నెల్లూరు

ప్రాణదాతకు ప్రాణదానం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడవిలో ఆ రాత్రి వెనె్నల పచ్చపువ్వులా విరగకాస్తోంది. ఆ రాత్రి ఆహారానే్వషణలో ఉన్న యువకుడైన మగ ఎలుగుబంటుకు తారసపడింది అదే వయసులో ఉన్న మరో ఆడ ఎలుగుబంటు. ఇద్దరూ కళ్లూ కళ్లూ కలుపుకున్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. రెండు ఎలుగుబంట్లూ ఒకదాన్నొకటి తరుముకుంటూ, ఒకదాని మూతి మరొకటి నాక్కుంటూ ప్రణయకలాపాలు సాగిస్తున్నాయి. ఒకరి నొకరు తరుముకుంటూ చెట్లమీద ఆడుకుంటున్నారు. ప్రియురాలు మామిడి చెట్టెక్కింది. దాన్ని తరుముతున్నాడు ప్రియుడైన ఎలుగుబంటు. దొరకలేదు ప్రియురాలు. మళ్లీ బేరిచెట్టెక్కింది. ఈసారి ఎలాగోలాగ చేజిక్కించుకున్నాడు ప్రియుడు. ఇద్దరూ బేరిపండ్లు కోసుకుని తిన్నారు.
మరొక చెట్టెక్కింది ప్రియురాలు. అతన్ని వెన్నంటి ఎక్కాడు ప్రియుడు. వెనె్నల రాత్రి ఆ అడవి వారికి బృందావనమైంది. ఇద్దరి ప్రేమకలాపాలకు అది వేదిక అయింది. తెల్లవారుజాము వరకూ ఒకరినొకరు తరుముకుంటూ సరసల్లాపాలు సాగించారు. ఇలా చెట్లమీద దూకేసమయంలో పనస చెట్టు కొమ్మ పంగలో ఎలుగుబంటు ప్రియుడి వెనుక కాలు చిక్కుకు పోయింది. తలకిందులుగా కొమ్మమీద వ్రేలాడసాగాడు. కాలు తీసుకోవడానికి గట్టిగా లాగింది. ఇంకా పంగలో ఇరుక్కుపోయింది కాలు. ప్రియుడి బాధ చూడలేక సాయానికి వచ్చి లాగింది ఎలుగుబంటు ప్రియురాలు. కాలు ఇంకా ఇరుక్కుపోయింది. తన శరీరం బరువుకు వ్రేలాడుతున్న ఎలుగుబంటుకి కాలు నొప్పి ఎక్కువయి ఇంకా గట్టిగా అరవసాగింది.
ఆడ ఎలుగుబంటు కూడా దాంతోపాటు బిగ్గరగా అరవసాగింది. ఆ కేకలకు అడవిలోని తోటి ఎలుగుబంట్లు కూడా అక్కడకి చేరి అరవసాగాయి. తెల్లవారింది. ఏమీ చేయలేక అన్నీ తిరిగి అడవిలోకి పారిపోయాయి.
చివరకు అక్కడ మిగిలింది వ్రేలాడుతున్న ఎలుగుబంటి మాత్రమే. అది పెడబొబ్బలు పెడుతే అరచిన అరుపులకు అడవంతా ప్రతిధ్వనించసాగింది. ఆ అరుపులకు చిన్నచిన్న జంతువులు భయపడి అడవి మధ్యకు పారిపోయాయి. చుట్టుప్రక్కల చెట్టమీద ఉన్న పక్షులు ఎగిరి దూరంగా ఉన్న చెట్ల మీద వ్రాలాయి.
