విశాఖపట్నం

సహజీవనం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంతారావు స్టేట్‌బ్యాంక్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసాక కొడుకు దగ్గర అమెరికాలో ఆరు నెలలు, కూతురు దగ్గర ఢిల్లీలో రెండు నెలలు వుండి విశాఖపట్నంలో గూటికి చేరాడు. అదేమి దురదృష్టమో పిల్లల పెళ్లిళ్ల వరకు ఆరోగ్యంగా వున్న భార్య సుగుణ ఆరేళ్ళ క్రితం కేన్సరు వచ్చి మరణించింది. సుగుణ కోరికపై అన్ని హంగులతో పదేళ్లక్రితం చక్కని బంగళా విశాఖపట్నంలో నిర్మించుకున్నారు. భార్యా భర్తలిద్దరూ బీచ్ దగ్గరవడం వలన ప్రతి రోజు సాయంత్రం వేళ బీచ్‌కి షికారు వెళ్లి ఆనందంగా కబుర్లు చెప్పుకొని ఇంటికి వచ్చేవారు. పిల్లలు అమ్మాయి, అబ్బాయి బాగా చదువుకుని సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగాలు సంపాదించారు. పిల్లలిద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశారు. ఎంతో ఆనందంగా జీవితాన్ని గడపాలనుకున్న సమయంలో సుగుణకు కేన్సరు వచ్చి రెండు సంవత్సరాలు నరకయాతన అనుభవించి, చివరకు మరణించింది. కాంతారావు ఏకాకి అయ్యాడు. వంట మనిషి వచ్చి రెండు పూటలా వండి వెళుతుంది. ఇంటి పని చేయడానికి పని మనిషి, వంట పని చేయడానికి వంట మనిషి ఉండడంవలన వంట ఇంట్లో పని ఉండదు.
శేషజీవితాన్ని సాఫీగా సాగించాలని ఆధ్యాత్మిక పుస్తకాలు కొని చదవడం ప్రారంభించాడు. అయినా మనశ్శాంతి లభించడంలేదు. నిత్యం భార్య సుగుణ గుర్తుకు వచ్చి ఆమె ఆలోచనలతో రాత్రి వేళ నిద్రకు దూరం చేస్తుంది. సుగుణతో నలభై ఏళ్ల అనుబంధాన్ని మరచిపోలేక ఆమెను తలస్తూ ఆమెతో తీయించుకున్న ఫొటో ఆల్బములను చూస్తూ రోజూ కాలక్షేపం చేస్తాడు. బాల్యంలో విజయనగరంలో చదువుకునే రోజుల్లో మలబారు హోటల్లో టిఫిన్ తినాలని కోరికవున్న రోజులలో జేబులో సరిపడా డబ్బులు వుండేవి కాదు. ఇప్పుడు ఫైవ్‌స్టార్ హోటల్లో తినే స్తోమత ఉన్నా తిని అరిగించుకునే శక్తిలేదు. అందుకే ఒక మహానుభావుడు ఇనపగుళ్లు తిని అరిగించుకునే రోజుల్లో జేబులో డబ్బులు లేవు. బరుగులు తిన్నా అరిగించుకోలేని ఈ రోజుల్లో లక్షల్లో డబ్బులిచ్చాడు. అందుకే దేవుడు చిత్ర విచిత్రమైనవాడు అన్నాడు. ‘నిజమే అన్నీ ఇచ్చినట్లు ఇచ్చి నా భార్యను నానుండి దూరం చేసాడు దేవుడు’ అనుకుంటూ కాంతారావు కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.
