రాజమండ్రి

ఖరీదైన వృథా! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదో ఖరీదైన కళ్యాణమండపం...
నగరంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరుగా పేరొందిన సూర్యప్రకాశ్ కుమార్తె వివాహ వేడుక జరుగుతోంది అక్కడ...
భారీ జనరేటర్ల హోరు... రకరకాల విద్యుద్దీపాల కాంతుల నడుమ రాత్రి అయినా పట్టపగలను తలపిస్తోంది...
ఒకపక్క బ్యాండుమేళం వాయిద్యాల నడుమ ఎక్కడలేని హడావుడి అంతా అక్కడే కనిపిస్తోంది...
కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కోట్లకు పడగలెత్తిన సూర్యప్రకాశ్‌కు ఒకే ఒక కూతురు... అపర్ణ.
తన స్థాయికి తగ్గ వరుడి కోసం వెదికి వెదికి చివరకు అనుకున్నది సాధించాడు.
విశాఖపట్నంలో తనలాగే కాంట్రాక్టులు చేస్తూ వందల కోట్లకు అధిపతి అయిన పద్మాకరరావుతో సంబంధం కలుపుకోబోతున్నాడు.
పద్మాకరరావుకు ఒకడే కొడుకు. యుఎస్‌లో ఎమ్మెస్ చేసి ఇటీవలే ఇండియాకొచ్చాడు.
ఇద్దరూ అపర కుబేరులే...ఇంకేంటి నిశ్చితార్థమే ఒక చిన్నసైజు వివాహ వేడుకలా జరిపించారు.
ఇక పెళ్లి అంటే ఎలా ఉంటుందో ఊహించాల్సిన అవసరంలేదు.
కళ్యాణమండపం పార్కింగ్ ప్రదేశం నిండిపోయి, బయట రోడ్డుపై కూడా పడవల్లాంటి కార్లు బారులు తీరాయి.
కళ్యాణమండపం ముందు ఖరీదైన పట్టుబట్టల్లో నిల్చున్న సూర్యప్రకాశరావు దంపతులు వచ్చిన అతిథులకు చిరునవ్వుతో ఆహ్వానం పలుకుతున్నారు.
తమ స్థాయికి కల్యాణమండపం సరిపోదనే కారణంతో ఆరుబయటే భారీ వివాహ వేదిక నిర్మించారు... సినిమా సెట్టింగును తలపించేలా ఉన్న వేదిక నిర్మాణానికే కొన్ని లక్షల రూపాయలు ఖర్చయ్యింది.
ఇక ముహూర్తం రాత్రి 9 గంటలకే కావడంతో వచ్చిన అతిథులంతా డిన్నర్ చేస్తూ పెళ్లి తిలకించేలా రౌండు టేబుళ్లతో ఏర్పాటుచేశారు.
కుబేరుడు తలచుకుంటే ఇంకేముంది... రకరకాల సూప్స్, స్నాక్స్, జ్యూసులు...స్వీట్లు... ఫ్రూట్స్, ఐస్‌క్రీంలు, రకరకాల బిర్యానీలు, ఫ్రైడ్‌రైస్‌లు, కూరలు.... ఒకటనేమిటి... శాకాహార భోజనంలో ఫలానా ఐటమ్ లేదు అని ఎవరూ వేలెత్తిచూపలేని విధంగా అక్కడ ఏర్పాట్లున్నాయి.
టేబుల్ ముందు ఆశీనులైన అతిథుల వద్దకే కోరుకున్న ఐటమ్స్ క్షణాల్లో అందించేలా నీట్‌గా డ్రస్‌చేసుకున్న వెయిటర్స్ సిద్ధంగా ఉన్నారు.
