నెల్లూరు

మెరుపు - నెల్లూరు : రేపటి మనుషులు కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేపటి మనుషులు

కథ

కెవ్వుమని కేక వినిపించేసరికి ఆ మైదానంలో ఆడుకుంటున్నక పిల్లలందరూ ఒక్కసారిగా అరచిన వాడివైపు చూశారు. అందరితోపాటు వారిలో ఎంకటేశు, మల్లికార్జున కూడా ఉన్నారు. ఆరోజు ఆదివారం కావడంవల్ల పిల్లలందరూ కలసి ఊరికి కొంచెం దగ్గరలోవున్న మైదానంలో ఆడుకుంటున్నారు. ఆ పిల్లవాడు ఎందుకు అరిచాడా అని అందరిలో తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది. బంతికోసం వెళ్లిన పిల్లోడు ఎందుకంతలా అరిచాడని చూస్తున్నారు. వారిలో ఒకడు ‘ఒరే! శీనుగా! ఏమైందిరా? అట్టా అరిసినావు’ అని అడిగినాడు. శీనుగాడికేమో నోటినుండి మాట రావడంలేదు. తల కూడా అటూ ఇటూ తిప్పడంలేదు. ఒళ్ళంతా పొదురుపుట్టి గజగజ వణుకుతున్నాడు. నోట్లో చెమ్మకూడా లేదు. అప్పుడే ఆ గుబురులోంచి నున్నగా తళతళ మెరుస్తూ బారడు పొడుగున్న పాము కనిపించింది. దాన్ని చూసి ఎక్కడివాళ్లు అక్కడ పారిపోయినారు. ఇక ఆరోజు ఆటకట్టు.
ఈ సంఘటన జరిగింది కృష్ణాపురం అనే గ్రామంలో. ఆ గ్రామంలోనే ఎంకటేశు, శంకరం అని ఇద్దరున్నారు. ఎంకటేసేమో కూలీనాలీ చేసుకుని బతికేవాడు. శంకరం చిల్లర దుకాణం పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు. ఈ ఎంకటేసు, శంకరానికి బడంటో ఎట్టా ఉంటది, అచ్చిరాలు ఎట్రాయాలో గూడా తెలీదు. వీళ్ళు బంధువులు గానీ, స్నేహితులుగానీ కాదు. ఒకే ఊరు కావడంవల్ల కనిపించినప్పుడు మాత్రం పలకరించుకుని, ఎవరిదారిన వాళ్ళు వెళ్ళేవారు.
కొంతకాలం గడిచింతర్వాత ఎంకటేసు తన కొడుకు మల్లికార్జున్ని ఆ ఊళ్ళో ఉండే వీధి బడిలో చేర్పించినాడు. అదేవిధంగా శంకరం కూడా తన కొడుకు దివాకర్‌ను పట్నంలో ఇంగిలీషు చెప్పే బళ్ళో చేర్పించినాడు. ఈ పిల్లకాయలిద్దరూ పెరిగి పెద్దవారవుతా ఉంటారు. ఎంకటేసు, శంకరం కూడా ఎప్పుడన్నా ఎదురుపడితే ఇంతకుముందు మామూలుగా పలకరించుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లకాయల సదువుల గురించి మాట్లాడుకుంటున్నారు.
