దక్షిన తెలంగాణ

పెద్ద నోటు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయం తొమ్మిది గంటలకు పాఠశాలలోని ’మొదటి బెల్’ మ్రోగింది. ‘రెండో బెల్’ మ్రోగేలోపు విద్యార్థులంతా అసెంబ్లీలో ‘ప్రార్థన’కై క్లాస్ రూముల్లో నుండి వచ్చి వరుసలుగా నిలబడుతున్నారు. ‘సుర్..సుర్..అంటూ విజిల్ వేస్తూ వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ సార్ పిల్లల్ని వరుసల్లో సరిగా నిలబెడుతున్నాడు. వారంలో ఒక రోజు సివిల్ డ్రెస్సు ఉంటుంది. ప్రతి రోజు స్కూల్ యూనిఫాం ఉంటుంది. ‘బుధవారం’ మాత్రం సివిల్ డ్రెస్సుతో పిల్లలు రంగు రంగుల డ్రెస్సులతో ‘సీతాకోక చిలుకల్లా’ ముస్తాబై వస్తారు. పాఠశాల ముందున్న పచ్చ పచ్చని చెట్లతో తమ రంగు రంగు డ్రెస్సులతో పోటీ పడుతున్నారు. ‘వందేమాతరం’ గేయాన్ని లయ బద్ధంగా పిల్లలంతా స్టేజీపై పాడుతుంటే మిగతా పిల్లలంతా ఆ గీతానికి తోడై శ్రావ్యంగా పాడుతున్నారు. ఐదు నిమిషాల్లో ‘ప్రార్థన’ కార్యక్రమం ముగిసింది. ‘క్లాసెస్ డిస్పాచ్’ అంటూ వ్యాయామ ఉపాధ్యాయుడు ‘మైక్’తో ఆదేశించేసరికి వరుసగా పిల్లలు తమ క్లాసుల్లోకి వెళ్లారు. క్లాస్ టీచర్ అటెండెన్స్ తీసుకొని సరిగ్గా ఫీజులు చెల్లించని పిల్లల్ని తమ పేరెంట్స్ దగ్గరికి పంపించారు. ‘రమేష్ సార్ ఉన్నారా..? గేటు దగ్గరున్న అటెండర్ సారయ్యను అడిగాడు ఒక పేరెంట్. ఏ రమేష్ సార్..? ఫీజులు తీసుకొనే రమేష్ సారా..? కంప్యూటర్ రమేష్..సారా..? అంటూ ప్రశ్నించాడు సారయ్య. ‘్ఫజులు తీసుకొనే రమేష్ సార్ కావాలి’ అన్నాడు పేరెంట్. ‘రమేష్ సార్ ఉన్నాడంటూ’ గేటు తీసి లోపలికి పంపించాడు. పేరెంట్‌ను సారయ్య..‘ప్రిన్సిపాల్’ అన్న ఇంగ్లీష్ అక్షరాలు ‘బ్లూ కలర్’ బ్యాగ్రౌండులో తెల్లని అక్షరాలతో నిగనిగ లాడుతూ కన్పిస్తున్నాయి. ప్రిన్సిపాల్ తలుపు దగ్గర తెల్లని ప్లాస్టిక్ స్టూలుమీద మహిళా అటెండర్ పుష్పలత కూర్చుని ఉంది. ‘ప్రిన్సిపాల్ సార్ ఉన్నాడా? అంటూ పుష్పలతను అడిగాడు పేరెంట్ తిరుపతి. ‘ఆ..ఉన్నాడు..ఉన్నాడు..సార్ ఫోన్‌లో మాట్లాడుతున్నాడు పంపిస్తాను ‘కూర్చో’ అంటూ ముందున్న ‘ఎర్రని’ ప్లాస్టిక్ కుర్చీవైపు చూపించింది. వెళ్లి ఎర్రని కుర్చీలో కూర్చున్నాడు పేరెంట్ తిరుపతి.