రాజమండ్రి

జీళ్ల తాత ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయసులో సమానమైనా, బాలగంగాధర తిలక్ అందరిలోను పెద్దగా కనబడేవాడు. అందుకే వాడు క్లాసు లీడరయ్యాడు. ఐదో తరగతి వరకు వాడే లీడర్. పొడవుగా, నల్లగా, సన్నగా ఉండేవాడు. వాడికి చెవిపై ఓ కాయ ఉండేది. వాడిల్లు కూడా బడిసందు కెదురుగా ఉండేది. ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఇంటికెళ్లి వచ్చేసేవాడు. బడికి ఉత్తరంవైపు పెద్ద చెరువు. చెరువుకు అవతలి పక్కన చింతచెట్లు, ఆసుపత్రి ఉండేది. ఔటుబెల్లు కొట్టగానే పరుగెత్తుకుంటూ చెరువు పక్కదారి నుండి ఆసుపత్రికెళ్లి చింతకాయలు కొట్టుకొచ్చేవారు. ఎవరైనా బడెనకాల ఇళ్లవారు వెళ్లి ఉప్పు కారం పట్టుకొచ్చేవారు. చింతకాయలులేని రోజుల్లో ఉప్పు చింతపండు కూడా తెచ్చే అమ్మాయిలుండేవారు. రమాదేవి, సత్యవాణి చింతకాయల్లోకి ఉప్పుకారం తెచ్చి తిట్టినా ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. చింతకాయలు తెచ్చినవాడు హీరో.
రుద్రయ్య మాస్టారు ఎప్పుడూ నిద్దరోతూనే పాఠం చెప్పేవారు. ఆయన నిద్రలో ఉండి గురక పెడితే ఇక కుర్రాళ్లదే రాజ్యం. తరగతికి ఒక మాస్టారే కాబట్టి రుద్రయ్య మాస్టారు క్లాసులో పిల్లలంతా ఇష్టమొచ్చిన అల్లరి చేసేవారు. హెడ్‌మాస్టారు వస్తే, కిక్కురుమనకుండా ఉండడమూ చేసేవారు. ఆయన వచ్చిన చప్పుడుకు నిద్ర నుండి లేచి బెత్తం పట్టేసేవారు రుద్రయ్యగారు. వెంటనే మురపాకోడు టీ తెమ్మంటారాండి? అనేవాడు. జేబులోంచి అర్థరూపాయి తీసి తెచ్చేయమనేవాడా మాస్టారు. ఈ వంకన వాడితో మరొకడు వెళ్లి ఓ అరగంట తర్వాత వచ్చేవారు. వాళ్లు రాగానే జీడిపాకం వాసన క్లాసు రూమంతా గుప్పుమనేది. పదకొండు గంటలకు బెల్లు కొడితే విరామం. అందరూ జీళ్ల తాత దగ్గర గుమిగూడేవారు. జీడిరంగు ముదిరే కొలదీ వాసన బాగా వచ్చేది. లక్ష్మీ మేడమ్ స్కూలు దొడ్డిగుమ్మం నుండి వచ్చి జీడి కొనుక్కుని తింటూ వెళ్లేవారు. ఇక పిల్లల గొడవ చెప్పనక్కర్లేదు. సరిగ్గా తొమ్మిదిన్నరకు వచ్చేవాడు జీళ్లతాత. చిన్న కేరేజీ నిండా జీడిపాకం పోసుకొచ్చి అక్కడే దాన్ని గట్టిపరిచి ముక్కలు చేసి ఇచ్చేవాడు. పదకొండు అయ్యేవరకు జీడిని గట్టి చేసేవాడు. ముక్క గట్టిపడేలోపుగానే అన్నీ అమ్మేసేవాడు. 5పైసలు నుండి అర్థరూపాయి వరకు అమ్మకం ఉండేది.
తిలక్ ఎప్పుడూ తాతకు డబ్బులిచ్చేవాడు కాదు. ఇంకా ఎవరికైనా జీడిముక్కలు ఇవ్వమనేవాడు. తాత మాట్లాడకుండా ముక్కలిచ్చేవాడు. ఎందుకు ఊరికే ఇస్తున్నాడో తెలిసేదికాదు. అడిగితే డిప్పమీద ఒక్కటిచ్చేవాడు తిలక్. అడిగినోళ్లంతా నోర్మూసుకుని అక్కడినుండి వెళ్లేవారు. అందరూ అడుగుతున్నారనీ, తాత ఫ్రీగా ఇస్తున్నాడనీ తిలక్ అక్కడికి రావడం మానేశాడు. తాత మాత్రం తిలక్ రావటంలేదే అని అడిగేవాడు. ఏమో తెలీదు? అని తోటివారు చెప్పేవారు. వాడు తరగతులకు అంతంత మాత్రమే వచ్చేవాడు.
