నెల్లూరు

బాబోయ్ పులి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్లాసులో అటెండెన్స్ తీసుకోవడమయ్యాక, ప్రారంభించే ముందు అటెండరు గోపాలం సర్క్యులర్ పుస్తకం తీసుకొచ్చాడు. అప్పటివరకు గుసగుసగా మాట్లాడుతున్న విద్యార్థులు నిశ్శబ్దంగా మారిపోయారు.
ఇంగ్లీషు మాస్టారు ప్రకాష్ ‘సర్య్కులర్’ చదవటం ఆరంభించాడు. ‘మూడు నెలల నుండి ఎన్.సి.సి. కోర్సులో చేరిన వారికి వచ్చేవారికి క్యాంప్ నిర్వహించబడును. కావున ఎన్.సి.సి. విద్యార్థులందరూ తమ తమ యూనిఫాం, కావాల్సిన సామగ్రితో తయారుగా వుండవలెను. ముందుగా తెలియజేయడమైనది’
ప్రకాష్ సార్ ‘సర్క్యులర్’ చదివి సంతకం పెట్టి అటెండరుకిచ్చాడు. అటెండరు వెళ్లిపోయాడు.
విద్యార్థుల ముఖంలో ఎక్కడలేని ఆనందం వెల్లివిరిసింది. ‘మీరంతా చాలా ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది. కాని ఎన్.సి.సి. క్యాంపునకు వెళ్లేటప్పుడు చాలా క్రమశిక్షణ అవసరం.. అందరూ కలసిమెలసి ఓర్పుగా నిర్వహించాలి తెలిసిందా?’ అన్నాడు ప్రకాష్ సార్.
సంతోషంతో ‘అలాగే సార్’ అన్నారు.
క్లాసు అవటంతో ప్రకాష్ సార్ వెళ్లిపోయారు.
ఇక అందరు ఏ వస్తువులు తెచ్చుకోవాలి, తినేందుకు ఏమేమి తెచ్చుకోవాలని కబుర్లలో పడిపోయారు.
వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి.
క్యాంప్ నిర్వహించే ముందు మీటింగ్ లాంటిది పెట్టారు.
క్యాంప్‌కి పెద్ద కమాండర్సు వస్తారని క్రమశిక్షణతో మెలగాలని క్యాంప్ ప్రదేశం అడవికి దగ్గరగా వుంటుందని క్రూర జంతువులు సంచరిస్తుంటాయి, కావున ధైర్యంగా వుండాలని చెప్పారు.
చివరి మాటలు విన్న విద్యార్థులకు అప్పటివరకు వున్న ఉత్సాహం నీరుకారిపోయింది.
అయినా ఇంతమంది వున్న తమకు భయం దేనికని ఒకరికొకరు తోడుగా వుంటే భయం వుండదని ధైర్యం చెప్పుకొన్నారు. ఆదివారం ఉదయం ఐదుగంటలకల్లా విద్యార్థులంతా స్కూలు ఆవరణంలో చేరారు.
ఎన్.సి.సి. విద్యార్థులందరిని ఓ వ్యాన్ మాట్లాడి క్యాంపు ప్లేస్‌లో దింపేటట్లు ఏర్పాటు చేశారు.
యన్.సి.సి. సార్‌కి వేరే పని వున్నందున వ్యాన్‌ను ముందు పంపి తను వెనుక బస్సులో బయలుదేరాడు.
వ్యాన్ డ్రైవరు తప్ప, తమని అదుపుచేసే వారు ఎవరూ లేకపోవడంతో వాళ్ల ఆటపాటలకు అడ్డు లేకుండా పోయింది.
అందులో సునీల్, రమేష్, రాజా, ప్రదీప్ నలుగురు స్నేహితులు ప్రకృతి దృశ్యాలను చూస్తూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
యన్.సి.సి. క్యాంపుకెళుతున్నామా లేక ఏదైనా పిక్‌నిక్‌కి వెళుతున్నామా అన్నట్టుంది వాళ్ల పరిస్థితి.
వీళ్లని చూసి డ్రైవరుకి కూడా ఉత్సాహం వచ్చేసింది. వ్యాన్ స్పీడ్ పెంచాడు.
బొంగురు గొంతు రాజేష్‌ని పాటపాడమన్నారు. వాడిగొంతు బాగా లేకపోయినా వాడికి పాటలంటే ప్రాణం. వాళ్లు అడిగేసరికి రెచ్చిపోయాడు. ఇనుపరేకు మీద గీస్తే ఒళ్లు జలదరించినట్టు వాడి పాట మొదలు పెట్టేసరికి డ్రైవరు వ్యాన్‌ని నిలిపేశాడు. ‘ఏమైందని’ అందరు ముక్తకంఠంతో అడిగేసరికి ‘బాబు మీ పాట వ్యాన్‌కి నచ్చలేదు అందుకని మీరంతా కొంచెం ప్రశాంతంగా కూర్చుంటే తొందరగా వెళ్లవచ్చు లేకుంటే ఇంతే’ కచ్చితంగా అన్నాడు. అందరు ‘సరే సరే’ అన్నారు.
డ్రైవరు వ్యాన్‌లోని క్యాసెట్ ఆన్ చేశాడు. అందరు దానికి అనుగుణంగా చప్పట్లు కొడుతూ కూర్చొనే డాన్స్ చేయనారంభించారు.
ఎరక్కపోయి ఒప్పుకున్నాను దేవుడా ఈ పిల్లల ప్రోగామ్స్‌కి. ఒప్పుకోకూడదు మనసులోనే చెంపలేసుకొన్నాడు డ్రైవరు.
ఎలాగో వాళ్లని చెప్పిన క్యాంపు దగ్గర దింపేసిన అరగంట తరువాత యన్.సి.సి. సార్ వచ్చాడు. అప్పటికి గంట పనె్నండు కావస్తోంది. సార్..రాగానే వ్యాన్ డ్రైవరు వెళ్లిపోయాడు.
ఇక ‘టెంట్‌లు’ వేసే పని. పిల్లలందరు ఉత్సాహంగా సార్ చెప్పినట్టు పెద్ద గుడారం వేశారు. దాని పక్కనే చిన్న గుడారం వేశారు.
ఎన్ని తిండ్లు తిన్నా భోజనం వేళకి భోజనం తినకపోయే సరికి అందరిలో నీరసం కళ వచ్చేసింది.
సార్ తనతో పాటు తెచ్చిన సామగ్రితో వంట ప్రారంభించనున్నాడు. అందరు తెల్లముఖాలు వేశారు. ఎవరికి సరిగా వంటరాదు.
అప్పుడు గమనించారు. చుట్టు ఎతె్తైన కొండలు.. మనిషి సంచారం లేదు. దూరంగా చెరువులాంటిది కన్పిస్తోంది. సార్ చెప్పినట్టు చెరువు దగ్గరకు పోయి నీళ్లు తెచ్చి రాళ్లుపెట్టి పొయ్యి వెలిగించి వంట చేశారు. వాళ్ల వంట వాళ్లకే తినబుద్ధి కాలేదు. అయినా తప్పలేదు.
రేపట్నించి హోటల్ ఆర్డరు ఇస్తామని సమయానికి వాళ్లే తెచ్చి పెడ్తారని సార్ చెప్పాడు.
రేపు సంగతి దేవుడెరుగు ఈరోజు ఇలా తినాలని రాసి పెట్టిందని నవ్వుకొంటు తాము వండుకొన్న అన్నాన్ని తామే వడ్డించుకు తిన్నారు. సార్‌కి కూడా వాళ్లని చూస్తే ఆనందంతో పాటు నవ్వొచ్చింది. వాళ్ల దగ్గర నవ్వితే భయం పోతుందని మనసులోనే నవ్వుకొంటున్నాడు.
