విజయవాడ

అటాచ్‌మెంట్ (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మన మనస్తత్వాలనే మార్చేస్తూ ఉంటాయి. వింత అనుబంధాల్లో మనల్ని ఇరికిస్తూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, సరైన జవాబు పొందడంలో సఫలం కాలేకపోవచ్చు. నేనెందుకిలా అంటున్నానో చెబుతాను. మా చిన్నమ్మాయి పావని చురుకైన పిల్ల. చాలా విషయాల్లో కచ్చితమైన అభిప్రాయాలు ఉండడమే కాకుండా వాటిని ఆచరణలో పెట్టడానికి వెనుకాడదు. అది ఏనిమల్ లవర్. కుక్కలంటే మరీ ఇష్టం. ‘నేను పెళ్లి చేసుకోను, నాకు పిల్లలక్కర్లేదు. నాలుగైదు కుక్కలని పెంచుకుంటూ హాయిగా ఉంటాను. విచిత్ర మనస్తత్వాలతో ఉండే మనకర్థంకాని మనుష్యుల కంటే మూగప్రేమను చూపిస్తూ నిష్కల్మషంగా ఉండే కుక్కలే నయం’ అని కూడా అంటూ ఉంటుంది. అలాంటి పావని ‘మనం ఒక కుక్కని పెంచుకుందాం అమ్మా’ అని చాలాసార్లు నున్న ఒప్పించడానికి ప్రయత్నం కూడా చేసింది.
అది ‘్ఫబియా’ అనండి, ఇంకేమైనా అనండి, నాకు కుక్కలంటే చచ్చే భయం! కుక్క కరచిన వాళ్లు ఇంజెక్షన్స్ చేయించుకోకపోతే ఎంత దారుణంగా చనిపోతారో చిన్నప్పుడు కథలు కథలుగా విన్నాను. దానికితోడు మా సొసైటీ కాంప్లెక్స్‌లో ఐదారేళ్ల క్రితం ఒకావిడని కుక్క కరిచింది. కరిచిన సంవత్సరానికే ఆవిడ చనిపోయింది. ఆవిడ ఇంజెక్షన్స్ చేయించుకుందనీ, కానీ అవి వికటించి ఆమెని ఒక వింత ‘్ఫబియా’కి గురి చేశాయని, ఆమె సూర్యరశ్మిని భరించలేకపోయేదని, పగలంతా తలుపులు వేసుకుని ఇంట్లోనే గడిపేదని, చీకటిపడిన తర్వాతే బయటకి వచ్చేదనీ అక్కడివారు కథలు కథలుగా చెప్పుకునేవారు. చివరికి ఆమె ఎందుకు మరణించిందో తెలియదు కాని, ఆ కుక్క కాటే ఆమెకు శాపంగా మారిందని వ్యాఖ్యానించారు చాలామంది. మనుషుల ఈ మాటల వెనుక ఎంత నిజముందో తెలియదు కానీ, ఆ సంఘటన మాత్రం నా మనస్సులో స్థిరపడిపోయి, కుక్కల పట్ల విపరీతమైన భయం ఏర్పడడానికి కారణమైంది. ఫలితంగా నేను చాలారోజుల వరకు మా అమ్మాయి ప్రయత్నాలు సాగనివ్వలేదు.
పావనికి కాంప్లెక్స్‌లో తిరిగే వీధికుక్కలన్నా కూడా విపరీతమైన ఇష్టం. అది ఇంట్లో నుంచి బయటికి వెళ్లేటప్పుడు నాలుగైదు కుక్కలు తోకలాడించుకుంటూ దానిచుట్టూ మూగేవి. అది వాటితో ఎంతో ఇష్టంగా, ప్రేమగా మాట్లాడుతూ వాటిని చేరదీసి నిమిరేది. మేమిద్దరం కలిసి బయటికి వెళ్లేటప్పుడు నేను దానికి ఆమడదూరంలో వెనుక నడిచేదాన్ని కుక్కల భయంతో! కొన్నాళ్లకి మా కాంప్లెక్స్‌లో ఉన్న ఒక వీధికుక్క గర్భవతి అయి ఆరు పిల్లలకు జన్మనిచ్చింది. నాలుగింటిని చెప్పాపెట్టకుండానే కొందరు ఎత్తుకెళ్లిపోయారు. మిగిలిన రెండు మా ఇంటి చుట్టూ తిరుగుతుండేవి. పావనికి అవంటే ఎంతో ముద్దు. రోడ్డుమీద బాసంపట్టు వేసుకుని కూర్చుని వాటిని ఒడిలోకి తీసుకుని ఆడిస్తూ ఉండేది. నెమ్మదిగా అవి మా ఇంటి ఆవరణలోకి రావడం మొదలెట్టాయి. పావని ఇంట్లో నుంచి బయటికి రాగానే అవి చెంగుచెంగున గంతులు వేసుకుంటూ దానిచుట్టూ తిరిగేవి. చెప్పొద్దూ.. దూరం నుంచి పావనిని, వాటిని అలా ఒకటిగా చూడటం నాక్కూడా ముచ్చటగా అనిపించేది.
