరే చూద్దాం!’ ఇక గుడ్‌నైట్ చెప్పి తన గదిలోకెళ్లి పడుకొన్నాడు.
తెల్లవారుజామున ఎవరో లేపినట్లనిపించి లేచింది గంగ. ఎదురుగా శ్రీకాంత్! ‘గంగా త్వరగా స్నానమది చేసి రెడీ అవ్వు. మనం మీ ఊరు వెళుతున్నాం’ అన్నాడు. ‘నిజంగానా బాబూ!’ సంతోషంగా అడిగింది గంగ. ‘అమ్మగారూ! వెళ్లమన్నారా? ఆ! వెళ్లమన్నారు! త్వరగా రెడీ అవ్వు’ అన్నాడు. పదంటే పది నిముషాలలో రెడీ అయ్యి బ్యాగ్ తీసుకొని హాల్లోకొచ్చింది. ఈ హడావిడికి పద్మ లేచింది. ‘శ్రీకాంత్! ఏం చేస్తున్నావ్! గంగని ఎక్కడకి తీసుకెడ్తున్నావ్? అది బ్యాగ్ కూడా సర్దుకొని వచ్చింది’ కోపంగా అరచిందామె.
‘అమ్మా! రాత్రి మీతో వాదించటం ఎందుకని ఊరుకొన్నాను. గంగ అడపిల్ల. సంక్రాంతి పండుగ ఆడ పిల్లల పండుగ. వాళ్లమ్మకి దూరం చేసి పండుగపూట మనింట్లో పనుల పేరు చెప్పి బాధపెట్టటం నాకు తప్పుగా అనిపించింది. వాళ్ల వాళ్లు పిల్ల కోసం ఎంత బాధపడుతుంటారు. ఆ చిన్నపిల్లకి అమ్మానాన్న, తమ్ముడితో తన ఇంట్లో పండుగ చేసుకోవాలని ఉండదా? ఒక్కసారి ఆలోచించు. రేపు భోగి! అందుకే ఈరోజు నేను కూడా గంగను వెంట పెట్టుకొని నానమ్మ వాళ్లతో మన ఊర్లో పండుగ జరుపుకోవాలని బయలుదేరుతున్నాను. మీరిద్దరూ రేపన్నా బయలుదేరి రండి!’ అని గబగబా గంగ చెయ్యి పట్టుకొని బయటకెళ్లాడు శ్రీకాంత్! షాక్ తిన్నట్టుగా చూస్తుండిపోయింది కొడుకు మాటలకి పద్మ!
ఉరమని ఉరుములా వచ్చిన మనవడిని చూసి శ్రీకాంత్ నానమ్మ, తాతగారు చాలా ఆనందించారు. ‘ఏరా! గుజరాత్ నుండి ఎప్పుడొచ్చావ్? ఏంటి భవిష్యత్ ప్రణాళికలు, మీ అమ్మానాన్న ఏమంటున్నారు? ప్రశ్నల వర్షం తాతగారి నుండి. నవ్వుతూ శ్రీకాంత్ అన్నాడు ‘తాతగారూ! ముందు ఈ గంగని వాళ్లింటి దగ్గర దింపేసి వస్తాను’
‘ఏమ్మా! ఏంటి సంగతి’ అడిగారు గంగని తాతగారు!
‘తాతగారూ! ఈ బాబు నన్ను పండుగకి నన్ను సిటీ నుండి పండుగ కోసం తీసుకొచ్చారు’ అంటూ తూనీగలా తనింటికి తుర్రుమంటూ పరుగెత్తింది.
భోజనాలు చేస్తూ, ‘నానమ్మా! అమ్మవాళ్లు కిందటి ఏడాది సంక్రాంతికి ఇక్కడికి రాకుండా అక్కడే జరుపుకున్నారు కదా! అందుకే నేను ఈసారి అందరం కలసి జరుపుకోవాలని మీ ఆనందాన్ని పెంచాలని ముందే వచ్చాను. మన గొప్పల కోసం, ఆడంబరాల కోసం మరో ఇంటి ఆనందాలను దోచుకోవటం ఓ విధమైన దోపిడీ కిందకు వస్తుంది కదా అనిపించింది. ఇక నేను చేయబోయే పనుల గురించి మీకు వివరంగా చెప్తాను. భోజనాలు పూర్తయ్యాక వివరంగా మాట్లాడుకుందాం’ అన్నాడు శ్రీకాంత్.
