నెల్లూరు

సంస్కారం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయంత్రం 6 గంటలయ్యింది. తిరుపతిలో నా పనులు అన్నీ పూర్తి చేసుకొని మా ఊరు రామచంద్రాపురానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండులోకి వచ్చాను. అప్పుడే మా ఊరిమీదుగా కాసీరావుపేటకు వెళ్లే బస్సు 32వ ప్లాట్‌ఫారం వద్దకు వచ్చి ఆగింది. ఆ బస్సు ఎక్కి కిటికీ వద్ద కూర్చున్నాను. అప్రయత్నంగా వెలుపలికి చూశాను. ఒక అందమైన అమ్మాయి ఎవరో వెంట పడుతున్నట్లుగా వచ్చి నా పక్కన కూర్చుంది. మరికొంతమంది బస్సు ఎక్కగానే డ్రైవర్ బస్సును స్టార్ట్ చేశాడు.
బస్టాండునుంచి రుయా ఆసుపత్రి వరకు ఎవరూ ఎక్కలేదు. అక్కడ నలుగురు కుర్రాళ్ళు ఎక్కారు. వాళ్ళను చూడగానే ఆ అమ్మాయి నాకు బలంగా ఆనుకుని కూర్చుంది.
పద్మావతి కాలేజి వద్ద మా ఊరి సర్పంచ్ చంద్రయ్య, ఆయన కూతురు లక్ష్మీ బస్సెక్కారు. ఆయన నన్ను చూడగానే ‘‘ఎక్కడనుండి రామూ ఇంటికేనా’’ అన్నాడు.
లక్ష్మీ నావైపు చూస్తుంటే నా పక్కనున్న అమ్మాయి ఒకరకంగా చూసింది. నేను గమనిస్తూనే ‘‘అవునన్నా ఇక్కడు టౌన్‌లో పని ఉంటే వచ్చాను’’ అని జవాబు చెప్పాను.
అంతలో కండక్టర్ నావైపు తిరిగి ‘‘టికెట్’’ అన్నాడు.
‘‘రామచంద్రాపురం’’ అని డబ్బిచ్చాను.
నాకు టికెట్ ఇచ్చాక నా పక్కనున్న అమ్మాయిని చూసి ‘‘శ్రావణీ ఇదిగో టికెట్’’ అని ఆ అమ్మాయి అడగకుండానే టికెట్ ఇచ్చాడు. డబ్బు తీసుకున్నాడు.
‘‘రోజూ తిరిగే వాళ్ళ పేర్లు నీకు బాగా గుర్తుండిపోయాయే’’ అని చంద్రయ్య కండక్టర్‌తో నవ్వుతూ అన్నాడు.
‘‘మన రూట్లో వచ్చే వాళ్ళంతా గుర్తేకదా’’అని అంటూనే టికెట్లు కొట్టేస్తున్నాడు కండక్టర్.
‘‘సార్ మీరు ఎప్పుడైనా కాశీరావుపేటకు వచ్చారా’’ శ్రావణీ నన్ను ప్రశ్నించింది.
ఆశ్చర్యానికి గురైన నేను ‘‘లేదు’’ అన్నాను. ‘‘సార్ ఏమీ అనుకోకుండా మీరు ఈరోజు మా ఇంటికి రావాలి’’.
మళ్ళీ ఆశ్చర్యపోయిన నేను ‘ఈ అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు, మాట్లాడలేదు, అకస్మాత్తుగా వాళ్ళింటికి రమ్మంటుందేమిటి’ అని మనసులో అనుకొన్నాను.
‘‘అందమైన అమ్మాయి రమ్మంటే ఎవరైనా వెళ్ళకుండా ఉంటారా’’ అని నా వెనుక సీటులో కూర్చున్న యువకుడు ఒకడు కామెంట్ చేశాడు. శ్రావణి వైపు చూసి ‘‘వాడు మీ కాలేజియేనా’’ అన్నాను. ‘‘అవును, వాడితోపాటు మిగిలిన నలుగురూ కూడా మా కాలేజియే, నేను మా ఊరికి వెళ్ళాలంటే బస్సు దిగి కొంతదూరం నడవాల్సి ఉంటుంది. ఆ గ్యాప్‌లో నేను ఎప్పుడైనా ఒంటరిగా దొరికితే ఏమైనా చెయ్యాలని వారి ఉద్దేశం’’ గబగబా చెప్పింది.
‘‘మరి మీవాళ్ళకు చెప్పి వాళ్ళను ఎదిరించవచ్చు కదా’’
‘‘అవసరం లేదు, ప్రతి రోజూ మా నాన్న కాని, మా అన్న కాని వచ్చి తీసుకొని వెళతారు. ఏ రోజైనా వారు రాకుంటే ఛాన్సు దొరుకుతుందేమోనని ఉబలాట పడుతున్నారు’’.
‘‘మరి నన్ను ఎందుకు పిలుస్తున్నావు’’
‘‘ఈరోజు మా నాన్న, అన్న ఇద్దరూ మామిడి కాయలను మండీకి వేసుకొని వెళ్ళారు. అక్కడ పని జరగలేదంట ఫోన్ చేశారు’’.