‘ట్రింగ్..ట్రింగ్..బెల్ మ్రోగింది. ‘సార్..! అంటూ పుష్పలత వెళ్లింది. ‘ఎవరొచ్చారు. అంటూ అడిగాడు ప్రిన్సిపాల్ శ్రీ్ధర్ ‘ఎవరో..పేరెంట్’ వచ్చాడు సార్ అంది పుష్పలత ‘సరే..లోపలికి పంపించు’ అన్నాడు ప్రిన్సిపాల్. ‘ఆ..ఏమైంది’..అంటూ పేరెంట్ తిరుపతిని అడిగాడు ప్రిన్సిపాల్. ‘సార్..మా పిల్లాన్ని ఫీజు చెల్లించలేదని’ ఇంటికి పంపించారట సార్. రెండు, మూడు రోజుల్లో ఫీజు చెల్లిస్తాను సార్. ‘ఈ పెద్దనోట్ల’తో ‘పెద్ద గండం’ వచ్చి పడింది సార్. రోజు బ్యాంక్‌కి వెళ్లి గంటలతరబడి నిల్చున్నా లాభం లేదు సార్..? అన్నాడు తిరుపతి. ‘సరే..సరే’ ఆ ఫీజు కౌంటర్‌లో రమేష్ సార్‌కి చెప్పి వెళ్లు, రెండు, మూడు రోజుల్లో ఫీజు చెల్లించు’ అని పంపించాడు ప్రిన్సిపాల్. ‘ట్రింగ్..ట్రింగ్’ మళ్లీ బెల్ మ్రోగింది. ‘సార్.. అంటూ పుష్పలత వచ్చింది..‘రామయ్య’ సార్‌ను పిల్చుకురా..! అన్నాడు ప్రిన్సిపాల్. ‘సరే సార్’ అని రామయ్య సార్‌ను పిలుచుకొచ్చింది పుష్పలత. ‘మే ఐ కమింగ్ సార్’..‘ఎస్..కమింగ్’ ప్రిన్సిపాల్ అనగానే రామయ్య సార్ లోపలికెళ్లాడు. ‘పదవ తరగతి’ పరీక్ష పీజు చలాన్ కట్టాలి అని చలాన్ పారమ్, డబ్బులు రామయ్య సార్‌కిచ్చాడు ప్రిన్సిపాల్. ‘ఒకే సార్ అంటూ చలాన్ ఫామ్, డబ్బులు తీసుకొన్నాడు రామయ్య సార్. చేతిలో చలాన్ ఫామ్ జేబులో డబ్బులు పెట్టుకొని బ్యాంక్‌కి బయలుదేరాడు రామయ్య సార్. బ్యాంక్‌లో చాంతాడంతా లైను ఉంది. లైనులో నిలబడ్డాడు రామయ్య సార్. ఎదురుగా ఉన్న గోడ గడియారం సమయం రెండు గంటలు చూపిస్తోంది. మధ్యాహ్నం భోజనం చేయక కాళ్లు పీక్కుపోతున్నాయి. రామయ్య సార్‌కి ‘క్యాష్’ కట్టే కౌంటర్‌కి దగ్గరగా వచ్చాడు రామయ్య సార్. ఇంతలోనే ‘సార్’ అంటూ ఒక ముసలాయన’ రామయ్య సార్‌ని అడిగాడు. ‘లేదు..లేదు’ నేనే పొద్దుటినుండి లైనులో ఉన్నాను. ఇప్పటికే ‘డినామినేషన్’ రాశాను అన్నాడు. ‘తెల్లని మీసాలతో నున్నటి గుండుతో తెల్లని చొక్కా, దోవడితో కళ్లలో బాధతో దీనమైన కంఠంతో ‘అబ్బ.. కొంచెం.. సహాయం చేయండి సార్ అంటూ చేతిలో ‘ఐదొందల నోటు’ పట్టుకొని అడిగాడు ముసలాయన. మొదట కసురుకున్నా కాసేపాలోచించి సరే ‘క్యాషియర్’ని అడిగి తీసుకొంటానని