ఇంకా అతిథులే స్వయంగా వెళ్లి తెచ్చుకునేలా బఫే ఏర్పాట్లు కూడా జరిగాయి.
వచ్చిన అతిథులు రకరకాల సూప్‌లు టేస్ట్‌చేసి, స్టార్టర్స్‌గా పెట్టిన రకరకాల స్నాక్స్ తినేసరికే కడుపు నిండిపోతోంది... ఇక మిగిలిన ఐటమ్స్ ఎవరికి వారు అలా వదిలేస్తున్నారు.
కొందరు స్నాక్స్ ఒకటీ అరా రుచిచూసి వదిలేసి, బిర్యానీ తదితరాలవైపు మళ్లుతున్నారు... ప్రతీ టేబుల్‌పై ఉంటున్న డిస్పోజబుల్ పళ్లాల్లో తిన్నవాటికంటే వదిలేసే ఐటమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి... వాటిని ఎప్పటికప్పుడు గంపల్లోకి లాగేసి, బయటవున్న డస్ట్‌బిన్‌లో వేసేస్తున్నారు క్లీనింగ్ చేసే కుర్రాళ్లు.
ఇదంతా గమనిస్తున్న ఈశ్వర్రావుకు కడుపు తరుక్కుపోతోంది.
ఈశ్వర్రావు సూర్యప్రకాశ్‌కు చిన్ననాటి స్నేహితుడు. వారి కుటుంబాల మధ్య సైతం అదే సాన్నిహిత్యం ఉంది.
సూర్యప్రకాశ్ అంత కాకపోయినా ఈశ్వర్రావు కూడా ధనవంతుడే... కాకపోతే కాస్త పొదుపరి... ప్రతీదీ లాభనష్టాల బేరీజు వేస్తుంటాడు... అందుకే జనం భాషలో మాత్రం అతనో పిసినారి.
పెళ్లిలో కీలకమైన డిన్నర్ ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతను ఈశ్వర్రావుపై ఉంచాడు సూర్యప్రకాశ్.
కళ్లముందే ఎంతో ఖరీదైన ఆహార పదార్థాలు అలా వృథాగా డస్ట్‌బిన్‌లోకి చేరిపోతుంటే ఉండబట్టలేకపోయాడు ఈశ్వర్రావు.
అతిథులకు డిన్నర్ ప్లేట్లు అందించే పనిలో నిమగ్నమైన వారిలో ఇద్దరిని పిలిచాడు.
అప్పటికే మంచినీటి బాటిళ్లు తెచ్చిన అట్టపెట్టెలు పదుల సంఖ్యలో ఖాళీ అయివున్నాయి. అందులో నాలుగు పెట్టెలు తెప్పించి, అతిథులు పేట్లలో ముట్టుకోకుండా వృథాగా వదిలేస్తున్న అరటిపండ్లు, స్వీట్లు, బజ్జీలు తదితర పదార్థాలను తీయించి, పెట్టెల్లో వేయించడం మొదలుపెట్టాడు.
అలా ప్రత్యేకించి, ఏరి తీయడానికి సమయం పడుతుండటంతో తానుకూడా అదే పనిలో నిమగ్నమయ్యాడు.
పెళ్లికి వచ్చిన అతిథుల్లో చాలామంది ఈశ్వర్రావుకూ బాగా పరిచయస్థులే... దానితో ఎంగిలి పళ్లాల్లో మిగిలిన పదార్థాలను జాగ్రత్తగా వేరే పెట్టెల్లోకి తీస్తున్న అతడిని వింతగా చూస్తున్నారు.
కొందరైతే పిసినారి బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు, రేపు బజారుకు తీసుకెళ్లి అమ్మేస్తాడేమో... అంటూ జోక్స్ చేసుకుంటున్నారు.
