ఉత్తర తెలంగాణ

మిస్సమ్మ! ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్ను వదిలి వెళ్లడం తప్పదా మమీ కన్నీళ్లతో అడిగాడు వరుణ్. ‘ఈ ఒక్క సంవత్సరమే నాన్నా, వచ్చే సంవత్సరం నుంచి మనిద్దరం కలిసే ఉంటాం, సరేనా? అంటూ అనునయించింది సీత.
‘అయితే ఈ రోజంతా నువ్వు నాతో ఉండు. రేపే నేను స్కూళ్లో జాయిన అవుతా’
‘సరే’నంటూ ఇద్దరూ కలిసి గుడి, పార్కు, రెస్టారెంటూ తిరిగి రాత్రికి ఇంటికి చేరారు.
‘ఈ సంవత్సరం ఒప్పుకున్న కాంట్రాక్ట్ పూర్తి చేసేవరకు బాబును హాస్టల్‌లో వేయక తప్పదు’ అలా మనసులో అనుకుని భారంగా కళ్లు మూసుకుంది సీత.
***
‘గుడ్‌మార్నింగ్ మేడం..మైనేమ్ ఈజ్ సీత
‘హి ఈజ్ మై సన్ వరుణ్’ ప్రిన్సిపల్‌తో పరిచయం చేసుకుంది.
‘గుడ్ మార్నింగ్, ఇది అప్లికేషన్ ఫాం’ ‘్ఫలప్ చేయండి’ అంటూ ఇచ్చింది ప్రిన్సిపల్. ఐదు నిమిషాల్లోగా ఫాం నింపి తిరిగి ఇచ్చింది సీత.
ప్రిన్సిపాల్ ముఖంలో రంగులు మారాయి.
‘ఆర్ యు మిస్ సీత’
‘యస్ మామ్’ అన్న సీత బదులుకు నిర్లక్ష్యంగా నవ్వును పడేసింది. ‘ఇట్స్ ఒకే. మీరు క్లర్క్ దగ్గరికెళ్తే మిగతా వివరాలు తెలుస్తాయి’
***
సీతను వెయిట్ చేయమని చెప్పి, క్లర్క్ రూం కెళ్లి ప్రిన్సిపల్ వివరాలు చెప్పడం, మాటల్లో ‘ఆ వచ్చిన ఆవిడ మిస్ సీతంట’ అంటూ వ్యంగ్యపరచడం’ సీత వినకపోలేదు.
‘ఏంటి మేడం! ఈవిడ మిస్సమ్మ సరే! మిస్సయ్య ఎక్కడో మిస్సయినట్టున్నాడే’ అంది క్లర్క్.
ఇది విన్న సీత చిన్నగా నవ్వుకుంది.
***
వరుణ్‌కి కావాల్సినవన్ని సర్ధి, జాగ్రత్తలు చెప్పి, తన కాంటాక్ట్ నెంబర్, డిటేల్స్ ఇచ్చి బాధతో వెనుదిరిగింది సీత.
***
అది సిటీలోనే అతి పెద్ద హాస్పిటల్. పరుగు పరుగున వస్తున్న సీతకు ఆ వాతావరణం చూడగానే ఏం జరిగిందోనన్న భయం ఆమె పరుగును ఇంకా పెంచింది.
***
‘మీ కోసమే ఎదురుచూస్తున్నాం మేడం! భయపడాల్సిందేం లేదు. ప్రమాదం తప్పిందనే అనాలి’ అంటున్న ప్రిన్సిపల్ మాటలకు అడ్డుకట్టవేస్తూ, అసలేం జరిగిందో వివరంగా చెప్పండి’ అంటూ గద్గదస్వరంతో అడిగింది. నిన్న పార్కుకని పిల్లల్ని బస్సులో తీస్కెళ్తుంటే ఒక లారీని తప్పించే యత్నంలో బాబు బస్సు చివర నిల్చోవడం వల్ల రోడ్డు మీద పడిపోయాడు’ అంటూ వరుణ్ క్లాస్ టీచర్ చెప్తున్న మాటలు పూర్తి కాకపోకముందే కుప్పకూలిపోయింది సీత.