పిల్లకాయలు గూడా సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు అమ్మానాయన్లకు సదువుల గురించి, మారుతున్న కాల పరిస్థితుల గురించి అప్పుడప్పుడూ సెపతా వుండేవోళ్ళు. ఎంకటేసు కొడుకు మల్లికార్జున, శంకరం కొడుకు దివాకరు ఈళ్ళిద్దరు కూడా సెలవుల్లో క్రికెట్ ఆడేకాడ స్నేహితులయ్యారు. మల్లికార్జునను వాళ్ళూర్లో బడిలోవుండే వాళ్ళలో బాగా సదివేవోడు, మంచి పిల్లగాడని అందరూ మెచ్చుకునే వోళ్ళు. దివాకర్ కూడా మంచి పిల్లోడే, కానీ ఊళ్ళో నుంచి పట్నానికి బొయ్యేటప్పుడు, వాళ్ళ బళ్ళో పెద్ద పిల్లకాయల, కొంటె పిల్లకాయల పరిచయం వల్ల పిల్లోడి ఆలోచనల్లో తేడా వచ్చింది.
మల్లికార్జున సదివేది గవర్నమెంటు బడికావడంవల్ల సదువుతోపాటు ఆటలు, పాటలు, చిత్రలేఖనం వంటి విషయాల్లో పాల్గొనడం వల్ల పిల్లోడు శారీరకంగా, మానసికంగా బాగున్నాడు. ఇక దివాకరం విషయానికొస్తే మంచివాడు కాస్త సావాసాల వలనైతేనేమి, శారీరక శ్రమ లేకపోవడం వలన మానసికంగా, శారీరకంగా ఎదుగుదల లోపించింది.
ఇలా కొంతకాలం గడిచింది. ఎవురు ఎట్టా సదివినా పిల్లకాయలేమో పెద్ద సదువులు సదవతా వుండారు. ఊళ్ళోజూస్తే వానలు కురవక, పైర్లు పండక పాపం ఎంకటేశం ఆర్థికంగా ఇబ్బందులు బడ్తావుండాదు. అయితే పిల్లగాడి సదువు విషయంలో ఎప్పుడు కూడా ఎనకడుగు వెయ్యలేదు. అప్పుడప్పుడూ మల్లికార్జునతో ‘‘ఒరే మల్లిగా! మేం సదువుకోక, ఇట్టా మట్టి పిసుక్కొని బతకతా వున్నాం, నువ్వన్నా బాగా సదువుకొని మాలాగా ఎర్రటెండలో కాయకష్టం చెయ్యకుండా నీడపట్న బతకడానికి కష్టపడి సదువుకొని, మంచి ఉజ్జోగం తెచ్చుకొని సుఖపడరా!’’ అని సెపతా వుండేవోడు. ఆ మాటలు, అమ్మా నాయనా పడే కష్టాన్ని గూడా మల్లికార్జున గమనిస్తా వుండేవోడు.
అటుజూస్తే దివాకరు పరిస్థితి కొంచెం తారుమారయింది. సదువులో ఎనకబడ్డాడు. ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. కొడుకు విషయం ఆనోటా ఈనోటా శంకరానికి కూడా తెలిసింది. కొడుకు బాగుపడే మార్గం ఏమిటా అని ఆలోచనలో పడ్డాడు. శంకరం ఇలా సతమతమవతావుంటే భార్య పార్వతమ్మ ‘‘ఏందయ్యా అట్టా దిగులుగా కూసోవుండావే’’ అని అడిగింది. కొడుకు సంగతి సెపితే తల్లి మనసు బాధపడుతుంది, దిగులుపడుతుందని, ఆ బాధ ఏదో మనమే భరిస్తామని, బాధను దిగమింగి బయటపడకుండా ఏదో సెప్పి దాటేశాడు. శంకరం చిన్నప్పటినుంచి వ్యాపారం ద్వారా పది రూపాయలు ఎనకేసుకుని స్థిమితంగా ఉండాడు. ఖర్చయినా ఫరవాలేదు కొడుకును బాగుపర్చాలనే నిర్ణయానికొచ్చాడు. తన కొడుకును గురించి మద్రాసు వున్న దూరపు బంధువు బాబూరావనే అతనికి సెప్పి సూసినాడు. బాబూరావు, శంకరంను ‘‘ ఏందబ్బాయా! సంగతి, పిలగాడ్ని గురించేనా? నువ్వు దిగులుపడబాక, మంచి డాక్టరుకు చూపించి, లేదా ఏదో ఒకటి చేసి మీవాడిని మంచిదార్లో పెడదాంలే’’ అని ఓదార్చినాడు.