మధ్యాహ్నం పూట కేంద్ర ప్రభుత్వ పథకం కింద బళ్లో ఉప్మా పెట్టేవారు. గోధుమ రవ్వ, ఎర్రగా ఉండేది. దానిలో ఎండిమిరపకాయలు, మినపప్పు తాలింపెట్టి అటెండరు ఎంకట్రావు ఘుమఘుమలాడేలా తయారుచేసేవాడు. మధ్యాహ్నం 12గంటల కల్లా అందరూ సేవెండి పళ్లేలతో వరుసగా కూర్చునేవారు. ఇది బలహీనవర్గాలకు ప్రభుత్వం కేటాయించింది. కాని తిలక్‌గాడు, ర్యాలోడు, మల్లినోడు, మురపాకోడు, గోపిగాడు అందరూ దాని రుచి చూడటం కోసమని వరుసలో చేరేవారు. నరసింహమూర్తి మాస్టారు చూస్తే కేక వేసేవాడు. అంతే ఒక్క ఉదుటున ఆ ఐదారుమంది పరుగెత్తి పారిపోయేవారు. ఆయన రాకపోతే ఇక చెప్పక్కర్లేదు ఎంకట్రావు రెండోసారి వడ్డించేవాడు. కొంచెం సాంప్రదాయ కుటుంబంలో పుట్టినవారిని అక్కడ తినొద్దనేవారు. ర్యాలోడు చిన్నప్పటి నుండి అందరితోను కలివిడిగా తిరగడం మూలంగా ఉప్పా కూడా తినాలనుకుని ఒకటి రెండుసార్లు తింటూ కూడా నరసింహమూర్తికి దొరికి దెబ్బలుతిని, తర్వాత మానేశాడు.
ఎందుకో తెలీదు తిలక్ మహేంద్రవాడ వెళ్లిపోయాడని తెలిసి ర్యాలోడు మురపాకోడు తెగ బాధపడ్డారు. వాడు ఐదో తరగతికి పెద్దదిక్కుగా ఉండేవాడు. ఎందుకీ వూరొచ్చారో తెలీదు. ఎందుకు వెళ్లారో తెలీదు. తిలక్ గాడి చెల్లి విజయ చిన్నప్పటి నుండి అందరినీ ఆప్యాయంగా పలకరించేది. వాళ్లింటికెడితే అందరికీ ఏదో ఒకటి పెట్టేది. తిలక్ అందరింటికీ వెళ్లి అందరినీ చూసి వెళ్లొస్తానని చెప్పడానికి ఎవ్వరూ మరచిపోలేదు. మురపాకోడు ఎప్పుడు కనబడినా ర్యాలోణ్ణి తిలక్ గురించి అడుగుతూనే ఉండేవాడు. వాడు కొట్టినా అందరికీ ఇష్టంగానే ఉండేది.
జీళ్ల తాత ఓ రోజు మంచి జీళ్లు తెచ్చి అందరికీ ఫ్రీగా ఇచ్చేసాడు. ఏం తాత! అంటే ఇక నేను కూడా మానేస్తాను అన్నాడు. ఏం! అంటే మా ఊరు ఎల్లిపోతానుగా! అని సమాధానం చెప్పాడు. ఐదో తరగతోళ్లంతా జీళ్లతాత ఇక రాడంటే బెంగగా ఉందని వాపోయారు. తాత దగ్గర కూర్చుని అంతా బాధపడుతూ మా తిలక్ గాడు ఊరొదిలి ఎల్లిపోయాడు. నువ్వు కూడా ఎల్లిపోతే ఎలా తాతా! అన్నారు.
మీకే ఎన్నైనా చెబుతారు. అక్కడి నుండి ఇక్కడి దాక సైకిలు తొక్కడానికి నేనేమైనా చిన్న కుర్రాణ్ణా? అని అడిగాడు. మరింతకాలం ఎలా వచ్చావు తాతా! అని అడిగారు పిల్లలు. నా మనవడికోసం అన్నాడు. ఆ! మనవడా! ఎవరూ? అని ప్రశ్నించారంతా! ఇంకెవడూ! ఆ తిలక్‌గాడే! అన్నాడు తాత. అందరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏంటీ? తిలక్‌గాడు మీ మనవడా! అన్నారు ఆశ్చర్యంగా! అవున్రా! ఆళ్లనాన్న నాతో దెబ్బలాడి ఈ ఊరు వచ్చేశాడు. మనవణ్ణి చూడకుండా ఉండలేక ఎలా రావాలా? అని ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆఖరికి ఇదిగో ఈ జీళ్ల యాపారం నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అందుకే గదరా! ఆడు ఇక్కడికొచ్చి మీకందరికీ జీళ్లు ఇమ్మంటే ఇచ్చేవాణ్ణి.!2 అన్నాడు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని, అదేంటి తాతా! ఎప్పుడూ మాట్లాడుకునేవారు కాదుకదా1 అని అడిగితే అవున్రా! ఆళ్లనాన్న మాట్లాడటంలేదని ఆళ్లని కూడా మాట్లాడొద్దన్నాడు. అందుకే నేను మాట్టాడకుండా ఆణ్ణి చూసుకున్నాను. మరిప్పుడు ఆళ్లు ఎల్లిపోతే నేనూ ఎల్లిపోతాను.
ఆళ్లనాన్న మా ఇంటికి వచ్చేసాడు. తిలక్‌గాడు ఇక నా దగ్గరే ఉంటాడు. రోజూ ఆణ్ణి చూసుకుని బతికేత్తాను. ఎల్లొత్తానురా కుర్రగాళ్లారా! ఏమీ అనుకోకండి. అని అందరికీ జీళ్లు పంచి అక్కడి నుండి కదిలాడు. స్నేహితులందరికీ జీడిపాకం లాంటి తీపి జ్ఞాపకాలు మిగిల్చి తిలక్ ఊరి నుండి వెళ్లిపోయాడని పిల్లలంతా అనుకుని అక్కడినుండి నిరాశగా ఇంటిముఖం పట్టారు.
మురపాకోడు ర్యాలోడు ఇప్పటికీ ఆ రెడ్డి బాలగంగాధర్ తిలక్ ఎక్కడున్నాడోనని కలిసినప్పుడల్లా అనుకుంటూనే ఉంటారు.

