ఉత్తర తెలంగాణ

ప్రైవసీ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త సంవత్సరం.. కొత్త భార్య.. ఇక లోకం కనిపించటం లేదు కార్తీక్‌కు.
మంచి మర్యాద ఉచ్ఛనీచాలు తేడాలు కూడా మరిచిపోయాడు. పగలే వెనె్నల జగమే ఊయలలా సరససల్లాపాలలో తేలియాడసాగాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ బాగోనిది ఒక్కటే. ఎవరి పొడా గిట్టటం లేదు. అందులో కనిపెంచిన తల్లిదండ్రులు కూడా చేరిపోయారు.
ఇలాంటి వింతలు ఎన్ని జరుగుతున్నా ఎన్నో చూస్తున్నా వారికి తమ కొడుకు ప్రవర్తనను ఎంత సమర్థించుకుందామనుకుంటున్నా మింగుడు పడడం లేదు. వాస్తవాన్ని జీర్ణం చేసుకోవటం వారి వల్ల కావటం లేదు.
రెక్కలు రాగానే పక్షి పిల్లలు ఎగిరిపోతాయిగా. ఆ పక్షులు పట్టించుకోవటం లేదు. మనం మాత్రం మన పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారే అని బాధపడుతున్నాం ఎందుకు?
‘అనారోగ్యం, సంపాదించుకునే శక్తి లేక’ వెంటనే అంతరంగం తడుముకోకుండా సమాధానమిచ్చింది.
నిజమే భార్య మంచం ఎక్కింది. తన ఇన్నాళ్ల సంపాదన వాడికి చదువు చెప్పించటానికే సరిపోయింది. మిగిలినవి అప్పులు. అరవై ఏళ్ల వయసులో తను..తన ఆశక్తత మాత్రమే!
అలాంటి సమయంలో వాడు తమకి అండగా నిలబడాల్సింది పోయి ‘నాకు ప్రైవసీ కావాలి నాన్నా! మీరు ఎక్కడికి వెళతారో, ఎక్కడ ఉంటారో నాకు తెలియదు. నా దగ్గర మాత్రం ఊడటానికి వీల్లేదు’ అని రాఖండీగా చెబుతున్న కొడుకును అలా చూస్తుండి పోయారు. ఆ తల్లిదండ్రులు, ఇన్నాళ్లు తమని పరాయి వాళ్లలా మాత్రమే చూస్తున్నాడు అనుకున్నారు. ఇప్పుడైతే శత్రువులా ప్రవర్తిస్తున్నాడే అని మధన పడ్డారు. ఇప్పుడేం చెయ్యాలి? ఎలా ఈ సమస్యను అధిగమించాలి? ఆలోచనల్లో పడిపోయారు ఆ దంపతులు. ‘అమ్మా ఇదేనా రావటం? కార్తీక్ అమ్మావాళ్లు వచ్చారు’ లోపల ఉన్న భర్తకి వినిపించేలా చెప్పింది పౌర్ణమి.
‘అత్తయ్యా! మామయ్య! కులాసానా?’ అడిగాడు ఎంతో ఆప్యాయంగా. ‘అంతా బాగానే ఉన్నాం బాబూ!’
‘ఏమిటి కబుర్లు మామయ్యా!’ అడిగింది మామగారినయినా వచ్చింది సమాధానం అత్తగారి నుంచి - ‘ఏముంది నాయనా? మా అబ్బాయికి మేము బరువయ్యామట. ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడు. అందుకే వచ్చేశాం. కూతురయినా కొడుకయినా ఇక నుంచీ పౌర్ణమే నాకు’.
కార్తీక్‌కి గొంతులో వెలక్కాయ పడినట్లయింది.
‘ఆడికి బుద్ధి లేదమ్మా! ఏమన్నా మనం విదేశాలలో ఉన్నామనుకుంటున్నాడా? వాడిని కూడా తీసుకురావాల్సింది. నాలుగు ఛడామడా పెట్టేదాన్ని.’
‘అవన్నీ ఏం వినే స్థితిలో వాడు లేడే. పెళ్లాం బెల్లం అయిపోయింది. మమ్మల్ని శత్రువుల్లా చూస్తున్నాడంటే నమ్ము’.
‘అదేంటమ్మా! అలా ఎలా మారిపోయాడు? మొన్నటిదాకా మనమంటే ప్రాణం పెట్టేవాడు కదా!’
‘అదేనే చోద్యం. అంతా కోడలి మహత్యం’
‘మనవాడి బుద్ధి ఏమయింది?’
‘ఉన్నట్లుండి అలా ఎలా మారిపోయాడో అర్థం కావటం లేదే?’
‘కోర్టులో కేసు వేస్తే సరి’ తేల్చేసింది పూర్ణిమ.
అంతా వింటున్న కార్తీక్ మాత్రం అవాక్కయ్యాడు. తను అమ్మావాళ్లతో అలా మాట్లాడితే కిక్కురుమనని పౌర్ణమి తన దాకా వచ్చేటప్పటికి ఎన్ని అంటోంది. వౌనంగా బయటికి వెళ్లిపోయాడు.
అరగంటలో ఆటో ఇంటిముందు ఆగింది.
‘అమ్మా! నాన్నా! రండమ్మా! మీ గదిలో ఈ సామాను పెడుతున్నాను. కాళ్లు కడుక్కోండి. పౌర్ణమీ! టిఫిన్లు తీసుకురా. ఇక నుంచీ అమ్మానాన్న మనతోనే ఉంటారు’ అన్న కొడుకును ఆశ్చర్యంగా చూసారా తల్లిదండ్రులు- ఇంతలో ఇంత మార్పా అన్నట్లు.
మరి నిన్ననే అనుకున్నారు ‘మనమూ ప్రైవసీ గురించి ఆలోచిస్తే వీడు అసలు పుట్టేవాడా’ అని ఆ దంపతులు. నిజమే కదా!

