విశాఖపట్నం

బేతాళ నగదు మార్పిడి (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంతంతో విక్రమార్కుడు చెట్టు వద్దకు పోయి శవాన్ని దించి వౌనంగా నోర్మూసుకుని శ్మశానం వైపు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు ‘‘రాజా! నువ్వు పడుతున్న శ్రమను తగ్గించుటకు ఒక జరిగిన కథ చెముతాను విను’’ అని బలవంతంగా చెప్పసాగాడు.
‘‘ఒకప్పుడు భారతావనిని ఒక నిజాయితీగల ఒక మొండి రాజు పాలించేవాడు. అతడు బాల్యం నుంచి వినే (చదివింది కాదు) ఆర్థిక శాస్త్రాన్ని ప్రజల మీద ప్రయోగించాడు. ఒక్క దెబ్బతో వారి రోజువారి సామాన్య దైనందిన కార్యక్రమాలన్నీ స్తంభించి వారి దగ్గర ఉన్న సొమ్మునంతా తీసుకుని రాజుగారి కోశాగారం వద్ద బారులు తీరి తమ వద్దనున్న పాత నగదుతో కొత్తనగదు తీసుకొనే పనిలో పడిపోయారు.
ఒక పక్షం పైన అన్ని పనులు ఆగిపోయాయి. అభివృద్ధి పూజ్యమైంది. శత్రురాజులందరూ దండయాత్ర శంఖము ఊదుటకు, ఉపక్రమించుటకు సన్నద్ధులు కానున్నారు. అనవసర ఏకాగ్రతతో రాజు ఇదంతా విస్మరించి పెరుగుతున్న ప్రజాసంద్రాన్ని చూచి అచ్చెరువెంది ప్రజల ఓపికను చూసి మిక్కిలి ఆనందించి శత్రువుల ఆగమనాన్ని బయటపెట్టిన పాలక సిబ్బందిని పరుషపదములు వాడి బంధించుటకు మస్తిష్కమున ఉపక్రమించెను. రాజ్యమందలి మికిలి శ్రేష్ఠుడైన విశ్రాంత మంత్రి వారించెను. పిదపరాజు ఒకింత మంకుతనాన్ని కొంత శమింప చేసుకొని రాజ్యాన్ని రక్షక దళములకు అప్పగించి, అర్థశాస్త్ర నైపుణ్యమును స్వయంగా సంపాదించదలచి మారు వేషములో తనవలే (మొండితనంతో) అలోచించే వెనిజులా రాజ్యము ఏతెంచెను.
ఆ రాజ్యమందు కూడా ఇట్టి నగదు మార్పిడి వ్యవహారంతో ప్రజలు అష్టకష్టములు పడుచుంటిరి.
ఒక వేదికనందు అక్రమ వ్యాపారులు ముచ్చటించుకొంటుండగా రాజుగారు ఆగి వారు ఎవ్వరికి దొరకకుండా వారి సిబ్బంది, పేద ప్రజల ద్వారా తమ వద్దనున్న నగదు రూపములో వున్న అక్రమార్జనను అతి సులువుగా మార్చుకొన్న విధానం విని అవాక్కు అయ్యారు. పైగా అచ్చటి రాజుగారి తెలివిహీన ఆర్థిక విధానాన్ని గేలి చేయటాన్ని మనసులోనే సహించి, తక్కిన అక్రమార్జన (సింహ భాగం) కొంత బంగారమందు, ఎక్కువ భూములందును దాచిన విధము తెలుసుకొని నాలుక కరుచుకొని మరొక వేదిక చేరుకున్నాడు.
అచ్చట రాజుగారి విధేయులు పెద్ద భూవిక్రదారులపై రాళ్లు విసురుతుండ ఒక ప్రతిపక్ష పాత తరం కథానాయకుడు ప్రజలను వారించి సక్రమంగా సుంకములు చెల్లించిన వారే మొదటి రాయిని విసరాలి అనినంత ఒక్కరాయి కూడా భూవిక్రయదారులపై పడలేదు.
తదుపరి కొత్తనగదుకై బారులు తీరిన ప్రజల వద్దకు పోయెను. అక్కడ ఒక ముదసలి మనవడికి చెప్పిన కథవిని రాజు స్వదేశమునకు పయనమై, సరళమైన భూసుంకములు విధించి ప్రజల మన్నన పొందెను’’.
అప్పడు బేతాళుడు విక్రమార్కుడిని ఆ కథ ఏమిటో ఊహించి చెప్పమన్నాడు. అంతేకాక ‘‘వౌనముగా ఉన్నయెడల నీ తల వెయ్యి ముక్కలు అవుతుంది’8 అని బెదిరించాడు.
ఇక చెప్పక తప్పదని విక్రమార్కుడు తన బామ్మ చెప్పిన పాత తరం పిల్లందరికి తెలిసిన కథ చెప్పసాగెను.
‘‘ఒకసారి ఒక గ్రద్ద పాముని ఆహారముగా పట్టుకొని ఆకాశమందు ఎగురుచుండ, ఆ పామునందలి విషము చిమ్మి అప్పడే గాలికి మూత ఎగిరిపడిపోయిన పెరుగు కుండలో పడెను. ఆ పెరుగు తిని ఒక మనిషి మరణించెను. తప్పెవరిదని మనవడు ప్రశ్నించ, తప్పించిన వారిదే తప్పెంచినవారిదే తప్పని, కథలోని పాత్రలన్నీ గ్రద్ద, పాము, గాలి, పెరుగు అమ్మిన మనిషి ఎవరి పనిని వారు చేసిరి. అటులనే ప్రజల తప్పులని ఎంచి ప్రజలని క్షోభ పెట్టిన రాజుదే తప్పని అవ్వ సమాధానం విని రాజు పన్ను విధానాన్ని సరళీకరించి ప్రజల మనస్సును మళ్లీ చూరగున్నాడని చెప్పినంతనే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు.