- డాక్టర్ ర్యాలి శ్రీనివాస్
రామచంద్రపురం
సెల్: 9949131716

సహజీవనం

కాంతారావు స్టేట్‌బ్యాంక్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసాక కొడుకు దగ్గర అమెరికాలో ఆరు నెలలు, కూతురు దగ్గర ఢిల్లీలో రెండు నెలలు వుండి విశాఖపట్నంలో గూటికి చేరాడు. అదేమి దురదృష్టమో పిల్లల పెళ్లిళ్ల వరకు ఆరోగ్యంగా వున్న భార్య సుగుణ ఆరేళ్ళ క్రితం కేన్సరు వచ్చి మరణించింది. సుగుణ కోరికపై అన్ని హంగులతో పదేళ్లక్రితం చక్కని బంగళా విశాఖపట్నంలో నిర్మించుకున్నారు. భార్యా భర్తలిద్దరూ బీచ్ దగ్గరవడం వలన ప్రతి రోజు సాయంత్రం వేళ బీచ్‌కి షికారు వెళ్లి ఆనందంగా కబుర్లు చెప్పుకొని ఇంటికి వచ్చేవారు. పిల్లలు అమ్మాయి, అబ్బాయి బాగా చదువుకుని సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగాలు సంపాదించారు. పిల్లలిద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశారు. ఎంతో ఆనందంగా జీవితాన్ని గడపాలనుకున్న సమయంలో సుగుణకు కేన్సరు వచ్చి రెండు సంవత్సరాలు నరకయాతన అనుభవించి, చివరకు మరణించింది. కాంతారావు ఏకాకి అయ్యాడు. వంట మనిషి వచ్చి రెండు పూటలా వండి వెళుతుంది. ఇంటి పని చేయడానికి పని మనిషి, వంట పని చేయడానికి వంట మనిషి ఉండడంవలన వంట ఇంట్లో పని ఉండదు.
శేషజీవితాన్ని సాఫీగా సాగించాలని ఆధ్యాత్మిక పుస్తకాలు కొని చదవడం ప్రారంభించాడు. అయినా మనశ్శాంతి లభించడంలేదు. నిత్యం భార్య సుగుణ గుర్తుకు వచ్చి ఆమె ఆలోచనలతో రాత్రి వేళ నిద్రకు దూరం చేస్తుంది. సుగుణతో నలభై ఏళ్ల అనుబంధాన్ని మరచిపోలేక ఆమెను తలస్తూ ఆమెతో తీయించుకున్న ఫొటో ఆల్బములను చూస్తూ రోజూ కాలక్షేపం చేస్తాడు. బాల్యంలో విజయనగరంలో చదువుకునే రోజుల్లో మలబారు హోటల్లో టిఫిన్ తినాలని కోరికవున్న రోజులలో జేబులో సరిపడా డబ్బులు వుండేవి కాదు. ఇప్పుడు ఫైవ్‌స్టార్ హోటల్లో తినే స్తోమత ఉన్నా తిని అరిగించుకునే శక్తిలేదు. అందుకే ఒక మహానుభావుడు ఇనపగుళ్లు తిని అరిగించుకునే రోజుల్లో జేబులో డబ్బులు లేవు. బరుగులు తిన్నా అరిగించుకోలేని ఈ రోజుల్లో లక్షల్లో డబ్బులిచ్చాడు. అందుకే దేవుడు చిత్ర విచిత్రమైనవాడు అన్నాడు. ‘నిజమే అన్నీ ఇచ్చినట్లు ఇచ్చి నా భార్యను నానుండి దూరం చేసాడు దేవుడు’ అనుకుంటూ కాంతారావు కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.
