విజయవాడ

కరిగిపోతూ ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనోగీతికలు

ఆశ్రమాల నిండా జనం
కానీ.. అనుబంధాలు మారిపోతున్నాయి
జనజీవనంలో కనిపించని సమ జీవితం
వాస్తవ రీతికి ఓ వికృత రూపం!
ఇక్కడ అంతా వేగం.. వేగం..
‘మొబైల్’ యుగంలో యాంత్రిక జీవనం
అనుభూతులూ తీపిగురుతులూ కనిపించవు
ఆదరణకాస్తా వాయుగుండంగా మారితే..!
తనవారు కానరారు
పలకరింపులు వుండవు
అస్తమించే సూరీడు సాక్షిగా
ఇక్కడ క్షణమొక యుగంగా..
భారంగా.. దీనంగా..
జ్ఞాపకాలు అలా
గుర్తుకు తెచ్చుకుంటూ!
కడుపుతీపి అంటూ
తనవారిని దూషించని ఆలోచన
బతుకు బతికించు.. బతుకై అన్నట్లు
దూరమైనా సరే
బిడ్డల క్షేమం కోరే త్యాగం
వృద్ధ జనులు ఎందరో.. ఇంకెందరో
కరిగిపోతున్న
కొవ్వొత్తి రూపంలో
ఎవరో వస్తారని
ఓ ఆశాదీపంలా..!

- పెండెం శ్రీనివాస శివప్రసాద్,
మంగళగిరి, గుంటూరు జిల్లా.
మనసు ఘాటు!
కాలంతో పాటు
కవిత్వమై
ప్రవహించే వేళ
ఆకాశం
అకస్మాత్తుగా
మేఘావృతమై
ఫెళఫెళానాదాల
పిడుగులు
ఉరుములూ
మెరుపులూ
మేనిని తాకే
ఝుంఝూమారుత
శీతల పవనాలు!
ఒక్కసారిగా
మారిన ప్రకృతి
పరవశించే సమయాన..
అందరి మదిలో
మెదిలే నేస్తమై
గుర్తుకొస్తావు
వేడివేడిగా
నాలుక చురుక్కుమన్నా
మాతో నువ్వుంటే
ఆ మజాయే వేరు!
నిలువునా పొట్టకోసి
వాము, జిలకర దట్టించి
కాగే నూనెలో వేయించి
వాయి తీసినపుడు
ఘుమఘుమలాడే
రుచులతో
మా అభిరుచులకు తోడై
గుంటూరు ఘాటు
నషాళానికంటుతుంది!
ఇక కొంచెం తేనీరు సేవిస్తే
ఓహో అనిపిస్తావు
ఎందుకో.. ఏమిటో
ఈమధ్య మామీద అలిగి
అందనంత ఎత్తున
కొండెక్కి కూచున్నావు!
నీ ధర తలచుకుంటే
గుండె దడ పెరిగి
ప్రియమైన నిన్ను
మరచిపోవాలనిపిస్తోంది!
ఏంచేస్తాం చెప్పు..
ఇప్పుడు
నిన్ను కొనలేం
ఇష్టంగా తినలేం
అయిష్టంగానే
కాలం వెంట
పయనిస్తూ..
నేనూ,
నా మిత్రులూ!
(కొండెక్కిన మిర్చి ధరకు
మనసు ఘాటెక్కి)

- ఎస్‌ఎం సుభాని,
గుంటూరు.
చరవాణి : 9490776184

నీవు లేని నిశి
సంధ్య కోసం ఎదురుచూపులు లేవు
చందమామ కోసం తపనలూ లేవు
వేడికి చూస్తే ఆకాశాన చుక్కలూ లేవు
ముసిరిన మబ్బుల చికాకుల్లోంచి
చిక్కని చీకటి జారిపోతూనే వుంది

చల్లని గాలి తెమ్మెరలు లేవు
తోటలో వసంతపు అలికిడే లేదు
కీచురాళ్ల రొదలూ.. వుసుళ్లముసుర్లూ లేవు
మూసిన రెప్పల కింద తడిసిపోయిన
చిత్తడి చీకటి కాలిపోతూనే వుంది

ఎప్పటిలా చెవిలో తన గుసగుసలు లేవు
మేనిని అల్లుకున్న బంధమేదీ లేదు
తెరిచి వుంచిన కన్నుల్లో కలలూ లేవు
కదలని హృదయ కవాటాలకసలే
చీకటి పారిపోతూనే వుంది!

