రాజమండ్రి

ఇక సెలవు! - కథ : మెరుపు - రాజమండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఎవరండీ, లోపల... మేడమ్ గారేనా’’ నవ్వుతూ చొరవగా ఇంట్లోకి వస్తున్న వేణుని సోఫాలో కూర్చుని ఫైల్స్ చూసుకుంటున్న శశి ఉలిక్కిపడి తలెత్తి చూసింది.
వేణు మొహంలో నవ్వు... అదే నవ్వు తనకిష్టమైన నవ్వు. హృదయంలో పదిలంగా ముద్రవేసిన అందాల నవ్వు. మళ్లీ చూడగలిగినందుకు సంతోషంతో సోఫాలోంచి లేచింది.
‘‘రండిసార్ రండి... దారి తప్పలేదు కదా?’’ అడిగింది.
‘‘మేం మర్చిపోమండి... మీరే మమ్మల్ని దూరంగా ఉంచుతారు. ఏం లేదు, మా రెండో పాప పెళ్ళికి ఆహ్వానిద్దామని’’ అంటూ వెడ్డింగ్ కార్డు చేతికందించాడు.
‘‘బయట మీ సిస్టర్, అదేనండి నా భార్య, కారు దగ్గరే ఉండిపోయింది వెళ్లాలి. తప్పకుండా పెళ్ళికి రండి. వస్తారనే ఇంటికి వచ్చి మరీ పిలుస్తున్నాను. రాకపోయారో అంతే మరి. మాట్లాడుకోవడాలుండవ్’’ అంటూ అదే నవ్వు అదే స్పీడ్‌తో నిష్క్రమించాడు.
‘వేణు... వేణు.. ఒకప్పుడు ఆ పేరంటే ఇష్టం తనకి. మైమరచిపోయేది. కాని ఇప్పుడు?’ అంతే... ఉన్నపళంగా శశి మనసు ముప్పై ఏళ్ళు వెనక్కి మళ్ళింది.
* * *
అమ్మ బతికి ఉన్న రోజుల్లో తన వయసు స్వీట్ సిక్స్టీన్. ఇంటర్ చదువుతున్న రోజులవి. మరో ధ్యాసలేని చిన్నతనం.
అప్పుడే వైజాగ్ ఎవిఎన్ కాలేజీలో వేణు లెక్చరర్‌గా పని చేస్తూ రఘు మావయ్య ఇంటి పక్కనే అద్దెకుండేవారు.
వేణూది చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యే స్వభావం కావడంతో మావయ్యతో పరిచయం స్నేహంగా మారిపోవడానికి ఎంతో కాలం పట్టలేదని, ఇట్టే కలిసిపోయే స్వభావం అని అక్క చెప్పింది.
ఆ సమయంలోనే మావయ్య అనుకునేవారట, శశికి ఈ అబ్బాయికి ఈడు జోడూ బాగుంటుంది అని. ఇంకెందుకాలస్యం అనుకుని ఓ రోజు మామయ్య అతన్ని అడిగేరట. ‘‘పది కాసుల బంగారం, కొంత కట్నం, సారె పెడతాము. మా శశిని అర్ధాంగిగా స్వీకరిస్తావా’’? అని ఆ అబ్బాయికి శశి అంటే చాలా ఇష్టమని తెలిసే ముసుగులో గుద్దులాట ఎందుకని అడిగేసారట మావయ్య!
వేణు మాత్రం శశి వాళ్ల అమ్మగారి దగ్గరికొచ్చి శశి డిగ్రీకి పనికివచ్చే బుక్స్ కొని ఇచ్చేవాడు. పైగా అమ్మని అడిగి ‘అలా బజార్లోకి మీ అమ్మాయిని తీసుకెళ్తానండి మళ్లీ గంటలో దిగపెట్టేస్తాను’ అని చెప్పి, అన్నట్లుగానే బజారు అదీ చూసుకున్న మీదట దిగపెట్టేసి వెళ్ళిపోయేవాడు.
శశికి వారానికి రెండు ఉత్తరాలు రాసేవాడు. కాలేజ్ నుంచి వచ్చేసరికి ‘నీకేదో లెటర్ వచ్చింది’ అని ఇచ్చేది అమ్మ. కనీసం ఏమిటా ఉత్తరం? ఎక్కడి నుండి అని కూడా అడిగేది కాదు.
ఆ అబ్బాయికి శశికి పెళ్ళి కుదురుతుందని అమ్మ అనుకునేదేమో, అందుకే ఏమనేది కాదు.
ఓ రోజు వేణు, శశి వాళ్ళమ్మ నడిగి ఎప్పటిలా బజారుకని చెప్పి పగలే ఓ చోటుకి తీసుకెళ్ళాడు. శశికి లోపలికెళ్ళే వరకూ అది ఓ లాడ్జ్ అని తెలీలేదు. చాలా భయం వేసింది. అక్కడ ఒకే మంచం ఉంది. కూర్చోమన్నాడు. తను కూర్చోకపోతే బలవంతంగా కూర్చోబెట్టేడు. కాస్సేపాగి అలా పడుకో నీమీద చెయ్యి కూడా వేయను. పక్కనే పడుకో చాలు అని పదే, పదే అన్నాడు. తను మాత్రం పడుకోలేదు. అయినా తన రెక్క పుచ్చుకుని లాగి పడుకోమన్నాడు.
అతడి ప్రవర్తనకు కాళ్ళూ చేతులూ వణికాయి. పారిపోదాం అనుకుంది. ఏదో తెలియని భీతి, మగ స్పర్శ భయం అన్నీ కలగాపులగంగా మెదడులో మెదిలాయి. తన చిన్నతనం, పెరిగిన విధానం సంప్రదాయం, అమ్మ, నాన్న, అందరూ కళ్ళముందు మెదిలారు.
