విజయవాడ

అమ్మాయిలూ.. జాగ్రత్త! (చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నాగరాజుకి బ్రేకప్ చెప్పేశావట నిజమేనా’? అడిగింది అమృత.
‘అవును! చిన్నతనంలోనే తండ్రి పోయాడని, తల్లి ఒంటరిగా పల్లెలో వుంటోందని, మన పెళ్లాయాకా ఆవిడని తీసుకొస్తానని అన్నాడు. నేను ఒప్పుకున్నాను. మా అమ్మ పోయి రెండేళ్లు అయింది. మా వదిన నాన్న గారిని నానా మాటలు అంటోందట. అందుకని నేను మా నాన్న గారిని కూడా మన దగ్గరకి తీసుకొస్తానన్నారు. దానికతను ఒప్పుకోలేదు. ఇద్దరం సమానంగా సంపాదిస్తున్నాం. అపార్ట్‌మెంట్ నాన్నగారిచ్చిన డబ్బుతోనే కొన్నాను. అందులో వాళ్లమ్మగారు ఉంటారట. మా నాన్నగారు మా దగ్గర వద్దన్నాడు. ఇంత సంకుచిత స్వభావం వున్న వాడిని జీవితాంతం భరించడం నానల్ల కాదు. అందుకే బ్రేకప్ చెప్పేశాను’ అన్నది సుకన్య.
‘మంచిపని చేశావు. వాడి గురించి వివరాలు సేకరించాను. ఇంతకు ముందు ఇద్దరమ్మాయిలని నీలాగే మోసగించాడట’ చెప్పింది అమృత. ‘ఒకమ్మాయితో తల్లి చనిపోయిందని చెప్పి తండ్రిని ఇంటికి తెచ్చాడట. అసలు వాడు తండ్రేకాడట. ఒక సీనియర్ సిజిజన్‌ట. ఇరవై వేలు పెన్షన్ తెచ్చుకునే వాడిని తండ్రిగా పరిచయం చేసి భారతి చేత అతనికి ఎంతో సేవ చేయించాడట. ఆయన దగ్గర నెలకి పదిహేను వేలు తీసుకునేవాడట. కొన్నాళ్ల తరువాత ఆయనతో గొడవపడితే పెద్దరికంతో తండ్రిని ప్రేమగా చూసుకోవాలని చెప్పేదట వీడితో. ‘నేను చూసుకుంటాను సరే! నువ్వు కూడా అంత ప్రేమగా చూసుకోనవసరం లేదు. ఆయన నడవగలడు. అయినా నిన్ను పట్టుకుని నడవడం నాకు నచ్చలేదు. ఆ వెధవ దొంగవేషాలు వేసి నిన్నలా టచ్ చేస్తుంటే నాకు ఒంటికి కారం రాసుకున్నట్లు వుంటోంది’ అన్నాడట. కోపంతో ఒళ్లు మరచిపోయి తండ్రిని అలా తిట్టేసరికి భారతి ఆశ్చర్యపోయిందట. ‘మామ గారంటే తండ్రితో సమానమని, ఆయన్ని నా తండ్రిగా భావిస్తున్నాన’ని అందిట. ‘అసలు వాడు నాకు తండ్రే కాదు. నెలకి పదహేను వేలు ఇచ్చే పేయింగ్ గెస్ట్’ అని చెప్పేసరికి తెల్లబోయిందిట. ఇంతలో ఆయన వచ్చి ‘ఆ వెధవ మాటలు నమ్మకు. నీకు నెలకి ఇరవై వేలు ఇస్తాను. వాడిని వెళ్లగొట్టు, మనిద్దరం ఉందాం’ అన్నాడట. దాంతో భారతికి మతిపోయిందిట. పెళ్లిని వాయిదా వేస్తుండటానికి కారణం అర్థమై వాడిని చీదరించుకుని వెళ్లిపోయిందిట. తరువాత నువ్వు దొరికేవు. ఇంటి అద్దె లేకుండా ఇంట్లో పైసా ఖర్చు పెట్టకుండా సహజీవనం అంటూ ఇలా వాడు నటిస్తున్నాడు. పోలీసులకి చెపుదామా?’ అంది అమృత.
‘వద్దు! వాళ్లు మనల్నీ, వాడిని కూడా నాకేస్తారు. ఇక ఏ పిల్ల వెంట వాడు పడ్డా వీడి చరిత్ర మొత్తం దానికి చెపుదాం. వెధవ ఉద్యోగం వదిలి పారిపోయేట్టు చేద్దాం అంది’ సుకన్య. సో! అమ్మాయిలూ.. జాగ్రత్త మరి!