ఇలా కొంతకాలం గడిచింది. ఎంకటేశం కొడుకు మల్లికార్జున బాగా చదివి, సమాజంలో నేడు పేరున్న ఉద్యోగాల్లో ఒకటైన ఇంజనీరింగ్ చదువు చదివి, మంచి పేరున్న కంపెనీలో ఉద్యోగం సంపాదించి, ఐదంకెల జీతంతో జీవితంలో స్థిరపడ్డాడు. ఇటు శంకరం కొడుకు దివాకరం పరిస్థితి ముందు వెనుకగా వుంది. శంకరం తన ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. మద్రాసులో వున్న బంధువు బాబూరావు, శంకరం కొడుకు దివాకర్ విషయాన్ని తన కొడుకులకు చెప్పగా, వారిలో ఒకడు రోబో టెక్నాలజీపై పరిశోధన చేస్తున్నాడు. అతని పేరు ఆనంద్. నాన్నగారు చెప్పిన సమస్యవిని ఆనంద్‌కు ఒక ఆలోచన వచ్చింది. రోబోకు మెమరీ తయారుచేసి మనిషిలా ఆలోచించే పరిజ్ఞానం ఉందికదా! మరి ఇలాంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి దివాకర్ జీవితాన్ని ఎందుకు బాగుచేయకూడదు అని ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా పలు రంగాలకు చెందిన విజ్ఞాన, పరిజ్ఞానాలను క్రోడీకరించి ఒక చిప్‌ను తయారుచేసి, దానిని మానవ శరీరానికి అనుసంధానం చేస్తే ఎలా వుంటుందనే ఆలోచన వచ్చి, కొన్ని సమస్యలను ఎదుర్కొని, చివరకు ఎలాగైతేనేమి ఆ చిప్‌ను దివాకర్ శరీరానికి, మెదడుకు అనుసంధానించాడు.
ఇక జూస్కో నాసామిరంగా, దివాకర్ పరిస్థితిలో మార్పే.. మార్పు. తాను పట్టిందల్లా బంగారం. ఏ ఉద్యోగానికి వెళ్ళినా వెనుకడుగే లేదు. కొడుకు పరిస్థితి మెరుగవడం చూసిన శంకరం ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. తన కుమారుని జీవితం బాగుపడడానికి కారకులైన బాబూరావుగారికి, ఆయన కుమారుడు ఆనంద్‌గారికి హృదయపూర్వక ధన్యవాదములను ఆర్పించాడు. అటు బాబూరావు తన కొడుకు సాధించిన ఈ ఘనతను గూర్చి ‘‘ ఔరా! సాంకేతికత ఎంత దూరం ఎదిగింది.
మనిషి తన మెదడుతో పనిలేకుండా, అంతకంటే వేయి రెట్లు అధిక వేగంతో సమస్యలను తొలగించగల శక్తిని మనిషి సాధించాడు. సృష్టికర్త బ్రహ్మ మనిషిని సృష్టిస్తే, ఆ మనిషిని తలదనే్న మరమనిషి లాంటి మనిషి, తన ఆలోచనలతో పనిలేని మనిషిని అపర బ్రహ్మలైన శాస్తవ్రేత్తలు సృష్టిస్తున్నారు గదా’’ అని ఆశ్చర్యపడ్డాడు. తన కుమారుడి శాస్త్ర పరిజ్ఞానాన్ని ప్రజలు వేనోళ్ళ పొగుడుతూ వుంటే పుత్రోత్సాహము తండ్రికి... పద్యాన్ని గుర్తుచేసుకొని లోలోన మురిసిపోయాడు బాబూరావు.

