విజయవాడ

పిచ్చి కుదిరింది (చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటోదిగి సూట్‌కేసుతో వచ్చిన చెల్లెలు సుభద్రని ప్రశ్నార్థకంగా చూశాడు మురళి.
‘ఆయనతో నేనింక కలిసి బతకలేను. ఎన్ని పిచ్చివేషాలు వేసినా భరించాను. వంటావిడకి నేను సేవలు చేయాలిట. అది ప్రెగ్నెంట్‌ట’ నాన్‌స్టాప్‌గా చెపుతోంది సుభద్ర.
‘దానికి నువ్వు సేవలు చేయడం ఏమిటీ? వింతగా వుంది’ అన్నాడు మురళి.
‘నేను ఆయనకి సపర్యలు చేయలేక చక్కగా టివి సీరియల్స్ చూస్తూ.. ఆయన పనులకి, ఇంటిని చక్కదిద్దటానికి మణిని పనిలో పెట్టుకున్నాను. దాన్ని అన్నిటికీ వాడేసుకున్నారు. నాలుగేళ్లయినా నాకు పిల్లలు లేరు కనుక దానికి పుట్టేవాడే వంశోద్ధారకుడు కాబట్టి మణికి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోమని ఆర్డర్. అయ్యో! సముద్రపు అలలు - ఇసుక దిబ్బలు సీరియల్ వచ్చే టైమయింది. అది పెట్టన్నయ్యా!’ అంటూ సోఫాలో సెటిలయింది సుభద్ర.
ఆడపడచు మాటలేవీ రాధకి అర్థం కాలేదు. సుభద్ర సీరియల్‌లో మునిగిపోయాక రాధకి అన్నీ వివరించాడు మురళి.
‘వాడు ఇష్టపడ్డాడని దాన్ని వాడికిచ్చివేసి తప్పు చేశాను. సుభద్రకి నువ్వు పని నేర్పలేదు. కాలేజీకెళ్లిరావడం, టివి చూడటం. అక్కడ మీ అన్నయ్య కూడా దాని ప్రవర్తనకి బాధపడి నాతో చెప్పుకుని ఏడ్చాడు. నేను మణిని పంపాను. దాన్ని తోసుకుని వాడు బెడ్‌రూంలోకి పోతున్నా ఒక్కసారి వాళ్లవంక చూసి టివి చూడటంలో మునిగిపోయేదిట’ భర్త చెప్పేది ఆశ్చర్యంగా వింటోంది రాధ.
‘రేపోమాపో దాని భర్త వచ్చి తీసుకుపోతానని చేప్పేడుట. ‘అది మా ఆయనతో...’ అంటూ ఎంతగా చెప్పినా ‘నేను మాత్రం మడికట్టుకు కూర్చున్నానా? రెండేళ్లయింది దాన్ని విడిచి వెళ్లి. దాని శరీరం మైలపడినా మనసు నాదే అన్నాడుట. ఆకలేస్తే హోటల్లో తినమా టిఫిన్? అలా అని ఇంటి భోజనాన్ని వదలుకుంటామా? అన్నాడుట. దాన్నిబట్టి దాన్ని వాడు ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలిసిందట. రెండు నెలలకి 20వేలకి దానిని నాతో నటించడానికి ఒప్పించాను. అదింక వెళ్లిపోతుందట.