కాంతారావు ఒంటరిగా మూడేళ్లకి మించి ఆ ఇంట్లో ఉండలేక ఒక వృద్ధాశ్రమంలో చేరేడు. వృద్ధాశ్రమంలో చాలా మంది వృద్ధులు వుండడం, వారి కథలు వింటూ, కబుర్లు చెప్పుకోవడంతో బాగానే కాలక్షేపం జరిగేది. కాంతారావు వృద్ధాశ్రమంలో చేరడం నచ్చక పిల్లలు ఎన్నో విధాల నచ్చచెప్పినా కాంతారావు అక్కడ జీవితమే తనకు సుఖంగా వుందని పిల్లల మాట వినలేదు. వృద్ధాశ్రమంలో లలితగారనే ఆవిడను అమెరికాలో వున్న పిల్లలిద్దరూ వృద్ధాశ్రమంలో చేర్చి పదేళ్లకు సరిపడా డబ్బు కట్టి తల్లిని వదిలించుకున్నారు. లలితగారి భర్త ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేయడం వలన అతనికి పెన్షను సౌకర్యం లేదు. రెండేళ్ల క్రితం ఆమె భర్త మరణించడంతో ఆమె ఏకాకి అయింది. పిల్లలు ఆమెను అమెరికా తీసుకువెళ్లడం ఇష్టంలేక వృద్ధాశ్రమంలో చేర్చారు. ఆమె కన్నీటి గాథ విన్నాక కాంతారావుకు జాలి కలిగింది. ఆమెతో ఎక్కువ కబుర్లు చెబుతూ ఆమెతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు.
కాంతారావుకు పెన్షన్ ముప్ఫై వేలు వస్తుంది. విశాఖపట్నంలో పెద్ద ఇల్లు. ఒక భాగంలో ఉన్నా రెండవ భాగానికి పదివేలు తక్కువ లేకుండా అద్దె వస్తుంది. తనకు తోడులేకే వృద్ధాశ్రమంలో చేరేడు. లలిత ఒంటరి జీవితాన్ని చూసాక ఆమెతో సహజీవనం చేస్తే బాగుంటుదనే ఆలోచన కాంతారావు మనసులోకి వచ్చింది. ఆమెను రిజిష్ట్రారు మ్యారేజీ చేసుకొంటే తన తదనంతరం అమెకు ఫేమిలీ పెన్షన్ వస్తుంది. ఆమె బ్రతికినంతకాలం ఇంట్లో వుంటుంది. ఆమె తదనంతరం ఇల్లు పిల్లలకు చెందేటట్లు వీలునామా రాస్తాను. ఆమెకిష్టమైతే ఇద్దరం సహజీవనం చేయవచ్చు. ఈ రోజు పెళ్లి చేసుకోకుండా యువతీ యువకులు ముఖ్యంగా పెద్ద నగరాలలో ఉద్యోగాలు చేస్తున్న వారెంతమందో సహజీవనం పేరున కాపురాలు చేస్తున్నారు. ఈ వయసులో శారీరక సుఖాల కోసం కాకపోయినా తోడు, నీడకోసం సహజీవనం తప్పులేదని కాంతారావు ఒక నిర్ణయానికి వచ్చి లలితకు చెప్పాడు. లలిత ముందు ఒప్పుకోకపోయినా, అక్కడున్న పెద్ద మనుషుల చేత చెప్పి ఒప్పించేరు. వృద్ధాశ్రమం నుండి బయటికి వచ్చి, స్వంత గూటికి చేరి లలితకు నీడినిచ్చి కాంతారావు ప్రశాంతంగా శేషజీవితాన్ని వెళ్ళబుచ్చాడు.