- దుగ్గిరాల రాజ్యలక్ష్మి,
చరవాణి: 9440172537

మహావృక్షం మరణ వాంగ్మూలం..

మీ మూర్ఖత్వాన్ని మరెలా చెప్పేది?!

కురుక్షేత్ర యుద్ధంలో తొడలు విరిగి యుద్ధ్భూమిలో పడి వున్న దుర్యోధనుడిలా నేలకూలి ఉన్నాను. నా మొదలు నిర్దాక్షిణ్యంగా నరికి వేశారు. నేడో, రేపో కొమ్మలు, తల కూడా నరికేస్తారేమో! దుర్యోధనుడు తను చేసిన దుష్కార్యాల ఫలితంగా నేలకూలాడు. అలాంటి పాపపు పనులేమీ నేను చేయలేదు. అయినా శిక్షిస్తున్నారు. అయినా నాకేం కోపం లేదు. చివరిసారిగా నేను చెప్పబోయే మాటలు మీరు వినాలని, నా ఆవేదన మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నా చుట్టుపక్కల మద్ది, వేప, గానుగ, రావి లాంటి నా స్నేహితులు ఎందరో ఉన్నారు. అందరికన్నా నేనే నిలువెత్తు పెరిగి ఉన్నానని నిన్నటి వరకు సగర్వంగా నిలబడి ఉండేదాన్ని. నా కొమ్మల కిందుగా కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. కాలువలో బాతులు ఈదులాడుతూ ఉంటాయి. బాతులను పెంచుకునేవారు నా నీడలో గుడారాలు వేసుకుని నివసిస్తున్నారు. నా కొమ్మలకు ఉయ్యాలలు వేసి పిల్లలు ఊగుతూ ఆడుకుంటూ ఉండేవారు. దారినపోయే బాటసారులు ఎండకు చెమటలు కక్కుకుంటూ వచ్చి నా నీడలో కొద్దిసేపు నిలబడి సేదతీరేవారు. తల్లి బిడ్డకు చీరకొంగుతో విసరినట్లు నా కొమ్మలతో ప్రేమగా గాలి వీచేదాన్ని. ఇంతమందికి ఆశ్రయం కల్పిస్తున్నందుకు ఎంతో సంతోషించేదాన్ని. నా గుబురులో కాకులు గూళ్లు పెట్టుకున్నాయి. ఉడతలు అటూ ఇటూ పరుగులెత్తుతూ ఉండేవి. పారిశ్రామీకరణ ఇంకా మా ఊరిదాకా పాకలేదు కాబట్టి ఈ మాత్రమైనా ఆశ్రయం కలిపించ గలుగుతున్నాననే సంతృప్తి ఉండేది. ఇంతక్రితం అయితే చిలుకలు, కోయిలలు, పిచ్చుకలు కూండా ఉండేవి. అవన్నీ ఇప్పుడు ఎక్కడికో వెళ్లిపోయాయి. సెల్‌ఫోన్‌ల నుంచి వచ్చే రేడియేషన్‌కి అవి పారిపోయాయని నా నీడన నిలబడి చెప్పుకుంటున్న వారి మాటల వల్ల అర్థమైంది. మనుషులతో పాటు పశుపక్ష్యాదులకు కూడా ఈ భూమి మీద జీవించే హక్కునిచ్చాడు భగవంతుడు. వాటినన్నింటినీ వెళ్లగొట్టి తానొక్కడే దూరాక్రమణ చేయటం ఎంతవరకు న్యాయమో.. ఈ మానవుడు ఆలోచించటం లేదు. అంతేకాదు, చాలాచోట్ల ఉన్న నా స్నేహితులను కూడా నరికేస్తున్నట్లు వారి రోదనల వల్ల తెలిసింది. రోడ్డు విస్తరణ కోసం, విద్యుత్ తీగలకు అడ్డువస్తున్నామనే నెపంతోనట. ఈ మనుషులెంత తెలివిలేనివాళ్లు? తను కూర్చున్న కొమ్మనే నరుక్కున్న కాళిదాసులా చేస్తున్నారు. నేను, నా మిత్రులు నీడను, పండ్లను ఇవ్వటమే కాదు, మనుషులు జీవించటానికి ముఖ్యావసరమైన ఆక్సిజన్‌ను అందిస్తున్నాం. వాళ్లు విడిచే కార్బన్ డైఆక్సైడ్‌ను పీల్చుకుని వాతావరణంలో వేడి పెరగకుండా నియంత్రిస్తున్నాం. వాళ్లు బతకటానికి కావలసిన నీరు, వర్షం రూపంలో పడేట్లు చేస్తున్నాం. ఎన్నో పక్షులకు, జంతువులకు ఆశ్రయం కల్పిస్తున్నాం. ఇంత మేలు చేస్తున్నా, వాళ్లు నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం వారు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ ఇప్పటికే పెరిగి పెద్దయిన మమ్మల్ని మాత్రం రక్షించటం లేదు. బతికున్న మమ్మల్ని రక్షిస్తేనే కదా, మా సంతానం వృద్ధిచెందేది! ఒకప్పుడు చెరువుల నుండి బిందెలతో, కావిళ్లతోనూ నీళ్లు తెచ్చుకుని తాగేవారు. ఇప్పుడు నీళ్లు కొనుక్కుని తాగుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు నీటి కోసం ప్రపంచ యుద్ధాలు కూడా జరుగుతాయి. ఆక్సిజన్ కూడా కొనుక్కోవలసి వస్తుంది. నేను మిమ్మల్ని శపించటం లేదు. బిడ్డలను శపించాలని ఏ తల్లీ అనుకోదు! జరగబోయే పరిణామాలను నివారించుకోమని చెబుతున్నాను. నాయనలారా.. మీరు మమ్మల్ని కాపాడితే మేము మిమ్మల్ని కాపాడుతాం. సుఖంగా ఉండండి. దాహంతో నా లేత చిగుళ్లు వడలిపోతున్నాయి. నా ప్రాణం కడగట్టిపోతోంది. ఇక మాట్లాడలేను. సెలవు!!