ఆ తెల్లవారు ఝామున ఆ ఎలుగుబంటు పెడుతున్న పెడబొబ్బలకు, ఆరుపులకు, ప్రక్కనున్న దుర్గంపల్లెలో బయట నులకమంచామీద పడుకున్నవాళ్లంతా లేచికూర్చున్నారు. ఇండ్లలో పడుకున్నవారు భయంభయంగా బయటకు వచ్చారు. అందరూ ఒకచోట చేరారు. అసలు అడవిలో ఏంజరుగుతుందో తెలుసుకోవడానికి కర్రలు తీసుకుని బయలుదేరారు యువకులు. వారిని వారించారు వృద్ధులు. ‘అసలు అక్కడ ఏంజరుగుతుందో? ఇప్పుడు పోయి ఏంచేస్తార్రా? తెల్లారనీయండి’ అంటూ ఆపారు. అందరూ తమతమ ఇండ్లలో ఉన్న ఎండిన కంప తెచ్చి, వీధి మధ్యలో వేసి మంట వెలిగించి చలికాసుకుంటూ ఆ శేషరాత్రి గడిపారు. తెల్లవారింది. కాని అడవిలోంచి వినిపించే పెడబొబ్బలు మాత్రం ఆగలేదు. ఇంకా ఎక్కువయ్యాయి.
ఇక ఆగలేక ఆడా, మగా, పిల్లాజెల్లా తలా ఒక ఆయుధం పట్టుకుని అడవిలోకి బయలుదేరారు. ఆ కేకలు వినిపించిన వైపు చెట్టను చీల్చుకుంటూ వెళ్లారు. అక్కడ పదడుగుల ఎత్తులో చెట్టువంపులో కొమ్మకు తలకిందులుగా వ్రేలాడుతూ ఉంది బలమైన ఎలుగుబంటు. కాటుకలాంటి నల్లని బొచ్చు ఒంటినిండా ఉంది. నల్లని పొడవైన మూతిలోంచి కోరపళ్లు బయట పెట్టి వికృతంగా అరుస్తోంది.
అందరూ ఇరవై అడుగుల దూరంలో నిలబడి పోయారు. ఆ చెట్టు పైకెక్కి కొమ్మను గొడ్డలితో నరికితే కొమ్మ విరుగుతుంది. దాంతోపాటు ఎలుగుబంటు కూడా క్రిందపడుతుంది. ఆ విధంగా కాలు బయటకు వస్తుందని అందరికీ తెలుసు. అయితే ఆపని చేసే ధైర్యం ఎవరికీ లేదు. అది అక్కడనుండి బయటపడితే అందరినీ చీల్చిచెండాడుతుందని వాళ్ల భయం.
చివరకు అందరూ మాట్లాడుకుని దాన్నలాగే ఉంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఏ పులో వచ్చి దాన్ని చంపేంతవరకు, ఏ కొండచిలువో వచ్చి దాన్ని మ్రింగేంత వరకూ తమకీ గోల తప్పదని నిర్ణయించుకున్నారు. నిజానికి దాన్ని చంపి తినడం ఏ పులికి ఇష్టముండదు. ఏ కొండచిలువా బొచ్చుతో నిండిన దాన్ని మింగడానికి సుముఖత చూపదు. అవి ఏ ఆహారమూ దొరక్క ఆకలికి తట్టుకోలేని గతిలేని పరిస్థితి వస్తే తప్ప దాని జోలికి ఏదీ పోదు.
పల్లె ప్రజలంతా తిరిగి ఇండ్లకు వెళ్లిపోయారు. మళ్లీ ఎప్పటిలా తమ దైనందిన కార్యక్రమాల్లో పడిపోయారు. అడవిలో అన్ని చోట్లకు పోతున్నారుగాని, ఈ ఎలుగుబంటు ఉన్న చోటికి మాత్రం ఎవరూ పోవడంలేదు. ఈ ఎలుగుబంటి అరుపులకు పగలూ, రాత్రీ అలవాటు పడిపోయారు.
నాలుగవరోజు దాని అరుపులు ఆగిపోయాయి. దాన్ని ఏ అడవి జంతువో చంపి ఉంటుందనుకున్నారంతా. ఆ పల్లెలో సోమయ్య కొడుకు పనె్నండేళ్ల నారయ్యకూడా అందరితో బాటుదాన్ని చూసాడు. అప్పటినుండి ఆ ఎలుగుబంటును రక్షించాలని కోరికగా ఉంది. కాని ఇంట్లోవాళ్లు వారించేసరికి ఆ చుట్టుప్రక్కలకు పోలేదు. ఇప్పుడు ఎలుగుబంటు అరుపులు వినిపించలేదు కాబట్టి ఏం జరిగిందో చూద్దామని తన చిన్న గొడ్డలి భుజాన పెట్టుకుని ఒంటరిగా అదున్న ప్రాంతానికి అడవిలో బయలు దేరాడు.