ముందుగా ఈ ఊర్లో ఎన్ని స్కూళ్లు ఉంటే అన్ని స్కూళ్లలో ఓ గంట నాకు తెలిసిన, నేర్చుకొన్న మంచి విషయాలను కథల రూపంగా చెప్తాను. అలా పిల్లలందరితో పాటు పెద్దలకు వయోజన విద్య, నీతి కథలు వాళ్ల సమస్యలు దూరం చేసేవి సిడిల ద్వారా దృశ్యం వేసి సినిమాలా చూపిస్తూ వాళ్లెంచుకొన్న తప్పుడు మార్గాల ద్వారా జీవితంలో ఏమేమి నష్టపోతున్నారో చెప్పాలని ఉంది. ఇక ప్రతి ఆదివారం జైలర్ గారి పర్మిషన్ తీసుకొని వారికి జీవితం ఎంత విలువైంది, కోపం, క్షణికావేశం ద్వారా కుటుంబం యావత్తూ ఎలా కష్టాలను సుడిగుండాలలో చిక్కుకొంటున్నది, దాని నుండి ఎలా బయటపడాలో సైనికుల ద్వారా మనం ఎంత భద్రంగా ఉన్నామో, అలాగే దొంగలు, హంతకులు లేని ఊళ్లల్లో భద్రంగా నిద్రపోవాలంటే ఎలా ఉండాలో అన్ని నేర్పించాలనేది నా కోరిక.
కొన్నికొన్ని గొప్ప త్యాగశీలులైన వ్యక్తుల కథలు, రామాయణ, భారత కథలు వీటిని మీరు నాకు ఓ 50 కథలు తయారుచేసి ఇస్తే వాటిని దృశ్యరూపకాలుగా జైల్లో ప్రదర్శించాలి. దీనికిగాను నిరుద్యోగులైన వారికి నేను నెలకింత జీతంలా ఇచ్చి నటింపచేస్తూ వారికి ఉపాధి కల్పిస్తూ సంస్కరణ దిశగా ముందడుగు వేయించాలనుకుంటున్నాను.
ఈ పనులన్నింటికి మీ సపోర్టు కావాలి, ధనసాయం కావాలి, మీరేమంటారు?’
‘నీకెందుకా బాధ? నేను గాంధీగారి బాటలో నడిచాను! నీవు అదే బాటలో నడుస్తానంటే కాదని ఎందుకంటాను? కౌలుడబ్బు2సగం నీకే ఇస్తాను ఈసారి నుండి. నీకు డబ్బు అవసరపడుతుంది అవన్నీ చేయాలంటే. మీ నాన్న ఏమీ అనడు? నేనంటే ఆ మాత్రం భయం ఉందిలే’ అంటూ శ్రీకాంత్‌కు భరోసా ఇచ్చాడు తాతయ్య... నీ ఆశయాలకు తగ్గవారిని ఒక బృందంగా చేసుకొని ఒక్క ఊరుని ఒకొక్కరు ప్రక్షాళనా దిశగా ప్రయత్నాలు చేయండి. మీకు ఆ ఊరివాళ్లే వసతి, భోజనం కల్పిస్తారు. ముందడుగు వెయ్యి! ఆలోచనలు, ఆచరణలు అదృష్టాన్ని నిర్మిస్తాయి. ప్రతి వ్యక్తీ మారితేనే సమాజం మారుతుంది’ అన్నారు.
‘అందుకే శీల నిర్మాణం చేసే నిజమైన విద్య అందిస్తానందరికి, దీవించండి’ అన్నాడు శ్రీకాంత్!
- ఉప్పులూరి శైలజ, రాజమహేంద్రవరం