కొన్నిరోజుల తర్వాత ఆ పిల్లలను వదిలేసి తల్లి ఎటో వెళ్లిపోయింది. వాటికి ఆకలవుతుందని, పాలు పోయమని పావని నన్ను పోరేది. రెండు ప్లాస్టిక్ డబ్బాలు వరండాలో పెట్టింది వాటి కోసం. అవి పాలు తాగడానికి వరండాలోకి వచ్చేవి. అలా రావడం మొదలుపెట్టిన ఆ రెండు కుక్కలు వరండాలోనే ఉండిపోవడం మొదలెట్టాయి. పడుకోడానికి పాతవయిపోయిన రెండు సోఫా దిండ్లని వాటికోసం వరండాలో అమర్చింది పావని. పావని చేసే ఈ పనులన్నింటినీ నేను మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించినా, క్రమంగా రాజీ పడిపోయాను. కానీ అవి నా దగ్గరికి వచ్చి నా మీద ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం కర్రతో వాటిని జడిపించేదాన్ని. బయటికి వెళ్లి ఇంట్లోకి వచ్చేటప్పుడు వాటికి తగలకుండా రాళ్లు విసురుతూ దగ్గరకి రాకుండా చేసేదాన్ని. కొన్ని రోజులకి అవి కూడా గ్రహించుకుని తోకలాడిస్తూ నాకు దూరం దూరంగానే ఉండేవి.
పావని వాటికి జాకీ, జిమీ అని పేర్లు పెట్టింది. ఆ పేర్లతో వాటిని పిలవడం మాకు అలవాటయిపోయింది. పావని పరీక్షల హడావుడిలో పడిపోయి వాటికి పాలుపోసే బాధ్యతని క్రమంగా నాకప్పగించేసింది. రోజూ ఉదయం టీ తాగిన తర్వాత వాటికి పాలుపోసేదాన్ని. నేను పాలు పోయడానికి వరండాలోకి వెళ్లినప్పుడు అవి సంతోషంగా లోకలాడించుకుంటూ నా దగ్గరకి పరుగెత్తుకు రావడం నాకు ఇష్టంగా అనిపించేది. ఎంతటి అనారోగ్యంలోనైనా వాటికి పాలు పోయడం మర్చిపోయేదాన్నికాదు.
ఒక సంవత్సరం తర్వాత జాకీ జబ్బు పడింది. ఒక కాలుపైకి పెట్టుకుని కుంటిగా నడిచేది. అది క్రమంగా చిక్కిపోయింది కూడా. పావని, మా వారు కలిసి ‘ఫ్రెండికోస్’ అనే కుక్కల ఆర్గనైజేషన్‌కి తీసుకెళ్లారు. వాళ్లు దాన్ని అక్కడే ఉంచి చికిత్స చేయాలని చెప్పారు. వారం రోజుల తర్వాత ఆర్గనైజేషన్ వాళ్ల దగ్గర నుంచి ఫోను వచ్చింది. కుక్కకి చికిత్స చేసినా బతికించలేకపోయామని, అది చచ్చిపోయిందని! ఈ వార్త విని పావని ఏడ్చేసింది. తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని రోజంతా బయటికి రాలేదు. పావనిని ఓదార్చుదామని అనుకున్న నాకు ఏడుపు వచ్చేసి సోఫాలో అలా కూర్చుండిపోయాను. కొన్ని రోజుల వరకు మేం మామూలు మనుషులం కాలేకపోయాం. నాలోని ఈ మార్పుకి నాకే వింత అనిపించింది. భయం భయంగా దూరంగా ఉండే నాకు చివరికి వాటితో ఏదో అనుబంధం ఏర్పడిపోయింది!!
జాకీ చనిపోయిన తర్వాత జిమీ మా అందరికీ మరీ ప్రియమైపోయింది. అంతగా దాన్ని పట్టించుకోని మా పెద్దమ్మాయి పవిత్ర కూడా దాన్ని దగ్గరకి తీయడం మొదలెట్టింది. ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత దానితో కొంచెంసేపు గడిపి కానీ మిగతా పనులు చేసేదికాదు. ఈ మధ్య జిమీకి పొద్దునే్న పాలన్నం పెట్టడం మొదలెట్టాను. ‘మీరు తినే అంత ఖరీదైన అన్నం దానికి ఎందుకు పెడతారు’ అనేది మా ఇంట్లో పనిచేసే జయమ్మ. అయినా మేం పట్టించుకునే వాళ్లం కాదు. పైగా సాయంకాలం దానికి మళ్లీ ఆకలి వేస్తుందని పావని దానికోసం పెడిగ్రీ పాకెట్స్ కొనితెచ్చి ఇంట్లో ఉంచేది. ఆ పెడిగ్రీ వాసన నాకు పడేదికాదు. రోజూ పావనికి పెడిగ్రీ పెట్టమని గుర్తుచేసే బాధ్యతను కూడా నేను సంతోషంగా స్వీకరించాను. ఇంట్లో చికెన్ వండినప్పుడల్లా దానికి తప్పకుండా పెట్టేవాళ్లం. ఎండాకాలం దానికి వేడిగా ఉంటుందని పావని ప్రత్యేకంగా ఫ్యాను వేసి ఉంచేది వరండాలో. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఎండలు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు ఏకంగా డ్రాయింగ్ రూమ్‌లోకే తీసుకొచ్చింది. మొదట్లో దీన్ని నేను తీవ్రంగా వ్యతిరేకించాను. అయినా పావని వినిపించుకోలేదు. క్రమంగా జిమీకి డ్రాయింగ్ రూమ్‌లో నా కుర్చీ పక్కన పడుకోవడం అలవాటైంది. రాత్రిపూట మాత్రం దాన్ని బయటికి వదిలేవాళ్లం. ఈ ఒక్క విషయంలో మాత్రం పావని నా మాట విన్నది.
జిమీ కూడా ఈ రొటీన్‌కి అలవాటుపడింది. పొద్దునే్న అన్నం పెట్టే సమయానికి తలుపుకొట్టి గుర్తుచేస్తుంది. మళ్లీ 10 గంటల సమయంలో లోపలికి రానివ్వమని తలుపు తడుతుంది. రాత్రి 10 గంటల తర్వాత బయటికి వెళ్లమని చెబితే దానికి అర్థమైపోయి బుద్ధిగా వెళ్లిపోతుంది. నేను పట్టుబట్టి దానికి యాంటీరేబిస్ ఇంజక్షన్లు కూడా ఇప్పిస్తున్నాను. మేం జిమీని అంత ప్రేమగా చూడటం జయమ్మకి ఇష్టముండేది కాదు. ‘రోడ్డున పడి ఉండాల్సిన కుక్క రాజభోగాలు అనుభవిస్తుంది’ అంటుండేది. దాని జుట్టంతా డ్రాయింగ్ రూమ్‌లో పడుతుందని ఊడ్చేటప్పుడు విసుక్కునేది. జిమీ మా కుటుంబంలోని సభ్యురాలిగా మారిపోయింది. పావని సమయం దొరికినప్పుడల్లా దానికి స్నానం చేయిస్తుంది. ఒక్కోసారి పావని అశ్రద్ధ చేసి స్నానం చేయించకపోయినా, దానిదగ్గర వాసన వస్తున్నా మాకు అలవాటయిపోయి ఏమీ అనిపించేదికాదు. ఒకసారి మావారు జాతీయ గీతం ‘జనగణమన’ అనాలోచితంగా పాడినప్పుడు జిమీ భయపడి సోఫా వెనక్కి వెళ్లి దాక్కుంది. అప్పటి నుంచి దాన్ని ఎప్పుడు భయపెట్టి నవ్వుకోవాలని అనిపించినా బిగ్గరగా ‘జనగణమన’ పాడేవారాయన. అది సోఫా వెనుక దాక్కుంటే ‘ఇది పూర్వజన్మలో పాకిస్తానీ’ అని సరదాగా అనేవారు. ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్లు బయటికి వెళ్లిపోయాక నా కుర్చీ పక్కన పడుకునే జిమీని చూసినప్పుడు నాకు ఎవరో ఒక మనిషి తోడున్నట్లే అనిపించేది. జిమీ మధ్యమధ్యలో బయటికి వెళ్లినా కొంచెం సేపట్లో టంఛన్‌గా వచ్చి నా కుర్చీ పక్కన పడుకునేది. మా అమ్మాయిల మీద ప్రేమ కురిపించే సమయాల్లో వాళ్లెంత పెద్దవాళ్లయినా ముద్దుగా ‘బుజ్జినాన్న’ అనో ‘బంగారు కొండ’ అనో పిలుచుకోవడం అలవాటు. ఒక్కోసారి జిమీని పిలిచేటప్పుడు కూడా ఆ పదాలు నాకు తెలియకుండానే పలికేదాన్ని. దానికి మా అమ్మాయిలు ఆటపట్టించేవారు. ‘జిమీ నీకు అత్యంత ప్రియమైన మూడో కూతురు అయిపోయిందే’ అని కామెంట్ చేసేవాళ్లు.
ఒకసారి నా స్నేహితురాలు సరోజ వచ్చింది మా ఇంటికి. జిమీని చూసి ‘ఓహో! కుక్కని పెంచుతున్నారా? ఇది ఒక మోహం మాయ. ఇందులోంచి బయటపడడం ఇక మీకు సాధ్యంకాదు’ అన్నది. నిజమేనని అనిపించింది నాకు. కొన్ని బంధాల్లో చిక్కుకుపోయిన మనం పూర్తిగా మారిపోవడమే కాకుండా వాటినుంచి బయటపడలేమేమో! కాని ఒక్క విష యం మాత్రం నిజం. కుక్కలంటే నాకు ఇదివరకున్న భయం చాలావరకు తగ్గిపోయింది!