కాంతారావు ఒంటరిగా మూడేళ్లకి మించి ఆ ఇంట్లో ఉండలేక ఒక వృద్ధాశ్రమంలో చేరేడు. వృద్ధాశ్రమంలో చాలా మంది వృద్ధులు వుండడం, వారి కథలు వింటూ, కబుర్లు చెప్పుకోవడంతో బాగానే కాలక్షేపం జరిగేది. కాంతారావు వృద్ధాశ్రమంలో చేరడం నచ్చక పిల్లలు ఎన్నో విధాల నచ్చచెప్పినా కాంతారావు అక్కడ జీవితమే తనకు సుఖంగా వుందని పిల్లల మాట వినలేదు. వృద్ధాశ్రమంలో లలితగారనే ఆవిడను అమెరికాలో వున్న పిల్లలిద్దరూ వృద్ధాశ్రమంలో చేర్చి పదేళ్లకు సరిపడా డబ్బు కట్టి తల్లిని వదిలించుకున్నారు. లలితగారి భర్త ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేయడం వలన అతనికి పెన్షను సౌకర్యం లేదు. రెండేళ్ల క్రితం ఆమె భర్త మరణించడంతో ఆమె ఏకాకి అయింది. పిల్లలు ఆమెను అమెరికా తీసుకువెళ్లడం ఇష్టంలేక వృద్ధాశ్రమంలో చేర్చారు. ఆమె కన్నీటి గాథ విన్నాక కాంతారావుకు జాలి కలిగింది. ఆమెతో ఎక్కువ కబుర్లు చెబుతూ ఆమెతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు.
కాంతారావుకు పెన్షన్ ముప్ఫై వేలు వస్తుంది. విశాఖపట్నంలో పెద్ద ఇల్లు. ఒక భాగంలో ఉన్నా రెండవ భాగానికి పదివేలు తక్కువ లేకుండా అద్దె వస్తుంది. తనకు తోడులేకే వృద్ధాశ్రమంలో చేరేడు. లలిత ఒంటరి జీవితాన్ని చూసాక ఆమెతో సహజీవనం చేస్తే బాగుంటుదనే ఆలోచన కాంతారావు మనసులోకి వచ్చింది. ఆమెను రిజిష్ట్రారు మ్యారేజీ చేసుకొంటే తన తదనంతరం అమెకు ఫేమిలీ పెన్షన్ వస్తుంది. ఆమె బ్రతికినంతకాలం ఇంట్లో వుంటుంది.
ఆమె తదనంతరం ఇల్లు పిల్లలకు చెందేటట్లు వీలునామా రాస్తాను. ఆమెకిష్టమైతే ఇద్దరం సహజీవనం చేయవచ్చు. ఈ రోజు పెళ్లి చేసుకోకుండా యువతీ యువకులు ముఖ్యంగా పెద్ద నగరాలలో ఉద్యోగాలు చేస్తున్న వారెంతమందో సహజీవనం పేరున కాపురాలు చేస్తున్నారు. ఈ వయసులో శారీరక సుఖాల కోసం కాకపోయినా తోడు, నీడకోసం సహజీవనం తప్పులేదని కాంతారావు ఒక నిర్ణయానికి వచ్చి లలితకు చెప్పాడు. లలిత ముందు ఒప్పుకోకపోయినా, అక్కడున్న పెద్ద మనుషుల చేత చెప్పి ఒప్పించేరు. వృద్ధాశ్రమం నుండి బయటికి వచ్చి, స్వంత గూటికి చేరి లలితకు నీడినిచ్చి కాంతారావు ప్రశాంతంగా శేషజీవితాన్ని వెళ్ళబుచ్చాడు.

