ఉత్తర తెలంగాణ

ఆమని రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోమలత్వము నిండిన భామవోలె
పల్లవించిన ‘దుర్ముఖి’ వచ్చె జగతి
అడుగులందున నవరాగమలరుచుండ
కొత్త సొగసుల కూర్మిని గూర్చి నేడు!
కవుల కవితామృతమ్ముల కలరుతములు
పదము పదమున సంగీత నదులవోలె
పరువులెత్తుచునుండగ వచ్చెయేడు
దుర్ముఖీనామ హర్షసందోహ నేడు!
చిగురు చిగురున బేర్చుచు చిత్రకళల
వగరు తీపియు పుల్పును బ్రతుకు తోడ
రంగరించుచు అనుభూతి రమ్యగతిని
చేతునుప్పును కారమునే చేసి రుచిగ!
కాలమా! తీర్చిదిద్దుము కాంతి పథము
భావి భాగ్యాల గూర్చెడి భద్రరథము
దినముకొక్క యుగాదిని దీర్చిపొమ్ము!
కొత్త యనుభూతి నీయగ కోరిరమ్ము!

- డా. ఆయాచితం నటేశ్వర శర్మ
కామారెడ్డి
సెల్.నం.9440468557

దుర్మిఖి!

పేరుకు మాత్రమే నీవు...
‘దుర్మిఖి’వి!
కానీ..
మా కందరికీ శుభాలొసగే
కల్పవల్లివి!
మోడువారే
వృక్షాలను చిగురింపజేసినట్లే..
పేద ప్రజల మోముల్లో
వెలుగులు ప్రసాదించు!
దేశమంతా సుభిక్షంగా..
ఉండేందుకు..
వరుణదేవుడు కరుణించాలని
కబురంపు!
నిత్యావసర ధరలకు రెక్కలొచ్చి
నింగికెగరకుండా..
నియంత్రించు!
ఆచరణ సాధ్యమైన
వాగ్దానాలు చేయుమని
పాలకులకు..సూచించు!
పెద్దలను..
వృద్ధాశ్రమాల్లో చేర్చే ప్రబుద్ధులకు..
సద్భుద్ధిని ప్రసాదించు!
బడుగు జీవులకు
భరోసా కల్పించు!

- బొమ్మకంటి కిషన్
కరీంనగర్, సెల్.నం.9494680785

ఓ కోయిలా!

ఇంకా ఈ రాతిరి రహదారి
విడిపోనే లేదు..
చైత్రమాసపు తొలి కిరణం
పుడమిని ఇంకా ముద్దాడనే లేదు..
తొందరపడి కూయకే.. ఓ కోయిలా!
అప్పుడే వసంతం
వచ్చిందనుకుంటారు సుమా!
ఓ కోయిలా..
ఏనాటి అనుబంధమే నీకు, వసంతానికి!
చిగురాకుకి, చిరునవ్వయి
చిందులేస్తుంటావు!
నీ చిరుస్పర్శతో
ప్రకృతిని పరవశింప జేస్తావు!
ఆమని ఆగమనాన్ని ఇట్టే పసిగట్టే..
ఓ సొగసరి కోయిలా..
నీ కుహు కుహు రావాలతో..
చైత్ర రథమెక్కి..
కొత్త సంవత్సరంగా కొలువుదీరేందుకు
వస్తున్న ఉగాదికి..
స్వాగత గీతం ఆలపించు!
జనులందరికీ శుభాలొసగాలని
‘దుర్మిఖి’ని ఆహ్వానించు!

- టి.వసంత,
నిజామాబాద్
సెల్.నం.7286031916

ఉగాది నాడైనా..

