నెల్లూరు

యుద్ధ శాంతి (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘శాంతి అంటే యేమిటి’’ అంటే ‘‘యుద్ధానికి యుద్ధానికి మధ్య ఉండేది శాంతి’’ అన్నాడట ఒక పెద్దాయన. యుద్ధాలు అనేవి రెండు దేశాల మధ్య కాని, రెండు జాతుల మధ్య కాని, రెండు కుటుంబాల మధ్య కాని, ఇద్దరు వ్యక్తుల మధ్య కాని జరుగుతూ ఉంటాయి. వాస్తవంగా దంపతుల మధ్య కూడా నిత్యం యుద్ధం జరుగుతూ, మధ్య మధ్య శాంతి నెలకొంటూ ఉంటుంది. అందుకు సజీవ సాక్ష్యం భాస్కరరావు సమీరల దాంపత్యం. భాస్కరరావును భాస్వరరావు అని పిలిస్తే సమంజసంగా ఉంటుందేమొ. ఎందుకంటె ఉండుండి భాస్వరంలా మండిపడడం భాస్కరరావుకు ఉగ్గు పాలతో వచ్చిన గుణం. అయితే అది తాటాకు మంటలా ఎంతోసేపు ఉండదు.
విచిత్రాలను ఆవిష్కరించడం భగవంతుని సహజ లక్షణమంటారు. ముక్కు మీద వేలేసుకొనే ప్రతి సంఘటనే భాస్కరరావుకు సమీర జీవిత భాగస్వామి కావడం. భాస్కరరావు భాస్వరం మాదిరి భగ్గుమనేవాడైతే సమీర సమీరం మాదిరి ఆ మంటను ఉసిగొల్పి పరాకాష్టకు చేరుస్తుంది. అతి సామాన్యమైన సంఘటనను కూడా ఒక సర్వలక్షణ శోభితమైన యుద్ధంలా మార్చడంలో వారికెవరు సాటిరారు. అయితే సంఘర్షణ ఎంత ఉద్ధృతంగా ప్రారంభమవుతుందో అంత శాంతియుతంగా, సంతోషదాయకంగా అంతమవుతుంది. అదే వారి ప్రత్యేకత.
వారిద్దరు తోడు కావడమే ఒక విచిత్రమైన సంఘటన. వారిద్దరు టీచరు ట్రయినింగు నాలుగైదుసార్లు డిఎస్సీ పరీక్ష వ్రాసి ఉద్యోగ ప్రయత్నం చేశారు. కాని దురదృష్టవశాత్తు ఒకట్రెండు మార్కులలో ఉద్యోగావకాశాలను కోల్పోయారు. ఆగ్రహంతో ఊగిపోయిన భాస్కరరావు వారిచ్చే ఉద్యోగం ఎవరిక్కావాలి అని ఒక ప్రయివేటు పాఠశాలలో టీచరుగా చేరి గవర్నమెంటు మీద ప్రతికారం తీర్చుకున్నాడు. వారు కాకుంటే ఉద్యోగమిచ్చే వాళ్లే లేరా - అని సుడిగాలిలా టౌనంతా తిరిగి భాస్కర్‌రావు చేరిన పాఠశాలలోనే టీచరుగా చేరి గాలి పీల్చుకొంది సమీర.
పరిచయమైన కొత్తలో కాస్త మార్దవంగా సాగినా, ఆ తర్వాత వారి మధ్య చిన్న చిన్న పంతాలు, పట్టింపులు ప్రారంభమైనవి. హాజరు పట్టీలో సంతకం చేసే దగ్గర నుండి చదువు చెప్పేదాకా స్పర్ధ దినదిన ప్రవర్ధమానమై ఒకరిపై ఒకరు మేనేజ్‌మెంటుకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. వారిద్దరు వృత్తిరీత్యా ఉత్తమ ఉపాధ్యాయులు. విద్యాబోధనలో కూడా పిల్లల దగ్గర నుండి మంచి రెస్పాన్సు ఉంది. వారిద్దరిని తొలగించకుండా రాజీ చేసే మార్గమేదో తోచక మేనేజ్‌మెంటు, స్టాఫ్ తలపట్టుక కూర్చుంది.
ఇంతలో సైన్సు మేస్టారికి ఒక చక్కని ఆలోచన తోచింది. వారిద్దరు జెండరురీత్యానే గాక స్వభావం రీత్యా విభిన్నంగా ఉన్నారు కాబట్టి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకొంటాయనే సైన్సు సూత్రం ప్రకారం వారిద్దరికి పెళ్లి చెయ్యడమే ఉత్తమమార్గమని సూచించారు. సయోధ్యకు ఇదే తగిన మార్గమని అందరు ఒక నిర్ణయానికొచ్చి ఈ ప్రతిపాదన వారి ముందు వుంచారు.