‘‘వెళ్ళిపోదాం వేణూగారూ... నాకు భయంగా ఉంది. మన ప్రేమ గురించి ఇంకా అమ్మకే చెప్పలేదు. ఇలా రావడం... అమ్మకి తెలిస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది? ఆవిడతో నేను ఇదివరకటిలా మాట్లాడగలనా?’’ అంటూ గభాలున లేచిపోయి తలుపులు తీసుకుని బయటికి పరుగున వచ్చేసింది. అతనువచ్చి ఇంటికి దిగపెట్టేశాడు. ఇద్దరి మధ్య మాటలు లేవు. షాక్‌లా వుంది తన మనసు.
వేణు అంటే తనకున్న ప్రేమ ముందు వేణు పెళ్ళి చేసుకుంటాడనే ఆశ ముందు... అతను అలా తీసుకెళ్ళినా ఎలా తీసుకెళ్ళాడో అలా దిగపెట్టేసినందుకు అతని మీద ప్రేమ తరగలేదు, తనదానే్న అనే భావనతోనే అతన్ని అతను కంట్రోల్ చేసుకోలేని స్థితిలో అలా ప్రవర్తించి ఉంటాడనుకుంది.
ఉత్తరాలు రాయడం మాత్రం మానలేదు. ఊరుకోకుండా తను కూడా జవాబిచ్చేది. ఎన్నో ఆశలు, కలలు ఉత్తరాలతో కల్పించేవాడు. అప్పుడే అన్పించేది ప్రపంచం చాలా అందమైనదని. ఆ ఉత్సాహం ఉరకలు వేస్తుంటే వచ్చే ఊహలతో ‘అతని నవ్వు’ అనే కవిత రాసి పత్రికకు పంపితే వాళ్ళు అచ్చువేశారు. ఆ కవితకు వందలాది మంది అభిమానుల నుండి ఉత్తరాలు వచ్చాయి. వేణుకి ఆ విషయం చెప్పలేదు సర్‌ప్రైజ్‌గా చెప్దామనుకుంది...
ఆ కవిత తనకెప్పుడూ కంఠస్థమే.
అతని నవ్వు / అతను నవ్వుతున్నాడు
హసనాల అధికారిగా... / మహరాజుగా
నవ్వులు కావవి, విరాళులు
రాగ సంగతినెరుగని వీణను
పల్కించు అనురాగ రవళులు
మనసు పొత్తిళ్ళనూగించు... జావళులు
చెప్పలేను అతనికీ విషయం...
ఎంతకాలమిలా...? / కలసిరాని కాలం
కరిగిపోతోంది... కొవ్వొత్తిలా...!
కవితలో ఆశ వుంది... ఆరాటం ఉంది... అతనే తన రాజు అనే నమ్మకం ఉంది. ఆ రారాజు, మహారాజు కవితకే పరిమితమైపోయాడా ఏమయ్యాడు...? ఏం చేశాడు...?
వేణు నుంచి లెటర్స్ రావడం మానేశాయి. రోజూ ఎదురుచూసేది. మానసికంగా ఒంటరితనాన్ని భరించలేక పగలు గడిపేసినా రాత్రి మాత్రం విపరీతంగా ఏడుపువచ్చేది. అమ్మ మాత్రం తమ్ముడు మాట్లాడిన ఆ అబ్బాయితోనే తన పెళ్ళి జరిగిపోతుందనే భ్రమలో ఉండేది.
వేణూ వాళ్ళమ్మ నాన్నలు వేరే అమ్మాయితో అతనికి పెళ్ళి చేసేశారని, ప్రేమించిన తనను, అతనికి తన మీద ఉన్న ప్రేమను ఉత్తరాలకే పరిమితం చేసి తన జీవిత పుటలోంచి ఆ అంకాన్ని తప్పించేసి సంసారంలో మునిగిపోయాడని ఓ రోజు అక్క వచ్చినప్పుడు చెప్పింది. ఏడుపు, ఏడుపు టుది పవర్ ఆఫ్ ఏడుపుగా... గడిపింది. ఆ ఏడ్పులో ఏడ్పుగా అమ్మ, మావయ్య ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరుగా ఈ లోకం నుంచే తప్పుకున్నారు. అక్కడ అక్క ఒంటరిగా పిల్లలతో పోరాటం, ఇక్కడ ఈ కుటుంబాన్ని పట్టించుకునే పెద్దలు కూడా ఎవరూ లేక అంతా శూన్యంగా అన్పించేది. ఎంతటి సంతోషాన్నైనా విషాదాన్నైనా తనలో ఇముడ్చుకుంటుందో లేదో కాలం నిర్ణయించాలి.
కరుడుగట్టిన స్తబ్దత గుండెల్లో
గూడుకట్టుకుని నిరాశతో ఉన్నా...
గతంలాంటి వర్తమానంలో కరిగి గతంఅవుతున్నా...
అపశృతిని శృతి చేద్దామని
భవిష్యత్తు మీద ఆశతో ఉన్నా...
ఆఫీసులో అందరిముందూ నవ్వుతూ మాట్లాడేది. మనిషి తన సంతోషాన్ని ఇతరులకు పంచాలి, కాని దుఃఖాన్ని కాదు అని తెలుసుకుని నటించడం మొదలుపెట్టింది. నాన్న పేషెంట్ అయ్యారు. అక్క చెల్లెళ్ల పెళ్ళిళ్ళు అయ్యాయి. తనకి ఉద్యోగం రావడం అనేదే తన బాధ్యతలకు పునాదిగా మారింది. అందరికీ అదృష్టం తన పాలిట శాపం అయింది. ఏడేళ్ళు ఇట్టే గడిచిపోయాయి.
