విజయవాడ

నేనే తప్పుచేశాను! (చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బావని తప్ప వేరెవరినీ పెళ్లి చేసుకోనని, అలాకాకుండా వేరెవరినో చేస్తే ఆత్మహత్య చేసుకుని చస్తానని’ బెదిరించింది తండ్రిని అమ్ములు.
మేనల్లుడు చంటితో కూతురి పెళ్లి ఘనంగా జరిపించి ‘ఇక జీవితంలో మీరిద్దరూ నా కళ్లపడకూడద’ని శాసించాడు పరంధామయ్య. ఏడాది తరువాత ఒంటరిగా తిరిగి వచ్చింది కూతురు. ‘అమ్ములికి జబ్బు చేసింది. బతికించడానికి ఇరవై లక్షలు ఖర్చయింది. తనను తాను ఒక ధనవంతురాలికి అమ్ముకుని అమ్ములిని బతికించాడు. వాడిప్పుడు ఈ దేశంలోనే లేడు’ అమ్ములిని పుట్టింట్లో దింపిన సౌమిత్రి చెప్పిన కథ ఇది. ‘ఆ వెధవ నా కూతుర్ని మోసం చేసి డబ్బున్నదానితో లేచిపోయాడు’ రంకెవేశాడు పరంధామయ్య.
‘నేను బతికి వున్నంతవరకు నిన్ను విడిచిపెట్టను. ఏ కారణంగానైనా నేను నీకు దూరమైతే నువ్వు మీ నాన్న దగ్గరకి వెళ్లిపోతానని మాటివ్వు’ అని చంటి అడిగినపుడు అలాగేనని వాగ్దానం చేసింది అమ్ములు.
అందుకే పుట్టింటికి చేరింది.
‘చంటిని వాడి మామగారు మోసగాడని తిడుతుంటే భరించలేకపోతున్నానురా’ అని సౌమిత్రి ఏడుస్తుంటే ‘వాడు చేసిన పని మాక్కూడా నచ్చలేదురా’ అన్నారు అతని మిత్రులంతా.
దానితో అసలు విషయం చెప్పేసి భోరుమన్నాడు సౌమిత్రి. ‘అమ్ములుని దక్కించుకోడానికి వేరే రాష్ట్రానికి పోయి తన రెండు కిడ్నీలు, డబ్బులూ ఇచ్చి అమ్ములి ప్రాణం కాపాడిన అతను ఒక నక్షత్రకుడిని వాడి వెంట పంపి కిడ్నీలు తెప్పించుకుని తన కొడుకుని బతికించుకున్నాడురా. ‘నేను చేస్తోంది ఎంత తప్పుపనో నాకు తెలుసు. కానీ నా కొడుకు చనిపోతే నేను...’ అంటూ ఆయన ఏడుస్తుంటే మన చంటి ఓదార్చాడురా. నేను ఎంతగా చెప్పినా వినలేదురా. అమ్ములు చనిపోతే నేను బతకడం అనవసరం అన్నాడు.’ ‘నువ్వు లేకుంటే అమ్ములు కూడా బతకదురా’ అంటే ‘నేను డబ్బుకోసం అమ్ముడు పోయానని, అదీ తనను బతికించుకోడానికేనని నచ్చచెప్పి.. తనని వాళ్ల నాన్నకి అప్పగించరా’ అన్నాడు.
విషయం బయటికి పొక్కింది. అమ్ములికి అసలు విషయం తెలిసింది. అమ్ములికి మొదటి నుంచీ తనను వదిలి చంటి మరో అమ్మాయితో ఉంటున్నాడంటే అసలు నమ్మకం కుదరడం లేదు. ‘నువ్వు లేని లోకంలో నేనెందుకుంటాను?’ అని తండ్రికి చీటీ రాసి ఆత్మహత్య చేసుకుంది. ‘అసలు తప్పు చేసింది నేను. ఇద్దరినీ దగ్గరుంచుకుంటే ఇలా జరిగేది కాదు’ అనుకున్నాడు పశ్చాత్తాపంతో పరంధామయ్య!
- జ్యోతిర్మయి, విజయవాడ.

విశ్వనాథవారి ‘అమ్మ ప్రేమ’

ముద్దుముద్దు ‘మాతల’ బాలరాముడు!