- ఆడేరు చెంచయ్య
నాయుడుపేట, చరవాణి: 9492331449

శివరాత్రి సందర్భంగా

జయజయ
మహాదేవ శంభో!
ఓంకార నాద స్వరూపా
శివలింగ రూపా
భస్మాంగ లేపితా
నాగాభరణా
చంద్రవౌళీ
సర్వలోక వందితా
పాహిమాం..పాహి...

బ్రహ్మ, విష్ణువులు
నీదు ఆది అంతములు జూడ
దేవతాదులు కుతూహలపడ
గంభీరమగు నీ లింగోద్భవంబు జేసి
శివరాత్రి పర్వదినాన జనులను మెప్పించితివి
హరా! శంకరా! అభయంకరా!
పాహిమాం..పాహి.
ఆకులలములకే (పత్రి) ఆనందబడు
నీ తనయుడు (గణపతి)
ఆభరణాలంకారములకే సంతసించు
శ్రీమహావిష్ణువు
గంగోదకములకే మురిసిపోవుదువు నీవు
గంగాధరా.
మారేడు, నేరేడు, నారికేళ సవిలములకే నీవు
భళా! భళాయని పొంగిపోవు
బోళా శంకరుడవు నీవు
త్రిలోచనా, త్రిశూలధారి పాహిమాం.. పాహి.
కాశీలోన విశే్వశ్వరుడవై
శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరుడవై
శ్రీశైలమున బ్రమరాంబికా మలికార్జునడవై
కృష్ణాగోదావరీ తీరాల పంచారామాల శివుడవై
భారతావనిలో ద్వాదశ జ్యోతిర్లింగములై
జనుల కోరికలు తీర్చు భక్త శంకరా పాహిమాం..పాహి!
కాళము - హస్తి - సాలె పురుగులకెల్ల మోక్షమిచ్చి
తిన్నడు, గొడగూచి, శిరియాళ గుణనిధి బెజ్జ
మహాదేవులకెల్ల్ల సాయుజ్యమిచ్చి
రావణ, బాణాసురులకెల్ల ఆరాధ్యదైవమై
దేవతలు, రాక్షసులు, మానవులు, ఋషులకెల్ల
కోరి కొలిచిన వారికెల్ల కొంగుబంగారమై
వరాలిచ్చిన
గౌరిసుధా, సాంబశివా, కైలాసనాథా పాహి..పాహి.
చేతులారంగ పూజించు నిన్ను
శుభాలన్నియు పడయునటుల
జగములోని వారికెల్ల సుఖములనిమ్ము
శివ అను శబ్దమున మంగళములనిమ్ము
గంగాధరా, జటాఝాటధారి, కపాలధారి పాహి.. పాహి..!

- లక్కరాజు శ్రీనివాసరావు
ఆర్టీసీకాలనీ, అద్దంకి
98491 66951

ఏది నిజం? ఏది నిజం?
ఓ నిరాకార నిరంజనా?
వేదాల ఈశ్వరవాదం
శంకరుని మిద్యావాదం
ఖయూం రసవాదం
గీతాకారుని పునరపి జననం
బైబిల్ తీర్పు రోజు
ఖురాన్ ప్యారీ స్వర్గం
ఎవరో చెప్పిన ఇవల్యూషన్
మరెవరో చెప్పిన రెవల్యూషన్
ఎన్నో సిద్ధాంతాలు
రాద్ధాంతాలు చేస్తున్నాయి
అన్నీ నువ్వేనంటూ..
ఏది నిజం? ఏది నిజం?
విరక్తి చెందిన వేదాంతీ
విసుగెత్తిన భక్తుడూ
గతి లేక చితికిపోయిన జీవాలు
నినే్న నిందిస్తున్నాయి
నీవైపే చూస్తున్నాయి
దీనంగా, బలహీనంగా
అవతారానికీ, అవతారానికీ మధ్య
నీ చిరునామా చెప్పవు
ఎంతకాలమిలా దాక్కుంటావు?
దూరాన పడవేసిన
గ్రహాంతర మానవులంతా
ఏనాటికైనా కలుసుకుంటే..
సత్యశాంతి స్వరూపుడవూ
ధర్మపరిరక్షకుడవైతే..
నీ సృష్టిలో అసత్యాధర్మాదులకు
ఉల్లోల కల్లోలాలకు
అతినాథుడు ఎవరు?
మారణహోమాలు
దారుణకృత్యాలు
ఈ విలయ వికటాట్టహాస
ప్రచలిత ప్రపంచాన్ని చూస్తే
నీకు సంతోషమా ప్రభూ!
మానవ జగతికి, ప్రగతికి
నీవే శక్తి,
ముక్తి అంటాడు భక్తుడు
గ్రహాలంటాడు జ్యోతిష్కుడు
కర్మంటాడు మీమాంసకుడు
ఇందేది నిజం?
విశ్వజననీ మానవ ధర్మాన్ని
సర్వసౌఖ్య మానవ గమ్యాన్ని
ఒకే ఒకటి సృష్టించకూడదా?
విశ్వ నియంతా!
ఫలపత్ర పుష్పతోయాదులతో
అర్చనా, ఆరాధనా
జరగదనీ..
రాతిగుళ్లకు
విలువ వుండదని భయమా?
లీలామానుషా?!

