ఉత్తర తెలంగాణ

ప్రయాణంలో పదనిసలు - కథ : మెరుఫు - తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రయాణంలో పదనిసలు - కథ

గోదావరికి పుష్కరాలొస్తున్నాయి. ఎక్కడికి వెళ్తే బాగుంటుందని ఆలోచిస్తున్న తరుణంలో, ‘కాళేశ్వరమంటే మరో కాశీ క్షేత్రమే’, ఓ మిత్రుడు చెప్పిన మాటలు గర్తుకువచ్చాయి. దూర దూరంలో ఉన్న క్షేత్రాల సంగతి సరే. దగ్గరలోనే ఉన్న కాళేశ్వరం వెళ్లాలని అనుకుంటున్నా ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ వచ్చింది. అందరం ప్రభుత్వోద్యోగులం కావడంతో ఒకరికి సెలవు దొరికితే మరొకరికి దొరుకదు. పుష్కరాల పుణ్యమా అని ఇప్పటికి అన్నీ కలిసొచ్చి హాయిగా బయలుదేరాం.
‘కులం చెడినా సుఖం దక్కాలి’ అన్నారు పెద్దలు. ఖరీదు కాస్త ఎక్కువైనా సౌకర్యంగా ఉంటుందని పెద్దవ్యానే ఎంగేజ్ చేసుకున్నాం. పిల్లలు ముందు సీట్లో కూర్చొని ఆడుకుంటున్నారు, అల్లరి చేస్తున్నారు. వ్యాను సుతారంగా ముందుకు దూసుకెళ్తుంటే, చల్లని గాలి మేనికి తగులుతూ హాయిగొల్పుతుంటే, వ్యాను కుదుపులకు నా శ్రీమతి, నేను ఒకరికొకరు ఒరుసుకుంటున్నాం. మళ్లీ యవ్వనంలోకి వెళ్లిపోయిన అనుభూతి.
‘చూశావా! మన పెళ్లయ్యాక హనీమూన్ వెళ్లని లోటు ఇలా తీరుతుంది గదూ! శ్రీమతి చెవిలో ఊదాను.
ఆవిడ ముఖం అలా విచ్చుకొని, ఇలా ముడుచుకుంది. మనసు హాయిగా మూలిగింది. జోరుగా హుషారుగా ఊళ్లు దాటుతూ మహాదేవపూర్ అడవిలో ప్రవేశించింది వ్యాన్. సూర్యదేవుడు విశ్రాంతి కోసం వెళ్లిపోతుంటే, చీకటి పరదాలు దిగుతుండడంతో ఓ పక్క థ్రిల్లింగ్‌గా ఉన్నా మరో పక్క బెరకు బెరకుగానే ఉంది. వెళ్తున్నది దట్టమైన అడవిలో కదా! ఒకరితో ఒకరు చెప్పకపోయినా అందరి మనస్సుల్లోనూ ఏదో గుబులు, తెలియని భయం అలుముకుంది. పిల్లలు మెల్లమెల్లగా నిద్రలోకి జారుకున్నారు. సద్దుమణిగింది. ఆ అడవిలో ఇప్పటికీ పులి, సింహం లాంటి క్రూరజంతువులు ఉంటాయని చెప్పుకుంటారు. వ్యాను డ్రైవర్ కూడా త్వర త్వరగా అడవిని దాటేయాలని స్పీడ్ పెంచి డ్రైవింగ్ చేస్తున్నాడు.
ఉన్నట్టుండి ఒక పెద్ద కుదుపుతో వ్యాన్ ఆగిపోయింది. అప్పుడే నిద్రలోకి జారుకోబోతున్న పెద్దవాళ్లం ఉలిక్కిపడి లేచి, డ్రైవర్ వంక ప్రశ్నార్థకంగా చూశాం. ‘ఏ మైంది’ అన్నట్లు?
‘చిన్న మెకానిక్ ట్రబుల్ . ఇప్పుడే సరి చేస్తాను’. అంటూ వ్యాను దిగి, బ్యానెట్ తెరిచి పరిశీలించాడు డ్రైవర్.