అంతరంగం

సామాజిక రుగ్మతలకు
గ్రంథాలయమే పరిష్కారం

ఊరికో గ్రంథాలయం ఉంటే నేటి సామాజిక రుగ్మతలకు అది చక్కని పరిష్కారాన్ని చూపుతుందని ప్రముఖ కవి డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య అంటున్నారు. ఎనిమిది పదుల వయసులో.. కంటి చూపు మందగించి.. చేదోడు లేకుండా కాలు బయట పెట్టలేని స్థితిలో ఉన్నా.. పేదోళ్లకు అండగా ఉండాలన్న పెద్ద మనసుతో.. స్వయంగా గ్రంథాలయాన్ని స్థాపించి వెలుగుదారి చూపిస్తున్నారు. తన ఐదు సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయిన విఠలాచార్య గారు కటిక దారిద్య్రాన్ని అనుభవించి.. మొక్కవోని విశ్వాసంతో.. ఒక్కోమెట్టు ఎక్కుతూ పేదరికపు అవరోధాలను అధిగమించి.. అందరికీ ఆదర్శంగా నిలిచారు. నా అన్న వారు ఎవరూ లేని కాలంలో.. ఆదుకునే వారు కరువయిన నాడు.. తనకు చదువుకోవడానికి పుస్తకాలు లేక.. అవస్థలతో ఎన్నో రోజులు గడిపిన అనుభవం ఆయన అంతరంగాన్ని మీటుతుంటే.. ఇప్పుడున్న పేదలకు అటువంటి కష్టాలు రావద్దని.. కాంక్షించే అక్షర ప్రేమికుడు ఆయన! మన కాలపు వట్టికోటగా భాసిల్లుతున్న డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గారు తెలంగాణ సాహిత్య పరిమళం! నల్లగొండ జిల్లా రామన్నపేట తాలూకా నీర్నెంల గ్రామంలో జూలై తొమ్మిది 1938లో జన్మించిన ఆయన పసిప్రాయం వీడని అమ్మ ఒడిలో.. ఉగ్గుపాలకు కూడా నోచక.. నిత్యం నాన్న లేని లోటుతో.. దాయాది ప్రేమలో.. అమ్మకార్చే కన్నీటి కడలిలో పెరిగారు. కష్టాలకు బెదరక.. చిన్ననాటి నుండే రచనా వ్యాసాంగం వైపు దృష్టి సారించారు. ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే.. పుష్పవిలాపం చదివి. ‘గోవిలాపం’ రాశారు. ఆనాటి భువనగిరి కేంద్రంగా ఉన్న ఉద్దండ నేతల ప్రేరణతో ‘శిల్పాచార్యులు’ రాశారు. తొమ్మిదో తరగతి చదివే కలంలోనే.. ‘్ఛందస్సు’ను పదో తరగతి విద్యార్థులకు చెప్పి.. గురువుల మెప్పును పొందారు. బోధనా వృత్తిలో ప్రవేశించక ముందు ఒకటి రెండు విభాగాల్లో పనిచేసి.. అక్కడి అవినీతిమయమైన వాతావరణం నచ్చక.. వెనక్కు వచ్చేశారు. ఉపాధ్యాయ వృత్తి చేపట్టి.. ఆ తరువాత రామన్నపేట జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పదోన్నతి పొందారు. ఆ తరువాత నల్లగొండ బాలికల కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసే కాలంలో.. బాలికలందరితో వరకట్నం తీసుకునే వారిని పెళ్లి చేసుకోబోమని ప్రతిజ్ఞ చేయించిన ఘనత ఆయనకుంది. ‘తెలుగు నవలల్లో స్వాతంత్య్రోద్యమ చిత్రణం’పై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి పట్టా పొందారు. కవి భూషణ, సాహిత్య ప్రపూర్ణ వంటి బిరుదులు ఆయనను వరించాయి. ‘విఠలేశ్వర శతకం’, ‘స్వాతంత్య్రోద్యమం’, ‘దొందూ.. దొందే’, ‘శిల్పాచార్యులు’ ‘కాన్ఫిడెన్సియల్ రిపోర్ట్’ వంటి గ్రంథాలను వెలువరించారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆయన రచనలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఉద్యోగ జీవితంలో సంపాదించిన తన ఆరు ఎకరాల భూమిని పేదలకు పంచారు. అనేక సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక సంస్థలను స్థాపించి.. క్రియాశీలక పాత్రను పోషించారు. బాపుభారతి, మా తెలుగుతల్లి, వలి వెలుగు, మన పురోగమనం, చిరంజీవి, ప్రియంవద, ముచికుంద, లేఖిని వంటి పత్రికలను నడిపించి ఎందరినో సాహిత్యం వైపు మళ్లించారు. వివిధ ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల నుండి సన్మాన సత్కారాలను అందుకున్నారు. జీవిత సాఫల్య పురస్కారాలనందుకున్నారు. ఆయన భువనగిరి గుట్టంత సాహిత్య శిఖరం.. ఆరు దశాబ్దాలుగా అలుపెరుగని సాహితీ యానం చేస్తున్న అక్షర యోధుడు ఆయన! నిఖార్సైన సాహితీ వేత్త, నల్లగొండ కవితా తిలకం.. కవిత్వానే్న తన వ్యక్తిత్వాన్ని మలుచుకున్న విఠలాచార్య గారితో ‘మెరుపు’ ముచ్చటించింది. వారి అంతరంగం ఆయన మాటల్లోనే...

ఆ మీ దృష్టిలో కవిత్వం అంటే ఏమిటి?
నా దృష్టిలో సామాజిక మార్పుకు దోహదపడే రచనే అసలైన కవిత్వం. అదికూడా చక్కని పదబంధాలతో పాఠకులను అలరించాలి. ప్రతీకలు, వర్ణనలు వచన కవిత్వానికి ఆభరణాలు కావాలి.

ఆ మీ పద్య రచనా విధానంపై ఏయే ప్రాచీనార్వాచీన కవుల పద్య ప్రభావం ఉంది?
నా పద్య రచనపై తిక్కన, బమ్మెర పోతన, శ్రీనాథుడు, విశ్వనాథ సత్యనారాయణ, గుర్రం జాషువా, జంధ్యాల పాపయ్య శాస్ర్తీ, దాశరథి కృష్ణమాచార్య, ఉత్పల సత్యనారాయణాచార్య మొదలగు మహా కవుల ప్రభావం ఉంది.

ఆ మీ విఠలేశ్వర శతక రచనకు ప్రేరణ ఏమిటి?
నేను అనుభవించిన, అనుభవిస్తున్న శారీరక, మానసిక ఆర్థిక సామాజిక ఆందోళనలే నా శతక రచనకు ప్రేరణ!