నారయ్య అందరిలాంటివాడు కాదు. వాడిది జాలిగుండె. అడవిలోకి వెళ్లినా ఏ జంతువునూ వేటాడడు, పైపెచ్చు అవేదైనా ఇబ్బందుల్లో ఉంటే రక్షిస్తాడు. వాడు గాయపడ్డ నెమలిని తెచ్చి దాన్ని గాయాల్ని నయంచేసి, పెంచి పోషించాడు. అది పగలు అడవంతా తిరిగి సాయంత్రానికి వచ్చి వాడి ఇంటిముందున్న వేప చెట్టు కొమ్మమీద కూర్చుంటుంది. ఉదయానే్న వాడు పెట్టిన గింజలు, పళ్లూ తిని, కొద్దిసేపు నాట్యంచేసి కొన్ని నెమలీకలు రాల్చి వెళ్లిపోతుంది. ఆ రంగుల నెమలీకల్ని వాడి తమ్ముళ్లు, చెల్లెళ్లు ఏరుకుని, కొన్ని నెత్తిన గుచ్చుకుని, కొన్ని తమ స్నేహితులకిచ్చి మురిసిపోతుంటారు.
వాడు అడవిలో కుందేళ్లతో ఆడుకుంటాడు. కోతులతో పోటీపడి చెట్లెక్కి దుముకుతాడు. కోయిల కూస్తుంటే దానికి పోటీపడి వాడూ ‘కూ..’ అని కూస్తాడు. గాయపడ్డ లేడిపిల్లల్ని సంరక్షిస్తాడు. వాడొక ప్రకృతి ప్రేమికుడు. అంతేకాదు అడవిలోంచి రకరకాల గుడ్లు ఏరుకుని వస్తాడు. మిగతా పిల్లల్లా వాటిని ఉడకబెట్టుకుని తినడు. దొడ్లో బుట్టలో గడ్డి ఉంచి వాటిని పొదగేస్తాడు. వాడి ఇంట్లో వాడ్ని తల్లిదండ్రులేమీ అనరు. వాడి చెల్లెలు, తమ్ముడు వాడికి సహాయంగా ఉంటారు. వాడు పొదగేసిన గుడ్లలోంచి ఒక్కోసారి పాము పిల్లలొస్తాయి. మరోసారి బుల్లిపిట్ట లొస్తాయి. కొన్నిసార్లు తాబేలు పిల్లలొస్తాయి. మరికొన్ని తొండపిల్లలొస్తాయి.
ఏమొచ్చినా వాడు వాటిని చంపడు. స్వేచ్ఛగా బ్రతకమని అడవిలోకి తీసుకువెళ్లి వదిలేస్తాడు. అవి కూడా తనంత స్వేచ్ఛగా బ్రతకాలని కోరుకుంటాడు. అంతేకాదు వాడు ఆటల్లో కూడా దిట్ట. వాడి గురి చాలా సూటిగా ఉంటుంది. గురిచూసి కొట్టాడంటే ఎంత ఎత్తునున్న కాయయినా భల్లున నేలమీద పడాల్సిందే. అంతటి గురిగాడు.
ఆ ఎలుగుబంటు ఇప్పటికీ చెట్టుకొమ్మల్లో వ్రేలాడుతూ ఉంది. మూడురోజులుగా తిండిలేక నీరసించిపోయి ఉంది. దానికి అరవడానికి కూడా శక్తిలేదు. సహాయం చేయమన్నట్లు నారయ్య వైపు చూస్తూ నీరసంగా చేతులూపుతూ చిన్నగా మూలుగుతోంది. నారయ్య ఇక ఉండలేకపోయాడు. చిన్నగొడ్డలిని నోటితో పట్టుకుని చెట్టు ఎక్కాడు. పై కొమ్మమీద కూర్చుని చేతిలోకి గొడ్డలి తీసుకుని క్రిందకు వంగాడు. క్రిందనుంచి చెట్టుకొమ్మను ఎలుగుబంటి కాలికి తగలకుండా జాగ్రత్త పడుతూ నరకసాగాడు.