‘తానో‘లాములు’, తండ్రి పేరెవరయా? ‘దాచా తమలాలు’ ‘నౌ
లే నాపే ర’న ‘నమ్మగాల’నగ నోలిందల్లి ‘కౌసల్య తం
డ్రీ నాఁగా’ననఁబోయి రాక కనులన్ నీర్వెట్ట ‘గౌసల్యనేఁ
గానే కానులె యమ్మనే’యని ప్రభున్ గౌసల్యముద్దాడెడిన్!
(రామాయణ కల్పవృక్షం - బాలకాండ - అవతార ఖండం - 334వ పద్యం)

లేలేత బాల్యదశలోని చిన్నారి రాముని మూడు- మూడున్నరేండ్ల ప్రాయపు ముగ్ధ సుకుమారపు ముచ్చట్ల, మురిపాల, వచ్చీరాని ముద్దుముద్దు మాటలను విని కౌసల్య అనిర్వచనీయ ఆహ్లాద, అనుభూతులతో పొంగిపోతున్న ఘట్టమిది. సార్వజనీన, సార్వకాలిక, సహజ భాష, సరళ భాషా సౌందర్య సమన్వితంగా విశ్వనాథవారు ఈ పద్యరచన చేశారు.
కౌసల్య, రాముల సంభాషణ ఇలా సాగిందట.
కౌసల్య: నాన్నా నీపేరేమిటి?
రాముడు: ‘లాములు’
కౌసల్య: నీ తండ్రి పేరేమిటి? ఎవరు?
రాముడు: ‘దాచాత మాలాలు’ (దశరథ మహారాజు)
కౌసల్య: సరే. మరి నాపేరు?
రాముడు: ‘అమ్మగాలు’ (అమ్మగారు)
కౌసల్య: కౌసల్య కదా నాన్నా?’
కౌసల్య రుూ మాట అనేసరికి రాముడికేడుపొచ్చింది. కళ్ల వెంట గిర్రున నీళ్లు తిరిగాయి. కొన్ని అడుగుల దూరంగా వెళ్లిపోయి నుంచున్నాడు- బిక్క మొహంతో. కౌసల్యకు దగ్గరగా రాలేదు. కౌసల్యకు రాముడి మనసులోని బాధ అర్థమయింది. తన చిన్నారి తనయుని పసిమనసుకు తన ఒక్కమాటలో ధ్వనించిన అనాత్మీయతా భావం ఏమిటో కౌసల్య మనసుకు తట్టింది. ‘ఈమె తన అమ్మకాదా? కౌసల్య అని ఏదో పేరు చెబుతోందేమిటి? అమ్మ అనేదానిలో తాను అనుభవిస్తున్న సొంతదనం కౌసల్య అనటంలో ఎక్కడుంది? పైగా తానెప్పుడూ ఆ పేరు విన్నట్టు, అన్నట్టూ లేదే! తనకు తెలిసింది ‘అమ్మ’ మాత్రమే. తాను పిలిచేది ‘అమ్మా!’ అని మాత్రమే. ‘కౌసల్య’ అనటంలో తనకు ఏర్పడుతున్న ఈ పరస్పర తాభావనా పూర్వక ఎడబాటు ఏమిటి ఉన్నట్టుండి’ అనే మూగబాధతో తన చిన్నారి రాముని లేతమనసు విలవిలలాడిపోయిందని గ్రహించింది కౌసల్య. వెంటనే ‘నేను కౌసల్యను కాదులే నాన్నా! మీ అమ్మనే’.. అంటూ కౌసల్య తన బిడ్డడిని ముద్దులతో ముంచెత్తింది.
ఈ పద్యంలో మహాకవి విశ్వనాథ లోకజ్ఞతాపరంగా, భాషాపరంగా, భావపరంగా, అనుభూతిపరంగా అద్భుత రచనా శిల్పం చూపించారు.
విశ్వనాథ తన రామాయణంలో సీత, రామాది పాత్రలను అన్నింటినీ నూటికి నూరు పైసలు తెలుగింటి వ్యక్తులుగానే, తెలుగువారల ఆచారాలు, భాషా కాకువులు, సుడికారాలతో నిండి ఉన్నవారుగానే చూపించారు. అది విశ్వనాథ తన మాతృభాష విషయంలో పెంచుకున్న ఆత్మీయత.
‘లాములు’, ‘దాచాత మాలాలు’, ‘అమ్మగాలు’ పదాలు సుందర్భోచిత, పాత్రోచిత సహజ సుందరంగా అమరి, ఇమిడిపోయాయి. ‘దశరథ మహారాజు’ అంటే వచ్చే గణభంగ ప్రమాదాన్ని అలవోకగా సముద్రాన్ని దాటిన హనుమంతునిలాగ దాటేశారు ‘దాచాత మాలాలు’ అనే ముద్దులు మూటగట్టే ముచ్చటైన బాల్యదశా ఉచ్ఛారణా సహజ సౌందర్యపు పంచదారపూతతో! ముఖాముఖి సంభాషణలు ఎప్పుడూ పొడిపొడి మాటల్లోనే ఉంటాయి. ఈ పద్యంలోని తల్లీబిడ్డల ప్రశ్నలు, సమాధానాలు క్రియా పదాలు లేకుండా చాలా తక్కువ పదాలతో సాగిపోయాయి. సందర్భోచిత సంభాషణా సహజ సౌందర్యానికి ఇదీ ఒక ఉదాహరణ. రాముడు కౌసల్య పేరు ‘అమ్మ’ అని చెప్తే కౌసల్య ‘కాదు, నేను కౌసల్యను’ అనగానే రాముడు సంక్షుభితుడైపోయాడు అనే ఊహే అద్భుత గంభీరత, సుందర భావన, అర్ధ్రతాభావాల సమ్మేళనం.