- గంగాధరుని నాగమల్లిక,
టీచర్, ఎస్‌ఎస్‌పి స్కూల్, గుంటూరు.

పుస్తక పరిచయం

విశ్వహితునికి తెలుగు కవుల నివాళి.. ‘ఒక విజేత’
పుస్తకం : ఒక విజేత
సంపాదకులు : మడిభూషి
సంపత్‌కుమార్
తెలుగు శాఖాధిపతి
మద్రాస్ విశ్వవిద్యాలయం, చెన్నై.
వెల : రూ.250/-
పేజీలు : 256
ప్రతులకు : పాలపిట్ట బుక్స్,
16-11-20/6/1/1, 403,
విజయసాయి రెసిడెన్సీ
సలీంనగర్, మలక్‌పేట, హైదరాబాద్
ఫోన్: 040-27678430

ఒక మనిషి జీవించి ఉన్నా, లేకపోయినా అతని ఆలోచనలు, వ్యక్తిత్వం లక్ష్యంతో కూడిన అతని సిద్ధాంతం ఎన్ని తరాలైనా బతికే ఉంటుంది. ఆచరణాత్మకమైన ఆయన ఆలోచనలు ప్రజల గుండెల్లో ప్రజ్వరిల్లుతూనే ఉంటాయి. బుద్ధ భగవానుని కరుణ, క్రీస్తు ప్రభువు త్యాగం, వివేకానందుని దేశభక్తి త్రివేణీ సంగమంగా రూపుదాల్చిన వ్యక్తి, శాస్తవ్రేత్త, భరతమాత ముద్దుబిడ్డ దివంగత రాష్టప్రతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం. ఆయన మరణవార్త వినగానే దేశం మొత్తం శోకసంద్రంతో నిండిపోయింది. విద్యార్థిలోకం నిశే్చష్టమయ్యింది. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఆ సమ్మోహన నాయకత్వం గాంధీ మహాత్ముడు, స్వామి వివేకానందుని తరువాత అబ్దుల్ కలాందేనని చెప్పాలి. బాల్యం నుండి వారి బాటల్లో నడిచిన వ్యక్తి కావడం వల్లనే ఇంతటి ప్రజాదరణను పొందగలిగారనడంలో అతిశయోక్తి లేదు. ఇంతటి మహోన్నత వ్యక్తికి మన తెలుగు కవనం అందించిన ఘనమైన అక్షర నివాళిని ‘ఒక విజేత’గా మన ముందుకు తెచ్చారు మద్రాస్ విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధిపతి మడిభూషి సంపత్‌కుమార్. జీవితమే ఒక సందేశంగా వెలిగిన మనీషి అబ్దుల్ కలాంకు కవుల సమూహం అందించిన నివాళి ఈ కవితా సంకలనం. ‘కొన్ని మరణాలు సామూహికమే/ సామూహిక మరణం అంటే/ అందరూ కలసి చావడం కాదు/ ఒక్క మరణాన్ని/ సమాజమంతా అనుభవించడం/ ఒక్క బ్రతుకును/ దేశమంతా కోల్పోవడం’ అంటారు తన ‘సామూహికం’ అనే కవితలో అద్దంకి తుషార. ‘మెట్టుమెట్టుపై అలవోకగా అడుగులేసిన అజాతశత్రువు’ అంటూ ‘జ్ఞానతపస్వి’ కవితలో అక్షరీకరించారు ప్రముఖ కవి, పాత్రికేయులు అనే్వషి. ‘పిల్లల్లో పిల్లవాడు/ పెద్దల్లో పెద్దమనిషి మా కలాం’ అంటూ కలాం వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు సిహెచ్ ఆంజనేయులు.