కొద్దిసేపటికి చెట్టుకొమ్మ ఫెళఫెళామని చెట్టు కాండం నుంచి వేరయి విరిగి క్రిందపడిపోయింది. కొమ్మ పంగలో చిక్కుకున్న ఎలుగుబంటు కాలు విడివడి ఎలుగుబంటు కొమ్మ ప్రక్కనే క్రింద పడింది. వెంటనే లేచి నిలబడి కుంటుకుంటూ నారయ్యనే పదేపదే చూస్తూ అడవిలోకి వెళ్లిపోయింది. అప్పటి వరకు భయపడిన నారయ్య చెట్టుమీదనే ఉండిపోయాడు. అది వెళ్లిపోయిన తరువాత ఏదోమంచి పని చేసానన్న తృప్తితో ఇంటికి వెళ్లిపోయాడు. తిడతారని ఈ విషయం ఇంట్లో కూడా చెప్పలేదు.
రోజులు గడచిపోతున్నాయి. సుమారు ఆరునెలలు గడిచాయి. దుర్గానికి అటువైపు బండకింద అడవికోళ్లు ఉన్నాయని సమాచారం అందడంతో అందరూ సంతోషంగా అడవిలోని ఆ ప్రదేశానికి పరుగెత్తుకు వెళ్లారు. ఊరు కట్టుబాటు ప్రకారం నారయ్య కూడా వెళ్లక తప్పలేదు. కాని మనసులో మాత్రం అవి దొరక్కూడదని కోరుకుంటున్నాడు. ఊరివాళ్లు అవి బండ క్రిందనుంచి బయటకు రావడానికి కంపమండలతో పొగ పెట్టారు. కాని నిజానికి అక్కడ అడవికోళ్లు లేవు. ఒక జంట ఎలుగుబంట్లు తమ పిల్లలతో నివాసముంటున్నాయి. పొగ తగలడంతో పిల్లలతో సహా అవి అరుస్తూ బయటకు వచ్చి మనుషులమీద పడ్డాయి.
దొరికిన వాళ్లను దొరికినట్లు తమ బలమైన చేతులతో వాటికున్న పదునైన గోళ్లతో ఎడాపెడా కొట్టాయి. కొందరి ముఖాలు పగిలాయి. కొందరి భుజాలు చీలాయి. గాయపడినవారు, గాయపడనివారు ఆ అడవిలో కకావికలై తలా ఒక దిక్కున పడి పరుగెత్తసాగారు. ఆడ ఎలుగుబంటి తన బిడ్డల్ని తీసుకుని సురక్షిత ప్రదేశానికి పోయినా, మగ ఎలుగు బంటి మనుషుల్ని తరమడం మాత్రం మానలేదు. పరుగెత్తడంలో వెనుకబడిన నారయ్య రాయి తట్టుకుని బోర్లా పడ్డాడు ‘అమ్మా’ అని అరుస్తూ. వాడి అమ్మా, నాన్నలు కూడా వాడిని రక్షించే స్థితిలో లేరు. కారణం ఉగ్రనరసింహుడిలా దాడి చేస్తున్న ఎలుగుబంటు.
‘బిడ్డా చస్తివిగదరా’ అంటూ భోరున ఏడుస్తూనే పరుగెడుతున్నారు వాళ్లు. వాడిని వెల్లకిలా తిప్పి తనవాడైన గోళ్లతో వాడి ముఖాన్ని చీల్చబోయిన ఎలుగుబంటు వాడి ముఖం చూసి ఆగిపోయింది. దాని కౄరమైన ముఖం ప్రశాంతంగా మారిపోయింది. గజగజా వణికిపోతున్న నారయ్య ముఖంలోకి ఇష్టంగా చూసింది. దాని కళ్లలోంచి రెండు కన్నీటిబొట్లు రాలాయి. పిల్లిలా వెనుదిరిగి నాలుగు కాళ్లమీద నడుస్తూ వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ తన భార్యాబిడ్డల దగ్గరకు వెళ్లిపోయింది.తనను ఆపదలో రక్షించిన వాడిగా నారయ్యను గుర్తించింది ఎలుగుబంటు. పూర్తి ఆరోగ్యంతో నడుస్తున్నా చిన్నగా కుంటుతున్న ఎలుగుబంటు కుడికాలును గుర్తించాడు నారయ్య. ఆకాలే ఆకాడు చెట్టు పంగలో ఇరుక్కుపోయిందని అతను అర్ధంచేసుకున్నాడు. ఎలుగుబంటు తనకు ప్రాణదానం చేసిన నారయ్యకు తిరిగి ప్రాణదానం చేసి తన కృతజ్ఞత తెలియజేసుకుంది.

