ఉత్తర తెలంగాణ

చొక్కారవిందము (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అష్టావక్రుని అన్నయ్య అనిపించుకుంటున్న లెక్చరర్ చొక్కారావుకు అందగాడనిపించుకోవాలని ఆరాటం. స్ట్ఫా రూంలో తోటి లెక్చరర్లు ‘బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికిరావు’ అని గుస గుసలాడుతున్నారు. పెళ్లి చేసుకోవాలని తనకు ఉంది. కానీ తాను మెచ్చిన, తనను మెచ్చిన అమ్మాయి దొరకాలి గదా! ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయిలు మూతులు, ముక్కులు వంకరగా తిప్పేస్తున్నారు. ఎందుకైనా మంచిదని జీన్‌ప్యాంటు, చుక్కల చొక్కా ఇన్‌షర్ట్‌లోకి దిగాడు. కానీ..టూవీలర్ బైక్ డ్రైవింగ్ నేర్చుకోలేదు.
ఓ రోజు అమ్మానాన్నలతో కలిసి ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ కూతురు అరవింద ఇంటికి పెళ్లి చూపులకెళ్లాడు. అరవిరిసిన మందారము లాగున్న అరవింద ‘స్కూటర్ గానీ, బైకు గానీ నడపడం వచ్చా?’ అడిగింది.
‘బైకు డ్రైవింగ్ రాదుగానీ భార్యను పువ్వుల్లో పెట్టి చూసుకోవడం వచ్చు’నన్నాడు. అమ్మాయివాళ్ల నాన్న చెవిలో ఏదో చెప్పింది. ఆయన ‘చొక్కారావు గారూ! ఒక నెలలోపల మీరు బైకు డ్రైవింగ్ నేర్చుకుని వచ్చి మా అమ్మాయిని ఎక్కించుకుని తిరిగొస్తే ఈ పెళ్లి ఓకే’ అని ప్రకటించాడు. దాన్ని ఛాలెంజిగా తీసుకుని తానూ ఓకే అన్నాడు.
కానీ, బైకు కావాలి. దాన్ని నేర్పేవారు కావాలి! రోజూ బైకు మీద ఝుమ్మంటూ కాలేజికొస్తున్న అటెండర్ చలపతి గుర్తుకొచ్చాడు. అతన్ని గట్టిగా పట్టుకుని ‘నీ బైకు మీద గ్రౌండుకు తీసుకెళ్లి నాకు డ్రైవింగ్ నేర్పించు’మన్నాడు. చలపతి ముసిముసిగా నవ్వి ‘నా బైక్ కుదరదు గానీ ఓ కొత్త బైకు కొనెయ్యండి నేర్పేస్తా’నన్నాడు. అదే రోజు బ్యాంకు నుండి క్యాష్ డ్రా చేసి చలపతితో సహా షో రూంకెళ్లి కొత్త బైకు కొనేశాడు.
చలపతి చెవుల పిల్లిలా అటూఇటూ చూసి ‘సారూ! ఏదైనా నేర్పేవాడు గురువు. నేర్చుకునే వాడు శిష్యుడు. మీరు అడ్వాన్సుగా గురుకట్నం సమర్పించుకోండి’ సవినయముగా మనవి చేసుకున్నాడు.
ఓ వెయ్యి రూపాయల నోటుకు రెక్కలొచ్చి చొక్కారావు జేబులోంచి ఎగిరి చలపతి చేతిలో వాలింది. చలపతి మొహం వికసించింది. మర్నాడు ఉదయం చలపతి ఇంటికొచ్చి బైకుతో సహా గ్రౌండుకు తీసుకెళ్లాడు.
మొదటి రోజు థియరీ క్లాసు..బైకునెలా స్టార్ట్ చెయ్యాలి? బ్రేకులెలా వెయ్యాలి? వగైరాలన్నీ బోధించాడు. కురుక్షేత్ర యుద్ధ రంగంలో శ్రీకృష్ణుని గీతాబోధ వింటున్న పార్థుడయ్యాడు. కాస్సేపు. రెండో రోజు.. బైకు ముందు గురువు, వెనక శిష్యుడు.. స్టార్టింగ్, రన్నింగ్, బ్రేకు వెయ్యడం, గేర్లు మార్చడం.. ప్రాక్టికల్ క్లాసు ఫర్వాలేదనిపించింది.
