విశాఖపట్నం

ప్రాణాలు తీసిన ప్రేమలు -- కథానిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెరుపు - విశాఖపట్టణం
ప్రాణాలు తీసిన ప్రేమలు -- కథానిక

రాజారాం పారిశ్రామికవేత్త. వేల కోట్లకు అధిపతి. కొడుకు అభిరాం తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బుతో జల్సాలకు అలవాటుపడ్డాడు. కార్ రేస్‌లు... గుర్రం రేస్‌లు... బైక్ రేస్‌లు... ఒక్కటేమిటి అన్నింటా అభిరాం పాల్గొనాల్సిందే! కొడుకు మీద ప్రేమతో తండ్రి ఏమీ అనేవాడు కాదు.
కుమారస్వామి పేరొందిన నటుడు. విపరీతమైన ఇగో! ఎవరినీ దరిచేరనీయడు. కోట్ల రూపాయలు సంపాదించాడు. ఎవరికీ దానం చేయని మహా పురుషుడు. ఒక్కడే కొడుకు పేరు సుకుమార్. డబ్బు తెచ్చిన మదం ఇతని జీవితాన్ని మరో మార్గంలోకి నెట్టివేసింది. తెల్లారింది మొదలు బైక్ రేసుల్లో పాల్గొనడం, డబ్బులు తగలేసుకోవడం పోలీసులు వీళ్లిచ్చిన మామూళ్లకు లొంగి, వీరిని పట్టించుకోవడమే మానేశారు.
రఘునందన్ మంచి క్రికెటర్. మంచివాడు. అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తాడు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా ముందుంటాడు. కొడుకంటే మహా ఇష్టం. అతనిపేరు శివమ్. అయితే... తండ్రి పోలికలను పుణికిపుచ్చుకున్న ఇతను అందరికీ తలలో నాలుకలా ఉంటాడు. కలుపుగోలుతనం... మృదువైన మాటతీరు... వెరశి అందరికీ అభిమానపాత్రుడయ్యాడు. అయితే అభిరాం, సుకుమార్‌ల పరిచయంతో మనస్తత్వం మారలేదు గానీ నడిచే మార్గం మారింది. వారి దారిలోనే పయనించడం మొదలుపెట్టాడు.
ముగ్గురు తండ్రులూ తమ పిల్లలను అతి గారాబంగా చూడటం... వారు ఏ మారగంలో పయనిస్తున్నారో గమనించే తీరిక వారికి లేకపోవడం... పిల్లల జీవితం గతి తప్పుతున్నా... కుర్రతనం అని వదిలేయడం... జీవితంలోనే అతి పెద్ద షాక్ తింటారు వారు. ఎలాగంటే...
ఆ రోజు- ఆదివారం- అందరికీ ఆటవిడుపు- ‘‘ఇవాళ బైక్‌రైస్‌లో పాల్గొందాం. లక్ష రూపాయలు పందెం!’’ అభిరాం అన్నాడు సుకుమార్‌తో
‘‘నేను రెడీ! పోలీసులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది!’’
‘‘ఏం శివా! నువ్వు పార్టిసిపేట్ చెయ్యవా?’’ అడిగాడు అభిరాం.
‘‘నాకిష్టంలేదు. మీరు కానీయండి...’’ నిరాసక్తంగా అన్నాడు శివమ్.
‘‘అదేంటి? అంతటి నిరాసక్తత!’’ పకపక నవ్వాడు అభిరాం. ‘‘ఇప్పుడు కాకపోతే మరెప్పుడు పార్టీసిపేట్ చేస్తావ్! ముసలయ్యాక మనమేం చెయ్యలేం! కమాన్!’’ ఆహ్వానించాడు సుకుమార్.
