రాజమండ్రి

చివరి కోరిక (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె పేరు అమృత!
పేరుకు తగ్గట్టు ఆమె మనస్సు కూడా అమృతమయమే. అటువంటి ఆమె గర్భాన జన్మించకపోయినా అటువంటి అమృతమయి పెంపకంలో పెరిగిన సుధాకర్‌కి అసలు సిసలైన మాతృప్రేమను పంచి ఇచ్చింది ఆమె.
ఆమె సుధాకర్‌కి సవతి తల్లి. అతని తల్లి చనిపోయిన తరువాత తండ్రి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుండి సవతి పిల్లల్ని కూడా అభిమానంగా చూసుకుంది.
ఇప్పుడామె మరణయాతన పడుతోంది. సుధాకర్ పిల్లలిద్దరూ నానమ్మ చెంతనే కూర్చున్నారు.
ఆ సమయంలో సుధాకర్‌కి మరణించిన భార్య సుధ జ్ఞాపకం వచ్చింది. గుండెపోటుతో ఆమె మరణించగానే తల్లి మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పినా సుధాకర్ వినలేదు. దాంతో వేరే కొడుకు సురేష్ దగ్గర ఉన్న అమృత సుధాకర్ దగ్గరకి వచ్చింది. అతన్ని, పిల్లల్ని ఓదార్చింది.
అప్పటికే ఆమె వయసు ఏడు పదులు. అంత వయసులోనూ ఆమె తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించేది.
సుధాకర్‌కి చిన్నప్పటి ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది. అప్పట్లో తమ్ముడు సురేష్ ప్రతి దానికీ పేచీ పెడుతుండేవాడు. ఎదుటి వారి దగ్గరున్న వస్తువులు కావాలని ఏడిచేవాడు. ఒకసారి తండ్రి సుధాకర్‌కీ, సురేష్‌కీ ఒకేలాంటి వాచీలు కొన్నాడు. అయితే సురేష్ తన వాచీ అడుగుతూ అల్లరి చేసాడు.
అప్పుడు అమ్మ ‘‘చిన్నోడా! నీవు చాలా స్వార్ధపరుడివి. ఎంత సేపూ ఎదుటి వాళ్ల దగ్గరున్న వస్తువులే కావాలంటావు. ఈ బుద్ధి నీకు మంచిది కాదు. భవిష్యత్తులో నీ ఈ అలవాటు ఎన్నో అనర్థాలకి కారణమవుతుంది’’ అంది.
తన వాచీని తమ్ముడికి ఇచ్చాడు సుధాకర్.
‘‘పెద్దోడా! తమ్ముడి ఈ గుణం నాకు నచ్చలేదు. ఎందుకు వాడికి నీ వాచీ ఇచ్చావు?’’ అంటూ అమ్మ అడిగింది.
‘‘సుధాకర్’’ అమృత పిలిచింది.
ఆలోచనా ప్రపంచం నుండి బయటపడి ఆమె వైపు చూశాడు సుధాకర్.
‘‘తమ్ముడికి కబురు పంపారా?’’ ఆమె గొంతులో నీరసం కనిపిస్తోంది.
‘‘నానమ్మా! బాబాయ్‌కి నాన్నగారు కబురు పంపారు. తప్పకుండా కుటుంబంతో వస్తాడు. సుధాకర్ నోరు విప్పేలోగానే అతని పిల్లలు మృత్యువుతో పోరాడుతున్న ముసలావిడని సంతృప్తి పరచడానికి సమాధానం ఇచ్చారు.
‘‘తమ్ముడు తప్పకుండా వస్తాడమ్మా. నీవు నిశ్చింతగా ఉండు’’ సుధాకర్ అక్క అంది.