‘ఆత్మావైపుత్రనామాసి (మనిషి యొక్క ఆత్మయే పుత్రుడు) అంటుంది ఉపనిషత్తు. పరమాత్మ యొక్క ఒక సూక్ష్మాంశమే జీవాత్మ అంటుంది వేద వాఙ్మయం. ఏకాత్మతాభావం అమ్మ అనే ఆత్మీయ పదంలో ఉన్నదిగానీ రాముడు, కౌసల్య అంటూ వ్యక్తీకరించే రూప నామ భావార్థాల్లో లేదు. ‘మరి అమ్మ అనే ఈ జీవి పరమాత్మ అయిన తనకు, జీవాత్మ అయిన అమ్మకు తేడాగా రుూ ప్రాపంచిక భావంలో మాట్లాడుతోందేమిటి?’ అంటూ పరమాత్ముడు జీవాత్మ వైపు చూసి ద్రవించిపోయాడు. ఈవిధమైన పరోక్ష గంభీరార్థం కూడా ఇమిడి ఉంది. ఇది విశ్వనాథవారు తరచుగా ప్రస్తావిస్తూ ఉండే ‘జీవుని వేదన’ - పరమాత్మ వైపు నుంచి. ఇదొక చమత్కారం. (ఆయన తన సంభాషణల్లో తరచూ వాడుతూ ఉండే పదం)
రాజుల ఇళ్లలో, క్షత్రియ కుటుంబాల్లో అమ్మను గూడా ‘అమ్మగారూ’ అనే పిలుస్తారు. ఇక్కడ రాముడు కూడా ‘అమ్మగాలు’ అనే అంటాడు. ఇది కవి లోకజ్ఞతకు చక్కని తార్కాణం.
పద్యం చివరలో ‘ప్రభున్’ అన్నాడు కల్పవృక్ష కవి. ‘సుతున్’ అని గాని, ‘శిశున్’ అనిగాని అనలేదు. కౌసల్య మనసుకు రాముడు కేవలం కొడుకు మాత్రమే కాదు, ప్రభువు! ‘ప్రభవతి సమర్థ్భోవతి - ఇతి ప్రభుః, సమర్థుడైన వాడు’ అని ప్రభువు పదానికి అర్థం. రాజు అని కూడా. ప్రతి తల్లీ తన కొడుకును ముద్దాడుతున్నప్పుడు ‘మా మహారాజు! మా దొరబాబు! పెద్దైతే ఏమైనా సాధిస్తాడు. రేపు అన్నిట్లోనూ అగ్రేసరుడై ఉంటాడు. నా బంగారు కొండ’.. అంటూ ఉంటుంది. ఇది ప్రతి తల్లికీ తన బిడ్డడి మీద ఉండే (ఆశీర్బల) విశ్వాసం, ఆశ. ఈ మాతృ సహజ భావనే కౌసల్యకు కూడా ఉన్నదని చెప్పటం కోసం విశ్వనాథ ఇక్కడ ‘ప్రభు’ శబ్దం మాత్రమే వాడారు.
‘ముద్దాడెడిన్’ అన్నారు విశ్వనాథ. ముద్దు పెట్టుకోవటం వేరు. ముద్దాడటం వేరు. ముద్దు పెట్టుకోవటం అంటే ఒక్క ముద్దు అని మాత్రమే అర్థం. ముద్దాడటం అంటే ముద్దుల మీద ముద్దులు పెట్టుకుంటూ బుజ్జగిస్తూ కొన్ని నిముషాలు గడపటం. రాముడి ఆత్మీయతా భావ దుఃఖాశ్రువులను, బిక్క మొహాన్ని, బుంగమూతిని చూసేసరికి తన రాముడిని ఒక్కసారి ముద్దు పెట్టుకోవటంతో కౌసల్యకు తనివి తీరలేదు. ముద్దుల మీద ముద్దులు పెట్టి ఎంతగానో బుజ్జగించింది. పిల్లవాడు అలిగినప్పుడు, బుంగమూతి పెట్టినప్పుడు, కన్నీటి బొట్లు బొటబొటా కార్చినప్పుడు ఏ తల్లైనా ఇలాగే చేస్తుంది. ఇంత విస్తృత సహజ సుందర భావం ఉంది ‘ముద్దాడెడిన్’ అని కవి అనటంలో. ఇలా పద్యపు ముగింపు పదంలో కూడా - అంటే - చిట్టచివరి పదంలో కూడా విస్తృతార్థాన్ని ధ్వనింపజేయటం విశ్వనాథకు వెన్నతో బెట్టిన విద్య.
ఈ పద్యంలో కనిపించేది తెలుగు రాముడు - భాషా పరంగా. ఈ విశ్వనాథ ‘రాముడు’ పిల్లలు, పాపలు గలగలలాడుతుండే ప్రతి ఇంట్లోని అలకల రాముడు. ముద్దాడేది మా అమ్మ, మీ అమ్మ, అందరి అమ్మ. సహజ సుందరత తెలుగమ్మలది. ఇక భావానుభూతి రసజ్ఞుడైన ప్రతి పాఠకుడిది. ముద్ర మాత్రం విశ్వనాథది. విశ్వనాథ తానె పోతనకు సాటి. (తానె పోతనకు సాటి, తానెపో తనకుసాటి).