- మహాభాష్యం రామలక్ష్మి, అలకనందాకాలనీ,
విజయనగరం-535003.
సెల్ : 9985014751.

కథానిక

పొరుగిల్లు

‘‘బాగున్నావా అమ్మాయ్’’ అంటూ లోపలికి వచ్చేస్తోంది ఎదురింటి అనసూయమ్మగారు చేతిలో ఓ పొడవాటి గ్లాసు పట్టుకుని.
‘‘బాగున్నాను రండి’’ నా ముభావాన్ని కనబడకుండా సమాధానం ఇస్తూ రమ్మన్నాను.
‘‘మీ బాబాయిగారు ఊరెళ్లారు. పంచదార నిండుకుంది. కాస్త సర్దుతావా అమ్మా. ఆయన రాగానే బదులు తీరుస్తా’’ దీర్ఘం తీస్తూ గ్లాసు ఇచ్చింది అనసూయమ్మ.
అదే గ్లాసు ఇంతకు ముందు కాఫీ పొడి అని, కారమనీ అడిగి పట్టుకెళ్లింది. తిరిగి ఇవ్వడం దేవుడికెరుక. ఆ పెద్ద గ్లాసు పాతకాలపు కంచుగ్లాసు. కనీసం పావు కిలో బరువుండి, ఓ అరకిలో పంచదారైనా నింపుకునేలా ఉంది.
‘‘కూర్చోండి తెచ్చిస్తాను’’ అని ఇక తప్పదని లోపలికెళ్లి తెచ్చి ఇచ్చాను. వచ్చేలోగా అనసూయమ్మగారు హాల్లోకి వచ్చి అక్కడున్న ఇంపోర్టెడ్ సోఫా మీద బైఠాయించింది.
ఇక వదలదు అనుకుంటూ నేనూ కూర్చున్నా.
అనసూయమ్మగారంటే నాకు భయం. భయంకరంగా ఉంటుందని కాదు ఆమె నస అంటే భయం.
అనసూయమ్మ పేరున్న వాళ్లు అందరూ మంచిగా ఉంటారేమో గానీ ఈమె మాత్రం అసూయతో ఊగిపోతూ ఉంటుంది అనిపిస్తుంది.
కళ్లు ఇలా తిప్పుతూ, కనుబొమలు పైకి కిందకీ కదిలిస్తూ, మాటలు దీర్ఘాలు తీస్తూ, చేతులు భరతనాట్యంలోలా ఊపేస్తూ మాట్లాడేస్తుంది.
చుట్టుపక్కల ఉన్న వాళ్లందరి విషయాలు ఉన్నవీ లేనివీ గుక్క తిప్పుకోకుండా అనర్గళంగా చెప్పేస్తుందని ఆమె మీద చాలా మంది అభిప్రాయం ఆ వీధిలో.
నాకేమో హస్కు ఇష్టంలేదు.
ఎదురింటి ఆవిడ, కాస్త పెద్దావిడ అని మాటలు కదిలించానంతే. కానీ వదిలే రకం కాదని లేటుగా తెలుసుకున్నా.
అయినా తప్పలేదు. అవీ ఇవీ కల్పించి చుట్టుపక్కలున్న వారికి చెబుతుందేమో అని భయం.
‘‘ ఏమిటీ కొత్త సోఫానా’’ అడిగింది అనసూయమ్మ.
‘‘అవునండీ. ఈ మధ్య పాత సోఫా మార్చి కొత్తది తీసుకున్నాం. ఇటాలియన్ ఇంపోర్టెడ్ సోఫా బాగుందని’’
‘‘బాగుంది. ఆ మూడో ఇల్లు ముత్యాలమ్మ మరీ పీనాసి. ఎవరన్నా వస్తే చాప మీదే కూర్చోబెడుతుంది. గంట కూర్చున్నా ఓ గ్లాసెడు మంచినీళ్లు ఇవ్వదు’’
విషయం అర్ధమై మరోసారి మొహమాటంగా అడిగాను ‘‘కాఫీ ఏమన్నా తాగుతారా?’’ అని.