- మహాభాష్యం రామలక్ష్మి,
సెల్ : 9985014751.

మనోగీతికలు

రెప్పవాల్చకు
రెప్పవాల్చకు అందం అందలమెక్కుతుంది
సహజ సుందరి ముగ్ధమనోహరంగా
సింధూరకాంతితో కనువిందు చేస్తోంది
తెలతెలవారుతున్న సప్తవర్ణాల చేరిక
హృదయాకాశం నిండా సొగసుల్ని పేరుస్తోంది
యమునోత్రి నుండి బయలుదేరిన
నదీ ప్రవాహ ధ్వనిలా...
దివ్యగానం అలలు అలలుగా
జ్ఞానామృతాన్ని కురిపించబోతోంది
చెవులు రిక్కించి విభ్రాంతితో వింటున్నట్లున్న
పల్లె గోవుల సమూహం
వాటిని సోకుతున్న మృదుపవన వీచికలు
మధుర మహోన్నత దృశ్యకావ్యంలా
నేలకు దిగి వచ్చిన పచ్చని చేల ఆకృతి
పొందుతున్న వేళ
రెప్పవాల్చకండి
అందం అందలమెక్కబోతోంది
కష్టం చేసి చేతులూ
కురిసే వానా పండే పంట
జన జీవనానికి జీవకృతులు
దివి నుండి దిగినట్లున్న భ్రాంతి
ఏ చిత్రకారుడూ చిత్రించలేని దృశ్యకావ్యం
క్షణానికో సౌందర్యం కంటికింపైన అనుభూతి
తిరిగి గగనానికి పయనమవుతున్న వేళ
రెప్పవాల్చకు
ఇల అందం అందలమెక్కుతోంది
తరుముకొచ్చే మూర్ఖ నాగరికత మనిషిని కమ్మేసరికి
బంగారు గుడ్లు తల్లుల కడుపులో ఇంకెన్ని ఉన్నాయో కోసి చూసే లోపున
ఎగురుతున్న డేగల కర్కశ వాద్య ధ్వని నుండి
చెట్టుని పుట్టని పక్షిని పల్లెని
మువ్వల సవ్వడితో పరిసరాల్లో పొంచి ఉన్న పులి సంకేతాల్ని పసికట్టు
మనిషి యుగానికొక తీరుగ మారవచ్చు
మూల స్వభావమెక్కడికి పోగలదు
ప్రకృతి సుకృతులే సమస్తం తస్మాత్ జాగ్రత్త
సౌందర్యానికి తేలిపోతూ వాలిపోతున్న
అరమూతల కన్నుల్ని జాగృతం చేయి
రెప్పవాల్చకు క్షణం
అందం అందలమెక్కబోతోంది
అందలేనంతగా!