సాయంత్రం అయ్యేసరికి అందర్ని గుండ్రంగా కూర్చొబెట్టి వాళ్ల చేత కథలు, పాటలు, మళ్లీ భవిష్యత్‌తో ఏం చేయాలనుకొంటున్నారో అడిగి తెలుసుకొన్నారు. చాలామంది సినిమా యాక్టర్స్ కావాలని అనుకున్నారు.
బాగా చీకటి పడేసరికి దూరంగా నక్క ఊలలు విన్పించాయి. పాములు, తేళ్లు ఉంటాయని జాగ్రత్తగా వుండాలని హెచ్చరించాడు. సార్ తనతో పాటు తెచ్చిన పెట్రోమాక్స్‌లైట్స్ వెలిగించిపెట్టాడు. ఎమర్జన్సీ లైట్ తప్ప మరేవి లేవు.
పొద్దున తిన్న అన్నంతోనే రాత్రికెవరికి అన్నం సయించలేదు. నక్క ఊలలు, బయట చీకటి చూసేసరికి ఒకటికి పోవాలన్న భయం వేసింది.
అందరు వాళ్లు తెచ్చుకొన్న బెడ్డింగ్ పరచుకొని నిద్రకుపక్రమించారు. అందరూ మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకున్నారు.
రమేష్‌కి మాత్రం నిద్రపట్టడం లేదు. అందరూ గాఢ నిద్రలో వున్నారు. చేతివాచీలో టైం చూశాడు రెండు గంటలు కావస్తోంది. పులి గాండ్రిస్తున్నట్లు విన్పిస్తోంది, చాలా దగ్గరగా విన్పిస్తోంది. పోనీ సునీల్‌ని లేపుదామంటే వాడిమీద పిడుగులు పడినా లేచేట్టులేడు. పోనీ సార్‌ని లేపుదామంటే దాని కన్న పులే నయమన్పించింది.
రమేష్ అలాగే భయంతో బిగుసుకుపోయి కళ్లు గట్టిగా మూసుకొని నాకొక్కడికే పులి గాండ్రింపు వినపడుతోంది. ఎవరికి ఎందుకు వినపడడం లేదు అనుకుంటూ పడుకొన్నాడు.
ఇంతలో ఏదో జంతువు పరిగెస్తూ గుడారంలోకి ప్రవేశించింది. అది నేరుగా రమేష్ మీద నుండి పరుగెత్తింది.
బాబోయ్ పులి..పులి పెద్దపెట్టున అరిచాడు.
సార్‌తో పాటు అందరూ ఉలిక్కి పడి లేచారు.
‘‘ఎక్కడ పులి.. పులి..’’ సార్ ఆదుర్దాగా అడిగారు.
‘‘సార్.. నా మీద నుండి పులి పరిగెత్తింది సార్’’ ఏడుపు గొంతుతో చెప్పాడు రమేష్. అందరూ ఒక్కసారిగా బయటకొచ్చారు. బయట ఎక్కడా పులి కనపడలేదు. ఎదురుగుండా కుక్క తోక ఊపుకుంటూ నిల్చుని వుంది. సార్ విరగబడి నవ్వాడు. ‘‘అదిగో నువ్వు చూసిన పులి’’ అని కుక్కని చూపించాడు.
అయినా గుడారంలోంచి పులి గాండ్రింపు వినపడటంతో సార్ ధైర్యంగా లోపలికి తొంగి చూశాడు ఇంతమంది లేచినా బొంగురు గొంతు రాజేష్ మాత్రం పులిలా గాండ్రిస్తూ గురకపెడుతున్నాడు. అందరూ కోపంతో ‘‘బాబోయ్ పులి వచ్చింది’’ అని వాణ్ణి నిద్రలేపేశారు.

