విశాఖపట్నం

సరోజా... నన్ను క్షమించు! (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అమ్మా ఒక్కసారి నీ సెల్ ఇవ్వమ్మా, కాసేపు గేమ్ ఆడుకుని వెంటనే ఇచ్చేస్తాను’’
‘‘సుధా నీకెన్నిసార్లు చెప్పాలి సెల్ వాడడం మంచిది కాదని. నీది సెల్ వాడే వయసు కాదు. పెద్దయ్యాక మంచి సెల్ కొనిస్తాను’’ కూతురితో అంది సరోజ.
‘‘అబ్బా ఏమిటమ్మా... నీవు ఎప్పుడు అడిగినా ఇదే మాట చెబుతున్నావు. నేను చిన్నపిల్లను కాదులే ఒక్కసారి ఇవ్వమ్మా. ఇవ్వకపోతే డాడీతో చెబుతాను’’ బుంగమూతి పెట్టింది సుధ.
‘‘సుధా నీవు చిన్నపిల్లవు అనడంలేదమ్మా. నీది అటుఇటు కాని వయసు. ఈ వయసులో నీ శరీరంలో జరిగే మార్పులతో పాటు మనసులో కూడా కాస్త అలజడి, ఆవేశం ఉంటాయి. నా మాట విను తల్లీ’’ అంటూ కూతుర్ని బుజ్జగించింది సరోజ.
‘‘చూడు డాడీ అమ్మ సెల్ ఇవ్వమంటే ఇవ్వడంలేదు. నీవైనా చెప్పు డాడీ’’ అంది సుధ.
‘‘అయ్యో ఏమైంది తల్లీ. సెల్‌ఫోన్ కోసం ఇలా ఎవరైనా ఏడుస్తారా? పద అమ్మని అడిగి ఇస్తాను’’ అంటూ కూతురితో పాటు సరోజ దగ్గరకి వెళ్లాడు మోహన్.
‘‘ఏమిటి సరోజా? సుధ సెల్ అడిగితే ఇవ్వనన్నావట. ఒకసారి ఇవ్వు, కొద్దిసేపు ఆడుకుని ఇస్తుంది’’
‘‘అది కాదండి ఈ వయసులో తను సెల్ వాడడం అంత మంచిది కాదు... నా మాట వినండి’’
‘‘నాకు తెలుసు’’ అంటూ భార్య ఎంత వద్దని చెబుతున్నా ఆమె చేతిలోని సెల్ లాక్కుని కూతురి చేతిలో పెట్టాడు మోహన్.
‘‘నా మాట వినండి. చిన్నచిన్న పొరపాట్ల వల్లే పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. రోజూ పేపర్లలో ఎన్ని వార్తలు చూడడంలేదు? సమస్య వచ్చాక బాధపడడం కన్నా ముందే మేలుకుంటే మంచిది’’ భర్తకి చెప్పింది సరోజ.
‘‘నువ్వు ఇంతలా వద్దని అంటున్నావంటే నీ రహస్యాలు ఏవైనా తెలిసిపోతాయని భయపడుతున్నావా? ఈ మధ్య నువ్వు సెల్‌లో తెగ మాట్లాడుతున్నావు కదా. అందుకే అయి ఉంటుంది’’ అన్నాడు మోహన్. ‘‘ఏమిటండీ మీరు అసలు పిల్లల దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పని మీకు తెలియదా? అయినా సంబంధం లేని విషయాలు మాట్లాడతారేమిటి? నాకంటూ వేరే రహస్యాలు ఏముంటాయి?’’ అంది.
‘‘అది నీకే తెలియాలి. నీ చాటింగులు, ఫోన్ మాట్లాడడాలు మా అమ్మ నాకు అన్నీ చెబుతుందిలే. అయినా అసలు నీ మొహానికి సెల్ ఎందుకు?’’
‘‘మీరు కొనిస్తేనే కదా వాడుతున్నాను. పిల్లలు, మా అమ్మతో మాట్లాడుతుంటాను. లేదంటే మీరు ఫోన్ చేస్తే మాట్లాడతాను. ఆ మాత్రానికే ఇంతలేసి నిందలు వేయాలా? ఆడది పొరపాటున మగవాడితో మాట్లాడితే తప్పు. మగవాళ్లు మాత్రం ఆడవాళ్లతో మాట్లాడి బిజినెస్ వ్యవహారాలు అంటారు. ఆడవాళ్లకో న్యాయం... మగవాళ్లకో న్యాయమా?’’
‘‘ఏమిటి నోరు లేస్తోంది? వెళ్లి నీ పని చూసుకో’’ అంటూ ఇంట్లో నుండి బయటికి వెళ్లిపోయాడు మోహన్.
* * *
‘‘నమస్తే మోహన్‌గారు... వారం క్రితం మిమ్మల్ని రమ్మంటే ఇప్పుడా రావడం?’’ అతన్ని చూడగానే అంది సుధ స్కూల్ ప్రిన్సిపాల్ రాధిక.