‘‘మీ ఊరి వాళ్లెవరూ బస్సులో లేరా’’
‘‘లేరు’’
‘‘సరే నీవు వెళ్లు, నేను బస్సు దిగి మా ఊరినుంచి స్కూటర్‌లో వెంటనే వచ్చేస్తా’’
‘‘అమ్మో చీకటి పడిపోతుంది, ప్లీజ్ ఈసారికి రండి, అక్కడినుంచి ఎవరి స్కూటర్‌పైనైనా డ్రాప్ చేయిస్తాను’’ దీనంగా అంది శ్రావణి.
ఇక తప్పదన్నట్లు మా ఊరు వచ్చినా దిగకుండా అక్కడనుండి కాసీరావుపేటకు టికెట్ తీసుకున్నాను. కాసీరావుపేటకు వెళ్లేటప్పటికి రాత్రి 8 గంటలైంది. విద్యుత్ సరఫరా ఆగిపోవటంతో చిమ్మచీకటిగా ఉంది. అక్కడనుంచి అర కిలోమీటరు నడుచుకుని వెళ్ళాలి. మేమిద్దరం బస్సు దిగాము. మా వెనుకనే నలుగురూ దిగారు.
చీకట్లో నడుచుకుంటూ వెళుతున్నాము. కొద్దిదూరం నడిచామో లేదో వెనుకనుంచి నలుగురు యువకులు వేగంగా వచ్చి శ్రావణిని ఈడ్చుకెళ్ళారు. వాళ్ళలో ఒకడు నన్ను కిందపడేశాడు. చీకట్లో ఏమి జరుగుతుందోనని వెంటనే సెల్ ఫోన్‌లోని టార్చి ఆన్ చేశాను. ఆ లైటు వెలుతుర్లో నాకు చిన్నపాటి చెక్క కనపడింది. అప్పటికే శ్రావణిని పొదల్లోకి లాక్కెళుతున్నారు. నా చేతిలోని చెక్కతో వారిని బాదాను. నన్ను తిరిగి కొట్టేందుకు వీలుకాక పారిపోయారు.
గబాగబా శ్రావణి వద్దకు వెళ్ళాను. భయంతో నన్ను గట్టిగా పట్టుకొంది.
‘‘చాలా థాంక్స్’’ అంది. అలాగే కొద్దిదూరం నడిచాము. అంతలో కరెంటు రావడంతో పల్లెల్లోని ఇళ్ళలో లైట్లు వెలిగాయి. ఇంటివద్ద శ్రావణి కోసం అమ్మ యశోద, చెల్లెలు రాధికలు ఎదురు చూస్తున్నారు.
కూతురును చూడగానే యశోద గబగబా వచ్చింది. ‘ ఒంటరిగా వచ్చావా’ అని అంటూ నన్ను చూసింది.
అంతలో మా ఊరి వెంకటరమణ ఆ దారిలో పోతూ నన్ను చూసి స్కూటర్ ఆపడంతో శ్రావణికి చెప్పి మా ఊరికి చేరుకున్నాను.
ఉదయం 9 గంటలకు నేను పొలం వద్దనుంచి ఇంటికి వచ్చాను. ఆశ్చర్యకరంగా శ్రావణి వాళ్ళ అమ్మ, చెల్లెలు మరో ఐదుగురు మా ఇంటివద్ద ఉన్నారు. మా నాన్నతో ఏదో మాట్లాడుతున్నారు. చిన్నగా వెళ్ళి వారి మాటలు విన్నాను.
‘‘మా అమ్మాయిని మీ అబ్బాయి కాపాడి ఇంటికి చేర్చాడు. పెళ్ళి వద్దనుకున్న మా అమ్మాయి ఇప్పుడు మీ అబ్బాయిని చేసుకోవాలంటోంది’’ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది యశోద.
‘‘అమ్మాయి చదువు గురించి ఆలోచించండి’’ అని మా నాన్న కుటుంబరావు అనగానే.
‘‘అదేంలేదు పెళ్ళయ్యాక వాళ్ళిష్టం, మీ సంబంధం పోతే మా అమ్మాయికి మంచి భర్త దొరకడండి’’ శ్రావణి వాళ్ళ నాన్న అనుకొంటూ గట్టిగానే అన్నాడు.
పెళ్ళయ్యాక మొదటి రాత్రి నేను శ్రావణిని ఒక ప్రశ్న అడిగాను ‘‘నేను నిన్ను ఏమీ చేయనని ఎలా అనుకొన్నావు’’ అని.
‘‘మా అమ్మా నాన్న రెండేళ్ళప్పుడే డిగ్రీలో చేర్చకుండా మీ ఫోటో చూపించి పెళ్లి చేసుకోమన్నారు. నాకేమో చదువు పూర్తయ్యాక చేసుకోవాలని. అప్పటికీ మీ పెళ్లి కాకుంటే మిమ్మల్నే చేసుకొంటానని చెప్పి ఉంటిని, నేను ఎవరో తెలియక పోయినా నన్ను రక్షించేందుకు ముందుకువచ్చారు. మీ సంస్కారం నచ్చింది. ఇంతకంటే ఆడది ఇంకేం కోరుకోదండి’’ అని లైట్లు ఆర్పేసింది.