ఆ విఠలేశ్వర శతక రచనకు ఎంతకాలం పట్టింది?
సుమారు ఒక సంవత్సరం.. ఆర్థిక పరిస్థితులు సహకరించక గ్రంథ రూపంలో రావడానికి చాలా కాలం పట్టింది.

ఆ గ్రంథాలయం స్థాపించాలన్న ఆలోచన ఎందుకొచ్చింది?
చిన్ననాడు హాస్టల్ ఉండి చదువుకునే రోజుల్లో పుస్తకాలు కొనే ఆర్థిక స్థోమత లేక.. తోటి విద్యార్థి మిత్రులు రాత్రివేళ నిద్రించే సమయాన వారి పుస్తకాలు తీసి చదువుకుని, వారు నిద్రమేల్కొనే లోపు తిరిగి వారి దగ్గర పెట్టే దుస్థితే నన్ను గ్రంథాలయ స్థాపనకు ప్రేరణనిచ్చిన సంఘటనలు! జీవితానికి వెలుగు దారి చూపేవి గ్రంథాలే కనుక నా తరువాతి తరం విద్యార్థులకు ఆ సమస్య ఎదురు కావద్దని 8వ తరగతి చదువుతున్న రోజుల్లోనే వెల్లంకిలో గ్రంథాలయాన్ని చిన్నగా ప్రారంభించాను. ఇప్పుడు స్వంత ఇంటినే గ్రంథాలయంగా మార్చి ప్రజలకు అంకితం చేశాను! సామాజిక రుగ్మతలకు చక్కని పరిష్కారాన్నిచ్చేవి గ్రంథాలయాలని గట్టిగా విశ్వసిస్తాను.

ఆ ఆధునిక కవులు, రచయితలకు మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమిటి?
గ్రంథాలు బాగా చదవాలి.. వివిధ రచనా పద్ధతులను ఒంటపట్టించుకోవాలి. ఆచరించేదే రాయాలి! రాసింది సామాన్యునికి సైతం అర్థమయ్యేలా ఉండాలి.

డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య

: కవి చిరునామా :
డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య
సాహితీ కుటీరం
వెల్లంకి గ్రామం, మండలం: రామన్నపేట
జిల్లా: నల్లగొండ
సెల్.నం.9949539765

ఇంటర్వ్యూ : - దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544

ఉన్నత చిత్రీకరణ... అనూహ్య

పేజీలు : 116, వెల : 70/-
ప్రతులకు:
వసంతరావు దేశ్‌పాండే
9-52, శ్రీనిలయం,
టీచర్స్ కాలనీ, రాజీవ్‌నగర్
ఆదిలాబాద్ జిల్లా - 504001
సెల్.నం.9440001166