‘‘క్షమించండి మేడం. పని వల్ల రాలేకపోయాను. ఇంతకీ ఎందుకు పిలిచారు?’’
‘‘మీ సుధ ఈ మధ్య క్లాసులో పరధ్యానంగా ఉంటోంది. తనలో తనే నవ్వుకుంటుంది. మొన్న జరిగిన పరీక్షలో మార్కులు బాగా తగ్గాయి. ఆ విషయం మీకు చెప్పాలనే పిలిచాను’’
‘‘సుధ గతంలో బాగానే చదివేది కదా. ఇప్పుడెందుకలా అయిందంటారు?’’ కంగారుగా అన్నాడు మోహన్.
‘‘నేను చెప్పేది కూడా అదే. అసలే పదవ తరగతి. అందులోనూ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. సుధ చాలా తెలివైన పిల్ల. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. తన సమస్య ఏమిటో తెలుసుకుని మామూలు మనిషిని చెయ్యడానికి ప్రయత్నించండి’’ అంది ప్రిన్సిపాల్.
మోహన్ మనసు అదోలా అయిపోయింది. లోపం ఎక్కడ ఉంది? ప్రేమగా చూసుకునే పాప ఎందుకిలా మారిపోయింది. ఇదంతా సరోజ నిర్లక్ష్యం వల్లే అనుకున్నాడు మోహన్.
* * *
‘‘సరోజా... సరోజా... త్వరగా రా’’ ఇంటికి వెళ్లగానే కేకలేశాడు మోహన్.
‘‘ఏమిటండీ అలా అరుస్తున్నారు? ఏమైంది?’’ కంగారుగా అంది సరోజ.
‘‘ఇదంతా నీ నిర్లక్ష్యం వల్లే. పిల్లలేం చేస్తున్నారో పట్టించుకోకుండా ఉంటే ఇలాగే జరుగుతుంది. ఈమధ్య సుధకి సరిగ్గా మార్కులు రావడం లేదని, స్కూల్లో పరధ్యానంగా ఉంటోందని ప్రిన్సిపాల్ చెప్పారు. చదువుని కూడా నిర్లక్ష్యం చేస్తోందట’’ అన్నాడు.
‘‘ఆకులు కాలాక చేతులు పట్టుకుంటే లాభం ఏముంది? ఆరోజు నేనెంత చెప్పినా వినకుండా దాని చేతికి సెల్ ఇచ్చారు. ఇప్పుడు పరధ్యానంగా ఉంటోందని అంటే నేనేం చెయ్యాలి. అసలు ఈ ఇంట్లో నన్ను పనిమనిషిలా అయినా గుర్తించారా? పిల్లల ఎదురుగా అలా మాట్లాడకండి అని మొత్తుకున్నా వినలేదు. ఇప్పుడు పిల్లలు నా మాట వినమంటే వింటారా? నీవు చెప్పేది ఏమిటి మేము వినేది ఏమిటి అన్నట్లు మాట్లాడారు’’ అంది సరోజ.
‘‘జరిగిందేదో జరిగిపోయింది. మనం ఇలా తగవులు ఆడుకుంటే జరిగిన నష్టం సమసిపోతుందా? రేపటి నుండి ఓ నాలుగు రోజులు సుధని కనిపెట్టుకుని ఉండు. స్కూలుకి పంపవద్దు’’
‘‘ఇలాంటి పరిస్థితిలో సుధని కోప్పడకండి. నేను చూసుకుంటాను. ఇకనైనా పిల్లల ముందు మర్యాదగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. అప్పుడే పిల్లలు తల్లిదండ్రులకి విలువ ఇస్తారు’’
‘‘సరేలే ముందు సుధ సంగతి చూడు మళ్లీ ఆ ప్రిన్సిపాల్ ముందు నేను తలదించుకుని నిలబడలేను’’ అన్నాడు మోహన్.
సుధ నిద్రపోగానే ఆమె సెల్ ఓపెన్ చేసి చూసింది సరోజ.