***
అప్పుడే డాక్టర్ బయటికి రావడంతో అందరూ ఆయన్ని ఆతృతగా చుట్టుముట్టారు.
‘డాక్టర్, ఈవిడే వరుణ్ తల్లి’ పరిచయం చేసింది ప్రిన్సిపల్.
సీతను చూస్తూనే డాక్టర్ ఆశ్ఛర్యంతో
‘డాక్టర్ సీత! వరుణ్ మీ కొడుకా! అంటే ఆ అబ్బాయేగా!
‘అవును డాక్టర్ ఈ వరుణ్ ఆ అబ్బాయే’!
‘ఓకే సీత! మీరు ఈ మందులు తీసుకురండి’ అంటూ ఆమెను కావాలనే క్రింది ఫ్లోర్‌కి పంపించారు డాక్టర్.
మీ అనుమానం నాకర్థమైంది’, ‘సీత డాక్టరే గాదు, గొప్ప సంఘసేవకురాలు కూడా’? అన్న డాక్టర్ మాటలకు,
‘అయితే మరి ఈ అబ్బాయి, ఆ అబ్బాయేనా? అన్నారు అడిగింది ప్రిన్సిపల్.
‘సునామీ ప్రమాదమప్పుడు మా టీం సహాయార్థమై మద్రాస్ వెళ్లాం. సీత అప్పుడు మా జూనియర్. అప్పుడే ఎంబిబిఎస్ పూర్తి చేసి కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్న అమ్మాయి’. అంటూ కొనసాగించాడు డాక్టర్.
‘ఇక వరుణ్ విషయానికొస్తే అదే సునామీలో కన్నవాళ్లను పోగొట్టుకున్న వాడు, బాధాకరమైన విషయమేంటంటే మద్రాస్‌లో చదువుకుంటున్న తన క్లాస్‌మేట్, కాబోయే భర్త మోహన్‌ని పొగొట్టుకుంది. అదే సునామీలో’. అప్పుడే సీత పెళ్లికాని విధవ. వరుణ్‌ని దత్తత తీసుకుని పెళ్లికాని తల్లి అయింది’. ‘బహుషా మీరందరు సీతను అపార్థం చేస్కుని వుంటారు’. అంటూ ముగించాడు డాక్టర్.
***
ఆ రోజు స్కూల్‌లో తామంతా సీతను అపార్థం చేసుకున్నందుకు సిగ్గుతో తలవంచుకున్నారు స్ట్ఫాంతా.
***
‘అంతే కాదు! సీత, మోహన్ ఇద్దరూ కలిసి పెరిగిన అనాథలు, వాళ్లు పెరిగిన శరణాలయపు సేవా కార్యక్రమాల్లో భాగంగానే సీత, వరుణ్‌ని హాస్టల్‌లో’ వేసింది.
***
‘క్షమించండి డాక్టర్! ‘సీత, సీతామాతంత పవిత్రమైందని తెలియక అపార్థం చేసుకున్నాం’ అన్న ప్రిన్సిపల్ మాటలకు, అప్పుడే వచ్చిన సీత విని చిరునవ్వుతో తన కొడుకు వరుణ్ ఉన్న గదివైపు అడుగులు వేసింది.