(రోడ్డు విస్తరణ కోసం
వందల ఏళ్లనాటి మహా వృక్షాలను
నరికేయటం చూసి వేదనతో..)

- గోనుగుంట మురళీకృష్ణ,
రేపల్లె, గుంటూరు జిల్లా.
చరవాణి : 9701260448

పుస్తక సమీక్ష

వనె్న తగ్గని విప్లవ
కిశోరం ‘్భగత్‌సింగ్’

సెప్టెంబరు అనగానే ఒక ప్రత్యేకత. అది పువ్వులకే కాదు, పుస్తకాలకు అని రుజువు అయ్యింది. ప్రకృతి పరిమళభరితం అవుతుంది పువ్వులతో. సాహితీ ప్రియుల హృదయాల్లో పుస్తకాల విడుదల ఒక నూతన ఉత్తేజాన్నితెస్తుంది. అలాంటి చైతన్యవంతమైన భారత దేశాన్ని ఉద్వేగభరితం చేసిన భగత్‌సింగ్‌పై రచయిత యస్.బి.చౌదరి చేసిన రచన ‘షహీద్ భగత్‌సింగ్’2 కొత్త ఆశల్ని రేపింది.
భగత్‌సింగ్‌పై ఎన్నో పుస్తకాలు, మరెన్నో కథనాలు, ఇంకా సినిమాలు నాటకాలు అవి ఇవీ మరెన్నో వచ్చాయి, వస్తాయి కూడా. రావాలి మరి ఎందుకంటే దేశభక్తి రాన్రాను కొరవడుతున్న పరిస్థితుల్లోకి వెళ్లిపోతుంది దేశం. దేశభక్తి క్రికెట్ ఆటలో ఒళ్లు విరుచుకుని పరుగెడుతుంది. నాలుగు బంతులు, ఆరు పరుగుల తేడాతో పాక్‌మీద గెలిస్తే చాలు జాతీయ జెండా బుగ్గల మీద, చెంపలమీద ముద్రలేసుకుని, బైక్‌లమీద ఊగిపోతూ కేరింతలు కొట్టే యువత అది దేశభక్తి అనుకుంటుంది. రహదారుల అంచుల చెంత హోరెత్తించే పాటల మధ్య దీనాతి దీనంగా దయామయపు చూపులకు చిక్కి సెల్యూట్ చేస్తుందని మాత్రం మన యువతకు తెలియజెప్పాలంటే... స్వాతంత్య్రం అంటే ఏమిటోనే కాదు, ఎలా సిద్ధించిందో, ఎంత రక్తం చిమ్మారో, ఎందరు ప్రాణాలు బలి అర్పణ చేశారో తెలియజెప్పాలి.
ఆ ప్రయత్నమే యువత దేశం వైపు మళ్లేలా అంతరంగాన్ని, ఆలోచనల్ని, ఉత్తేజకరం చెయ్యబూనటానికి భగత్‌సింగ్‌ను తెలియజెప్పడానికి జేసిన ప్రయత్నమే ‘షహీద్ భగత్‌సింగ్’. జరిగిన చరిత్రను మళ్లీ మన కళ్లముందు నిలిపిన అక్షరకావ్యం. స్వయంగా తాను చూచి, భగత్‌సింగ్ తల్లి, తమ్ముడుతో మాట్లాడి పొందిన అనిర్వచనీయ అనుభూతుల్ని అక్షరబద్ధంచేశారు. ప్రత్యక్షంగా ఆయా ప్రాంతాలు పర్యటించి, స్వీయానుభూతి విషయాలతో చెప్పిన చరిత్ర సంగతులు పుస్తకంలో ఉన్నాయి. అపరిపక్వ భావాలతో ఉద్రేక స్వభావంతో నిండిన నిర్ణయాలో, ఉద్రేక స్వభావంతో చేసిన చర్యలో చేసి ఉండలేదనే సత్యం బ్రిటిష్ పోలీసు అధికార్ల ఎదుట తానిచ్చిన రాత వాంగ్మూలం ఒక చారిత్రాత్మక సత్యాన్ని రుజువుచేస్తుంది.