- బులుసు సరోజినీదేవి,
సెల్ : 9866190548

సత్యం

చుట్టూ చిలుకలు
రంగురంగుల చిలుకలు
పంచవనె్నల చిలుకలు
అందమైన కళ్లు, ఎర్రని ముక్కు
ఆకుపచ్చని రెక్కలు, పొడవైన తోకలు
రెక్కలు అల్లార్చుతూ
వయ్యారంగా నడుస్తూ
మోహనరాగాల రంజితాలతో
కవ్విస్తూ, అలరిస్తూ
ఎంత పరవశం ఆనంద పరవశం
ఇంతలో మధ్యలో ఓ కాకి
నల్లని కాకి, ఏకాకి
సుందర దృశ్యాన్ని భగ్నపరుస్తూ
స్వప్న సంతోషాన్ని భంగపరుస్తూ
వౌనంగా, నిశ్శబ్దంగా
సహనంగా, శాంతంగా కాని నల్లగా
ఇంద్రధనస్సు కప్పేసిన మేఘంలా
వెనె్నలను దాచేసిన నల్లమబ్బులా
తులసి మొక్కల మధ్య గంజాయిమొక్కలా
నల్లటి కాకి
సంతోషాన్ని ఆవిరి చేస్తూ
స్వర్గంలోంచి సత్యంలోకి తోసిపడేస్తూ
వద్దాన్నా, కాదన్నా చుట్టూ తిరిగే కాకి
చూడగా చూడగా
కాకి కూడా ఒకప్పటి చిలుకలాగే ఉంది
బహుశా చిలుకేనేమో!
(అంకితం : భార్యావిధేయులందరికీ)

- మీనా (మాధురీదేవి),
సాయిటవర్స్, పిఠాపురంకాలనీ,
మద్దిలపాలెం, విశాఖపట్నం-530003.
పుస్తక పరిచయం

ఆది మానవులది సిగ్గా?..
కాదంటున్న ‘పేరలింగం’
ప్రతులకు
డి. పేరలింగం
సైన్స్ గ్రంథాలయం
ఎవి అప్పారావు రోడ్డు
రాజమహేంద్రవరం-3