ప్రకృతితో పాటు..
కవులు, పండితులు, జనులెల్లరు
సంతోషించగ..
మళ్లీ ఏ తెంచే నవ వసంతం!
కవి పండితుల
సత్కారాలకు చుట్టింది శ్రీకారం!
ఇంకేం!
మన్మథకు వీడ్కోలు చెబుతూ
దుర్మిఖికి ఆహ్వానం పలుకుతూ
జగమంతా.. సుభిక్షంగా ఉండాలంటూ
కొంగ్రొత్త కవితలల్లడానికి
కవులారా సిద్ధం కండి!
మార్పుకు సంకేతంగానైనా
మిత్రులారా
షడ్రుచుల పచ్చడిని సేవించండి
భక్షముల భుజించి..
పండగ నాడైనా..
ఫాస్ట్ ఫుడ్‌లకు స్వస్తి పలకండి!
సినిమాలు, సీరియళ్లు
సెల్ ఫోన్‌లకు విరామమిచ్చి..
ఉగాదినాడు పంచాంగ శ్రవణానికెళ్లి..
శుభాలకు స్వాగతం పలకండి!

- గంప ఉమాపతి
కరీంనగర్,
సెల్.నం.9849467551

ఆమని రాకకై...

ఆమని రాకకై..
ఆసక్తిగా నిరీక్షిస్తున్న కవిహృదయం
కోయిల పాటకై పరితపిస్తోంది!
నవ వసంత ఆగమన వేళ..
అందాలను ఆస్వాదిస్తూ
కవి మనసు లేడి కూనలా
గంతులేస్తోంది!
నిన్న మునిమానుపు సమయాన..
విచ్చుకున్న మల్లెలు..
నేడు ప్రభాతవేళ
నులివెచ్చని తలపుల్లో తడిసి
కొంగ్రొత్త ఊహలకు
ఆహ్వానం పలుకుతూ
కవి అక్షరం
మట్టి పరిమళమై పరవశించాలని
ఉవ్విళ్ళూరుతోంది!
జగమంతా సుభిక్షంగా ఉండాలనీ
జనులంతా సుఖ సంతోషాలతో
వర్ధిల్లాలనీ..
కొత్త సంవత్సరానికి కవిత్వంతో
అక్షర హారతి పట్టాలని
కవి కలం, ఆరాటపడుతోంది!
పేరుకు ‘దుర్మిఖి’ అయితేనేం!
పంచాంగ ఫలాలు
ఫలప్రదంగా ఉండాలనీ
కవి గణం కాంక్షిస్తోంది!

- పొద్దుటూరి మాధవీలత
ఎడపల్లి, సెల్.నం.7386483664

దుర్మిఖీ.. స్వాగతం

సోదరుడు మన్మధుడు శుభాలతో వెళుతున్నాడు
అన్నయ్య ‘దుర్ముఖి’ మెరుపు దివిటీలతో
ఉరుముల శంఖారావములతో మేఘ సింహాసనంలో
వాయువు పిల్ల తెమ్మెరలై వింజామరలు వీస్తుండగా
నువు దివి నుండి భువికి దిగిరాగా నీకు వనరాణి
ఎదురేగి ఆహ్వానించి గజరాజంతో ఆహ్వానం పలుకుతోంది!
అడవిపూల మాలలు వేయించి సింహ వాహనంపై
పర్వత రాజమలు ఫలవృక్ష సముదాయములు
జంతుజాలము నదీనదాలు సర్వవన రక్షకులు
వెంటరాగా విజయ దుందుభులతో
ఊరిలోకంపగా నిను వసంతులు మల్లి మాలలతో
వేప పూబాలల సువాసనలతో మామిడి తోరణాలతో
ముంగిట ముగ్గులతో శుక పిక రణగొణ ధ్వనులతో
ఆహ్వానం పలుక పండు ముతె్తైదువలు మంగళ వాద్యములతో
స్వాగతం పలికి ఇంట్లోకి తెచ్చి అందముగా అలంకరించిన
దేవుని మందిరంలో ఉంచి నీకు ఉగాది పచ్చడితో
భక్ష్య భోజాద్యులతో నిను పూజించి పంచాంగ శ్రవణంతో
నను సంతృప్తిపరచిన మమ్ము ఆనంద జీవితాలతో
రామ రాజ్యమును తలపించేలా చేసి నీవు శుభాలతో
వెళ్లాలని ఈ విప్లవ కుమారి కోరిక!