‘‘లేదే అమ్మాయి! వాడి స్వభావం నాకు బాగా తెలుసు. వాడు రాడు. నీకూ, సుధాకర్‌కి నేను జన్మనివ్వలేదు. మనది రక్త సంబంధం కాదు. పెంచిన ప్రేమ మాత్రమే. అయినా మీరు నా మీద చూపిస్తున్న ప్రేమలో ఒకటవ వంతయినా నా రక్తం పంచుకుని పుట్టిన నీ తమ్ముడు చూపించలేదు. అదేనే నా బాధంతా’’ అంది అమృత బాధగా.
ఎవరూ ఏమీ మాట్లాడలేదు.
‘‘ఒరే సుధా! నీ మరదలు నీ భార్యలాంటిది కాదురా. గొప్ప స్వార్ధపరురాలు’’ చాలా సార్లు అమ్మ అనేది.
అయితే సుధాకర్‌కి ఆమె అలా అనడం నచ్చేది కాదు. పరోక్షంగా ఉన్నవాళ్లను ప్రత్యక్షంగా ఉన్నవాళ్లతో సరిపోలుస్తు నిందించడం అతనికి నచ్చలేదు.
ఒకసారి అమ్మ మాట్లాడుతూ ‘‘ ఒరే సుధా! నేను మరి తమ్ముడి దగ్గర ఉండలేనురా. మొన్న ఏమన్నాడో తెలుసా? నీకు నాకన్నా అన్నయ్య, అక్కయ్య అంటేనే ఇష్టం. వాళ్లు నీ కడుపున పుట్టకపోయినా వాళ్ల మీదే నీకు ప్రేమెక్కువ’’ అని చెప్పుకుని బాధపడింది.
ఆ మాటలకి సుధాకర్‌కి కోపం వచ్చింది. వెళ్లి వాడిని మందలించాలని అనుకున్నాడు. అయితే సురేష్ తన పెద్దరికానికి విలువ ఇవ్వకపోతే అనుకుని ఆ ప్రయత్నం విరమించుకున్నాడు.
అమృత తిరిగి మూలిగింది.
‘‘ఒరే తమ్ముడూ! అమ్మకి తమ్ముడిని చూడాలనేది చివరి కోరికరా. వాడికి ఫోను చెయ్’’ అంది శాంత.
‘‘లాభం లేదక్కా! వాడి స్వభావం నాకు తెలుసు కదా. చేసినా రాడు’’ చెప్పాడు సుధాకర్.
శాంత గాఢంగా నిట్టూర్చింది.
మరణయాతన అనుభవిస్తూనే చివరి కోరిక తీరకుండానే అమృత శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచింది. ఆమె ముఖంలో ప్రసన్నత లేదు. కొడుకుని చూడలేదన్న అప్రసన్నత, అసంతృప్తి ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
‘‘అమ్మా!’’ అంటూ సుధాకర్, శాంత, ‘‘నానమ్మా’’ అంటూ పిల్లలు ఏడుస్తున్నారు.
సుధాకర్ కళ్లు తుడుచుకుని భావోద్వేగంతో ఆలోచిస్తున్నాడు. ‘అమ్మ జీవితంలో ఏం మిగుల్చుకుంది? బ్రతికినంత కాలం తన వాళ్లు అనుకున్న వాళ్ల కోసం బ్రతికింది. తనకీ, పిల్లలకీ సేవ చేసింది. అందులోనే ఆనందం ఉందని అనుకునేది. తన కళ్ల ముందే తండ్రి, బావ, ఆ తరువాత తన భార్య సుధ ఇలా ఒక్కొక్కరు దూరమైపోతున్నా ఆత్మస్థైర్యాన్ని విడిచిపెట్టలేదు. ఎదురుదెబ్బలు తగులుతున్నా గుండె నిబ్బరంతో ఎలా జీవించాలో నేర్పించింది. ఆమెకేం ఇచ్చినా, ఎన్ని జన్మలెత్తినా రుణం తీరదు’ అనుకుంటూ ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకున్నాడు.