దిలాబాద్ పట్టణానికి చెందిన నవలా రచయిత వసంతరావు దేశ్‌పాండే 1973లో సాహితీ రంగంలోకి అడుగిడి.. 1982లో ‘అడివంటుకుంది’ నవలతో అందరికీ చేరువైనారు. ఇంద్రవెల్లిలో ఏప్రిల్ 20, 1981న జరిగిన పాశవిక ఘటనకు కదిలిపోయి..‘అడివంటుకుంది’ నవలను జీవం పోశారు. 1988లో ‘అడవి’ పేరుతో ప్రచురణ రూపంలోకి వచ్చిన నవల ‘చతుర’ వారు నిర్వహించిన పోటీలో అత్యుత్తమ నవలగా నిలిచి ప్రథమ బహుమతి పొందిన విషయం పాఠకులకు తెలిసిందే. ‘అడవి’కి కొనసాగింపుగా ‘ఊరు’ 1995లో రాశారు. 1999లో ‘్ఫస్ట్ఫార్వర్డ్’గా స్వాతి వారపత్రికలో ధారావాహికంగా వెలువడిన వీరి నవలను ఇప్పుడు ‘అనూహ్య’ పేరుతో మనకు అందిస్తున్నారు. ‘అనూహ్య’ నవలలో నాటకీయమైన పరిణామాలకే పెద్దపీట వేశారు. ఫలితంగా జీవిత విస్తృతి కొరవడినప్పటికీ.. స్ర్తి సమస్యల పట్ల రచయిత దేశ్‌పాండే గారికున్న ఆర్తిని అభినందించకుండా ఉండలేము. స్ర్తిలలో స్వాభిమానాన్ని నింపేందుకు ఆయన ‘అనూహ్య’ పాత్రను చిత్రించిన తీరు ప్రశంసనీయం!
రచయిత స్ర్తిల పక్షం వహించి.. స్ర్తి,పురుష సంబంధాలకు మెరుగులద్దే ప్రయత్నం చేశారు. నవల ప్రారంభం బాగుంది. అనూహ్య పంపిన సెలవు చీటిలోని అంశం పాఠకుల్లో సైతం నవల చదవాలన్న ఆసక్తి కలుగుతుంది.
కళాశాలల్లో సహజంగా ఉపన్యాసకుల మనస్తత్వాలు ఎలా ఉంటాయో చక్కగా ఆవిష్కరించారు. స్నేహానికి, మానవత్వానికి ప్రతీకలుగా నిలిచే పాత్రలున్నాయి. ముఖ్యంగా సాత్యకి, శ్రీనివాసరావు, అంబాయమ్మ పాత్రలు ఉన్నతంగా చిత్రీకరించడంలో రచయిత సఫలీకృతులైనారు.
రాహుల్‌పై అనూహ్యకు అపారమైన నమ్మకం ఉండటం తప్పుపట్టలేము. కానీ మరీ అంత గుడ్డిగా రాహుల్‌ను నమ్మడం అనూహ్యకే చెల్లిందన్న అభిప్రాయం పాఠకుల్లో కలుగుతుంది. భౌతిక స్పర్శ లేకున్నా మానసిక బంధంతో ఎంతటి అలౌకిక ఆనందాన్ని పొందవచ్చో రాహుల్- అనూహ్య పాత్రల ద్వారా తెలుసుకోవచ్చు. విలాసాల్లో పుట్టి పెరిగిన రాహుల్ అనూహ్య ప్రేమను పొందడానికి రాహుల్ తన్ను తాను సంస్కరించుకోవడం బాగుంది. అనైతికమయమైన ఆయన జీవితం అనూహ్య రాకతో ఓ కొత్త మలుపుతిరిగినా.. అది మూన్నాళ్ల ముచ్చట అవ్వడం బాధనిపిస్తుంది. రాహుల్ పెళ్లి ప్రపోజల్ అనూహ్య ముందుంచినప్పుడు అనూహ్యంగా ఆమె ఇచ్చే సమాధానాల్లో అభ్యుదయ భావాలను చూడగలం.