- పివిఎస్ ప్రసాద్.
సెల్ : 9949244504.

కథ

స్నేహమే గెలిచింది!

చెన్నై మెయిల్ దిగి ఆదరాబాదర ఇంటికొచ్చా. నా మనసు నిండా అలజడి. ఇంట్లో అడుగు పెట్టగానే నాలో ఆందోళన ఆవిరైపోయింది. మనసంతా ఒకేసారి చల్లబడింది. మా అమ్మ మొహంలో చిరునవ్వు నా గుండెకు ధైర్యాన్నిచ్చింది. ‘‘అమ్మా’’ అంటూ తనను హత్తుకున్నాను.
నెల రోజుల క్రితం నా ఆఫీసు పని నిమిత్తం చెన్నై వెళ్లాను. అపార్ట్‌మెంట్ కదా భయపడాల్సిందేముంది? అమ్మని ఒకతినే ఇంట్లో ఉంచి వెళ్లా. ఈ మధ్యలో అనారోగ్యం చేసింది అమ్మకు. ట్రైనింగ్ పీరియడ్ అయ్యేంత వరకు తెలియనివ్వలేదు. నిన్ననే ఫోన్ చేసి చెప్పింది. హాస్పిటల్‌లో నాలుగు రోజులుంది పాపం.
‘‘ఎందుకిలా చేశావమ్మా? నేను ఫోన్ చేసినప్పుడల్లా రమణీ ఆంటీతో మాటాడిస్తూ బాగానే కవర్ చేశావ్. మన పక్కిటి వాళ్లుండబట్టి సరిపోయింది. లేకపోతే ఏమిటి నీ పరిస్థితి?’’ అన్నాను.
‘‘లేదురా నేనీ రోజు ఇలా చక్కగా ఉన్నానంటే దానికి కారణం శ్రీనివాస్. నేను వాడి మేలు మరిచిపోలేను. మార్కెట్‌లో స్పృహ తప్పి పడిపోయిన నన్ను హిస్పిటల్‌కి తీసుకెళ్లి జాగ్రత్తగా కనిపెట్టుకుని రక్తదానం కూడా చేశాడు. వాడు నాకు రెండవ కొడుకురా’’ అంటూ కన్నీరు కార్చింది.
ఆ మాటకు నా తలలో సుడిగాలులు చక్కర్లు కొట్టాయి. హృదయం బరువైన అలల తాకిడికి గురయింది. మనసులో పశ్చాత్తాప సుడులు గిర్రున తిరిగాయి.
శ్రీనివాస్ నేను ఒకటవ తరగతి నుండి ఇంజనీరింగ్ వరకు ఒకే తరగతిలో పక్కపక్కనే కూర్చుని చదువుకున్నాం. మా ఇద్దరిలో ఎటువంటి తేడాలు ఉండేవి కావు. వాడుండే చోటల్లా నేనుండాల్సిందే. నేను వెళ్లే చోటికల్లా వాడు రావలసిందే. మా ఆలోచనలు బాగా దగ్గర. మా మార్కులు కూడా దగ్గర దగ్గరే. మా ఎంసెట్ ర్యాంకులు కూడా దగ్గర దగ్గరగానే వచ్చాయి. ఇంజనీరింగ్ ఒకే కాలేజీ, ఒకే గ్రూపులో చేరాము. పక్కపక్కనే కూర్చుని పాఠాలు వినేవాళ్లం. ఫైనలియర్‌లో ఒక అనవసరపు తగాదాలో నెత్తి మీదకి కలహాల కుంపటిని తెచ్చుకున్నాను.