వినోదం కాస్తాపోయి విచారం అలుముకుంది అందరిలోను. బిక్కుబిక్కుమంటూ భయంగా మావైపు, డ్రైవర్ వైపు చూస్తున్నారు పిల్లలు. అమ్మ సంగతి సరేసరి. గుర్తొచ్చిన దేవుడికల్లా మొక్కడం ప్రారంభించింది. ఆ అడవి నుంచి ఏ ప్రమాదం లేకుండా బయటపడాలని అందరి ఆలోచన.
డ్రైవర్ అన్ని పరిశీలించి, లాభం లేదు సార్! ఇక బండి కదలదని’ పెదవి విరిచేశాడు.
‘మరైతే ఎలా?’ అందరం ముక్త కంఠంతో అడిగాం.
ఎక్కడ ఏ పొరపాటు కనిపించలేదు. ఎంత ప్రయత్నించినా వ్యాను కదలడం లేదు. తన అశక్తతను వ్యక్తం చేశాడు డ్రైవర్.
అడవిలో అందరం భయపడితే ఆగమైపోతాం. ‘్ధర్యే సాహసే లక్ష్మీ’ అన్నారు కదా! నేనే ధైర్యం చేసి, దారికడ్డంగా నిలబడి, అటుగా వస్తున్న వాహనాలను ఆపే ప్రయత్నం చేస్తున్నాను. మామూలుగా అయితే ఇంత రాత్రి అక్కడ మానవ సంచారమూ ఉండదు. వాహనాలు తిరుగవు. పుష్కరాలు కావడం వల్ల, రోడ్డు రద్దీగానే ఉంది. చాలాసేపటికి నాశ్రమ ఫలించింది. ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి బాగా వయస్సున్న డ్రైవర్ దిగాడు.
‘ఏమిటీ సమస్య’ అంటూ ప్రశ్నించాడు.
‘అంతా పరిశీలించాను. అన్నీ కరెక్టుగానే ఉన్నా మా వ్యాను కదలడం లేదు’ చెప్పాడు మా వ్యాను డ్రైవర్ విచారంగా.
‘అలాగా! అంతా సరిగ్గానే ఉన్నా వ్యాన్ అలా సడన్‌గా ఆగిపోయిందంటే అసలు ప్రాణం ఉందో లేదో చెక్ చేశావా? అడిగాడు కారు డ్రైవర్.
‘అంటే! ‘అయోమయంగా ప్రశ్నించాడు మా వ్యాను డ్రైవర్.
‘మరేం లేదు. ఇంజన్‌లో ఇంధనం అయిపోయినట్టుంది. చూసుకున్నావా?’, నవ్వుతూ ప్రశ్నించాడు కారు డ్రైవర్.
‘అన్నీ పరిశీలించాను. అదొక్కటే మరిచాను’, అని ఇంజన్‌లో డీజిల్ ఉందో లేదో చూశాడు మా వ్యాన్ డ్రైవర్. పూర్తిగా డీజిల్ అయిపోయి వ్యాను ఆగిపోయిందని తెలుసుకున్నాడు.
‘బయలుదేరెప్పుడే ట్యాంక్ ఫుల్ చేసుకోవాలని తెలియదా?’ కోపంగా అడిగాను నేను. ముఖం తేలవేశాడు మా డ్రైవర్.
కారు డ్రైవర్ వద్ద స్పేర్‌లో ఉన్న డీజిల్ సహాయంతో ఎలాగోలా కాళేశ్వరం చేరుకున్నాం. తేలికగా ఊపిరి పీల్చుకున్నాం. తెలివి తక్కువగా ప్రవర్తించిన మా డ్రైవర్‌ని తిట్టుకొని, చూడకుండానే ఇంధనం అయిపోయిన సంగతి చెప్పినా కారు డ్రైవర్ అనుభవాన్ని కుటుంబ సభ్యులమంతా మెచ్చుకున్నాం. ఆ కాళేశ్వరుడే కారు డ్రైవర్ రూపంలో వచ్చి మాకు సహాయం చేశాడని అందరం భావించాం.

