విజయవాడ

టాపర్ (కథానిక )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయికృష్ణ నాలుగంటల నుండి కొడుకుని లేవుతున్నాడు. కానీ ముసుగుతన్ని మరీ పడుకుంటున్నాడు.
‘ఒరేయ్ సన్యాసీ! లేవరా. ఇంజనీరింగ్‌లో రెండు సబ్జెక్టులు పోయాయి. లేచి చదువుకో. పరీక్షలు దగ్గరకొస్తున్నాయి’
‘ఇంకో గంట పడుకుంటా నాన్నా. ఐదు గంటలకి లేస్తానులే’
‘ఒరేయ్ రాజీవ్ లేవరా! బాగా చదవకపోతే ఉద్యోగం రాదు’
‘గూగుల్‌లో గానీ, మహేంద్రలో గానీ వస్తాదిలే నాన్నా’
‘ఆఁ ఎలా వస్తాదిరా.. పాస్ అవ్వకపోతే!’ అంటూ ఎయిర్‌కూలర్ ఆపేశాడు. దెబ్బకు లేచి కూర్చోన్నాడు రాజీవ్.
‘పుస్తకం పట్టుకొని బయటికి రా. ఇక్కడ హాయిగా చదువుకోవచ్చు’
‘బయటా..? వద్దు. ఇక్కడ చదువుకుంటానులే’
‘పదా’..! అంటూ గర్జించాడు సాయికృష్ణ.
మొబైల్, పుస్తకం పట్టుకొని బయకొచ్చాడు రాజీవ్.
అక్కడ పుస్తకం తీయడం మానేసి మొబైల్‌లో వాట్సాప్, ఫేస్‌బుక్ ఆన్ చేశాడు.
‘ఏరా! ఇంత పొద్దునే అవి అవసరమా?’
‘గుడ్ మార్నింగ్.. అని పెట్టాలికదా! లేకపోతే ఫ్రెండ్స్ ఫీలవుతారు’
‘మరీ నీ మెసేజ్ కోసం ఎదురుచూస్తుంటారా వాళ్లు?’ అంటూ మొబైల్ లాక్కున్నాడు సాయికృష్ణ.
‘కాసేపు’.. అంటూ చిన్నగా గొణిగాడు రాజీవ్.
‘పో! వద్దుపో!’ అంటూ తన జేబులో పెట్టుకున్నాడు సాయికృష్ణ.
‘ట్రింగ్.. ట్రింగ్‌మంటూ పావుగంట సేపు మేసేజ్‌లు వచ్చాయి.
‘ఎంట్రా అలా సౌండ్ వస్తోంది’
‘గ్రూప్ మేసేజ్‌లు నాన్నా. ఒకసారి ఇవ్వండి చూస్తాను’
‘ఏ వద్దులే’! అంటూ సెల్ స్విచాఫ్ చేశాడు సాయికృష్ణ.
‘ముందు ఫస్టియర్ సబ్జెక్టులు పాసవ్వు’
‘మీకు ఎలా చెప్పాలి? అవి చదవడం చాలా కష్టం. ఉదయం లేచి చదివితే వచ్చేస్తాయా?’
ఇంతలో ‘పేపర్’.. అంటూ పట్టుకొచ్చాడు శ్రీనాథ్.
‘ఏం రా శ్రీనాథ్’ అంటూ పలకరించాడు రాజీవ్.
ప్రతిగా శ్రీనాథ్ నవ్వాడు.
‘ఇతనెవరు? నీకు తెలుసా’ రాజీవ్‌ని అడిగాడు సాయికృష్ణ. ‘మా కాలేజ్ టాపర్ నాన్నా’
‘టాపరా!’.. అంటూ ఆశ్చర్యపోయాడు సాయికృష్ణ
‘టాపర్‌వి అయ్యుండి డైలీ పేపర్ వేయడం ఏమిటి?’ అడిగాడు.
‘పేదరికం సార్. నాన్నగారికి ఒంట్లో బాగోలేదు. అయినా పనిచేయడానికి వెళతారు. అమ్మ కూరగాయల గంప పట్టుకుని ఊరారా తిరిగి అమ్ముతుంది. కానీ ఎంత కష్టపడినా ఇంటి అద్దెకే సరిపోతోంది. మరి తినడానికి ఉండాలి కదా! అందుకే ఉదయమే పేపర్ వేస్తాను. తర్వాత కాలేజ్‌కి వెళతాను. సాయంత్రం ఓ చెప్పుల షాప్‌లో పనిచేస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత చదువుకుంటాను’ వివరించాడు శ్రీనాథ్.
ఆ మాటలు రాజీవ్‌కి ఎక్కడో గుచ్చుకున్నాయి.
‘ఇక ఉంటాను సార్! చాలా పేపర్లు వేయాలి’ అంటూ టాపర్ వెళ్లిపోయాడు.
‘నాన్నా’! అంటూ తండ్రిని హత్తుకున్నాడు రాజీవ్. ‘బాగా చదువుతాను నాన్నా. ఏమి చేయాలో ఇప్పుడు తెలిసింది’ అంటూ అప్పటి నుంచి పుస్తకాలతో కుస్తీ పట్టాడు రాజీవ్. సోషల్ నెట్‌వర్క్ సైట్స్‌కి దూరంగా ఉన్నాడు.