* * *
ఓ రోజు వేణు ఇంటికి వచ్చాడు. ఎందుకో దీనంగా, గడ్డం పెరిగి నీరసించి, జబ్బుపడిన వాడిలా ఉన్నాడు. ‘‘ఏం ఏమైంది? ఎందుకలా ఉన్నారు’’ కంగారుగా అడిగింది.
షాకింగ్ న్యూస్ చెప్పేడు. పెళ్ళి చేసుకున్న తన భార్య రమ్య ఏడేళ్లకి ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డనివ్వలేక హాస్పిటల్‌లో చనిపోయిందని.
‘‘అయ్యో’’ అని నోటిమీద చెయ్యి వేసుకుంటూ అంది. ‘‘నీకు తెలుసా శశి ఏదైనా పాపం చేయడం తేలికే. ఆ పాపం తాలూకూ భయం మాత్రం మనిషిని వెంటాడుతూ ఇబ్బంది పెడ్తూనే ఉంటుంది. నీకు ఆశలు చూపి నిన్ను నిరాశాపాలు చేసిన నాకు ఈ శిక్ష పడాల్సిందే. నన్ను క్షమిస్తావా...?’’
‘‘్ఛఛీ... అలా అనొద్దు, నేను ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాను. ఉంటాను కూడా. ధైర్యంగా ఉండండి’’ అంది. కాలం ఎలా నిర్ణయిస్తే అలా ఒదిగిపోవడం నేర్చుకోవాలి. తనలా... చెప్పాలనుకుంది కానీ చెప్పలేకపోయింది.
వేణు వెళ్ళిపోయాక చాలా దిగులుగా అన్పించింది. తను అతని బాధను తగ్గించలేదు, ఏమార్చలేదు, ఎందుకంటే ఆ హక్కు తనకి ఇవ్వలేదతను. పడుచు వయసులో మనసులో ప్రేమ ముద్రవేశాడు గానీ తనదాన్నిగా చేసుకోలేకపోయాడు. ప్రేమించిన పాపానికి ఆ ప్రేమ లేఖలు నిజం చేస్తాడనుకుని ఎదురుచూస్తూ ఏడుస్తూ తనీరోజు ఇలా ఒంటరిగా మిగిలిపోయింది. తప్పక ఇంటి బాధ్యతలన్నీ నెత్తినేసుకుని తన జీవితంలో లోటుని మర్చిపోవాలని ప్రయత్నిస్తూ రోజుల్నీ, సంవత్సరాలని వెనక్కి నెట్టేస్తూ వచ్చింది.
వేణు ఒంటరివాడయ్యాడు పిల్లలు లేక, భార్య లేక కదా వస్తాడేమో తనని పెళ్ళి చేసుకుంటానంటాడని ఆశగా ఉండేది. ఎదురు చూసింది. వయసంతా వర్తమానం నుండి గతంలో గతించిపోతోంది. గతానికి వర్తమానానికి మధ్య కాలంలో ఎన్నో అనుభవాలు. తను కళంకిత కాకుండా ఉండాలనే ప్రయత్నాలు, మానసిక ఒత్తిడులు, సమాజంలో పెళ్ళి కాకుండా ఉన్న ఆడవాళ్ళు అనుభవించే విచిత్ర వ్యథలు... బాధలు... అవమానాలు... అన్నీ అనుభవించింది.
మళ్ళీ ఇదిగో ఇనే్నళ్ళకి ఇప్పుడు కూతురు పెళ్ళికి పిలవడానికి వచ్చిన వేణు ఓ రోజు ఫోన్ చేసి ‘‘నా కోసమేనా అలా ఉండిపోయావు. బాధ్యతలు పెంచుకొన్నావు. ఏం ఒక్కసారి అడగొచ్చుకదా... నన్ను...? ఇప్పుడు నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను. వారానికి ఒకరోజు వస్తుంటాను. నా ఆస్తి కొంత రాస్తాను. ఆలోచించు’’ అని రిసీవర్ పెట్టేశాడు.
వేణూ...
ఇది నా ఆవేదన లేఖ అనుకోండి ఆఖరి లేఖ అనుకోండి. చదవండి తప్పనిసరిగా! ఏ మనిషైనా పరిస్థితుల ప్రభావంతో ఎలా ఎటుపడితే అటు కొట్టుకుపోతాడో అలాగే నా జీవితాన్ని కాలానికే వదిలేశాను.
నిజానికి మీకు నేను భార్యను కాలేకపోయాను కాబట్టే చేపట్టిన బాధ్యతల్ని సవ్యంగా నిర్వర్తిస్తున్నాను. నాన్నకు తొమ్మిదేళ్ళు ఓ నర్సులా సేవచేసి కాపాడుకున్నాను. అందరికీ పెళ్ళిళ్ళు చేశాను. వాళ్ళకు న్యాయం చేయగలిగాను. మీరు, మీ ఆస్తి నాకేం వద్దు. మీ జీవితం మీది, నా జీవితం నాది. మీరు చేసిన పొరపాటు ఒకటే, మీ మొదటి భార్య చనిపోయినప్పుడు అడగాల్సిన పెళ్ళి మాట ఈ రోజు అడిగారు. జీవితంలో అర్ధకాలం ఆలస్యమైపోయింది. అదిప్పటికైనా గుర్తించండి.
ప్రేమ త్యాగాన్ని కోరుతుంది!
స్ర్తి జీవితం ప్రేమాభిమానాల ప్రాకారం!!
స్ర్తి జీవితం స్నేహ సహకారాల సాగరం!!!
స్ర్తి జీవితం సహన సౌజన్యాల ఓంకారం!
- శశి