స్కాండల్‌ను చంపటం చిన్న సాంకేతిక లోపంతో జరిగినప్పటికీ, అసెంబ్లీలో బాంబు విసరడం వరకు పరిణతి కలిగిన విప్లవకార లక్ష్యాలను నిర్దేశించే క్రమాన్ని తెలుపుతుంది. తామెందుకు హింసామార్గాన్ని అవలంబించామో, తాము చేసే పోరాటం దేనిమీదో తెల్చిచెప్పడంలో అసలు సిసలు విప్లవ యోధుని లక్షణాలు భగత్‌సింగ్‌లో కనిపిస్తాయి.
రచయిత చౌదరి యవ్వనం నాటి ఉద్రేకాలు, వనస్థనిగా ఆనాటి ఉద్విగ్నతలు పొంది స్వాతంత్య్ర సమరంలో తాను పాల్గొనలేకపోయాననే కోరికను సఫలీకృతంచేసిన షహీత్ భగత్‌సింగ్‌ను, నలభై ఏళ్ల తర్వాత కూడా బయటపెట్టలేకుండా ఉండటమే ఈ రచన. దానినే ఈ నాటి యువతకు తానిచ్చిన సందేశం. మొన్న జరిగిన పాక్ సైన్యం మన సరిహద్దుల్లో మోహరింపుకాని, చొరబాటుతో యుద్ధవాతావరణాన్ని తలపించినపుడు సైన్యం నుంచి వచ్చేసిన సిపాయిలు తాము తుపాకీ పట్టి యుద్ధరంగంలో శత్రుసైన్యాన్ని అణచడానికి ఉవ్విళ్లూరడం దేశభక్తయుత ఆవేశం. అదే చేతనత్వం కనదరంగంలో కదలాడి శత్రువు దేశ పొగరుదించాలనే వీరత్వం ఉప్పొంగిన సమయం.
ఐదు దశాబ్దాలు దాచుకున్న సంగతులు, ఆనాడు లిఖించిన విషయాలు అప్పుడే చెప్పివుంటే తన తోటి యువతను కర్తవ్యోన్ముఖులను చేసుండేవారు. మరికొందరు దేశభక్తుల్ని అధ్యయనంచేసి వారి వివరాలు మనకు మరింత సమగ్రపరిచేవారు. చరిత్ర గ్రంథ రచయితగా ప్రముఖమయ్యేవారు. పేపరుమిల్లులో సోషల్ వెల్ఫేరు ఆఫీసరు ఉద్యోగ బాధ్యతలు అసలు కర్తవ్యాన్ని కూరుకుపోయేలా చేసుంటాయి. అయినప్పటికీ నేటి యువతలో సందేశాత్మకతను నింపడమే కర్తవ్యంగా యెంచడం పుస్తక ముఖ్య ఉద్దేశ్యం అయింది. తాను చదువుకోవటానికి ఉత్తర దేశం వెళ్లినపుడు, తాను చదువుకున్న భగత్‌సింగ్ స్వస్థలాన్ని, ఆ కుటుంబీకుల్ని దర్శించుకొని ఎంత భావోద్వేగానికి గురయ్యారో పుస్తకాన్ని ఆసాంతం చదివితే తెలుస్తుంది. రచయితకు పరిశీలనా దృష్టి కాదు పరిశోధనా దక్షత ముఖ్యం కావాలి. అదీ కనిపిస్తుంది ఈ పుస్తకంలో. భారతదేశ సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం బలిదానం చేసిన త్యాగమూర్తులు, సదా మన మననంలో ఉండేలా వారి జీవితగాథలు, స్మరణ కథలు విరివిగా యువతకు అందించగలిగితేనే వారు స్ఫూర్తిదాయకమై నిలుస్తారు. అటువంటి బృహత్తర పనికి శ్రీకారం చుట్టిన రచయిత అభినందనీయులు. సమాజ అభ్యున్నతికి, దేశ ప్రగతికి సామాజిక చైతన్యం తెచ్చే రచనలు, అభ్యున్నతికి దేశప్రగతికి సామాజిక చైతన్యం తెచ్చే రచనలు బుచ్చయ్య చౌదరిగారి కలం నుంచి జాలువారాలని కోరుకుందాం.