పేపర్‌బోయ్ స్థాయి నుండి భారత ప్రథమ పౌరుడి దాకా ఎదిగి ఒదిగిన మనిషి, ఒదిగినకొద్దీ ఎదిగిన మనీషి కలాం. అందుకే కలాంను ‘ఆదర్శ మనీషి’గా తీర్చిదిద్దారు తన కవితలో ఆరవల్లి జగన్నాథస్వామి. నిరంతరం పరిశోధన చేసి రక్షణ రంగానికి విశిష్ట సేవలు అందించిన క్షిపణి పితామహుడు మన కలాం. గొప్ప వ్యక్తుల జయంతులను, వర్ధంతులను జరిపి కాస్తంత గుర్తుచేసుకుని ఆరోజును గడిపేసే రోజుల్లో ఉన్నాం మనం. అందుకే ‘్భరతజాతి ఎన్నటికీ/ తీర్చలేని ఋణం నీది/ నీ ఆదర్శాలను ఆశయాలను/ కలలను ఆకాంక్షలను/ కొనసాగించాలనే ప్రతిజ్ఞే/ ఈ దేశం నీకు సమర్పించే/ నిజమైన నివాళి’ అంటూ యువతకు కలాం పట్ల ఉండవలసిన లక్ష్యాన్ని తెలియచెప్పారు తన కవిత ద్వారా డా. ఈటెల సమ్మన్న. ‘జనమనోహరుడు’ అంటూ ఏనుగు కిశోర్‌బాబు కీర్తిస్తే ‘జనహృదయ నేత’ అంటూ కీర్తిస్తారు కనమాల రాఘవులు. అబ్దుల్ కలాం బాల్యం నుండి మరణం దాక మూడు సీస పద్యాలు, మూడు తేటగీతి పద్యాలతో ‘విశాల హృదయ’ అంటూ వివరించారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికార మాసపత్రిక సప్తగిరి ఉప సంపాదకులు డాక్టర్ కంపెల్లె రవిచంద్రన్. ‘కష్టానే్న కష్టపెట్టి భ్రష్టుపెట్టించి/ ఇష్టాన్ని సాధించుకున్న/ కష్టజీవి..కలాం’ అని అంటారు కాల్వ వేణుగోపాల్ తన ‘మార్గదర్శి’ కవితలో. శివుని మూడవ నేత్రంతో పోలుస్తారు కాలె శ్రీనివాస్. ‘మళ్లీ వస్తావ్‌గా’ అంటూ ఆర్తిగా అడుగుతున్నారు కోడూరు సుమన. ‘మళ్లీ నా దేశంలో పుట్టవా ప్లీజ్’.. అంటూ ‘నువ్వెప్పుడూ మా ఆలోచనల్లోనే ఉంటావు’ అంటారు మహెజబీన్ బేగ్. ‘సాదాసీదా ప్రయాణం మొదలుపెట్టి/ అసాధ్యాలను సాధించి/ సామాన్య మానవుల మనసుల్లో/ తేనెగూడు కట్టినవాడా/ యువత కలల్లో సోనెలు నింపినవాడా.. నీకు సలాం’ అంటూ ‘అఖండ జ్యోతి’ని అక్షరీకరించారు ఈ సంకలనకర్త సంపత్‌కుమార్. ‘నిరంతర తపస్వి’ అని లెనిన్ శ్రీనివాస్ అంటే ‘అతనొక కర్మయోగి/ అతనొక మార్గదర్శి’ అని కలాం కీర్తికి సలాం చేస్తారు పొత్తూరి సుబ్బారావు.
ఉష్టప్రక్షులై రాష్టప్రతులంతా/ హస్తిన బస్తీకో/ వేసవి విడుదలకో/ వాచవి విందులకో/ పరిమితమయితే/ విద్యాకుటీరాల వైపు పరువెత్తిన/ భవిష్యద్దార్శనికునివి నీవు.. అభంగ తరంగ ఉత్తుంగ గంగలై/ ప్రవహించిన జాతి గీతానివి నీవు.. అంటూ వౌనభాష్పాలతో అంజలి ఘటిస్తారు ద్రవిడ విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధిపతి ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు.
భావరాజు పద్మిని అన్నట్లు అందనంత ఎత్తుకు ఎదగాలంటే పేదరికానికి ఎదురొడ్డి పోరాడాలి. ఉక్కులాంటి సంకల్పబలం కావాలి. మరెన్నో సుగుణాలు పుష్కలంగా ఉన్న వ్యక్తి కలాం కాబట్టి అందరి హృదయాల్లో నిలిచిపోయాడు. దేశం నలుమూలల నుండి వర్తమాన, వర్ధమాన కవులతో పాటు లబ్దప్రతిష్టులైన కవులు ఘనమైన నివాళులర్పించారు. 256 కవితలతో అద్భుతంగా మలిచిన కలాం స్మృతి కవిత్వం ‘ఒక విజేత’.

ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపిన మిస్సైల్ మాస్టర్ అబ్దుల్ కలాంపై కవితా సంకలనం తెచ్చిన సంపాదకులు సంపత్‌కుమార్ గారికి, పాలపిట్ట బుక్స్ వారికి అభినందనలు.

- సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు,
అశ్వారావుపేట. ఖమ్మం జిల్లా.
చరవాణి : 9491357842

నివాళి

ప్రజాకవి అద్దేపల్లి!

అద్దేపల్లి నిరంతర సంచార ప్రజాకవి. గొప్ప స్నేహశీలి. నిగర్వి. భేషజాలు లేవు. చిన్నా పెద్ద తేడాలేకుండా సాగిపోయారు. ఆదిలాబాద్ నుండి బరంపూర్, ఢిల్లీ, ముంబై.. ఎక్కడికైనా సొంత ఖర్చులతోనైనా సరే మాటిచ్చాడంటే వెళ్లడమే తరువాయి. అలసట ఎరుగకుండా, విరామం లేకుండా పుస్తకావిష్కరణలు, సభలు, సదస్సులు, సమావేశాలు.. ఎక్కడ చూసినా డా.అద్దేపల్లి వారే.
అద్దేపల్లి కవిత్వాన్ని గురించి మాట్లాడుకోవలసి వస్తే వారి ప్రగతిశీలత, పరిణామక్రమం అప్రతిహతం. ఆయన వచన కవిత్వం మొదటిసారిగా 1970లో అంతర్జ్వాలతో అక్షర రూపం దాల్చింది. ‘ఇది అంతర్ జ్వాల/ మనిషనే అగ్గిపుల్లని/ ఏ రోడ్డు మీద గీసినా భగ్గున మండే/ సమాజ బాధామయ వాతావరణం/ గుండెల్లో రాజుకుంటున్న మహాజ్వాల/.. అంటూ అగ్గిపుల్ల లాంటి గుణం కలిగి కవుల గుండెల్లోనే రాజుకుంటూ సాగిపోయేవి ఆయన భావాలు. ‘పెద్దపెద్ద ఇనపెట్టెల్లో కన్నీళ్లూ/ చిన్నకార్ల టైర్ల అడుగున గుండెకాయలూ/ ఎయిర్ కండిషన్, మేడల పునాదుల్లో స్వేద ప్రవాహాలు/ బంగారు గుమ్మాల మీద కుంకుంబొట్లలో/ నెత్తురు జీరలూ/ ఇల్లూ - నెత్తురు ఉడికిపోయే మంటలు/ ఎట్లా ఆర్పాలి ఈ మండే భయంకరత్వాన్ని/ భయపెడుతై కలవరపరుసె్తై’.. అంటారు.
తొలినాళ్లలో విశ్వనాథ భల్లూకపు పట్టులోంచి తప్పించుకుని శ్రీశ్రీ ఉష్ణరక్త కాసారంలోకి దుమికించాడు తన కవితను. చిక్కని కవిత్వానుభూతే ఆయనను కవిగా మలచింది. మహాప్రస్థానానికి తొలి విమర్శకుడిగా ఎందరో ప్రముఖులతో పాటు మహాకవినే మెప్పించాడాయన. తొలినాటి మధుజ్వాలలోని పద్యాల్లో వేదాంతం వుంది. అది క్రమంగా అభ్యుదయవేశాన్ని ఆవరించింది. క్రమక్రమంగా అద్దేపల్లి జీవితంలోని సంఘటనలు, కష్టాలు, కన్నీళ్లు అంతర్జ్వాల నుంచి ప్రగతిశీలిగా, హేతువాదిగా సిద్ధాంతరీత్యా మలిచాయి. అయినా ‘్ధర్యంగానే’లో సామ్రాజ్యవాద వ్యతిరేకత, ‘రక్తసంధ్య’లో విప్లవ భావాలు, పోరాటాశయాలు పెల్లుబికినై. ‘అక్కడి పసిపిల్లలు తుపాకీ గొట్టంలో/ పలక మీద అ,ఆలు రాస్తున్నారు/ తల్లులు ఎడమ చేత గన్నుతో కుడిచేత గంటెతో/ పిల్లలకు ఆహారం అందిస్తున్నారు’.. అంటూ వియత్నాం పోరాటాన్ని ఆవిష్కరించారు రక్తసంధ్య కవితా సంపుటిలో. సమాజ దారుణ దోపిడీని ఎండగట్టారు. ముఖ్యంగా మేధావుల బాధ్యతారాహిత్యాన్ని, ప్రజాసమస్యలను పట్టించుకోని నీరో చక్రవర్తుల అకృత్యాలను ఎండగట్టారు, ఖండించారు. వేమన చాటిన సమాజ దుర్నీతుల్ని, గురజాడ రచనల్ని సమాజ దర్పణంలో చూశారు. ఆయన కవిత్వం చాలాచోట్ల ధ్వని పూర్వక ప్రతీకాత్మకంగా చిత్రించిన తీరు కనిస్తుంది. 1980 తర్వాత వస్తు వైవిధ్యమూ, శిల్ప వైవిధ్యమూ, విస్తృత ఆలోచనలు కనిపిస్తాయి. ‘గోదావరి నా ప్రతిబింబం’లో ‘ఇప్పుడు జీవితాన్ని కూడా అర్థం చేసుకుంటున్నప్పుడు/ దోవ పొడుగునా పోరాటాల్ని మోసుకుపోతున్న పరమాణువుల ప్రవాహా’లంటారు. అద్దేపల్లి నిరంతర కవితా జ్వాలాముఖుడు. తొలినాళ్లలో కృష్ణశాస్ర్తీ ప్రభావం, విశ్వనాథపై అభిమానం. కవిగా ఏ సంఘాల్లోనూ సభ్యుడు కాదుగాని, అన్ని సాహిత్య ఉద్యమాలూ ఆయనను ప్రభావితం చేసినై. విప్లవ కవిత్వం గొప్ప ఉత్తేజానిచ్చింది. అగ్రరాజ్య దురంహంకారాన్ని నిర్ద్వంద్వంగా ఖండించారు. పురిపండా, బోయి భీమన్న, చిన్నప్ప భారతి, ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాల్ని అందుకున్నారు. కష్టజీవిని కాపాడే రోజుల కోసం తాపత్రయపడ్డారు. స్ర్తి, దళితవాద ఉద్యమాలకు ఎప్పుడూ అండగానే నిలిచారు.
మినీ కవితలను ప్రోత్సహించి మినీ కవిత్వ లక్షణ, లక్ష్యాలను వివరించారు అద్దేపల్లి. కొల్లూరి చేత మినీ కవిత్వ విప్లవాల స్వరూపాల్ని రచింపచేశారని ‘పొట్టి కవుల పినతండ్రి’ అంటూ ప్రఖ్యాత సంపాదకులు, సాహితీవేత్త పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఆయనను పిలిచేవారు. తెలుగు రాష్ట్రాల నిండా వందలాది మంది యువకులను ప్రోత్సహించి కవిత్వంలో ఏ కొంచెం మెరుపు కనిపించినా వెన్నుతట్టేవాడు అద్దేపల్లి. కొందరు ‘ఈయన అందర్నీ కవుల్ని చేసేస్తున్నార’ని విసుగు చెంది విమర్శించినా ఒక ప్రోత్సాహకునిగా, శ్రేయోభిలాషిగా ఆయనొక పిల్లల కోడి! కవి నాయకుడిగా నిలిచినవాడు. కవుల కవిత్వానికి గీటురాయి. ముందు మాటలను నాలుగు సంపుటాలుగా తెచ్చాడు. సభల అనంతరం రాత్రంతా యువ, నవకవులతో ముచ్చట్లతో మునిగిపోయేవాడు. వాళ్ల సందేహాలకు సమాధానాలిస్తూ సంభాషణలతోనే పొద్దుపుచ్చేవాడు. గజల్స్ రచించి పాడిన అద్దేపల్లి వాటిని సీడీగానూ తెచ్చారు. వాటిలో మచ్చుకు ఒకటి రెండు ఖవ్వాలీలు వున్నాయి. ‘నే సలాము చేస్తా/ ఈ జనానికి/ పేదవారి కోసం పోరు చేసేవారికి’ అనేది బాగా పాపులర్ అయింది.