మూడోరోజు ముందు శిష్యుడు, వెనక గురువు అభ్యాసం బాగానే సాగింది గాని ఆఖరుకు ఎదురుగా వస్తున్న లర్నింగ్ బైకును గుద్దేసింది. బైకును ఆటోమేటిగ్గా ఆటోలో మోసుకెళ్లి రిపేరు చేయించాల్సి వచ్చింది. శిష్యుడికి చిన్నపాటి గాయాలైనాయి.
మధ్యలో వారం రోజుల వైద్యం, విశ్రాంతి.
మరో ఐదొందలు గురుకట్నం తర్వాత బైకు కదిలింది.
‘రేపు మీరు స్వయంగా బైకు నడుపుతారు సార్!’ అన్నాడు చలపతి. చొక్కారావు ఊహల ఉయ్యాల లూగాడు..అరవిందతో షికారుకెళ్లొచ్చినట్టు..దివ్యానుభూతి. రెండ్రోజుల అభ్యాసమైంది.
కాస్సేపు గ్రౌండు ప్రాక్టీసు తర్వాత ఆ రోజు శిష్యుడు ముందు, గురువు వెనక రోడ్డుమీదికొచ్చారు. బస్టాండు రోడ్డు మీదుగా క్షేమంగా ఇంటికొచ్చారు. మర్నాడు ఫైనల్..ఎలాంటి డైరెక్షన్ లేకుండా డ్రైవింగ్ వచ్చేసింది. వెయ్యి రూపాయల ఫైనల్ పేమెంటు గురువుకు ముట్టింది. అటెండర్ ద్వారా ఆ విషయం కాలేజిలో ప్రచారమైంది. స్వీటు, ఖారా, కాఫీలతో సరిపెట్టాడు.
ఆ రోజు బైకుమీద కాలేజికెళ్లొచ్చాడు. ఛల్‌మోహన రంగా అనుకుని బైకుమీద అరవింద ఇంటికి బయలుదేరాడు. అంతకుముందే వర్షం పడి ఆగిపోయింది. రోడ్లన్నీ చిత్తడైపోయినై.
చౌరస్తా దాటి చూశాడు. లారీ ఎదురుగా వస్తోంది. గుండెల్లో డప్పులు కొట్టినై. బండి గడగడలాడి నీళ్ల గుంతలో పడేసింది. లారీ తన మానాన తాను వెళ్లిపోయింది. పోలీసులు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పరుగెత్తుకొచ్చారు. ఇన్‌స్పెక్టర్..అరవింద తండ్రి. ఇద్దరు విద్యార్థులొచ్చి బైకును, చొక్కారావును లేపారు. గాయాలేవీ లేవు గానీ, వేషం మారిపోయింది. ‘అయ్యో! మీరా సార్! కొరివి దెయ్యం లాగయ్యారు సార్!’ నోర్లు తెరిచారు స్టూడెంట్స్. వాళ్లు చొక్కారావు శిష్యులు.
ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కింద నుంచి మీద్దాకా చూసి, ‘అరెరే! చొక్కారావు గారా?’ అన్నాడు. చొక్కారావు ఎదపొదలో ఆందోళన. తన ఆశలన్నీ అడియాశలైపోయాయని మొహం కందగడ్డయింది.
ఇన్‌స్పెక్టర్ ఆశ్చర్యంలోంచి తేరుకుని ‘పద మన ఇంటికెళ్దాం’ అన్నాడు. ముందు చొక్కారావు, వెనక ఇన్‌స్పెక్టర్ బైకుమీద వెళ్లారు. ఇన్‌స్పెక్టర్ లోపలికెళ్లి అరవిందను, ఆమె తల్లిని తీసుకొచ్చాడు. వాళ్ల ముందు పరువు పంచనామా ఐపోతుందనుకున్నాడు.
‘అయ్యో! ఎట్లాపడ్డారండీ! అంటూ అరవింద చొక్కారావును లోపలికి తీసుకెళ్లి ప్యాంటు, షర్టు బురద కడిగేసింది. ఇద్దరూ వసారాలోకొచ్చేసరికి గరం ఛాయ తయారుగా ఉంది. ఇన్‌స్పెక్టర్ పక్కన కూచోబెట్టుకుని, ‘చొక్కారావు గారూ! మీ పట్టుదల మా అమ్మాయికి బాగా నచ్చింది’ అన్నాడు. అరవింద బుగ్గలు సిగ్గులు సంతరించుకున్నాయి.