- నల్లపాటి సురేంద్ర,
చరవాణి : 9490792553

చిన్న కథ

తూరుపు తిరిగి...
‘ఈ నాలుగు ఐదు వందల నోట్లు ఇచ్చి రెండు వేల రూపాయల నోటు తీసుకురా’ అని తల్లి చెపితే రెండు గంటలు క్యూలో నిలబడి సాధించాడు. బస్సుకి చిల్లర లేదు, ఆటోవాడికి కూడా రెండు వేల నోటు చూపించాడు. వాడు పెదవి విరిచాడు. ఇక గత్యంతరం లేక స్కూలుకి టైమ్ అయిపోతోందని పరుగు పరుగున ఇంటికి చేరేసరికి ఒళ్లంతా తడిసి ముద్దయింది. జేబులోని రెండు వేల నోటు తీసి తల్లికిచ్చాడు. వెలిసిపోయిన నోటుని చూసి తెల్లబోయిందామె.
‘నోటు తడిస్తే ఎలా? పూర్వం నోట్లు నానబెట్టినా వెలిసేవి కావుగా! ఇప్పుడేమిటి దారి?
‘తూర్పు ఎటు?’ అడిగింది తల్లి.
‘రోజూ నువ్వు ఆదిత్య హృదయం చదువుతావుగా. సూర్య నమస్కారాలు కూడా చేస్తావు. ఇప్పుడు నన్నడుగుతావేమిటమ్మా?’ ఎదురు ప్రశ్నించాడు తనయుడు.
‘ఇప్పుడు నా బుర్ర పనిచేయడం మానేసిందిరా! ఏం జరుగుతోంది? ఏమి జరగబోతోంది? వంద నోటుకి చిల్లర లేక పక్కింటామెను అడిగి గ్యాస్ సిలెండర్ వాడికిచ్చేదాన్ని. ఇప్పుడు రెండు వేల నోటుకి చిల్లర ఎవరిస్తారు? అందుకే తూర్పు తిరిగి దండం పెట్టి ఆ ఆదిత్యుని వేడుకుందామని’ అందా తల్లి నిస్పృహగా!
(2వేల నోటు వెలిసిపోతుందనే పుకారుని నమ్మి)
- గంగాధరుని శ్రీహర్ష, 9వ తరగతి,
సత్యసాయి స్కూలు, గుంటూరు.