అద్దేపల్లి అనుభూతి, ఆవేశాల సంగమంగా సాగిపోయిన కవి. ఆయన కవిత్వం పరారుూకరణకు వ్యతిరేకంగా పాశ్చాత్య, పడమటి సాంస్కృతిక వారసత్వాలకు వ్యతిరేకంగా పుట్టిన విల్లు. కవిత్వంతో నిర్మించిన మానవ సంబంధాల పరిరక్షణకు పాటుపడ్డాడాయన. ‘బ్రతుకున కంటే సత్యమగు వస్తువు లోకమునందు లేదు’ అని అంటారు. ‘ఆకుపచ్చని సజీవ సముద్రం’ ఆయన కవిత్వం. ‘్థంక్ గ్లోబల్లీ.. యాక్ట్ లోకల్’ అని హితవు పలికారు. ఆయన విమర్శకులుగా తీర్చిదిద్దిన వారిలో టిఎల్ కాంతారావు, రాధేయ, కొండ్రెడ్డి, జి సుబ్బారావు, లంకా వెంకటేశ్వరరావును ఎంతగానో ప్రోత్సహించారు. లంకా ఎం.్ఫల్ ‘పదచిత్రాలు - ప్రతీకల’పై గొప్ప చర్చ చేసి ముందుకు నడిపించి ప్రోత్సహించారు. ఎమర్జెన్సీలో ఇందిరా గాంధీపై వ్యంగ్యంగా ‘ఏం చెయ్యాలేం చెయ్యాలి/ జనులారా మీరు/ ఇందిరమ్మకు భజన చెయ్యాలి’ గీతం దీనికి సాక్ష్యం. ప్రపంచీకరణపై ఆయన ఎక్కుపెట్టిన బాణం ‘పొగచూరిన ఆకాశం’ కవితా సంపుటి. ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వంలో శిఖరాగ్రాన నిలిచిన ఒక నామక కవిగా ఈయన్ని నిలిపింది. ‘జాతుల స్వాతంత్య్రంపై ఒకడి పెత్తనమేమిట’ని ప్రశ్నించాడాయన. ‘బహుళ జాతుల కరచాలనాల్లో నా జాతి చెయ్యి జారిపోతుం’దంటారు. మనదేశం తూర్పు నుంచి తన సూర్యుణ్ణి దోసిట్లో పట్టుకెళ్లి పడమట దోసిట్లోకి జారవిడిచింది. యాడ్ మ్యాడ్ వరల్డ్ డాన్సింగ్ బాడీ’ గ్లోబల్ మార్కెట్‌లో నడివీధిలో స్ర్తిత్వం తలవంచుకుంటుంది. ఆయనవి మరణం లేని అక్షరాలు. ఆయన కుందుర్తి, తిలక్, జాషువా తత్వాలపై విమర్శనా వ్యాసాలందించారు. చివరగా ఎందరికో ఆత్మీయుడిగా ఖమ్మం జిల్లాలో ప్రజా కవులు, రచయితలతో అనుబంధం కలిగినవారు. సాహితీ స్రవంతి సభలకు రెక్కలు కట్టుకుని వాలేవారు. ఇక్కడి కథలకు పీఠికలు రాయటానికి తపనపడేవారు. తనే అన్నట్లు ఖమ్మం ఆయన స్వస్థానం. ఆయన అక్షరాలకు అన్నీ తెలుసు. తడబడకుండా అదుపులో ఉంటాయంటారు. సామాజికవేత్తగా, ముఖ్యంగా ఆధునిక తెలుగు కవిత్వంలో ఆయన పాత్ర చిరస్మరణీయమైనది. ఆయన ముద్ర బలమైనది.