ప్రతిరోజు ఎవరితోనో వాట్సప్, ఫేస్‌బుక్ ఇలా ఏదో ఒక దాంట్లో చాటింగ్ చేస్తూనే ఉంది. అందులో ఏ ఒక్కటి చెత్త మెసేజ్ లేదు. కనీసం ఎవరితో మాట్లాడినట్టు ఒక్క కాల్ కూడా లేదు. పాత మెసేజ్‌లన్నీ అలాగే ఉన్నాయి. అంటే చెడు తోవలోకి అడుగు పెట్టిందే కాని తప్పుడు ఆలోచనలు లేవన్న మాట. మెసేజ్‌లన్నీ సానుభూతి కోరుతున్నట్లు ఉన్నాయి. అంటే సుధ ఇంకా చేయి దాటిపోలేదు. కాని ఆ చాటింగ్‌లకు అలవాటు పడి తన చదువుని నిర్లక్ష్యం చేస్తున్నది. సమయాన్ని దుర్వినియోగం చేస్తోంది. అసలు చాటింగ్ చేస్తుంది ఎవరు? ఏమిటి తెలుసుకోకుండా ఉండడం వలన జరిగే అనర్ధాల గురించి సుధకి తెలియజెప్పాలి. ఇది తప్పు అని చెబితే వినదు. తను వెళ్లిన దారిలోకే వెళ్లి తన తప్పును తానే తెలుసుకునేలా చెయ్యాలి అని నిర్ణయించుకుని మెల్లగా ఆ గది నుండి బయటికి నడిచింది సరోజ.
* * *
స్కూల్‌కి వెళ్లవద్దని తల్లి చెప్పడంతో ఏం చేయాలో తోచక సెల్ పట్టుకుని తన గదిలోకి వెళ్లింది సుధ.
కొత్త నెంబర్ నుండి ఆమెకి మెసేజ్ వచ్చింది.
‘హాయ్ గుడ్ మార్నింగ్ బంగారం’ అని ఉంది.
ఎవరబ్బా నన్ను బంగారం అంటున్నది అనుకుంటూనే ‘హూ ఆర్ యు’ అని మెసేజ్ పెట్టింది.
‘నా పేరు సూరజ్’
‘అవునా నా నెంబర్ నీకెక్కడిది?’
‘నీలాంటి అందమైన అమ్మాయి నెంబర్ కనుక్కోవడం నాకేమంత కష్టం కాదు. నీవంటే ఉన్న ఇష్టంతో సంపాదించా. ఇంతకీ టిఫిన్ చేశావా బంగారం’
‘ఏదో తిన్నానులే’
‘అయ్యో ఏమైంది? డల్‌గా ఉన్నట్లున్నావు... ఏమైంది డియర్?’
‘ఏముంటుంది చెప్పడానికి ఎప్పుడు చూసినా అమ్మానాన్న గొడవ పడుతూ ఉంటారు. నా గురించి పట్టించుకోరు. నాకేదో చదవాలి అనిపిస్తుంది. నాన్న ఇంకేదో చదవమంటాడు. విసుగ్గా ఉంది’
‘అదేమిటి అమ్మను ఏమడిగినా చేసి పెడుతుందిగా. నీవు అడిగావా? అడిగితే కదా చేస్తుందో లేదో తెలిసేది. ఊరికే ఇలా కోపగించుకుంటే ఎలా?’
‘అయినా నీతో చాట్ చేయడమేమిటి? ఉంటా’ అని మెసేజ్ పెట్టి తల్లి దగ్గరకి వెళ్లింది.
‘‘ఏమిటమ్మా సుధా ఏమైనా కావాలా’’ అంది సరోజ.
‘‘నాకు ఇడ్లీ తినాలని లేదు. ఈరోజు నాకు పెసరట్టు కావాలి’’ అంది సుధ.
‘‘ఓస్ అంతేగా ఇప్పుడే చేస్తాను’’ అని అరగంటలో పెసరట్లు వేసి కొసరి కొసరి తినిపించింది సరోజ.
తర్వాత సూరజ్‌కి ‘్థ్యంక్స్.. నీవు చెప్పింది అక్షరాల నిజం. ఈరోజు అమ్మ కొత్తగా కనిపించింది. నాకు దగ్గరుండి తినిపించింది. చాలా నెలల తర్వాత నేను కడుపు నిండా తిన్నాను’ అని మెసేజ్ పెట్టింది.
‘‘మైడియర్ బంగారం అమ్మానాన్నలు ప్రేమకి ప్రతిరూపాలు. నీవు సరిగ్గా అర్థం చేసుకోలేదు అంతే. సరే పరీక్షలు దగ్గర పడుతున్నాయి బాగా చదువుకో మరి’
‘చదవాలని పుస్తకాలు తీస్తే ఏవో ఆలోచనలు వస్తున్నాయి తప్ప చదవబుద్ధి కావడంలేదు. అసలు ఎలా చదవాలో నాకే అర్ధం కావడంలేదు’
‘నా మాట విన్నావంటే నీకు స్టేట్‌ఫస్ట్ వస్తుంది’
‘ఇన్ని విషయాలు చెబుతున్నావు నాకు నిన్ను చూడాలని ఉంది’
‘నీవు నన్ను చూడాలంటే తప్పకుండా కలుద్దాం. అందుకు ఒక షరతు. నీవు ఎగ్జామ్స్ రాసే వరకు సెల్ పూర్తిగా ముట్టుకోకూడదు. నీ దగ్గరే ఉన్నా దానిపై దృష్టి పెట్టకూడదు. అలా చెయ్యడానికి ట్రై చెయ్యి అప్పుడు నీ పేరు పేపర్‌లో వస్తుంది. ఆ పేపర్ కటింగ్ పట్టుకుని నీ దగ్గరకు వస్తాను. ఈ ఒక్కసారికి నా మాట విను’