ఈ విషయంలో శ్రీనివాస్ నాకు సలహా ఇచ్చి మందలించినందుకు నేను నోరు జారాను. తనపై చేయి కూడా చేసుకున్నాను. ఆరోజు నుండి అహం అనే గీత మా మధ్య దూరాన్ని పెంచింది. వాడు నన్ను కలవాలనుకున్న ప్రతిసారీ ఎవరో8 ఒకరు నన్ను రెచ్చగొట్టేవారు. నా మూర్ఖత్వం నా కళ్లకు దట్టమైన తెరను కప్పేసింది.
ఇంజనీరింగ్ అవగానే నాకు ఎన్ ఎస్‌టి ఎల్‌లో ఉద్యోగం వచ్చింది. వాడు బ్యాంకులో పి ఒగా సెలెక్ట్ అయి ద్వారకానగర్ స్టేట్‌బ్యాంకులో జాయిన్ అయ్యాడు. మేమిద్దరం ఒకరికొకరు ఎదురైనపుడు వాడి పలకరింపులో స్వచ్ఛత కనబడుతుంది. నా మొహంలో నవ్వు క్లిప్ తగిలించినట్లు ఉంటుంది. వాళ్ల కుటుంబ సభ్యులకు గానీ, మా అమ్మకు గానీ మా ఇద్దరి మధ్య అఘాయిత్యం గురించి తెలియదు. రెండేళ్లయింది మా మధ్య వ్యత్యాస బీజం నాటుకుని. నా వళ్లంతా కంపరంగా ఉంది. నా ప్రాణస్నేహితుడిని పిచ్చితనంతో అర్ధం లేని అహంతో బాధించాను. వెంటనే బైక్ తీసి శ్రీనివాస్ ఇంటికి వెళ్లాను. ఆరోజు ఆదివారం. ఇంట్లో అమ్మా, నాన్న, చెల్లీ అందరూ ఉన్నారు.
ఇంట్లో అడుగు పెట్టగానే ‘‘ ఏరోయ్ చాలా రోజులకు వచ్చావు. పెద్దవాడివి అయిపోయావురా’’ అంటుండగానే శ్రీనివాస్ దగ్గరకు వెళ్లి కాళ్లపై బోరున ఏడ్చాను.
‘‘ ఏమైందిరా?’’ అంటూ ఇంట్లో ఒకరి తర్వాత ఒకు గాబరా అవుతూ అడిగారు. నాతో పాటు వాడూ ఏడవడం మొదలుపెట్టాడు.
మా ఇద్దరి గోలకి ఇరుగు పొరుగు వచ్చి చూస్తున్నారు. శ్రీనుగాడు ఉన్నట్టుండి నవ్వడం మొదలెట్టాడు. నాలో ఏడుపు వెర్రినవ్వుగా మారింది. ఇది చూస్తున్న వాళ్లంతా ‘పిచ్చివెధవల్లా ఉన్నారే’ అనుకుంటూ వెనుదిరిగారు. అంకుల్, ఆంటీలకు విషయం తెలిసి నా తల నిమిరి హత్తుకున్నారు. నాలో కొండంత బరువు దిగినట్లయింది.
‘‘హమ్మయ్యా! నా అహం బద్ధలయి స్నేహం బతికింది. అది ధైర్యాన్ని కొండంత పెంచి అవివేకాన్ని పిండి చేసింది. స్నేహమే గెలిచింది. గెలిపించింది.

