ఉత్తర తెలంగాణ

‘ధన’ బంధం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయ్ ఇంటికి వచ్చేసరికి గేట్ దగ్గర భార్య శ్రావణి, కొడుకు విశేష్ నిల్చుని ఉన్నారు. వారిని చూడగానే ఏమైంది? అని అడిగాడు ఉదయ్. ఈ రోజు తేలిపోవాలి, ఈ ఇంట్లో నేను ఉండాలో? మీ నాన్న ఉండాలో? అంటూ కోపాన్ని ప్రదర్శించింది శ్రావణి.
అసలు ఏమైంది ‘శ్రావణి’
నిన్నటి లాగే ఈ రోజు కూడా మీ నాన్న ఇల్లంతా వాంతులు చేసుకొన్నారు. ఎప్పటిలాగే అన్నం తినేసిన కంచాలు అలాగే వదిలేశారు. మాసిపోయిన బట్టలతో ఇల్లంతా నింపేశారు.
నిజమో కాదో అని ఇంటి లోపల పరీక్షించాడు ఉదయ్. నిజమని తేలడంతో భార్యతో ‘ఏం చేద్దాం’ అన్నాడు.
‘చూడండి నేను ఆఫీస్ నుండి అలసిపోయి వస్తాను అలాంటప్పుడు ఇంటిని ఇలా చూస్తే చిరాకేస్తుంది’ అంది.
‘నాన్నకి మరోసారి చెబుతాను’ అన్నాడు ఉదయ్. అది వందోసారి చెప్పడం అవుతుంది తప్ప మీ నాన్నలో మార్పు రాదు’ అంది శ్రావణి.
‘నిజమే! అయితే ఒక పని చేద్దాం. ఆ పనితో నాన్న ఇంకా కన్పించడు. వృద్ధాశ్రమంలో వేసినా మనకి ఆనందం ఉండదు. అందుకే ఈ నిర్ణయం.’
‘నాకు నచ్చింది. మీకేం బాధ లేదు కదా!’
‘బాధేం లేదు. నాన్న నాకు చిన్నప్పటి నుండి చేసింది ఏమి లేదు. కనడం తప్ప’ అన్నాడు.
ఆదివారం నాడు పిక్నిక్ అని తండ్రిని, భార్యని, బాబుని కొండ ప్రాంతానికి తీసుకువెళ్లాడు ఉదయ్.
ఉదయ్ తండ్రి వీర్రాజు ఆ కొండ అందాలకు పరవశించిపోతున్నాడు. ఆ సందర్భంలోనే చెప్పాపెట్టకుండా వచ్చేస్తారు ఉదయ్, శ్రావణి వాళ్ల కొడుకు విశేష్. ఇంటికి వచ్చి ఆనందంగా గడుపుతారు. వీరు తర్వాత రోజు ఉదయ్‌కి ఫోన్ వస్తుంది తండ్రి వీర్రాజు నుండి.