- అనూరాధ రామకృష్ణ
చరవాణి : 9394837563
-----

పుస్తక సమీక్ష

పిల్లల్ని చైతన్యపరిచే కథామంజరి

ప్రతులకు
మోపూరు పెంచలనరసింహం,
న్యూ మిలటరికాలనీ,
ఎకె నగర్, నెల్లూరు.
చరవాణి : 93463 93501
--
పిల్లలకే కాదు పెద్దలకు కూడా కథలంటే ఎంతో ఇష్టం. కథా రచన ఎంతో కష్టమైన ప్రక్రియ. అందులోనూ పిల్లలకోసం రాయడమంటే ఇంకా కష్టం. కథలంటే పంచతంత్రం కథలే. అవి అందరికీ గుర్తుండే ఉంటాయి. ఏదో నాలుగు పాత్రలు సృష్టించి వాటి చుట్టూ కథలు అల్లడం కాకుండా సందేశాత్మకంగా, వినోదాత్మకంగా రచించిన శైలి అద్భుతం. బాలలు కథలు చదవడం కన్నా బొమ్మలు చూడడానికే ఇష్టపడతారు. అయితే ఇదే అంశాన్ని రచయిత ఒడిసి పట్టుకుని బొమ్మలతో కూడిన కథలను అందించారు. అటు ఇటుగా 30 కథలున్న ఈ బాల కథామంజరి చదివాక రచయిత మనస్సు పిల్లల్లో పరకాయ ప్రవేశం చేసిందనిపించింది. ప్రతీ కథా సందేశాత్మకంగా రచయిత సృజించారు. పేజీలకు పేజీలు రాయకుండా క్లుప్తంగా పది పదిహేను వాక్యాల్లో కథను ముగించడం ఎంతో బాగుంది. రచయిత బాలలకు నచ్చే అంశాలను ఎంచుకుని వారికి అర్ధమయ్యే సులభరీతిలో కథలు రచించారు. ఒకదాని మించి మరొకటి ఉన్నాయి. అక్షరాల సైజు, పేజీలే అవుట్ కూడా పిల్లలకు నచ్చేవిగా ఉన్నాయి. వీటికి తోడు ఆయా కథలకు అనుగుణమైన చిత్రాలు కూడా పిల్లన్ని ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. మూగజీవాలతో పాటు పురాణ పాత్రలు, రాజు, మంత్రి, సేనాధిపతి వంటి పాత్రలతో కూడా నీతి సూక్తులు చెప్పించారు.
అహంకారాన్ని వీడాలని సూచిస్తుంది ఏనుగు-ఎలుక, ఎక్కడికి వెళ్లినా ఇంతే కథలో సున్నితమైన హాస్యంతో పాటు అల్పప్రాణుల మనోవేదన చక్కగా ఆవిష్కృతమైంది. వెలుగులో అనాథలను అక్కున చేర్చుకోవాలన్న సందేశాన్నిచ్చారు. బడి ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లేవారికి చదువువిలువ చెంపపెట్టు. ఇందులో విద్యార్థుల్ని రిక్షావోడు సున్నితంగా మందలించడం అద్భుతం. ఉత్తమ సాధువులో బౌద్ధం వ్యాప్తి, కుందేలు తెలివిలో అప్రమత్తంగా ఉండాలని రచయిత పిల్లలకు హితవు పలికారు. జీవ హింస తగదని కృతజ్ఞత అనే కథలో చిన్నారులకు వివరించారు.

-గౌతమి
చరవాణి 9347109377

-----

స్పందన

సమాజ హితం కోరిన కుంతల
గత వారం మెరుపులో ప్రచురించిన కుంతల కథ చాలా బాగుంది. చాలాకాలం తర్వాత ఓ మంచి కథను చదివాను అన్న భావన నాలో కలిగింది. అసలు సమాజవంలో ఈ లింగ వివక్ష ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. నేటి కాలంలో ఆడపిల్లలే అన్నింటా అగ్రగామిగా రాణిస్తున్నారు. ఇక కథలోకి వెళితే కుంతల పాత్రను ప్రముఖంగా తీర్చిదిద్దిన తీరు బాగుంది. తన కడుపులో వున్న ఆడపిల్లను కాపాడుకోవడానికి ఆమె పడిన శ్రమ, తపనను ఎంతో గొప్పగా మలిచారు. ఆమె కడుపులో వున్నది ఆమె అమ్మేనని, ఆమె ధైర్యాన్ని నూరిపోసి కుంతలను ముందుకు నడిపించిన తీరు కొత్తగా వుంది. కడుపులో వున్న పాపాయి ఆజ్ఞలను పాటించి మొండి మొగుడ్ని తన దారికి తెచ్చుకున్న విధానం సూపర్. రచయిత ఆలకుంట రెడ్డిప్రసాద్ కథలో తన నేర్పరి తనాన్ని చూపి కథను ప్రాణం పోశారు. ఇలాంటి కథలు ఇంకా రాయాలని కోరుకుంటూ..
- పద్మప్రియ, పొగతోట, నెల్లూరు
- రావూరు హరిబాబు, శ్రీకాళహస్తి
- హరిచందన, కావలి

హితైషికాలు, లోకం తీరు కవితలు బాగున్నాయి
గతవారం మెరుపులో ప్రచురించిన హితైషికాలు కవిత సూపర్. ఎదగడం అంటే, తగ్గడం అంటే, ఒదగడం అంటే, వ్యక్తిత్వం అంటే, గొప్పతనం అంటే ఏమిటో క్లుప్తంగా వివరించిన విధానం బాగుంది. జీవితం ఎన్నో అనుభవాల సారాంశం. రచయిత రవీంద్రబాబు చెప్పిన హితైషికాలను చక్కగా తెలుసుకుని ముందుకు పయనిస్తే జీవితంలో ఓ పూలవనం.
అలాగే లోకం తీరు కవితలో భావం కూడా బాగుంది. ప్రస్తుతం లోకంలో జరిగే తంతును వివరించిన మోహన్‌రాజుకు ధన్యవాదాలు.
- రాజారమేష్, కరణాలవీధి, గూడూరు
- పెద్దపాళెం హరికృష్ణ, ఎం ఆర్ పల్లి, తిరుపతి