‘సోమేపల్లి’ చిన్న కథల పోటీ..
సింహప్రసాద్ రచనకు
ప్రథమ స్థాయి పురస్కారం
సోమేపల్లి హనుమంతరావు స్మృత్యర్థం ఇటీవల రమ్యభారతి సాహిత్య త్రైమాస పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి చిన్న కథల పోటీలకు 126 కథల పరిశీలనకు రాగా హైదరాబాద్‌కు చెందిన సింహప్రసాద్ రచన ‘మనుష్యరుణం’ కథకు ప్రథమ స్థాయి సోమేపల్లి పురస్కారం లభించింది. తటవర్తి నాగేశ్వరి (కొవ్వూరు) రాసిన ‘రఘుపతి రాఘవ రాజారాం’కు ద్వితీయ స్థాయి, రంగనాథ రామచంద్రరావు (హైదరాబాద్) రాసిన ‘నాలుగు ఉత్తరాలు - ఒక సమాధానం’ తృతీయ స్థాయి సోమేపల్లి పురస్కారాలు లభించాయి. ఎంఎస్ శాయిబాబు (గుంటూరు) రాసిన ‘పండుగ జరుపుకుందాం’, వియోగి (కర్నూలు) రాసిన ‘తాపత్రయం’, మంత్రవాది మహేశ్వర్ (హైదరాబాద్) రాసిన ‘మాటకందని వౌనం’ కథలు ప్రోత్సాహక బహుమతులకు ఎంపికయ్యాయి.
విజేతలకు నగదు బహుమతులతో పాటు వచ్చే ఫిబ్రవరి తొలివారంలో విజయవాడలో జరిగే సభలో జ్ఞాపిక, శాలువాతో అతిథుల సమక్షంలో ఘనంగా సత్కరిస్తారు. ఈ పోటీలకు ప్రముఖ రచయిత కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారని అవార్డు కమిటీ చైర్మన్ సోమేపల్లి వెంకటసుబ్బయ్య, రమ్యభారతి ఎడిటర్ చలపాక ప్రకాష్ ఒక ప్రకటనలో వివరించారు.

పద్యకావ్యంపై సమీక్ష

‘గోపీనాథు’ని ‘ప్రేమ’కవితా బృందావనం!
ప్రేమరూపాలు పద్యకావ్యం
కవి: శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు
పేజీలు: 48, వెల: రూ.60/-.
ప్రతులకు: రచయిత, 23-17-8, స్కూల్ స్ట్రీట్, సత్యనారాయణపురం,
విజయవాడ - 520011.
చరవాణి : 9848293119