పుస్తక సమీక్ష

పెల్లుబికిన
జ్ఞాపకాల ప్రవాహం!
అతనికి వలపుల కోలాటంతో పాటు... కన్నీటి కొలనులలోని ఆరాటాన్ని కవిత్వంలో బంధించడం తెలుసు! అతని కలం నుండి జాలువారే అక్షరాలకు నక్షత్రాలను మీటటం తెలుసు! అతనికి పూల బాణాలే కాదు..ఆకలి కోణాలూ తెలుసు! ఆయన రచనలు పరిపక్వతకు ప్రతిబింబాలు! రస రమ్య పదాల పొందికకు చిరునామాలు! అతడికి వేడి నిర్పూలతో పాటు..బతుకులకిచ్చే ఓదార్పులూ తెలుసు! ఆయనెవరో కాదు..కవి యకలూరి శ్రీరాములు గారు! వివిధ ప్రక్రియల్లో తన సాహితీ ప్రతిభను ప్రదర్శించి..బహుగ్రంధకర్తగా అందరికీ పరిచయమన్న ఆయన ఇటీవల ‘జ్ఞాపకాల ప్రవాహం’ పేరుతో ఓ గ్రంథాన్ని వెలువరించారు.
ఈ గ్రంథంలో..యక్కలూరి గారు ‘శిలా విలాపం’ కవిత ద్వారా..కళ అంటే నాట్య విన్యాసమనీ..కళంటే చూపుల కోలాటంలో ప్రేమ స్వరూపమనీ..కళ అంటే స్పందించే హృదయమని తేల్చి చెప్పారు.
‘సంపెంగ పువ్వు ఆ సన్నాయి’ కవితలో షెహనాయికా మోహన్ షా తుమ్మెదల ఝంకారాన్ని వింటాము. వెనె్నల సరిగమల్ని వీక్షించగలం! శిలని చలనంగా, చలనాన్ని శిలగా మార్చే శక్తి రాగానికే వుందని తెలుసుకుంటాం. రాగమన్నది ఆనంద భాగ్యాల భాష్పాలతో చెమర్చడానికేననీ గ్రహిస్తాం! ఇలా..ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ గారి సన్నాయి రాగాలను గుర్తు చేశారీ కవితలో..! యక్కలూరి గారు ఆయనకు సన్నాయి సార్వభౌముడిగా పాఠకుల ముందు ఉన్నతంగా నిలిపిన తీరు బాగుంది.
మట్టి మనల్ని మన తల్లుల్ని గన్న మాతృక అనీ..మట్టి మన బ్రతుకుల్ని నీటితో వెలిగించే దీపిక అనీ..మట్టి రేణువు నుంచే మన కణం! మట్టి అణువు నుంచే ప్రతి వస్తువు జననమని ‘్ధర’ణి కవితలో తేల్చి చెప్పారు. నాటికి, నేటికి ఏ నాటికైనా మనకు కావల్సింది భూమేనని ఈ కవితకు చక్కని ముగింపునిచ్చారు.
కర్నూలు ఓ కరువు కోన
కడప ఓ ఎండిన కాన
చిత్తూరు ఓ నెత్తురు కూన
అనంతపురం అట్టకట్టిన ఆకలి పేగుల బాన’ అంటూ..రాయలసీమ వ్యధలను మరో కవితలో ఆవిష్కరించిన తీరు బాగుంది.
‘ఒక పొద్దునే్న’ కవితలో..ప్రభాత వేళలోని కార్యకలాపాలను అక్షరబద్ధం చేశారు. ప్రతీ ఉదయం..ఓ క్రొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుందన్న సంగతిని తెలియజేశారు.
కవి ‘కవితా’, ‘వ్యాస’ ‘కథ’నం రూపంలో వైవిధ్యంగా ‘ఒక మధ్యాహ్నాన్ని’ చిత్రించారు.
ప్రపంచీకరణ నేపథ్యంలో..పల్లెలు కనుమరుగై..మహానగరాలుగా రూపాంతరం చెందడం మూడో ప్రపంచయుద్ధం కాక మరేమవుతుందన్న ఆలోచనను పాఠకులకు ఇంకో కవిత ద్వారా యక్కలూరి గారు కల్పించారు.
‘జ్ఞాపకాల ప్రవాహం’ శీర్షికతో రాసిన ‘కవితా’ ‘వ్యాస’ ‘కథనం’ పాఠకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ప్రతి క్షణం వాస్తవాలతో నిండిన మహేంద్ర జాలమనీ.. అనంత అనుభవాల మయమే కదా! ఈ చిన్ని జీవితమని ఇందులో చక్కగా ప్రస్తావించారు.
గగనంలో వున్నాసరే ఆ పతంగం దారమే దాని ప్రాణాధారం! మనిషి అత్యున్నత ఆకాశాన్ని అందుకున్నా..వాడి బతుకు మెడలో వ్రేలాడే దండగా అనుభవాలు కూర్చుకున్న రంగు రంగుల పూసల దారమనీ.. గత కాలపు క్షణాల్ని గురుతులుగా మననం చేసుకునే మనిహారంగా కవి యక్కలూరి చక్కగా ఆవిష్కరించారు.
అంతేగాక..
ప్రతీ ఒక్కరి జీవితం
నిన్న నేడు రేపులుగా
నిరంతర జ్ఞాపకాల ప్రవాహమని విడమరిచి చెప్పారు. లక్కరాజు దేవి గారి ముందు మాట ఈ గ్రంథానికి నిండు శోభను కూర్చింది.
ఇలా..వైవిధ్య భరితంగా తమ జ్ఞాపకాలను అక్షర మాలగా కూర్చి..మనకు అందించిన యక్కలూరి గారిని అభినందిద్దాం.
- సాన్వి, కరీంనగర్
సెల్.నం.9440525544