- రవికాంత్,
9642489244
పూర్వ కవిత్వంలో సారూప్యతలు

నిబద్ధత వల్లే.. వైవిధ్యం లేక కాదు!

ఆదికవి నన్నయభట్టుతో ప్రారంభమైన తెనుగు కవిత్వం 19వ శతాబ్దం ప్రథమార్ధం వరకూ నిరాఘాటంగా సాగింది. మూడు పూవులూ, ఆరు కాయలుగా విలసిల్లింది. దీన్ని పూర్వ కవిత్వం అన్నారు. ఈ కవిత్వంలో కొన్ని లోపాలున్నై అనీ, అందుకే భావకవిత్వమూ, ఆధునిక కవిత్వాలు పుట్టుకొచ్చాయనీ చెపుతారు. వారుచెప్పే మొదటి లోపం- పూర్వ కవిత్వం క్లిష్టపద భూయిష్ఠమై వుంటుందని! ఇది ఒప్పుకోదగినది కాదు. ప్రయత్నిస్తే అర్థంకానంత కఠినమైనదిమాత్రం కాదు. అతి నవ్య కవిత్వం కంటే, అధివాస్తవిక కవిత్వం కంటే, వచన కవిత్వం కంటే పూర్వ కవిత్వమే సులభం. ఇక రెండోది- పూర్వ కవులు చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పరని! సూటిగా చెప్పటంలో అందం ఏముంటుంది? వ్యంగ్య మర్యాదను పాటిస్తేనే గదా కవిత్వం. ఇక మూడోది- పూర్వ కవిత్వం అంతా అనువాదాలమయమని! సంస్కృత కావ్యాలు అర్థంకావటం లేదంటారు. అనువదిస్తే తప్పంటారు. కవిత్రయ భారతం, శ్రీనాథుని నైషధం, పోతన భాగవతం- ఇవన్నీ మూలగ్రంథాలకు మెరుగులుదిద్ది సొంత రచనల్లా భాసించాయి. అందుకే చిరస్థాయిగా నిలిచాయి. ఇది మన భాగ్యంగా భావించాలి గాని, అనువదించిన వారిని ఈసడించటం దారుణం. ఇక నాలుగో లోపం- పూర్వ కవుల కవిత్వం అంతా ఒకేరకంగా వుంటుందని, వైవిధ్యం లేదని! ఒకరినొకరు అనుకరించటం తప్ప మరేమీ లేదని, అందువల్ల ఒక పుస్తకం చదివితే అన్నీ చదివినట్లేనని! దీనికి వారిచ్చిన కొన్ని ఉదాహరణలు చూద్దాం. తిక్కన పద్యం భారతంలోనిది.
‘ఒరులేయవి యొనరించిన, నరవరయ ప్రియము
తన మనంబునకగుతా, నొరులకు యవిసేయకు
నికి, పరాయణము పరమధర్మ పథములకెల్లన్’!
అర్థం చాలా సులభం. అయినా దర్భా సుబ్రహ్మణ్యశర్మగారు సుమతీ శతకం రాస్తూ అందులో ఈ పద్యభావం వుండటం సమంజసం అనుకున్నట్లున్నారు. ఆయన బాణీలో ఈ పద్య భావాన్ని తిరగరాశారు.
‘ఎది ఎదిరినీ కొనర్చిన, నెదయుమ్మలి కమ్మునొందు
నెదిరికి నీవ, య్యది సేయకుండు మిదియే, సద
మల ధర్మోపదేశ సారము సుమతీ’!
అలతి పదాలతో కూర్చిన ఈ పద్యం ఎంత బాగుంది? మంచి మాటలు ఎన్ని రకాలుగా చెపితే మాత్రం తప్పేముంది?