పుస్తక పరిచయం
స్ఫూర్తిని నింపే
‘మహనీయ మూర్తులు’
ముందుతరం దూతలు మన రచయితలు. సంస్కరణాభిలాషతో వారు చేసే రచనలు భావితరానికి మార్గదర్శకాలు. చాలా ముందుచూపుతో యోచన చేసే ఎన్నో సూచనల్ని సిద్ధాంతీకరించారు. వారు నూతన యుగ నిర్మాతలు. వారినోసారి పునస్మరణ చేసే అవకాశాన్ని ‘మహనీయ మూర్తులు’ పుస్తకం కల్పిస్తే దాన్ని రూపొందించిన పసల భీమన్న ఆలోచన రేకెత్తించారు. ముఖ్యంగా పాత తరం రచయితలు, ఉద్యమ నేతలు, సంస్కరణాభిలాషులను గుర్తుకు రానంతగా.. కాదు కాదు గుర్తుచేసుకోలేనంత వేగంగా కాలం మారిపోయింది. పరివీలన చేసిన, పరిశోధన చేసినవారు నేటి తరానికి అవగాహన పరచటం వారికి పరిచయం చేయడం కర్తవ్యంగా భావించి ‘మహనీయ మూర్తులు’ పుస్తకాన్ని ప్రచురించారు.
ఆదర్శనీయులైన ఫూలే, పెరియార్, అంబేద్కర్, గాంధీజీ భావాలు, ఆలోచనలు సంఘ సంక్షేమానికి, సమకాలనీయతకు ఎంత అవసరమో తేల్చిచెప్పిన రచనయిది. మానవతను మహిమపరచిన వీరంతా మహనీయమూర్తులు. వారిని జాగృతపరుచుకోవడం ప్రస్తుత సమాజ కర్తవ్యం. అయితే మరింత మేలుకర సమాజం ఏర్పడే అవకాశం ఉంటుంది. సంస్కర్తలు సాంఘిక విప్లవకారులు, స్ర్తిజనోద్ధారకులు. రచయిత భీమన్నగారు ఎన్నుకొన్నవారు వీరిని శాస్ర్తియ దృష్టితో వారు చేసిన కార్యక్రమాలను పరిచయం చేయడానికి పూనుకొన్నారు రచయిత.
మూఢభావాల్ని, మత విశ్వాసాల్ని నెత్తిన పెట్టుకోకుండా, ప్రజలకు అవసరమైన అభివృద్ధికర మార్గంవైపు పయనించేలా ఉద్యమాలు చేపట్టిన వాళ్లను ఈ పుస్తకంలో పొందుపరిచారు. భీమన్నగారు తన పరిధిలో విషయ సమగ్రతను, సంక్షిప్తతను పాటించడంవల్ల, వాళ్లను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే కుతూహలం పాఠకుల్లో తప్పక కలుగుతుంది. పుస్తకం ముందు మాటలో ప్రముఖ సాహితీ విమర్శకుడు కోడూరి శ్రీరామమూర్తిగారన్నట్లు సంఘ సంస్కర్త కందుకూరికి, జనోద్ధారకులు కాశీనాథుని పేర్లు చివర పంతులు తగిలించి సంప్రదాయ వాసనను ఇష్టంగానే భీమన్నగారు కలిగించారు.
సంస్కరణ ఉద్యమం మరిన్ని సంస్కరణలకు దారితీయడానికి వీలుకలుగుతుందని ఈ మహనీయుల చరిత్రను చదువుతుంటే తెలుస్తుంది. సంస్కరణలైనా, విప్లవాలైనా రెండూ జనోద్ధరణ కార్యక్రమాలే. ప్రజల్ని మేల్కొలిపి, మార్పు తేవటానికి చేసేపని అది. విప్లవం ఉద్రేకపూరితంగా ఉంటే, సంస్కరణ స్థిర చిత్తంతో కొనసాగుతుంది. పసల వారి పుస్తకంలోని వ్యాసాలు గతంలో వివిధ పత్రికల్లో ప్రచురితమై, పాఠక హృదయాల మెప్పు పొందినవే. అయితే వీటన్నిటినీ ఒకేచోట సంకలనపరచి, ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం చేశారు. ప్రజాకవి వేమనతో మొదలై చివరన సామినేని ముద్దు నరసింహంతో కలిపి 128 పేజీల్లో సరళమైన తెలుగులో రాసిన ఉత్తమ గ్రంథం ఇది. ఇందులో ఇద్దరు మహిళామూర్తులు, ఉద్యమకారిణుల జీవిత చిత్రణ ఉంది. ఒకరు మల్లాది సుబ్బమ్మగారైతే మరొకరు సరస్వతి గోరా. అలాగే డాక్టర్ ఎటి కోపూర్, జస్టిస్ ఆవుల సాంబశివరావు, బి హేమానంద్, రఘుపతి వెంకటరత్నంనాయుడుపై రాసిన వ్యాసాలు తప్పక చదవతగినవి. జ్యోతీరావుఫూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, త్రిపురనేని రామస్వామి చౌదరి పెరియార్, భగత్‌సింగ్ మొదలైన వారి విప్లవాత్మక శాస్ర్తియ భావాల గురించి పసలవారు చేసిన చర్చ చదవతగినది. మన పూర్వీకులు మనకోసం ఎంత త్యాగం చేశారో వారిని చదివితే మరింత అర్ధమవుతుంది. రాజారామ్మోహన్‌రాయ్, ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ వంటి సంస్కరణవాదులు భారతీయ మహిళల కోసం తమ జీవితాలను ఎలా ధారపోసి, స్ర్తి రక్షణకు ఎంత కృషిచేశారో తెలుసుకోవాలంటే పుస్తకంలోని మహనీయులను తెలుసుకోవాల్సిందే. 17, 18, 19 శతాబ్దాలకు చెందిన కొంతమంది మహనీయుల గొప్పతనాన్ని రచయిత తనదైన భావజాలంతో వివరించారు.
భీమన్నగారిని చూసి, ఆయనతో మాట్లాడితే ఎలా ఉంటుందో ఈ వ్యాసాలు చదివితే అలానే ఉంటాయి. మహిమలు, మంత్రాలు, అతీతశక్తులు అంతా బూటకం, సైన్సు తప్పించి మరేమీ చేయలేదంటారు. ఏది మాట్లాడతారో, అదే రాస్తారు. దానే్న ఆచరిస్తారు. పుస్తకంలో నిక్షిప్తంచేసిన మహనీయ మూర్తులు ఏపాటి వారో గ్రహించడానికి ఇంతకన్నా అవసరం మరొకటి ఉండదు.