- గరిశకుర్తి రాజేంద్ర
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా
సెల్.నం.9493702652

సాహిత్య సమాచారం

దాస్యం వెంకటస్వామి స్మారక పురస్కార ప్రదానం 8న

సమైక్య సాహితి పక్షాన ప్రతి ఏడాది ప్రదానం చేస్తున్న దాస్యం వెంకటస్వామి రాష్టస్థ్రాయి కవితా పురస్కారం 2015 సంవత్సరానికి గాను ప్రముఖ కవయిత్రి కొండపల్లి నీహారిణి కవితా సంపుటి ‘నిర్నిద్ర గానం’ ఎంపికైంది.
ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కరీంనగర్‌లోని భగవతి ఉన్నత పాఠశాలలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు పురస్కార కమిటీ కన్వీనర్ దాస్యం సేనాధిపతి, సమైక్య సాహితి అధ్యక్షులు మాడిశెట్టి గోపాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ముఖ్య అతిథిగా సినారె పురస్కార కమిటీ కన్వీనర్ డా. ఎడవల్లి విజయేంద్రరెడ్డి, విశిష్ట అతిథులుగా సీనియర్ సాహితీవేత్త ఎం.వి.నరసింహారెడ్డి, ప్రముఖ సాహితీవేత్త డా. గండ్ర లక్ష్మణరావు, గౌరవ అతిథులుగా సాహితీ గౌతమి అధ్యక్షులు కె.ఎస్.అనంతాచార్య, భగవతి విద్యాసంస్థల అధినేత బి.రమణరావు, ప్రముఖ కవి, వ్యాఖ్యాత వి.పి.చందన్‌రావు, ఆత్మీయ అతిథులుగా డా. అడువాల సుజాత, ఇస్రత్ సుల్తానా హాజరుకానున్నారని, డా. బి.వి.ఎన్.స్వామి గ్రంథ పరిచయం చేస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

పుస్తక సమీక్ష

కవిత్వ వెలుగులు పంచే ‘చిరుదీపాలు’!

పేజీలు : 144, వెల :100/-
ప్రతులకు: వంశీ పబ్లికేషన్స్
వంశీ నర్సింగ్ హోం కాంపౌండ్
ఇందిరా భవన్ రోడ్
నెల్లూరు-524001

బహుగ్రంథకర్త డాక్టర్ పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి గారు ఈ మధ్య ‘చిరు దీపాలు’ పేరుతో ఓ గ్రంథాన్ని వెలువరించి ‘రెక్కలు’ కవితా రూపానికి వెలుగులు నింపారు. భావంతో పాటు సందేశంతో రూపుదిద్దుకున్న ఇందలి ‘రెక్కలు’ పాఠకుల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి. లోగడ వివిధ ప్రక్రియల్లో తమ ప్రతిభను ప్రదర్శించిన డాక్టర్ పెళ్లకూరుగారు ఇప్పుడు ‘రెక్కలు’ రూపంలో తమ సృజనను చాటుకోవడం ప్రశంసనీయం! కవిత్వ ప్రక్రియ ఏదైతేనేం? అందులో కవిత్వాంశ వుంటేనే పాఠకులు ఆదరిస్తారన్నది నిజం చేస్తూ..‘రెక్కలు’ సాహితీ ప్రపంచంలో ఇప్పుడిప్పుడే వడి వడి అడుగులేయడం జరుగుతోంది. తమ జీవితానుభవాన్ని రంగరించి రాయబడిన ఇందలి రెక్కలు’లో పెళ్లకూరి గారి ఉత్తమ వ్యక్తిత్వం ప్రతిబింబిస్తోంది. తాను స్వయంగా వైద్యురాలు కనుక పెళ్లకూరు గారు అక్కడక్కడ వృత్తిపరమైన అంశాలను జూప్పించి.. పాఠకుల్ని మెప్పించ యత్నించారు. మానవత్వాన్ని మించిన మహానీయత లేదనీ.. పొగరు అణగాలంటే..ఎదురు దెబ్బలు తినాల్సిందేనని..గుర్తింపుకోసం కవులు ఉబలాటపడొద్దనీ పెళ్లకూరు గారు రెక్కల్లో హితవు పలికారు.
ఒక చేతిలో / చీకటి / మరో చేతిలో / వెలుగు../ జీవితం / బొమ్మా, బొరుసు! అంటూ జీవన సత్యాన్ని తేల్చి చెప్పారు.
మాటతో / మనిషిని / నొప్పించవచ్చు / మెప్పించవచ్చు / మాటే మంత్రం అంటూ ‘మాట’ మాటున దాగిన భావాన్ని విడమరిచి చెప్పారు.
ఆత్మన్యూనతా/్భవం/ప్రగతికి/అవరోధం / స్వయం/ సంకెల అని వివరించిన తీరు బాగుంది.
బతుకును/చల్లకుండను చేసి/ చిలికి/ చూడు/ వెనె్నల/ సోనలు అన్న పంక్తులు చక్కని సందేశాన్ని మోసుకొచ్చాయి. నడుస్తున్న చరిత్రకు అద్దం పడుతూ పెళ్లకూరు గారు రాసిన కవితలు బాగున్నాయి.
చెప్పులకు/మార్గం/చూపిస్తున్నాయి/కళ్లద్దాలు- వృద్ధాశ్రమం/ గమ్యం అని చెప్పడంలోని కవయిత్రి గారి ఔచిత్యాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఆ కాలంలో /బిడ్డపాలు/ఉచితం/ఇప్పుడు అన్నీ అమ్మకానికే/కాలం మీద/పైసల కాటు అని వ్యాఖ్యానించారు. నిజమే కదా!
ప్రేమ/మధురమైందే/కానీ/పద్మవ్యూహం/ తెలిసి/ప్రవేశించాలని హితవుపలికారు.
రాజకీయ/ హామీలు/ ఫైళ్లకు/ ఎక్కవు/ ఫ్లెక్సీల/ సంబరమని చమత్కరించారు.
తెలంగాణ/సీమాంధ్రా/ఉమ్మడి కుటుంబం / చీలిపోయింది-‘శోకపత్రంపై/అధికార ముద్ర అన్న పంక్తులతో అందరూ ఏకీభవించకపోవచ్చు. ‘ప్రజాభీష్ట పత్రం’పై అధికార ముద్ర అంటే బాగుండేది! అన్నదమ్ముల్లా విడిపోయి..కలిసి మెలసి ఉండే అవకాశముందిగా? అన్న ఆలోచనలు పాఠకుల్లో కలిగే వీలున్నది..
జీవితాన్ని గ్రహించి..అనుభవాన్ని సంగ్రహించుమంటూ.. జీవితమంటే వెలిగే దీపమని విడమరిచి చెప్పారు. ఇలా ‘రెక్కలు’లో పెళ్లకూరు గారు కవిత్వాన్ని పండించడంలో సఫలీకృతమైనారు..అందరు హాయిగా చదువుకోదగిన గ్రంథమిది!