‘‘నాకివ్వాళ పార్టిసిపేట్ చెయ్యలని లేదు. ఈ రోజుకు నన్నొదిలేయ్!’’ అభ్యర్థించాడు శివమ్. సరే నీ ఇష్టం!’’ అంటూ ‘‘మనం సిటీ అవుట్ స్కర్ట్స్‌కు పోదాం! విశాలమైన డబుల్ రోడ్ అక్కడుంది. మనల్నెవరూ అడ్డుకోరు!’’
సుకుమార్ అంగీకరించాడు. అందరూ బైక్‌లపై బయలుదేరారు. ఎండ విపరీతంగా ఉంది. అయినా... ఎవరికీ... ఎండతాపం గూర్చి బెంగలేదు. ‘‘ఇదిగో నా లక్ష రూపాయలు! శిమ్ దగ్గర దాస్తున్నాను. ఎవరు గెలిస్తే వారికి ఈ లక్షతో పాటు చెందుతాయి!’’ అభిరాం సూట్‌కేస్‌ను శివమ్‌కి అందించాడు.
బైక్‌రేస్ స్టార్టయింది. మొత్తం పది మంది అభిరాం, సుకుమార్‌లు వేగంగా వెళ్తున్నారు. మిగతా వాళ్లు వెకనబడి... విరమించుకున్నారు. అభిరాం బైక్ స్పీడ్ నూట ఇరవై దాటినట్లుంది.
‘‘అంత స్పీడా! కంట్రోల్ చేసుకోగలడా!’’ శివమ్ ఆందోళనగా పక్కనున్న వాడితో అన్నాడు.
ఓవర్ స్పీడ్... విపరీతమైన ఎండ... అభిరాం కళ్లు మసకబారాయి. ముందు మార్గం కన్పించడం లేదు. బైక్ కంట్రోల్ తప్పింది. కన్నుమూసి తెరిచేలోగా డివైడర్‌ను ఢీకొని... తుళ్లిపోయాడు. నడుం... ప్రక్కటెముకలు విరిగాయి. హెల్మెట్ ఎటో ఎగిరిపోయింది. తల పగిలింది. ‘అమ్మా!’ అన్న మూలుగు మాత్రమే విన్పించింది. ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
* * *
కొడుకు మరణవార్త రాజారాంను షాక్‌కు గురిచేసింది. భోరున ఏడ్చాడు.
‘‘సర్! మీ అబ్బాయి బైక్ రేస్‌లో పాల్గొన్నాడు. ఓవర్ స్పీడ్ అతని ప్రాణాలను హరించింది!’ ఎస్‌పి అన్నాడు.
‘‘మీరేం చేస్తున్నారు? కుర్రాళ్లు బైక్‌రేస్‌లో పాల్గొంటుంటే... మీ పోలీసులు కళ్లుమూసుకుని కూర్చున్నారా! లంచాలకు అలవాటుపడి... మీ ధర్మాన్ని మీరు విస్మరిస్తున్నారు!’’ కోపంగా అన్నాడు.
ఎస్‌పి తలదించుకున్నాడు.
రెండు నెలలు గడిచిపోయాయి. ఈ మధ్యకాలంలో ఎవరూ బైక్ రేస్‌లో పాల్గోలేదు. కానీ... ఓ రోజు సుకుమార్, శివమ్‌కు ఫోన్ చేశాడు. ‘‘అభిరాం పోయాడని మన సరదాలు మానుకుంటామా! మనం మళ్లీ బైక్ రేస్‌లో పాల్గొందాం. ఈసారి తెల్లవారే వెళ్లిపోదాం! నువ్వేమంటావ్? ‘‘నేను రెడీ! రేపు ఉదయానే్న వెళదాం!’’ శివమ్ అంగీకారం తెలిపాడు.
మరు రోజు ఉదయం ఆరు గంటలకు బైక్‌లపై బయలుదేరారందరూ. ఈసారి ఐదుగురే వచ్చారు. ప్రాణభయం మిగతావారిని వెనుకంజవేసేలా చేసింది.
‘‘రేస్ ప్రారంభిద్దాం! ఈసారి గెలిచిన తర్వాతనే డబ్బులు తెద్దాం. శివమ్! జాగ్రత్త! ఓవర్‌స్పీడ్‌లో వెళ్లకు. కంట్రోల్ చేయడం కష్టమవుతుంది!’’ మృదువుగా హెచ్చరించాడు సుకుమార్.