- పుష్ప గుర్రాల
సెల్ : 9491762638.

===

పుస్తక పరిచయం

జ్ఞానానికి ఆధ్యాత్మికతను జోడించిన
నాలో నేను

అక్షరాన్ని తోడ్కొని జీవితాన్ని నడపడం, అక్షరం తోడుగా జీవనం గడపడం. రెండూ అరుదైనివే కాని మెరుగైనవి. వాటి ఊతంతో జీవితం అంతా ఆశావహం అవుతుంది. అలా ఆశావహం చేసుకొని జీవితాన్ని గడిపి అనుభవంతో సంపాదించిన జ్ఞానానికి ఆధ్యాత్మికతను జోడించి వివిధ విషయాల మీద సంగతుల మీద ఆకుండి రాధాకృష్ణమూర్తి కలం నుంచి వచ్చిన వ్యాస పరపర ‘నాలోనేను’.
ఆయన స్వవిషయాలు ఇవన్నీ. అంటే ఆయన అనుభవించి ఆయన ఎదుర్కొని ఆనందించి ఎరుక పరిచినవి. ఎందుకంటే మనసును జయించారు కనుక. మనసును నిజంగా జయించగలమా. ఆ ప్రశ్న మనకేకాదు మహాభారతంలో అర్జునుడికి వచ్చింది. అశాంతికి లోనై గింగిరాలు కొట్టేస్తుంది. అల్లకల్లోలం చేసేస్తుంది. భయంకరంగా క్షోభకు గురిచేసేస్తుంది మనసు. మరి దాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలో వివరించారు. అన్ని అంగాల్లానే మనసు కూడా ఇంద్రియమే. అయితే ఫలానాగా గుర్తించలేము రూపం లేదు కాబట్టి. కాని సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు. సముద్ర తరంగాలు అవి మనసులో పుట్టి మనసులోనే లీనమవుతాయి కాని సంకల్పాలు కార్యరూపం ధరిస్తే వికల్పాలు మాత్రం దానిలోనే లీనమైపోతాయని చక్కని వివరణ ఇచ్చారు. యమ నియమములు అభ్యాసిస్తే స్వాధీనపర్చుకోవడం వల్ల సులభమవుతుందంటారు. ‘మనసును జయించడం ఎలా?’ అనే శీర్షికలో.
ఈ సువిశాల ప్రపంచంలో మనషొకడు. అతని చుట్టూ ఆ మనుషులే. మరి వారి అవసరాల్లో ఈ మనిషి తన అవసరాల్లో ఆ మనషులు సహకరించుకుంటేనే సంఘం లేదా సమాజం. ఆనాటి సాంఘిక న్యాయం ఏమీ ఆశించకుండా సాయపడేది. ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మాల్ని స్వచ్ఛందంగా పాటించడం వల్ల మనుగడ మంచిగా వెళ్లింది. ఈనాడు డబ్బుతోనే ప్రధానం. ప్రతి పనికి డబ్బు ఆధారం అయిపోయింది. ఎవరన్నా మరణిస్తే అన్నింటా తాముండి హనన కార్యక్రమాలే కాదు కుటుంబ బాగోగులు సైతం వారే చూసేవారు. పరిస్థితులు మారిపోయాయి. ఖర్చుకు వెనుకాడని పరిస్థితులు తెచ్చేసుకున్నాం. మనిషి అవసరాన్ని గుర్తించకపోవడం వల్ల ఈ దుస్థితి. నలుగుర్ని మంచి చేసుకొని నాలుగు కాలాలు మేలు పొందటానికి పూర్వం ఆలోచించేవారు. మానవ జీవితం చిన్నది. మనిషి దిగులుకి నిరాశ నిస్పృహకు గురికాకుండా ఉండటానికి మనిషిలోని శక్తి, సాయం ఊరట లాంటి సద్వినియోగపరిచే వాటిని ‘ఆ నలుగురితోనూ’.. అంటూ చర్చించారు. ‘మాయ’ అనే విషయాన్ని మహాద్భుతంగా చెప్పారు. చాలా చిన్న కధలో తెలిసిన దానే్న సులభపరిచి తెలిపారు. జీవాత్మ పరమాత్మ కలయికను ఇద్దరి మిత్రుల స్నేహంలోకి మార్చి ‘మాయ’ ఎక్కడ ఆటంకపరుస్తుందో, ఎవరి ఆధీనంలో ఉంటుందో ‘దీని మర్మం తెలుసా మీకు?’లో తెలియజెప్పడం బావుంది.