వివాహ వేదిక వద్ద ఏర్పాట్లను పర్యవేక్షణ బాధ్యతల్లో తలమునకలైవున్న ఈశ్వర్రావు భార్య శ్యామల చెవిన వేశారు ఎవరో ఈ విషయాన్ని.... కల్యాణ వేదికకు కాస్త దూరంగా జరుగుతున్న తతంగం ఆమెకు లీలగా కనిపిస్తోంది.
భర్త పొదుపు బుద్ధి తెలిసిందే కనుక పెద్దగా ఆశ్చర్యం అనిపించకపోయినా, ఒక్క క్షణం మ్రాన్పడిపోయింది.
ఛీఛీ... పెళ్లికి వచ్చినా ఆయన బుద్ధి పోనిచ్చుకోలేదా అనుకొంది.
ఇక ఆగలేకపోయింది... కాస్త దూరంలో ఉన్న కొడుకు విష్ణును పిలిచింది.
‘చెవిలో నాన్నగారు తన పిసినారి బుద్ధితో ఏదో చేస్తున్నారంట...పరువు పోయేట్టుంది... వెళ్లి కాస్త ఆపు...’ అంది.
వెంటనే విసవిసా నడుచుకుంటూ తండ్రి వద్దకు వెళ్లాడు విష్ణు.
తన ఎదురుగా నిల్చున్న కొడుకును చూసిన ఈశ్వర్రావు...‘రారా ఖాళీయేనా... అదుగో ఆ పెట్టెలను జాగ్రత్తగా ప్యాక్ చేయి’ అన్నాడు. కాస్త దూరంగా పక్కన పెట్టివున్న పెట్టెలను చూపించి మళ్లీ తన పనిలో నిమగ్నమైపోయాడు.
తలతిప్పి పక్కకు చూశాడు.
తలతిరిగిపోయింది... దాదాపు డజనుకు పైగా పెట్టెల్లో రకరకాల పదార్థాలు ఉన్నాయి.
‘ఏంటి నాన్నా అవన్నీ’ అన్నాడు.
‘కనిపించడంలేదా అవన్నీ అతిథులు తినకుండా ప్లేట్లలో వదిలేసినవే’
‘తెలుసు నాన్నా... ఎందుకు అవన్నీ అలా సేకరిస్తున్నారు’ అడిగాడు.
‘ఎందుకో తరువాత చెబుతాను... ముందు అవన్నీ జాగ్రత్తగా ప్యాక్ చెయ్యి’ విసుగ్గా చెప్పాడు ఈశ్వరరావు.
‘నాన్నా....’
‘నువ్వలా చేస్తుంటే పరువుపోతుంది...’ గట్టిగా అరిచాడు విష్ణు.
కొడుకువంక ఒకసారి చూసి, చిరునవ్వు నవ్వి, మళ్లీ తన పనిలో నిమగ్నమయ్యాడు ఈశ్వరరావు.
ఒకపక్క వివాహ తంతు జరుగుతుండగానే ఈశ్వరరావు అక్కడే నేలపై కూర్చుని, ఐటమ్స్‌తో నిండిన పెట్టెలను శ్రద్ధగా తాళ్లతో కట్టి ప్యాక్‌చేశాడు.
‘విష్ణూ... వెళ్లి పార్కింగ్‌లో నా కారువుంది తీసుకుని రా ఆదేశించాడు కొడుకుని’
తండ్రి అంటే ఉన్న భయం... గౌరవంతో మారుమాట్లాడకుంటా పార్కింగ్‌లో ఉన్న తండ్రి కారుని డిన్నర్ జరుగుతున్న ప్రాంతానికి తీసుకువచ్చాడు.
ఖరీదైన ఆడీ కారు అది.
‘డిక్కీ ఓపెన్ చెయ్యి’ అన్నాడు ఈశ్వరరావు.
అలాగే చేశాడు..
ప్యాక్‌చేసిన పెట్టెలను ఒక్కొక్కటిగా డిక్కీలో పెట్టాడు.
కొన్ని పెట్టెలు మిగిలిపోతే కారు బ్యాక్ డోర్ తీసి సీటులో ఉంచాడు.