‘బాబు నన్ను ఈ ప్రాంతంలో వదిలేసినందుకు నాకేం బాధ లేదు. నేను సంపాదించిన రెండు లక్షలు బ్యాంక్‌లో ఉండిపోయాయి. ఆ బ్యాంక్ పాస్‌బుక్ నా బ్యాగ్‌లో ఉంది. నేను చనిపోయాను అని చెప్పి ఆ డబ్బులు తీసుకోండి’ అంటూ ఫోన్ పెట్టేస్తాడు. విషయం మొత్తం శ్రావణితో చెప్పి ఇద్దరు కలిసి బ్యాగ్ మొత్తం వెతికారు కానీ బ్యాగ్‌లో బ్యాంక్ పాస్‌బుక్ ఎక్కడా కనబడలేదు.
‘రెండు లక్షలంటే మాటలా?.. మీ నాన్నగారు చేసిన నెంబర్‌కి మీరు ఫోన్ చేసి అడగండి’
ఉదయ్ వెంటనే ఆ నెంబర్‌కి ఫోన్ చేస్తాడు. ముందు ఎవ్వరో ఎత్తి తర్వాత వీర్రాజుకిస్తాడు.
‘నాన్న! బ్యాంక్ పాస్‌బుక్ ఎక్కడా కనబడలేదు’ అన్నాడు. సరిగ్గా చూడు బ్యాగ్‌లో గానీ, మంచం పరుపుకింద గానీ వుంటుంది’ అన్నాడు వీర్రాజు.
ఉదయ్, శ్రావణి మొత్తం రూంలో వెతికినా కనబడలేదు.
ఇలా కాదని ఉదయ్ తన తండ్రిని వెతుక్కుంటూ కొండ ప్రాంతానికి వెళ్తాడు.
వీర్రాజ్ గారికి ఆశ్రయమిచ్చిన ఆ ఇంటికి చేరుకొని సాయం చేసిన వారికి కృతజ్ఞత తెలిపి తన తండ్రిని తీసుకెళతాడు ఉదయ్. ఇంటికి రాగానే ఉదయ్ తన తండ్రితో ‘పాస్‌బుక్ ఎక్కడ వుంది’ అని అడుగుతాడు.
వీర్రాజ్ తన రూమ్ మొత్తం వెతుకుతాడు. ఉదయ్ గుర్తురావడం లేదు. రేపు రాత్రికల్లా వెతుకుతా అంతే ఆ తర్వాత రోజు నుండి వీర్రాజు గారు పూర్తిగా మారిపోతాడు. తన పనులు తాను చేసుకోవడం ఇల్లు శుభ్రంగా ఉంచడం. ఇంకా ఎన్నో మంచి పనులు ప్రతి రోజు చేయడంతో ఉదయ్‌కి, శ్రావణికి వీర్రాజు గారిని ఇంటి నుండి పంపివేద్దాం అనే ఆలోచన రాదు.
‘వీర్రాజ్‌కి బ్యాంక్ పాస్ బుక్ లేదు. ఎక్కడో ఒంటరిగా అనాధగా ఆ వయస్సులో బ్రతకడం కష్టం అని అబద్ధం ఆడాడు. ఆ అబద్ధం వారు నమ్మడంతో వీర్రాజ్ పునర్జన్మ ఎత్తాడు.
కొన్ని రోజుల తరువాత వీర్రాజు తన పనులతో విషయం మర్చిపోయేలా చేశాడు. ఉదయ్ నాన్నగారని ప్రేమగా మాట్లాడితే, శ్రావణి మావయ్యగారని గౌరవంగా చూసింది. మనవడు తాతయ్య అంటూ రోజు ఏదో ఆట ఆడటం మొదలుపెట్టాడు.