‘గతమున నెందరు పలికిన, హితవచనము కాలదోష
మెరుగదు గద, శాశ్వత ధర్మము నెవరు జగ, ద్ధిత
ముగ జెప్పినను స్వాగతించుము మిత్రా’! అన్నారు పెద్దలు. కనుక దీనిని అనుకరణ అనటం దేనికి? ఇది ఒక నేర్పేగదా!
మరో ఉదాహరణ, పోతనగారు కృష్ణుణ్ణి గురించి రాసినది.
‘నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై
జల్లెడువాడు వౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురా
జిల్లెడు మోము వాడొకడు చెల్వుల మానధనంబు తెచ్చెనో
మల్లియలార! మీ పొదల మాటున లేడుగదమ్మ చెప్పరే’!
ఇది పాపయ్య శాస్ర్తీగారికి ఎంతగా నచ్చిందంటే ఆయన యముణ్ణి గురించి రాస్తూ పద్యాన్ని ఇట్లాగే నడిపించాడు.
‘నల్లనివాడు రక్తనయనంబులవాడు భయంకర స్వరూ
పోల్లసనంబు వాడు గదనూని మహామహిషమ్ముపై ప్రవ
ర్తిల్లెడు వాడు నా ప్రణయదేవుని ప్రాణధనంబు తెచ్చెనో
భిల్ల పురంధ్రులార! కనుపింపడుగా దయచేసిచెప్పరే’!
ఇది వంద శాతం అనుసరణే. పోతనగారి మీద ఆయనకున్న అభిమానాన్ని ఈవిధంగా వెల్లడించుకున్నాడనుకోవాలి. మరొక్కటి చూద్దాం. ఇది రుక్మిణీ కల్యాణంలోనిది. కుండిన నగర వర్ణన.
‘ఆ నగరంబుత్రోవను దినాధిపుడేగుచు దారికడ్డమై
పూనికనున్న కోటగనిపోవగలేక యిరారుమేనులం
దానటుదిడ్లు దూరిచనె దథ్యము కాదనియంటెరేనిరుూ
భానుని ద్వాదశాత్ముడని పల్కగ కారణమేమినిచ్చలున్’!
దీనిలాంటి పద్యం విజయ విలాసంలో వుంది. అది ఇంద్రప్రస్త పుర వర్ణన.
‘పున్నమరేల దత్పురము పొంతనె పోశిఖరాళి దాకివి
చ్ఛిన్నగతిన్ సుధారసము చింది పయిందిగువార నంతకుం
డినె్నల సన్నగిల్లి నది నిక్కముగాదని యంటిరేనిరుూపదా
ర్వనె్న పసిండి మేడలకురా పనియేమిల సౌధానామముల్’!
అనుకరించటం నిజమే అయినా, చేమకూరి వారి పద్యం ఎంతచక్కగా వున్నది? ఆయన సామర్థ్యాన్ని మెచ్చుకోవాలి. మరొకటి శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారయణదాసు గారి జయంత్యుత్సవ సంచికలో కరుణశ్రీ గారు ఆయన మీద నవరత్న మాలిక రాశారు. అందులో మొదటి పద్యం..
‘ఎవరీ ముగ్ధమనోజ్ఞదర్శనుడెవండీ శారదామూర్తి రుూ
నవశృంగార రసావతారుడెవడన్నా శ్రీమదజ్జాడయే
అవునా! ఆ దరహాస, మానడకతీరా ఠీవి, యాదర్పమా