‘అలాగే సూరజ్’
‘సరే నేను కూడా ఉంటాను. అమ్మకి పనుల్లో సాయం చేయాలి. నీకు తెలుసా? ఈ ప్రపంచంలో అన్ని ఉద్యోగాలు చేసే వారికి సెలవులు ఉన్నాయి కానీ అమ్మకి మాత్రం సెలవు ఉండదు. అందుకే అందరం అమ్మకి సాయం చేయాలి. ఇక ఉంటా డియర్’
‘సరే పరీక్ష ఫలితాలు వచ్చిన రోజున నీకు మెసేజ్ పెడతాను. ఎక్కడ కలవాలో చెప్పు వస్తా’ అంటూ మెసేజ్ పెట్టి సెల్ స్విచ్ ఆఫ్ చేసింది సుధ.
శ్రద్ధగా చదవడం మొదలుపెట్టింది.
ఇంట్లో పనులన్నీ ముగించుకుని వచ్చి చూసిన సరోజకి సుధ చదువుకోవడం కనిపించింది. వంటింట్లోకి వెళ్లి వేడివేడి పాలు తీసుకొచ్చి ఆమెకి ఇచ్చింది. దగ్గరుండి పాలు తాగించింది.
‘‘అయ్యో అమ్మా నీకెందుకు ఈ శ్రమ. అసలే రోజంతా నువ్వు ఇంటి పనులతో బిజీగా ఉంటావు. ఆఫీసులోను నీకు ఖాళీ ఉండదు. కాసేపు చదువుకుని పడుకుంటాను’’ అంది సుధ.
‘‘అది కాదు తల్లీ ఒక్కదానివే ఉన్నావుగా నేను ఇక్కడే కూర్చుంటానులే కాసేపు’’
‘‘అమ్మా నేనేమీ చిన్నపిల్లను కాదు’’
* * *
పదవ తరగతి పరీక్షల ఫలితాలు వచ్చాయి.
ఆత్రంగా రిజల్ట్స్ చూసింది సుధ.
ఒక్కసారిగా షాక్ తింది.
మెయిన్ పేజీలో ఫొటోతో సహా స్టేట్ ఫస్ట్ అని ఉంది. అంతే ఆత్రంగా సెల్ తీసి ఆన్ చేసింది. వేంకటేశ్వరుని గుడిలో నీ కోసం ఎదురు చూస్తుంటా అని సూరజ్ నుండి మెసేజ్ కనిపించింది. అమ్మానాన్నలతో సంతోషకరమైన వార్తను పంచుకుని స్వీట్స్ పట్టుకుని గుడికి బయలుదేరింది సుధ.
పేపర్‌లో సుధ ఫొటో కట్ చేసి భర్తను కూడా రమ్మని పిలిచి వేంకటేశ్వర స్వామికి గుడికి వెళ్లింది సరోజ.
సుధ మొదటిసారిగా సూరజ్ నెంబర్‌కి రింగ్ చేస్తూ చుట్టూ చూసింది. కాస్త దూరంలో తల్లి చేతిలో ఫోన్ రింగ్ అవుతోంది. అసలు ఏం జరుగుతుందో అర్ధం కాక కాల్ కట్ చేసి మళ్లీ రింగ్ చేసింది సుధ. మళ్లీ తల్లి చేతిలో సెల్ రింగ్ అయింది. సూరజ్ నెంబర్ అది.
అమ్మ దగ్గర ఎలా?
నిజంగా సూరజ్ అనే మనిషి ఉన్నాడా అనుకునేలోపే ‘‘ఇదిగో బంగారం పేపర్ కటింగ్. నీకు చెప్పానుగా నీకు స్టేట్ ఫస్ట్ వస్తుంది అని’’
‘‘అమ్మా నీవు... అమ్మా సూరజ్ నెంబర్ నీ దగ్గర’’
‘‘నా దగ్గర కాదు తల్లీ... నేనే సూరజ్‌గా కొద్ది రోజులు అవతారం ఎత్తాను. నా బంగారు తల్లి బంగారు భవిష్యత్తు కోసం’’ అని కూతురి నుదుటిపై ముద్దు పెట్టింది సరోజ.
‘‘అమ్మా నన్ను క్షమించమ్మా. చాలా తప్పు చేశాను’’ అని ఏడుస్తూ తల్లిని చుట్టుకుపోయింది సుధ.
అప్పుడే అక్కడికి వచ్చిన మోహన్ ఇవేం తెలియక అర్థం కానట్లు చూసాడు.
సరోజ అతనికి జరిగింది చెప్పింది.
అన్నీ విన్న మోహన్‌కి ఏం చెప్పాలో అర్థం కాలేదు.
సరోజ తల్లి చెప్పిన చాడీలు విని భార్యని ఎంత చులకనగా చూసాడో గుర్తుకు వచ్చింది. ఎనె్నన్ని మాటలన్నాడో స్ఫురించి అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆగలేక ఆమెని, సుధని అక్కున చేర్చుకుని ‘‘సరోజా నన్ను క్షమించు’’ అన్నాడు.