పుస్తక సమీక్ష

‘పృథ్వీ’ బిగిని తెలిపే
‘నడక సడలిన వేళ’

ప్రతులకు:
పి. ఉషారాణి
3-868, ఎం.జి.వీధి,
రామకృష్ణానగర్, రాజమహేంద్రవరం

ఆరోగ్యకరమైన మనిషికి కాని సమాజానికి కాని సూచికగా నిలిచే పదం నడక. సజావుతనాన్ని చెప్పే చక్కని పదమాధుర్యం నడక. సమాజ ప్రగతిని కాని, మనిషి అభివృద్ధిని కాని క్రమానుగతితో ముందుకుపోయేది ‘నడక’. ఆ ‘నడక సడలిన వేళ’2 అంటూ యస్సార్ పృథ్వీ రాసిన దీర్ఘకవిత ఈ పుస్తకం. పృథ్వీపైనే నడక, నడకతోనే పృథ్వీ ఇది. కవి పేరుతో నడిచిన క్రమం, భువిపైనే నడిచే కవి పేరూను. తన ఊహలు తన ఉద్దేశాలు తన ఆలోచనలు తన ఆవేశం అంతా ఆకాశమార్గం నుంచి భూమార్గం పట్టించిన పృథ్వీ కలంలోని భావాలు ఏదో ఒక సంఘటన కవిని పట్టిస్తుంది. అదే తన కవితా వస్తువుకి మూలమవుతుంది. పుట్టిన ప్రతీ జీవి నడకతోనే తన జీవన యానాన్ని ప్రారంభించాలి. ఆ నడకే తోవకు తొలి వేకువ. ఆ నడకే అడుగు చప్పుళ్లను బయల్పరచిన వేదిక. అందుకే అంటారు ‘నా నడక / అది నా ఆరో ప్రాణం / అదే నాకు ఆరని దాహం’ అని. పృథ్వీ అనుభవాలు అనుభూతులుగా మారి అక్షరాలుగా అచ్చయ ఆహ్లాదపరిచిన కవిత్వమే తన నడకకు వెచ్చించిన సమయం. ఇందులో తన నడత మొత్తం దాగుంది. కవికి ఇష్టమైన సూత్రం అంతరంగ మంత్రం నడక. భూమిని కొలిచిన పాదాలు కవిగారివి ఎంత గాఢంగా అంటే ‘నడకతో అనుబంధాన్ని / పెంచుకున్న పాదాలు నావి’ అనటంలోని ఔన్నత్యం అది.
మనిషి ఎదుగుతున్న కొలది ఇష్టాలు మారుతుంటాయి. కొత్తవి వచ్చి చేరుతుంటాయి. అయితే చిన్నతనంలో ఏర్పడిపోయిన ఇష్టం ఆయన అభీష్టం అయిపోయింది. ‘రోజుకి ఇరవై మైళ్లని సునాయాసంగా కొలచిన పాదాలు నావి’ అని ముచ్చటగా చెప్పుకోవడమే కాదు తన నడకలోని ప్రేమను బహిర్గత పరుచుకున్నారు.
‘నడక సడలిన వేళ’ దీర్ఘకవిత ఓ కావ్యంగా రావడానికి కారణం ఓ బైక్ రైడర్. ప్రమాదవశాత్తే జరిగింది, కాని మోటారుసైకిలిస్ట్ తప్పిదం.. పొరపాటునగాని మైకం వల్లగాని జరిగిన చర్య. సువిశాల మార్గాన్ని వదిలి ఒకపక్కగా నడిచిపోయే తన నడకలో ఎంత మాధుర్యం ఉందో తన నడకపై ఎంత మమకారముందో ఆ ప్రమాదం జరగకపోతే మనకు తెలిసేదికాదు. అయితే ప్రతి సంఘటనకు స్పందనగా ప్రమాదాన్ని ఆహ్వానించమని కాదు ఈ సమీక్షకుని ఉద్దేశం. నా నడక వయస్సు / నిక్కచ్చిగా చెప్పాలంటే / నిండుగా ఐదు దశాబ్దాల మీద / ఐదేళ్లెక్కి కూర్చుంది2 అని మనకు తెలిసేదా? చేబోలు చిన్మయ బ్రహ్మంగారి ఆప్యాయత తెలిసేదా? ‘ఎందుకో సైకిలంటే అయిష్టం’2 అన్న సంగతి మనకు తెలిసేది కూడా కాదు. ఓ పార్టీ ఎన్నికల చిహ్నం దాని వల్ల అనుకునేరు అదేమికాదు. వల్లమాలిన భయం ఉండునట్లు తనకి-సైకిలుకి నడుమ దూరాన్ని పెంచింది2 