- పోట్లూరు సుబ్రహ్మణ్యం, నెల్లూరు
చరవాణి : 94911 28052

మనోగీతికలు

నీటిమాటలు
క్రొంగొత్త సంవత్సరంలో
వింటానంటే...
మీకో నాలుగు మాటలు చెబుతా..
నావి నీటిమూటలు కావండోయ్!
విన్నారంటే మీరే చెబుతారు
గట్టి మాటలని
చిత్తగించండి మరి!

నేనో ప్రముఖ జీవకర్తను
పచ్చదనాల చలవ పందిళ్లతో
అనునిత్యం జగతిని నిత్యకళ్యాణిగా
చూడాలనుకొనే జగత్కర్తను

మహిలోనైనా మనుషుల్లోనైనా
నా భాగస్వామ్యం సింహభాగమే
మన్నుకు మిన్నుకు మధ్య
నా రాకపోకలు అనివార్యం

నా గమనం ఒడిదుడుకుల మయం
నా అస్థిత్వం రూపాంతరాల
సమ్మేళనం
సుస్వారాల సవ్వడుల మధ్య గలగల సాగిపోయే
నా గమకాలే మీ జీవన నాదాలు

జీవాణువుల మధ్య శృతి బంధాలు నేను అల్లినవే
జీవ కార్యాల సాఫల్యత
నిక్షిప్తత కోసం
నా గుండెపుడూ లోతులనే
కోరుకుంటుంది

నన్ను చూస్తే హాలికులు రక్తం
చురుకెక్కుతుంది
నాగళ్లు పదునెక్కుతాయి
ఇంటింటి వేడుకల్లో ఏరువాకల కోలాహలాలు
సంబరాలే జరుపుకొంటాయి

నా వెన్నంటే మీ జీవన ప్రస్థానంలో
సంస్కృతీ సంప్రదాయాల
మైలురాళ్లను నాటింది నేను!

కుదురుకొన్న జీవితాలతో
కుదుటపడ్డ మనసులతో
మీ నాగరికతల ఆవిష్కరణల వెనుక
పరోక్ష భూమిక వహించింది నేనే

ఆధ్యాత్మిక భక్త్భివాల
ఆనంద నిలయాలు
నా ప్రాపున వెలసిన సద్గతుల తీరాలే
పురాణేతిహాసాల్లో చెరగని ముద్ర వేసింది
నా నదీనదాల ఉత్కృష్టపు వైశిష్ట్యాలే
ప్రళయం కానంత వరకు
నైవైశిష్ట్యం యశోవిరాజితమే
వరదల బీభత్సం రానంతవరకు
మీ పాలిట వరదాయినినే
సాత్వికమైన నా వౌలిక
లక్షణాలను
విస్తృత పరచుకోవడం మీ ఐచ్ఛికం
అందుకే మీ పాలిట నేనెప్పుడూ
అమృతంగమయానే్న
మీలోని పరమార్థాన్ని ఎత్తి చూపే జీవన వేదానే్న
వెరశి జీవధాత్రి అన్న పేరును
సార్థకం చేయడానికి కట్టుబడ్డ
ఓ ధర్మసూత్రాన్ని
ఇప్పుడొప్పుకుంటారా!
నావి గట్టి మాటలేనని.