చెప్పగానే ‘ముసలాయన’ కళ్లల్లో ఆనందం వెళ్లి విరిసింది. తన కొచ్చిన ‘్ఫంచన్’ డబ్బులు రెండు ‘రెండు ఐదొందల నోట్లు’ పట్టుకొని ఎవరిని అడిగినా చిల్లర ఇవ్వడం లేదని బ్యాంక్ కొచ్చాడు ముసలాయన. ముసలాయన దగ్గరున్న ఐదొందల నోటు తీసుకొని వంద నోట్లు ఐదింటిని అతని చేతిలో పెట్టాడు రామయ్య సార్. ఆ ‘ఐదు’ వంద నోట్లను ‘మహాప్రసాదం’గా భావించి రెండు చేతుల్ని జోడించి రామయ్య సార్‌కి నమస్కరించాడు ఆ ముసలాయన. రామయ్య సార్‌ను చిల్లర ఇవ్వకముందు ఒక ‘రాక్షసున్ని’ చూసినట్లు చూసి చిల్లర ఇచ్చాక ఒక దేవునిలా చూసి నమస్కరించే సరికి ‘హృదయం’ ద్రవించింది రామయ్య సార్‌కి. రెండు రోజుల నుండి తిరుగుతున్నాను సార్..చిల్లర లేక మీరు ‘దేవుని’లా సహాయం చేసేసరికి నాకు ప్రాణం తిరిగి వచ్చినట్లయ్యింది. ఆ ‘మాట’ అనేసరికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి రామయ్య సార్‌కి. ఐదు వంద నోట్లను ఐదు వేలుగా భావించి ముడతలు పడ్డ తన తెల్లని చొక్కా జేబులో పెట్టుకొని ఆనందంతో బ్యాంక్ గేటు దాటాడు ముసలాయన. ‘క్యాష్ కౌంటర్’లో ఫీజు కట్టి పాఠశాలకు బయలుదేరాడు రామయ్య సార్. సమయం నాలుగున్నరయింది. ‘సుర్..సుర్’ అంటూ విజిల్ వేస్తూ వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ సార్. పిల్లల్ని వరుసల్లో నిలబెడుతున్నాడు. ‘జనగణమన’ గీతాన్ని పిల్లలు లయబద్ధంగా ఆలపిస్తున్నారు. వరుసలో ఉన్న పిల్లల వెనకాల నిల్చొని ‘జనగణమన’ గీతాన్ని ఆలపిస్తూ అసెంబ్లీ స్టేజీ దగ్గర గోడకు వేలాడుతున్న ‘తెల్లని మీసం’ నున్నటి గుండుతో ఉన్న బోసినవ్వుల ‘గాంధీ’ బొమ్మను చూస్తున్నాడు రామయ్య సార్. స్కూల్‌లోని ‘గాంధీ బొమ్మ’ పెద్దనోట్ల పైనున్న ‘గాంధీ బొమ్మ’ బ్యాంక్‌లో కల్సిన ‘ముసలాయన’ కొత్తగా గులాబీ రంగులో వచ్చిన రెండు వేల పెద్దనోటుపై నిగ నిగలాడుతూ మెరుస్తూ ఉన్న ‘గాంధీ బొమ్మ’ అందరూ ఒకేలా అనిపించింది. ఆ సంఘటన గుర్తుకొచ్చి రామయ్య సార్ కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ‘బోసి నవ్వుల’ గాంధీతాత ‘పెద్దనోటు’పై చిద్విలాసంగా దేశంలోని ‘బ్యాంకుల’ ముందు బారులు తీరిన పేదలందర్ని చూస్తున్నాడు తన కళ్లకున్న ‘గుండ్రని’ అద్దాల్లోంచి..!