- శాంతిశ్రీ బెనర్జీ,
కొత్త ఢిల్లీ.
చరవాణి : 9871989360

చిన్నకథ

అమ్మా.. క్షమించవే!
ఫ్రెండ్స్‌తో చెన్నై వెడుతున్నాని చెప్పి వెళ్లిన కొడుకు పదిరోజులైనా రాకపోవడం, కనీసం ఫోన్ కూడా చేయకపోవడం వరమ్మని ఆందోళనకి గురిచేసింది. పక్కింటి దుర్గాంబ కొడుకు కేశవుడు తల్లిని దేవతగా చూసేవాడు. అమిత ప్రేమ. అలాంటివాడు పెళ్లయిన ఏడాదికే పెళ్లాం చాటు మొగుడుగా మారిపోయాడు. పెళ్లాం తన తల్లిని అనరాని మాటలంటున్నా నోరుమూసుకుని కూర్చోవడమే కాకుండా అప్పుడప్పుడు భార్య మాటలకి తాళం వేయడంతో దుర్గాంబ ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్లిపోయింది. భార్య చెప్పిందని వెతికించలేదు వాడు. ‘రేపు పెళ్లయితే మీవాడైనా అంతే’! అని జానకమ్మగారు అనడంతో వచ్చిన ప్రతి సంబంధానికి ఏదోఒక వంక పెట్టి తప్పించడం చేసింది. ‘ఈవిషయం వాడికిగానీ తెలిసిందా?’ పరిపరి విధాల ఆలోచనలు. ఆందోళన మొదలైంది వరమ్మలో. ‘పోస్ట్’ అంటూ కేక. ‘ఇంకా ఈరోజుల్లో కవరా? సెల్‌ఫోన్ వచ్చాక కూడా’.. అనుకుంటూ చింపి చదివింది.
‘అమ్మా నన్ను క్షమించవే..! పెళ్లిచూపులకంటూ నీవెంట ఎన్నో ఇళ్లకు తిరిగాను కదా! ఏదీ అచ్చిరాలేదు. అందుకే సొంత నిర్ణయం తీసుకుని నాతోటి టీచర్ స్వరాజ్యాన్ని గుడిలో పెళ్లి చేసుకున్నా. స్నేహితులందరి సహకారంతో స్వరాజ్యం బంధువుల అందరి ఇళ్లూ తిరుగుతూ చూడవలసిన ప్రదేశాలు చూస్తున్నా. అంటే ‘హనీమూన్’ అన్నమాట! ఢిల్లీలో మేనమామ గారింటికి వెళ్లాము. వాళ్లు మాకు అక్షరధామ్, ఆగ్రాలో తాజ్‌మహల్ చూపించారు. త్వరగానే వస్తాంలే. దిగులుపడకు. నేను కేశవుడుని కాదని మాట ఇస్తున్నా’..!
- జి నాగమల్లిక,
గుంటూరు.

పుస్తక పరిచయం

ఏది ఉత్తమ దానం?