విషయాన్ని సమగ్రంగా, సంపూర్ణంగా తెలపటానికి వ్యాసం కన్నా పుస్తకమే మేలు. ఆ ప్రయత్నాన్ని విజయవంతం చేశారు పేరలింగం గారు. రాజమహేంద్రవరం వాసులకే కాదు..రాష్ట్రంలోని హేతువాత మిత్రులకు సుపరిచితులు. అయితే ఆయన పెద్ద పెద్ద చదువులు చదవలేదు. ఫ్యాను కింద ఉద్యోగి కాదు. కష్టజీవి..పూర్తి శ్రమకారుడు. వృత్తిరీత్యా వడ్రంగి పని. అయితేనేం..జిజ్ఞాసి, నమ్మిన దాన్ని పదిమందికి తెలపాలనే ఆరాటం పుష్కలంగా ఉన్న ఏడుపదుల నిండిన యువకుడాయన.
సృష్టి ప్రారంభంపై వివిధ మతాల సిద్ధాంతాలు ఒకో రకంగా ఉంటాయి. అయితే ఓ చక్కని వివరణ ఆసాంతం దక్కించుకున్న వైనం క్రైస్తవ మతానిది. సృష్టి ఎలా ఆవిర్భివించిందో మానవులు ఎలా జన్మించారో బలమైన నమ్మికతో కూడిన మత వాదం ఉంది. ఆది మానవులు మొలకు ఆకులు చుట్టుకున్నది సిగ్గువల్ల కాదు2 అని పుస్తకంగా వెలువరించారు దేవగుప్తాపు పేరలింగం గారు.
అధ్యయనపరంగా తనకు తెలిసిన విషయాలను, పరిశీలనాత్మకంగా శోధించిన సంగతులను ఆయన అనేకంగా ప్రస్తావిస్తూ రాశారు. అలా అని ఆయనేదో పరిశోధకుడు, చదవరి కాదు. ప్రాథమిక స్థాయి విద్యార్హతతోనే తానీ పనికి పూనుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఒక సాహసోపేతమైన విషయ వివరణకు పూనుకోవడం.
అందరూ చదువుతారు. కొందరే రాస్తారు. చదివినోళ్లు సదువుకున్నోళ్లకే తెలుపుతారు. అటువంటి లోటుపాట్లు గుర్తించి తెలీనోళ్లకు తెలపాలనే ఉద్దేశంతో ఈ పుస్తక పనికి పూనుకొన్నారు. ఆది మానవులనగానే ఆదాము అవ్వలే గుర్తొస్తారు. ఎదెను తోటలో దేవుడు తినొద్దపన్న పళ్లుతిని విచక్షణతో సిగ్గు కలిగి ఆకులు చుట్టుకున్నారన్నా విషయం మీదే పుస్తకంలో పెద్ద చర్చ చేశారు. వేల ఏళ్ల పరిణామ క్రమాన్ని ఓ పద్ధతిలో ప్రశ్నిస్తూ ప్రస్తుత విషయాలు అన్వయపరుస్తూ చెప్పారు. జీవ పరిణామ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో సృష్టివాదాన్ని క్రైస్తవ మతాన్ని చీల్చి చెండాడారు.
శాస్ర్తియ సత్యాన్ని ఏ మతాలు అంగీకరించవు. నమ్మకం పునాది మీద విశ్వాసాన్ని నిలబెట్టి పబ్బం గడుపుకుంటాయి. వెర్రి తలలు విశ్వరూపం భక్తి పిచ్చి దాంతో ఎన్ని ఫీట్లు చెయ్యవచ్చో అన్నీ చేసేస్తాయి ఆ పురోహిత వర్గాలు లేదా పాదిరీలు పూజార్లు.
బాగా ఎరుక పరచాలనే ఉద్దేశంతో ఎక్కువ చెప్పే ప్రయత్నంలో తిరగమోత జరిగింది. ఎంచుకున్న విషయం మీదే దృష్టిపెడితే బాగుండేది. ఎక్కువ విషయాల్లోకి తలదూర్చడం వల్ల విషయ విసుగు పుట్టింది. సైన్సుతో బైబిల్ విషయాన్ని ఎదుర్కొంటే బావుండేది. ఆదాము అవ్వల పుట్టుక నుంచి మొదలు పెట్టి ఉంటే క్రైస్తవ సత్తా మీద హేతుత్వ బాణం గురి తప్పేది కాదు. మట్టితో బొమ్మచేసి దేవుడు ఊపిరి ఊది ఆదాము అయ్యాడట. తనకో తోడు కోసం ఆదాము పక్కటెముక నుండి అవ్వను తయారు చేసాడనేది కథనం. శరీర నిర్మాణ ప్రకారం ఎముకలు ఇద్దరికి సరి సమానంగానే ఉంటాయి. కాని ఒకరికి తక్కువుంటాయనేది క్రైస్తవ జ్ఞానం. ఫలానాది తినొద్దనే నిషేధం ఏమిటి?.. ప్రశ్నలు వేసుకుపొతుంటే అంతుండదు.