పెళ్లి అయితే గాని దీని తిక్క కుదిరించను - భాస్కరరావు; ఈయన సంగతేదో తాళికట్టిన తర్వాత తేల్చుకుందామని - సమీర; ఇద్దరు ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. వాళ్లిద్దరికి వెనుకాముందు ఎవరు అయినవాళ్లు లేరని తెలుసుకొని, పాఠశాల సిబ్బందే బంధువర్గమై, పిల్లలే పెళ్లి పెద్దలై పాఠశాల పరిణయ వేదిక కాగా, మేళతాళలతో సమీర మెళ్లో మూడు ముళ్లు వేయించి, వాళ్లిద్దరిని ఒక యింటివారిని చేశారు.
ముచ్చటగా మూడు రాత్రిళ్లు పూర్తికాగా, భాస్కరరావు తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ‘‘ఎప్పుడైనా మీ ఆడవాళ్లు క్రిందే అని గమనించుకోవాలి’’ అన్నాడు. సమీర ఊరకుంటే సమీర ఎందుకవుతుంది! వెంటనే ముక్కు మీద గుద్దినట్లు చెప్పింది ‘‘అది కింద కాదు, మీ మగవాళ్లను మాత్రమే కాక, సమస్త సృష్టికి మా ఆడవాళ్లే ఆధారమని మీరు గుర్తించుకోవాలి’’ అంది.
ఆ విధంగా ప్రారంభమైన వారి దాంపత్యజీవితం మూడు యుద్ధాలు, ఆరు శాంతులుగా సాగిపోయింది.
వారి కలహాలకు పెద్దకారణమవసరం లేదు. చిన్నచిన్న చితుకులే పెద్దమంటకు కారణమైనట్లు, అతి సాధారణమైన సంఘటనలను కూడా వారు సర్వాంగ సుందరమైన సమరంగా మార్చగలరు. ఇంట్లో కాలు పెట్టగానే కాలుకు కాసింత దుమ్ము తగిలితే ‘‘ఇల్లు శుభ్రంగా ఊడ్చుకోవడం కూడా తెలియదా?’’ అంటూ ఎగిరిపడతాడు భాస్కరరావు. ‘‘నాకు తెలియదులే! నీవు ఊడ్చి చూపించు, నేర్చుకుంటాను’’ అంటుంది సమీర. అంతే, భాస్కరరావు కోపం నషాళానికి అంటుతుంది. వెంటనే మూలనున్న పొరక తీసుకొని - ఊడ్చి చూపిస్తా! రా! నేర్చుకొందువు - అంటూ మీదికి దూకుతాడు. పొరక దెబ్బల నుండి రక్షణకు ఆమె చేట తీసుకుంటుంది. అది డాలు మాదిరి ఉపయోగించుకుంటూ పొరక దెబ్బలు తప్పించుకుంటుంటే, భాస్కరరావు తన నిస్సహాయతకు మరింతగా మండిపడి పొరక పక్కన పారేసి ఎగిరి జుట్టు అందుకుంటాడు. జుట్టు పట్టుకొని దూకుడుగా ముందుకు లాగేసరికి, ఆమె మెరుపు వేగంతో ముందుకు తిరిగి భాస్కరరావును అతుక్కుపోయి నోటి దగ్గరికొచ్చిన బుగ్గను కసిక్కిన కొరుకుతుంది. ఈ ఘర్షణలో ఆమె పెదవి పోయి ఆయన నోట్లో పడుతుంది. వెంటనే పరిస్థితి మారిపోయి నరాలలో రక్త ప్రసార వేగం పెరుగుతుంది. క్రోథ రసంలో ప్రారంభమైన ఈ సంఘటన శృంగారంతో సింగారించుకొని ప్రశాంతంగా ముగుస్తుంది.
ప్రతిసారి ఇట్లాగే జరగాలని లేదు. చాలాసార్లు శాంతియుతంగా సరసం గానే సాగుతూ ఉం టుంది. కాకపోతే అప్పుడప్పుడూ కోపతాపాల్లో కూరు కుపోయిన సందర్భాలలో, ఆయుధాలతో యు ద్ధం జరిగిన తర్వాత, ముష్టి యుద్ధానంతరం మల్లయుద్ధానికి దిగినప్పుడు, ఇట్లా జరిగి శాంతి నెలకొంటుంది.
చాలామందికి విడ్డూరంగా అన్పించవచ్చు. చాలా మంది దాంపత్య జీవితాల్లో చిరు కలహాలే చిదానందాన్ని కల్గించిన సందర్భాలు అనేకం ఉంటాయి. ఒక్కొక్కసారి చిరుకలహాలే మరికొంచెం పుంజుకొని మాటల యుద్ధం మొదలై చేతల వరకు వెళ్లి చిరస్థాయిగా విడిపోవడం కూడా జరుగుతుంది. నిజమైన దాంపత్యం నిండా నూరేళ్లు వర్థిల్లాలంటే హాస్యాలుండాలి, విలాసాలుండాలి. వాటితోపాటు ప్రణయ కలహాలు, పైత్యప్రకోపాలుండాలి. ఎన్ని ఉన్నా - అగ్నిలో పడి అన్నీ పునీతమైనట్లు, అభిమానాలు, అహంకారాలు విరహాగ్నిలో పడి మాడిమసై, అహరహం పరస్పర ఆకర్షణతో ఒక ప్రణయ బిందువు చుట్టు పరిభ్రమిస్తూ ఒకరికొకరు ఆలంబనంగా నిలవాలి.