- నల్లపాటి సురేంద్ర
సెల్.నం.9490792553

పుస్తక సమీక్షఅంతరంగం

ధిక్కార స్వరం..
కలం యజ్ఞం

యువ కవి బోల యాదయ్య వెలువరించిన తన ‘కలం యజ్ఞం’ గ్రంథం నిండా ధిక్కార స్వరంతో అక్షరాలకు ప్రాణం పోశారు.. పాలమూరు కన్నీళ్లను తమ కలంలోకి ఒంపుకొని.. కవిత్వాన్ని పండించ యత్నించారు. ఆయన కవిత్వంలో పేద ప్రజల పక్షాన నిలవాలన్న ఆకాంక్ష కానవస్తుంది. అంతేగాక.. కష్టాన్ని గుండెలో కరిగించి.. కండలలో సెమటగా పాల పొంగులను కురిపించే.. బహుజన బాటసారుల వ్యథలను తమ కవిత్వం ద్వారా ప్రతిబింబింపజేశారు. మట్టికి మాటనేర్పి.. మనిషికి ఓర్పు నేర్పి, కాలానికి ఎదురెళ్లే కర్షక, కార్మికుల కష్టాలను కవి ఏకరువు పెట్టారు. సృష్టికర్త బ్రహ్మ కాదు.. అమ్మేనని తేల్చి చెప్పిన ఆయన.. మరణం వౌనంగా పలకరిస్తుంటే.. కొంగుచాటున పాల ధారను పసిపాపకు అందించే అమృతధార కరుణామూర్తి, త్యాగశీలి అమ్మ అని అభివర్ణించారు.
సామాజిక తెలంగాణ ఉద్యమకారులను ఎలుగెత్తి ప్రపంచానికి పరిచయం చేయాలని పిలుపునిచ్చే కవి యాదయ్య జనం కళ్లలో వెలుగులు నింపే దిశగా పాలకులు అడుగులేయాలని సూచించారు. పాలమూరు ప్రతి పల్లె బిడ్డ పౌరుషానికి ప్రతీక అని..జానపదాల పూదోట పాలమూరు గుండెపాట అని ఓ కవితలో పాలమూరు జిల్లా యొక్క స్వాభిమానాన్ని చాటారు.
కష్టాలు, కన్నీళ్లు, కాలాన్ని కౌగిలించుకున్నప్పుడు.. ఓదార్చే ఓర్పునై వస్తానని.. చెప్పడమే గాక.. జనహితమై.. జనకాంక్షకోసం.. నేనొక పాటనై వస్తానని కవి నినదించారు! కవి పుట్టిందే ప్రజలకోసమనీ..ప్రజల అభ్యున్నతి కోసమనీ..ప్రజా శ్రేయస్సే కవి యొక్క పరమావధి కావాలని కాంక్షించిన తీరు బాగుంది. సన్మానాలకో, సత్కారాలకో, మెమోంటోలకో, శాలువాలకో రాజీ పత్రాలకో..రంగు పత్రాలకో తలలు వంచే వాళ్లు కవులుగా మన గలలేరని..వారు కవులు అసలే కారని ఒక కవితలో తేల్చి చెప్పారు. పాలమూరు వలసలను ఇప్పటికైనా ఆపి..శ్రమ జీవుల తలరాతలు మార్చాలనీ..అందుకోసం..ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు. భూమికోసం.. భుక్తికోసం.. శ్రామిక పీడిత వర్గాల విముక్తికోసం.. సాయుధ పోరాటంలో అమరులై.. నిజాం పాలనకు చరమగీతం పాడి.. మన ప్రభుత్వ పాలనకు పట్టం గట్టిన.. తెలంగాణ విమోచనాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించి.. అమరులను స్మరిద్దామని మరో కవితలో పేర్కొన్నారు. ప్రేమంటే.. రెండు హృదయాల సంగమక్షేత్రమనీ.. అనురాగానికి ప్రతీకగా మలుచుకుని ప్రేమకు సార్థకత కలిగించాలని కాంక్షించారు. ఇలా.. ఈ గ్రంథంలో కవి బోల యాదయ్య తన భావాలను ప్రగతిశీలకంగా ప్రకటించడం ప్రశంసనీయం.. కవిత్వం శ్రమైక సౌందర్యాన్ని అందంగా, ఆర్ద్రంగా ఆవిష్కరింపబడాలని ఆకాంక్షించే ఆయన.. ఈ దిశగా మరింత ప్రయత్నం చేసి.. తమ కలం బలం పెంచుకుంటారని విశ్వసిద్దాం.

పేజీలు: 74 - వెల : 35/-
ప్రతులకు:
బోల యాదయ్య
1-87,4వ వార్డు
గ్రామం ధర్మాపూర్
జిల్లా మహబూబ్‌నగర్
సెల్.నం.9912206427

- సాన్వి, కరీంనగర్, సెల్.నం.9440525544

జీవితానుభవాలే
నా రచనా తరంగాలు
ఆచార్య కడారు వీరారెడ్డి
ఇంటి నెం.8-12-20,
బృందావన్ నగర్, రోడ్ నెం.8,
హబ్సిగూడ, హైదరాబాద్-500007
సెల్.నం.9392447007