అప్పటికి మధ్యాహ్నం రెండు గంటలయింది.
‘‘ ఓ చిన్న కప్పు కాఫీ ఇయ్యమ్మ పంచదార లేక నేను పెట్టనేలేదు... తాగనూ లేదు’’
ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పిందావిడ.
అలా అడిగినందుకు నన్ను నేనే తిట్టుకుంటూ అయిష్టంగా వంటింట్లోకి వెళ్లి కాఫీ పెట్టి పట్టుకు వచ్చాను.
కాఫీ చప్పరిస్తూ తాగుతూ ‘‘ ఎంత బాగా పెట్టావమ్మా. మా కోడలూ ఉంది. అది పెడితే కాఫీ అనాలో టీ అనాలో కూడా అర్ధం కాదు. మా వాడిని ఎగరేసుకు వెళ్లింది. వాడొక అమాయక మొహం. అదేం చెబితే అదే’’ చెప్పుకు పోతూ ఉంది.
‘‘పెళ్లయిన సంవత్సరంలోపే మాకు దూరంగా వెళ్లిపోయారు. వాడొక్కడే వస్తాడు అప్పుడప్పుడు మమ్మల్ని చూడ్డానికి. బాబాయి గారికి ఇంకా అయిదేళ్ల సర్వీసు ఉంది’’
వింటూ ఉండిపోయాను.
‘‘అవునూ మీ ఆయన ఏ కంపెనీకో పెద్ద మేనేజరు అని విన్నా. బాగానే సంపాదిస్తారుగా’’ పైన వేలాడుతున్న షాండ్లియర్‌ను చూస్తూ అడిగింది.
‘‘పర్లేదు పిన్నిగారూ. బాగా చదువుకున్నారు మంచి ఉద్యోగం’’
‘‘పై అదాయం ఏమన్నా ఉంటుందా?’’
‘‘అంటే’’
‘‘అదేనమ్మా పెద్ద ఆఫీసరు కదా అవీ ఇవీ ముట్టజెబుతారు కదా’’
‘‘అదేం లేదు పిన్నిగారూ. ఆయన చాలా సిన్సియర్ ఆఫీసర్. అలాంటివి దగ్గరకు రానీయరు’’
‘‘మంచిది జాగ్రత్త ఆఫీసుల్లో ఆపీసర్లను పడేసే రంభలు ఉంటారు. ఓ పక్క గమనిస్తూ ఉండు’’ తోటి ఆడాళ్లను అలా అనకూడదేమో అని లేకుండా ఉచిత సలహా ఒకటి పారేసింది.
‘‘మరి నువ్వు ఉద్యోగం అదీ’’
‘‘లేదండీ పెళ్లయిన సంవత్సరానికే కవలలు. వాళ్లను చూసుకోవడానికి నా సమయం సరిపోతుంది. బ్యాంకు ఉద్యోగం వదిలేసాను’’
‘‘మంచి పని చేశావు. టింగురంగా అంటూ తయారై మొగుడినీ పిల్లల్నీ వదిలేసి ఉద్యోగాలేమిటీ’’ తన పాత చింతకాయ పచ్చడి ఆలోచనను బయటపెట్టింది.
ఏమీ అనలేని పరిస్థితి నాదు.
మూడవ క్లాసు చదువుతున్న నా పిల్లలు స్కూలు నుండి వచ్చే టైమవుతోంది. ఈమె ఇంకా వెళ్లదేంటీ అనుకున్నాను.
అలా పిచ్చి కబుర్లు చెబుతూ ఓ గంట తర్వాత ‘‘వెళ్లొస్తానమ్మా’’ అంటూ బయలుదేరింది అనసూయమ్మ.
ఇలాంటి కబుర్లు చెప్పడానికి వీళ్లకి మనసెలా వస్తుందో... మళ్లీ రాకు తల్లీ అని మనసులో అనుకున్నాను. ఆమె వెళ్లగానే పెద్ద రిలీఫ్‌గా ఫీలయ్యాను.