‘ప్రేమకు ప్రేమనిచ్చి కడు ప్రేమగ జూచెడి వారి ప్రేమకున్,
ప్రేమయె విశ్వరక్షణకు పెట్టనికోటగ నెంచువారికిన్,
ప్రేమను లోకవృద్ధికొక ప్రేరణగా గణియించువారికిన్,
ప్రేమయె దైవరూపమని పేర్కొనువారికి నా ప్రియాంజలుల్’ (పుట 13)
ఇలా పలికే కవి ఎరుకలపూడి గోపీనాథరావుగారు కాక మరెవరౌతారు? ఇది ఆయన ‘ప్రేమరూపాలు’ అనే కావ్యారంభంలోని పద్యం. విద్వాన్ గొట్టిముక్కల సుబ్రహ్మణ్యశాస్ర్తీగారి ‘ప్రియావలోకనం’ పీఠిక ఈ కృతిలతాంగికి చెరగని వసంత తిలకమే. ఈ కృతి నిజంగా ‘ప్రేమాదీని ప్రేమ మధ్యాని ప్రేమాంతాని’! ‘ప్రేమ రూపాల’ను విశిష్టంగా ప్రదర్శించిన ఈ కవి కేవలం ‘కామ్’గా వుండే కవి కాదు. ఇంతకుముందు ‘ఒక ప్రయాణం వంద మలుపులు’ (కవిత్వం), ‘కాలస్పర్శ’ (వచన కవిత్వం), ‘అక్షరార్చన’ (వచన కవిత్వం), ‘పద్య ప్రసూనాలు’, ‘జాగృతి’ (వచన కవిత్వం), ‘నానీల వాణి’ అనే పేర్లతో, అనేక ప్రక్రియల్లో తెలుగులో కవితా కచేరీ చేసిన ప్రముఖుడు. ఇప్పుడు విశేషించి ప్రేమనూ, దాని తత్త్వాన్నీ అక్షరాలా ‘ఫ్రేమ్’ కట్టించిన కవి - కావ్యరూపంలో! ఇంకో విశేషం - ఈ కవి జన్మతః మహారాష్ట్ర ప్రాంతీయుడు. కేవలం 5వ తరగతి వరకే తెలుగు చదువుకున్నవాడు. ఎస్సెస్సీ వరకు హిందీ మాధ్యమంలో, ఇంటర్మీడియట్ ఆంగ్ల మాధ్యమంలోనూ చదువుకున్నవాడు. ప్రస్తుతం విజయవాడ నివాసి. అలాంటి వ్యక్తి తెలుగులో ఇన్ని కవితా సంపుటాలు వెలువరించారు.
అసలు - ‘గోపీనాథుడం’టే కృష్ణుడు. మధుర ప్రేమ భావుకుడు. అలనాటి కృష్ణుడు గోపికల్ని దివ్యప్రేమ విరహ వేదనకు గురిచేసి, చివరికి వారినాదరించి గోపీనాథుడయ్యాడు. ఈ ‘గోపీనాథుడు’ తన ప్రేయసి వలన విరహ వేదనకు గురయ్యాడు. తనదైన అనుభూతి తనదిగా దీన్ని రచించారు. ఈ ‘ప్రేమరూపాలు’ కావ్యరచనోద్దేశాన్ని
‘ప్రణయ వైచిత్య్రమిడిన వైరస్యములను
రూపమును, ప్రేమతత్త్వ వైరూప్యములను
తెలియజేసితి నాదైన తీరునందు
స్వీయ సంతాపమును దెల్పు స్వేచ్ఛతోడ
నెడద కన్నీట నక్షరాల్ తడియజేసి!’ (పుట-46) అని చివరలో తెలియజేశారు. నిజంగా తన హృదయమనే కన్నీటిలో అక్షరాలను తడిపి, దానినే ‘సిరా’గా చేసికొని మరీ రాశారు - ఈ కావ్యాన్ని తాను ప్రేమతత్త్వపు ‘టెరుకలపూడి’యై! ఎలాబడితే అలా ప్రేమనూ, విరహ వేదననూ ఒలకబోయడం కాదు - ఈ కవి ఉద్దేశం. ప్రేమతత్త్వమేమిటో, ఈవిషయంలో ఆయన అభిప్రాయమేమిటో వ్యక్తీకరించారు ఇలా చివరిగా..
‘వ్యక్తిగతమైన అనుభవాల్ వ్యక్తపఱచి
ప్రణయ మాహాత్మ్యమున్ కించపఱచనెపుడు
వలపుటెద యొకటెన్నడో భగ్నమయిన
పెరిమ గరిమము మొత్తమ్ము తఱగిపోదు!
ఎచ్చటో ఒక్క ప్రేమాత్మ మెడరినంత
వలపుతలపుల పూదోట వాడిపోదు!’ (పుట-47). లోకానికి ఎలాంటి ప్రేమ కావాలో, ఆరోగ్యకరమైన ప్రేమ స్వరూపమేమిటో ఇలా తేటగీతిలో తేటతెల్లం చేశారు
‘వలపు వంచన లెవరికున్ వలదు వలదు!
కలయికల యందు నెడబాటు కలతవలదు
నిత్యమై, సత్యమై ప్రేమ నిలువవలెను