‘సుభద్రకి చివరి షాక్ ఇచ్చాను. దానికి బుద్ధి చెప్పి పంపమ’ని అదొచ్చే ముందు ఫోన్ చేశాడు మీ అన్నయ్య. ఇప్పుడు నాలుగు రోజులు నిన్ను మాటలతో, చేతలతో హింసిస్తాను. చక్కగా నటించాలి నువ్వు. నన్ను చూసి అది అసహ్యించుకుని నా భర్త దేవుడంటూ వాళ్లింటికి వెల్లిపోవాలి- తెలిసిందా’ అన్నాడు మురళి.
ఆడపడుచుని చక్కదిద్ది అన్న కాపురాన్ని బాగుచేయటానికి సిద్ధపడింది రాధ.
ఇక ప్రతిరోజూ ఏదోవంకన అన్నయ్య వదిన్ని అనే మాటలు, అప్పుడప్పుడు చెయ్యి చేసుకోవడం చూసిన సుభద్ర అన్నని చీదరించుకుంది. ‘నా భర్త దేవుడు. ఆయన ముఖంలో కోపం గానీ, చిరాకు గానీ ఎన్నడూ చూడలేదు. ఎప్పుడూ ఆయన పెదవులపై చిరునవ్వే. ఇలాంటివాడిని నువ్వెలా భరిస్తున్నావు వదినా? చూస్తుంటే నాకు చాలా బాధగా వుంది. నేనిక్కడ వుండలేను. సాయంత్రం మా ఆయన దగ్గరకి వెళ్లిపోతాను’ అంది సుభద్ర.
‘మరి మా అన్నయ్య ఆ మణితో’.. అడిగింది రాధ.
‘అదంతా అబద్ధం వదినా. మీ అన్నయ్య శ్రీరామచంద్రుడని నాకు తెలుసు. నాకు బుద్ధి చెప్పడానికే మణితో నాటకం మొదలెట్టారు. ఎప్పటికీ నన్ను వదలుకోరు. నీకిక్కడ వుండటం బాధగా వుంటే నా దగ్గరకి వచ్చేయ్ వదినా. మీ అన్నయ్య ఏమీ అనరు’ అంది జాలిగా చూస్తూ.
‘నాలుగు దెబ్బలు వేస్తే భర్తను వదిలివేస్తావా? అని మా వాళ్లు నన్ను మాటలతో చంపేస్తారు. అన్నయ్య అసలొప్పుకోడు. ముందు నువ్వు వెళ్లు. సహనంతో నా సంసారాన్ని నేనే సరిచేసుకుంటాను’ అంటున్న వదిన్ని ఆరాధనగా చూసింది సుభద్ర.
‘అన్నయ్య చాలా అదృష్టవంతుడు, మంచి భార్య దొరికింది. అన్నయ్యా! వదిన్ని బాధపెట్టకు. ఆమె కంటి నీరు ఇంటికి మంచిది కాదు’ అని అన్న వంక ఈసడింపుగా చూస్తూ ఆటో ఎక్కింది సుభద్ర.
ఆటో అటు వెళ్లగానే ఫోన్ చేశాడు బావమరిదికి ‘సుభద్ర దారిలోకి వచ్చింది. నీ దగ్గరకి బయలుదేరింది. జాగ్రత్తగా చూసుకో దాన్ని. నా ముఖం చూసి’.. చిన్నగా చెపుతున్న భర్తను చూసి
‘నేను చాలా అదృష్టవంతురాలిని’ అనుకుంది రాధ.