మూడున్నరకల్లా పిల్లల స్కూలు బస్సు వచ్చింది. వాళ్ల కోసం గుమ్మం దగ్గర నిలబడి రోజులాగే వేచి చూస్తూ వాళ్లు రాగానే లోపలికి తీసుకెళ్లాను.
* * *
మధ్యాహ్నం పనె్నండుంబావు.
రింగవుతున్న ఫోను ఎత్తాను వంటింట్లోంచి వచ్చి.
ఫ్లోనులో అట్నుంచి చెబుతున్న విషయం విని కూలబడిపోయాను.
అదే ఊళ్లో ఉంటున్న మా పెద్దన్న హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడికి దగ్గరలో ఉండే అపోలో హాస్పిటల్‌కి తీసుకెళ్లారట. కాళ్లూచేతులూ ఆడలేదు. వెంటనే మా వారికి ఫోను చేసి హాస్పిటల్‌కి రమ్మని చెప్పి బయలుదేరాను.
స్కూలు నుండి పిల్లలు రావడానికి మూడు గంటలు పడుతుంది. ఈలోగా నేవెళ్లి వద్దామని త్వరత్వరగా బయలుదేరాను హాస్పిటల్‌కి.
* * *
సాయంత్రం ఆరవస్తోంది. ఓ పక్క ఆపరేషన్ జరుతోందని హాస్పిటల్లో ఉన్నా. మరో పక్క పిల్లలు ఇంటికొచ్చి ఏం చేస్తున్నారో. తలుపు తాళం వేసినా వరండాలో కూర్చోవచ్చు. వాళ్లు స్కూలు నుండి వచ్చేలోగా వద్దామనుకున్నా ఆ పరిస్థితులు కుదరనివ్వలేదు. మావారూ కంగారుపడిపోయారు.
‘‘యమునా నేను ఇక్కడ హాస్పిటల్లో ఉంటాను. ఇక్కడ ఏదన్నా సహాయం అవసరం అవ్వొచ్చు. నువ్వు డ్రైవరును తీసుకుని ఇంటికెళ్లు. పిల్లల్ని తీసుకొద్దువుగాని’’
‘‘అయితే త్వరగా వస్తాను. అక్కడ పిల్లలు ఎలా ఉన్నారో’’ అని కంగారుగా బయలుదేరాను.
* * *
వరండాలో పిల్లలు లేరు. వాళ్ల బ్యాగులూ లేవు. చెమటలు పడుతున్నాయి. కాళ్లు వణుకుతున్నాయి. పిల్లల్ని ఒంటరిగా ఇలా ఇదే మొదటిసారి వదలడం. కళ్ల వెంబడి నీళ్లు.
ఇరుగూ పొరుగూ ఉన్నా ఎవరికి వాళ్లే.
ఆయనకు ఫోను చేసా.
‘‘యమునా నీకు కంగారు ఎక్కువ. ఆదుర్దా పడకు. వాళ్ల క్లాస్ ఫ్రెండు రాహుల్ ఇంటికెళ్లారేమో కనుక్కో’’ వినయ్ చెప్పాడు.
రాహుల్ నెంబర్ ఫోనులో వెతికి కాల్ చేశాను.
‘‘వాళ్లు మీ ఇంటి దగ్గరే స్కూలు బస్సు దిగారాంటీ. ఇక్కడికి రాలేదు’’ చెప్పాడు రాహుల్.
ఆ సమాధానం విని గుండె కొట్టుకుంటోంది... తల తిరుగుతోంది.
ఈలోగా ఎదురింటి అనసూయమ్మ తలుపు తీసుకుని వచ్చింది.
ఇప్పుడామె ఎందుకొచ్చిందో... మళ్లీ ఏం కావాలో పాడో మనసులో అనుకున్నా.