శివమ్ తలూపాడు. బైక్‌రేస్ స్టార్టయింది. ముందు స్లోగానే వెళ్తున్న శివమ్, సుకుమార్‌లకు ఆ స్పీడ్ సంతృప్తినివ్వలేదు. స్పీడ్ పెంచుకుంటూపోయారు. తొంభై... నూరు... నూటపది... నూట ఇరవై... నూటముప్పై... చూస్తున్న వాళ్లు నోరెళ్లబెట్టారు. శివమ్... సుకుమార్... పోటాపోటీగా ముందుకు సాగుతున్నారు. ఇంతలో... ఏం జరిగిందో... తెలీదు. రెండు బళ్ళూ గుద్దుకున్నాయి. కొంతదూరం రోడ్డుపై ఈడ్చుకుపోయిన బైకులు... వారిద్దరినీ బలంగా డివైడర్‌కు గుద్దించేసి... తన మానాన తాము ఆగిపోయాయి. కనీసం.. కని... పెంచిన... తల్లిని తలచుకోకుండానే ప్రాణాలు వదిలేశారిద్దరూ!
కుమారస్వామి భోరుమన్నాడు. రఘునంద్ శిలావిగ్రహంలా ఉండిపోయాడు. చేతికందిన కొడుకులు... ఇలా... అసువులుబాయడం... జీర్ణించుకోలేకపోయారు. తాము గడించిన డబ్బు... తమ పిల్లల విచ్చలవిడితనానికి ఆలవాలమవుతుందనీ... ఆ డబ్బే... వారి ప్రాణాలను హరించివేసిందనీ... వాళ్లకు లక్ష రూపాయలు విలువచేసే బైక్‌లు కొనివ్వడం తప్పయిందనీ... భోరున విలపిస్తూ అనుకున్నారు. తమ అతి ప్రేమలు వారి ప్రాణాలను తీసిందని ఆవేదన చెందారు. పోలీసులు బైక్ రేస్‌లను చూసీ చూడనట్లు వదిలేయడం పట్ల ఆవేదన చెందారు. ఆగ్రహం వ్యక్తపరిచారు.
షరా మామూలే! పోలీసులు హడావుడి చేశారు. నెల రోజులు రోడ్లపై కాపలా కాశారు. స్పీడ్‌గా వెళ్తున్న కుర్రకారుని ఆపి... కౌనె్సలింగ్ ఇచ్చారు. ప్రాణాల విలువను తెలియజెప్పారు. ఇకపై బైక్‌రేస్‌లో ఎవరు పాల్గొన్నా కఠినంగా శిక్షిస్తామని ఎస్‌పి ప్రకటించారు.
ఆరు నెలలు గడిచాయి. తండ్రులందరూ విచారం నుండి బయటపడ్డారు. ఎస్‌పి గారబ్బాయికి ఇరవై ఏళ్లొచ్చాయి. తన తండ్రి జిల్లా అధికారి- తననెవరేం చేస్తారనే ధీమాతో బైక్‌ను నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్‌తో నడపసాగాడు. పోలీసులు చూశారు. వెంటనే ఎస్‌పి గారికి ఫోన్‌లో తెలియజేశారు. ఆయన తన కొడుకైనా ఫర్వాలేదు- వెంటనే అరెస్ట్ చేసి తన దగ్గరకు తెమ్మని ఆదేశించాడు. పోలీసులు కదిలారు. కానీ... అంతటి స్పీడ్‌ను కంట్రోల్ చెయ్యలేక... రోడ్‌పై డివైడర్‌ను ఢీకొట్టి తలపగిలి తను చనిపోతూ, ఏ పాపం ఎరుగని మరో వ్యక్తిని తనతో తీసుకుపోయాడు. ఎస్‌పి గారబ్బాయికి లైసెన్స్‌లేదు.
ప్రేమలు పిల్లల ప్రాణాలు తీయకూడదు. నిలబెట్టాలి. తండ్రులూ! డబ్బులు వెదజల్లడం కాదు.. వారికి ప్రేమించడం నేర్పించండి. ప్రాణాల విలువను తెలియజెప్పండి!