ప్రముఖ కవి ఆచార్య కడారు వీరారెడ్డి

‘జీవిత అనుభవాల జల్లెడే.. నా రచనా తరంగాలకు ఆయువు!’ అని సవినయంగా ప్రకటించే ప్రముఖ కవి ఆచార్య కడారు వీరారెడ్డి వృత్తిరీత్యా కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉద్యోగ విరమణ చేశారు. అంతకు ముందు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్ర విభాగం నుండి అనేక ఉన్నత పదవులను అలంకరించారు. రసాయనశాస్త్ర విభాగం అధ్యక్షులుగా, డీన్‌గా, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అందరి మన్ననలు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, జైశెట్టి రమణయ్య ఫౌండేషన్ అవార్డు పొందారు. మూడు దశాబ్దాలకు పైగా బోధనతో పాటు రసాయన శాస్త్ర రంగంలో విశేష పరిశోధన చేసిన అనుభవం ఆయనకుంది.
రసాయన శాస్త్రంలో ఆరు గ్రంథాలను వెలువరించారు. ఇరవైఐదు పరిశోధనా పత్రాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమర్పించారు. ఆరుగురు పిహెచ్‌డి విద్యార్థులకు గైడ్‌గా వ్యవహరించిన ఆయన కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేస్తున్న సమయంలోనే తెలుగు సాహిత్యం పట్ల ఆకర్షితులై కవిగా తమ సృజనను ప్రారంభించారు. అనతి కాలంలోనే తెలుగు కవిత్వంలో ఆరు గ్రంథాలను వెలువరించారు. అందరి మన్ననలు పొందారు. వీరి గ్రంథాలు కొన్ని ఇతర భాషల్లోకి అనువదింపబడటం విశేషం. సాహితీరంగంలో నిత్యకృషీవలుడిగా పేరొందిన ఆచార్య కడారు గారు కవిత్వం రాయడం పురస్కారాలతో పరిణతి సాధించారు. అనేకమంది సాహితీకారులను స్వయంగా సత్కరించారు. ఆయనతో ‘మెరుపు’ ముచ్చటించింది. ముఖాముఖి వివరాలు ఆయన మాటల్లోనే..

ఆ రసాయన శాస్త్ర విషయ నిపుణులుగా ఖ్యాతిగాంచిన మీకు తెలుగులో రచనల పట్ల ఆసక్తి ఎలా కలిగింది?
కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయానికి నేను ఉపకులపతిగా వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఎన్నో సాహితీ కార్యక్రమాలకు వెళ్లడం... ఎందరో సాహితీ వేత్తలతో పరిచయం ఏర్పడడం.. ఆ క్రమంలోనే సాహితీ జిజ్ఞాస మేల్కొంది.

ఆ మీరు మొట్టమొదట రచించిన కవిత ఏది?
నా మొదటి కవిత ‘సచ్చిన్, సచ్చిన్!’..‘నేటి నిజం’ పత్రికలో ప్రచురించబడిన నా మొట్టమొదటి కవిత కూడా. సాహిత్యరంగంలో గుర్తింపు దిశలో నా తొలి అడుగు!

ఆ రచనా వ్యాసంగంవైపు రావడానికి మీకు ప్రేరణనిచ్చిందెవరు?
ముఖ్యంగా ఇద్దరు మిత్రులు, డాక్టర్ గండ్ర లక్ష్మణ్ రావు గారు, దాస్యం సేనాధిపతి గారు. ముక్కుసూటిగా కవిత్వం రాసే తత్వం వున్న నన్ను వీలైనంత ‘చాటు’గా భావాన్ని ప్రకటించమని సలహాలిచ్చి ఈ రంగంలో ఎదగడానికి తగిన ప్రోత్సాహమిస్తున్న కవి మిత్రులు వీరే. నేను సృజించిన మొట్టమొదటి కవిత నుండి నేటి వరకు నేను రాసిన ఎన్నో కవితలు ప్రచురించి ప్రోత్సహించిన ‘నేటి నిజం’ పత్రిక సంపాదకులు, మిత్రులు బైస దేవదాసు గారు.