ఆదర్శం

స్నే‘హితులు’
మన హితం కోరేవారు స్నేహితులు. ఎలాంటి లాభం ఆశించకుండా మత, కుల, పేద, ధనిక భేదాలు లేకుండా పరస్పరం ఒకే రకమైన భావాలు కలిగిన వారు సహజంగా స్నేహితులుగా మెలుగుతారు. అలాంటి స్నేహ కేంద్రానికి పాఠశాలే ఒక నిదర్శనమని అనిపిస్తుంటుంది. ఆలోచనలు వేరైనా ఎల్లప్పుడూ మనతో ఉండి మన మంచికోరే వారే నిజమైన స్నేహితులు. నిజమైన స్నేహితులు మనం చేసిన మంచి, చెడ్డలను నిర్మొహమాటంగా చెబుతూ మిత్రునికి ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటూ, మిత్రుని ఆనందాన్ని తన ఆనందంగా, అతని బాధను తన బాధగా భావిస్తాడు. అంతేగాకుండా మన ప్రతి పనిలోనూ తోడుండి మంచివైపు మనల్ని నడిపించే వాడే నిజమైన స్నేహితుడు. స్నేహానికి వయస్సుతో పనిలేదు. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకూ విడదీయలేని స్నేహ బంధముంటుంది. మనతో కలిసి ఆడుతూ, పాడుతూ కలిసి తింటూ, ఆటపట్టిస్తూ ఆనందంగా కలిసి ఉండే వాళ్లు మన స్నేహితులు.
స్నేహం అన్ని బంధాలకన్నా గొప్పది. మంచి స్నేహానికి ఐదు లక్షణాలుండాలని నేను విశ్వసిస్తాను. అవి నమ్మకం, ప్రేమ, క్షమించే గుణం, సహాయం చేయడం, త్యాగ గుణం. స్నేహితులు ఒకరిపట్ల ఒకరు నమ్మకంగా ఉండటం, పరస్పరం ప్రేమగా మసలుకోవటం, ఒకరితప్పులను మరొకరు క్షమించే గుణం కలిగి వుండటం, ఆపదలు వచ్చినప్పుడు సహాయం చేసుకోవటం, స్నేహితుని కోసం ప్రత్యేక సందర్భాల్లో త్యాగం చేయటం వంటి లక్షణాలు పాటిస్తే ప్రతిఒక్కరి స్నేహం చిరకాలం మనగలుగుతుంది. అదే ఆదర్శంగా నిలుస్తుందని నా నమ్మకం. స్నేహం ముసుగులో నేటి సమాజంలో అనేక మోసాలు, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తటం చూస్తుంటే బాధగా ఉంటుంది. ప్రతిఒక్కరూ నిర్మలమైన మనస్సుతో ప్రతి ఒక్కరినీ స్నేహితులుగా భావించి నిజాయితీని ప్రాతిపదికగా చేసుకుంటే ఈలోకంలోని వాళ్లందరితో స్నేహం చేయవచ్చు. దుష్ట మనస్కులకు కాలమే సమాధానం చెపుతుందనేది వాస్తవం.

- కె శిరీష, 8వ తరగతి
ఆత్మకూరు,
గుంటూరు జిల్లా.

నేడు మల్లెతీగ పురస్కార ప్రదానం
మార్చి 27వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడ బందరురోడ్డు రాఘవయ్య పార్క్ ఎదురుగా ఎంబి భవన్‌లో మల్లెతీగ సాహిత్య పురస్కార ప్రదానోత్సవ సభ జరుగుతుందని మల్లెతీగ సాహిత్య సమాచార వేదిక అధ్యక్షులు కలిమిశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభకు పద్మశ్రీ డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు అధ్యక్షత వహిస్తారు. విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్ ముఖ్య అతిధిగా హాజరవుతున్న ఈ సభలో ప్రఖ్యాత మానసిక వైద్యులు డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య, ప్రపంచ పర్యావరణవేత్త ప్రొ. ఎన్‌ఎన్ మూర్తి, డా. రావి రంగారావు, విశ్వనాథం రవికుమార్, తదితరులు పాల్గొంటారు. జి.నరసింహస్వామి (నిజామాబాద్), డా. ఎంబిడి శ్యామల (తెనాలి), చిన్ని నారాయణరావు (నెల్లూరు), సరికొండ నరసింహరాజు (నాగార్జునసాగర్), సవ్యసాచి (హైదరాబాద్), సిరికి స్వామినాయుడు (పార్వతీపురం) ఈ సభలో అతిధుల చేతుల మీదుగా మల్లెతీగ పురస్కారం అందుకుంటారు.

ధర్మచింతన

శాస్ర్తియ ఆధ్యాత్మిక జ్ఞానం.. భౌద్ధం!