- మల్లారెడ్డి రామకృష్ణ,
బుడితి-532427. సారవకోట మండలం
శ్రీకాకుళం జిల్లా, సెల్ : 8985920620.

తెలుగు జయంతి

వ్యాసం

ఆంధ్రుల చరిత్ర చాలా ప్రాచీనమైనది. వేదాల కాలం నుండి ఆంధ్రులున్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఐతరేయ బ్రాహ్మణులలో మహాభారత, రామాయణ ఇతిహాసాలలో, పాణినీ పతంజలుల గ్రంథాలలో, పురాణాలలో ఆంధ్రులు దక్షిణ భారత దేశంలో ప్రధాన జాతులలో చెప్పబడ్డారు. ఆంధ్ర రాజులలో మొదటి వారుగా కృష్ణానదీ తీరపు రాజులలో సుచంద్రుడు, అతని కుమారు ఆంధ్ర విష్ణువు. ఈ ఆంధ్ర విష్ణువు కృష్ణా నదీతీరాన శ్రీకాకుళం దగ్గర ప్రాచీన దేవాలయంలోని ఆరాధ్య దేవుడై ఆంధ్ర జాతి పితామహుడిగా చెప్పబడుతున్నాడు. ఈ విధంగా ఆంధ్ర పదము ప్రాచీన కాలము నుండి వాడుకలో ఉందని చెప్పవచ్చు.
శ్రీశైలము, కాళేశ్వరము, ద్రాక్షారామ క్షేత్రములందున్న లింగములకు త్రిలింగములని పేరని, ఈ త్రిలింగములు ఉండుటచే ఆంధ్ర దేశానికి త్రిలింగ పేరయ్యెనని, దాని తత్భవము తెలుగని, సింహాచలం, శ్రీశైలం, శేషాచలం నగరములు హద్దులుగా చూపి ఈ మూడు నగరములకు మధ్యనున్న భాగానికి త్రినగ భాషని అదే తెనుగని క్రీస్తుశకం 1650 ప్రాంతానికి చెందిన అప్పకవి చేత చెప్పబడింది. క్రీస్తుశకం 1166లోని వెలనాటి వీర రాజేంద్రుని శాసనమునందు, క్రీస్తుశకం 14వ శతాబ్దానికి చెందిన విన్నకోట పెద్దన్న కావ్యాలంకార చూడామణియందు ఇట్టి అభిప్రాయాలే చెప్పబడ్డాయి. ఈనాడు ఆంధ్రము- తెలుగు- తెనుగు అను మూడు పేర్లు పర్యాయయాలుగా వాడుతున్నాము. తెలుగు భాషకు శ్రీకృష్ణ దేవరాయల కాలములో మంచి కీర్తి ప్రతిష్టలొచ్చాయని ఈ పద్యం ద్వారా తెలుసుకోవచ్చు. ఇది స్వయానా దేవరాయలు చెప్పిన పద్యం.
తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లనృపుల గొలువ నెరుగ వేబాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