- రవికాంత్, సెల్: 9642489244

పుస్తక సమీక్ష

వేయి పదాల ఆంగ్ల క్రియా నిఘంటువు
విద్యార్థులకు కల్పతరువు
మానవ మనుగడకు భాష వారధి. మనిషి తన భావాలను ఇతరులతో పంచుకోవడానికి మాధ్యమం భాషే. ప్రదేశాలను బట్టి మాధ్యమాలుంటాయి. నేల నాలుగు చెరగులా వేల భాషలున్నాయి. విద్య, విజ్ఞానం సర్వతోముఖాభివృద్ధికి భాష ఒక ఉపకరణం.
ప్రపంచవ్యాప్త భాషల్లో అనుసంధాన భాషగా, అంతర్జాతీయ భాషగా ఆంగ్లం గుర్తింపబడింది. త్రిభాషా సూత్రం కూడా ఆంగ్లం నేర్చుకునే ఆవశ్యకతను తెలుపుతుంది. తరగతి గదిలో ఆంగ్ల భాషను మాట్లాడడానికి క్రియా పదాలే కీలకమైనవి. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు తరగతి గదికి అవసరమైన ఆంగ్ల క్రియా పదాలనే వాటిని తెలుగు భాషలో అకారాది క్రమంలో పెట్టి, వాటి వర్తమాన, భూత కాలాల రూపంలో తెలిపిన చిన్న పుస్తకమే క్రియా పద నిఘంటువు. దీని సంకలనకర్త ఆంగ్లోపాధ్యాయుడు గొట్టాపు శ్రీనివాసరావు.
ఆంగ్ల బోధన సులభతరం చేయడానికి రాష్ట్ర విద్యా శిక్షణా పరిశోధనా మండలి నుండి ఆంగ్లోపాధ్యాయుల వరకు కృషి చేస్తున్నవారు ఉన్నారు. ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు పెట్టిన తరువాత ఆంగ్ల భాషా బోధన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రతి ఉపాధ్యాయుడు తన తరగతి గది సమస్యలను అధ్యయనం చేస్తూ చిట్టి పరిశోధనలు చేయవలసి ఉంది. సమస్య, సాధన, ఫలితాలను సరి చూసుకోవలసి ఉంది. ఈ ఆలోచనతోనే శ్రీనివాసరావు ఆంగ్ల పదాభివృద్ధికి, మాట్లాడడానికి ఏయే పదాలు అవసరం అవుతాయో సూచించారు. ఒక సంవత్సర కాలం పరిశీలన చేసి దీనిని వెలువరించారు. ఇది ఆంగ్లోపాధ్యాయులకు, పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతులకు జి. శ్రీనివాసరావు, సాలూరు-535591, విజయనగరం అనే చిరునామాలో సంప్రదించాలి.