ఎండ లేకుంటే నీడకు విలువేముంది! ప్రణయ కలహాలు లేకుంటే పతీపత్నుల పరస్పరాకర్షణకు ప్రబలమైన బలమేముంటుంది! ఏదో ఒక విధమైన రాజీ ఫార్ములా లేకుండా, ఏ దాంపత్యం స్థిరంగా నిలబడదు. అందుకనే భాస్కర సమీరల దాంపత్య జీవితానికి మాట పట్టింపులే పట్టుగొమ్మలు. అవి లేకుండా వారి జీవితాలు నిర్జీవంగా, నిర్లిప్తంగా, నిరీహంగా మిలిగిపోయేవి.
వైవిధ్యభరితమైన దాంపత్య జీవితంలో వారికి లభించిన మధుర ఫలాలు ఇద్దరు కొడుకులు. వారికి విద్యాబుద్ధులు నేర్పడమే వారి భవిష్యత్‌కు బంగారుబాట ఏర్పరచడానికి వారు పడ్డ శ్రమకు విలువ కట్టలేము. వారి ఏకైక లక్ష్యం వారి పిల్లల భవితవ్యం. దాని కోసం ఎంత కష్టమైన, నష్టమైన భరించడానికి వారు సిద్ధమయ్యేవారు. అనేక ఆటుపోటులతో పాటు జీవితాలల్లో చేదును మ్రింగి వారికి తియ్యని జీవితాలను యిచ్చారు. ఇద్దరు శ్రద్ధగా చదివి సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ అయ్యారు. ఈనాటికి తమ కష్టాలు తీరి తీరం చేరుకున్నామని సంబరపడ్డారిద్దరూ.
కుమారులిద్దరూ పదునైన కత్తులు. దట్టమైన అడవినైనా నరుక్కుంటూ పోయి మాయలపకీరు ప్రాణమున్న చిలుకను పట్టుకొచ్చేంత సాహసికులు. రెక్కలొచ్చిన పక్షులు గూటిలో కూర్చోవు. ఆకాశం అంతు చూసేదాకా ఆగవు. అట్లాగే వాళ్లు కూడా తమ వృత్తి ఉద్యోగాలలో ఊర్ధ్వముఖంగా ప్రయాణం చెయ్యడంలో నిమగ్నమై, తమ జన్మభూమికి దూరంగా, తమ జననీ జనకులకు కూడా అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. ఇప్పుడు వారు అమెరికా దేశపు దత్తపుత్రులు. నల్ల దొరసానమ్మలకు మొగుళ్లు. కుబేరులకు అల్లుళ్లు, డాటర్ల చుట్టూ డాన్సు చేసే నెమళ్లు.
వారికిప్పుడు పుట్టిన ఊరు, కన్న తల్లిదండ్రులు గుర్తుకు రావడం లేదు. సాంకేతిక విజ్ఞానంలో సరికొత్త ఎత్తులకు ఎదిగామని ఆనందపడుతున్నారే కాని కన్నవాళ్ల కడుపుకోతకు కారణమయ్యామని వారు గుర్తించడం లేదు. వారు పిల్లల పురోభివృద్ధిబాటలో స్పీడు బ్రేకర్లు కాదు, తమ చెమట బిందువులతో చలువ పందిళ్లు వేసినవారు. వారికిప్పుడు కావాల్సింది ఎద లోతును తట్టి లేపే ఆప్యాయతతో నిండిన అమ్మా..నాన్నా.. అనే రెండు పిలుపులు. ఆ పిలుపులు పలకాల్సిన పెదవులు దాహర్తితో సప్త సముద్రాలకవతల ఎండమావుల వెంట పరుగులు తీస్తున్నాయి.
ఇప్పుడు వారిద్దరు బిడ్డలున్న గొడ్రాళ్లు. జీవిత చరమాంకంలో కళ్లు లేని ఆయన, కాళ్లు లేని ఆమెకు నడకకు తోడ్పడితే, ఆమె తన కళ్లతో ఆయనకు చూపు పంచుతుంది. ఆమె ఆయనకు కళ్లు అయితే, ఆయన ఆమెకు కాళ్లు అయి, జీవిత యాత్రలో జంట బాటసారుల్లా ముందుకు సాగుతున్నారు. వారిప్పుడు గత జీవితం తాలూకు మధురస్మృతులను నెమరు వేసుకుంటూ - ఇప్పటిదాకా ఒకరితో ఒకరు యుద్ధం చేసిన వారిద్దరు - వృద్ధాప్యంతో యుద్ధం చేస్తూ ఒక వృద్ధాశ్రమములో అంతిమ శాంతి కోసం ఎదురుచూస్తున్నారు.