కొందరు కలిస్తే అది మతం. అందరూ కలిస్తే అది ధర్మం. లోకమంతటికీ మేలుచేసే ప్రయాణమే ధర్మం. ఈ ధర్మమనేది కేవలం మానవులకు మాత్రమే కాదు, సర్వలోకానికి వర్తిస్తుందని చెపుతుంది ‘బౌద్ధ ధర్మం’. కుల-మత-జాతి వివక్షలు లేని సమాజ నిర్మాణానికి బౌద్ధం దోహదపడుతుంది. చెప్పుకోటానికి తేలికగా ఉన్నప్పటికీ ఇంద్రియ నిగ్రహం, కోర్కెలను జయించటం వంటి అంశాలు మనిషి నుంచి అంత సులువుగా విడిపోయేవి కానప్పటికీ ‘విపశ్యనా ధ్యానం’ అనే సాధనతో వీటిని కూకటివేళ్లతో ఎలా పెకలించవచ్చో బుద్ధ భగవానుడు మానవాళికి ధ్యాన సాధన ద్వారా దిశానిర్దేశం చేశాడు. ‘అంగుళీమాల’ వంటి క్రూరుడు సైతం బౌద్ధ భిక్షువుగా మారి లోకహితానికి ఆదర్శంగా నిలవటంతో బౌద్ధం ఔన్నత్యం లోకానికి మరింతగా తెలిసివచ్చింది.
ప్రాచీన భారతంలో ప్రపంచ దేశాలన్నిటికీ మన దేశం ఆధ్యాత్మిక గురువుగా వెలుగొందింది. అమూల్యమైన ఈ వారసత్వ సంపదను కాపాడుకోవలసిన అవసరం, బాధ్యత అందరిపై ఉంది. దేవునితో నిమిత్తం లేకుండా బుద్ధుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని శాస్ర్తియంగా ఈ లోకానికి అందించాడు. ఇలాంటి రుజువు మరే మతంలోనూ కనుపించదు. ఇంతేకాక గృహస్తు ధర్మం విషయానికొస్తే అద్భుతమైన ఆచరణ మార్గాలను బౌద్ధం మనకు అందించింది.
బుద్ధుడు వెళుతున్న దారిలో ‘సిగాలుడు’ అనే వ్యక్తి దిక్కులకు నమస్కరిస్తూ ఉంటాడు. తథాగతుడు అతని వద్దకు వెళ్లి ‘నాయనా! నీవు ఎవరికి నమస్కరిస్తున్నావు? ఎందుకు నమస్కరిస్తున్నావు?’ అని అడగ్గా.. ‘నేను దిక్కులకు నమస్కరిస్తున్నాను. నా తండ్రి మరణించే ముందు నన్ను ప్రతిరోజూ దిక్కులకు నమస్కరించమని చెప్పాడు. ఇలా చేస్తే నాకు మంచి జరుగుతుందని చెప్పాడు’ అని సమాధానమిస్తాడు. దానికి గౌతముడు ‘నీ తండ్రి చెప్పింది నిజమే! నీకు ఆ దిక్కులు ఎవరో తెలుసా? తెలియకుండా ఇలా ఎలా ఆచరించగలవు?’ అంటూ..
తూర్పు- తల్లిదండ్రులు
పడమర- భార్య
ఉత్తరం- మిత్రులు, శ్రేయోభిలాషులు
దక్షిణం- గురువు
ఇవికాక మరో రెండు దిక్కులున్నాయి. కింది దిక్కు- దాస, సేవకులు, పైదిక్కు- శ్రమణులు, సాధువులు’ అని తెలియజేసి ‘వీరందరి పట్ల నీవు గౌరవభావంతో మెలగగలిగితే నీకు అంతా మంచే జరుగుతుంది. ఇదే నీ తండ్రి నీకు తెలియజేసింది’ అని వివరిస్తాడు. వైదిక మతం బుద్ధుడు కూడా దశావతారాల్లో ఒక అవతారమనే భావనను ప్రవేశపెట్టింది. ఇది వక్రీకరణ. భగవంతుడు అనేదానికి అతీతంగానే బౌద్ధం ఉంటుంది. బౌద్ధ ధర్మం వ్యాప్తికి పాటుపడిన అనగారిక ధమ్మపాల, యజ్ఞశ్రీ శాతకర్ణి, అశోక చక్రవర్తి, ఆనంద కౌసల్యాయన్, డా. బి.ఆర్. అంబేద్కర్ వంటివారు విశేనష కృషి చేశారు. అంబేద్కర్ బౌద్ధం స్వీకరించిన తరువాతనే మన దేశంలో బౌద్ధానికి ఆదరణ తిరిగి మొదలైంది. అటువంటి పునాదిని అంబేద్కర్ వేశారు. ధర్మానికి మూలాధారాలైన పంచశీల- జీవహింస చేయకపోవటం, దొంగతనము చేయకపోవటం, అసత్యం పలకకపోవటం, వ్యభిచరించకపోవటం, మత్తు పదార్థాలు తీసుకోకపోవటం ద్వారా జీవితం సరళం, సుఖమయం అవుతుంది. తరాలు మారినా, యుగాలు గడిచినా విశ్వకల్యాణాన్ని కోరుకునేది ఏదైతే ఉందో అదే అసలు సిసలు ధర్మం. బౌద్ధంలో ఈ అంశాలన్నీ ఇమిడి ఉన్నాయి.