దేశ భాషలందు తెలుగు లెస్స. కాలమేదైన భాషకు జీవం కవి. తలుగు ఛందస్సు దేశ భాషలలో బహుశ ప్రపంచ భాషలలో సాటిలేని సంగీత సౌష్టవం కలదని చెప్పవచ్చు. తెలుగు సంగీతానికి అనుకూలమైన భాష. అందుకే అరవ దేశానికి చెందిన (వలస వెళ్లిన) తాగ్య తెలుగు పలుకులలో తన ఇలవేలుపును స్తుతించి ప్రాచీన అరవ భాషకు లేని తియ్యదనం తెలుగు భాషకుందని నిరూపించాడు. ఏ ఇతర భాషలలో కనిపించని అవధాన ప్రక్రియ తెలుగు వరం. అందుకే కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్ర్తీ ‘తెలుగుదనము వంటి తీయందనము లేదు తెలుగు కవులు వంటి ఘనులు లేరు తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా’ అని తెలిపారు.
1974వ సంవత్సరం తెలుగు వారి చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టము. అంతకు ముందు ఒక సంవత్సరం రాష్టప్రతిపాలన సాగిన తరువాత జలగం వెంగళరావు మంత్రివర్గం పదవీ స్వీకారం చేసింది. ఈ మంత్రివర్గం తెలుగు ప్రజల సమైక్యతకు అధిక ప్రాధాన్యతనిచ్చిందని చెప్పవచ్చు. తెలుగు భాషను పరిపాలనా భాషగా తాలూకా స్థాయిలో ప్రవేశపెట్టింది. భవిష్యత్తులో తెలుగును జిల్లా స్థాయిలో, రాష్టస్థ్రాయిలో అధికార భాషగా రూపొందించాలని నిర్ణయించారు. అప్పుడే అధికార భాషా సంఘం నియామకం జరిగింది.
అప్పుడు విద్యామంత్రిగా పదవీ స్వీకారం చేసిన మండలి వేంకట కృష్ణారావు సందర్భశుద్ధిని, అవసరాన్ని గమనించి అఖిల భారత స్థాయిలో తెలుగు మహాసభలను జరిపించారు. 1975 ఏప్రిల్ 12వ తేదీ తలుగు సంవత్సరాది ఉగాది రోజున ప్రపంచ తెలుగు సభలు ప్రారంభమై వారం రోజులు వైభవంగా జరిగాయి. ఈ సమావేశాలకు మారిషస్, మలేషియా, శ్రీలంక, ఫిజీ, కెనడా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, అమెరికా, రష్యా, జాంబియా మొదలైన దేశాలలో నివసించే తెలుగు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సభలు హైదరాబాద్‌లో జరిగాయి. ఆనాటి నుండి ఇటీవల తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల వరకు తెలుగు భాషాభివృద్ధికి జరుగుతున్న కృషి అభినందనీయమైనది.
నేడు తెలుగు నేలలో తెలుగు భాష, చరిత్ర మీద సమగ్రమైన అవగాహన గల ఏకైక వ్యక్తి ఎవరంటే అది దినపత్రికలే అని చెప్పవచ్చు. నాటి తరంలోని నిబద్ధత, నేటి తరంలోని వైజ్ఞానికతను కలబోసి తెలుగు జాతి అభిమానంతో క్షణక్షణ విషయాలను అనుక్షణం తెలుగు భాషలో అందించి తెలుగు భాషకు జీవం పోస్తున్నవి తెలుగు పత్రికలే అని చెప్పవచ్చు.