- సిరి లాభాల

జోక్స్‌జోక్స్

తెల్లమొహం
గీత : మా ఇంట్లో అందరూ పౌడర్ ఎక్కువగా వాడతామని నీకెలా తెలుసు?
సీత : మీ ఇంట్లో వాళ్లని ఏమడిగినా తెల్లమొహం వేస్తారు కదా అందుకని.
ఇంటికెన్నో ద్వారాలు
రామారావు : ఇంత పెద్ద ఇల్లు కట్టావు సరే. చాలా బాగుంది. కానీ అవసరం లేకపోయినా ఇంటికి ఇన్ని ద్వారాలు ఎందుకు పెట్టావు?
సుబ్బారావు : ఈ ఇల్లు బోలెడు మంది దగ్గర అప్పులు తీసుకుని కట్టానురా. ఏ అప్పులోడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎవడొచ్చినా సులువుగా తప్పించుకోవడానికే ఇన్ని ద్వారాలు పెట్టాను.

తీరని రుణం
మొదటి దెయ్యం : నా బాకీ నువ్వు తీర్చవని మనం బతికున్నప్పుడే తెలుసు నాకు.
రెండవ దెయ్యం : అదెలా?
మొదటి దెయ్యం : నీ బాకీ ఈ జన్మలో తీర్చలేనని నువ్వు అంటూ ఉండేవాడివి కదా. అలా తెలిసిందిలే.