ఆ‘్భస్వరాలు’ కవితా సంపుటిని వెలువరించిన మీరు అనతికాలంలోనే కవిగా అందరి మన్ననలు పొందడం వెనక మీ కృషి ఏమిటి?
సృజనా ప్రక్రియపై మక్కువ, దానికి తోడు నిరంతర కృషి. నాలో మెదిలే భావతరంగాలను ఒడిసి పట్టుకోవడం, ఆలోచనలకు పదును పెట్టడం. విస్తారంగా సాహితీ మిత్రులతో సమాలోచనలు.. ఎన్నో విషయాలపై నిత్య మథనం!

ఆ మీ ముద్రిత గ్రంథాలు?
ఇప్పటివరకు ఆరు గ్రంథాలు.. నాలుగు కవితా సంపుటాలు. ‘్భస్వరాలు’, ‘కాలం అడుగులు’, ‘అక్షరాప్సరసలు’, ‘తరంగాల అంతరంగాలు’, రెండు దీర్ఘ కావ్యాలు. అందమా.. నిను వర్ణింప తరమా!’, ‘నిత్య యవ్వని’. త్వరలో మరో రెండు గ్రంథాలు ఆవిష్కరణకు సిద్ధంగా వున్నాయి.

ఆ మీ గ్రంథాలు ఏవైనా ఇతర భాషల్లోకి అనువదింపబడ్డాయా?
రెండు కవితా సంపుటాలు..‘్భస్వరాలు’, ‘కాలం అడుగులు’. హిందీలోకి ‘్భస్వర్’ మరియు ‘కాల్ కే కదం’గా అనువదింపబడ్డాయి.

ఆ మీ దృష్టిలో కవిత్వం అంటే ఏమిటి?
విషయ సారాంశాన్నంతా పదబద్ధంగా సూక్ష్మీకరించడమే కవిత్వం! ఓ అద్భుత సృజనప్రక్రియ! అందరికీ అందుబాటులో వున్నవి అవే అక్షరాలు అయినా.. వాటితో అందమైన పంక్తులు సృజించడం కొందరినే వరించే కళ!

ఆ మంచి కవిత్వానికి ఉండాల్సిన లక్షణాలు?
మాగిన పండు వెలువరించే కమ్మని ఘుమఘుమలా కవితలో పొదగాల్సిన సహజ పదఝరి కవిత.. కృత్రిమ ప్రసవంలా కాదు.. సకలం సమకూర్చి వడ్డించాల్సిన సంపూర్ణ భోజనం! సహజ సృజనకు శిఖరాయమానం! అభివ్యక్తిలో వైవిధ్యం, భిన్నత్వంలో నూతనత్వం ప్రతి కవితకుండాల్సిన సహజ లక్షణం!

ఆ మీకు నచ్చిన గ్రంథం? కవి ఎవరు?
జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, మహాకవి డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి ‘విశ్వంభర’, నాకు నచ్చిన కవి డాక్టర్ సి.నారాయణ రెడ్డి.

ఆ ఇప్పుడొస్తున్న వచన కవిత్వంపై మీ అభిప్రాయం?
ముఖానికి రంగు పులిమినంత మాత్రాన నటులు కాలేరు. ప్రేక్షక హృదయాల వేదిక కావాలి. భక్తులు లేని గుడి సందడి లేని రాళ్ల గుహ.. ఆరాధన లేని దేవుడి విగ్రహం ఓ రాతి శిల్పానికి సరిసమానం! ఎవరూ చదవని కవిత రాలిన పుష్పంతో సమానం! అన్ని పూలు అందమైనవే.. అయినా అన్నీ ఒకేలా వుండవు. పువ్వును బోలిన ఆకు ఉండొచ్చు. అయినంత మాత్రాన అది పువ్వు కాలేదు. అలాగే కవితలు కూడా. ఏ రంగంలోనైనా ‘తాలు’ సహజమే.. తూర్పారబట్టాల్సింది పాఠకులే!