- కిలపర్తి దాలినాయుడు,
సెల్ : 9491763261.

నిత్యసత్యాలు

ఒకరు వద్దంటారు!
ఇంకొకరు ముద్దంటారు!

ఎన్నని చెప్పను? ఏదో ఒకటి మొదలుపెట్టాలి కదా! అప్పటికప్పుడు పుట్టుకొచ్చే ప్రేమలకి ఆలవాలమై వయసుకొచ్చిన వాళ్ల వాలకాలు పాడు చేస్తున్నాయి కాబట్టి ఈ వాలం టెయిల్‌లలు వద్దంటారు కొందరు. ప్రేమ వేరు, పెళ్లి వేరన్న సిద్ధాంతం వీళ్లకి నచ్చదు. పండగనాడూ పాత మొగుడేనా అని మీరే అంటారు కదా ఏదో ఈ రోజున మా మోజులు తీరేలా ముందు ముద్దురోజొచ్చిన శుభసూచకంగా జంటలు జంటలుగా మా తంటాలు మేం పడడం మాకు ముద్దదంటారు కొందరు. మన ముడి సరకూ విదేశీ పని ముట్ల వాడకం కలగలిపి మన చెమటకి వాళ్లు రేటు కట్టేలా విదేశీయులు భారతదేశంలోనే తయారీ మొదలెట్టడానికి అనుమతులు వద్దంటారు కొందరు మేధావులు. ఇంకా పల్లకీలెక్కే తిరుగుతామా ఏంటి? అరచేతిలో ప్రపంచాన్ని పట్టి ఉంచే పనితనాన్ని వదులుకోవడం మంచిది కాదు గనకనూ మనవాళ్లేదో కొత్తవి కనిపెట్టి పొడిచేస్తారని మాకు నమ్మకం లేదు కనకనూ మన దేశంలో మనం బానిసలమైనా ఫరవాలేదు కాని పొరుగు వాళ్లొచ్చి వండిన పుల్లకూరే మాకు ముద్దంటారు పాలకులు.
ఒళ్లు కనబడేలా బట్టలు కట్టుకోవడం మన ఇంటా వంటా లేదు, అనవసర అత్యాచారాలూ అఘాయిత్యాలూ అంతకంతకీ జరగడానికి కారణం అదే కాబట్టి వద్దంటారు కొంత మంది. కిర్రెక్కించే వెర్రెక్కించే గంతులూస్తే పీలికలతో వాలకాలు పోతుంటే తెల్లమొహం వేసి చూస్తున్నారు కాని, అయినా మీ వలిపాల పేరుతో దేవతావస్త్రాల సంగతి మాకు తెలీదా అంటూ వంటిని బయటపెట్టే బట్ట కంటే మీ చుప్పనాతి చూపుడే పెద్ద ముప్పు గనుక అలాఅలా తూనీగల్లా ఎగరడమే మాకు ముద్దంటున్నారు కొందరు. ముచ్చటగా మూడేళ్ల నుండీ ముదనష్టపు ముక్కిడితనానికి కారణమైన మార్క్సు మాస్కుల వారికే పద్మాలు పంచడం జరిగి ముద్ద ముక్కలవుతోంది కాబట్టి ఇక ముందు వద్దంటారు కొందరు. ఏదో ఇస్తున్నారు కదా అని తీసేసుకున్నాం కాని తరువాత్తర్వాత మాకూ మరి కొందరికీ నచ్చని పనులు జరగడానికి కారణం మీరని మాకు అనుమానం కాబట్టి మీ పచ్చల పతకాలు మాకు ఇప్పుడు నిప్పచ్చరం అంటూ ఎవరి ప్రమేయం వల్లో కాదు మాకై మేము అని తిరిగి ఇచ్చీడమే ముద్దంటున్నారు కొందరు.
పాడికీ పంటకీ పవిత్రతకీ గుర్తుగా భావించే గోమాత మాంసం తినడం మంచిది కాదు వద్దంటున్నారు కొందరు. లేత ఆవు మాంసాన్ని అతిథులకి వడ్డించే సంప్రదాయం మాకు తెలీదా అయినా కప్పల్నీ, కుక్కల్నీ, పందుల్నీ, పాముల్నీ తినేవాళ్లని గౌరవించగలిగిన మీరు మమ్మల్ని తిడుతున్నారు గనుక అదే మాకు ముద్దంటున్నారు కొంతమంది. ఒకటవ తరగతి నుండి ఇంగ్లీషు మీడియం పెడితే మా పిల్లలు మెరికల్లా తయారై అమెరికాలకి ఎగిరిపోగలరని అన్ని వర్గాల్లోని ప్రజలు అదే మాకు ముద్దంటున్నారు. అమ్మ నుడి అంటే మాతృభాష రానిదే మరో భాష, శాస్త్ర విజ్ఞానం రావని లోకం కోడై కూస్తోందిరా ఉష్ట్ర పక్షుల్లారా! అసలు ఇంగ్లీషు మీడియం వద్దనడం లేదు ఒకటవ తరగతి నుండే మొదలెట్టొందంటున్నారు కొందరు మేధావులు. కొన్నిటికి కొందరు వద్దనొచ్చు. కొందరు ముద్దనొచ్చు కాని ముద్దునెవరూ వద్దనరనుకుంటా!