- డాక్టర్ దన్నాన అప్పలనాయుడు,
సెల్ : 9492546833.

మనోగీతికలు

జవరాలి ఊసులు
ఆ॥ నల్లరాతివోలె నదురైన నావోడు
సందమామ కన్న సక్కనోడు
మల్లెపూవు వోలె మనసున్న మారాజు
మేలమాడ వచ్చె మేనబావ
ఆ॥ ఎడద దోచినాడు ఎనె్నల్ల జతగాడు
జొన్నసేలకాడ జొల్ల కాడ
మనసు విప్పినాడు మనువాడతానని
మొగిలి పూవు వోలె ముడుసుకొంటి
ఆ॥ అద్దరేయి కాడ నిద్దర్లు బోతంటే
సద్దు సేయకుండ అద్దలించి
ముద్దరాల యింద అద్దాల రైకంటు
సేత పెట్టి పోయె సిలిపివోడు
ఆ॥ పొద్దు పొడవకుండ పుంజు కూయకుండ
సేత కుండ పట్టి సెరువుకెల్లి
నిండు నీలలోన నిలిచి తానాలాడి
ఱైక తొడిగినాను మైకమాయె
ఆ॥ సేతి కండ యిడిసి సెక్కిట్లో సేయుంచి
సెరువు నీలకేసి సిటవు సూసి
సెలికాని సూసి సిత్తరువయ్యాను
సిగ్గు కలిగినాది సిన్నవోడ
ఆ॥ సూపుకేమొ ఒళ్లు సుళ్లు తిరిగినాది
సూపు తిప్పవోయి సోయగాడ
లేత ఎండలోన సేత బరిస పట్టి
సోకు సూపమాకు సొగసు కాడ
ఆ॥ మాట కలిసినాది మనసు కలిసినాది
తగిన రోజునాడు తాళి కట్టు
సేయి సేయి కలిపి సేను పండిద్దాము
సేను పండినాకె మేని పంట

- గుమ్మా నాగమంజరి,
శృంగవరపుకోట, విజయనగరం జిల్లా
సెల్ : 9985667500

జడివాన
గగనపు సింహాసనం నుండి
గజ్జెల గుర్రాల అలజడిలా
గాంధర్వ శబ్ద స్వరాలతో
అద్భుత క్షణ అదృశ్య మెరుపులతో
హరివిల్లుల సోయగాలతో
సిరిమువ్వల జల్లులతో
శీతల పవన స్పర్శతో
సాహిత్యపు అలల తాకిడిలా
పుత్తడి పుడమికి దిగి వచ్చే
చిత్తడి జల విన్యాసమే
జడివాన!

- పెయ్యల శ్రీనివాసరావు,
అలికాం గ్రామం పోస్టు,
శ్రీకాకుళం జిల్లా-532185
సెల్ : 8886423116.

నీడ పడని వెలుగు
చీకటి అంతటా సర్దుకుని అలముకోవాలన్నా
వెలుగున కుదురుకునే నిలకడలు కానరాక
వెను వెనుకనే నక్కి
ఆవరింపుల పెరిగి విరిగి సంచరిస్తుంది
వెలుగుల దాగిన నా నిశ్శబ్దపు లయల
అడుగు జాడల పలుకు వినపడలేదా?
నలుదిక్కులా ఆవరించిన చీకటిని
ఆది అస్తిత్వం వెలుగు సహజాతమంటుంది
ఇల అంతరంగాల దినకరుని కదలికలు
జన మనుగడల ఆశాపాశ బంధాలు
వెనువెంట నీడలై పరుచుకుంటాయి
పాప పుణ్య ప్రమాణ ప్రయాణాలు లిఖిస్తూ
వెన్ను తోడు నీడనై సంచరిస్తాను
నన్ను వెనుతిరిగినా చూడలేని మీ వెన్ను సాక్షిగా
నేను లేనిచోట నీవు లేనే లేవన్నది సత్యం
ఆశే శ్వాసించు జగతికి వెలుగెంతో
భూమిపై నడిచే మనిషికి నా తోడంతే
చీకటి నీడ పడని వెలుగున నీవు లేనట్టే!

- ఎల్ రాజా గణేష్,
సెల్ : 9247483700.