తన ప్రారంభ వ్యాసంతోనే హత్తుకొనేలా రాసి మనల్ని మంత్రుముగ్ధుల్ని చేయటమేకాదు రచయిత వ్యాఖ్యలకు దాసోహమైపోతాం. పని ప్రారంభపు ఎత్తుగడకు ఈ వ్యాసం చక్కని ఉదాహరణ. త్రికరణ శుద్ధిగా తలపెడితే ఆ పని ఎంత సజావుగా పూర్తవుతుందో ప్రయోజనమవుతుందో వివరించిన వ్యాసం ‘శ్రీకృష్ణార్జునులు మన అంతరంగంలోనే’ అంటూ భగవద్గీతలోని కృష్ణార్జునుల్ని సంకల్పశక్తి క్రియాశక్తిగా అభివర్ణించి మంచి పోలికతో మన మనసులోకి గీత యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేశారు. మనలోని ఈ రెండు శక్తులు సంకల్ప, క్రియాశక్తులు ఏకమైతే మానవ సమాజం సర్వాంగ సుందరమన్నది రచయిత ఆశ. సంసారపు సైకాలజీని చాలా సరసంగా చెప్పారు. ఏళ్ల నాటి వైవాహిక అనుభవం. ఆచరణాత్మక అనుభవ పూర్వక సిద్ధాంతం బాగా ఆకట్టుకునే విషయం. అన్యోన్యత ఎంత రాణించి రసరమ్యత తెచ్చిందో ఆయన జీవన విధానం తెలుపుతుంది. అపేక్షపూర్వక అనుబంధం వారిది. ఇలా ఎందుకు ప్రస్తావించానంటే రచయిత రాధాకృష్ణమూర్తి సహచరి యెడబాటు వలన కలిగిన వెసులుబాటు ఈ అద్భుత రచనలకు అవకాశం ఇచ్చింది. ఆమె సాంగత్యంలో ఎనె్నన్ని ఆనంద సంతోషకర విషయాలు రసాత్మకం అయ్యాయో తెలుస్తుంది. పరిశీలనాత్మక దృష్టి నుంచి ఎంతో వివేచించి చెప్పిన మనోవిశే్లషణాత్మక వ్యాసం ‘ఆలుమగల సైకాలజీ’ శాస్త్రంగా ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు అన్వయించబడుతుందో చెప్పారు. ఆత్మ సంబంధ శాస్త్రం ఆప్యాయతానురాగాలు ఆత్మీయ బంధాలు ఎంత అవసరమో ఆలుమగలకు ఈవ్యాసం అంత అవసరం.
మనసు మీదే మనిషి ఆధారపడతాడు. ఇంద్రియాలన్నీ మనసు ఆధీనంలోనే ఉంటాయి. ఇంద్రియాలు కేవలం విషయ సేకరణకు పనిచేస్తాయి. అయితే దాని ద్వారా కలిగిన ఫలితాన్ని సుఖంగానో, దుఃఖంగానో అనుభవించేది మాత్రం మనసంటారు. ఇక్కడొక చక్కని మాట చెప్పారు హిందీ భాషలోది ‘మన్ చంగా హైతో కటౌతీ మే గంగా’ అంటే మనసు స్వాధీనంలో ఉంటే కమండంలో గంగ ఉంటుందని. చాలా విధాలుగా సమన్వయం అన్వయం చేసుకొనేది. ఇలాంటి మనసు అటు పతనానికి, ఇటు ఉచ్ఛస్థితికి తీసుకెళుతుంది కనుక దాన్ని కార్యాలోచనకి కార్యాచరణకు సంకల్పించుకుంటేనే ఉన్నత శిఖరారోహణకు ఆలంబన అవుతుందని ‘అన్నింటికీ మనసే ప్రధానం’ శీర్షిక జీవిత రహస్యాల్ని చెప్పింది. మనసు గురించి ఎంత మధురంగా చెప్పారో అది చేసే పని గురించి అంతే మక్కువ కలిగేలా తెలిపారు. మనసుకు తోచింది మనిషి చేసుకుంటూ పోతుంటే ఇబ్బందులుంటాయి. జ్ఞాన సముపార్జనతో జీవిత భవిష్యత్‌కు మార్గాన్ని నిర్దేశిస్తుంది. అయితే ఆ మనసు ఎక్కడుంటుంది? అది ఏం చేస్తాది అంటూ ప్రశ్నించి తర్కించి ఓ చక్కని ఉపకారాన్నిచ్చారు ‘ఎక్కడుందీ మనసు?’ వ్యాసంతో. మనసుకు పెత్తనం ఇస్తే? మనసుని కంట్రోల్ చేసి అదుపులో పెట్టే బుద్ధి అనే పరికరం ఒకటి ఉంటుందంటున్నారు. అదేమిటో తెలుసుకోవటానికి మరి తప్పక చదివితేనే కదా! తెలుస్తుంది.
విద్య మీద ఓ చక్కని వ్యాసం ‘చదువంటే చదవడమేనా’ అని మన జీవితాల మీద వేసి చురక అది. నిజంగా ఏం చదువుకుంటున్నాం! జీవితాలు చదవడం లేదు. జీవన విధానాలు తెలుసుకోవడంలేదు. స్కూళ్లు, కాలేజీల్లో చదివే లౌకికమైన చదువులు నిజమైనవి కావంటారు. మానవతా విలువల్ని పెంచి పోషించేవే అసలు సిసలు చదువులంటారు. సరియైన విద్యకు క్రమబద్ధమైన సాధన, అలాగే నిరంతర కృషి, శ్రద్ధ, భక్తి అవసరమంటారు. సత్యమే దైవమంటారు. నిజంగా దృష్టిపెట్టాల్సిన విషయాలను చాలావాటిని స్పృజించారు. ఇంకా వీటిలో చాలా మంచి విషయాలు చెప్పే వ్యాసాలున్నాయి. జీవించటానికో స్ఫూర్తినిచ్చే పుస్తకం జీవన పద్ధతులు మెరుగుపర్చటానికి ఉద్దేశించిన జీవన సత్యమార్గాలు వీటిలో పుష్కలంగా ఉన్నాయి. భారతీయ తాత్వికతను, మన ఆధ్యాత్మికశక్తిని అనేక సంఘటనలతో, సంగతులతో మిళితం చేసి జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవాలో చెప్పారు. 73 వ్యాసాలతో సర్వాంగ సుందరంగా ‘రాధాకృష్ణుల’ ముఖచిత్రంతో తీర్చిదిద్దిన ఘనత డాక్టర్ చర్ల మృదుల గారికి దక్కుతుంది. భగవద్గీతను చదవలేని వారికి, మనల్ని మనం కనుగొనటానికి మనమెవరిమో తెలుసుకొనటానికి ఈ పుస్తకం దోహదపడుతుంది. శ్లోకాలు, అర్థాలు ప్రతి పదార్థాలుగా కాకుండా భగవత్ సారాన్ని వ్యాసాలుగా సులభ ‘గీత’గా అందించారు. పుస్తకం ముందుమాట ‘స్వగతం’లో చెప్పినట్టు విశ్రాంతి జీవితం ఉద్యోగ బాధ్యత నుంచి తెరిపినిస్తే ఆయన అధ్యాపక జీవితం విద్యార్థికే కాదు వినే శ్రోత నుంచి చదివే పాఠకుని వరకు ఎంత విషయ జ్ఞానం అవసరమో అంతవరకే అందించి సఫలీకృతం చేయడానికి తోడ్పడింది. ‘నాలో నేను’ శీర్షిక చాలా బాగుంది. అయితే ‘మనలో ఆయన’గా నిలిచిపోయిన రచన. ముందు నుంచి రచనా రంగంలోకి రాకపోవడం మన దురదృష్టకరం. ఆ లోటును సంపూర్ణం చేయటానికి మనలోని మరిన్ని ఉత్తమ గుణాలు ఆవాహనం చేయటానికి మరెన్నో మంచి రచనలు చేస్తారని ఆశిద్దాం. నూరేళ్లు ఆయుష్షు నింపుకొని నిండు నూరేళ్లు నిలిచే పుస్తకాలు రావాలని కోరదాం.