తాను వెళ్లి ముందు సీటులో కూర్చుని, పోనియ్యి అన్నాడు.
అప్పటికే పెళ్లి పూర్తయినా, ఇంకా అనంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ప్రాణస్నేహితుడి కుమార్తె పెళ్లి వేడుకను వదిలి తండ్రి ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి... మనసులో ఆలోచిస్తూనే కారును ముందుకు పోనిచ్చాడు విష్ణు.
ముందు సీటులో కూర్చుని కొడుక్కి రూటు చెబుతున్నాడు.
సిటీ లిమిట్స్ దాటి శివారు ప్రాంతానికి చేరుకుంది కారు.
ఇక అక్కడి నుండి అంతా పెద్ద మురికివాడ.
మురికివాడ మధ్యలోకి వెళ్లాక అక్కడ కారును ఆపించాడు.
రాత్రి వేళలో పడవలాంటి కారు వచ్చి ఆగడంతో ఆశ్చర్యపోతూ చుట్టూ చేరారు మురికివాడ వాసులు.
డిక్కీ తెరిపించి ఒక్కో పెట్టెను కిందకు దించాడు. తండ్రితోపాటు విష్ణుకూడా భాగస్వామి అయ్యాడు.
పెట్టెలు తెరిచి, అక్కడున్న వారందరినీ పిలిచి, అందులో ఉన్న ఐటమ్స్‌ను పంచిపెట్టడం ప్రారంభించాడు.
అప్పటికిగాని అర్థం కాలేదు విష్ణుకు తండ్రి ఏం చేస్తున్నాడో...
ఈ విషయం మురికివాడ అంతా పాకిపోవడంతో క్షణాల్లో అక్కడ బారులుతీరారు.
ఆడామగా, పిల్లలు అంతా ఖరీదైన ఆ పదార్ధాలను చాలా ఆబగా తింటున్నారు.
వాళ్లలో చాలామంది జీవితంలో అలాంటి పదార్థాలను తినడం అదే మొదటిసారి... ఇక పిల్లలైతే చూడటం కూడా అదే మొదటిసారి...
రాత్రివేళ తమ ఇళ్లముంగిట్లోకి వచ్చి, అమృతప్రాయమైన ఆహారాన్ని అందించిన తండ్రీ కొడుకులను చల్లగా ఉండమని దీవిస్తూ వెళ్తున్నారు ఆ పేదలు.
కారు తిరిగి కళ్యాణమండపం వైపు బయలుదేరాక మొదలుపెట్టాడు ఈశ్వరరావు....
‘మన దేశంలో ఏటా ఇలాంటి ఖరీదైన వివాహాల్లో వృథా అవుతున్న ఆహార పదార్థాల విలువ కొన్ని వందల కోట్ల రూపాయలు... అంతేకాదు ఆ పదార్ధాలను చెత్తకుండీల్లో పోయడంవల్ల అవి కుళ్లి, విషంగా మారి వెదజల్లుతున్న కాలుష్యం కూడా లెక్కలేనంత...
ఇప్పుడు మనం పడిన కష్టం మహా అయితే ఒకటి రెండు గంటలు...
కానీ మనం అందించిన ఆహారం స్వీకరించిన అభాగ్యులకు మాత్రం అది నిజంగా అమృతప్రాయమే...’
ఇంతకాలం తండ్రిని బంధువులు, సన్నిహితులు పీనాసి అంటుంటే ఏమిటో అనుకున్న విష్ణుకు తండ్రిలోని ఉన్నత భావాలు, సామాజిక బాధ్యత తెలిసివచ్చి... అప్రయత్నంగా కళ్లు చెమర్చాయి.