పెరిమయే లోకరక్షణై వెలయవలెను’ (పుట-47). గొట్టిముక్కల వారన్నట్లుగా ఈ కావ్యమంతా ఒక భగ్నప్రేమికుని వియోగ వేదనా వాసుదేవమే! సర్వశ్రీ దేవులపల్లి, అబ్బూరి, తల్లావజుల, వేదుల, పెనుమర్తి వార్ల భావచ్ఛాయలున్నప్పటికీ, దీనిలోని శత సంఖ్య పద్యాలూ ‘అర్థమ్ము కాని (ప్రేమ) భావగీతమ్ములు’ మాత్రం కావు!
ఈ కవి ఇప్పటివాడైనప్పటికీ తన ఇతర కృతుల్లో వర్తమాన సమాజాన్నీ, దానిలోని సంక్లిష్టతనూ ఎంతగానో వ్యక్తీకరించినప్పటికీ ఈ కావ్యంలో మాత్రం ఊహా ప్రేయసీలోలుడయ్యాడు. అసలు - నిజంగానే ప్రేయసి ఉన్నా ఉండవచ్చు కూడా! ఆ ప్రేయసి ఈ ‘గోపీనాథ’ హృదయాన్ని దోచుకుంది. ఏ కారణం చేతనో దూరంగా నెట్టివేసింది. ‘సఖియొక రెప్పపాటు తన బారెడు కన్నుల చూపులొల్కినన్ సుఖములు పొంగి పొర్లునెద’! (పుట-14). ఈ కవికి ‘జీవన మార్గమందు చెలి స్నేహవసంతము నేర్పరించి, ఆ/ తావుల నా సదాశయ లతాంతవనమ్ములు పూయజేయుచున్/ వావిరియైన హర్షముల బంధము పన్నుచు; వీడిపోని నె/ త్తావులకున్ మనమ్మునొక ధామము జేయగ నిశ్చయంబు’ (పుట-15) గైకొన్నంతగా వలపును ప్రదర్శించారాయన. ‘రానా! నీ మృదు బాహుబంధముల కారాగారమాశించి.. (పుట-16) అని తన కోరికను నివేదించారు కూడా. కానీ, లాభం లేకపోయింది. ‘కంటికి మంటికి నేకధారగా వలవల యేడ్చినాను తెలవారినదాకను నిన్ దలంచుచున్’ (పుట-34) అనడం ఈ కవి వంతయింది. తెలుగు నుడికారంతో ‘మదినొకమారు కాల్చి బసుమం బొనరించదు పాడుప్రేమ’ (పుట-27) అని కూడా అనుకున్నారు. ఇక్కడ ‘అంతర్బాహ్య మాద్యంత మందతివా! నీవెవసించి నన్నిటుల నల్లాడించుటల్ మానవే! (పుట-35) అనడంలో - ముఖ్యంగా ‘అల్లాడించుటల్’ అన్న అచ్చమైన తెలుగు పదాన్ని యతి స్థానంలో ఉంచడం వల్ల ఆ ప్రేయసి ఈ కవి హృదయాన్ని ఎంతగా క్రక్కదలించిందో పఠితల హృదయాలకు మరపురాని రీతిగా అనుభూతవౌతోంది. పాపం! ఈ కవి ‘ఎదకన్నుల కూర్మి తటాకమంతయున్ శోకాల సముద్రమవుతోంద’ట! (పుట-35). ఇక్కడ ఎదకూ, కన్నులకూ అభేదాన్ని చెప్పారు. స్పందనను తెలిపే జ్ఞానేంద్రియం ఎద అనే కన్ను. ఆ కూర్మి తటాకమంత. పాపం - ఆ ప్రేయసి ఏ కారణం వల్లనో ఈ ప్రియుణ్ణి విడిచి వెళ్లడం వల్ల ఆ ప్రేమచెరువు కాస్తా గుండె చెరువైంది. ఆ చెరువు కాలానికే అతీతమై శోకాల సముద్రమైంది. పాఠకులకు కూడా ఎంతో విశిష్ట రసానుభూతిని కలిగించే రూపకాలంకార రూపాలు ఇక్కడ ఈ ‘ప్రేమరూపాలు’లో దర్శనమిస్తున్నాయి. దేవులపల్లి, వేదుల మున్నగు భావకవుల ప్రేరణలూ - ఛాయలూ ఈ కృతిలో ఆకృతి దాల్చినప్పటికీ ఇక్కడ మాత్రం గోపీనాథునిదైన కవితాముద్ర భద్రంగా భద్రాచలమంతగా కనిపిస్తోంది! ‘ప్రేమపంచు జాబిలి నడిరేయి చీకటుల పేటికలందున దాగెనేమి?’ (పుట-39) మున్నగు వాక్యాలూ, ‘క్రిక్కిఱించు’ (పుట-38) మున్నగు అచ్చ తెలుగు క్రియాపదాల పోహళింపులూ భద్రాచలమంత భద్రరూపాలే ఇందులో!