- సిహెచ్ ఆంజనేయులు, ఖమ్మం. చరవాణి : 7702532453

మనోగీతికలు

సాహిత్య
సమ్మోహనుడు
కృష్ణాతీరంలో పుట్టి
సాహిత్య గోదావరిగ
ప్రవహించినవాడు
గళ్లచొక్కా, జీన్స్ ప్యాంటేసిన
చిరునవ్వుల మెరుపు పువ్వు
వచన కవిత్వానికి మినీ కవిత్వపు
మెరుపద్దిన నిత్యయవ్వనుడు
తెలుగు క్లాసుకు గ్లామరు తెచ్చిన
కొత్త తరం మాస్టారు
మహాప్రస్థానానికి
మొదటి విమర్శకుడు
ప్రపంచీకరణతో
‘ఆకాశం పొగచూరిన’ సంగతి
ఎలుగెత్తి చాటినవాడు
పెన్నుపట్టిన యువ కవుల్ని
వెన్నుతట్టిన స్నేహశీలి
కవిత్వాన్ని
భుజాన వేసుకు తిరిగిన
నిత్య సంచారి
భోజనాన్ని కూడా కవిత్వమంతగా
ఆస్వాదించే ప్రభావశీలి
అవనిగడ్డలో
చేతికంటిన నేతి వాసన
ఇంకా పోలేదన్న చమత్కారి
పాలల్లో నానేసిన
కొత్తటుకులంత మృదుభాషి
అరేబియన్
ఖర్జూరమంత మధురంగా
గజల్స్ పాడిన గాయకుడు
బందరులో
‘ఆంధ్ర సారస్వత సమితి’కి
బీజావపనం చేసి,
బెజవాడ ‘సాంస్కృతీ సమాఖ్య’ను
శాఖోపశాఖలుగ విస్తరింపజేసిన
సాహిత్య కృషీవలుడు
నా నేల
‘ఆకుపచ్చని సముద్ర’మంటూ
కవిత్వాన్ని సజీవం చేసుకున్న
జాతీయ కవి
ఆయన నిత్యయవ్వన రూపం చూసి
అమరులు ఆశ్చర్యపడే ఉంటారు!
ఇంద్రుని వద్ద
కొత్త గజల్ పాడటానికో
నవ సాహిత్యోపన్యాసానికో
ఆయన్ని పిలిచుంటారు!!