స్పందన
జీవితమిచ్చిన కథ బాగుంది
గతవారం మెరుపులో ప్రచురితమైన జీవితమిచ్చిన కథ చాలా బాగుంది. వాస్తవానికి దగ్గరగా సాగింది. అయితే కథ నిడివి ఎక్కువైంది. కథను అల్లుకున్న తీరు బాగుంది. చదివినంత సేపు చదివించేలా సాగింది. పెండ్యాల గాయిత్రి గారు ఇంతకు ముందు రాసిన మట్టిపొరలు కథకు, ఇప్పుడు రాసిన జీవితమిచ్చిన కథకు పూర్తిగా భిన్నం. రెండు కథలు ఒకేరీతిలో కాకుండా దేనికదే భిన్నంగా రాశారు. ఆ కథకు, ఈ కథకు ఎటువంటి పోలిక లేకుండా రాసిన తీరు బాగుంది.
- పి.వెంటక శేషసాయి, వెంకటగిరి
- చిరమన గోవిందయ్య, దర్శి
- గోకర్ణ సరస్వతి, కసూర్తిబావివీధి, తిరుపతి

మనిషి బంధియే కవిత నచ్చింది
మనిషి తన స్వార్థపు గూట్లో ఎలా బంధి అవుతున్నాడు అనే అంశంపై చక్కగా చెప్పగలిగిన విషయాన్ని సూటిగా చెప్పిన కవిత మనిషి బంధియే. రచయిత యర్రాబత్తిన మునీంద్ర గారు కొంచెం విభిన్నంగానే తన కవితలను సంధిస్తున్న తీరు మేము గమనిస్తూనే వున్నాం. ధన్యవాదములు.
- ఘాలి హేమలత, గిడ్డంగివీధి, నెల్లూరు