ప్రాచీన భారతదేశంలో బౌద్ధం ఎంతో ఉజ్వలంగా ప్రకాశించింది. తరువాత కొన్ని సంస్కరణలతో బౌద్ధం పునాదులపై వైష్ణవ, శైవ మతాలు ప్రవేశించాయి. ఈ పరిణామాలకు చిహ్నాలుగా మన రాష్ట్రంలోనే అనేక బౌద్ధ కట్టడాలను, ఆరామాలను, బుద్ధుని అవశేషాలపై నిర్మించిన స్థూపాలను కనుగొన్నారు. హేతువాద దృక్పథానికి, శాస్ర్తియ విజ్ఞానానికి గీటురాయిగా నిలిచే బౌద్ధాన్ని అనుసరించవలసిన ఆవశ్యకత ఏర్పడింది.
వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభవౌతుందన్నట్లుగానే మొదలైంది ‘మంగళగిరి బుద్ధవిహార’ ప్రయాణం. సమాజ శ్రేయస్సుకు నైతిక విలువల ఆచరణ ఎంతో అవసరమని భావించి ఇందుకోసం వ్యూహాత్మకంగా ప్రయాణం మొదలుపెట్టింది. దేశ భవిష్యత్తుకు పునాదిరాళ్లైన విద్యార్థులకు చిత్రకళ, వ్యాసరచన వంటి పోటీలు, ఔత్సాహికులకు క్రీడల పోటీలు, కవులకు కవితల పోటీలు వంటివి నిర్వహిస్తూ బుద్ధుని బోధనలను సమాజానికి చేరువ చేయటంలో సఫలీకృతులయ్యారు నిర్వాహకులు. ఇవి కాక మహాత్ములు, సంఘ సంస్కర్తల జయంతి, వర్ధంతులను నిర్వహిస్తూ భావితరాల్లో స్ఫూర్తిని కలిగిస్తున్నారు. ప్రతి ఏటా ‘బుద్ధ పూర్ణిమ’ను పండుగ వాతావరణంతో నిర్వహిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా ఇంతింతై వటుడింతై.. అన్నట్లు వివిధ ప్రాంతాల్లోని బౌద్ధ సంఘాలను వెదికి, వారితో పరిచయాలు పెంచుకుని అందరినీ ఒకే తాటిమీదికి తేవాలనే తలంపుతో ‘సంఘమిత్ర’ అనే మాస పత్రికను ప్రారంభించారు. కాలగమనంలో ఆ పత్రిక ‘బుద్ధ్భుమి’గా రూపాంతరం చెంది ప్రతినెలా మనోరంజకంగా మన ముందుకు వస్తూనే ఉంది. నాడు కరపత్రం ముద్రించేందుకు ఆపసోపాలు పడిన ఈ సంస్థ నేడు ఒక మాసపత్రికగా మనకు అందిస్తోందంటే దీనివెనుక నిర్వాహకుల తపన, కృషి, సంకల్పం ఎంత బలీయంగా ఉన్నాయో అర్థమవుతుంది. బురదలో నుంచి పద్మం వికసించినట్లే ‘నాకేంటి?’ అనే సమాజం నుంచే ఈ ఆధ్యాత్మిక సంస్థ ఉద్భవించటం, సమాజ శ్రేయస్సుకు ముందుకు రావటంలో ఎంతో ఔచిత్యముంది. లెక్కలేనన్ని కార్యక్రమాలను నిర్వహించిన ఈ సంస్థ నిధులు సమకూర్చుకోవటం, విమర్శలను తట్టుకోవటం వంటి పెనుసవాళ్లనే ఎదుర్కొందనటంలో సందేహం లేదు. మనం మనుషులం. మంచితనంతో మెలగవలసిన వాళ్లం. సాటి మనిషికి సాయం చేస్తూ ప్రపంచాన్ని ప్రేమించవలసిన వాళ్లం.. అని ఎప్పుడూ భావించే ‘రేకా కృష్ణార్జునరావు’గారు మంగళగిరి బుద్ధ విహార ట్రస్ట్‌కు వ్యవస్థాపక అధ్యక్షులు. ఇలాంటి సంస్థలు సమాజ మనుగడకు చాలా అవసరం. శాస్ర్తియ విజ్ఞానం తన పరిధిని మరింత విస్తృతం చేసుకుని పరుగులు పెడుతున్న నేటిరోజుల్లో సమాజ మనుగడ, సాంఘిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సమాజ శ్రేయస్సుకు పాటుపడటమనేది ఆహ్వానించదగిన పరిణామం.
ఆశించి చేసేదానికి స్వార్థమనే హద్దుంటుంది. ఆశయం కోసం పనిచేసేదానికి ఆశయ సిద్ధే సంచలన లక్ష్యవౌతుంది. బౌద్ధ ధర్మం దశదిశలా వ్యాపించాలనే సంకల్పం సిద్ధించాలని కాంక్షిద్దాం! ‘బుద్ధం శరణం గచ్చామి.. ధర్మం శరణం గచ్ఛామి.. సంఘం శరణం గచ్ఛామి!