‘‘అమ్మాయి వచ్చావా? ఎక్కడికి వెళ్లావ్. ఏదో బాగా వర్రీగా ఉన్నట్లున్నావు’’ అంది.
‘ ఈమెకు అన్నీ కావాలి. అసలే బాధలో ఉంటే మధ్యలో ఈమె నస ఒకటి’ అనుకుంటూ ‘‘మా అన్నయ్యను హాస్పిటల్లో చేర్చితే చూద్దామని అర్జెంట్‌గా వెళ్లాల్సి వచ్చింది’’ అన్యమనస్కంగా చెప్పాను.
‘‘అనుకున్నా ఏదో అర్జెంటు పని ఉండి ఉంటుందని’’ దీర్ఘం తీసింది.
‘ ఇక వదలదా ఈమె’ అనుకున్నా.
‘‘మీ అన్నయ్యకా? ఏమైందట. అంతా బాగుంటుందిలే. పెద్దగా వర్రీ అవకు. మీ పిల్లలు మా ఇంట్లో ఉన్నారు. నేనే రమ్మన్నాను. బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు పాపం. కొంచెం అప్పు కావాలని మీ ఇంటికి వస్తే తాళం పెట్టి ఉంది. పిల్లలేమో దిగులుగా కూర్చుని నువ్వు ఎక్కడికి వెళ్లావో తెలియదన్నారు’’
ఆ మాటలు నాకు సుమధురంగా అనిపించాయి.
అప్పటి వరకు ఉన్న అలసట, భయం పూర్తిగా పోయాయి. మనసు తేలిక పడింది.
అప్పుడే ‘‘అమ్మా’’ అంటూ పిల్లలిద్దరూ అనసూయమ్మగారింట్లో నుండి వస్తున్నారు.
వాళ్లని చూసి ఎంత ఆనందపడ్డానో చెప్పలేను,
‘‘మామ్మగారు బోలెడు బొమ్మలు, తాయిలాలు ఇచ్చారు. రామాయణం కథ కూడా చెప్పారు. మేము రోజూ మామ్మ దగ్గరే ఆడుకుంటాం’’
బుడిబుడి మాటల్లో చెబుతూ ఉన్నారు మా చిట్టికవలలు రాం, శ్యాం.
‘‘మా అబ్బాయి పిల్లల్లానే వీళ్లూను. మంచి పిల్లలు. గొడవే చేయలేదు. నీలానే బుద్ధిమంతులు. అయినా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ఇరుగు పొరుగుకో, నాకో చెప్పొద్దా అమ్మాయి’’ అంటూ దీర్ఘం తీసింది.
నేను వౌనంగా ఉన్నాను.
‘‘మధ్యాహ్నం ఏదైనా తిన్నావా? కాస్త మొహం కడుక్కుని రా టిఫిన్, కాఫీ తెచ్చిస్తా’’ అంది.
అనసూయమ్మగారివేనా ఈ మాటలు. అంత బాధలోనూ ఆశ్చర్యంతో పాటు ఆ క్షణంలో ఆమెపై ఒక ఆరాధనా భావం కలిగింది.
ఆమెలో మా అమ్మ కనబడింది.
మనసు తెలుసుకుని అభిప్రాయం ఏర్పరచుకోవాలని పాఠం నేర్చుకున్నా. ఆమె మనసుకు నా మనసులోనే నమస్సులు తెలిపాను.
ఆప్పుడే మా వారి నుండి ఫోను.
‘‘అక్కడ పిల్లలు ఎలా ఉన్నారు? ఇక్కడ మీ అన్నయ్య ఆపరేషన్ సక్సెస్ అయింది’’
ఆ మాటలు విని నా కళ్లలో ఆనందబాష్పాలు రాలాయి.