- కాండూరి లక్ష్మీపతి,
సెల్ : 9440559398.

మనోగీతికలు
నవ తరం
దేవుడు భువిపై జన్మించి
జీవికి నిర్జీవం నిర్మించి
మట్టిని మట్టితో వెలగట్టి
మనిషే దేవుడై మళ్లీ పుట్టాడు!
అండంలో వుండలేక
బ్రహ్మాండం మోయలేక
భీతితో ‘నీతి’కి చితిపేర్చి,
నిర్భీతితో దేహం పొగచూర్చి
ప్రవాహంలో పాకి దేకి
పురుషత్వం కోల్పోయి
పునీతుడై సాగరుడై
మృత్పిండం మింగినాడు
మృత్యుంజయుడైనాడు!
నావను నడిపేటివాడు
తోవను మరిచేటివాడు!
మనిషిలాంటి ‘గుడి’ వాడు
మనసు చెడితే గుడ్డివాడు
కాలకూటం మింగుతాడు
కాళరాత్రి నిదురపోడు
జడివానకు మండుతాడు
పిడుగుల్లో తడుస్తాడు!
పిడికిలి బిగించుతాడు
పిరికి పాలు తాగుతాడు
బలముంటేనే బతుకుతాడు
బలహీనుడు మానవుడు!
కూర్చుంటే కుర్చీ దిగడు
కూడుంటే కూలికెళ్లడు
గూడుంటే పడక దిగడు
గుర్తుంటే ఏదీ మర్చిపోడు
కూటితో కులబేరం
గోటితోపోయే వ్యవహారం
గొడ్డళ్లతోనే పరిహారం!
దొంగలా దోచుకుని
దొరలా దాచుకుని
దోచుకునే దొంగలకి తానే
దొంగతనం నేర్పుతాడు!
చెవిలో ఏదో చెబుతాడు
చెరుపుదెచ్చి పెడతాడు
బల్లగుద్ది చెబుతాడు
గల్లంతులు రేపుతాడు
కనకపు గద్దె మీది, ఆ
శునకంతో ముద్దులాడి
కుక్కతినే చెప్పుకోసం
కక్కుర్తి పడతాడు!
పడుచుదనం పడుపువృత్తి
వృద్ధాప్యం ఉడుతాభక్తి
చదువులమ్మే సంతలో
చదువుకొన్న సర్వజ్ఞుడు!
పంచభూత నిర్మితదేహంలో
ప్రత్యగాత్మ పరిపూర్ణుడని
అంతరాంతరాలు తెలిసి
అధోగామి మానవుడు!
ధర్మకాల ధర్మాత్ముడు
సత్యకాల సర్వార్థుడు
హింస, అహింస, సంశయాలు
హింసించుకునే వంచకుడు!
ధర్మానికి ఖర్మపెట్టు
ధర్మాసన వారసుడు
ధనుంజయుడు ధార్మికుడు
రుధిరపాశ బంధితుడు
బధిరాంధుడు కబంధుడు
క్షుత్రశ్రేష్టి మానవుడు
భద్రపీఠి మానవుడు!