‘పెళ్లి మూడుముళ్ల బంధం.. ఒక ముడి ఆడదాని శరీరానికి, మరో ముడి ఆడదాని మనసుకీ మూడో ముడి ఆడదాన్ని బానిస చేసుకోవడానికి చేసేవి. ఆ మూడు ముళ్లంటే నాకు అసహ్యం’ అని అనూహ్యతో పలికించడంలో రచయిత ఆంతర్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సమాజం మనం ఏర్పర్చుకున్నదే. ఈ కట్టుబాట్లన్నీ మనం రూపొందించుకున్నవే! ఈ పెళ్లి తంతు. ఇవన్నీ ఈనాడు అవసరం లేదని అనూహ్య అనడం ఆమె ఆధునిక భావాలకు అద్దం పట్టినా.. భద్రత, భరోసా, సమాజంలో వచ్చే అపనిందలను మోయడానికి నిజ జీవితంలో అది సాధ్యమా? అని ఒకింత సగటు మహిళల్లో ఓ సందేహం వచ్చే అవకాశం ఉంది.
పెళ్లి కాకుండానే తల్లివవుతుందన్న భావనలో ఉన్న కాలేజీ స్ట్ఫా, విద్యార్థులు, పోషకులు సమాజం పెట్టే అవమానాలను అనూహ్య తేలికగానే తీసుకోవడం గమనిస్తాం. రాహుల్ అనివార్య పరిస్థితుల్లో అనూహ్యను గురించిన బాధ్యతలను గుండెలోనే దాచుకుని ఆయన అమ్మకోసం మరో పెళ్లి చేసుకోవడం..వంటి అంశాలుకథ సీక్వెన్స్‌కు తోడ్పడేలా రచయిత చూపిన ప్రతిభ ప్రశంసనీయం! సాత్యకి సహాయంతో తిరిగి అనూహ్య అత్త మామలతో అనూహ్యకు జరిగిన అవమానాలకు కాలేజి వేదికపైనే సమాధానం చెప్పించడం లాంటి సంఘటనలు అనూహ్యకు ఊరట కలిగిస్తాయి..చివరికి అందరు కలిసి హాస్పిటల్‌లో ఉన్న రాహుల్‌వైపు అడుగులేయడం వల్ల నవల సుఖాంతమైంది. అయితే..నవల కథా గమనంలో రచయిత వేగం పాటించడం వల్ల..ఆయా ఘటనలకు నాటకీయ మలుపులు చేకూరడంతో.. వాస్తవికతకు కొంత దూరంగా వున్నట్లు పాఠకులు భావించే అవకాశముంది.
ఏది ఏమైనా..కాత్యాయనీ విద్మహే గారన్నట్లు పితృస్వామిక కుటుంబాధికార విధినిషేధాల మధ్య ఆధీన జీవితాలు స్ర్తిలవే కనుక బాధితులవైపు నుండి ఈ ప్రక్రియ ప్రారంభం కావడం సహజం. ఈ నేపథ్యంలో రచయిత దేశ్‌పాండే గారు బాధిత స్ర్తిల పక్షం వహించి స్ర్తి, పురుష సంబంధాల్లో రావలసిన మార్పును, ఉత్తమ సంస్కారాలను ఈ నవలలో నిక్షిప్త చేయడం అభినందనీయం.