- గుండు రమణయ్య గౌడ్
సెల్.నం.9440642809

అంతరంగం

సాహితీ పురస్కారాలు
అర్హులకే దక్కాలి

ప్రముఖ కవి సముద్రాల వేణుగోపాలాచార్య

చిరునామా:
సముద్రాల వేణుగోపాలాచార్య
ఇం.నం.9-5-221
రాంనగర్, ప్రగతినగర్, కరీంనగర్
సెల్.నం.9849473958

అర్హులకే పురస్కారాలు అందించాలని, ఎంపికలో పారదర్శకత పాటించాలని భావించే ప్రముఖ పద్యకవి సముద్రాల వేణుగోపాలాచార్య పాత కరీంనగర్ జిల్లా గంగాధర గ్రామానికి చెందిన వారు. వృత్తిరీత్యా జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా ఉద్యోగవిరమణ చేసిన ఆయన రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మలచుకున్నారు. శ్రీ సప్తగిరి వెంకటేశ్వర శతకం, భావి పౌరశతకం, భారత గీతా, శ్రీ గోదావ్రతం, మహానీయుల మధుర స్మృతులు, చిన్న జీయర్ స్వామి సన్నుతి, సాగర తరంగాలు (నానీలు), తాట్లవాయి శ్రీరామ శతకం మరియు తెలుగు విద్యార్థి తదితర గ్రంథాలను వెలువరించారు. తెలుగు, సంస్కృతంలో రచనలు చేసిన ఆయన తెలుగు పద్యకవితా సదస్సుకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల్ని నిర్వహిస్తూ ఛందోబద్ధ కావ్యాల సృజనకు పాటుపడుతున్నారు. తాను పనిచేసిన పాఠశాలల్లో సైతం విద్యార్థులకు పద్యరచన పట్ల ఆసక్తిని కలిగించి ప్రోత్సహించారు. విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ‘గోడ పత్రిక’ను నిర్వహించారు. అనేక సాహితీ పత్రికల్లో ఆయన రచనలు చోటుచేసుకుంటున్నాయి. సంస్కృత భాషా ప్రచార సమితి హైదరాబాద్ వారి పరీక్షలకు విద్యార్థినీ, విద్యార్థులను ప్రోత్సహించారు. వివిధ ప్రక్రియల్లో తొమ్మిది గ్రంథాలు ఆయన ప్రకటించినప్పటికీ.. పద్య రచనకే పెద్దపీట వేయడం విశేషం! ‘మెరుపు’ ఆయనతో ముచ్చటించింది. ముఖాముఖీ వివరాలు ఆయన మాటల్లోనే...

ఆ రచనా వ్యాసంగాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1970లో మొదట తెలుగు పద్యాలను రాశాను.. కోరుట్లలోని ఉభయ వేదాంత సంస్కృత పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో మా గురువుల ప్రోత్సాహంతో పద్య రచన ప్రారంభించాను.

ఆ సంస్కృతంలో మీరు రచనలు చేయడానికి ప్రేరణనిచ్చిందెవరు?
నైజాం రాష్ట్ర ఆద్యశతావధాని, శ్రీమాన్ శిరిశనహళ్ కృష్ణమాచార్యులు గారు. కోరుట్ల ఉభయ వేదాంత సంస్కృత పాఠశాలలో ప్రధానాచార్యులుగా చేస్తున్న కాలంలో నన్ను ప్రోత్సహించారు. వారి ప్రేరణతోనే సంస్కృత రచనల పట్ల ఆకర్షించబడ్డాను.

ఆ మీకు నచ్చిన సంస్కృత కావ్యాలు?
కుమార సంభవం, మేఘసందేశం - మాఘం

ఆ మీకు నచ్చిన కవి, రచయిత?
కాళిదాసు, తెనాలి రామకృష్ణుడు, అభినవ పోతన, వానమామలై వరదాచార్యులు.

ఆ పద్యకావ్యాలు అనుకున్నన్ని నేడు వెలువడకపోవడానికి కారణం?
నేటితరం ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేయకపోవడం.. గ్రంథ పఠనం పట్ల ఆసక్తి లేకపోవడం..వ్యాకరణం, ఛందస్సు, అలంకారాలను గూర్చి అవగాహన లేకపోవడం..అంతేగాక పద్యరచన కష్టమైందన్న ఒక భావన కలిగి ఉండటం..కానీ ఆసక్తి ఉంటే పద్య రచనను సులభంగా చేపట్టవచ్చు..

ఆ ఇప్పుడొస్తున్న పద్యకావ్యాలపై మీ అభిప్రాయం?
చాలామంది పద్యకావ్యాలు ప్రకటిస్తున్నారు. అయితే గాఢత లోపిస్తున్నది. ఛందస్సు, నియమాలు పాటించే క్రమంలో.. ప్రతీకలు, వర్ణనలు అభివ్యక్తి, శిల్పం పట్ల శ్రద్ధ వహించడం లేదు.

ఆ సాహితీ పురస్కారాలపై మీ అభిప్రాయం?
అర్హులైన వారికే పురస్కారాలు అందించాలి. ఎంపికలో పారదర్శకత పాటించాలి. పురస్కారాలు కవి, రచయిత బాధ్యతను పెంచుతాయి! పురస్కారాల ఎంపికలో ప్రతిభకు పట్టం కట్టాలి.

ఆ ఇప్పటి కవులు, రచయితలకు మీరిచ్చే సలహాలు, సూచనలు?
కొత్తది వింత..పాతది రోత అన్న ధోరణిని ఇప్పటి కవులు రచయితలు విడనాడాలి. ఆధునిక సాహిత్యంతో పాటు ప్రాచీన సాహిత్యాన్ని చదవాలి. అధ్యయనం ద్వారానే వివిధ ప్రక్రియల్లోని రచనల మెలకువలు తెలుసుకోగలుగుతామని గ్రహించాలి.