మనోగీతికలు
నీ కోసం..!
నేస్తమా!
స్నేహమంటే నీ కనురెప్పల చప్పుళ్లలో..
ఇప్పటికీ నన్ను నేను వెతుక్కుంటున్నా
నీ సహచర్యం గుర్తొస్తే..
నా మదికి సాంత్వననిస్తుంది!
నీ జ్ఞాపకాల వీధుల్లో..
నా మనసు ఇంకా పచార్లు చేస్తూనే వుంది!
ఏటి ఒడ్డున..
నీటి పువ్వులాంటి జీవితాన్ని అందించి
నా గుండె గదుల నిండా..
సూర్యోదయ లాలిత్యంతో పాటు
సూర్యాస్తమయపు సౌందర్యాన్ని నింపావు!
ఒకప్పుడు..
మనం కలిసి గడిపిన క్షణాలు..
ఉవ్వెత్తున ఎగిసిపడే ఆనంద కెరటాలై
ఏ కవీ వర్ణించని..
మధుర స్మృతులుగా..
నా హృదిని సవ్వడి చేస్తున్నాయి!
ఎప్పటికైనా..
కలుస్తావన్న నమ్మకంతో
నీ కోసం.. వేచి చూస్తున్నా!!
- టి.వసంత, నిజామాబాద్
సెల్.నం.8686961611