- కె.వి.నాగేశ్వరరావు
చరవాణి : 9963662699

అన్నీ మా కోసమేనా శివా..!
అన్నపూర్ణను అంటిపెట్టుకుని ఆదిభిక్షువయినావు
అందరికి సరికన్నులిచ్చి బేసి
కన్నులుంచుకున్నావు
అమృతము అందరికి చేర్చి
హాలాహలమే చాలన్నావు
సువాసన భరిత సుగంధము మాకిచ్చి
సుద్దవిభూతి చాలన్నావు
స్వర్ణ్భారణములు మాకిచ్చి నీవు
నాగాభరుణుడవయినావు
మల్లెపూలు మాకిచ్చి తుమ్మిపూలు చాలన్నావు
స్వర్ణమయలంక రావణునికిచ్చి స్వయంగా
శ్మశానవాసివయినావు
చీనీ చీనాంబరములు మాకిచ్చి
అంగమొల వేల్పువయినావు
ఆకారములు మాకిచ్చి నిర్మల
నిరాకరుడవయినావు
భోగభాగ్యములు మాకిచ్చి
భూతగణనాథుడవయినావు..!

- వేదగిరి రామకృష్ణ, నెల్లూరు

మనో గీతికలు

తీరని ఋణం
భువనైక సౌందర్యంతో
విశ్వమోహన పరిమళాలు వెదజల్లే
సుందర సుకుమార పుష్పాలు
తనువులు అతి తేలికగా వున్నా
బాధ్యతల బరువును మోస్తున్నాయి
మనిషి పుట్టుక నుండి మరణం వరకు
పూలతో వున్న అనుబంధం అపురూపం
ప్రతిరోజూ వేల పుష్పరాసులు
ఆ దేవదేవుని పాదాలకు ప్రణమిల్లుతాయి
దేవేరికి సుమంగళి శోభను కలిగిస్తాయి
గుమ్మానికి పచ్చాకు కట్టి
గడపకు పసుపు రాసినప్పుడల్లా
పూల ముతె్తైదువలు తరలిరావలసిందే,
అమ్మాయికి పెరిగిన కొద్దీ పూలతో చెలిమి
ఆత్మీయంగా పెనవేసుకుపోతుంది
ముంగిట పచ్చని పందిరి వేసినా
పట్టుచీరల పడతులందరికీ
పూలమాలల ముస్తాబు కావలసిందే
కొత్త పెళ్లికూతురు పూలజడ
కోటి కోర్కెలతో కళకళలాడుతుంది
శోభనపురాత్రిని మధురరాత్రిగా మలచేందుకు
పూలబాసలు ఎదురుచూస్తాయి
అత్తారింటికి పయనమయ్యే కోడలమ్మతో
పుట్టింటి పూలసారె పయనమవుతుంది
కడుపుపండి ఒడి నిండిన సమయాన
వుయ్యాలకు పూలు పందిరవుతాయి
ఆత్మీయతనే కాక ఆత్మారణకూ
ముందుంటాయి ఈ పూలదేవతలు!
తనువు చాలించిన మనిషికి
చివరి వరకు తోడుగా నిలబడి
మరుభూమికి సైతం తరలిపోతాయి
ఏమిచ్చి ఈ పూల ఋణం తీర్చుకోగలం?

- పాతూరి అన్నపూర్ణ, నెల్లూరు, చరవాణి : 9490230939

కర్తవ్యం
పుట్టావ్...గిట్టావ్
కాలావ్..బూడిదగా మారావ్
మధ్యలో నువ్వు
సాధించేముంది!
జీవితం బూడిద కాదు
బూరుగదూదీ కాదు
వెలిగి ఆరిపోయే లోపల
కాసింత మంచిని
పదుగురికీ పంచు
మనిషితనాన్ని పెంచు
మనీషివై తరించు