- పెనుగొండ సరసిజ
కరీంనగర్
సెల్.నం.7386806499

అపార్థం
చిన్నకథ
ఉషోదయ వేళ.. సూర్య కిరణాలు కిటికీలోంచి ముఖం మీద పడుతున్నాయి. బాగా తెల్లారినట్లుంది. నిద్ర లేద్దాం అనుకునేంతలో శ్రీమతి అరుణ హడావిడిగా నా వద్దకు వచ్చింది. ‘ఏమయ్యింది? ఎందుకలా ఉన్నావని’ ప్రశ్నించాను.
‘ఏమండీ! నాన్న ఫోన్ చేశారు. అమ్మకు ఆరోగ్యం బాగా లేదట. మనం వెంటనే బయల్దేరి వెళ్దామండీ’ అంటూ కిరణ్‌ను అల్లుకుని బావురుమని ఏడ్చింది అరుణ.
కాసేపటికి ఇరువురూ కారులో గ్రామానికి బయలుదేరారు. దారిలో పోయినసారి అమ్మ దగ్గరికి వెళ్లిన సంఘటన గుర్తుకు వచ్చింది..అరుణకు.
‘అమ్మా మా ఆయనకు ఏదైనా టిఫిన్ చేయమ్మా అడిగింది’ అరుణ. ‘ప్రతి రోజు నేనే టిఫిన్, అన్ని పనులు చేస్తున్నా కదా ఈ రోజుకి నువ్వు చేయమ్మా’ అన్నది తల్లి. విసుక్కుంటూ టిఫిన్ చేసింది అరుణ. ఉన్న నాలుగు రోజులు కూతురుకే పని వప్పజెప్పి పడుకుంది తల్లి.
ఆ రోజు రాత్రి అరుణతో.. ‘మీ అమ్మ చాలా మారిపోయిందోయ్. మునుపటిలా నీపై ప్రేమ లేదు. అల్లుడన్న గౌరవము నాపై లేదు. ఇదివరకు వచ్చినప్పుడు రకరకాల పిండి వంటలు చేసి మరీ మరీ వడ్డించేది’ అన్నాడు కిరణ్. ‘నిజమేనండీ’ అంటూ వంత పాడింది అరుణ.
ఆ గది పక్కగా వెళ్తూ ఆ మాటలు విని ఎంతో బాధపడ్డాడు అరుణ తండ్రి జగన్. తెల్లవారుజామున కూతురు, అల్లుడు ఇద్దరూ బయల్దేరి వెళ్తూ ‘మేము దీపావళికి రావడం లేదన్నారు. మా కోసం రమ్మని కబురు చేయొద్దు’ అని నిష్ఠూరంగా మాట్లాడి వెళ్లిపోయారు. తర్వాత అమ్మ ఫోన్ చేసి మీరు వెళ్లినందుకు నాన్నగారు నన్ను తిట్టారని ఏడుస్తూ చెప్పింది. తాను ఫోన్ కట్ చేసింది. ఇదంతా గుర్తుకు తెచ్చుకుంది అరుణ. ఇంతలో..కారు ఒక్క కుదుపుతో సడన్ బ్రేక్ వేయగా ఆగిపోయింది. అరుణ కళ్లు తెరిచింది ఇల్లు వచ్చేసింది ఎదురుగా నాన్న నిలబడి ఉన్నారు. ‘నాన్నా అమ్మ ఏది’ అని అడిగింది కూతురు. ‘బెడ్‌రూంలో పడుకొని ఉన్నది’ చెప్పాడు జగన్. ప్రక్కనే ఉన్న పక్కింటి ఆంటీ కలుగజేసుకుని..‘అమ్మా అరుణా! మీ నాన్నగారు ఆఫీస్‌కి వెళ్లిన తర్వాత పంచదార అరువుగా తీసుకుందామని మీ ఇంటికి వచ్చాను. మీ అమ్మ నేలపై కళ్లు తిరిగి పడిపోయి ఉంది. ఆటో తీసుకొచ్చి నేనే ఆసుపత్రికి తీసుకొని వెళ్లాను. డాక్టర్‌గారు అన్ని పరీక్షలు చేసి రక్తం చాలా తక్కువగా ఉంది. రక్తం ఎక్కించాలి. జ్వరం కూడా ఉంది. టైఫాయిడ్ జ్వరం. ఆమెకు ఏ పనీ చెప్పవద్దు. పూర్తిగా మందులు వాడుతూ పండ్లు తీసుకుంటూ రెస్టు తీసుకుంటే జబ్బు నయమవుతుంది’ అని చెప్పారు డాక్టర్ గారు అన్నది ఆంటీ. చెమర్చిన కళ్లతో అమ్మ దగ్గరికి చేరింది అరుణ.
‘అమ్మా ఒక్కసారి కళ్లు తెరువమ్మా మొన్న మొన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాకెంతో చేశావు. నీవు లోపల అనారోగ్యంగా ఉండి నీరసంతో ఏ పని చేయలేకపోయావు అని గ్రహించలేక పోయాను. నీవు మారిపోయావనుకున్నాను. నన్ను క్షమించమ్మా’ అంటూ తల్లి కాళ్లపై పడి బోరున విలపిస్తూ అంది అరుణ.
‘నాన్నగారూ అమ్మ పూర్తిగా కోలుకునేంతవరకు నేను ఇక్కడే ఉండి అన్ని పనులు చేస్తాను. అమ్మను కంటికి రెప్పలా కాపాడుకుంటాను నాన్నా’ అని అంటున్న కూతురి తలనిమురుతుంది. ప్రేమగా చూస్తుండిపోయాడు జగన్! ఆమెలో వచ్చిన మార్పుకు తండ్రిగా ఎంతో ఆనందించాడు జగన్!