కవితాదీప్తి యనన్యసాధ్యములు రాలై మోడ్పులందించరా’!
ఇది చదవగానే ఇటువంటి పద్యం ఎక్కడో చదివినట్లనిపించింది. వెతకగా కదిరీ పతి ప్రభువు రచించిన శుకసప్తతిలో కనిపించింది. ఒక షోకులాడిని వర్ణించిన పద్యం.
‘ఆ మృదులోరు విలాసం, బామోహన ముఖవికాస మాదరహాసం
బామెడ యానడ, యాజడ, యామేనిమెరుంగు రంగున
లవియె పొగడన్’!
ఇందులోని ‘ఆ మోహన ముఖ వికాస మాదరహాసం, బాయెడ, యానడ, యాజడ, యామేనిమెరుంగులు’ కరుణశ్రీ పద్యంలో ‘ఆ దరహాస, మానడక, యాఠీవి, యాదర్ప మాకవితా దీప్తిగా మారినయ్’ అని అనటం ఎంతవరకు సమంజసం! పోలికైతే వుంది. అది కరుణశ్రీ గారికి తెలియకుండానే కదిరీపతి పద్యపాదం కొంతవరకూ నడిచి వుండవచ్చు. అయినా ఎంత బాగుందీ పద్యం! పాపయ్య శాస్ర్తీగారి స్టైలే వేరు. ఈ పద్యంలో కూడా ఆయన బాణీ కనపడుతూనే వుంది. మరో రెండు పద్యాలు ఒకేరకంగా వున్నవి చూడండి.
‘నదమా పొక్కిలి, జంబూ!
నదమా మైచాయ, కోకనదమా పదమా!
పదమా జడ నడుము వియత్!
పదమా నూగారు గూఢ పదమా చెలికిన్!
రసమాతను రుచి జితసా!
రసమా వదనంబు, వనధర సమీ హితసా!
రసమానమా, కచముసా!
రసమానడ, నుడువులమృత రసమా చెలికిన్’!
స్ర్తి వర్ణన వచ్చినప్పుడు కవులు రసోపయుక్తమైన అవయవాలను వర్ణించటం పరిపాటి.
మొదటి పద్యం కూచిమంచి తిమ్మకవి ‘రసికజన మనోభిరామం’లోనిది. ఆయన మునిమనుమడు వెంకట రాయకవి ఈ పద్యం వారి ప్రపితామహుడు రాసినట్లు చెప్పి ఇట్లాంటి పద్యం ఎవరైనా రాయగలరా? అని సవాలు విసిరాడు. అక్కడే వున్న పిఠాపురం సోదర కవులు (దేవులపల్లి సుబ్బరాయశాస్ర్తీ, దేవులపల్లి తమ్మన్న శాస్ర్తీ)లో ఒకరు తడుముకోకుండా రెండవ పద్యం చెప్పారుట. కనుక ఇది అనుసరణ కాదు. కావాలని రాసిన పద్యమే. రెండూ రెండే- బంగారు తునకలు!
చివరగా పోతన అనుకరించిన పద్యం ఒకటి చెపుతా.
‘వారిజాక్షులందు వైవాహికములందు
బ్రాణవిత్త మానభంగమందు
చకితగోకులాగ్ర జన్మ రక్షణమందు
బొంకవచ్చు నఘము వొందదధిప’!
ఈ పద్యం పోతనగారి సొంతమే. భావం భారతం లోనిది. నన్నయ గారిది. శుక్రుని వద్ద ప్రమాణం చేసిన యయాతి నియమాలను ఎలా ఉల్లంఘించటమా? ఎలా అబద్ధం ఆడటమా?- అని బాధపడుతున్నప్పుడు శర్మిష్ఠ చెప్పన పద్యం.
‘చనుబొంకగ బ్రాణాత్వయ
మున, సర్వధనాపహరణమున, వధగా వ