పుస్తక సమీక్ష

సమాజాన్ని చైతన్యపరిచే ‘క్రాంతి కిరణాలు’

ఉషస్సు అంటే మేలుకొలుపుకి సంకేతం. ఈ ప్రభాత తరంగాల నుండి పుట్టుకొచ్చే ఊహలు ఎనె్నన్నో. సృజనరేఖలు పురివిప్పితే వికసించే కవితా కుసుమాలు అనంతం. అలాంటి ఉద్వేగభరిత క్షణాల్లోండి ఊపిరి పోసుకున్నదే ఈ క్రాంతికిరణాలు కవితా సంపుటి. దీని సృష్టికర్త కవి శేఖరమంత్రి ప్రభాకర్. సహృదయ సాహితీ సంస్థ ప్రతినిధిగా లబ్దప్రతిష్టులు. పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక సేవా రంగాల కేంద్రబిందువు. విభిన్న సత్కారాల గ్రహీత. గతంలో అనేక రచనలు చేసిన దిట్ట. ఈ సంపుటిలో 50 వచన కవితలు దర్శనమిస్తాయి. అంత్యప్రాసల నియమంతో సాగిన రచనలు వెల్లువ అధికం. అన్నీ సామాజిక స్పృహను ప్రతిబింబింపజేసేవే. పలు రంగాల విశిష్ట వ్యక్తులపై స్పందించి రాసిన కవితలున్నాయి. లోకం తీరును ఔపోసన పట్టి చిత్రీకరించిన నేపథ్యమే ఈ సృజనకు మూలం. అలాంటి అనుభవాల లోతుల తడిని ఒకసారి స్పృశించే ప్రయత్నం చేద్దాం.
‘బిందువులో సింధువై/అణువులో ఆత్మవై
ప్రతికూలతను ఛేదించే/విత్తువై/మట్టి అమ్మ
జన్మనిచ్చే మొలకెత్తిన/ ఆత్మ విశ్వాసానివి’ అంటూ సాగిపోతారు చెట్టుతల్లి కవితలో. భావవ్యక్తీకరణలో ధ్వని ప్రధానమైన ఎత్తుగడ కనిపిస్తుంది. ప్రకృతిలోని ప్రతి కోణాన్ని అణువణువునీ తడుముతూ సృష్టికి మూలమైన అంతర్లీన శక్తిని ప్రగతిశీలక దృక్పథంతో అనే్వషించే ప్రయత్నం చేస్తారు కవి. ఈ క్రమంలో అనేక వస్తు ప్రతీకలను సృజనాత్మకంగా ఒడిసి పట్టుకుంటారు. ‘రూపాయి విశ్వాన్ని కబళించే సిపాయి/మానవీయ బంధాలను సేహ సుగంధాలను/హరించే మహమ్మారి’ అంటారు మానవత్వపు రూపాయి కవితలో. ‘్ధనమూలం మిదం జగత్’ అన్న నానుడి ఈ సందర్భానికి అతికినట్లు సరిపోతుంది. రూపాయి చుట్టూ ప్రపంచమంతా ప్రదక్షిణ చేస్తున్న కాలమిది. స్నేహబంధాలు, మానవ సంబంధాలు అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. ఆర్థిక సంబంధాల ఉచ్చులో సర్వం రాజ్యమేలుతోంది. ఈ నిజాన్ని అక్షరీకరించడంలో తనదైన శైలిలో ప్రతిస్పందించారు కవి. ‘నేటి బతుకులు’ శీర్షికలో అగ్గిపెట్టెలో ఆరుగజాల చీరను నేసి, ఇమిడ్చిన నేత కళాకారుల ఆర్థిక దుస్థితిని ఆవిష్కరిస్తారు