- కటారి రామయ్య, సదుం
చరవాణి : 9704025771

---
కవిత

తల(లు)పు
కుటుంబ సౌధానికి
నువ్వు పునాదివి
అంతస్తుల హోదాతో మెరిసి
మురిసిపోతున్నా
సింహద్వారానికి అతుక్కుని
నీ అంతర్గత బలానికి నేను
రక్షణ కవచమయ్యాను
తాళి తాళం ఒక్కొక్కసారి
నా స్వతంత్ర శ్వాసకు అడ్డొస్తూ
నా కంఠాన్ని బిగిస్తుంటుంది
అయినా, నువ్వెంతో యిష్టంగా
మలచుకున్న నీ మమతల పర్ణశాలకు
నేనే ఊపిరి అంటూ
నా అందమైన నగిషీలను
తడుముతూ నా అద్భుత శిల్ప సౌందర్యమా
అంటూ ముచ్చటగొలిపే నీ ఆత్మీయతకు
బందీనై ప్రాణం లేని కొయ్యలా
నీ కోవెలకే అతుక్కుపోయాను
నీకు తెలుసా! జీవన సమరంలో
నువ్వు ఎదుర్కొనే ఎత్తుపల్లాలు,
ముళ్లదారులు, ఆ దారుల్లో తారసపడే
క్రూర మనస్తత్వాలు
నీ ఇంటికొచ్చే అతిథి మిత్ర బృందాలు
కొత్త చుట్టరికాలు..
నీతో పాటు నేనూ వాళ్లను
ప్రేమగా పలకరించి ఆహ్వానిస్తాను
కొందరైతే తొలిసారి నువ్వు
నన్ను ఎన్నుకున్నప్పుడు ఎలా చూశావో
అచ్చం అలానే చూస్తారు
మరికొందరైతే నాపై చెక్కబడ్డ
నగిషీ పనితనానికి ముగ్ధులై
నీ ఎంపికలోని ప్రతిభకు ‘హాట్సాఫ్’ చెపుతారు
అప్పుడప్పుడూ నువ్వు నన్ను
ఎత్తిపొడుస్తూ ‘మొద్దూ’ అన్న
సందర్భం గుర్తొచ్చి పశ్చాత్తాపంతో
నవ్వుతూ నా వంక చూస్తావు
నాలోనూ పనితనం వుందని
రుజువైనందుకు గర్విస్తాను
ఇంకొందరైతే నీ ఆతిథ్యం స్వీకరిస్తూనే
నన్ను కళ్లతో ఆరగిస్తూ
తృప్తి చెందుతారు
అది సభ్యత కాదని మింగి నీళ్లు తాగుతారు
‘పుర్రెకో బుద్ధి’ అని నన్ను నేను
సర్ధి చెప్పుకుని అచేతనమవుతాను
బాగా వయసు పైబడిన వాళ్లు మాత్రం
‘‘నీ బలానికి కావలసినంత
ఆసరాననీ, నీ హోదాకి తగినదాన్నని’’
నా భుజం తట్టి మరీ మెచ్చుకుంటారు
తాళం తాళి ‘బరువు’ తక్కువైనా
బాధ్యతల బరువును నీతో
సమానంగా మోస్తున్నందుకు
‘దీర్ఘ సుమంగళీ భవ’ అని నన్ను
అభినందించి ఆశీర్వదిస్తారు
అదే నాకు నిజమైన ‘ ఆత్మ సంతృప్తి’
చుట్టూ ఎన్ని కష్టాలు, క్రూర మృగాలున్నా
‘‘నా నమ్మకం నీవు, నీ బలం నేను’’
అయినప్పుడు
‘‘మన బంధం’’ శాశ్వతమే కదా!