- చావలి శేషాద్రి సోమయాజులు,
పాచిపెంట,
విజయనగరం జిల్లా.
సెల్ : 9032496575.

పుస్తక సమీక్ష

సన్మార్గం వైపు నడిపే ‘ప.వి.కృతములు’

చరిత్రాత్మకమైన బొబ్బిలి గడ్డకు చెందిన దివంగత పంతుల విశ్వనాథరావు ప.వి.గా, కవిగా, విశే్లషకునిగా, బొబ్బిలి కళాభారతి కన్వీనర్‌గా సాహితీమిత్రులకు సుపరిచితుడే. ఈయన ఉపాధ్యాయ పురస్కారం గ్రహీత, విశాఖ వాసి పంతుల సీతాపతిరావుకు సోదరుడు. విశ్వనాథరావు కలం నుంచి జాలువారిన రచనలు ఆనాటి వివిధ పత్రికల్లో వెలువడి బహుమతులను పొందాయి. అయితే, సమాజశ్రేయస్సు దృష్ట్యా ఈ రచనలన్నింటినీ ఒక సంపుటిగా పంతుల సీతాపతిరావు తీసుకురావడం ప్రశంసనీయం. మొత్తం 34 పేజీల్లో ఉన్న వివిధ పద్యాలు ‘నేటి వ్యక్తి’ని సన్మార్గంవైపు నడిపిస్తాయి. విశ్వనాథరావు మొదటిపేజీనే ‘దైవస్తుతి-ప్రార్థన’తో ప్రారంభించడం భగవంతునిపై ఆయనకు ఉన్న భక్తిని వెల్లడిస్తుంది. పరుల పట్ల దయచూపితే నిన్ను దైవం కూడా కష్టాల్లో ఆదుకుంటుందని తన ‘కర్తవ్యం’లో చెప్పారు రచయిత. అలాగే, చులకనగా చూదొద్దని, విద్యకు విలువ పెంచమని, తెలిసినదంతా బోధించి, అందరి చేత మంచిమాటలు పలికించుము అని కోరారు. పచ్చని భూమలు, పాడి పంటలు వెలకట్టలేని సంపదలని, అప్పటి పల్లె వాసి తనకు నచ్చిన వృత్తిని చేపట్టి, నిస్వార్థునిగా పేరుతెచ్చుకున్నాడని విశ్వనాథరావు ‘పల్లెటూరు’లో వర్ణించారు. కట్నాలు, కానుకలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసి, బాధపడడం కంటే, ఆ కార్యం లేకుండానే వివాహాలు చేస్తే ఇరువైపులా సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని ‘పెండ్లిసందడి’లో లోకానికి చాటారు. మంచిదారిని మరిచిపోతే నట్టింట వచ్చి, నర్తించి లక్ష్మీదేవి వెళ్ళిపోయి, చివరకు ఉన్నదంతా ఊడ్చిపెడుతుందని ‘అవినీతి’లో బోధించారు. సంపుటి చదివాక విశ్వనాథరావు పద్యరచనలో మంచిపట్టుగలవారని అవగతమవుతుంది.
- గున్న కృష్ణమూర్తి

ప్రతులకు
పిబిఎస్ శర్మ, 13-108/ఎ,
పాత పోస్ట్ఫాసు వీధి,
బొబ్బిలి, విజయనగరం జిల్లా,
సెల్: 949058622
మూల్యం: అమూల్యం.