ఆ మీ ‘అందమా.. నిను వర్ణింప తరమా!’ దీర్ఘ కావ్యంలో అందాన్ని వివిధ కోణాల్లో ఆవిష్కరించడానికి మీరు చేసిన కృషి వివరిస్తారా?
ఈ కావ్యం అందం ప్రకృతి సొంతం. ప్రకృతి నా ఆదర్శం. సమస్త జీవులు, నిర్జీవులు ప్రకృతిలో అంతర్భాగమే! అందం. వీటన్నింటిలో నెలవైన గోచరాగోచర ప్రతిబింబమే అని నా నమ్మకం. ఆయా ప్రతిబింబాల వెతుకులాటలో నేను సృజించప్రయత్నించిన ఊహాకల్పనే ఈ గ్రంథంలో పొందుపరిచిన కవిత్వం! నేను వీక్షించినది కొంత, ఊహించినది మరికొంత. వెలువరించింది పిసరంత! అందం..ఎప్పటికైనా ఏ వర్ణనకు పూర్తిగా అందనిదేనేమో!

ఆ మీరు కథలు కూడా రాశారు కదా..కథ, కవిత్వం..రాయడంలో ఏది సులభం? ఈ రెండింటిలో మీరు ఏ ప్రక్రియ ఇష్టపడతారు?
దేనికదే ప్రత్యేకం. రెండు ప్రక్రియలు సృజనతో కూడుకొన్నవే. జీవితానుభవంతో ముడివేయబడినా, నెమరు వేసే తీరు మారొచ్చు. గమనంలో కూడా ఎంతో తేడా. సృజనలో కొత్తదనం లేకుంటే కవితైనా, కథ అయినా పాఠకులను మెప్పించలేదు. రెండూ కష్టంతో కూడుకున్నవే. కష్టమైనవే నాకు ఇష్టమైనవి!
ఆ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా, వివిధ స్థానాల్లో పరిపాలకునిగా, వి.సి.గావున్న మీ అనుభవం మీ రచనల్లో ప్రతిబింబిస్తుందంటారా?
తప్పకుండా ప్రతిబింబిస్తుంటాను. నా అనుభవాల జల్లెడే నా రచనా తరంగాలకు ఆయువు!

ఆ రసాయన శాస్త్రంలో మీరు వెలువరించిన గ్రంథాల వివరాలు చెబుతారా?
ఇప్పటివరకు ఆరు గ్రంథాలు వెలువడినాయి. త్వరలో మరొకటి రాబోతుంది. ఇందులో రెండు గ్రంథాలు మన దేశంలోని దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల కళాశాలలో ‘రెఫరెన్స్’గా వున్నాయి. అందులో ఒక గ్రంథం ‘సిమ్మెట్రీ అండ్ స్పెక్ట్రాస్కోపి ఆఫ్ మాలిక్యూల్స్’ మాత్రం గత ఆరు సంవత్సరాలుగా అంతర్జాతీయంగా ప్రచురింపబడి ప్రపంచవ్యాప్తంగా పలుకుబడి పొందింది.

ఆ అవినీతిపై మీరు ఇటీవల వెలువరించిన దీర్ఘ కావ్యానికి ‘నిత్య యవ్వని’ అని పేరు పెట్టడంలో ఉద్దేశం ఏమిటి?
ఎలాంటి మనిషినైనా ఓ ప్రత్యేక ఆకర్షణతో లొంగదీసుకునే ఏకైక శక్తిశాలి. అవినీతి మహమ్మారి.. అది నిత్యనూతన సుందరి. అందుకే.. అవినీతి ఓ ప్రత్యేక అవతారమెత్తిన ‘నిత్య యవ్వని’.. అందుకే కావ్యానికి ఈ పేరు!

ఆ సాహితీ పురస్కారాలపై మీ అభిప్రాయం?
ఎంపిక ఇజాలకు తావివ్వకుండా పారదర్శకంగా ఉంటే మంచిదే!

ఆ కొత్త కవులు, రచయితలకు మీరిచ్చే సలహాలు, సూచనలు?
కొత్తగా వచ్చే కవులు గొప్ప ఆలోచనాపరులుగా ఎదగాలి. అలా అని.. గొప్ప ఆలోచనలుంటేనే గొప్ప కవులు కాలేరు! ఆలోచనలకు అనుభవాల రంగరింపే మంచి సృజనకు ఆవిర్భావం! పుట్టగానే అందరూ ఏడుస్తారు. కానీ పెరుగుతూ కొందరు దానిని సరైన కృషితో పాటుగా మలుచుకుంటారు. దాదాపు ఇదే మాదిరి కృషి కొత్త వారి నుంచి రావాలి. గొప్ప కవులను ఆదర్శంగా తీసుకొని అనుసరించాలి - అనుకరించరాదు.