అమ్మో..అగ్నిచినుకులు
అగ్ని చినుకులు కవిత గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు కవితలో వాడిన పదాలు, వాక్య నిర్మాణాలు వాడిన తీరు కవి యొక్క సహజశైలికి దర్పణం. ప్రకృతిలో మార్పులు ఎలా ఉంటాయో వర్ణించిన తీరు సూపర్. గతంలో వానచినుకులు ఎంత మధురంగా ఉంటాయి.. ఇక అవి ఎలా ఉండబోతున్నాయి అనే వర్ణన అద్భుతం. ఇకనైనా మనం పర్యావరణ పరిరక్షణకు నడుంకట్టకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు. రచయిత రవీంద్రబాబు గారికి హెట్సాప్.
- కొండూరు సంధ్య, కుమ్మరివీధి, గూడూరు
- రావి సుందరం, భక్తవత్సలనగర్,
మార్కాపురం

ఉగాది
కవితలు ఆహ్వానం
తెలుగువారి సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మెరుపు పేజీకి షడ్రుచులతో కూడిన కవితలను ఆహ్వానించడమైనది.
కవితలను తేది 02.04.2016లోగా
కింది చిరునామాకు పంపండి.

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు,
ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

సాహితీ పూదోటలో వెనె్నల వర్షం
పుస్తక సమీక్ష
ప్రముఖ రచయిత మోపూరు పెంచలనరసింహం తన ప్రతిభతో సాహితీ పూదోటలో మరోసారి ‘వెనె్నల వర్షం’ కురిపించారు. ఇంతింతై వటుడింతై అన్న చందాన చిట్టి చిట్టి కవితలతో సాహితీ సేద్యం ప్రారంభించి కథలు, నవలలు, నాటకాల స్థాయి అందుకున్న మోపూరు ప్రతిభకు వెనె్నల వర్షం మచ్చుతునక. పెంచలనరసింహం రచనకు వియోగి (కోపల్లె విజయప్రసాద్) నాటకీకరణ వనె్న తెచ్చింది. నాటకాలంటే ఇష్టపడని సాహితీప్రియులుండరు. ఎందుకంటే ఇందులో ప్రతీ దృశ్యమూ చక్కటి స్క్రీన్‌ప్లేతో పాత్రలు సజీవంగా కళ్ల ముందు కదలాడుతుంటాయి. ఇందులో పాత్రల్లో ఒక పాత్ర రచయిత స్వభావానికి దగ్గరగా ఉండడంతో ఈ నాటక రచన ఉత్సాహంగా సాగింది. తన జీవితంలో కొంత భాగం ఈ నాటకంలో ప్రస్ఫుటమవుతుందని రచయితే స్వయంగా ముందుమాటలో చెప్పుకున్నారు. తన శ్రేయోభిలాషిని మనస్సుతో తడిమి ఆతని భావాలకు దగ్గరగా మరో పాత్రను రచయిత సృజించడం ఎంతోబాగుంది. ఇతివృత్తం కూడా నెల్లూరు నేటివిటీలో సాగింది. పాత్రధారులు కూడా మనమధ్య తిరుగాడేవారే గమనార్హం. వెనె్నల వర్షంలో రచయిత కలంనుంచి కొన్ని ఆణిముత్యాల్లాంటి పద బంధాలు జాలువారాయి . అందులో మచ్చుకు కొన్ని ‘సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బతుకు చాలా హార్డ్‌గా ఉంటుంది’.
తనకు కాబోయే శ్రీమతి ఎలా ఉండాలో చెప్పే సన్నివేశంలో ‘కవిత్వమే జీవితంకాదు జీవితంలో కవిత్వం ఒక చిన్నభాగం’ అని కావేరి పాత్రతో చెప్పడం సందర్భోచితం. ‘అభిమానం ఎప్పుడూ హద్దుల్లో ఉంటేనే ముద్దు’ అని రాజేశ్వరితో చెప్పించడం కూడా ఈకాలానికి ఎంతో అవసరం అనిపిస్తుంది. డబ్బులుండడం గొప్పకాదు దాన్ని ఖర్చుచేయడానికి మనసు రావడం గొప్పవిషయం కదా. రచయిత మోపూరు పెంచలనరసింహంగారిని తెలిసిన వ్యక్తులు ఈ నాటకాన్ని చదువినా, స్టేజిపై చూసినా నరహరి పాత్రలో ఆయనే మనకు స్ఫురిస్తారు. అంధుల ఆర్తిని కళ్లకుకట్టించి వారి సమస్యలపై సమాజాన్ని ఉత్తేజితం చేసిన నరహరిలో రచయితే కన్పిస్తాడు. నేత్రదానం, అవయవదానాన్ని చేయాలని లోకానికి తెలియజేసిన రచయిత నిజంగా స్ఫూర్తిప్రదాత.
ఇక ముక్తాయింపుగా రచయిత పెంచలనరసింహంతో సన్నిహితంగా మెలిగే వారంతా ఒక్కసారి ఆలోచిస్తే నాటకంలో నరహరి పాత్ర మోపూరు పెంచలనరసింహమే అయితే ఆయన్ని ఎంతగానో అభిమానించే రేఖ ఎవరై ఉంటారో మీరు ఊహించండి.
- గౌతమి, 9347109377