- డిఎన్‌వి రామశర్మ, సెల్ : 9663526008

పుస్తక సమీక్ష

కడలిని కడవలో చూపిన కావ్యం అవ్యక్తం

భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల స్థానం అత్యుత్తమైనది. వారిని భూమాత ఆకాశాలతో పెద్దలు పోలుస్తారు. స్వర్గస్తుడైన అయ్యకు అక్షరాంజలిని తర్పణ గావించి, అంకితాన్నిచ్చిన తనయుడు ఆత్మకరు రామకృష్ణ గొప్ప చిత్రకారుడు, కవి. ఇది దీర్ఘకవితగా విషాదాన్ని వెల్లడిస్తూ వినూత్నంగా వెలిసింది. సినారె వంటి ప్రముఖుడు దీనికి ముందు మాటనందించారు. ఇందులో భాష, భావం, సందర్భం, సన్నివేశం శైలివంటివి వారి గుండె లోతుల్ని వేదనని కవిత్వాకర్షణలో చూపి చివరి దాకా చదివింపజేశారు. వారి అనుబంధాన్ని, ఆప్యాయతని, చిత్రంలో చిత్రించినట్లు చేవగలిగి చూపారు.
జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాలను ఎదుర్కొనే తొలిపాదాలకు నాంది నాన్న. ధర్మం నిలవని చోట క్షణం నిలిచేవాడు కాదు. మనమెంత, మన బ్రతుకెంత అంటూ నిరాడంబరతను నేర్పాడు. రూపాయి విలువ తెలిసేలా పెంచాడు. పరుపులున్న చోట కటిక నేలను చూపాడు. పాలు పరమాన్నమున్న చోట గంజి రుచిని మప్పారు. ఇందులో తండ్రి వ్యక్తిత్వం, వేదాంతం, కర్మయోగం, శ్రమైకజీవనం వెల్లడవుతాయి.
చుట్టూ ఉన్న సమాజాన్ని చదివిన ఆధునికుడవు, నిత్య విద్యార్థివి, బ్రాహ్మణ సఖుడవు, హరిజన ప్రియుడవు, అందరినీ కలుపుకుని వెళ్లే సమభావ సముద్రడవు, అధిక సుఖాలు అనంత బాధల కొరకే అన్నావు. ఇందులో గీతావాణి వినిపిస్తుంది. దేహం దుర్బలంగా కనిపిస్తే ‘ ఈసురోమని మనుషులంటే దేశమేగతి బాగుపడునోయ్’ అంటూ గురజాడను గుర్తు చేశావు. కాలం పోతే తిరిగి రాదని కాలం విలువను చిన్ననాడే తెలిపావు. కార్యసాధనే ధ్యేయమని, భేషజాలకు దూరంగా ఉండమని జీవన విలువలను తెలిపావు. ఇందులో వారి అనుభవం, ఆధ్యాత్మిక అగుపిస్తాయి. తీర్థాలు పుణ్యక్షేత్రాలు చూసి రమ్మంటే కాశీకెళ్లినా చేదు గుమ్మడి చేదే గాని, తీపి రాదన్నావు. మనం ఇబ్బంది పడ్డా ఫర్వాలేదు, తోటి వారు ఇబ్బంది పడకూడదు అంటూ జీవన వేదాన్ని బోధించావు. మట్టిని ప్రేమించిన మనిషిగా ఒదిగిన విజ్ఞత మీ సొంతం. పుట్టింది ఎందుకో తెలిసేలా పెంచావు. మీ వౌనాలే గౌతముని బోధనలు, మీ కథలే రామకృష్ణ పరమహంస ప్రవచనాలు. మాటలే ఢమరుక నాదాలు, ఇందులో తండ్రిగారి తత్వం, వ్యక్తిత్వం విశదమవుతాయి. ఏడుకొండలనెక్కిన వెంకటరమణుడు కాదు మా నాన్న, కనిపించని ఎనిమిదో కొండపై వెలిసిన కారణజన్ముడు నాన్న. మోక్షం దొరికే వరకు మళ్ళీమళ్లీ మనిషిగానే పుడతా అన్న వివేకానందుని తత్వం మీది. కాళ్లు తడవకుండా సాగరాన్ని, కళ్లు తుడవకుండా సంసారాన్ని దాటలేమనే వాడివి. మాకిచ్చింది ఆస్తుల్ని కాదు ఆప్తుల్ని అంటూ తండ్రి అంతర్వాణిని అవలోకించే సత్తా గల ఆర్ద్రతను ఆవిష్కరించాడు తండ్రి రుణం ఇలా తీర్చుకున్న రామకృష్ణ కవి ధన్యుడు. అతని కవితా పటిమ కొనియాడదగినది.

- చెళ్లపిళ్ల సన్యాసిరావు, సెల్ : 92933 27394.