చ్చిన విప్రార్థనమున, వధూ
జన సంగమమున, వివాహ సమయములందున్’!
ఇంతకూ ఈ అనుసరణలనేవి శ్రీనాధుని ముందువారికి తెలియవు. నన్నయ్యభట్టు, ననె్నచోడుడు, తిక్కన, మారన, జక్కన, నాచనసోముడు మొదలైనవారు వారివారి కవిత్వం రాసుకున్నారు. ఎర్రన మాత్రం నన్నయ వదలిన అరణ్య పర్వ శేషాన్ని పూరించదలచుకున్నాడు గనుక అతుకు కనపడకుండా వుండటానికి నన్నయ బాణీనే నడిపిస్తే సహజంగా వుంటుందని అనుకరించాడు.
‘స్ఫుర దరుణాంశురాగరుచి చొంపిరివోయి నిరస్తనీరదా
వరణములై దళత్కమలవైభవజృంభణ ముల్లసిల్లను
ద్ధురతర హంససారస మధువ్రత నిస్వనముల్ సెలంగగా
గరమువెలింగె వాసరము ఖంచులు శారదవేళ జూడగన్’!
ఇది కావాలని చేసింది. చివరకు తిక్కన వలెనూ రాశాడు. కనుక దీన్ని అనుసరణ అనటం సమంజసం కాదు.
ఎర్రనయు గూడ భరతకృతికి కొన్ని శిల్పినేర్పులనద్ది విశిష్ఠుడయ్యె. ఆదికవి వలె మొదలెట్టి అంతమునకు తిక్కనార్యుని శైలి నందించాడు. ఇది ఆ కవి ప్రతిభ కింద పరిగణించాలి. మొదటగా అనుకరించటం మొదలుపెట్టింది శ్రీనాథుడే. తరువాత పెద్దన, భట్టుమూర్తి, వెంకట కవి ఒకరి నొకరు పరంపరగా అనుకరిస్తూ వచ్చారు. పూర్వకవుల పద్యాలు నచ్చి ఆ స్ఫూర్తితో రాసినవి. ఇవి భాషామతల్లికి అపూర్వ ఆభరణాలుగా భావించాలి. మన కవులు వారి భాషా పటిమను ప్రదర్శించి ఆంధ్ర కావ్యేందిరకు నూతన శోభను చేకూర్చారే గాని, పాడిందే పాడలేదు.
ఈవిధంగా అనుసరించటాన్ని మెచ్చుకోలుగా పరిగణించాలేతప్ప వేరేవిధంగా భావించకూడదు. దీన్ని పెద్దవాళ్లు ‘ఆత్మీయతా స్పర్శ తప్ప ఇంకొకటి కాద’న్నారు. కవిత్వం అంతా ఒకేరకంగా కనపడటం నిబద్ధత వల్ల, నియమాలను అతిక్రమించకుండా వుండటం వల్ల! అంతేగాని వైవిధ్యం లేకపోవటం వల్ల కాదు. ఎవరి బాణీ వారిదే. ఎవరి పాకం వారిదే. ఆ పాకాన్ని పసిగట్టి కవిత్వం ఎవరిదో ఇట్టే చెప్పగల పండితులనేకమంది ఉన్నారంటే వైవిధ్యం వున్నట్లే. మిగిలిన వారికి పూర్వ కవిత్వం అంతా ఒకేరకంగా కనపడటంలో ఆశ్చర్యం లేదు!

- ప్రయాగ కృష్ణమూర్తి,
నరసరావుపేట, గుంటూరు జిల్లా.
చరవాణి : 8179063842

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net

email: merupuvj@andhrabhoomi.net

- పెండెం శ్రీనివాస శివప్రసాద్