మనోగీతికలు

పునరుత్పత్తి
రంగు రంగుల పూలకు
తమ రంగేమిటో తెలుసా?
ఎగిరే పక్షులకు,
తిరుగాడే జంతువులకు
తమ వనె్నలేవో లెక్కకు దొరికేనా?
కడుపు నింపే ధాన్యాలకు కనువిందు చేసే
రంగుల అందాలు తెలిసేనా?
రుచులను పంచే వంటకాలకు అంతే!!
అన్నిట తానై ఉండే ‘‘మనిషి’’
అన్నిరంగులను, రుచులను ఆస్వాదిస్తూ
ఆనందిస్తున్నాడు. గొప్పలు పోతున్నాడు
ఇన్ని అనుభూతులు పంచే వాటి
ఉనికిని కాపాడుతున్నామా?
అభిమానం చూపుతున్నామా?
నాశనం చేయకుండా ఉంటున్నామా?
పునరుత్పత్తికి పాటుపడుతున్నామా?
మానవజాతి పునరుత్పత్తికి తరతరాలుగా
ఏ ఆటంకం లేదే!
భావి తరాల ఉనికికి చరిత్రే సమాధానం
కాకూడదు
ఉనికిని కోల్పోతున్నామని పూలు, పక్షులు,
జంతువులు, ధాన్యాలు
మరెన్నో ఆక్రోశిస్తున్నాయి
ప్రకృతికి ఊరట కల్గించలేమా?
మనతోపాటు వాటికి కూడా
ఆనందం పంచలేమా?
సమతుల్యాన్ని కాపాడుతూ ఆనంద తీరాలకు అందరం చేరాలని ఆకాంక్ష.

- ఎస్.వి.సుబ్బారావు (శ్రీకంటి), నెల్లూరు. చరవాణి : 9441685812

నీరాజనాలు
సైనికా! ఓ సైనికా!
సరిహద్దు తీరములలో
ఉగ్రవాదుల కోసం
దేశరక్షణయే నా బాధ్యతని
భరతమాత కీర్తియే నీ ధ్యేయమని
అహరహరము కాపాలా కాస్తావు
సింహంలా గర్జిస్తావు
ఘనకీర్తిని గడిస్తావు