ఇంటర్వ్యూ:
దాస్యం సేనాధిపతి,
సెల్.నం.9440525544

మనోగీతికలు

పతంగి..

రంగు రంగుల పతంగి
నింగిన చెంగు చెంగున ఎగురుతున్నది!
అంబర వీధుల సందడి చేస్తూ
నింగి ముంగిలి నుండి తొంగి చూస్తూ
మబ్బు చింగుల చిందులేస్తూ
విహంగమై కనువిందు చేస్తున్నది!
పైరగాలులు బూర నూదగ..
తోకపైన నిలిచి ఆడుతూ
పడగవిప్పిన పాములా..
బుసలు కొట్టినట్లనిపిస్తున్నది!
వెండి మబ్బుల ఊయలలూగుతూ
విను వీధి వేదికనెక్కి..
వెలుగు రేఖల వనె్నల సంకెళ్లలో..
బందీ అయి
చుక్కలతో పోటీ పడుతున్నది!
సుడిగాలులను
అక్కున చేర్చుకుంటూ..ఏం చక్కా
చుక్కల చెక్కిలిని ముద్దాడుతున్నది!
దార మాధారంగా..
ధరణి నుండి నింగికెగసి
తారల నడుమ తానొక తారయి..
తళుకు బెళుకులు తోరణమవుతున్నది!

- డాక్టర్ తిరునగరి గిరిజా గాయత్రి
బాన్సువాడ, కామారెడ్డి జిల్లా
సెల్.నం.9440338370

మార్పు

ఎండాకాలంలో
ఎతమేసి తోడినట్లు
ఎందనిండా దుఃఖం..
పంచుల మీద పంచులు యిచ్చే ప్రభుత్వాలు
హంసతూలికలపై
శయనించే నాయకులు
ప్రజలది మాత్రం పస్తులతో
బ్రతుకు ప్రయాణం
వాళ్లమోముల్లో చిరునవ్వులకు చోటెక్కడది?
మసకబారుతున్నాయి
మానవ సంబంధాలు..
మచ్చుకైనా కానరావు
మమతానురాగాలు!
నాగరికాన్ని వదిలి
నగరీకరణ మోజులో
బ్రతికే బ్రతుకులు..
చివరకు..
సంబంధ బాంధవ్యాలను వదిలి
చట్టుబండలను కౌగిలికెత్తుకుంటున్న
వీరిలో మార్పును
ఎప్పుడు చూస్తామో మరి!

- గంప ఉమాపతి
కరీంనగర్
సెల్.నం.9849467551

దిగులు!
ఎటు పోతున్నామనేది పెద్ద దిగులు
తూర్పుకా పడమరకా
ముందుకా.. వెనుకకా..
జీవన పోరాటంలో..
గెలుస్తున్నామా ఓడుతున్నామా
పెద్ద దిగులు
ప్రజాస్వామ్యం పదరేఖల మీద
విషాదం స్కెచ్ గీయటం పెద్ద బాధ
తప్పదుగా!
బురదను మంచినీరని చెప్పలేముగా!
మత్తుగా త్రాగమని
చిత్తుగా ఓడిపొమ్మని
మద్యం ఉత్పత్తి పెంచి ధరలు పెంచేసారు
చావు మనది..
శోభనం వారిది..
విషాదం మనకు
ఆనందం వారికి
దుఃఖం మనకు.. నవ్వు వాళ్లకు!
ఇది జాతి కవిత.. ఓ దుఃఖ చిత్రం
కన్నీటి వరదలో కొట్టుకుపోతున్న
నా జాతిగీతం ఇది!
ధరలు పెంచుతారు
రూపాయి విలువ పడిపోతుంది!
రైతు ఆత్మహత్య కనిపిస్తుంది!
ఉగ్రవాదం బాంబు విసురుతుంది!
అవినీతి ఊడలమర్రి మీద
లీడర్లు వూగుతున్న దృశ్యం కనిపిస్తుంది!
ఎటుపోతున్నామనేది ఓ దిగులు!!