- శ్రీపతి పండితార్యాధుల పార్వతీశం,
హైదరాబాద్.
చరవాణి : 9849779290

పుస్తక పరిచయం

శాకంబరీ అవతార ఆంతర్యం.. శ్రీ దీపదుర్గా పూజావిధి

శ్రీమతి బలభద్రపాత్రుని భానుమతి కేశవరావు కలం నుంచి అమ్మవారికి సంబంధించిన మరో గొప్ప ఆధ్యాత్మిక వ్యాస సంపుటి శాకంబరీ అవతార ఆంతర్యం - శ్రీ దీపదుర్గా పూజావిధి భక్తులకు ఓ కానుకలా వెలువడింది.
దీపానికి మరో పేరు జ్యోతి. జ్యో తిని జ్ఞానానికి, హృదయానికి, శక్తికి ప్రతిరూపంగా చూస్తాం. అందుకే దేవుని ముందు దీపం వెలిగించమంటారు. సాయంసంధ్య వేశ దీప దర్శ నం చేసుకోమంటారు. కార్తీక మాసం లో దీపదానం చేయమంటారు. దీపదానం వల్ల యమ దండన వుండదు. పితృదేవతలు తరిస్తారు. దీపాన్ని దర్శించటమే కాదు, దీపదుర్గా పూజ చేయటం ఎంతో మంచిది. దీపదుర్గా పూజ వల్ల రాహుగ్రహ దోషం తొలగిపోతుంది. సౌభాగ్య వృద్ధి, ఉద్యోగం, వివాహం, సంతానం, స్వగృహం కోసం దీపదుర్గా పూజ ఎంతో మంచిది. అలాంటి దీపదుర్గా పూజా విధానం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆ పూజ విధానాన్ని సంపూర్ణంగా వివరించారు రచయిత్రి. పూజా విధానం ద్వారా పాఠకులు తమ మనోభీష్టాన్ని నెరవేర్చుకోటానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇందులోనే మరో అంశంగా శ్రీ శాకంబరీ అవతార ఆంతర్యాన్ని వివరించారు రచయిత్రి. భూలోకంలో వర్షాలు సరిగా లేక, పంటలు పండక అనావృష్టి సంభవించగా, ప్రజలు జగన్మాతను ప్రార్థించారు. ఆమె అవతరించి నూరు కన్నులతో ముల్లోకాలను కాపాడుతుంది. దేవి దేహం నుంచి శాకములను పుట్టించి ప్రజల ఆకలిని తీర్చుతుంది. వర్షాలు కురిపించి జగతిని సస్యశ్యామలంగా మార్చుతుంది. దేవి దేహమంతా శాకములు వచ్చినందున ఆ దేవిని శాకంబరిగా కొలుచుకుంటున్నాం. దుష్ట సంహారం చేసిన ఆ దేవిని అనేక నామాలతో భక్తులు కొలుస్తారు. ఆ నామాలు, వాటి విశిష్ఠత గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే. దుర్గామాతకు ఎన్ని పేర్లు? నిత్యం జపించాల్సిన నామాలెన్ని? నవదుర్గా స్తుతి, శ్రీ దుర్గాంద్వాత్రిశన్నామ మాతా, శ్రీ దేవి ఖడ్గమాలార్చన స్త్రోత్రాలు ఇందులో ఇచ్చారు. ఇవికాక చండీ హృదయం, వనదుర్గా హృదయమ్ వంటి వాటిని మనం చదవచ్చు. చివరగా భక్తుల కోసం దేవీ నవరాత్రులలో తిథుల వారీగా చేయవలసిన నైవేద్యాలు, శ్రీ దీపదుర్గా మానస ధ్యానం ఇందులో ఇవ్వటం వల్ల భక్తులు సులభంగా అమ్మవారిని ప్రసన్నం చేసుకొని తమ కోర్కెలు తీర్చుకునే అవకాశం లభిస్తుంది. దుర్గమ్మ అనుగ్రహం సులభంగా పొందాలనుకునే వారికి ఇది మంచి పుస్తకం.