కవి పరిచయం

వజ్రసంకల్ప ఉద్యమ సాహితీస్రష్ట డాక్టర్ ఆవంత్స

కవితా పితామహుడు, కళాకేళి వ్యవస్థాపకులు, 93 ఏళ్ల జన్మదినోత్సవానికి చేరువలోనున్న డాక్టర్ ఆవంత్స సోమసుందర్ అస్తమించడమంటే కవితాలోకం 12 ఆగస్టున ఒక వజ్రాయుధాన్ని కోల్పోయినట్లుగా దు:ఖసాగరంలో మునిగిపోయింది.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో కుంతీమాధవస్వామి ఆలయం వీధిలో కవులతో నిత్యం కళకళలాడుతుండే ఆ ప్రాంతం వెలవెలబోయింది.
అలుపెరుగని సాహిత్య పఠనంతో వేలకు వేలు గ్రంథాలు అధ్యయనంలో నిత్యనూతనంగా ఆఖరి నిమిషం వరకు కావ్య రచనలో నిమగ్నుడై కవిత్వాన్ని ఆస్వాదిస్తూ, సాహిత్యాన్ని పండించిన కవి, కథకుడు, వ్యాసకర్త, అనువాదకులు, ఆంగ్ల కవుల్ని ఔపోసన పట్టిన అగ్రజులు, ఎవరికీ తలవంచని, తీసిపోని వాక్చాతుర్యులు, సమయస్ఫూర్తి ప్రదాత, మేధో సంపన్నుడు ఆవంత్స సోమసుందర్.
18 నవంబర్ 1924లో జన్మించిన కవి ప్రతి నవంబర్ 18న కవితామిత్రులకు పురస్కారాలు అందిస్తూ, మరెన్నో కావ్యాలను ఆవిష్కరిస్తూ చెక్కు చెదరని ఠీవి, దర్పంతో అందరినీ పరామర్శిస్తూ అతిథుల్ని ఆదరిస్తూ, ఆతిథ్యాన్నిచ్చి సాగనంపే సోమసుందర్ వ్యక్తిత్వం ఆ ఒక్కరికే చెల్లింది. వారి జీవితానికి వజ్రాయుధం ఒక మైలరాయి. ‘తన చరిత్ర తనే పఠించి ధరణి ఫక్కున నవ్వింది. తన గాథను తనే స్మరించి ధరణి భోరున ఏడ్చింది’ అంటూ ప్రస్తావించారు. అపహాస్యం చేస్తున్నట్లే తన కవిత్వంలో ఆనాటి పరిస్థితుల్ని అద్దంలో చూపించే చతురులు. సోమసుందర్ ఎప్పుడూ తన మనసులోని మాటను సూటిగా చెబుతారు. ‘నా జాతి సోదర ప్రజలకు నేను బోధించవలసి ఉన్నదనే అంత:ప్రేరణే లేకపోతే కవిత్వం రాయడం మానేసి ఉండేవాడిని. కవిత్వం పేరుతో శుష్క రాజకీయ ఉపన్యాసాలిమ్మంటే మాత్రం నేను సిద్ధంగా లేను’ అని నిర్భయంగా చెబుతూ అదే మాటపై చివరి వరకు తన సాహిత్యాన్ని కొనసాగించిన అగ్రజులు. అభ్యుదయ ఉద్యమ సాహిత్యానికి ఒక దివిటీలా వెలుగుతూ ముందు తరాలకు మార్గదర్శకులయ్యారు. స్వీయ చరిత్రల ఔన్నత్యాన్ని చాటి చెప్పిన గ్రంథకర్త. నేటి యువతరాన్ని ప్రోత్సహించడంలో ఆవంత్స సోమసుందర్ ఒక అడుగు ముందే ఉన్నారు. వారి నుండి సత్కారాలు, సద్విమర్శలు అందుకున్న కవులే ఇందుకు నిదర్శనం.
వారి నిష్క్రమణం సాహితీలోకంలో ఏర్పడిన లోటును పూడ్చలేనిది. వారి ఆత్మకు శాంతి కలగాలని, మరో కవిగా ఆంధ్రదేశంలో జన్మించాలని ఆకాంక్షిస్తూ నివాళి అర్పిద్దాం.

- అడపా రామకృష్ణ
సెల్ : 9505269091.