- సాన్వి, కరీంనగర్
సెల్.నం.9440525544

మనోగీతికలు

గురువు
ఎటో తెలియని దారుల మధ్య గమ్యం
తెలియని తీరంలో చీకటి కమ్మిన
భవితలో నీకై తనలోని తనను
మినహాయించుకొని శూన్యంలోని వెనె్నల
వెలుగులను నీకు ప్రసాదించేది గురువు
నిరంతరం మారే జగతికి నిత్యమై.. సత్యమై..
నీలోనూ నీ చుట్టూ అద్వితీయమైన
ఆనందమైన జీవితాన్ని ప్రసాదించేది గురువు
ఇంకా పుష్పించని పూవు నీవు!
నిన్ను చూసి నవ్వేవాళ్ల మధ్య
నీకంటూ తోడుగా ఉండి..
నీ గమ్యాన్ని గుర్తుచేసేవాడు గురువు
అడుగులు దారితప్పితే
నీ తోడుగా ముందుకు నడిపించేది
నీ గురువే సుమా!
- టి.సుధాత్రి
నిజామాబాద్, సెల్. 8686961611

గమ్యం !

రంగంలో దిగే మన సైనిక దళం
సరిహద్దుల్లో ఓ నిఘానేత్రం!
సైనికుల సాహసం, త్యాగం
దేశానికో వరం!
దేశ ప్రజలకు
వారిపై అపార విశ్వాసం
అందుకే.. వారి ప్రాణం
ధ్యానం.. గమ్యం
దేశ రక్షణకే సమర్పితం!

- ఎం.డి.ఖాలిద్
కరీంనగర్, సెల్. 9618175421

మమతను..
జాతిలోన మతం
చిచ్చు పెడుతుంది
మతంలోన కులం
కుమ్ములాటలకు తెరలేపుతుంది!
మతాల మారణ హోమంలో
కులాల కుమ్ములాటలో
మానవత్వమే మంటకలుస్తుంది!
స్వార్థ మానవుడే దానవుడై
దౌర్జన్యాలు చేస్తున్నాడు
ధరిత్రిని దావానాలంగా
దహించి వేస్తున్నాడు!
భరత మాత బిడ్డలకు
తీరని కీడు చేస్తున్నాడు!
ఈశ్వర్ అల్లా యేసు
మళ్లీ రావాలి
మతమంటే మానవత్వమని
చాటి చెప్పాలి
కన్న తల్లి కడుపుకోత తీర్చాలి
అన్నదమ్ముల్లా అందరూ
కలసిమెలసి ఉండాలి!
మనిషి మనిషిగా
మమతను పంచాలి
ఇదే అన్ని మతాల
అభిమతమని చాటాలి!