- రవికాంత్, సెల్: 9642489244

మనోగీతికలు

మలి సంధ్య
అవును
నా జీవిత ప్రయాణంలో
నేనిపుడు అందమైన
ఒక సాయంసంధ్యలోకి అడుగుపెట్టాను
నేనే కాదు,
అందరూ అనివార్యంగా
ఎప్పటికైనా
ఈ మలిసంధ్యలోకి అడుగుపెట్టాల్సిందే.
జీవితంలో
బాల్యం ఒక మేలిపొద్దయతే
వృద్ధాప్యం
ఒక ఆహ్లాదకరమైన సాయంసంధ్య
రెండూ ఇంచుమించు ఒక్కటే.
బరువు బాధ్యతలు తెలీని
కల్లాకపటం లేని తొలి సంధ్య బాల్యమైతే
బాధ్యతలన్నీ తొలగి నిర్మలంగా
విశ్రమించే మలి సంధ్య వృద్ధాప్యం.
రోజంతా పనిచేసి అలసిసొలసిన ఈ దేహాన్ని
సాయంత్రపు చల్లగాలి సేదదీర్చినట్లే,
జీవితమంతా ప్రయాణించి
అలసిసొలసిన ఈ ప్రాణాన్ని
వృద్ధాప్యం అనునయిస్తుంది.
ఇంతకాలం,
నేను - నా చదువు
నా ఉద్యోగం - నా కుటుంబం అంటూ
నా బాల్య వనాల
ఉరుకులు పరుగులతో
నాకు తెలీకుండానే
నా జీవితంలోంచి జారిపోయాయి
ఇప్పుడిక సాయం సంధ్య నా చేతుల్లోనే ఉంది