వైరి పక్షాలు దాడి చేస్తే
అకుంఠిత దీక్షతో పోరాడతావు
గెలిచి విజయాన్ని సాధిస్తే
అవార్డుల కితాబు పొందుతావు
కాలం కలిసిరాక
తుపాకులు నీపై పేలినపుడు
వీరజవా(బు)నులా పెట్టెల్లో తిరిగివస్తావు
త్రివర్ణ పతాకము అవగతము కాగ
సైనిక వందనములతో జోహర్ అన్పిస్తావు
సైనికా! ఓ సైనికా!!
ఒంటరిగానో, నీ బృందంతోనో
కటిక చీకట్లో గుడ్లు చీల్చుకొని
శత్రువుల కదలికలు గమనిస్తున్నపుడు
నీవాళ్లు గుర్తొచ్చినా
నిరామయుడివై కర్తవ్యం
నిర్వహిస్తావు
విధియే దైవమని తలుస్తావు
తృణప్రాణంగా ప్రాణాలర్పిస్తావు
సైనికా! ఓ వీరసైనికా!
కాళ్ల పారాణారని భార్య యొకరికి
నవమాసాలు నిండిన ఆలి మరొకరికి
నిన్ననే బిడ్డను కన్న బాలింతరాలు ఇంకొకరికి
వచ్చేనెలలో నీ ముహూర్తాలు కన్నా అనే వారు మరికొందరు
నీవు ఎప్పుడొస్తావని ముదిమితో ఎదురుచూసే కన్నవారు గలవారు చాలామంది
మళ్లీ తిరిగివస్తా నేస్తాలంటూ
తిరిగిరాని లోకాలికి వెళ్లిపోతావు
సైనికా! ఓ సైనికా!

కష్టాలు, కన్నీల్లు, ప్రార్థనలు, ఆశీర్వాదాలు
వేదనలు, వెతలు, ఆవేదనలు, వీడ్కొలులు
ఇవేవి నిలబడవు - కాలం కర్పూరంలా కరిగిపోతావు
గుర్తొచ్చినప్పుడల్లా నీ పటానికి ఓ దండ
స్మరణకొచ్చినపుడల్లా నీ త్యాగానికి ఓ పూ పరిమళం
వెల్గుతూనే వుంటుంది - నీ త్యాగం ఈ జాతి
నిరంతరం హృదయాల్లో
నీరాజనాలందిస్తూనే వుంటుంది
సైనికా! ఓ సైనికా!

- లక్కరాజు శ్రీనివాసరావు, అద్దంకి, చరవాణి : 9849166951

భూతల స్వర్గం
నిర్మిద్దాం
మతి తప్పిన మానవజాతి చేష్టలకు
గతి తప్పి ఘోషిస్తోంది పుడమి తల్లి
అస్తవ్యస్త పర్యావరణం
విలయతాండవ వాతావరణం
భానుడేమో అగ్ని శిఖయై
వెండి కొండలు విరిగి కరిగి
స్వార్థ జీవుల ఆకలి కేకకు
ప్రకృతి వనరుల ఫలహారం
ఉవ్వెత్తున పొంగే కడలి
ప్రాణభీతితో జీవులు హడలి
జీవవైవిధ్యం క్షీణత
ప్రకృతి వైపరీత్య విశృంఖలత
గ్లోబల్ వార్మింగ్..
శాస్తవ్రేత్తలకు వార్నింగ్
పొగచూరిన ఆకాశం
అడుగంటిన భూగర్భజలం
అఖాతాల నుండి అంతరిక్షానికి
నింగి నుండి పాతాళానికి
కమ్మేస్తోంది కర్భన కాలుష్యం
సలసల మరుగుతోంది భూగోళం
నరులకు కలగాలి మంచిబుద్ధి
తగ్గాలి కాలుష్యం టన్నులకొద్ది
సమర శంఖం పూరించు
పర్యావరణాన్ని రక్షించు
ప్రాణికోటిని బ్రతికించు
భూతల స్వర్గం నిర్మించు!

- ఆడేరు చెంచయ్య, నాయుడుపేట
చరవాణి : 9492331449

email: merupunlr@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

- పిడుగు పాపిరెడ్డి, కనిగిరి చరవాణి : 9490227114