- సింహాద్రి పద్మ, అవనిగడ్డ. చరవాణి : 9290174624

మట్టిబతుకు..
నేను పుట్టింది ఈ మట్టిలోనే
పసితనం నుంచి ఇదే నా నేస్తం
నా జీవం ఈ మట్టితో పెనవేసుకుంది
ఈ మట్టి వాసనే నా ఊపిరి
ఈ మట్టి స్పర్శతో నా తనువు పులకరిస్తుంది
ఈ మట్టిలో ఎన్నిసార్లు సేదతీరానో
ప్రతిసారి కనులలో కమ్మని భావన కలిగేది
ఈ మట్టి తొలకరికి నీళ్లోసుకుంటుంది
శ్రీమంతపు చీర కట్టి పచ్చగా విచ్చుకుంటుంది
సంక్రాంతికి ధాన్యపుటేరులై ఈనుతుంది
ఈ మట్టే తరతరాలుగా మమ్మల్ని కాపాడుతోంది
ఈ మట్టే నా పిల్లల్ని, పశువుల్ని సాకుతోంది
ఈ మట్టిలో ఎన్నిసార్లు ఏరువాక సాగిందో
సాగిన ప్రతిసారీ నా కడుపు నిండింది
ఈ మట్టిలో ఎన్నిసార్లు యదపెట్టానో
పెట్టిన ప్రతిసారీ నా వ్యథ తీర్చింది
ఈ మట్టే నా ఒళ్లంతా పూసుకున్నాను
ఈ మట్టే నా ఇల్లంతా జల్లుకున్నాను
ఈ మట్టే నా గుండెంతా నింపుకున్నాను
మా ఇద్దరిదీ తల్లిబిడ్డల బంధం
నన్నుగన్న తల్లి పాలిచ్చి పెంచితే
ఈ పుడమి తల్లి పంటిచ్చి పెంచింది
అలాంటి నా తల్లిని నా నుండి
ఎవరూ దూరం చేయలేరు
మేం ఒకరికి ఒకరం అవిభాజ్యులం
ఈ కట్టె ఈ మట్టిలో కాలాల్సిందే
నా రక్తం మాంసం ఊపిరి
ఇందులో కలవాల్సిందే
నాదే కాదు నా తరతరాలది ఇదే మాట
జై నేలతల్లీ..
జైజై సిరుల కల్పవల్లీ..

- పెరుగుపల్లి బలరామ్,
చరవాణి : 9676636816

ఇగో..
అహం
అనే పదానికి
అతనే ఓ ప్రతిరూపం
పవిత్రమైన తన వృత్తిని
గ్రహించని
‘అంధ్ చిక్‌వా’ అతను!

పూర్వ విద్యార్థి
ప్రణామ
పర్యంతమైనపుడు
ప్రతినమస్కారం
ప్రకటించని కుసంస్కారి!

కూపస్థమండూకమే
అతనికాదర్శం!
వాస్తవంగా
ఆ విద్యార్థి జ్ఞానం ముందు
అతడో
అర్భకుడు!
కష్టనష్టాల
జీవితపు
మైలురాళ్లను దాటి
ఎన్నో విజ్ఞాన శిఖరాలు
అధిరోహించిన
కళాప్రపూర్ణుడా విద్యార్థి!

‘హృదయపూర్వక
కృతజ్ఞతలు సార్..
ఇనే్నళ్ల తర్వాత
మీ దర్శన భాగ్యంతో
నాజన్మ
సార్థకమైంది మాష్టారు!
మీరు దిద్దించిన
అక్షరాలతో
నేనింతటివాణ్ణైనాను
మీ కృషికి
నా మనో సుమాంజలులు’
అంటూ
పెద్దమనసుతో
నిష్క్రమించాడా విద్యార్థి!

- రాపోలు పరమేశ్వరరావు,
కొత్తరెడ్డిపాలెం, గుంటూరు జిల్లా.
చరవాణి : 9951416618

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

email: merupuvj@andhrabhoomi.net

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

- గంగాధరుని నాగమల్లిక