ఆ రచనల్లో ఇజాలు, భావజాలాలు ఉండాలంటారా?
వ్యక్తిగతంగా ఏ భావజాలమున్న పాఠకులపై బలవంతంగా రుద్దకూడదు..ఎవరి ఇజం ఏదైనా హ్యూమనిజంకు ప్రాధాన్యతనిచ్చి రచనలు కొనసాగిస్తే బాగుంటుంది.

ఆ ఇప్పటి తరాన్ని సాహిత్యంవైపు మళ్లించాలంటే ఏం చేయాలి?
పాఠశాల, కళాశాల స్థాయిలో సంబంధిత తెలుగు అధ్యాపకులు ప్రత్యేక చొరవ చూపాలి. వివిధ సందర్భాల్లో పోటీలు నిర్వహించాలి. అలాగే సాహితీ సంస్థలు సైతం కళాశాలలు, విద్యాలయాలకే వెళ్లి విద్యార్థుల కోసం కార్యక్రమాలు నిర్వహించాలి. ముఖ్యంగా గంటల తరబడి కాకుండా సాహిత్య సభలు గంట, గంటన్నరలో పూర్తి అయ్యేలా చూస్తే కొంతమేరకు నేటి తరం సాహిత్యం వైపు దృష్టి మళ్లించే అవకాశముంది.

ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544

మనోగీతికలు

ఊహల్లోనైనా..!

సృష్టి స్థితి లయల్లో దగ్ధమైనా
చివరి చితాభస్మం నుండి
తిరిగి పురుడు పోసుకుని
సృష్టికి ప్రతి సృష్టితానై
నింగిలా నిలిచిందే కానీ
నక్షత్రంలా రాలిపోలేదు!!
తను ఆఖరన్న ప్రతిసారి
మళ్లీ మొదలై భేదాన్ని
వేరుకు నీరులా ఒలికించి
తొలిపూతకు మారాకు వేసి
సజీవమైందే కానీ
తానెపుడు మరణించలేదు!!
కాలం రేఖ వీది బ్రతుకు ఆటలో
తడబడని తను
శిక్షలు, హక్కులు పోరాటాల క్రమంలో
అపుడపుడు ఓడి ఒరిసిన గాయం
చిమ్మింది ఎరుపు రంగైనా..
జీవన చిత్రంలో సప్తవర్ణాల
దృశ్య కావ్యంగా రంగులద్దిందే కాని
తానేమి చేతులు ముడుచుక
కూర్చోలేదు!!
పిడికిలి బిగించి ఏ శపథాలు
చెయ్యని, ఏ ఆయుధాన్ని
ధరించని ఆమె
కొన్ని కాలాల తరబడి
పుడమిపైన రణక్షేత్రంలో
సహనాన్ని ధరించి
తనదైన క్షమైక నైజంతో
విజేతగానే నిలుస్తుంది
నిజమే కదా!
అందుకే ఆమెను
ఊహల్లోనైనా అనే్వషించడం
ఎవరికైనా తరమా!..

- రామానుజం సుజాత
రేకుర్తి గ్రామం, కరీంనగర్ జిల్లా
సెల్.నం.9701149302

జీవితం!
పుట్టుక..
చావు వంతెనపై తాత్కాలికంగా
జరిపే ప్రయాణమే జీవితం!
బతుకు కంటకంగా
ఉంటేనేం?
ఆలోచనలు మాత్రం..
సుమాల వోలే సుగంధాలను
వెదజల్లుతున్నాయి!
సంపద పెరిగితే..
ధనవంతులు కావొచ్చు..
వయసు పెరిగిన కొద్దీ
వృద్ధాప్యాన్ని చేరువవుతాం!
కానీ.. మంచి మనసుతోనే..
మనిషిగా గుర్తించబడతాం!