కవి. ‘ ఇంట్లో సుక్క నీరు నేదు/గూట్లో అన్నం నేదు, కూర నేదు/ ఇంటి నిండా పస్తులుంటున్నాం/మగ్గమే మా బతుక్కి పగ్గమైపోనాది’ అంటూ ఒక విషాద జీవన వాస్తవికతను కళ్ల ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారు. రెక్కాడితే కాని డొక్కాడని చేనేత కార్మికుల దైనందిన పరిస్థితికి ది అద్దం పడుతుంది.
సిరిసిల్ల లాంటి ప్రాంతంలో ఆకలి చావులకి జవాబులను వెదికే క్రమంలో కవి అనే్వషణ కొనసాగుతుంది. ప్రపంచీకరణ మూలంగా సాజామిక ఆర్థిక పరిస్థితులలో వచ్చిన మార్పులని పట్టి చూపుతుంది. పారిశ్రామిక విప్లవం కారణంగా పెట్టుబడిదారీ వ్యవస్థ వల్ల కులవృత్తులు, కుటీర పరిశ్రమలు ఏ విధంగా ధ్వంసమయ్యాయో నిరూపిస్తుంది. పర్యవసానంగా మధ్య, అట్టడుగు వర్గాల బతుకులు వీధిన పడిన వైనాన్ని ఇది ప్రశ్నిస్తుంది. విశాఖ మాండలికంలో రాసిన ఈ కవిత ప్రాంతీయ స్పృహను ప్రతిబింబిస్తుంది.
‘నేనొక ప్రభాత కిరణాన్ని/తిమిర మూలాల్ని ఛేదించే కాంతి ఖడ్గాన్ని/నవ కాంతులీను జవనాశ్వాన్ని/చైతన్య దీప్తులు వెదజల్లే వెలుగు పుష్పాన్ని’ అని క్రాంతిగీతంలో కవి ప్రబోధించడం ఆశావహ దృక్పథం కనిపిస్తుంది. గేయ సంప్రదాయాన్ని పోలిన ఈ వచన శైలి కొత్తపాతల మేలుకలయికలా భాసిల్లుతుంది. అంధకారంలో మగ్గిపోతున్న జీవులకు ఈ పిలుపు మేలుకొలుపులా జవసత్వాలకు చైతన్యాన్ని అందిస్తుంది. ‘అదృశ్యం’ అనే మరో కవితలో కవి తాత్త్విక అనే్వషణ కనిపిస్తుంది. ‘ప్రతి అస్తమయం వెనుక/దాగి ఉందో అజ్ఞాత సత్యం/ప్రతి ఉదయం వెనుక/ ఇమిడి ఉందో భయం’ అనడం వెనుక అంతర్లీన భావ సందేశమేదో అందీ అందనట్లు జారిపోతుంది. ఇలా ఈ కవితా సంపుటి నిండా లెక్కకు మించిన సామాజిక అనుభవాలు బహిర్గతమవుతుంటాయి. వీటి వెనుక ప్రాపంచిక అధ్యయనంతో పాటు సునిశిత పరిశీలనా దృష్టి గోచరిస్తుంది. పీడుతులు, అభాగ్యులు, అన్నార్తుల పట్ల ఆవేదన ప్రస్ఫుటమవుతుంది. వీటి లోతుపాతులను సమర్థవంతంగా అంచనా వెయ్యడంలో ఈ క్రాంతికిరణాల పాత్ర చాలా ఉంది. సమయస్ఫూర్తితో సమర్థవంతంగా వీటిని ఒడిసిపట్టుకున్నందుకు కవి శేఖరమంత్రి ప్రభాకర్‌కి అభినందనలు తెలపాల్సిందే. ఈ కృషితో భవిష్యత్తులో మరిన్ని గొప్ప రచనలు భావితరాలకు అందజేస్తారని ఆశిద్దాం!