- కె.రవీంద్రబాబు, పాకాల
చిత్తూరుజిల్లా.
చరవాణి : 9052778988

కాలప్రవాహం
కాలచక్రం ప్రవహిస్తూనే ఉంటుంది
ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా
ఆ ఒడిదుడుకులు ఏవో..!
మనకే దర్శనమిస్తుంటాయి
కొన్ని కెరటాలు బలంగా విసిరి
బాధిస్తుంటాయి
మరికొన్ని సున్నితంగా తాకి..
ఆహ్లాదపరుస్తాయి
జీవిత పరమ పదసోపానంలో
పాములు..నిచ్చెనలు మామూలే..
గుంతలో..మిట్టలో...
పడిన ప్రతిసారి కారణాలను
విశే్లషించుకుంటూ..
విజయపరంపరవైపు
పయనించటమే..
గుంతలకు కృంగిపోక..
మిట్టలకు మిడిసిపడక
సంవత్సరాల కడలిలో
జీవితనావను సాగించాలి
మనసున తడిని తట్టి లేపే
జ్ఞాపకాలన్నింటిని
హృదయడైరిలో పొదుపుకొని
ఉజ్వల భవిష్యత్
స్వప్నాన్ని సాకారం
చేసుకునేందుకు
మంచు కురిసే
శీతల గాలుల వేళ
నూతన సంవత్సరానే్న
ఆనందంగా
ఆలింగనం
చేసుకుందాం...

- అవ్వారు శ్రీ్ధర్‌బాబు,
నెల్లూరు.
చరవాణి : 8500130770

ఓ... నవ్య
సంవత్సరమా!
దివ్యంగా ఉదయించుమా!
నవ్య విజయాలకు నిలయమా
కదిలే కాలానికి
సరిక్రొత్త సింగారమా
ఓ..నవ్య ఆంగ్ల సంవత్సరమా
విశ్వజన ఆశలు తీర్చగా
దివ్యంగా ఉదయించుమా..!
నీ ఉషోదయ వెలుగులు
హృదయాలలో..
క్రొత్త ఆలోచనలు మొలిపించాలి
జీవితాలలో...
సరిక్రొత్త ఒరవడికి
నాందినివ్వాలి
విపరీత పోకడలనే
విషసర్పాల నీడల్ని
నామరూపాల్లేకుండా
నిర్మూలించాలి
నేరాలు, ఘోరాలు లేని
క్షణాలకు..
మనిషిని మనిషిగా చూచే
మానవతా భావ వీచికలకు..
అందరూ సమంగా
అందరూ ఆనందంగా
జీవించగలిగే దినాలకు
నిలయమై విరాజిల్లాలి..
దైన్యం నిండిన చోట
ధైర్యాన్ని కలిగిస్తూ
ఆవేదన నిండిన చోట
ఆనందాన్ని పంచిస్తూ
‘మంచి’కి బాసటగా
మానవాళికి గొప్ప
మేల్కొలుపు కావాలి!