సాయం - గాయం

మినీకథ

రాత్రి నైట్ డ్యూటీ చేసి ఇంటికి పయనమయ్యాడు నూకరాజు. దారిలో వెళుతుంటే జీతం బ్యాంక్‌లో పడిందనే విషయం గుర్తొచ్చి ఎటిఎం దగ్గరికి వెళ్లాడు. జీతం పదివేలు తీసుకొని బయలుదేరాడు.
‘ఈ జీతంతో చెల్లి పాపకి ఏవైనా బొమ్మలు కొనాలి! అమ్మని హాస్పటల్‌కి తీసుకెళ్లాలి, కారిపోతున్న ఇంటిని బాగుచేయించాలి, ఇంకా చాలా ఉన్నాయి!’
ఇంతలో ఒక వ్యక్తి వీపుమద కావిడిమోస్తూ కనిపించాడు. అంతలోనే పడిపోయాడు. ఒళ్లంతా గాయాలయ్యాయి. చేతులు, కాళ్లు కొట్టుకుపోయాయి. కావిడికి రెండు బిందెల్లో ఉన్న నీరు మొత్తం నేలపాలయింది. ఇది చూసిన నూకరాజు వెంటనే బండి ఆపి, అతనిని లేపి బిందెలను తీసి ఉంచాడు.
ఇది చూసిన వ్యక్తి బంధువులు అందరూ ఒకొక్కరుగా వచ్చి నూకరాజుని ‘‘కళ్లు కనబడట్లేదా? వేగంగా వచ్చి గుద్దేస్తావా?’’ అని అరవసాగారు.
‘‘నేను కాదండీ! ఆయనే పడిపోయాడు. నేనే లేపాను’’ అన్నాడు. ‘‘నోర్ముయ్! ఇంక మాట్లాడక’’ అని ఆ వ్యక్తి కొడుకు నూకరాజు మీద అరిచాడు! ‘‘మా నాన్నని అర్జెంటుగా హాస్పటల్‌కి తీసుకెళ్లు. కాళ్లు విరిగినట్లుంది అందుకే లేవలేకపోతున్నాడు. చేతికి కూడా ఏదో జరిగినట్లుంది అందుకే లేపలేకపోతున్నాడు’’ అన్నాడు.
‘‘మీ నానే్న తాగేసి ఉన్నాడు. అందుకే పడిపోయాడు’’ అని కోప్పడ్డాడు నూకరాజు. ఊరిజనం అంతా అక్కడ చేరుకున్నారు. నూకరాజు మాట ఎవ్వరూ ఆలకించలేదు. అందరూ హాస్పటల్‌కి తీసుకెళ్లాలి అని పట్టుబట్టారు.
‘‘నేను ఎందుకు తీసుకెళ్లాలి. అతను తాగేసి పడిపోయాడు’’ అని మరోసారి చెప్పినా ఊరి జనం వినలేదు. ‘‘హాస్పటల్‌కి తీసుకెళ్లి స్కానింగ్ చేయిస్తావా? లేకపోతే నీ బండి పట్టుకెళ్లిపోమంటావా?’’ అన్నారు.
‘‘ఏమిటండి బెదిరిస్తున్నారా?’’ అని ఊరి జనం ముందు తన ఆవేదన విన్నవించుకున్నా వాళ్లు వినలేదు.
తప్పని పరిస్థితిలో అతనిని హాస్పటల్‌కి తీసుకెళ్లాడు. గవర్నమెంట్ హాస్పటల్ వాళ్లు ఆసక్తి చూపించకపోవడంతో ఖరీదైన ప్రైవేట్ హాస్పటల్‌కి తీసుకెళ్లాడు.
బాడీ స్కానింగ్, అనేక చికిత్సలను చేయించుకున్నారు. అన్నీ చేసిన తర్వాత డాక్టర్ అంతా బాగానే ఉంది అని చెప్పి పదివేలు ఫీజు చెప్పారు. కన్నీళ్లు నిండిన హృదయంతో తనకి అప్పుడే వచ్చిన జీతం డబ్బులు ఖర్చవడంతో బాధను దిగమింగలేక బరువైన హృదయంతో ఇంటికి బయలుదేరాడు నూకరాజు.
ఈ కాలంలో సాయం కూడా గాయం మిగులుస్తుంది అని తనకు తనే ఓదార్చుకున్నాడు.

- నల్లపాటి సురేంద్ర,
పెదగంట్యాడ, విశాఖపట్నం.
సెల్ : 9490792553.

======

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.