మనోగీతికలు

రెప్పవాల్చకు
రెప్పవాల్చకు అందం అందలమెక్కుతుంది
సహజ సుందరి ముగ్ధమనోహరంగా
సింధూరకాంతితో కనువిందు చేస్తోంది
తెలతెలవారుతున్న సప్తవర్ణాల చేరిక
హృదయాకాశం నిండా సొగసుల్ని పేరుస్తోంది
యమునోత్రి నుండి బయలుదేరిన
నదీ ప్రవాహ ధ్వనిలా...
దివ్యగానం అలలు అలలుగా
జ్ఞానామృతాన్ని కురిపించబోతోంది
చెవులు రిక్కించి విభ్రాంతితో వింటున్నట్లున్న
పల్లె గోవుల సమూహం
వాటిని సోకుతున్న మృదుపవన వీచికలు
మధుర మహోన్నత దృశ్యకావ్యంలా
నేలకు దిగి వచ్చిన పచ్చని చేల ఆకృతి
పొందుతున్న వేళ
రెప్పవాల్చకండి
అందం అందలమెక్కబోతోంది
కష్టం చేసి చేతులూ
కురిసే వానా పండే పంట
జన జీవనానికి జీవకృతులు
దివి నుండి దిగినట్లున్న భ్రాంతి
ఏ చిత్రకారుడూ చిత్రించలేని దృశ్యకావ్యం
క్షణానికో సౌందర్యం కంటికింపైన అనుభూతి
తిరిగి గగనానికి పయనమవుతున్న వేళ
రెప్పవాల్చకు
ఇల అందం అందలమెక్కుతోంది
తరుముకొచ్చే మూర్ఖ నాగరికత మనిషిని కమ్మేసరికి
బంగారు గుడ్లు తల్లుల కడుపులో ఇంకెన్ని ఉన్నాయో కోసి చూసే లోపున
ఎగురుతున్న డేగల కర్కశ వాద్య ధ్వని నుండి
చెట్టుని పుట్టని పక్షిని పల్లెని
మువ్వల సవ్వడితో పరిసరాల్లో పొంచి ఉన్న పులి సంకేతాల్ని పసికట్టు
మనిషి యుగానికొక తీరుగ మారవచ్చు
మూల స్వభావమెక్కడికి పోగలదు
ప్రకృతి సుకృతులే సమస్తం తస్మాత్ జాగ్రత్త
సౌందర్యానికి తేలిపోతూ వాలిపోతున్న
అరమూతల కన్నుల్ని జాగృతం చేయి
రెప్పవాల్చకు క్షణం
అందం అందలమెక్కబోతోంది
అందలేనంతగా!

- బులుసు సరోజినీదేవి,
సెల్ : 9866190548

సత్యం

చుట్టూ చిలుకలు
రంగురంగుల చిలుకలు
పంచవనె్నల చిలుకలు
అందమైన కళ్లు, ఎర్రని ముక్కు
ఆకుపచ్చని రెక్కలు, పొడవైన తోకలు
రెక్కలు అల్లార్చుతూ
వయ్యారంగా నడుస్తూ
మోహనరాగాల రంజితాలతో
కవ్విస్తూ, అలరిస్తూ
ఎంత పరవశం ఆనంద పరవశం
ఇంతలో మధ్యలో ఓ కాకి
నల్లని కాకి, ఏకాకి
సుందర దృశ్యాన్ని భగ్నపరుస్తూ
స్వప్న సంతోషాన్ని భంగపరుస్తూ
వౌనంగా, నిశ్శబ్దంగా
సహనంగా, శాంతంగా కాని నల్లగా
ఇంద్రధనస్సు కప్పేసిన మేఘంలా
వెనె్నలను దాచేసిన నల్లమబ్బులా
తులసి మొక్కల మధ్య గంజాయిమొక్కలా
నల్లటి కాకి
సంతోషాన్ని ఆవిరి చేస్తూ
స్వర్గంలోంచి సత్యంలోకి తోసిపడేస్తూ
వద్దాన్నా, కాదన్నా చుట్టూ తిరిగే కాకి
చూడగా చూడగా
కాకి కూడా ఒకప్పటి చిలుకలాగే ఉంది
బహుశా చిలుకేనేమో!
(అంకితం : భార్యావిధేయులందరికీ)

- మీనా (మాధురీదేవి),
సాయిటవర్స్, పిఠాపురంకాలనీ,
మద్దిలపాలెం, విశాఖపట్నం-530003.

email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- మహాభాష్యం రామలక్ష్మి