దీన్ని ఇంతలో చేజారనివ్వను
ఎందుకంటే, ఈ కాలం
సాయం సంధ్యని ప్రకృతికి,
వృద్ధాప్యాన్ని మనిషికి,
వరంగా ప్రసాదించింది
సాయంకాలమంటే
అస్తమించటం కాదని
కొత్త ఆలోచన ఉదయించటమని,
వృద్ధాప్యమంటే శాపం కాదని
అర్థం చేసుకొంటే
అదొక జీవన సంధ్య అనీ
జీవిత చరమాంకంలో
నిత్యనూతనంగా, చైతన్యవంతంగా
తాత్విక చింతనకీ
సామాజిక సేవకీ
ప్రశాంత జీవనానికి అది
మార్గాన్ని సుగమం చేస్తుందని
నాకు అర్థమయింది.
అందుకే నేను
సాయంకాలాన్ని
వార్థక్యాన్ని
రెంటినీ
మనసారా ఆహ్వానిస్తాను
తనివితీరా ఆస్వాదిస్తాను

- డాక్టర్ జోశ్యుల కృష్ణబాబు, సెల్: 9866454340

మద్యపానమును మానవ మానవా!
సార దరికి బోకు సార త్రాగను బోకు
సార త్రాగి త్రాగి శవముగాకు (జీవచ్ఛవము గాకు)
కష్టపడినదంత కడకు సారకొరకు
వ్యయము చేసి రోగివగుచు చెడకు

మద్యమనర్ధదాయకము మద్యము హింసకు కారణమ్మిలన్
మద్యము నేరవృత్తికి అమానుష బుద్ధికి ప్రేరణమ్మునౌ
ఆద్యము సర్వపాపముల కంతము సేయును మానవత్వమున్
మద్యము, మద్యపానమును మానవ మానవ మానవా యికన్

ఇల్లు గుల్లగనగు ఒళ్లును గుల్లగు
అయినవారు దూరమగుదురయ్య
కోరికోరి చావు కొని తెచ్చుకొందువా
మానవోయి బాబు మద్యమింక

తండ్రి కాని నీకు తనయుడే కానిమ్ము
త్రాగుబోతులాట సాగనీకు
మగనినైన తల్లి! మరయాదసేయకు
మానిపింప మంచి మార్గమగును

అన్నదమ్ముల వలె మనమంత కలసి
శాంతిభద్రతలతొ సుఖ సంపదలతొ
భవిత బంగారు బాటగా అవని వెలుగ
మద్య రహిత సమాజము మనకు వలయు

- తటవర్తి రాఘవరాజు
రామచంద్రపురం, తూ.గో.జిల్లా
సెల్: 9963610243

హైకూలు
గాలి చిక్కు తీస్తూ
ఏటిగట్టున
కొబ్బరి చెట్టు

రాలిన పువ్వుతో
ముచ్చటిస్తున్నా
రాయితే గాయమయ్యేది

కరిగిన కొవ్వొత్తి
నేనేనయం - నా దుఃఖం
గడ్డ కట్టడం లేదు

శాంతిని మరచి
కొంటున్నారు గమ్మత్తుగా
పానశాలలో మత్తును

సాయంత్రం వేళ
తెరిపివ్వని వాన
చిక్కింటావు ఏ పంచకిందో

నెత్తిన గొడుగు
బతుకు బండి మోస్తు
తాబేలు

తీరంలో వాయుగుండం
గూటిని వెతుకుతూ
ఎగురుతోంది - గోరింక

ఇసుకలో చెరిగిన
చిత్రాల్నే స్పష్టంగా
మళ్లీ గీసింది కెరటం

- అమృత్, సెల్: 9642489244

=============
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా.

email: merupurjy@andhrabhoomi.net