పుస్తకం: శాకంబరీ అవతార ఆంతర్యం - శ్రీ దీపదుర్గా పూజావిధి
వెల: రూ. 35/-
రచయిత: శ్రీమతి బలభద్రపాత్రుని భానుమతి కేశవరావు
ప్రతులకు: లలితా జ్ఞానపీఠము, డోర్ నెం. 14- 10- 73, శివాలయం వీధి, మారీస్ పేట, తెనాలి, గుంటూరు జిల్లా. సెల్ నెం. 8297508710
బికెఎం చక్రవర్తి, అడ్వకేట్, 133/ఎ, టీచర్స్ కాలనీ, ఈస్ట్ మారేడ్‌పల్లి, సికింద్రాబాద్. సెల్ నం: 9885022458

- విష్ణ్భుట్ల రామకృష్ణ,
విజయవాడ.
చరవాణి : 9440618122

మనోగీతికలు

అపరిచితులం
అపరిచితులం మనకు మనమే
పక్కింటోడికి ఎదురింటోడు
అపరిచితులు!
ఒకరికొకరు పలకరింపులు లేవు
మాటల స్పర్శ లేదు
తెలిసికూడా తెలియనట్లు నటించటం
ఇక్కడి జనం మనస్సు సహజ నైజం
మాట ముఖ్యం ఏనాటికైనా
ఆత్మీయతానురాగం
పిట్టగూడులా అల్లుకున్నట్లుండాలి
పొద్దంతా నీలాకాశం
ఆహార విహారం చేసిన
చీకటిరంగు పులుముకున్న
ప్రకృతి తనువు నిండా
రాత్రి మజిలీ కోసం
పశుపక్ష్యాదుల
విశ్రాంతి మందిరాల కోసం వెదుకులాట!
మనుషులు మాత్రం అంటీముట్టనట్లు
ఎవరికివారే అపరిచితుల్లా సంచారం
ఈ మనిషే గుండెకింది తడినెప్పుడో
పోగొట్టుకున్నాడు
అత్యాశలతో స్వార్థం కచేరీలు చేస్తున్నాడు
నిరంతరం వేగమే చక్రాలుగా కాళ్లకు
తగిలించుకొని ఒకటే పరుగుల బతుకు
ఇపుడు బతకడమే
ఇంకొకడి మీద గుర్రపు స్వారీ!
నేనిప్పుడు మనిషిని మనిషిగా ఆరాధించే
ప్రేమైక మనిషి కోసం వెతుకుతున్నా
మనిషే నా విశ్వాస సంతకం
మనిషే నా సకలం
మనిషితనం నిండా
వెనె్నల ఆరబోసినట్లున్న కాలం కోసం
నిరంతరం తపస్సు చేస్తున్నా
ప్రతీ క్షణం సజీవ నదీ ప్రవాహంలా
నిండుగుండెతో పలకరించే
మనిషితనం, పచ్చదనంతో పసిడి నిండే
కాలాన్ని కోరుతున్నా
నేనిప్పుడు మనిషిని మనిషి ఆరాధించే
ప్రేమమయ మనిషి కోసం వెతుకుతున్నా
మనిషితనం నిండార వెనె్నల ఆరబోసినట్లున్న
మనిషి కోసం నిరంతరం తపన పడుతున్నా
ఒక నూతన సుపరిచిత మానవీయ
మమతల మల్లెల సుగంధాల
జీవనాన్ని ఆహ్వానిస్తున్నా
అందరూ పరిచితుల్లా పలకరించే
మనిషి కోసం
ఆ ఆదర్శ ప్రేమజీవన
సౌందర్యం కోసం అనే్వషిస్తున్నా!