- గోలి మధు, మంగళగిరి
చరవాణి : 9989186883

మనోగీతికలు
ఉదయార్కుడా..!
అణచివేతలు
అనాదిగా సాగుతున్న క్రతువులే..
పోరాటం నుంచి
పుటం పెట్టుకుంటున్న బ్రతుకులే..

ఆత్మార్పణలు
ఇప్పుడు కొత్తేంకాదు
అవి స్వేచ్ఛాపోరులో
మా అంతిమ ఆయుధాలు

బలవన్మరణాలు
మాపై మేమే రాసుకుంటున్న
మరణ శాసనాలు

వివక్షా ఉక్కుపాదాలతో
ఈ గుండెలకవుతున్న గాయాల్ని
మా సున్నిత హృదయాలు
ఓర్చుకోలేక పోవచ్చు

సమస్యల పద్మవ్యూహాల్ని
ఛేదించలేక
ఈ తనువును తృణప్రాయంగా
వదిలుండవచ్చు
కానీ.. కానీ..
మా ఆశయ స్ఫూర్తిని రగిలిస్తూ
కాగడాలమై
మండుతూనే వుంటాం

అంబేద్కరుడా..
నీ ఆశయం ఇంకా
ఫలించటం లేదు
ఉదయార్కుడా
పడమర అస్తమిస్తున్నావంటే
తూర్పున ఉదయించటానికే కదా..!