ప్రతులకు: పామర్తి రవి,
కార్యదర్శి, మంగళగిరి బుద్ధవిహార
11-450/సి1, ఎన్‌సిసి రోడ్,
మంగళగిరి - 522503.
చరవాణి : 9490834124

మానవీయ కోణానికి గీటురాయిగా నిలిచే అంశాల్లో ‘దానం’ ఒకటి. దానం అంటే ఒక అవసరానికి సంబంధించి దాత - గ్రహీత నడుమ జరిగే ప్రక్రియ. మానవ మనుగడకు మంచి ఎంత అవసరమో, సమాజ మనుగడకు దానగుణమూ అంతే అవసరమని ప్రబోధిస్తుంది ‘దాన విశిష్టత - ఒక అవగాహన’ అనే పుస్తకం. మానవ గుణాల్లో ఒకటైన దానగుణాన్ని పుస్తక రూపంలోకి తీసుకురావటమనే ఆలోచనే విశిష్టమైనది. అయితే దానమనేది నేడు అనేక వింతపోకడలు పోతుండటం జగమెరిగిన సత్యం. ‘నీ కంట్లో వేలు పెడతాను - నువ్ నా నోట్లో వేలుపెట్టు’ అనే విపత్కర పరిస్థితులు సమాజం యావత్తూ ఆవరించి ఉన్న నేటిరోజుల్లో భావితరానికి, వర్తమాన సమాజానికి సందేశాన్నందించే ఆలోచనామృతమే ఈ పుస్తకం. చిత్తశుద్ధితో, నిజాయతీతో ‘దానం’ పోకడల్ని దగ్గరగా పరిశీలించి దానగుణాన్ని త్రికరణశుద్ధితో మధించగా స్వీయానుభూతితో మనముందుకు వచ్చిన సారమే ఈ రచన. ఈ పుస్తకాన్ని చదివి ఏ ఒక్క లోభి మనోగతం మారినా రచయిత తపన ఫలించినట్లే! గౌతమ బుద్ధుని దశపారమితల్లో ప్రధానమైన దానగుణాన్ని అందరూ అలవరుచుకోవాలనే సదుద్దేశ్యంతో ఈ రచన సాగింది. అడుగడుగునా అమృతవాక్కులను అందిం చే బౌద్ధం ఔన్నత్యాన్ని దానానికి అన్వయిస్తూ రచయిత విశే్లషించిన తీరు అమోఘం. రచయితకు ప్రేరణగా నిలిచిన బౌద్ధం మనందరికీ చేరువకావాలనే ఆర్తితో చేసిన ఈ ప్రయత్నంలోకి మనమూ ఒకసారి తొంగిచూస్తే.. దానాన్ని 1. ఉత్తమ దానం 2. మధ్యమ దానం 3. అథమ దానం - అనే మూడు రకాలుగా వర్గీకరించారు. దానానికి ముందు, దానం చేసేటప్పుడు, దానం చేసిన తరువాత దాన చర్య పట్ల సద్భావన ఉన్నట్లయితే అది ఉత్తమ దానం. అంతేకాదు, దాతకు కరుణతో పాటు ప్రజ్ఞ కూడా ఉండి తీరాలంటారు రచయిత. చేసిన దానం ఉత్తమమే అయినప్పటికీ అజ్ఞానం వల్ల గ్రహీత ఆనందమనస్కుడు కాకున్నప్పటికీ దాత మాత్రం ఆనందమనస్కుడుగానే ఉండాలనే మర్మమైన అంశాన్ని మనముందుంచారు రచయిత. ‘గ్రహీత దానం స్వీకరించటం వల్లనే దాతకు దానం చేశాననే తృప్తి మిగులుతుంది’ అనే వాక్యం రచయిత పరిశీలనా శక్తికి దర్పణంగా నిలుస్తుంది. ఇక తమ అతిశయాన్ని చాటుకునేందుకు చేసే దానాన్ని ‘మధ్యమదానం’గా పేర్కొన్నారు. ఇలాంటి దానాలు కూడా బాధితులకు ఓదార్పును కలిగించి, జీవితంపై విరక్త్భివాన్ని తొలగిస్తాయని విశే్లషించారు. అయితే ఇవి పూర్తి ఫలితాలను ఇవ్వలేవు. అలాగని దుష్ఫలితాలను కలుగజేయవని పేర్కొన్నారు. ‘స్వార్థ ప్రయోజనాలను ఆశిస్తూ తాటికాయంత కాజేయడానికి ఈతగింజను ఎరగా చూపించేది’ అథమ దానంగా చిత్రీకరించారు. ఒక కారణాన్ని సాకుగా చూపించి పొందిన సాయాన్ని స్వార్థానికి వాడుకోవడాన్ని ‘అథమదానం’గా పేర్కొంటూ పాత్రనెరిగి దానం చేయాలనే భావాన్ని అందించిన రచయిత అభినందనీయులు.
దానం చేయాలంటే ధనమే అవసరం లేదంటూ ప్రయాణ సమయంలో దివ్యాంగునికి ‘సీటు’ ఇవ్వటం కూడా దానమే అని తాను విన్న విషయానికీ విలువనిచ్చి చెప్పిన తీరు రచయిత విజ్ఞతకు నిదర్శనం. దానం చేయాలన్నా, పుణ్యం పొందాలన్నా ధనం తప్పనిసరి కాదని తేల్చారు.