- సిరిపురం వాణిశ్రీ
రేకుర్తి గ్రామం, కరీంనగర్ జిల్లా
సెల్.నం.9392023988

పుస్తక సమీక్ష

జాగృతానికి
ఆధరవు ‘దరువు’

ప్రతులకు:
ఎస్. జ్యోతి సదాశ్రీ
ఇం.నం.5-6-368/7/ఎ/2
మారుతినగర్, కరీంనగర్
సెల్.నం.9290088384
పేజీలు: 64, వెల : 50/-

‘బాల్యం / ఓ మధుర అనుభూతుల పేటిక! / జ్ఞాపకాల దీపిక!!’ అంటూ బాల్యం గురించి చక్కని భావాలను ప్రకటించిన సదాశ్రీ, తన రెండో కవితా సంపుటిగా ‘దరువు’ను వెలువరించారు. ఈ కవితా సంపుటిలో తెలంగాణ వాదానికి పెద్దపీట వేస్తూ.. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాసిన కవితలే ఎక్కువ ఉన్నాయి! ప్రత్యేక రాష్ట్ర సాధనా ఉద్యమంలో ఉడుతా భక్తిగా సమాజాన్ని జాగృతపరిచేందుకు చేసిన ప్రయత్నం స్వాగతించదగింది.
నిన్నటి స్వప్నానికి నిచ్చెన వేసే వాన్ని.. నేటి కాలానికి.. ఆకృతినిచ్చిన వాన్ని.. రేపటి రూపానికి ప్రాణానిచ్చే వాన్ని అని సగర్వంగా ప్రకటించుకున్న కవి సదాశ్రీ ‘దరువు’ కవితా సంపుటి నిండా భావోద్వేగంతో కూడిన కవితలే మనకు దర్శనమిస్తాయి! కవిత్వాంశ కోసం వెతికే పాఠకులకు కొంత నిరాశ కలిగినప్పటికీ.. ఆయన వివిధ అంశాలపై స్పందించిన తీరును మెచ్చుకోకుండా ఉండలేరు. ఉద్వేగంతో.. ఉద్యమ స్ఫూర్తితో కవితలల్లిన క్రమంలో గాఢత లోపించినప్పటికీ.. కవి సదాశ్రీకి ఈ మట్టిపై వున్న మమకారాన్ని.. ఆరాటాన్ని అభినందించి తీరుతారు. ‘బతుకమ్మ’ కవితలో.. అతివలు అర్చించే.. నయగారాలు సోయగాల బతుకమ్మ నడిచి వచ్చిన వన దేవతగా అభివర్ణించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో డాలర్ల వేటకై పరుగులు తీసే వారిపై కవి తమ కలాన్ని సంధించారు.
శ్రామికుడు - కండలు కరిగిస్తేనే.. ప్రగతి బాట.. కర్షకుడు.. ఒళ్లు వంచి శ్రమిస్తేనే.. బుక్కెడు బువ్వ అని గుర్తు చేసిన తీరు బాగుంది. ‘దరువు’ శీర్షికతో రాసిన కవితలో.. నీతికి, అవినీతికి మధ్య గల వ్యత్యాసాలను ఏకరువుపెట్టారు. మెడలోని హారాలు.. మేనుకే అందాలు.. మగువలకు మురిపాలు.. అంటూ కోయిలమ్మ పదాలు వినిపించారు. అతివలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందిస్తూ.. లోకానికి వెలుగు నింపే తల్లివి.. విశ్వం విల్లుతో సంధించిన బాణానివి.. ఆకాశమంతా ఎదిగిన అమ్మవి.. చూపులు చురకత్తులుగా మార్చుకొని.. మానవ మృగాలను ఎదుర్కో చెల్లీ అంటూ.. ధైర్యాన్ని నూరిపోశారు.
మానవత్వం మంట కలుస్తోందనీ.. స్నేహం కోసం హృదయాన్ని ఆవిష్కరించే సన్నివేశం కరువైందని వాపోయారు. మానవత్వానికి వారసులుగా నిలుపాలన్న కాంక్షతో.. నిత్యం కవి కోయిలపై కూస్తున్న మకర సంక్రాంతి జ్యోతినై ఎదురుచూస్తున్నానని కవి ప్రకటించి.. తమ ఉత్తమ వ్యక్తిత్వాన్ని చాటారు.
ఇలా ఈ చిన్ని గ్రంథంలోని కవితలన్నీ కవి సదాశ్రీకి ఉన్న సామాజిక దృక్పథానికి అద్దం పడతాయి. జన చైతన్యానికి దోహదపడతాయి. అయితే.. కవి సదాశ్రీ వస్తు ఎంపికలో ఇంకా శ్రద్ధ చూపాల్సి వుంది. శిల్పం, రూపం, అభివ్యక్తిలోనూ మెలకువలు పాటించాల్సి వుంది. అధ్యయనంపై దృష్టి సారించి మున్ముందు తమ కలానికి ఇంకా పదును పెట్టుకుంటారని ఆశిద్దాం.