- కటుకోఝ్వల రమేష్, ఇల్లెందు, ఖమ్మం జిల్లా.
చరవాణి : 9949083327

స్వగతం
నా ఇంటికి చెద పట్టింది
నీ వీధిలో మురుగునిండింది
నా కొడుకును ఎలుక కొరికింది
నా కూతుర్ని కుక్క కరిచింది
నా ఊరంతా చెత్త కంపు కొడుతోంది
పొరుగువారెవరైనా వస్తే బావుండు
నా ముఖంపై జిడ్డు తొలగించి
నా ఇంటిముందు గుంతలు పూడ్చి
నా వంటి బద్ధకాన్ని వదిలించి
బురదలో కూరుకుపోయిన నన్ను
బయటకు లాగి నిలబెడితే బావుండు
నా ఇంటి ఊడిన పెచ్చులు
నా పెరటి మొక్కల కుప్పలు
గొప్పింటోళ్ళు సరిచేస్తే బావుండు
ఎలా చూసినా వాళ్ళు అన్నీ తెలిసినోళ్ళు
ఆకాశ హర్మ్యాలు అందంగా కట్టి
నా స్థలంలో వారి వ్యాపారం ఫలించి
నా పళ్లెంలో
నాలుగు మెతుకులు విదిలించి
నా ప్రాణం నిలిపితే బావుండు
వంగి వంగి సలాములు కొట్టి
వారి ఋణం తీర్చుకుంటాను ఒట్టు
నన్ను నేను పెట్టుకున్నానంట తాకట్టు
గిట్టని వాళ్ళ మాటలు నాకు పట్టవు
ఎంత కాదనుకున్నా
నేనూ తెలివైన వాణ్ణే...

- షేక్ బషీరున్నీసా బేగం,
గుంటూరు.
చరవాణి : 9985193970

రెక్కలు
‘వేకువ’ కోడి కూయందే
భానోదయమవ్వదు
‘నిద్రనదిని’ దాటందే
‘మెలకువ’ తీరం చేరదు
చతుర్దశలు కడచిపోందే
బతుకు కడతేరదు..!
***
శ్రుతిమించిన రాగం
శ్రోతలకు విసుగు
వికటించిన నటనం
ప్రేక్షకులకు వెగటు
‘అతి’ ఏదైనా
అపహాస్యం పాలగు..!
***
ఏమో? కలిసున్నట్లే
మనమధ్యే మసలుతాడు
వల్లమాలిన ఆప్యాయతలు
ఒళ్లంతా ఒలకబోస్తాడు
కుమ్మరి పురుగులా
బతుకు తొలిచేస్తాడు..!
***
ఏ నదీ నదమైనా
కల్లోలినిని కలవాల్సిందే
దినకరుని ఏ మయూఖమైనా
ధరణి ఒడిని తాకాల్సిందే
అధముడైనా ఆధిక్యుడైనా
మృత్యుశకటం ఎక్కాల్సిందే..!

- డా. అవనిగడ్డ సూర్యప్రకాష్, విజయవాడ, 9908731648

వెనె్నల్లో కనె్నబాల
అదే పైరగాలి
ఆనాటిదే జాబిలి
ఏడే నామాఁవ లేడే అని
ఓ పల్లెటూరి పడుచుపిల్ల
అమాయకంగా
అడిగినట్లుంది వెనె్నల
ఈ నిశిరాత్రిలో నీ ఊహే
నా మనసును
నీదరికి లాగుతోంది
కొబ్బరాకు సందుల్లోంచి
తొంగిచూసి
ఫక్కున నవ్వాడు రేరాజు
హుఁ ఆయనకేం తెలుసు
నా మనసు సెగ
నీ చూపు సోకితే చాలు
నా మనసంతా హరివిల్లౌతుందని
నీ అధరం తగిలితే చాలు
నా జీవితం సుమధురవౌతుందని
నీ తనువు తాకితే చాలు
నా తనువు సుమధనువౌతుందని
నీ చేయి తగిలితే చాలు
నా చేయి చెంగల్వ పూదండౌతుందని
నీ పాదం మోపితే చాలు
నా ఇల్లే పూల పొదరిల్లౌతుందని!

- కట్టా శ్రీనివాసరావు
శనగపాడు, కృష్ణా జిల్లా.
చరవాణి : 9912450428

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు email: merupuvj@andhrabhoomi.net

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

- చావలి నాగ శ్యామల, విజయవాడ.