నువ్వు..!
మిత్రమా!
స్నేహమనే పూదోటలో
విరబూసిన సుమానివి నువ్వు!
అనురాగపు కోవెలలో
మమకారపు వెలుగుల్ని పంచే
జ్యోతివి నువ్వు!
చిరువెనె్నల కాంతితో..
మరుమల్లెల మాటలు పంచే నువ్వు!
సదా ప్రసన్న వదనంతో..
నవ్వుల పువ్వులు పూయించే నువ్వు!
రేపటి వేకువ కోసం..
మదిలో కొలువుదీరి..
మధుర భావాలను పంచుతున్న నువ్వు..
నా మనసంతా ఆవరించి..
గిలిగింతలు పెడుతూ..
కలలోనే నువ్వు కవ్విస్తూ..
ఊహలోకాల్లోకి..
నన్ను లాక్కొని వెళ్లడం భావ్యమా!
- కోరుకంటి శశికిరణ్మయి
కరీంనగర్,
సెల్.నం.9440287740
ఆడపడుచు
భారతావని ఆడపడుచు
అన్నింటా ముందునడుచు
అందరికీ ఆనందాన్ని పంచు!
సృష్టికి మూలమై..
ఇంటింటా ప్రేమజ్యోతిని వెలిగించు!
ప్రకృతిలోని అందాలను
రంగవల్లిగా మార్చి
మన ముంగిట్లో నిలుపు!
భువినున్న జగన్మాతను
బతుకమ్మగా మార్చి ఇలకు దింపు!
మన ఆశయాల జెండాతో..
అంతరిక్షంలోకి పయనించు!
అలాంటి ఆమె రక్షణకా నిర్భయ చట్టం?
మగాడ్ని కన్నదీ తనేనని
సహించింది కానీ..
శత్రువుగా క్షణం తలంచినా
సడిచేయని సముద్రం
సునామీకి సూచనైనట్లు
అణచబడిన ఆడది
అంతానికే మూలవౌతుంది సుమా!
- ఎన్.హరిప్రియా గిరిధర్ రావు
కరీంనగర్, సెల్.నం.9133293384

రేపటి ఆశకు!
చీకటి పురుడు పోసిన
ఆ చెట్టుకింద వృద్ధుడు
రాలుతున్న చివరి ఆకులా నిల్చున్నాడు!
భ్రమ విభ్రమల బతుకుబండిలో
గమ్యస్థానంకై నిరీక్షిస్తూ..
అనంత దుఃఖపు గొంగడిని
ఒంటినిండా కప్పుకొని
ఘనీభవించిన శోకమూర్తిగా..
లిప్తపాటు ఘడియలో
తలకిందైన జీవన క్షణాల్ని
కనుకొలుకుల్లో
గతం చేదుకుంటున్నాడు!
కాళరాత్రి మిగిల్చిన
కన్నీటి చారికగా
శిథిలవనంలో ఓ ముదుసలి!
సర్వమూ త్యజించిన శాపగ్రస్థ!
ఎదిగీ ఎదగని వారసత్వాన్ని
జోలెలో వేసుకొని భవిష్యత్తుకేసి
బెంగగా చూస్తున్న శేష ప్రశ్నల వంతెనపై
మోయలేని బతుకుముల్లెగా..ఆమె!
గ్రహణం కమ్ముకుంటున్న నేలలపై
ఫెటీల్మని విరుచుకుపడుతున్న
అదృశ్య రక్కసి!
చిగురించిన వసంతాన్ని
అలుముకున్న ఆ వృద్ధులు..
తడిగాయాల ధ్యానముద్రలు!
తలరాతల తప్పొప్పుల్లో తడబడకుండా
బతుకుసవారీపై ఆఖరి పోరుకు మళ్లీ..
సన్నద్ధమవుతున్న
అలుపెరుగని మలిసంధ్యకు..
ఇదొక కొత్త మజిలీ!
ఐనా..ఓడిపోనివ్వనంటున్న
ఆ గుండె ఊటలోని తొణకని జీవరసం!
కొన్ని బాధామయ సందర్భాల్లో
రాలుతున్న చిటికెడు
చితాభస్మమూర్తులు వీరే!
రేపటి ఆశకు పదును పెడుతూ
కాలాన్ని అధిగమించిన అద్భుత చిత్రాల
ఆవిష్కర్తలూ వీరే!!
- బి.కళాగోపాల్, నిజామాబాద్
సెల్.నం.9441631029

ధర్మబద్ధంగా వుంటూ..