- సాన్వి, కరీంనగర్
సెల్.నం.9440525544

మనోగీతికలు

నిజమైన ప్రేమకు..
నిర్మానుష్యమైన నా జీవనయానంలో..
అనుకోని నీ ఆగమనం
కలిసి జీవించాలనుకున్న కలను
నిజం చేస్తుందన్న నమ్మకం
క్షణక్షణానికీ నాలో బలపడుతోంది!
నీ దానిగా చేసుకోవడమే కాదు..
మందహాసాన్ని కూడా పరిచయం చేశావు!
నా నిశీధి ప్రపంచంలో
చిన్ని దీపాలు వెలిగించడమే కాక..
సంజీవనిగా మారి ఊపిరిపోశావు!
నవ్వడమే కాదు..
నవ్వించడం కూడా నేర్పిన నువ్వు
చేదెక్కిపోయిన నా జీవితానికి
చెరకుగడల తీపిని రుచి చూపావు!
నిప్పులపై నడకే తప్ప..
నిజమైన సంతోషాన్ని ఎరుగనిదాన్ని
నా కోరికలు మాయతెరల మాటున..
దోబూచులాడుతున్నాయి!
ఆకాశమంతటి ఆనందాన్ని
నా ముంగిలిలో గుమ్మరించినా..
ఆస్వాదించడానికి
మనసు నా దగ్గర లేదు..!
నిజమైన ప్రేమకు
నిర్వచనం చెప్పలేకున్నా..
నిన్ను ప్రేమించలేదని
నన్ను నేను మభ్యపెట్టుకోలేదు..
మన్నించు!

- పొద్దుటూరి మాధవీలత, ఎడపల్లి గ్రామం, నిజామాబాద్ జిల్లా, సెల్.నం.9030573354

వృక్ష విలాపం..
ఎక్కడ చూసినా..
హరితం, హరితం
హరిత హారం నినాదాలు
‘మొక్కలు నాటండి’
‘వృక్షాలను కాపాడండి’ అంటూ
కబుర్లు చెబుతుంటే..
మా వృక్ష జాతంతా
ఎగిరి గంతులేసినట్లు
సంబరాలు జరుపుకుంది!
మాకు మంచి రోజులొచ్చాయని
మురిసి పోయాయి!
అతిథి, అభ్యాగతులకు
నీడతో సాంత్వననిద్దామనుకున్నాము!
దేవుడు కరుణించినా..
పూజారి వరమీయనట్లు..
నారు పోశారు..
నీరు పోయడం మరిచారు!
గోతులు తవ్వి
మమ్మల్ని పూడ్చి..
చేతులు దులుపుకున్నారు!
పశువులు పీక్కుతుంటున్నా..
పట్టించుకునే నాథుడే కరువైనాడు!
ఓ మనుష్యుల్లారా!
మీకు దయ, మానవత్వం లేదా?
మీ పిల్లల్ని ఇలాగే..
రోడ్డుపై పడేసి చోద్యం చూస్తారా?
మాకు ప్రాణం ఉందని గ్రహించండి!
మమ్మల్ని..
కాపాడేందుకు ముందుకు రండి!
మీ గృహ ప్రవేశానికి
మీ పాప ఊయల ఊగడానికి
వృద్ధాప్యంలోనూ
మీకు చేతి కర్రగా మారి
ఆసరా యివ్వడానికి..
చివరికి
మీ మోక్షప్రాప్తికోసం చేసే
యజ్ఞంలో
సమిధలయ్యేది మేమేనని
ఇకనైనా తెలుసుకోండి
మమ్మల్ని అక్కున చేర్చుకోండి!
గుక్కెడు నీళ్లు పోసి..ఆదుకోండి!!