లోభి మనోగతాన్ని ఉద్దేశించి ‘కూడబెట్టడం మాత్రమే తెలిసి వినియోగించటం తెలియని శ్రీమంతులు మురికిగుంటలోని నీళ్లు తాగేవాళ్లు’ అంటూ పదునైన చురకనంటించారు. అలానే చేసిన దానాన్ని తిరిగి ఇచ్చేయమనే ప్రబుద్ధులుంటారనీ, ఇలాంటివారిని ‘కక్కిన కూటికి ఆశపడే రకం’గా జనం కీర్తిస్తారని హెచ్చరించారు. పసిపిల్లల మనోభావాలను స్పృశిస్తూ, ‘పసివాళ్లు పెద్దవాళ్లలా ప్రతిఫలమాశించి దానాలు చేయరు. వారు స్వచ్ఛమైన మనసుతో నిస్వార్థంగా దానం చేస్తారు’ అని పేర్కొంటూ, ఇలాంటి దానాలు చేయటంలో చిన్నారులకు తర్ఫీదు ఇవ్వటం ద్వారా ఆనందదాయకమైన సమాజం మనముందుకు వస్తుందని అంటారు రచయిత. ప్రతిఫలమాశించని దానాన్ని అసలు సిసలైన దానంగా పేర్కొంటూ దానం ఎంత మంచిదైనప్పటికీ దాతకు కీడు కలిగించే దానం శ్రేష్ఠమైనది కాదని, గ్రహీతకు - దాతకు మంచిని కలిగించేదానినే ‘శ్రేష్ఠమైన దానం’గా పేర్కొన్నారు. కన్యాదానం విషయంలో వరుని తరఫు వాళ్లు వధువు తరఫు వారిని పీడించి తీసుకునే కానుకల విధానాన్ని ఖండిస్తూ వరకట్న దురాచారాన్ని ఎండగట్టారు. ఇలా ఒకటేమిటి విద్యాదానం, ఆరోగ్యదానం, న్యాయదానం, అభయదానం ఇలా ఎన్నింటినో దానం కోవలోకి తెచ్చిన రచయిత అభినందనీయులు. అభయదానాన్ని తీసుకుంటే పురాణాల్లో హనుమంతుడు య యాతిని రక్షించేందుకు శ్రీరామునికి ఎదురుతిరిగిన విధానాన్ని, గయుడును కాపాడటానికి అర్జునుడు శ్రీకృష్ణునితో తలపడిన విధానాన్ని ప్రస్తావించి నిబద్ధత, ఔన్నత్యాన్ని మనకు సాక్షాత్కరింపజేశారు రేకా కృష్ణార్జునరావు గారు. ‘సమాజానికి ఏది ఇస్తే సమాజమూ దాన్ని తిరిగి ఇస్తుంది’ అనే అద్భుతమైన శక్తిని మనముందుంచి సమాజం చెడిపోతుందని అందరూ చేసే విమర్శలకు దీ టైన సమాధానమిచ్చిన రచయిత మనోగ తం విశిష్టమైనదిగా చాటుకున్నారు. వం దలు, వేలు, లక్షలు, కోట్లు దానం ఇచ్చిన దా నికన్నా నిండు మనసుతో దానం చేసిన చిల్లర నాణాలు ఎంతో విలువైనవనే మర్మం దానగుణం కలవారికి కనువిప్పు కలిగించే అంశం. వేశ్యలు దానానికి అతీతులు కారం టూ చరిత్రలో జరిగిన సంఘటనలు మనముందుంచారు. స్వతహాగా బౌద్ధ ధర్మాన్ని నలుమూలలా వ్యాప్తి చేస్తున్న రచయిత ఈ క్రమంలో బౌద్ధజాతికి కథలతో మనసును కదిలించే ఉదాత్తమైన ఉదాహరణలను రమణీయంగా అందించారు. * వ్యాఘ్రీ జాతక కథలో మనిషి తనకు తానుగా పులికి ఆహారంగా మారటమనేది ‘పారమార్థక భావలన’లకు పరాకాష్ట. * దాన విశిష్టత - ఒక అవగాహన నామకరణానికి తగినట్లు బోధిసత్వుడు స్ర్తి దానాన్ని నిరాకరించిన తీరును వివరిస్తూ.. సౌందర్యరాశి చీరచెంగు స్పర్శ కోసం, పరస్ర్తి పొందుకోసం తహతహలాడే కాముకులకు కనువిప్పు కలిగించారు.
* అపురూప లావణ్యవతియైన ‘ఆమ్రపాలి’ అంతఃశీలాన్ని, ఆమెకిచ్చిన మాటను తథాగతుడు నిలబెట్టుకున్న విశేషాంశాన్ని హృద్యంగా వర్ణించారు.
* లోక బాధను తన బాధగా మార్చుకున్న అశోక చక్రవర్తి దానగుణాన్ని ప్రజాక్షేమం కోరి ఆచరించిన జీవన విధానాన్ని, చివరిరోజుల్లో నేలకొరిగిన తీరును పరిశీలించిన పాఠకులకు ‘కంటతడి’ రాక మానదు.
దానాన్ని హర్షించినా పుణ్యమేనంటూ సార్వజ్జనీనమై సర్వమానవాళి శ్రేయస్సు కోరి విశ్వమంతటికీ మేలుచేసే దానిని అసలు సిసలైన ధర్మమని పేర్కొంటూ అన్ని దానాల్లోకి ‘్ధర్మదానం’ గొప్పదని చెప్పారు. దాన పరిధిని విస్తృతం చేస్తూ బౌద్ధ్భామానిగా, బౌద్ధ సాహిత్యంలోని ఉదాత్తమైన సంఘటనలను సమాహారంగా కూర్చిన రచయిత ‘వాక్కును కర్మ’కు అనుసంధానిస్తూ జీవనం సాగించే మనిషి. విద్యార్హత కేవలం ఏడో తరగతి. విశ్వశాంతికి అక్షర శరసంధానం చేస్తున్న రేకా కృష్ణార్జునరావుగారి రచనలు మరింత ప్రాచుర్యం పొందాలని, బౌద్ధ ధర్మం దశదిశలా వ్యాపించాలని ఆశిద్దాం!