- ఎం వి ఎస్ శాస్ర్తీ
కొత్తపేట, ఒంగోలు
చరవాణి : 9948409528

స్పందన

అందమైన కలలా సాగిన
నాకొక వరం కావాలి
అందమైన ఊహకు రూపం పోస్తే ఎలాంటి అద్భుతమైన దృశ్యం ఆవిష్కరింపబడుతుందో అలా సాగింది నాకొక వరం కావాలి కథ. నిజంగా కథలోని ఉష ఎంత చక్కని కల కనింది. నిజంగా ఇంత అందమైన జీవితం పొందాలన్నా ఎంతో అదృష్టం చేసుకుని వుండాలి. చక్కని పల్లెటూరి వాతావరం, వ్యవసాయం చేసే భర్త, బృందావనం లాంటి ఇల్లు, అల్లరి చేసే పిల్లలు ఇంతకంటే ఏం కావాలి గృహిణికి. కథ చదువుతున్నంత సేపూ మనసుకు హాయిగా ఉంది. అయితే ఇది కథ కాదు కల అని తెలిసిన తరువాత ఆమెకు ఇలాంటి జీవితం వచ్చే జన్మలోనైనా దొరకాలని మనసారా కోరుకున్నా. అలాగే ప్రస్తుత సమాజంలో జరిగే మార్పులతో ఎత్తిచూపుతూ మంచి కథను అందించిన రచయిత్రి అనురాధ రామకృష్ణ గారికి కృతజ్ఞతలు
- పసుపులేటి హైమావతి, తిరుపతి
- రాయపు శంకరయ్య, కోవూరు
- పమిడి రవికుమార్‌చౌదరి, నెల్లూరు

బఫే మీల్స్
ప్రస్తుతం శుభకార్యాల్లో జరిగే ప్రధాన ఘట్టం బఫేమీల్స్. ఈ మీల్స్‌పై తన బాధను వెళ్లగక్కిన రచయిత జ్వాలా ఉమామహేశ్వరశర్మగారికి మొదటగా నమస్కారములు. అసలు పెళ్లి అంటే ఓ మహత్కార్యం. అందులో విందు భోజనం అంటే ఇక చెప్పక్కర్లేదు. చక్కగా చలువ పందిళ్లలో బంతిలో కూర్చుని అరటి ఆకుల్లో భోజనం చేస్తే కలిగే ఆనందం వర్ణించలేం. కానీ నేడు ఈ పనికిమాలిన బఫేమీల్స్ అనాటి ఆనందాన్ని కోల్పోయాం. కవితలో వాడిన ప్రతి పదం, వాక్యం ఆలోచింపదగినది. ముఖ్యంగా చెప్పుల్లో కాళ్లుపెట్టి, చెతిలో బొచ్చ పెట్టి,ప్లేట్లో చెంచాలెట్టి, టివిల్లో కళ్లుపెట్టి అటూ ఇటూ తిరుగుతూ తినే బఫేమీల్స్ అంటూ సాగిన వాక్యాల్లో ప్రతి పదం మనం ఎటువెళ్తున్నామో చెబుతోంది. పాతను ఆచరిస్తే మిగిలేను ఎంతో ధనం..మానం మారితే ఘనం.
- మంత్రి ఉమామహేశ్వరరావు, నెల్లూరు
- అల్లు భార్గవి, కనిగిరి

ఇలా బ్రతికితే
ఎంత బాగుంటుంది
గత వారం మెరుపులో ప్రచురితమైన ఇలా బ్రతికి చూడు కవిత వాస్తవానికి దగ్గరగా ఆలోచింపజేసింది. మనిషి ఇలా బతికితే ఏమవుతుంది.. ఎంత బాగుంటుంది అంటూ రాసిన తీరు బాగుంది. ‘‘ఒడిదుడుకులకు వెరవకు, కడగండ్లకు చెదరకు, కలసిరాలేదని కుమలకు, చిత్తశుద్ధి ఉంటే నీ చేతలలో గెలుపు పడిగాపులుకాస్తుంది నీ గుమ్మంలో, నీ గమ్యంలో.. ఇలా సాగి చూడు ఏమవుతుంది బ్రతుకు నీదవుతుంది’’ అంటూ రాసిన చివరి నాలుగులైన్లు కవితకు ప్రాణం పోశాయి. హేట్సాప్ బాలు గారు.
- పీసుపాటి సాయిబాబు,
జానకిరాంపేట,గూడూరు
- చిరువేళ్ల కృష్ణమోహన్, సంగీతకళాశాల, నెల్లూరు.
===========
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882
merupunlr@andhrabhoomi.net