- సిహెచ్ ఆంజనేయులు,
ఖమ్మం.
చరవాణి: 7702537453

ఎదురుచూపు
నా రూపానికి
ప్రతిరూపమైన
రక్తస్పర్శ పట్ల
అమిత మమకారం

నా మనోవల్మీకంలోని
జ్ఞాన పరిమళాన్ని ప్రసరించి
బిడ్డ భవిష్యత్తును
వెలిగించాలన్నదే నా అభిమతం

సాటిలేని రుజువర్తనకి
మేటి శీల నియతికి
ప్రతీకగా
నిలపాలన్నదే నా లక్ష్యం

బాబు ప్రతి కదలికని
పర్యవేక్షిస్తూ
క్రమశిక్షణా బెత్తం
ఝుళిపిస్తుంటానని కాబోలు
చిట్టికన్న పంతం

చిరుప్రాయమునే
ఇల్లు విడిచి
మమతామయిని మరచి
అనుబంధాల తలపునే తుంచి

ఏ దిశకి నడిచాడో
ఏ లోగిలికి చేరాడో
వాడి చిరునామా
ప్రశ్నార్థమైన వేళ

దిగులు గుబులు వేదనతో
ప్రతి నిముషం
నా హృదయ ఫలకం మీద
వాడి నామధేయం
దిద్దుకుంటూనే వుంటా
కన్నబిడ్డ రాక కోసం నిరీక్షిస్తూ
బాధాశ్రువులతో గుండెల్ని
తడుపుకుంటూనే వుంటా

ఏడీ..?
వాడిపుడెక్కడున్నాడో?
మెరుపుతీగలా
వాడెపుడొస్తాడో..?

- సందుపట్ల భూపతి, మంగళగిరి, గుంటూరు జిల్లా.

జగమంతా జపియించె
సీ. సింధుజ! నీ పేరు బంధువులేకాదు
జగమంత జపియించె రక్తితోడ
అవనిజ! నీ కీర్తి ఎవరెస్టుకి ఎగసీ
రెపరెపలాడెను జెండ లాగ
స్వర్ణజ! పోరాడి సాధించిన పతకం
భరతమ్మ మెడలోన హారమాయె
తరుణిమా! వంటిల్లు దాటని వనితలకు
మహిళల మహతును చాటినావు

ఆ.వె. పిన్న వయసులోన ఎనె్నన్నో విజయాలు
కోరి సింధును వరియించినాయి
ఆటవస్తువు కాదురా ఆడదంచు
బంతులాటలాడి యింతిచూపె

తే.గీ. విశ్వవేదిక ఆటలో వెండిబిళ్ల
గెల్వటము చిన్న విషయము లేదు సుమ్మి!
వెర్రిగా చూసే క్రికెట్టు వీక్షకుల
సింధు ఆటను చూసిరి సిగ్గుపడక!

- జి సూర్యనారాయణ,
బందలాయి చెరువు, కృష్ణా జిల్లా.
చరవాణి : 9704784744

email: merupuvj@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net

- జ్యోతిర్మయి, విజయవాడ.