- మానాపురం చంద్రశేఖర్,
సెల్ : 9440593910.

మనోగీతికలు

పులకిత ఆమని
ఆకాశంలో సింధూరవర్ణం
రాతిరిని చూడగానే
సిగ్గుపడి పారిపోయింది

పొదల చాటున గువ్వల జంట
ఊసులాడుకుంటూ
గూటికెళ్లడం మరిచిపోయింది

ఎదురు చూస్తున్నాయి చిన్ని సెలయేర్లు
చిట్టిచేతులు చేసే
కాగితపు పడవల కోసం

పూలతోటకెళ్లి తేనె మూట కట్టి
దాచుకున్నదంతా
దోసిట్లో పోసింది తుమ్మెద

తొలిసంధ్య వేళలో సూర్యబింబంలా
విచ్చుకుంది పెరటిలోని
ముద్దమందారం

వేకువజామున మంచుముత్యాలు
నిదుపోతున్నాయి
ఆకుల పొత్తిళ్లలో

- బి. బాలత్రిపుర సుందరతేజ,
లక్ష్మీగణపతి నిలయం,
న్యూరెవెన్యూకాలనీ,
కె.ఎల్. పురం,
విజయనగరం - 535003.
సెల్ : 8008758877.

ఎగసిపడుతున్న
యువ సమూహాలు
స్వార్ధపు పునాదులలోకి కాళ్లను పాతుకుని నిలబడి
అభివృద్ధి మంత్రం వల్లెవేస్తూ
సరదాగా రావణ కాష్ఠాలను రగిలిస్తుంటే
జనిస్తున్న సిగల మధ్యనున్న
వడివడిగా దూసుకొస్తున్న సమస్యల శరాలు
కరడుగట్టిన కసాయి గుండెల సాక్షిగా
దూసుకొచ్చిన మరయంత్రాల కింద
నలిగిపోయిన పచ్చని తివాచీ కిందం నుండి
వికృతంగా పొడుచుకొచ్చిన అవినీతికాలు
అన్యాయంతో స్వార్ధం అక్రమంగా జత కట్టి
సయ్యాటలు ఆడుతూ సరదాగా పేరుస్తున్న
ఆత్మాహుతి చితుల్లోకి
బలవంతంగా నెట్టబడుతూ
బలైపోతున్నది ఎవరు?
బయటికి రావడానికి అలవాటు పడుతూ
బయట పడలేక బలవంతపు త్యాగాల పేరిట
కాలి బూడిదవుతున్న బడుగు బతుకులను
ఇంకా ఆదుకోకపోతే ఎలా అని తలచినవేళ
నిదురపోతున్న నిజసక్తులను తట్టి లేపి
సన్నగిల్లిన చైతన్యం సర్ది చెప్పి
వడివడిగా ముందుకు అడుగులు
వేస్తున్న మన యువకిరణాలు

- సి.హెచ్.వి. లక్ష్మి,
సెల్ : 9493435649.

వరద
కట్టలు కట్టలు
ఖర్చు చెయ్యడం కాదు
కరకట్టలు నిర్మించండి
రాబోయే వరదల్లో
ఊరూవాడా
మునిగిపోకుండా!

- జి.జి.కె. రావు,
శ్రీకాకుళం.

ప్రకృతి పాఠం
ఉత్తేజం ఊపిరిగా అలుపెరుగని ప్రయత్నం
తీరంలో హోరెత్తించే అలల ప్రతియత్నం
ఇది ఇదియని భేదమెరుగని సమానత్వం
అన్నింటా స్పృశిస్తూ వ్యాపించేటి గాలితత్వం
ఎరుదో నలుపేదో బట్టబయలు చేయు కాంతి
కాలిస్తే ఇటుకయ్యి, తడిస్తే మొలకయ్యే
విషం మింగి జనుల కొరకు అందించు ఆమ్లజని
త్యాగగణపు చిరునామా, తరవు చలవ కడాని
పసి సెలయేరు కాస్త యువ నదియాయె
గంభీరపు ప్రవాహంలో సాగరాన మిళితమాయె
మనసు అలలు అలుపులేక ఉత్తేజితమవ్వాలి
మనతత్వం గాలివోలె సమానత్వమెరగాలి
సత్యానికి తోవ చూపు కాంతిని మనం పొందాలి
మట్టి వలె సమ్మతించు సహనమనేదుండాలి
తరువులోన త్యాగగుణం లేశమైన కలగాలి
ఈ జీవనయాత్రకు అంతముండునని యెరగాలి
అనంత కీర్తి సంద్రాన మనం భాగమై మిగలాలి

- చావలి శేషాద్రి సోమయాజులు,
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, పాచిపెంట.

యువశక్తి
ఏమవుతుంది ఏమవుతుంది
యువతలోని శక్తి నవయువతలోని శక్తి
విలాసాల క్లబుల్లో మత్తుమందు జబ్బుల్లో పడి
నిర్వీర్యమవుతుంది నిర్జీవమై నీరు గారిపోతోంది
చదువులు కొనడానికి కావాలి లక్షలు
అవుతున్నాయవి పెద్దలకు భరించలేని శిక్షలు
పట్టా చేపట్టి ఉద్యోగానే్వషణలో
వయసేమో పెరుగుతుంటే ఓపికేమో తరగుతుంటే
పెడత్రోవ పడుతోంది
పోరాటం చెయ్యలేక ఆరాటం పడిపోతూ
నిప్పును మూటకట్టుకున్నారు

- కాళ్ల గోవిందరావు,
ఆమదాలవలస. సెల్ : 9550443449.
పెడత్రోవన పట్టిన యువశక్తికి
ప్రభుత్వమే అడ్డుకట్ట వేయాలి భావిపౌరులుగా తీర్చిదిద్దాలి

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

email: merupuvsp@andhrabhoomi.net

email: merupuvsp@andhrabhoomi.net

- సిరి లాభాల