బి.వి.ఎస్ రచనలపై మక్కువ పెంచిన
‘మరోమలుపు’ సమీక్ష
17.04.2016 మెరుపులో ‘దృశ్యం వెనుక అదృశ్యం కొత్త జీవన పార్శ్వం’ శీర్షికన ప్రచురితమైన బి.వి.ఎస్. ప్రసాద్ గారి ‘మరోమలుపు’ కధానికల సంపుటిపై ప్రఖ్యాత రచయిత విహారి గారి విశే్లషణాత్మక పుస్తక సమీక్ష పాఠకులకు ప్రసాద్ గారి కథలను చదవాలనే మక్కువ కలిగించింది. స్వతహాగా వ్యంగ్య చిత్రకారుడైన ప్రసాద్ పాత్రల స్వభావాలను ఆకళింపు చేస్కుంటూ చిత్రాలను గీచినట్లు తన కథల్లో కూడా ఆహ్లాదకరమైన హాస్యాన్ని జోడించి మధ్యతరగతి మనస్తత్వాల్లోని వైరుధ్యాలను ప్రస్పుటింపచేశారు. పాత్రలు మన మధ్యలో తిరిగ మధ్యతరగతి మన ఇరుగుపొరుగువారే.
కథానికల సంపుటి ‘మరోమలుపు’ విహారిగారి మెప్పు పొందడం, సమీక్ష గావింపబడడం బి.వి.ఎస్. గారి అదృష్టం.
- వేదం సూర్యప్రకాశం, నెల్లూరు.

-----

మనోగీతికలు

ఉగాది వెళ్లిపోయిందా..!
కోయిలల కుహూ కుహూ రాగాలు
కోడిపుంజుల మెల్కొలుపులు
కనపడలేదు.. వినపడలేదు
కరవు కోరల్లో మోడువారిన చెట్లు
కూలీనాలీ లేక మాడే కడుపులు
వీటిని చూస్తూ ఉగాది వెళ్లిపోయిందా!

ఊగేందుకు ఊరు ముందర చెట్లు లేవు
ఆడేందుకు ఊరవతల గట్లు లేవు
ఊరపిచ్చుకల అలికిడి లేదు
ఊరకుక్కల అరుపులు తప్ప
ఉదయాస్తమానాలు లేవు
ఉరుకులు పరుగులు తప్ప
వీటిని గమనిస్తూ ఉగాది వెళ్లిపోయిందా!

వేప పువ్వు కోసం వెంపర్లాట
మామిడి పిందె కోసం దోబూచులాట
చింత పులుపు కోసం కోతాట
వెలగపండు కోసం వెయ్యిపాట్లు
వీటిని చూడకనే ఉగాది వెళ్లిపోయిందా!

అంతా యాంత్రిక జీవనమే
కృత్రిమ ప్రేమలు
కొలబద్దలు అనురాగాలు
నీకేమైనా ఇస్తే నాకేమొస్తుంది
వీటిని పరికిస్తూ ఉగాది వెళ్లిపోయిందా!

వెళ్లింది మన్మథనామం
వచ్చింది దుర్ముఖి ఉగాది
దుర్ముహుర్తాలే వస్తాయో
దుష్టులే వస్తారో
దుర్మార్గులే తరలుతారో
దుఃఖాలే మిగులుతాయో
ఓ దుర్ముఖీ
దుష్టులను సంహరించు
దుఃఖాలను దూరంగా వుంచు
సుఖశాంతులను పెంపొందించు
అష్టైశ్వర్యాలను కలిగించు
అందరిని ఆనందింపు
గుర్తుగా గుర్తుంచుకుంటాం..!
- కటారి రామయ్య, సదుం
9704025771

ఇసకేరా
అన్నింటికి మూలం
ఇసకేగా అన్నిటికి మూలం
ఆ ఇసకలేనిదే నిర్మాణాలు శూన్యం
ఇసకను సులువుగా చూడకురా
ట్రక్కు ట్రక్కు ఇసకను కుప్పలు చేయరా
కుప్ప చేసి డబ్బులు కూడబెట్టరా
ఇసక రాశులున్నప్పుడే లక్షలు చేకూరునూ
అందుకే ఇసక విలువ తెలుసుకొని నడవరా!