- ప్రసూనా శరత్, పొదలకూరు
చరవాణి : 94416 99585

---
బాలల కథలకు ఆహ్వానం
సమాజంలో నానాటికీ తగ్గుతున్న మానవ సంబంధాలు పిల్లల్లో పెంచడానికి వారిలో నైతిక విలువలు పెంపొందించాలన్న సంకల్పంతో నెల్లూరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డీల సంఘం నేతృత్వంలో బాలల కథలను పుస్తకంగా తేవాలని సంకల్పించామని ఆ సంఘం ప్రధానకార్యదర్శి అచ్యుతమణి చెప్పారు. ఔత్సాహికులైన రచయితలుకాని, ఉపాధ్యాయులు కాని చేతిరాతలో రెండు పేజీలకు మించని కథలు ఆహ్వానిస్తున్నామన్నారు. జూన్ 10వ తేదీలోగా తమకు అందిన కథలను ఎంపిక చేసి పుస్తకంగా ముద్రించి పాఠశాల విద్యార్థులకు, హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా అందజేయాలని సంకల్పించామన్నారు.
మరిన్ని వివరాలకు అచ్యుత మణి, నెల్లూరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డీల సంఘం ప్రధాన కార్యదర్శి, ప్లాట్‌నెంబర్ 101, సాయిగార్డెన్స్ అపార్ట్‌మెంట్, ఎవికె ఎస్టేట్, డైకస్ రోడ్డు, నెల్లూరు, ఫోన్ 9440752616 అనే చిరునామాలో సంప్రదించగలరు.

---
స్పందన
---
మహిళా దినోత్సవం కథ సూపర్
మహిళా దినోత్సవం రోజు సగటు మహిళ పడే పాట్లను క్షుణ్ణంగా వివరించిన కథ మహిళా దినోత్సవం. మహిళలకు మహిళా దినోత్సవం రోజు కూడా విశ్రాంతి అనేది ఒక మాయ, అది వారికి అత్యాశే అవుతుంది అనే కోణంలో రచయిత్రి పద్మావతి గారు రాసిన కథ సూపర్. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఓ ఉద్యోగం చేసే మహిళ, అటు ఆఫీసులో ఉద్యోగిగా, ఇటు ఇంట్లో గృహిణిగా ఆమె పడే బాధలను కళ్లకు కట్టినట్లు చూపించిన తీరు బాగుంది. కథ చివరి వరకు కూడా సరదాగా సాగింది.
- అల్లాడి శ్యామల, నెల్లూరు
- హేమలత, ఎన్‌జివో కాలనీ, తిరుపతి

గాలిపటం కవిత బాగుంది
గతవారం మెరుపులో ప్రచురించిన గాలిపటం కవిత నిజంగా ఓ మధురానుభూతి. గాలిపటాన్ని జీవితానికి అనుసంధానించి పోల్చిన తీరు అహో అనిపించింది. గాలిపటం దారాన్ని జీవితానికి ఆధారం చేస్తూ రాసిన ప్రతి పదం హృదయాన్ని తాకింది. రచయిత శింగరాజు శ్రీనివాసరావు గారికి సదా అభినందనలతో..
- ఊరుబిండి శ్యామలమ్మ, రిటైర్డ్ హెచ్‌ఎం, కావలి
- అయితా శ్రీహరి, కందుకూరు

రెండు కవితలు నచ్చాయి
గతవారం మెరుపలో ప్రచురించిన ఉగాది వెళ్లిపోయిందా.. కవిత చాలా బాగుంది. ఏమి లేకుండానే ఉగాది వెళ్లిపోయింది అంటూ ఆవేదనతో కవి కటారి రామయ్య చాలా బాగారాశారు. అలాగే ఇసుకేరా అన్నింటికి మూలం అంటూ ఇసుక అక్రమాలపై రాసిన కవిత కూడా చాలా బాగుంది.
- వాసిలి అనంతరామయ్య, అద్దంకి
- సజ్జా హేమలత, రేణిగుంట