ఈ కృతిలోని పద్యాల్లోని ‘రాగము’, ‘చాలు’, ‘సైచితి’, ‘చెలీ’ - ఇత్యాదిగా పదాల పునరుక్తులూ, ‘తమి’ శబ్దాన్ని నాలుగర్థాల్లో ఒక పద్యంలో ఒక్కొక్క పాదంలోనూ ఒక్కొక్క అర్థం చొప్పున ప్రయోగించడాలూ, సరళ శైలీ - ఇవన్నీ ఈ కవిని పూర్వ భావకవుల నుండి ఒక ప్రత్యేక రూపంతో వేరుచేసి నిలబెడుతున్నాయి. అంతేకాదు - ప్రకృతి మానవ ప్రకృతికి ప్రతికృతి గదా! మానవ ప్రకృతిలో - అందులోనూ వియోగ వేదనతో కూడిన కవి అయినవాని హృదయ ప్రకృతిలో వచ్చే మార్పులకు - ఈ కావ్యంలో అక్కడక్కడా కనిపించే గ్రీష్మ, హేమంత, శరత్ ఋతువర్ణనల పద్యాలు విరహాభ్యుదయానికి దోహదాలయ్యాయి. ఈ ప్రేమరూపాలకు ఒకానొక అనిర్వచనీయ సముదాత్తతను సంతరించి పెట్టాయి. ఈ ఋతువర్ణన పద్యాలను ఈ కావ్యంలో పెద్దక్షరాలలో ముద్రించడంలో కూడా ఈ కవి ఒక ప్రత్యేకతను, (సం)్భవించినట్లుగా ఉంది. ‘ప్రణయవాసంతమ్ము ప్రభవించి బతుకంత/ పల్లవించునటంచు భ్రాంతిగొంటి’ (పుట-44) ఇత్యాదిగా కానవచ్చే సీసంలో కూడా ఈ కవి వియోగ వేదనారూప ప్రేమరూపాలే కనిపించి, కావ్యోదాత్తతకు తోడ్పడ్డాయి. భావోచితమైన ఛంద సౌందర్యం కూడా ఈ కావ్యంలో కానవస్తుంది - అక్కడక్కడా. అఖండ యతి ప్రయోగాలు అక్కడక్కడా ఉన్నా అవి కవితాపాసకు - రసాస్వాదనానుభూతికి తోడ్పడే పుడకలే! ఉత్పలమాలలోని ‘..సర్వాచ్ఛ’ మనస్విస్నేహ (పుట-20) అన్నచోట గణస్థితి కొంచెం విచారణీయాంశం. అటువైపునకు మన చూపును మళ్లించకుంటే భవ్యమైనది ఈ కావ్యం. ఈ కృతి సూర్యోదయ వర్ణన పద్యంతోనే ప్రారంభమైంది. బంగారపు రశ్మిరాసులను కానుకనీయగ ధాత్రిదేవికిన్’ (పుట-13) రవి వస్తే - ఈ కవి - ‘ఊహాప్రేయసీ రూపమైన కవితా రశ్మిరాసులకు సహృదయ పాఠక దేవతలకు కానుకగా ఇచ్చారనిపిస్తుంది. రవికీ, కవికీ అనుబంధం ఉంది గదా!
ఇంతగా ఊహాప్రేయసీ రూపవిరహ వేదనకు అక్షరభావ కవితా పట్ట్భాషేకం చేసినప్పటికీ చిట్టచివరి పద్యాన్ని ‘ప్రేమయే మానవత్వంపు ధామమనెద/ ప్రేమయే మర్త్యలోక సంక్షేమకారి/ ప్రణయమే నేలనెలకొల్పు స్వర్గపురము మానవుల్ ప్రేమ పూజలన్ మానతగదు’ (పుట-28) అని తేట గీతా సందేశంతో ముగించారు - విశిష్టంగా సార్వజనీనంగా - దివ్యాత్మ రూపంగా. - కర్తవ్యోపదేశకరంగా. అందుకే ఆయన గోపీనాథుడు. సార్వజనీన భగవద్గీతా సందేశాన్ని ఇచ్చిందీ - ‘కర్మణ్యేవాధికారస్తే..’ అన్నదీ గోపీనాథుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మయేగదా! ఈ కావ్యంపై ముఖచిత్రం కూడా కొమ్మ - పువ్వు - తుమ్మెదతో కూడి ప్రకృతి తత్త్వమైన పరమాత్మకు ప్రతీకయై నిలుస్తోంది.
‘నేటి వయస్సు నందు రమణీయములై వెలుగొందు చందముల్ నాటికి నాటికిన్ దఱిగి నశ్వరవౌగదె! మేని సొంపులేపాటివి? ఆ క్షణ ప్రభల వనె్నలు జూచుచు నిక్కకమ్మ! నా మాటలు నమ్ము! సౌరుగల మానస దీప్తియె శాశ్వతంబగున్’! (పుట-45) అన్న పద్యరూపంలో హృద్యమైన పారమార్ధిక పరమ ప్రేమరూపమైన దివ్యసందేశాన్ని అందిస్తోంది ఈ కృతి. ఇంతకీ ఎల్లోరా శిల్పమంత అందమైంది ఈ ఎ.గో.రా.’ (ఎరుకలపూడి గోపీనాథరావు) పద్యకవితా శిల్పం - ఈ కావ్యం ఒట్టి ప్రేమరూపాలూ కాదు, ప్రేమ శతకమూ కాదు. ప్రేమ పతకం! అక్షర ప్రేమ పతకం - పతాకం. ఇదీ ‘గోపీనాథు’ని ‘ప్రేమ’కవితా బృందావన స్వరూపం.