- అనభేరి విప్లవ కుమారి
పోలంపల్లి, సెల్.నం.9000282372

ఉగాది శుభాకాంక్షలు

సూర్యుని రాకకై ఎదురుచూస్తూ
చంద్రుడు మబ్బుల మాటున దాక్కుంటున్నాడు
భానుడు చిరు చీకట్లని చీల్చుకుంటూ
వేకువనే తన వెలుగులని వెదజల్లుతూ వస్తున్నాడు
ఆశల రెక్కలని మొలిపించుకొని స్వేచ్ఛగా ఎగురుతూ
కపోతం అలవోకగా తన వాణిని లోకానికి అందిస్తున్నది
ఉగ్రవాదాన్ని ఉక్కు పాదాల కింద తొక్కేయాలంటూ
ప్రపంచ ప్రజలంతా ఒకే గొడుగు కిందికి రావాలంటున్నది
సౌభ్రాతృత్వాన్ని విహంగాల్ని జనంలో పెంచుతూ
ప్రపంచానికి తమ శాంతి మంత్రాన్ని ఉపదేశిస్తున్నది
లోకాన మానవత్వపు పరిమళాలు వెదజల్లుతూ
జనమంతా ఒక్కటవ్వాలని
ముక్త కంఠంతో ఘోషిస్తున్నది
మన్మధనామ సంవత్సరాన్ని
వీడ్కోలుతో సాగనంపుతూ
కోయిలలన్నీ కొత్త ప్రపంచాన్ని మేల్కొల్పుతున్నవీ
దుర్మిఖి నామ సంవత్సరాన్ని
కొత్త రాగాలతో ఆహ్వానిస్తూ
ఉగాది శుభాకాంక్షలు చెపుతూ
మనమంతా కలిసుండాలని కోరుకుంటున్నవి!

- సల్వాజి వాణి
కరీంనగర్, సెల్.నం.9000282372

చైత్రలక్ష్మి

తల్లీ చైత్రలక్ష్మీ!
ఆనందోన్ముకులమై
నీ శుభాగమనాన్ని
స్వస్తివచనాలతో
సాదరంగా స్వాగతిస్తున్నాం!
నీవావిష్కరించే
వసంత జల్లుల్లో
తనివితీరా తడిసి ముద్దవ్వాలని
ఎంతగానో ఆరాటపడుతున్నాం!
ఆప్యాయతానురాగాలను
ప్రేమాభిమానాలను
మేమంతా గుండెల్లో
పండించుకుంటామని
పరస్పర స్నేహ హస్తాలతో
ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం!
రుచులారయినా
దేని రుచి దానిదే
దేనికేదీ తీసిపోదు
దేనినేదీ మించిపోదు
వాటి సమాగమంతో
నీవందించే ఉగాది పచ్చడి
దివ్యౌషధ సమమనే కదా
అత్యంత భక్తి విశ్వాసాలతో
ఆదరిస్తూ ఆస్వాదిస్తున్నాం!
- కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం
జగిత్యాల
సెల్.నం.9492457262

నవ వసంతం!

నూతనోత్సాహాన్ని నింపే..
కొత్త సంవత్సరం!
కోటి వెలుగులు పంచే..
నవ వసంతం!
లేలేత చిగురులు కొరుకుతూ
కబుర్లు చెప్పే చిలుకమ్మలు!
కుహు..కుహు రావాలతో
మనసును సాంత్వన పరిచే..
కోకిల గానాలు!
ఆమని అందాలు
నవ్వుల పొదరిల్లులై..
సప్త వర్ణశోభిత హరివిల్లులై..
కోటి ఆశలు రేకెత్తించే ఈ ఉగాది
నవశకానికి కావాలి నాందీ
అవ్వాలి నవకాంతికి పునాది!
- హన్మాండ్ల రమాదేవి
బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా
సెల్.నం.9959835745