----
మనోగీతికలు
----

కరువు
ఏ గుండెను తవ్వినా
కరువుని ఏకరువు పెడుతుంది
భూమి పొరల్లోకి ప్రయాణించినా
ఎడారి దృశ్యమే ఎదురవుతుంది
మబ్బును చూసి మురిసిన రైతు కళ్లు
కన్నీటి చలమలవుతున్నాయి
నోళ్లు తెరుచుకున్న బీళ్ల దాహం తీర్చలేక
రైతు గుండె చెరువవుతుంది
అరక కట్టిన నాగలి
అన్నం మెతుకై మొలకెత్తడం లేదు
కలుపుమొక్కనూ..కనలేని భూమాతను చూసి
మేడిపట్టిన రైతు
నగరమనే అరణ్యంలోకి
వలస పిట్టై ఎగిరిపోతున్నాడు
కాడిని మోసిన మోపురం
కబేళాలలో శలభమై పోతుంది
కొలుపులు చేసినపుడు
మేఘం గర్జిస్తూనే వుంది
ఋతుపవనానికి
రుతుస్రావమై తేలిపోతుంది
గ్రీష్మం దుశ్శాశనుడైతే
చెట్లన్నీ వివస్తల్రై నగ్నంగా దర్శనమిస్తున్నాయి
తన అపార్టుమెంట్‌ని కోల్పోయిన ఓ పిట్ట
వర్షాకాలం సమావేశం జరుగుతున్న
అసెంబ్లీ ముందు ధర్నాకు దిగింది
ఓటు వేయడానికి నిలబడినట్లు
ఖాళీ బిందెలు బారులుతీరి నిలుచొనివున్నాయి
నిండు గర్భిణిలా వాటర్‌ట్యాంకర్ వచ్చినప్పుడల్లా
ప్రతి మహిళా ఝూన్సీలక్ష్మిబాయై దర్శనమిస్తుంది
నీటి యుద్ధాలు గురించి విన్నాం నేడు చూస్తున్నాం
వర్షం చినుకై రాలకపోతే
మనిషికి మిగిలేది కన్నీటి చినుకే
దేశానికి పట్టిన కరువు కరువైపోయేది
జలం చిద్విలాసం చేసినపుడే
జనం మనుగడ సాధ్యమయ్యేది
చెట్టుని బిడ్డగా పెంచుకొన్నపుడే
వర్షానికి వసీకరణం చెట్టు
వృక్షాన్ని విస్మరిస్తే
దేశంలో అన్నిటికీ కరువే
ఒక్క!
అమలుకాని ప్రభుత్వ పథకాలకు
రాజకీయ నాయకుల వాగ్దానాలకు తప్ప..!

- పొన్నూరు వేంకట శ్రీనివాసులు
ఒంగోలు
చరవాణి : 9440432939

‘‘మేఘమా.. కురిసిపో’’
ఆకాశాన్ని చూసినప్పుడు
ఆకాశంలో.. నల్లని మబ్బుల్ని చూసినప్పుడు
ప్రజలంతా కరవుతో అల్లాడుతున్నారు
తాగటానికి నీళ్లు లేవు
మూగజీవాల అరణ్యరోదన
పంటలు ఎండిపోయి
కరవు సీమను తలపిస్తూ
రైతాంగం కన్నీళ్లు పెడుతోంది
ఆకాశంలో
అక్కడా.. ఇక్కడా తిరిగే మేఘమా
కాసేపు నీ ప్రయాణాల్ని కట్టేసి
ఒకసారి చూడు
హృదయ విదారకంగా ఉన్నది చూడు
ఒక్కసారిగా కుండపోతతో
నీ పరామర్శను చూపించు
నేలంతా నీ ఆలింగనంతో
ముద్దయ్యేటట్టు వర్షించుమా!

- మార్టూరి శ్రీరామ్‌ప్రసాద్
చరవాణి : 9490455599

ఆ మహోదయమెప్పుడో..
పరుగును వీడదు కాలం
కోయిల మానదు గానం
కానీ మనిషి మాత్రం తన ధర్మమైన
మానవత్వాన్ని విడిచి పెట్టేశాడు
ఏడాదిగా జాడలేని
మల్లెలు మళ్లీ వికస్తున్నవి
ఎండిన గుండెలో కరుణ
ఎడాది కోయిల చందమే
హృదయానికి లేదా వసంతం?
కళ్లున్నా చూడలేని
చెవులున్నా వినలేని
కాళ్లున్నా కదలలేని
జడత్వపు జీవుల్లో
ఎండిన గుండెల్లో
రసోదయ
మహోదయమెన్నడో?!

- చిరమన వెంకటరమణయ్య
గూడూరు
చరవాణి : 9441380336
--

రచనలకు
ఆహ్వానం
నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net