- జాదవ్ పుండలీక్ రావు పాటిల్
భైంసా, ఆదిలాబాద్ జిల్లా, సెల్.నం.9441333315

ఓటమి గెలుపు కోసం!

గెలుపు ఓటమి
జీవనయానంలో
నాణేనికి రెండు వైపులు!
ఓడిన ప్రతిసారీ
తనను తాను తడుముకుంటూ
కలవరింతల్లోంచి
ఉల్కాపాతంలాంటి ఉలిక్కిపాటు!
తలాతోకల మధ్య
సతమతమవుతూ
హృదయాన్ని
ఆరబోసుకోవటమే!
ఒక ఆత్మశోధన
శారీరక విశే్లషణ
మానసిక చిత్రాల
విచిత్ర ప్రదర్శన
విశే్లషణలు, సమీకరణాలు
ఎత్తులు పైఎత్తులు
పరమపద సోపానంలో
పాము మ్రింగుపాటు!
మింగటం
గొంతులో పచ్చివెలక్కాయవటం
సవరించుకోవటం
గాండ్రించడం!
సముద్ర గంభీరతను
అలల విద్యుత్తును
ఆవాహనం చేసుకొనే
వశీకరణ మంత్రానే్వషణ!
ఓ ఉరుమును పుక్కిట ధరించి
మెరుపు కళ్లల్లోకి నింపి
పిడుగును ప్రసవించటం!
గాలినంతటిని ఎముకల్లోకి నింపుకొని
వాతులాస్తులతో ప్రపంచమంతటా
విస్తరించటమే!
ఓడటం
దెబ్బతిన్న సైనికునిలా అదనుకోసం
నిరీక్షించటం!
ఎదురు తిరిగి నిప్పులు చెరిగి
అగ్నిని రాజేయటం గెలుపు!
గెలుపు విశ్రాంతి కాదు
విరామమెరుగక పరిశ్రమించే
ప్రయాణం!

- కె.ఎస్.అనంతాచార్య,
కరీంనగర్, సెల్. 9441195765

అంతరంగం

సెలవు కృష్ణవేణమ్మా!

చల్లని వెనె్నల కాంతిలో
సుఖ ప్రయాణం
కృష్ణవేణమ్మ ప్రవాహపు
హోరుల సవ్వడిలో
పుష్కర యానం
అదే మా బస్సు ప్రయాణం!
బీచుపల్లిలో నీ పలకరింపు
మా మదికి కలిగెను మోదం,
ఎందాకా నీ పయనం
తెలియని దేమున్నది నీ గమనం
కడలి దాకేగా నీ పయనం
అదే నీ గమ్యం!
పుష్కరాని కోమారు
పులకించును మా ఒడలు
ధన్యజీవులమైతిమి మేము
పోయి రావమ్మా కృష్ణమ్మా!
పోయిరా తల్లీ
ముదమారమదిని
పులకింపజేయగ
తిరిగిరా తల్లీ!
మరో పుష్కరానికి
సెలవు కృష్ణవేణమ్మా!
సెలవు! సెలవు నీకు!!

- యెనిశెట్టి గంగాప్రసాద్, కామారెడ్డి, సెల్. 9866447234

వౌనం!
వౌనం.. ఓ అలౌకిక ఆనందం!
వౌనం ఓ నిశ్శబ్ద గానం!
శిలాక్షరాలలో నిక్షిప్తం కాని భాష వౌనం!
గుండె చప్పుళ్లను..
కడుపులో దాచుకుంటుంది వౌనం!
పెదవులు విప్పి చెప్పలేని..
ఓ మూగ భాష వౌనం!
అంతర్మథన వేదనకు ప్రతిరూపం!
అంతరాల మోదానికీ ప్రతిబింబం!
ప్రేమకై..
మదిలో సవ్వడి చేసే
అందెల రవళి!
ఊహల కందని జావళి!

- పోపూరి మాధవీలత
హైదరాబాద్
సెల్.నం.8125115667

email : merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

- యలమర్తి అనూరాధ