- ఎం. జగదీశ్వరి
వీరవాసరం, ప.గో.జిల్లా

పుస్తక పరిచయం

బాధ్యతను గుర్తుచేసే
‘మన మంచి తెలుగు’

తెలుగువారి కోసం తెలుగులో ప్రియమైన పుస్తకంగా వచ్చింది. తెలుగు చదువరులకు కోపం వస్తుంది. నిజమే. తెలుగులో మాట్లాడటం, రాయడం నామోషీగాను, నామర్దాగాను భావిస్తున్న కాలం. ఎవరి మాతృభాష కోసం వారు పరితపిస్తూ పోతుంటే మన భాష పట్ల మనకేమీ పట్టనట్టుండే దౌర్భాగ్య పరిస్థితి మన తెలుగుకు పట్టింది. ఇంకా భాషా ప్రేమికులు తమ మాతృభాష మీద మమకారం చావకుండా ఉండటం కోసం భాషా విషయాలపై శ్రద్ధపూని నిరంతర కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఆ కోవలోదే ఈ పుస్తకం ‘మన మంచి తెలుగు’. రచయత బహు గ్రంథకర్త డాక్టర్ మలయశ్రీ.
తేనెలూరు తెలుగు పదాలలోని రూపాన్ని, భావాన్ని పరామర్శించిన ప్రయత్నమే ఈ పుస్తకం. అందుకే తెలుగు భాషా పదాల - రూప భావ పరామర్శ అన్న ఉప శీర్షికతో పుస్తకాన్ని వెలువరించారు. చరిత్రను గురించి చెప్పుకుంటూ వచ్చారు. చదువుకుంటూ రెండో పేజీలోకి రాగానే మనకొక తెలుగుమాట కన్పడుతుంది. గాధా సప్తశతిలోని ‘పులుమావి’. ఆ పదం యొక్క అర్థం ‘గడ్డి గర్భ సంజాతుడు’ అని. ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నించారు మలయశ్రీ. తెలుగు భాష జనం వాడుకలో ఉన్నా అప్పటికి తెలుగు వాక్యాలు రాలేదంటే ఆ స్థాయికి ఎదిగి ఉండదంటారు. జానపదం, వౌఖిక సాహిత్యం కాలగర్భంలో కల్సిపోయిందన్నది ఆయన అభిప్రాయం. పదకొండవ శతాబ్దంలో నన్నయ్య భట్టారకుడు అనువదించిన మహాభారతమే కవిత్వంలో మొదటిది అంటారు. అప్పటికి ఇప్పటికి అదే మన తెలుగు భాషకు, కవిత్వానికీ ప్రామాణిక గ్రంథం అంటారు. చరిత్రను ఔపాసన పట్టిన మాస్టారు రాసిన విషయాలు చదువుతుంటే మన మాతృభాషను ఎంత భ్రష్టుపరుస్తున్నామో అనిపిస్తుంది. తెలుగు అనార్య భాష అయితే ద్రవిడ భాషా కుటుంబానికి చెంది పరిపక్వ భాష అయిందంటారు. సమస్త భాషలకు సంస్కృత భాష మూలమనేది తప్పంటారు. దాన్ని సంస్కృత భాషాభిమానుల కల్పిత సూక్తిగా కొట్టిపారేస్తారు. ఒక చక్కని కొత్త విషయాన్ని చెప్పారు. తమిళం, కన్నడం, మలయాళం, తులు, కుయి గోండీ భాషలు తెలుగు సోదర భాషలంటారు. ఎందుకంటే వాక్య నిర్మాణం, పదాల - క్రియల రూపాలు అర్థాలు వాటి మధ్య పోలికలు ఎక్కువని చెప్పారు.