- డా. రామడుగు వేంకటేశ్వరశర్మ,
గుంటూరు.
చరవాణి : 9866944287

మనోగీతికలు

అందగాడు
ఈరోజు వంట ఏంచేశావు తల్లీ
ఆప్యాయంగా అడుగుతున్నట్లే ఉంది
ఈరోజు నువ్వు రాసిన కవితకు
పేరేమి పెట్టావమ్మా అని
కళ్లెగరేసినట్లే ఉంది
నిన్ను సన్మానించారుగా
వారేమని పొగిడారో చెప్పమని
వొళ్లంతా చెవులు చేసుకున్నట్లే ఉంది
నాన్నా..
వేలవేల మంది శిష్యులకు
గుండ్రని ముత్యాల అక్షరాలు
దిద్దించిన తెలుగు మాష్టారివి
కష్టాలతోనూ విజయాల బాటలో
నడచిన బుద్ధిజీవివి
నీ గాజుకళ్లల్లోనూ
నాకోసం నిండిన ఆర్తి
నెమ్మదిగా కదిలిన నీ చేతుల్తో
నన్ను దీవించిన స్ఫూర్తి
‘నేను అందంగా ఉన్నానా’ అని నవ్వుతూ
మాకు కన్నీరు తెప్పించావు నాన్నా..
ఇన్నాళ్లూ మా ముందుండి నడిపించి
ఇప్పుడు నిశ్చల గానమైనావా..
నీ జ్ఞాపకాల చేయిపట్టి
పూలు పరచిన నీ ఆదర్శాల బాటలో
నడుస్తా నాన్నా..
ధన్యజీవివి నువ్వు
ఆరడగుల అందగాడివి!