- గోలి మధు, మంగళగిరి
చరవాణి: 9989186883

మనోగీతికలు ..

కోరస్ పాడేద్దాం..
ఆకాశపు అంచులు తాకే ఆనందాలు ఓ పక్క
గుండె గాయాలతో అల్లల్లాడే విషాదాలు మరోపక్క
ఆశావహ దృక్కులతో సాగే బతుకులేమో కొన్ని
కంటిచెమ్మతో చిమ్మచీకటైన బతుకులు ఎన్నో
ముప్పిరిగొన్న మహోద్విగ్నభరిత క్షణాల విలక్షణాన
వైరుధ్యాల పల్లవులతో వైచిత్రిగా సాగే మలుపులెన్నో
కోటి ఆశలతో కొత్త సోపతికి సాదర స్వాగతమంటూనే
వెంటనడిచొచ్చిన 12 నెలల నెచ్చెలిని భారంగా వదులుకుంటూనే
కలయిక - వీడుకోలు జీవిత నాటకరంగపు అంకమంటూనే
మూసుకున్న మధుర క్షణాల రెప్పల వాకిళ్ల నుండి - వస్తూ వస్తూనే
ఒళ్లు విరుచుకున్న నిముషాలు గంటల్ని దాటుకుంటూ
వారాలు, రోజులు, నెలల మైలురాళ్లన్నింటినీ దూకేసుకుంటూ
సరికొత్త బాటలో సాగే గమ్యపు ప్రణాళికలు రచించే శూన్య గంటలు
ఆపై మంచుదుప్పట్లు పరుచుకున్న డిసెంబర్ 31 రాత్రి పనె్నండు గంటలు
బంగరులోకపు కలల ప్రపంచానికి అందరూ కథానాయిక, నాయకులే
గత కాలపు అనుభవాల వంతెనలు దాటుకుంటూ సొదల రొదలు వింటూ
మదిని దిటవు చేసుకుని ఉల్లాసపు ఉషస్సుల కోసం అంగలార్చుకుంటూ
దౌర్జన్యాలు - దుర్మార్గాలు, అలజడులు - హాహాకారాలంటూ లేని
జీవన గమనపు రథచక్రాలైన ఆడపిల్లల కళ్లల్లో చెమ్మల్లేని
నిశ్చయ ‘నిర్భయ భారతం’ మాకు ఆనందమంటూ, ఆమోదమంటూ
కొత్త వేకువల కువకువరావాల రసరాజ్యాలకు తెరనెత్తుకుంటూ
మనిషి మనిషిగా మనగలిగే కొత్త అంకానికి శ్రీకారం చుడుతూ
ఈ క్షణం నుండి అన్ని పవనాల్నీ ఆఘ్రాణిద్దాం - ఆహ్వానిద్దాం
సమయోచిత ఓర్పు - నేర్పులతో కొత్త వత్సరాన్ని స్వాగతిద్దాం
నీవూ - నేనూ, మనందరం జగమంత కుటుంబంగ సాగుదాం
నవనవోస్మేషణ రసగంగా ప్రవాహానికి శృతిలయలౌదాం
నూతన సంవత్సరానికి మనస్ఫూర్తిగా
స్వాగతగీతిని కోరస్‌గా పాడేద్దాం!