- డి.పద్మ
ఎల్‌ఎండి కాలనీ, కరీంనగర్
సెల్.నం.9908944227

పేదరికం
పేదరికం పిల్లల పాలిట ఒక శాపం
అది చేస్తుంది వారి జీవితాలను అతలా కుతలం
వారి జీవితాలు చేస్తాయి గమ్యస్థానం చేరని ప్రయాణం
విధి అనే సముద్రంలో తెరచాప తెగిన నౌకాయానం
పేదరికం అనే పెరట్లోని బొండు మల్లెలు వీధి బాలురు
వారి జ్ఞాన సంపద అమోఘం, అమూల్యం
అది బొండు మల్లెల సువాసన భరితం
కాని మంచి చెడులకు నిలయమైన వీధి చేస్తుంది దానిని వ్యర్థం
అమ్మా నాన్నల అపురూపాలు వీధి బాలలు
వారి కటిక దఠిద్రత మరియు కుసంస్కారపు బలి పశువులు
వారి ప్రేమకు దూరమైన అనాథలు
వీధి అనే నిలయానికి శరణాగతులు

- డి. వినాయక్ రావు, భైంసా, నిర్మల్ జిల్లా, సెల్.నం.9440749686

మనసంతా నువ్వే!

చిత్రం..
భళారే విచిత్రం!
నాకు తెలియకుండానే..
నాలో ఇన్ని మార్పులా?
ఆకలి అసలే లేక..
ప్రతిక్షణం
నీ ఆలోచననలతోనే
జాగరణ చేస్తున్నా!
ఏం మాయ చేశావో ఏమో..
నీ మధుర జ్ఞాపకాలే
నన్ను ఉక్కిరి బిక్కిరి అవుతున్నా!
నన్ను ఓ గొప్ప
ప్రేమికునిగా అయినా
గుర్తిస్తావన్న ఆశతో జీవిస్తున్నా!
సదా నీ ధ్యాసే..!
నీ స్మృతులే నాకు శ్వాస!

- ఎస్. ప్రగ్నేష్
గణేష్‌నగర్, కరీంనగర్
సెల్.నం.7673937660

అంతర్వేదన

నేల తల్లిగా..
నేను ఎందుకు తల్లడిల్లుతున్నానంటే..
నిర్ధాక్షిణ్యంగా
నరుకుతున్న చెట్లను చూసి..
కుల మత విద్వేషాలను
రెచ్చగొడుతున్న వారిని చూసి..
నేను ఎందుకు బాధపడుతున్నాననంటే...
ననే్న నమ్ముకుని అన్నదాత
ఆరుగాలం కష్టించి..
పంట చేతికొచ్చే వేళ..
ప్రకృతి బీభత్సానికి గురవ్వడాన్ని చూసి..
దళారుల సంకెళ్లలో
బంధించబడ్డ రైతన్నను చూసి..
అప్పుల తిప్పలు తట్టుకోలేక
ఉరితాళ్లను ముద్దాడుతున్న
వ్యవసాయదారున్ని చూసి..

- వి.సూర్యతేజ
ఎల్‌ఎండి కాలనీ, కరీంనగర్

గురువు

కార్యశాల లాంటి
గురువును ఎన్నుకో..!
అప్పుడే..
క్షామం లేని బ్రతుకు బాట
సుక్షేత్రమవుతుంది!
అక్షరాన్ని ఎన్నుకొని
ఆర్ద్రతతో సాగిపోయావంటే..
ఇక
నీ ఒడిదుడుగుల
జీవన యానం సుగమమై..
ఆనందమయమవుతుంది!
- మొగిలి స్వామిరాజ్
రాకాసిపేట, బోధన్
సెల్.నం.9963642205

ఓ కవితా!

గుస గుసలాడిన
ఊహలలో
కొసమెరుపనించిన
ఓ కవితా!
ప్రయి కవితా!
నీవేలే ఈ రాతకు సొగసువు
నా మాయని మమతకు
గురుతుగ, ఎదురుగ నిలచిన
ఎంతో చక్కని
సుందర రూపమే నీవు!
నీవు లేని
నేను లేనని
చాటి చెప్పనా!
నా కలమునొదిగి
కళారూపానివై
తెలుపు కాగితాలపైన
జాలువారుతు నీవు
జీవాల వలె నిలుచుండి
సిరివై నవ్వుచుంటివి!

- కూర్మాచలం వెంకటేశ్వర్లు
కరీంనగర్
సెల్.నం.7702261031

పుస్తక సమీక్ష

దూప తీర్చే కల్పతరువు.. ఊర చెరువు!