- సాన్వి, కరీంనగర్
సెల్.నం.9440525544

మనోగీతికలు

వెలుగు రేఖ!
బాల్య, యవ్వనపు తొలినాళ్లు
అక్షరాల వేటలో..
జ్ఞానార్జన బాటలో గడిచినవి
పాఠశాల వీడుతున్నప్పుడు..
నా మనోనేత్రం
ఓ చిత్రాన్ని బంధించింది
ఆణిముత్యం లాంటి రూపం అది
అమ్మా..నాన్నల కలబోతల చిత్రం
అక్కున చేర్చుకుంది
వేలుపట్టి నడిపించింది
హద్దులు లేని స్వేచ్ఛని పంచింది
అందుకే..నా అంతరంగమున
ముద్రించబడింది!
కళ్లు మూసినా..తెరిచినా..
ప్రత్యక్షమైనట్టు ఉంటుంది!
తడిపిన వెలువనిది..మసకబారనిది
ఇంతింతై వటుడింతైనట్టు..నేను..
అంతకన్నా..గొప్పగాదుగా..
పొడిచే పొద్దులాంటిది
చిగురించే చెట్టులాంటిది
ఎగిసే కెరటం లాంటిది
పరిగెత్తే నదిలాంటిది
చీకటిని చీల్చు వెలుగురేఖ అది!

- దామరకుంట శంకరయ్య, కరీంనగర్. సెల్.నం.9440876788

లైట్ బాయ్ !
‘లైట్ బాయ్’ చీకట్లో ఉంటాడు!
ముందు హీరోలు హీరోయిన్లు ఆనందతాండవం చేస్తుంటారు!
లైట్ బాయ్ ఫోకస్ చేసే లైట్లో నటులు వెలిగిపోతుంటారు!
వెండి తెరమీది బొమ్మలు నాట్యం చేస్తున్నాయంటే
లైట్ బాయ్ మ్యాజికే!
లైట్ బాయ్ లేకుండా చిత్రాలు వెలుగులోకి రానేరావు!
లైట్ బాయ్ జీవితం లైట్‌గానే ఉంటుంది!!
లైట్ బాయ్ తెరమీద కనిపించడు!
హీరో గూర్చి, హీరోయిన్ గూర్చి, విలన్ గూర్చి, జోకర్ గూర్చి
అందరూ రాస్తారు!
కానీ లైట్ బాయ్ గూర్చి ఎవరూ రాయరు!
త్రాగి పడేసిన ప్లాస్టిక్ టీ కప్పులా ఎక్కడో పక్కకు వెళ్లిపోతాడు!
లైట్ వెనకాల చీకట్లో ఉండే లైట్ బాయ్ ఎవరికి కనిపిస్తాడు?
సూర్యుడస్తమించినా లైట్ బాయ్ ఉదయించే ఉంటాడు!

- కందాళై రాఘవాచార్య, నిజామాబాద్
సెల్.నం.9908612007

చెరువు!
మబ్బులు కరుణించి
కురుస్తేనే..
మణులు పండుతాయి!
వరుణుడు కరుణించకపోతే
చెరువే శరణ్యం!
అందుకే చేయి చేయి కలుపుదాం
చెరువులకు జీవం పోద్దాం!
చెరువులమ్మ నీడలో..
పంటలు పండేలా చూద్దాం!
చెట్టు, చేమ, పుట్ట, నీడ
జలక్షీరదాలకు నెలవు..
మన ఊరు చెరువు!
బీటలు వారి
కలుషితమైన చెరువు..
రూపురేఖలు మార్చుదాం!
చెరువుకు..
పూర్వ వైభవాన్ని తెద్దాం!
‘మిషన్ కాకతీయ’తో
జీవకళ ఉట్టిపడేలా..
రైతుల పాలిట
కల్పతరువులా ఉండేలా..
తలో చేయి వేద్దాం!!