ఎందుకు వస్తున్నాయి ఈ ప్రళయాలు?
ఏమై పోతున్నాయి ఈ ప్రపంచాలు?
ఒకచోట అతివృష్టి మరొకచోట అనావృష్టి
ప్రళయతాండవం చేస్తూ, పకపక నవ్వింది భూమాత!
వికటాట్టహాసం చేస్తూ విరుచుకపడింది ప్రకృతి మాత!
సాగర గర్భాన బడబాగ్ని పుట్టింది, ఉగ్రరూపంగా అది ముందుకే ఉరికింది!
ఏమై పోతున్నాయి ఈ ప్రపంచాలు
నరమేధం జరుగుతుంది,
బలవుతున్నాయి మానవ జీవితాలు
కన్నవారినే మరిచారు, కన్న పేగునే కాల్చారు!
వావివరసలు మరిచారు, అరాచకాలే చేశారు!
నిర్భయలు పెరిగారు,
మదర్ థెరిస్సాలు తగ్గారు!
కరుడు కట్టిన రాక్షసులు
కాని పనులే చేశారు!
అందుకే ఈ ప్రళయాలు!
అందుకే ఈ కరువు కాటకాలు
అందుకే విరుచుకపడుతున్నాయి పంచభూతాలు!
మంచి, మానవత్వంతో మెదులుదాం
ధర్మబద్ధంగా వుంటూ
పంచభూతాల దీవెనలు పొందుదాం!
- చిలుకమర్రి విజయలక్ష్మి
ఇటిక్యాల, సెల్.నం.9493210293

అవినాభావం!
నింగిలోని చంద్రునికి
నీటిలోని కలువకు
పరుగులిడే సముద్రానికి
పడిలేచే కెరటానికి
పాటలోకి పల్లవికి
అది పాడే రాగానికి
ఆలయంలోని శిల్పానికి
అందులోని గోపురానికి
మండే సూర్యునికి
వేడిని పంచే కిరణానికి
మధ్యన..
ఎలాంటి సంబంధం లేకున్నా..
వాటి మధ్య రసరమ్యంగా ఉండే
అవినాభావ సంబంధంతో
అవి ఏ నాటికీ వీడిపోవు!
- పోపూరి మాధవీలత
భాగ్యనగర్, సెల్.నం.8125115667

తడి ఆరని బతుకు !
అతడు నిత్యం భుజాలపై
బతుకు బరువును మోసే క్రీస్తు
బీడువారిన పొలాన్ని
ఆకుపచ్చని చందమామను చేసే
పత్రహరితం
కన్నీరింకిన పొలంలో
పన్నీరును చిలికించే అభయహస్తం
తడి ఆరని భూమి దేహానికి
దాహార్తిని తీర్చే ఒయాసిస్సు
పగుళ్లిచిన పొలానికి
పొడరసమై ప్రవహించే జలపాతం !

ఆకలితో అలమటించే
జనావళికి దాహం తీర్చే అన్నదాత వాడు
కల్పతరువుగా మార్చినవాడు
అకుపచ్చని లోకంలో
చెమటముత్యమై మెరిసేవాడు
ఆకలి సమాజానికి అనునిత్యం
అన్నంముద్ద పెట్టేవాడు
గింజగింజపై తన పేరుండే రైతన్న
వాన చినుకు కోసం
ఆత్రంగా చూస్తాడు వాడిపుడు

బీడై పగుళ్లిచ్చాడు
బతుకుబరువై బక్కచిక్కాడు
ఎడారైన పొలంలో
తన పాదముద్రలను స్వప్నిస్తున్నాడు
ఎండిన పంటను చూసి మట్టి విత్తనాలను కావలించుకుంటున్నాడు
మట్టిని మాణిఖ్యం చేసివాడు
మరణశాసనాన్ని లిఖిస్తున్నాడువాడు

అతివృష్టిలో- అనావృష్టి
అనావృష్టిలో -కర్మిష్టి

వాడికిపుడు
ఓదార్పుకాదు ఆసరాకావాలి
ఎండిన పంటకు గిట్టుబాటు కావాలి
రైతేరాజని నాగళ్లు నవ్వాలి
రైతేరాజని నాగళ్లు నవ్వాలి
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