- సిహెచ్.మధు, నిజామాబాద్

మా విన్నపం
మేమంతా ఆత్మీయతా భిక్షకులం..?
మనసుజోలెను తెరిచి పిడికెడు ప్రేమను
ఆర్థించడానికి సిద్ధపడుతున్నాం
జాలి కరుణాదయాభిక్షల కోసం కాదు
ప్రేమానురాగాల ఆత్మీయతల కోసం
ఎలా ఉన్నారని ఎవరైనా అడిగితే చాలు
ఎనే్నండ్లో వెనక్కెళ్లి బాగున్నామంటాం
ఇప్పుడెలా ఉన్నామనేది ఈ క్షణం మరిచిపోతాం
ఈ హృదయభవంతుల ప్రేమ పునాదులు పదిలమే
కాని, వయసు తుఫానులో శరీరమే శిథిలమైంది.
నిబ్బరం చెదరని గుండె ఎంత ఓదార్చుతున్నా
నిర్భయంగా శరీరం నిలబడలేక పోతుంది
ఇప్పుడు ఎగిరి గంతేయాలని కాదు ఆరాటం
మా కడుపున పుట్టిన మీ ఆప్యాయతలో
కనులు మూసి నిదురపోవాలనే తపన
కనిపించి లాలించినందుకు ప్రతిఫలంగా
సేవించి రక్షించమని అడగడం ధర్మం కాదెమోగాని
ప్రేమించి చేరదీయడం మీ ధర్మమని మా విన్నపం

- కొత్త అనీల్ కుమార్
కరీంనగర్, సెల్.నం.9395553393

మన మాట
కష్టమైన ఏ లక్ష్యమైన
ఇష్టపడి సాధన చేస్తే
నిజమైన విజయం నీవెంటే!
అలాగే అందరితో దోస్తానం
మనసంతా ప్రశాంతం
నేడు ఆంగ్లం తెలిసినోడు
తెలివిమంతుడు!
రేపు తెలుగు తెలిసినోడే
అసలు తెలివిమంతుడు!!
ఆంగ్లం నేడు నీకు అన్నం పెట్టిన
రేపు తెలుగు నలుగురికి
పెట్టిస్తుంది!
అమ్మలాంటి తెలుగును
అసలే మరచిపోకు!!
ఏ భాషైనా నేర్చుకో
ఎవరుకాదంటారు!
ఓ తెలివిమంతుడా!!
తెలుగును మాత్రం విడనాడకు!

- పెరుక రాజు
నీలగిరి, తమిళనాడు
సెల్.నం.09443091384

ఏది జవాబు?
వానాకాలం రోజు షవర్ బాత్‌లే
ఎండాకాలం ఎర్రని ఎండల ములాఖత్‌లే
నిరుపేద పూరి గుడిసెలో
ఏసి అంటే ఆ గుడిసెకు చలికాలమే
ఆ పేద గొండొక నిద్రాణ అగ్ని పర్వతమే
సమస్యలు, బాధల సాంద్రతకు
గుండల్లో ఆర్ద్రతకు తాను చిరునామా
ఆయనొక కవిత
ఆయనే ఒక కావ్యం
ఆయనొక నిత్య కర్మశాలి
ఆయనొక నిత్య ధీశాలి
బతుకు సంఘర్షణల జవాను
వెతుకు అతని ప్రశ్నలకు జవాబు?

- నల్లగొండ రమేష్
ఆసిఫాబాద్
సెల్.నం.9441711832

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

నిర్వహణ : దాస్యం సేనాధిపతి merupuknr@andhrabhoomi.net

మెరుఫు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. dasyamsenadhipathi10@gmail.com

email : merupuknr@andhrabhoomi.net

- నల్లపాటి సురేంద్ర సెల్.నం.9490792553