- రాజమల్లు యాలల
కోహెడ
సెల్.నం.9908724156

బతుకమ్మ సందేశం
బతుకమ్మ, బతుకమ్మా!
బతుకు అర్థం తెలిపే తత్త్వం బతుకమ్మ
బతుకు, బతుకనివ్వు అనే సందేశం బతుకమ్మ
భారతీయ ఆత్మావిష్కారం బతుకమ్మ
తెలుగువాళ్ల జీవన విధానం బతుకమ్మ
నిజంగా
బతుకుమనే సందేశం ఎంత గొప్పది!
ప్రకృతిని సహజంగా అలంకరించే పువ్వులతో
ఆకృతిని సంతరించుకున్న బతుకమ్మ
నిజాయితీగా బతుకుమనే కదా- చెబుతున్నది
రంగు రంగుల పూవులన్నీ రమణీయంగా పేర్చబడి
వర్ణ భేదాలు మరచి బతుకుమనే కదా- సూచిస్తున్నాయి!
భిన్న జాతుల పూవులన్నీ కమనీయంగా కూర్చబడి
మత భేదాలు మరచి బతుకుమనే కదా- బోధిస్తున్నాయి
నిండుగా పూస్తూ నిష్కల్మషంగా నవ్వుతూ
నిండైన జీవితాన్ని గడపమనే కదా- నివేదిస్తున్నాయి!
అందుకే ప్రియమైన రైతు సోదరులారా!
ప్రకృతి సాక్షిగా బతుకమ్మ సందేశాన్ని శిరసావహిద్దాం
దృఢచిత్తులమై ఆత్మహత్యలను నివారిద్దాం

- సరస్వతి రత్నప్రభ, కరీంనగర్
సెల్.నం.9963499137

ఒరిపిడి
యవ్వన దశ కూడా
భగ్గున మండే...
అగ్గిపుల్లే కదా!
మనిషిని తూచే రూపాయి బిళ్ల
మనసును దోచే పిల్లా
రెండూ ప్రమాదకరమే సుమా!
ఇప్పటికైనా..
నేటి యువత అప్రమత్తంగా లేకపోతే..
ఇందులో పడి..
మిడతల్లా కాలి విలవిలలాడక తప్పదుమరి!
ఒరిపిడి తగలకుండా
రక్షణనిచ్చే..
రాయబారి కావాలి!

- గంప ఉమాపతి, కరీంనగర్
సెల్.నం.9849467551

ముసుర్లు!
చిన్న చిన్నగా..
రాలుతున్న వాన చినుకుల్లా
ముసురుతున్న ఆలోచనలు!
చినుకును పట్టి పట్టి చూసే లోపల
నేల రాలి ఇంకిపోయే మట్టిలోపల!
చినుకు చినుకులో ఓ తళుకు!
అగుపించకుండా పోయేదాని
ఆచూకి దొరకడం కష్టం!
ఒక్కో ఆలోచనను విడమరిస్తే
ఓ కవితా కన్యకు జన్మ!
కానీ? సాధ్యమా..
పుట్టకముందే పుటుక్కుమనేవి ఎన్నో!
రూపు దాల్చకముందే..
గాలిలో కలిసేది మరెన్నో!
స్థిమితంగా కొన్నింటినైనా ఒడిసిపట్టి..
బారసాల జోలపాడినవే
కనువిందుజేసే నేటి కవితలు!
కంటి కాటుక అందం
కనురెప్పలకు తెలియని చందం!
అందం పుట్టిందెక్కడైనా
కరిగి పరవశించేది మెట్టినింట్లోనే!
ఆలోచనల మెరుపుల అవతారిణి
ఆత్మను స్పృశిస్తూ
అక్షర రూపిణిగా మారి తరించేది..
పాఠకుడి ఒడిలోనే!!

- ఆచార్య కడారు వీరారెడ్డి
కరీంనగర్
సెల్.నం.7893366363

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

ళ్ఘౄజ : email : merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

- పెనుగొండ సరసిజ