అంతేకాని మరొకటి కాదంటారు. పాఠశాల నుంచే ఆలోచనల అవసరం2 మొదలవుతుంది. కాని ఈయనకెందుకో సైకిల్ అవసరం అన్పించలేదు. సమయాన్ని అధిగమించటానికి సౌఖ్యం చెంత సేదతీరాలనే తపన కలగలేదు సరికదా అందరూ సైకిళ్లమీద విన్యాసాలు చేస్తే హ్యాండిల్ వదిలేసి, కాళ్లు పైకెత్తి రకరకాల ఫీట్లు కుర్రకారు సొత్తు. మిత్రులెంత మంది సైకిల్ మీద నుంచి నేర్చుకునే క్రమంలో కింద పడ్డారో సైకిలు మీదేసుకుని దెబ్బలు తిన్నారో గాని ఆ వైపుకెళ్లకుండా ఒడ్డున పడింది పృథ్వీగారు కదూ!
మానసికంగా, భౌతికంగా అలా ఎక్కడా గాయపడలేదు. లేకపోతే ఇంకా రాటు దేలేవారేమో. మిత్రులు సైకిళ్లతో రోడ్ల మీద వీరవిహారం చేస్తుంటే నా కళ్లు మాత్రం / నడక చక్రాలతో / అలుపెరుగని ఆసక్తితో / నడక విన్యాసాలు చేసేవి2 అంటారు. అది ఆయన దన్నుకీ, దమ్ముకీ గల ధైర్యం. లేదంటే జరిగిన ప్రమాదం నుంచి అంత త్వరగా కోలుకునేవారు కాదు. నడక ఆరోగ్య ప్రదాయిని అని ముందే ఊహించారేమో ఏమోకాని అలవాటు చేసుకొన్నారు. అలా ఆ నడక క్రమంలో ఎన్నో ఎనె్నన్నో ఆలోచనలు, ప్రణాళిక రచనలు చెక్కు చెదరని ఆయన ఆత్మస్థైర్యానికి నడక సడలింది. ఆ వేళను ప్రస్తావిస్తూ నడిచిన క్రమమే దీనిలోని కవితాపాదాలు. పృథ్వీగారి నడక ఎక్కడ సడలిందో ఆ వైనాన్ని తెలుసుకోగోరుతుంటే ఈ పుస్తకం తక్షణం అవసరం. మరి ఆ వైపు దృష్టిపెడితే ఆయన జీవితానే్న కాదు రాజమహేంద్రవరం చరిత్రను ఆనాటి స్థితిగతుల చిత్రణను ఇట్టే పసిగట్టవచ్చు.
ఒక నడక గురించి ఎంత తెలుసుకోవచ్చో అంత విపులత ఈ పుస్తకంలో కన్పిస్తుంది. నిజంగా నడక ఇప్పుడు ఆరోగ్య అవసరం. ఆ దృష్టితో చూస్తే కరగని కొవ్వు గురించి మాత్రమే వక్రిస్తుంది మన దృష్టి. అది కాదు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం తేలని విషయాల సంగతులను తేటపరిచినవి తెలుసుకోవడం అవశ్యంకాదు! ఎన్ని సంగతులు కావాలో అన్ని విషయాలు ఇందులో దాగివున్నాయి. నడుచుకుంటూపోయే మన పృథ్వీగారిలో నడతకు సంబంధించిన అనేక విషయాలు ఇందులో గోచరం కావడమే ఆ విశేషం.
కవి ఇంచుమించుగా సుమారు 14 పుస్తకాలు ప్రచురించిన అనుభవశాలి. ఈసారెందుకో నడక తడబడినట్టు తప్పులు దొర్లటం కనిపించింది. సుకుమారతకు సౌకర్యానుకూలత దోహదమైన వేళ అక్షరం గాయపడితే మనసు కాస్త చివుక్కుమంటుంది. ఆయన చెప్పిన ‘మదిలో పూచిన మాటల పూలు’ అనుభవం కాదు. ఆయన ఆత్మశీలతకు ఆనందానురేకానికి ఆత్మ సంతుష్టత కాగలదు. కవి ఆశావహుల దృక్పథాన్ని తెలుపుతుంది. కవి దృఢసంకల్పాన్ని మద్దతు పలకడమే మన ముందున్న కర్తవ్యం. మరింత మంచి ఉత్తమోత్తమ కవిత్వాన్ని వెలువరిస్తారని కాంక్షిద్దాం.
- రవికాంత్, 9642489244