పండితుల సంస్కృతాభిమానంతో తెలుగు పదాలు మాయమైపోయాయి. చాలా పదాలు తెలుగు పదాలనుకునేంత సంస్కృత పదాలు తెలుగులో కలిసిపోయాయి. అన్నం, దేహం, సూర్యచంద్రులు, గృహం, వివాహం, సంతానం, స్వర్గ నరకాలు ఇవీ సంస్కృత పదాలు. ఆశ్చర్యమనిపిస్తాయి. ఇక మన పొరుగు రాష్ట్రాల తమిళ, కన్నడ, ఒరియా, మరాఠి, హిందీ పదాలు తెలుగులో కలిసిపోయాయి. అలాగే ముస్లిం పాలకుల వల్ల ఉర్దూ, పార్శీ పదాలు మన భాషలోకి మిళితమైపోయాయి.
భాష అభివృద్ధి చెందటానికి వివిధ ప్రాంతాల ప్రజలు దోహదకారులు అవుతారు. రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోని ఇతర భాషా పదాలు తెలుగు పదాలు అయిపోయాయి. రాయలసీమను ఆనుకొన్నది కర్ణాటక రాష్ట్రం. కన్నడ పదాలు తెలుగులో కలుస్తున్నవి... దొడ్డ, బెట్ట, గెనుసు, సంకట, దుడ్డు, బేడలు (బేళె = పప్పు) అలాగే ఉత్తరాంధ్రలో ఒరియా పదాలు పాత్రుడు పాత్రోలాంటివి కల్సిపోయాయి. తెలంగాణా హద్దులో మరాఠీ పదాలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తమిళ పదాలు కలగలసి ఉంటాయి. మన కోస్తా జిల్లాల్లో కుళాయి, టెంకాయి, నేరుగా, సాంబారు, వడ విరివిగా వాడేస్తాం. అవి తమిళ పదాలు. అలాగే ధోతి - అడ్డ పంచె కట్టు తమిళులది. ఇక పంఖా, జేబు, చెట్నీ, సుస్తీ, హుషారు, నాస్తా, దోస్త్, మస్త్, జబర్దస్త్, దరఖాస్తు, నౌకరు ఇవన్నీ ఉర్దూ పదాలు. కాకపోతే తెలుగులో వాడుతున్న ఇంగ్లీషు పదాలు అబ్బో చెప్పక్కర్లేదు. విడదీయలేనంత గాఢత కలవి. మనం ఒకటి గుర్తించాలి. నిత్య వాడుకలో లేనివి మరుగున పడిపోతాయి. ఇంతకీ చెప్పొచ్చేదేమంటే తెలుగు పదాలు వాడితేనే వాటి మనుగడ. అంతే.
సామెతలు ఎలా పుట్టాయో ఎలాంటి మార్పులు చెందాయో చర్చించారు. మనకు బాగా అలవాటైన సామెత ‘గాడిద గుడ్డు కంకర పీచు’గా కొట్టి పారేస్తాం. అది ఎలా ఆవిర్భవించిందో చెప్తూ జానపదంలో అయిన మార్పును విశే్లషించారు. అలాగే ‘పని లేని మంగలి పిల్లి తల గొరిగినట్టు’ అంటుంటాం. నిజానికి ‘పిల్లి’ కాదు, ‘పిలిచి’ అది జనవాడుకలో పిల్లి అయిపోయింది. ‘పోరు నష్టం పొందు లాభం’ పోరు అంటే వెళ్లరని కాదు గొడవ, తగాదా. అలాగే పొందు అంటే పొందటం కాదు చెలిమని, అలాంటివెన్నో చక్కగా విపులీకరించారు రచయిత మలయశ్రీ.