బైబిల్ సృష్టివాదం మీదే దృష్టిపెట్టి చర్చించుంటే బాగుండేది. హేతువాద సంఘం పూర్వ అధ్యక్షుడు సుబ్బరాజు (పియస్సార్) లాంటి వాళ్లు బైబిల్ మూఢత్వంపై పలు రచనలు వెలువరించడం జరిగింది. బ్రహ్మం లాంటి వారి రచనలు సరసన ఈ పుస్తకం చేరింది.
వ్యవస్థలో లోపాలు వెలికితీసే ప్రయత్నంలో వాస్తవం కనుమరుగు కాకూడదు. ఒక క్రమ పద్ధతిలో వెళ్లగిలిగితేనే లోపాన్ని ప్రత్యక్షత పరచగలం. లేదంటే లోపం లోపల మనం లోప భూషిష్టమయిపోతాం. రచయితలు పేరలింగం గారు చెప్పే విషయానికి బలంగా మరొక రచయిను కోట్ చేయాలనుకుంటే వారి పేరు ప్రస్తావన చేస్తే చాలు. ఇంకా వివరణ ఇవ్వాలనుకుంటే రిఫరెన్సు ఇవ్వొచ్చు. అయితే వివరణ పేరాను మించిపోతే గందరగోళం పరుస్తుంది. అదే జరిగింది.
నెత్తిన నీళ్లకుండ పెట్టుకుని ఒళ్లు తడవకుండా నడక చేయడమే కష్టం. మరి పరిగెట్టాలంటే ఇంకా కష్టం. ఓ సాహసోపేతమైన పుస్తక రచనకు పూనుకుని అందులోను మతానికి ముఖ్యంగా క్రైస్తవానికి సంబంధించిన విషయం తీసుకోవడం కత్తిమీద సాము. అయితే రచయిత హిందూత్వ విషయాల ప్రస్తావనే అధికంగా చేయడం కూడా గమనించతగగ విషయం. పేరలింగం గారు పుస్తకం ముందు మాటలో అక్కడక్కడా చిన్నచిన్న తోకల్లు పిలకల్లు గిలిగింతలుగా జేర్చడం2 అంటూ చెప్పేరు. అశ్లీలతా వాఖ్యలకు నొచ్చవద్దని మనవి చేశారు. ఇక్కడ అదే ప్రధాన చర్చకు దారి తీసింది.
శృంగారాన్ని బూతుని ఒకే గాటన కట్టి స్ర్తిలకు కించపరిచే విధంగా ఆ వాఖ్యలు పొడసూపడం కాస్త విచారింపదగ్గ విషయం. మాతృస్వామ్య వ్యవస్థ నుంచి స్ర్తిని అథఃపాతానికి నెట్టేసే క్రమం చాలా కీలకమయింది. మతమే కాదు..పురుష స్వామ్యం బుసులు కొట్టింది, పడగలూ విప్పింది. తరతరాలుగా బానిసత్వపు కాట్లు వేస్తూనే ఉంది. నీచ ఆలోచనలకు నాందిగా, ప్రగతి కాముకలుగా చెప్పుకునే రచయితలూ పునస్మిరించడమూ భావ్యయం కాదూ.
పుస్తకానికి తొలి మాట ఎందుకు ప్రాధాన్యం అవుతుందో పరిశీలిస్తే విమర్శకు దొరకని వారు అయ్యేవారు. పెద్దల అభిప్రాయానికి తావిచ్చుంటే కొన్ని సందేహ నివృత్తులు, విషయ క్లుప్తత, క్వాంటిటితో పాటు క్వాలిటీ చేకూరేది. తొలి రచన సైన్సు ఫ్లస్ మూఢ నమ్మకాలు చిన్న పొత్తం కానిచ్చేశారు. రెండోదానికి శ్రద్ధ చూపాలి కదా?..చిన్నచిన్న పొరపాట్లు తిరిగి రాకుండా జాగ్రత్త తీసుకోగలిగితే మంచి విషయాలు మన్నన దాయకమవుతాయి.

- రవికాంత్, 96424 89244

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
email: merupurjy@andhrabhoomi.net

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- డాక్టర్ ర్యాలి శ్రీనివాస్