ప్రేమ వల
ప్రేమంటే చెలగాటం నీకు
ప్రేమంటే ప్రాణ సంకటం నాకు
చూడ్డానికి అందంగానే ఉన్నావు
సూదంటు రాయిలా ఇట్టే ఆకర్షించగలవు!
నీ సరదాల కోసం, సంతోషాల కోసం
ఎంత మంది యువకులకు పిచ్చెక్కించావో!
నీ వెంట తిప్పుకుని లూటీ చేశావో!
పాపం నీ మాయలో పడిన వాళ్లను చూస్తుంటే
తెగ జాలి వేస్తుంది సుమా!
నీపై చచ్చేంత కోపం వస్తుంది కూడా
ఇప్పుడు ప్రేమవలను
నాపై విసరాలనుకున్నావు
నన్నూ పిచ్చి వాళ్లలో ఒకనిగా
చేయాలనుకున్నావు
నీ విషయం తెలిసి జాగ్రత్తపడ్డాను
నీ వలలో పడకుండా తప్పించుకున్నాను
ఎ (ఇ)ప్పటికైనా నీకు
ఎదురుదెబ్బ తగలడం ఖాయం
అప్పుడెవరూ మాన్పలేరు
నీ గాయాన్ని
- గరిశకుర్తి రాజేంద్ర
కామారెడ్డి
సెల్.నం.9493702652

తెరచాపనవుతా!

నేస్తమా!
నువు నడి సంద్రాన లేవు!
ఎడారి బాటలో అసలే లేవు!
నా హృదిలోనే..
కొలువు దీరావు!
ఒక సెకను
ఒక నిమిషం
ఒక గంట
ఒక రోజు
ఒక వత్సర కాలం పాటు
మాత్రమే ఉండేది కాదు..
నీ స్నేహం!
సదా గుండె లోతుల్లో
పంటి బిగువున
కంటి పాపలో
కనురెప్పల మాటున
నను కంటికి రెప్పలా
చూసుకుంటుంది నీ స్నేహం!
కలిమి లేములలో
మనల్ని కలిపి వుంచుతూ..
సుఖ దుఃఖాల్లో...
పెనవేసుకునే మన స్నేహం
అందరికీ ఆదర్శం!
నీ రాకతో..
నా వేదన ఆమడ దూరం పరుగు!
నీ ఆత్మీయతతో..స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరే పక్షిలా
అనుక్షణం ఆనందంగా ఉంటా!
వెనె్నల లాంటి చల్లదనమున్న
నీ మనసుకు..
చుక్కానిలా ఉన్న మన స్నేహబంధానికి
తెరచాపనవుతా!
నీ చెంత వున్నంత సేపు..
సాంత్వన నొందుతూ...
ప్రపంచానే్న మరిచిపోతా!!
- ఎ.అనిత
రాంనగర్, సెల్.నం.9014894141

జాతర
జాతరంటే జాతర
మేడారం జాతర
యెల్లక్క మల్లక్క
సంటోళ్లను పట్టుకొని
సంకన మూటెట్టుకొని
కిక్కిరిసిన బస్సెక్కి
తొక్కిసలాటల కోర్చి
బయట బస్సుదిగినారు
జలకమాడ పూనినారు
మెరుపు గుండు కొట్టించి
గద్దెల కడ కేగినారు
సారక్కను సమ్మక్కను
కోర్కెలెన్నో కోరినారు
కోళ్లను ఎగరేసినారు
ఆటబొమ్మలెన్నో కొని
సంటోళ్లకు ఇచ్చినారు
బ్రతుకు బాగుండాలని
బంగారం పంచినారు
సమ్మక్క సారక్క
అడవిలోకి పోగానే
ఇంటిదారి పట్టినారు
ఇల్లు మళ్లీ చేరినారు
తామంతా బాగుంటే
కలతలేవి లేకుంటే
రెండేళ్లకు ఒక్కసారి
మ్రొక్కు తీర్చుకుంటామని
మోదముతో చెప్పినారు
సమ్మక్క-సారక్కా
వెళ్లి రావమ్మా -
మళ్లీ రావమ్మా
- కొక్కొండ శ్రీహరి
సెల్.నం.9948539214

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.
merupuknr@andhrabhoomi.net

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్.
merupuknr@andhrabhoomi.net

- ఐతా చంద్రయ్య సిద్దిపేట, మెదక్ జిల్లా సెల్.నం.9391205299