మనోగీతికలు

చెరువు
చెరువంటే
నేలపై పరచిన వాన మేఘం
గట్టు మీద గడ్డి చిగురు వెలుగు
కలువ పువ్వులతో
ఊరంతా వెనె్నల పంట
చేపల దీపాలతో
నీటిలోపల పూసిన వెనె్నల పుష్పం
బాల్యంలో ఆడిన ఆటలు
నా గుండెలనిండా
జ్ఞాపకాలు కాలంలో కరిగిపోయాయి
పూలచెట్టు కొమ్మలపై
పక్షులు నడకలు ఇంకా
చిగురిస్తున్నాయ్
చెరువంటే అన్నం పెట్టే అమ్మ
బతుకులో కన్నీళ్లను
దాచుకునే బ్యాంక్
నీటిబాతుల కిలకిల దృశ్యాలు
తూనీగల ఇంద్ర ధనస్సు పరిమళం
రంగుల్లో
పిచ్చుకల పాటలు జలం
నిశ్శబ్దంగా వింటోంది
ఎద లోపల ఏదో తెలియని ఆనందం
రంగులపూల నేత్రాలతో
పరిమళాల చినుకు ధారతో
చెరువు నిరంతరం
జనం కోసం బతుకుతోంది
కనుల ముందు వికసించే జలతల్లి
గట్టుచుట్టూ
కొబ్బరి చెట్లు చెరువు తల్లికి రక్షకులు
ఇదంతా పాతకాలం కథ
నేడు
ఆ చెరువు కనిపించడం లేదు
అక్కడ ఇప్పుడు
అపార్ట్‌మెంట్ నిలిచింది
మనిషి స్వార్థానికి ప్రతీకగా

- నల్లా నరసింహమూర్తి, అమలాపురం, చరవాణి: 9247577501‘మనీషి’గా జీవించు
ఎవరు ఆదేశించారని ముందు నడిచే చీమతో
వరుస కడుతోంది అల్పాయుష్క పిపీలిక
గొర్రెల మందని ఎవరు నిర్దేశించారని
నియంత్రణతో అడుగులేస్తోంది అలయక సొలయక.
బిందువుతో శత సహస్ర జ్ఞానం సంతరించుకున్నా
సింధువంత శస్తజ్ఞ్రానిని అనుకుని
అహంతో అహరహం హుంకరించే మనిషికి,
నలుగురి నడకతో శృతి కలపని కుసంస్కార మందమతికి,
సహన సంయమన రహితునికి అంతా అగమ్యగోచరం.
క్రమశిక్షణా విదూరికి మిగిలినది అంధకార బంధురం
ముష్కరత్వంతో నిత్యం పాపపంకిలంలో మునిగి తేలుతూ
మహా పుష్కర స్నానంతో పుణ్యరాశి కూడబెట్టాలనే
తాపత్రయునికి ప్రతిఫలం ‘మహా దుఃఖసాగరం’
అమేయ మేథస్సుతో అలరారే అనాలోచిత మానవా
‘అంతఃకరణ’ను త్రికరణశుద్ధిగా శుద్ధిచెయ్యి
అనంత సంచిత పాపరాశిని సత్కర్మలతో తుడిచెయ్యి
సెంటిమెంటును పగులకొట్టి పక్కనపెట్టు
సెంట్ పర్సంట్ ‘ఆదర్శ మనీషి’గా జీవించు
సదాలోచనకి ఆచరణ పట్టము గట్టు
సదా గోదావరి మాత నీవెక్కడున్నా చక్కగా దీవించు

- చాగంటి సుబ్రహ్మణ్యం
అనపర్తి, తూ.గో. జిల్లా, సెల్ : 95733 86124

కరిగిపోతూ ..
ఆశ్రమాల నిండా జనం
కానీ.. అనుబంధాలు మారిపోతున్నాయి
జనజీవనంలో కనిపించని సమ జీవితం
వాస్తవ రీతికి ఓ వికృత రూపం!
ఇక్కడ అంతా వేగం.. వేగం..
‘మొబైల్’ యుగంలో యాంత్రిక జీవనం
అనుభూతులూ తీపిగురుతులూ కనిపించవు
ఆదరణ కాస్తా వాయుగుండంగా మారితే..!
తనవారు కానరారు
పలకరింపులు వుండవు
అస్తమించే సూరీడు సాక్షిగా
ఇక్కడ క్షణమొక యుగంగా..
భారంగా.. దీనంగా..
జ్ఞాపకాలు అలా
గుర్తుకు తెచ్చుకుంటూ!
కడుపుతీపి అంటూ
తనవారిని దూషించని ఆలోచన
బతుకు బతికించు.. బతుకై అన్నట్లు
దూరమైనా సరే
బిడ్డల క్షేమం కోరే త్యాగం
వృద్ధ జనులు ఎందరో.. ఇంకెందరో
కరిగిపోతున్న
కొవ్వొత్తి రూపంలో
ఎవరో వస్తారని
ఓ ఆశాదీపంలా..!

- పెండెం శ్రీనివాస శివప్రసాద్

email: merupurjy@andhrabhoomi.net

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

- ఉప్పులూరి శైలజ