- చిలుకమర్రి విజయలక్ష్మి, ఇటిక్యాల గ్రామం
సెల్.నం.9493210293

అంతం లేని..!
ఎంత ప్రయాణించినా..
చేరలేని గమ్యం!
ఎంత తరచి చూసినా..
తనివి తీరని అందం!
ఎంత నేర్చినా..
తరగిపోని మేధస్సు!
ఎంత పొందినా..
అంతులేనిది ఆనందం!
ఎంత కలిగినా..
మితం లేనిది ధనం!
అంతా తనకే..
దక్కాలనే స్వార్థం!
ఇంకా ఇంకా పొందాలన్న ప్రేమ!
మానవునికి ఎప్పటికీ..
అందనిదీ..
అందుకోలేనిదీ..
అంతమంటూ అసలేనిది ఆశ!

- పోపూరి మాధవీలత, భాగ్యనగర్, సెల్.నం.8125115667

ఎంతకాలం ?
జీవిత చదరంగంలో
ప్రజలను పావులుగా చేసి..
మీరు ఆట ఆడుకుంటున్నారు!
ఎంత గొప్ప వాళ్లు మీరు?
మీరూ..
మీ రాజకీయం సమాధి కానీ!
ఇది తిట్టుకాదు..
శాపం!
ప్రజలు రుషులు
పరమాత్ములు!
శ్రమను నమ్ముకున్న సాహసులు!
ఒడ్డున కూర్చుని..
చేపలను పడుతున్న వేటగాళ్లు మీరు!
సూర్యాస్తమయానికి..
మీరు కనుమరగవ్వక తప్పదు!
ఎంత కాలం మీ ఆట?
జనంకు ఓపికున్నంత
కాలమే సుమా!!

- సిహెచ్.మధు
నిజామాబాద్
సెల్.నం.9949486122

చివరకు మిగిలేది !
మానవ తత్వానికి దూరమవుతూ..
అంతర్గత అంధకారంలో
జడత్వానికి దగ్గరవుతూ..
నేను, నాది నాకే, అన్న
స్వార్థం మాయలో కొట్టుమిట్టాడుతూ..
విరామం ఎరుగని దిన చర్యతో
యంత్రాలను..
తలపిస్తున్నారు నేటి మనుషులు!
అంతులేని ఆశల వలలో చిక్కుకుని..
మానవ సంబంధాలన్నింటినీ..
‘మనీ’ సంబంధాలుగా
మార్చుకుంటూ..
మనుగడ సాగిస్తున్నారు!
చివరకు మిగిలేది శూన్యమేనని
తెలిసినా..
సేద తీర్చిన సెలయేళ్లను కాదని
ఎండమావులవైపు..
ఎగబడి పరుగెడుతున్నారు!

- రామానుజం సుజాత
కరీంనగర్
సెల్.నం.9701149302

రైతు భారతం

గుప్పెడు మెతుకులకు సాటిలేదనీ
కరెన్సీ నోట్ల కట్టలు..
కడుపు నింపవన్నది జగమెరిగిన సత్యం!
యుగ యుగాలకది
శిలాశాసనం!
ఒకనాడు..
పొలాల వెంబడి పక్షుల కిలకిలా రావాలు
కళ్లు చెదిరె ధాన్యరాశులు!
రైతు ఇంటా..
నిత్యం పండుగ పరవళ్లు!
రైతు మదిలో..
ఆనంద రవళులు!
ఈనాడు..
పంటలు లేక..
రైతుల కంటతడితో నిండిన పొలాలు..
పని లేక..
మూలన పడ్డ హళాలు!
ప్రతి రోజు
ఎక్కడో ఓ చోట
ఆత్మహత్యల విషమకాండ
రైతుల ఇంట కర్మకాండ!
ఇకనైనా..
పాలకులు మేల్కొని
రైతుల మోముల్లో వెలుగులు నింపాలి!

- శిష్ణా మాధవి, కరీంనగర్
సెల్.నం.7382183258

===============
ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి. మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmai l.com