- షేక్ బషీరున్నీసా బేగం,
గుంటూరు.
చరవాణి : 9985193970

వీడిపోని దైవమా..
ఎంత వేడినా ఏమి చేసినా
వింతయైన నీ లీల కొంత మారదు
వింత, వింత రాతలతో మమ్ములంత చేసినావు
పరమ కుమ్మరీ.. నీకిది పాడియేనా?
రంగురంగు పాత్రలెన్నో రమ్యంగా చేస్తావు
రకరకాల ఆకృతులను రంగరించిపోస్తావు
వట్టి మట్టి మేమని తెలిసి కూడా నీవు
చెరిగిపోని బంధాల రంగులెన్నో గుండెపైన పూస్తావు
ఒక పాత్రను అందంగా తీర్చిదిద్దుతావు
మరో పాత్రనేమో మొర్రిగానూ చేస్తావు
ఏమి ధర్మమో ఇది నీకు తెలియదయ్యమాక!
తెలుసుకొనేలోగ మరల మట్టిలోనే కలుపుతావు!
ఎందుకయ్యా మట్టిబొమ్మతో ఆడుకుంటావు
ఆదమరిచి చేయి జారిన ముక్కలవునని తెలిసికూడా
ఎందుకయ్యా మట్టిబొమ్మతో ఆడుకుంటావు
నీ చేతుల్లో నన్ను ఎప్పుడూ భద్రపరచిన దైవమా
బతుకు బాటన నువ్వు నాకు నడక నేర్పే బాటలో
నన్ను నీవు చేయి విడిచి నడువమన్న ఘడియలో
నీ సాయం లేక నేను తూలుతున్న తీరులే!
గుండెలవిసే కంపనాలై బతుకునంతా కుదిపేయగా
ఓపలేక నీ కోసం మరణకేకలు వేశానే! ఎందుకయ్యా!
అన్నివేళల నాకు తోడుగా నువ్వున్నావని
ఎన్నడూ నను పడిపోనీక సాయం ఉంటావని
నా తల్లియైన కొన్నిమార్లు నన్ను మరుచునేమోగానీ
కడదాకా నువ్వు నన్ను మరచిపోవని తెలిసినా
బలహీనుడను చిన్ని చిన్ని నీ పరీక్షలు
తాళలేక తల్లడిల్లి అల్లాడుచుంటిని
విడువబోకు క్షణమైనా
నన్ను పరమ దైవమా!

- బండి స్టాన్లీ, విజయవాడ.
చరవాణి : 9703701425

కారణాలు..!
కారణాలు చెప్పలేను కొన్నిటికి
కారణాలు చెప్పలేను అందరికీ
కారణాలు చెప్పి నేను తప్పించుకోలేను
కారణాలు చూపి నేను
కొన్ని పనులు చేయలేను
కారణాలతో నేను ఇతరులను
వేలెత్తి చూపలేను
కారణమే మారణమై
ఘోరం సృష్టిస్తుందని
కారణాలు చెప్పలేను
కార్యాకారణమే ఈ జగత్తు అంతా
కారణం లేని జన్మ ఈ భువిలో లేదంట
కారణభూతుడే కారణాలు చెప్పలేక...
కఠినశిలగా మారిపోతే...
ఇక కారణాలకే తావులేదంట!

- కిలిమి యోగేష్,
విజయవాడ,
చరవాణి : 9397391799

నీవు లేని నేను
నీవు లేని నేను
వెనె్నలలున్నా వనె్నలెరుగని జాబిల్లిని
పరిమళిస్తున్నా పరవశించలేని మరుమల్లిని

నీవు లేని ఈ రేయి
కలల పొదరిళ్లలో నిదురించిన కనుదోయి
అలల కౌగిళ్లను చేజార్చుకున్న బండరాయి

నీవు లేని నా లోగిలి
వసంతమొచ్చినా వికసించని వనం
స్పందించినా రాయలేని కవనం

నీవు లేని నా హృదయం
శృతి తప్పిన విరహ గేయం
కాలమూ మాన్చలేని కఠిన గాయం!
- బలభద్రపాత్రుని ఉదయశంకర్,
నందిగామ, కృష్ణా జిల్లా.
చరవాణి : 9494536524

email: merupuvj@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net

- నల్లపాటి సురేంద్ర