పేజీలు: 71, వెల: 100/-
ప్రతులకు:
వనపట్ల సుబ్బయ్య
భార్గవి హేర్ స్టైల్స్
నల్లవెల్లి రోడ్, బస్టాండ్ దగ్గర
నాగర్‌కర్నూల్-509209
మహబూబ్‌నగర్ జిల్లా
సెల్.నం.9492765358

సకల జీవరాసుల ఆకలి దూప తీర్చే ఊర చెరువు..మన పాలిట కల్పతరువు! ఊరు ముందు ఇసురాయిలా కొలువుతీరిన చెరువు..దానితోనే మన బ్రతుకుదెరువు..అంతటి ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న చెరువుపై ఉద్యమ కవి వనపట్ల సుబ్బయ్య ఓ దీర్ఘ కవి తను ‘ఊర చెరువు’ పేరుతో ప్రకటించడం ప్రశంసనీయం! ఉద్యమ కాలంలో..తెలంగాణ అస్తిత్వ పోరాటానికి తన కవిత్వంతో ఊపిరులూదిన కవి సుబ్బయ్య గారు రేపటితరం వెలుగుకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువులను పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో..మన గొలుసు కట్టు చెరువులను ప్రస్తావిస్తూ దీర్ఘ కవితను వెలువరించడం ముదావహం! అభినందనీయం!
‘చెరువే జననం
చెరువే బాల్యం
చెరువే జీవితం
చెరువే చరిత్ర
చెరువే ప్రార్థనాగీతం
చెరువే కావ్యం
చెరువే సమస్తం
చెరువే సాంస్కృతిక సమ్మేళనం’
అంటూ చెరువు యొక్క గొప్పదనాన్ని ఈ దీర్ఘ కవితలో చక్కగా ఆవిష్కరించారు.
‘పోలు రాస్తేనే లగ్గం
పూడిక తీస్తేనే నీళ్లు
కాలువ పారితేనే పంట
బువ్వ వండితేనే బోనం
కరువును తరిమేదే చెరువు
బతుకును నిలబెట్టేదే చెరువు
చెరువులు నిర్మాణం
గ్రామాలు నిర్మాణం
గ్రామాలు పునర్నిర్మాణం
పుష్కరాలు జరిగి
పూర్ణకుంభమై మెరువాలని’
కవి ఆకాంక్షించడం హర్షణీయం!
‘వాగులు సెలిమలు
కుంటలు కాలువలు
బావులు, చెరువులు
గొలుసుకట్టు నిర్మాణాలే
వ్యవసాయానికి బాటలు’ అందుకే ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయకు జనం హారతులు పడుతున్నారని కొనియాడారు.
మట్టికి మనిషికి
రైతుకు నేలకు
వూరుకు చెరువుకు వున్న తరతరాల బంధాన్ని కవి చక్కగా ఆవిష్కరించారు. ఇలా..ఊరు చెరువును.. వివిధ కోణాల్లో కవి అభివ్యక్తీకరించారు. చెరువు ప్రాశస్త్యాన్ని వర్ణించే క్రమంలో..కవి ప్రయోగించిన పద బంధాలు, ప్రతీకలు..వర్ణనలు కవితలో అందంగా ఒదిగి పోయాయి!
దీర్ఘ కవితను కవితాత్మకంగా మలచడంలో కవి యొక్క ప్రతిభ కానవస్తోంది. ఈ గ్రంథంకు ముఖచిత్రం నిండు శోభను కూర్చింది. ఈ కవిత ద్వారా చెరువులే మన కల్పతరువులని తేల్చి చెప్పిన కవి వనపట్ల సుబ్బయ్యకు అభినందనలు తెలుపుదాం!

- సాన్వి, కరీంనగర్
సెల్.నం.9440525544

నిర్వహణ : దాస్యం సేనాధిపతి జ్ఘూఒక్ఘౄఒళశ్ఘజ్దూజఔ్ఘఆ్దజ10బఘౄజ.ష్యౄ

సభాపర్వం

తెలంగాణ సారస్వత పరిషత్తు, కరీంనగర్ సాహితీ గౌతమి సంయుక్త నిర్వహణలో కరీంనగర్‌లో ఇటీవల జరిగిన డా. దేవులపల్లి రామానుజరావు శతజయంతి ఉత్సవాల్లో ప్రసంగిస్తున్న తెలంగాణ అధికార
భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకర్‌రావు. వేదికపై ఎడమనుంచి
కె. కిషన్‌రెడ్డి, డా. ఇ. భద్రయ్య,
డా. జి. లక్ష్మణరావు, దాస్యం సేనాధిపతి, డా. ఎన్. భాస్కర్, డా. పి.మోహన్, రామారావు, గాజుల రవీందర్ తదితరులు.

email : merupuknr@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

- గుండు రమణయ్య గౌడ్