- కొండూరు వెంకటేశ్వరరాజు
చరవాణి : 9492311048

నూతన
సంవత్సరం
గమ్మతె్తైన గ్రీటింగ్స్
ఖరీదైన కానుకలు
పరిమళాల మాలలు
పసందైన యాపిల్స్

కాకాలు బాకాలు
తెగతాగి తందనాలు
సినిమాలు షికార్లు
వెర్రిమొర్రి వేడుకలు

కొత్త సంవత్సరం నాడు
కోలాహలాలెనె్నన్నో
శనివారం వెనుకనే
ఆదివారం సహజం

రెండువేల పదిహేను వెంటనే
రెండువేల పదహారు అంతే
జనవరి రాగానే
జాతకం తిరగబోదు

అంకెలతో లంకెపెట్టి
ఆకసాన మేడ కట్టి
గుడ్డి నమ్మకాలతో
గోతిలో పడేకంటే
జనవరినొక బహుచక్కటి
యోగ్యమైన సూచిగ్గా
చిత్తంలో నిలుపుకొని
సత్కార్యం ఏదైనా

సహృదయంతో మొదలుపెట్టి
సత్ఫలితం సాధిస్తే
కొత్త సంవత్సరమొక
గుర్తుగా మిగిలిపోదా!

నీ జీవన ప్రగతికది
నిచ్చెనగా నిలిచిపోదా!

- చిరమన
వెంకట రమణయ్య,
తూర్పువీధి, గూడూరు
చరవాణి : 9441380336

స్పందన

మధ్యతరగతి అనుబంధం అంతే!
యర్రాబత్తిన మునీంద్ర గారు రాసిన మధ్యతరగతి అనుబంధం కథలో మధ్యతరగతి కుటుంబంలో ఉండే అనుబంధాలు, ప్రేమలు అలాగే సమస్యలు, కష్టాలను విపులంగా వివరించిన తీరు బాగుంది. నిజంగా కథ ప్రారంభం నుంచి సాఫీగా సాగినా చివరలో ఇచ్చిన ట్విస్ట్ కథకు మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. భార్య మనస్తత్వాన్ని తెలుసుకుని భర్త ఆమెకు గుణపాఠం చెప్పిన తీరు బాగుంది. అలాగే ఈ కాలపు ఆడపిల్లలు మరీ నా మొగుడు నాకే సొంతం అనే ఫార్ములాను బాగా కాచివడపోసి అనేక ఇబ్బందులు సృష్టిస్తున్నారు... ఇలాంటి వారికి ఈ కథ ఓ కనువిప్పు. వయస్సులో చిన్నవాడైనా మంచి కథను అందించిన మునీంద్రకు అభినందనలు.
- దామవరపు లక్ష్మిశ్రీ, బుచ్చిరెడ్డిపాళెం
- శ్రీకిరెడ్డి చంద్రశేఖరరెడ్డి, నెల్లూరు

హాస్యభరితం సచిన్ స్ఫూర్తితో..
నిజంగా కవి తలచుకుంటే ఎలాగైనా హాస్యం ఒలికించగలడు అనేందుకు నిదర్శనం గత వారం మెరుపులో ప్రచురితమైన బొగ్గవరపు రాధాకృష్ణ గారి కవిత. అసలు సచిన్ స్ఫూర్తితో అంటూ కవితను శిఖరాగ్రానికి తీసుకెళతారెమో అనుకుంటే ఫటాఫట్ దోమలబ్యాట్ అంటూ ముగించి మమ్మల్ని పగలబడి నవ్వేటట్లు చేశారు. చాలా గొప్ప సారూప్యత.
- ముమ్మడి భానుప్రియ, నాయుడుపేట
స్మృతి చిహ్నాలు
కవిత చిన్నదైనా కవితలో భావన గొప్పది. అచ్చం ఇలాగే సాగింది మోపూరు పెంచల నరసింహం గారి కవిత స్మృతి చిహ్నాలు. నిజంగా సినీనటులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం జీర్ణించుకోలేకపోతున్నాము. సినీనటుడు రంగనాథ్ మృతికి నివాళిగా రాసిన ఈ చిరుకవితలో అంతర్లీనంగా దాగున్న ఆవేదన వర్ణణాతీతం.
- సిరిమాను గోపీచంద్, ఆడిటర్, నెల్లూరు

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

email: merupunlr@andhrabhoomi.net

- పోట్లూరు సుబ్రహ్మణ్యం