పురాణ పురుషుల పేర్లలోని అర్థాలు వివరణ బాగుంది. చూడండి ‘అభిమన్యు’ అంటే అధిక కోపం కలవాడు, అగస్త్యుడు అంటే కొండను అట్లా ఉంచినవాడని, కుచేలుడు అంటే చినిగిన బట్టల వాడు అని వివరించారు. గమ్మతె్తైన ఈ పేరును చూడండి ‘బాలాజీ’ అంటే ఠపీమని వెంకటేశ్వరస్వామి అనేస్తాం. కాని నిజానికి బాలాత్రిపుర సుందరిని సంక్షిప్తం చేస్తే ‘బాల’ కదా గౌరవ వాచకం చేస్తే మరి వింతగా లేదు. రావణ = పెద్ద అల్లరి చేయువాడు, వాలి = తోక కలవాడు, ద్రోణుడు, భీష్ముడు, అశ్వత్థామ, కౌసల్య, కైకేయి లాంటివి. చాలా విచిత్రంగా ఉంటాయి. ఇవి అసలు పేర్లు కావు. విశేషణాలు అంటారు. కావ్య రచన కదా కవుల సృష్టి. అలాగే తెలుగు పేర్ల పదాలను పరామర్శించారు. భద్రాచలం, వెంకటాచలం, సింహాచలం, వీటిని విడదీస్తే భద్ర+అచలం అలాగే మిగతావి అచలం అంటే కొండ. సింహాద్రి, వెంకటాద్రి, శేషాద్రి. అద్రి అన్నా కొండ అర్థం. రంగాచారి, రామాచారి సరికాదంటారు. చారి - సంచారి. సంచరించువాడు. దానికి ఆచారవంతుడనే అర్థం రాదంటారు. తప్పుని ఒప్పుగా పాడేసుకుంటూ పెద్ద తప్పిదం ‘్భద్రాద్రి రామదాసు’ పాట ‘మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి కరుణించుమని చెప్పవే’ అంటూ తెగ పాడేసుకుంటాం. కాని ‘బ్రోవుమని’ అంటే కరుణించమని ఉండాల్సిందంటారు. హనుమద్దాసులు అనాలోచితంగా పద రూపాలు మార్చి పాడి ఉంటారు అనేది ఆయన అభిప్రాయం. ఇంకో సినిమా పాట చాలా మంచి పాట. ‘వౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది... ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది’ కదా! ఎదగమని, ఒదగమని ఇవి వ్యతిరేకార్థ పదాలు కావా? ఎందుకో చాన్నాళ్ల నుంచి మన కవులు, రచయితలు, పండితులు - పామరులు, పత్రికల రాతలు - సభల ప్రసంగాలు అంతటా ఈ అనమను, తినమను, వినమను అంటూ నెగిటివ్ పదాలు వాడుతున్నారని ఆయన వాపోతున్నారు. ఎందుకంటే అనేవారికి, వినే వారికి లేని ఈ బాధ విశే్లషకులకే ఉంటుంది మరి. అలాగే కొన్ని పాత, కొత్త సినిమా పాటలు పదాల అర్థాలు చర్చించారు. మలయశ్రీ మాట ఏమిటంటే రాసేవాళ్లంతా తమ తప్పు తెలుసుకొని సరియైన పదాలు వాడమని భాషను కాపాడమని ఆయన వేడుకోలు. ఇంకా ఈ పుస్తకంలో అన్నమయ పదాలతో మారిన సంస్కృత పద రూపాలు, తెలుగు పద రూపాల పట్టిక. డాక్టర్ సినారే పద ప్రయోగాలు, గురజాడ వాడిన పదాలు పట్టికగా ఇచ్చారు. ఇవి పరిశోధక విషయాలు. క్షేత్రయ్య, త్యాగరాజు, రామదాసు అలా కొందరు వాడిన పద ప్రయోగాలు పుస్తకంలో ఉన్నాయి. ఆయన ముఖ్యంగా కరీంనగర్ జిల్లా తెలుగు సాహిత్యం చరిత్రపై పరిశోధన చేసిన వారు. తన భౌతిక వాది పత్రిక ద్వారా, తన రచనల ద్వారా తెలుగు భాషా సేవ చేస్తున్న భాషావేత్త కనుక ఈ పుస్తకం విద్యార్థులు సాహితీపరులు, భాషాభిమానులు కొని తప్పక చదవ తగిన పుస్తకం.