- సంపటం దుర్గాప్రసాదరావు, ఖమ్మం. చరవాణి : 8466965401

చిత్తు కాగితాలు
కాలంచెల్లిన క్రియలన్నీ
వెలవెలబోతుంటాయి
నిన్న విలువైనవన్నీ
నేడు చిత్తుకాగితాలవుతుంటాయి
ఏదీ శాశ్వతం కాని బతుకు పోరులో
సామాన్యుడి అడుగెప్పుడూ సర్కస్ ఫీటే
అమాంతం జారిపడ్డ కుబేరుడు
ఏ లొసుగు తాడునో పట్టుకుని
మళ్లీ ఎగబాకుతాడు
మడతలు పెట్టుకుంటూ
మళ్లీమళ్లీ చూసుకుంటూ
ఇవాళ్టి ఆకలికి తూకం వేసుకుంటూ
రంగుల కాగితాన్ని దాచుకుంటూ కాలాన్ని వెళ్లదీసుకునే దరిద్ర ధీరుల్ని
ఓ కొత్తకోణం మళ్లీ వెక్కిరిస్తోంది
బోసినవ్వుల బాపూ సాక్షిగా
పెద్దనోటు తలపోటును తెప్పిస్తోంది
కట్టల గుట్టలతో కొందరికి సంకట స్థితి
చెత్త బతుకుల్లో చిత్తుకాగితాలు మరికొన్ని
ఆర్థిక వ్యవస్థలో ఇదో మలుపు
హార్దిక అవస్థలో ఇదో అలుపు
నేటికీ రేపటికీ మధ్య ఎన్ని వైరుధ్యాలో
మాటల గారడీలతో
మేటలు వేసుకున్న నల్లధనం
దొడ్డిదారుల్ని వెతుక్కుంటూ
మెల్లగా తెల్లగా మారిపోవటం
మనం చూస్తుంటాం..
చూస్తూనే వుంటాం!

- కటుకోఝ్వల రమేష్,
ఇల్లెందు, కొత్తగూడెం భద్రాద్రి జిల్లా.
చరవాణి : 9949083327

అదిగో.. అదిగో!
చెత్తకుప్పలలో భావిపౌరులు
విస్తరాకుల్లో విందు
అభ్యవహరణముకై
వెతుకులాటలు
జారుతున్న లంగూట
నాసికాన నాసామల జలపాతం
పూనికమున చెదిరిన చూలికలు
మసిబారిన చుబ్రములు
కుసుమించవలసిన
పసికూనల
అసుధారణములు
అలసిసొలసి
నొగులుతున్నవి కదా!
మాలిన్యపు మూత్రాదిజలములలో
జలకాలాటలు
అవియే వారికి జలాశయాలు
ఎవరు చేసిన దోషము
పసిహృదయాలను
చిదిమేసిన కాలము
ఓ కడు బీదరికమూ..
అతలాకుతలము చేయకుమా
ఓ దరిద్రమా
దయతలచి దరిచేరుకుమా!
ధరణి నిండా నిండిన ధనికులార
అవినీతి పడగలు విప్పిన
కాలనాగులార
ఇకనైనా అక్రమ ధనార్జన మాని
భావిపౌరులను చేరదీసి
అక్షరాలతో అలంకరించి
వారి జీవితాలను
పరిపూర్ణం చేయరాదా?!

- జాని తక్కెడశిల,
బెంగుళూరు.
చరవాణి: 7259511956

email: merupuvj@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net

- శాంతిశ్రీ బెనర్జీ