మనోగీతికలు

ప్రకృతి ఘోష
నేను కదలకపోతే మీకు ఊపిరాడదు
నా స్పర్శ మీకు హాయినిస్తుంది
అజ్ఞానంలో కలుషితం చేశారు నన్ను
మీ అనారోగ్యానికి నేనే కారణమన్నారు
నేను స్తంభించానా మీ ప్రాణం పోతుంది
నేను లేకుంటే మీ దప్పిక తీరదు
మీ అవసరాలు తీర్చేది నేనే
ఆలోచన లేక వ్యర్థ పదార్థాలు నాలో కుమ్మరించారు
పదిలంగ, పవిత్రంగ చూడాలి నన్ను
వృథా చేస్తే మిగిలేది తీరని వ్యథ
సకల చరాచర జగత్తుకి ఆధారం నేనే
మీ మనుగడ సాఫీగా సాగాలంటే
నన్ను ప్రాణసమానంగా చూసుకోవాలి
మీ భారాన్ని మోసేది నేనే
మీ స్వార్ధానికి నన్ను ఛిద్రం చేస్తున్నారు
మీ పాపాలతో నన్ను పంకిలం చేస్తున్నారు
భూమీద కాలుష్యం పెంచారు
నన్నంటి ఉండే ఓజోన్‌కి ముప్పు తెచ్చారు
ఇసుమంతైనా ఇంగితం లేదా మీకు
విజ్ఞానమంటూ వింత ప్రయోగాలు చేశారు
అంతరిక్షాన్ని కొల్లగొట్టి మసి చేశారు

- విఎస్‌ఆర్ వౌళి,
పాలకొండ రోడ్డు,
శ్రీకాకుళం-532001.
సెల్ : 7093693268.

అలసట
ఓ చెలీ...
సెలయేటి ఒడ్డున
నీ ఒడిలో తల పెట్టి
నీ ముంగుర్లు సవరిస్తుంటే
చల్లగాలి మెల్లగా వచ్చి
మళ్లీ ప్రయత్నించమంటున్నది
నీ పెదవులు పద్మాలనుకుని తుమ్మెద
పొరబడి మధువును గ్రోలాలనుకుంటే
తరిమి తరిమి... అలసిపోయా
నా కన్నులలోకి చిలిపిగా చూసి
మంత్రించినట్లు అలసట లాగేశావు!

- బండారు చిన్న రామారావు,
లోగిస-535270.
విజయగనం (జిల్లా).
సెల్ : 9553330545.

అందరూ
ఆనందంగా
చేస్తేనే పండగ
కష్టాల్లో ఉన్నప్పుడు
పండగవును దండగ
పండగ రావాలి అది
మెడలో ఒక దండగా
మరక రాశిలో సూర్యుడు
ప్రవేశించు రోజు
సంకురాత్రి రోజున
ప్రతి గరీబు రాజు

- మాధవీ సనారా,
కామాక్షి కోవెల వీధి,
నిదానం దొడ్డి,
అనకాపల్లి-531002.
సెల్ : 9440103134.

పాలపిట్టల
సొగసులు
తెలుగుజాతి చిహ్నమైన
పాలపిట్టల గుంపులు
మొక్కజొన్న తోటపైన
వాలి గాలికి ఊయలలూగుతూ
లేత పొత్తుల గింజల్లో
పాలు తాగుతూ
రెక్కల అందాల రంగుల
పచ్చిక బయళ్ల నింపే
పాలపిట్టల సొగసులే
ఈ తెలుగు నేలకు వెలుగులు
ఆ వెలుగుల మెరుపును
మనమందరం ఆస్వాదిద్దాం
ఆనందంగా ఇతర జీవుల్లా
ప్రకృతిని ప్రేమిద్దాం!

- విద్వాన్ ఆండ్రకవిమూర్తి,
అనకాపల్లి.
సెల్ : 9246666585.

నానీలు
కుటుంబాల్లో కలహాలు
మాట్లాడుకుంటే అవే
నవ్వుల వరహాలు
నగరంలో గొప్పోళ్ల కాంతులేనా
మురికివాడల్లో పేదోళ్ల చీకట్లేనా
అన్ని రోగాలకు మందులున్నాయా
మరి, డబ్బు జబ్బుకు సారీ లేవండి
మతంలోని మూఢత్వమెంతుంది
కులంలోని మూర్ఖత్వమంత
పడేసిన చెత్తను ఎవరెత్తాలి
వేరే ఎందుకు నువ్వే ముందుకు రావాలి

- బి. గోవర్ధనరావు,
నరసింహ విహార్ అపార్ట్‌మెంట్స్,
శివాజీపాలెం,
విశాఖపట్నం-530017.
సెల్ : 9441968930.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

email: merupuvsp@andhrabhoomi.net

- పివిఎస్ ప్రసాద్. సెల్ : 9949244504.