- రవికాంత్, సెల్: 9642489244

మనోగీతికలు

కాలుష్యం ఛేదించే ఖడ్గం
గుడ్డ సంచులనే వాడుదాం
ప్లాస్టిక్ కవర్లు మనకు వద్దని చెబుదాం
ధరణి పట్ల మన బాధ్యత గుర్తిద్దాం
స్వచ్ఛమైన ప్రకృతిలో జీవిద్దాం
పాలు తేవడానికి ప్లాస్టిక్ సంచి
కూరలు, సరకులు మోసేటందుకు ప్లాస్టిక్ సంచి
పూవులు, పళ్లూ తెచ్చేటందుకు ప్లాస్టిక్ సంచి
ఇల్లంతా ప్లాస్టిక్ సంచులమయమురా!
ఇలా సాగితే మనిషి బతుకు భయమురా!
ప్లాస్టిక్ కవరు కరగడానికి
వేల సంవత్సరాలు పట్టు నేలకి
పారేస్తే నీటి పొరలను కప్పివేయురా!
ఇంటినిండ ప్లాస్టిక్ కవర్లతో అనారోగ్యమే
కేన్సర్ చర్మవ్యాధులకిది కారకమే
గుడ్డసంచి కాలుష్యం ఛేదించే ఖడ్గం!
గుడ్డసంచి నవ మానవ నాగరికత చిహ్నం
గుడ్డసంచి ప్రకృతిని ప్రేమించే మార్గం

- పంపన సాయిబాబు
తోలేరు, వీరవాసరం, ప.గో.జిల్లా
సెల్: 9652801014

ఆలోచించు నేస్తమా!
నేస్తం.. మనం అక్షరాలు సృష్టిస్తాం కదా!
అమృతాన్ని ఒలికిస్తాం కదా!
ఆలోచనలలో పసిపాపలెందుకవుతున్నాం
అహంకార జ్వాలల్లో
శలభాలెందుకవుతున్నాం
వటవృక్షాన్ని మించిన స్థైర్యం మనది
ముళ్లను పూలుగా మార్చే
మంత్రజాలం మనది
కుళ్లు సమాజంలో
బ్రతకలేని తనమెందుకు?
తుళ్లి తుళ్లిపడే వయసులోని
చేప పిల్లలా మనం
మన కవితలతో చేద్దాం ఉద్యానవనం
అమృతం తప్ప విషాన్ని చిమ్మని
వర్షం కురిపిద్దాం
పుస్తకాలే కదా మన నేస్తాలు
ప్రేమ స్మృతులేగదా వాస్తవాలు
వికసించాలి మన మస్తకాలు
అగ్నిలా వర్షించాలి
అన్యాయాలపై అక్షరాలు
నిప్పులు చిమ్ముతూ నింగికెగరాలి
అక్షర క్షిపణులు..
ఆత్మహత్యలు మనకొద్దు నేస్తం
ఆయువునిచ్చే సత్యాలు మనకు నిత్యాలు

- సుధాశశిరేఖ
సెల్: 95333 76193

యంత్రంలా
మనిషి మారాడు ఒక యంత్రంలా
క్షణకాలం తీరిక లేని చాటింగ్‌లు
సెల్‌తో ఎస్మెస్‌లు పంపిస్తూ...
ప్రేమ, అనురాగాలకు దూరం అయ్యాడు
నిత్యం టెన్షన్‌తో సతమతమవుతూ..
లేని, రాని చిరునవ్వును ముఖంపై
తెచ్చుకుని
జీవనం సాగిస్తున్నాడు ఒక యంత్రంలా...
పెదవులపై చిరునవ్వు
ఎదుటి వారికి మనసై పెంచుతుంది లవ్వు
అందుకే నువ్వు
నీ పెదవులపై చెదరనీయకు నవ్వు

- చింతా రాంబాబు, కాట్రేనికోన

స్నేహం కోసం
ఆమె కనులు...
వయ్యారంగా ఆకాశాన్ని తడుముతూ
కంటి అంచున సన్నని నవ్వు చెలిమికై ఎదురుచూస్తూ...
నను తాకంగ
ఆమె భుజంపై వాలాను
నా కనులు ఆమెవవ్వగ
ఆమె చెవులు నావి అవ్వగ
విహంగంకై తరుముకొస్తున్న వేట తుపాకి
ఆమె శబ్దానికి వెనుక జారంగ
నాకు అర్థమయింది
నేను విన్నది సింహగర్జనని

- ఎం నీరజాదేవి, సెల్: 9866779398

email: merupurjy@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా.
email: merupurjy@andhrabhoomi.net

- ఎం. జగదీశ్వరి