వాగైనా వంకైనా ఓకేరా
కాలువైనా నదియైనా ఫరవాలేదురా
డ్యాములైనా, చెక్‌డ్యాములైనా సరేలేరా
కాలుష్యం గొడవ మనకొద్దురా
ఎవరెటు పోయినా మనకెందుకురా
వీలైతే సీనరేజ్‌లు ఎగరెయ్యరా
వీలైనంత స్విస్ బ్యాంకులో నిల్వచేయరా!
ఏదైనా ఏమైనా చేసి నీవు లీజు పట్టురా
లీజు రాకున్న రాజకీయం రగిలించుమురా
ఎవరైనా ఎదురొచ్చిన లెక్క చేయకుమురా
ధైర్యముతో తెగ దోపిడి చేయమురా
దోచేసి పెద్దమనిషిగా చలామణి కమ్మురా!

ఎల్లప్పుడు పదవిలో ఉంటేటట్లు చూసుకోరా
అది లేనప్పుడు
మన వారెవరైనా వుండేటట్లు చేసుకోరా
ఇసకే కదా అని నిర్లక్ష్యం చేయబోకురా
సోమరిగా నీవు నీ పనులు
పరులకప్పగించకురా
ఎంత నమ్మితే అంత మంచిదని నటించుమురా
అనవసరంగా అందరిని నమ్మవద్దురా
అడుగడుగున
సొంత లాభము చూసుకొమ్మురా
నమ్మకంగా నీ పనులు చక్కపెట్టుకొమ్మురా
లక్షలక్షలు కూడబెట్టిననాడే
జనం నిను గౌరవించురా
అది లేనప్పుడు నీవు గుడ్డికాసుకు లెక్కకాదురా
ఇసక ఉచితమనేది ఒక నాటకమురా
అధికారులు తనవారిని కాపాడే కపటనీతిరా!

ఉచితముగా ఏ వస్తువు వస్తుందిరా
కరెంటా? నీరా? తిండా? బట్టా? నీడా?
నిత్యావసర వస్తువులా?
ఏది ఉచిత వస్తువురా?
సరసమగు ధరకు వస్తువస్తే అది చాలురా
అన్నింటిని సామాన్యులు కొనక తప్పదురా
కొని స్థిమితంగా జీవించుమురా..!

- లక్కరాజు శ్రీనివాసరావు. అద్దంకి
చరవాణి : 9849166951

గాలిపటం
విహరించే విహంగాలలో
ఒకటవ్వాలని
వినువీధిన తారాడే మబ్బులను
ముద్దాడాలని
తళతళలాడే తారలనందుకోవాలని
శూన్యాకాశంలో స్వేచ్ఛగా విహరించాలని
ఆశగా పరుగెత్తుతుంది పతంగం
గమ్యాన్ని చేరుకోలేననే అధైర్యం లేదు
దారం తెగుతుందన్న భయం లేదు
మనసులో వున్నది తపన
వెనకడుగు వేయని పట్టుదల
కానీ ఆధారం మాత్రం
ఆ దారం ఒక్కటే
మరి మనం
సర్వాంగ సంభరితులం
అండదండలన్నీ పుష్కలం
అయినా
మదినిండా అయోమయం
ఆలోచనలన్నీ అస్తవ్యస్తం
గమ్యం తెలియని ప్రయాణం
ఒడిదుడుకుల జీవితం
బ్రతుకంతా ఊగిసలాట
భ్రమలలోనే వెతుకులాట
ఎంతకాలం ఇలా సాగుదాం?
ఇకనైనా మేలుకుందాం
గాలిపటాన్ని ఆదర్శంగా చేసుకుందాం
గాలివాటపు పయనాన్ని
మార్చుకుందాం..!

- శింగరాజు శ్రీనివాసరావు, ఒంగోలు
చరవాణి : 90520 48706

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 ౄళూఖఔఖశూబ్ఘశజ్ద్ఘూఇ్ద్య్యౄజ.శళఆ