- దివి నరసింహారావు,
చరవాణి : 9493443722

ఎండల దండయాత్ర!
తొండ ముదిరి
ఊసరవెల్లి అయినట్లు
వేసవి ఎండలు కాస్తా
మహా కొలిమిల్లా మారాయి!
ఉదయం నుంచే ఆదిత్యుడు
ఆకాశంలో నిప్పులు రాజేస్తున్నాడు
మధ్యాహ్నానికి మార్తాండుడు
భగభగమని మండుతున్నాడు
ఎండలు ధరణిపై
దండయాత్రలు చేయటంతో
పుడమి పురిటినొప్పులు పడుతోంది
రోడ్లన్నీ నిప్పుల కొలిమి!
అచ్చెరువున చెరువులోని
నీళ్లన్నీ ఆవిరి!!
ఎండ తీవ్రతకు
ఆత్మారాముళ్లను
నీడకు చేర్చి ఉపశమన చికిత్సలు
గగనతలంలో
కారుమబ్బుల కోసం
జీవకోటి నిరీక్షణ
పగిలిన నేల గుండెతో
అన్నదాత ఎదురుచూపు
ఎండిన గొంతుకతో
గ్రామాలు పడిగాపులు
ముడుచుకున్న పింఛంతో
నెమలి కోమలి ప్రతీక్షణ
ఆకాశంలో కారుమబ్బులు
కలుస్తాయి కానీ..
చుక్క చినుకు నేలరాలదు
నింగిలోని సూర్యుడు
నేలమీదకు వచ్చేసి
నిప్పుబంతిలా దొర్లుతున్నాడు!

- జి. సూర్యనారాయణ,
చరవాణి : 9704784744

కాలుదువ్వితే..
కత్తులు దూస్తాం..
దేశ రక్షణకు ప్రాణాలర్పించి
అమరులైన సైనికులకు
దేశరక్షణే మా ధ్యేయమంటూ
ప్రాణత్యాగానికైనా
వెనుకంజ వేయక
ఆటుపోట్లకు అదరక బెదరక
ఆత్మస్థయిర్యంతో
మునుముందుకు
సాగుతున్న సైనికులకు
అభివందనాలు..
మాతృదేశ రక్షణకు
ప్రాణాలను పణంగాపెట్టి
చలిగాలులు,
వడగాలులను లెక్కచేయక
శత్రుసైన్యాలతో పోరాడుతున్న
వీర జవానులకు అభినందనలు
దేశ రక్షణకు సైన్యంలో చేరి
విశ్రమించక, విసుగు చెందక
తల్లిభారతి రక్షణే
మా ధ్యేయమంటూ
యుద్ధ రంగంలో దుమికిన
వీరజవానులకు అభినందనలు
నిద్రాహారాలు మాని నిరంతరం నిఘా వుంచి
దేశ సరిహద్దుల్లోకి
శత్రుమూకలు చొరబడకుండా
సరిహద్దుల్ని కాపలా కాస్తున్న
దేశభక్త జవాన్లకు అభినందనలు
దేశ రక్షణకు మేం ప్రాణాలైనా అర్పిస్తాం
భరతమాత ముద్దుబిడ్డలుగా నిలుస్తాం
యుద్ధరంగంలో
వీరజవానులమై నిలుస్తాం
శత్రుసైన్యాలను
తరిమితరిమి కొడతాం
యుద్ధం కావాలని మేం కోరుకోం
శత్రువులు కాలుదువ్వితే మాత్రం
కదనరంగంలో దునుమాడుతాం!
కవ్వింపుదారులను
కాల్చడానికైనా వెనుకాడం
ప్రాణాలిచ్చి అయినా
మా దేశాన్ని కాపాడుకుంటాం!

- సౌపాటి ప్రభాకర్,
చరవాణి : 8184874460

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
email: merupurjy@andhrabhoomi.net

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా.
email: merupurjy@andhrabhoomi.net

- గూడూరు గోపాలకృష్ణమూర్తి, ఫోన్ - 08922 231605.