విజయవాడ

మెరుపు - విజయవాడ : మనోగీతికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూతదయ
జముడు కాకి ఒక్కటి
ఒంటరిగా ఎగిరివచ్చి
పూలచెట్లమాటున
వాటంగా వాలింది
మొక్కల గుబురుల్లో
గెంతిగెంతి గోప్యంగా
భయపడే చూపులతో
బాసటగా నిలిచింది
నీటిమడుగు నీడలో
నిక్కినిక్కి చూసింది
అటు చూసి, ఇటు చూసి
ముచ్చటైన ముక్కుతోడ
అరకొరగా నీరు తాగి
ఆకలిగా నోరుతెరచి
అందినంత రొట్టెముక్క
అందుకుంది ఆబగా
ఆరగించి మింగింది
నింగికేసి దీక్షగా
నికరమైన చూపులతో
లేచి ఎగిరిపోయింది
నిత్యమూ ఓ చిన్న దినుసు
దానికొరకు దాచివుంచి
ఆరగింపు సమయానికి
దానికొరకు దాగివుండి
అది తింటుంటే చూసిచూసి
మైమరచిపోయి నేను
ఎంతగానొ మురిశాను
మన నేస్తం మన మధ్యన
బతుకుబాట సాగుతుంటే
పరవశాన పక్షిజాతికి
మేలుచేయ చెలిమికోరి
గ్రీష్మ ఋతువు తాపాన
నీరులేక విహంగములు
దాహముతో తల్లడిల్లి
చేటుకాలం దాపురించి
చనిపోతూ వుంటాయి
అందుకనే పెరట్లోన
బకెట్ నిండా నీరు నింపి
వాటికొరకు వెర్రిగా
ఎదురెదురు చూస్తాను
పిలిచినట్లు వస్తాయి
చిలుకలూ గోరంకలు
పిచ్చుకలూ పావురాలు
కొంగజాతి కొక్కెరలు
గువ్వలూ గూబలూ
రకరకాల పిట్టలూ
నీటికొరకు నిరీక్షణతో
రివ్వుమంటు వస్తాయి
చాటుమాటు వాటిని
తిలకించి తిలకించి
మురిపెంగా ముచ్చటగా
చూస్తూనే మురిసిపోయి
ఆ సంతసం ఓ వరంలా
యుక్తిగా భావించి
భాసిల్లిన మనముతోడ
భక్తిగా దైవాన్ని
స్మరిస్తాను భావమున!
- తన్నీరు సీతారామాంజనేయులు,
జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా. స్థిరవాణి : 08654 224726

నిప్పులాంటి నిజాలు
ఏదైనా అది వెలుగుచూసే వరకే
అనుభవించే వరకే
కాలమే తీరుస్తుంది
మార్పుతో మార్చేస్తుంది
అనుభవమే గుణపాఠం
ఆచరణే ఆమోదం
ఆరాధనే ఆవేశం
కానీ ఆశలే అవరోధం
అందుకే అనిపిస్తుంది
అదెట్లా అవుతుందని
మరెందుకో ఆశజూపి
తన దారికి పిలుస్తుంది
చూసేదేదీ, అది కానేకాదు
చెప్పేదేదీ చేతల్లో రాదు
అనుభవించేదేదీ నిలిచేది కాదు
ఒకరికి చెప్పేదీ కాదు
అది అంతవరకే అయిపోతుంది
ఆగిపోతుంది
ఎందుకిట్లా అయ్యింది?
ఏమిటిదంతా పోయిందా? అని
తెలిసిన నాడు తేలిన నాడు
చెప్పటానికి, చెప్పుకోటానికీ
ఏమీ మిగలదు
అదే అక్షర సత్యం
నిప్పులాంటి నిజం!

- పి హనుమాన్ ప్రసాద్,
విజయవాడ,
చరవాణి : 9030104968

నా మాతృభాష
అమ్మ ప్రేమను రంగరించిన
కమ్మనైన భాష
అమృతాన్ని ఆకలించిన
చనుబాల భాష
ఒడిన కులుకు చిన్నిపాపల
చిలక భాష
బోసినవ్వుల వికసించు
పువ్వు భాష
ఉగ్గుపాల నిగ్గుతో
ఊఁకొట్టు భాష
అమ్మ కౌగిలి వెచ్చనూర్చు
చంటి భాష
కనుసైగల మెలిగి
వెలుగు భాష
మాట ఒరవడికి మొదటి మెట్టై
నూతనతను మూటకట్టుకున్న భాష
చావుపుట్టుకల్లో
పరభాష రానేరాదు
నేర్చుకుంటున్న
స్పృహ కలగనేరదు
నామతము నీమతము కానేకాదు
భావవ్యక్తీకరణలో మాతృభాషకి
సాటిమరేది లేదు

- పెరుగుపల్లి బలరామ్
ఎఎన్‌యు, గుంటూరు.
చరవాణి : 9676636816

ఆక్రోశం

దేశమాతను
తల్లిగా భావించే జాతి
తల్లిని దైవంగా కొలిచే దేశం
ఆలినైనా
అమ్మగా భావించే మనం
ఆడదంటే
అదోలా చూస్తున్న చూపులేం?
ప్రతిసృష్టి చేస్తున్న సంతోషం
ఆమెకు మిగలదా?
అమ్మ ఒడిన
మానవత్వపు పునాదిపై
గోరుముద్దలు మింగి
మృగత్వ విసర్జనా?
ఆమె.. కంటబడితే వేధింపులా
దొరికినంతనే వెటకారమా?
అత్యాచారాలు, హత్యలేమిటి
తెలిసీ చేస్తున్న గాయం
ఆమెకెందుకీ కష్టం!
పసిమొగ్గల్ని కాలరాస్తూ
నిస్సిగ్గు బతుకెందుకు?
ఇంత ఘోరమేమిటి
వారి రోదన వినరా?
ఇది నాగరిక సమాజమా
అనాగరిక జనమని అందామా?!
సిగ్గు.. సిగ్గు..
ఆత్మహత్యా సదృశం
మన మాతృజాతి
‘స్వేచ్ఛా కల’ చెదురుతోందిలా
అతివ కంట
కన్నీరు మిగులుతోందిలా
చిట్టిచిట్టి అడుగులేసే
గుడియా మనపిల్లే కదా
మృగాళ్లకు బలైన నిర్భయ
మనచెల్లి కాదా
కన్నవారి కంటి ముందే
కాటికి చేరిన సునీల
మన తల్లి కాదా
అనూహ్య భవిత భగ్నమెందుకలా?
ఆమె బతుకు ఎడారై
కన్నపేగు ఆశ అడియాశై
ఊగిన ఊయల సైతం రోదిస్తోంది
అమ్మే ఉండదని!
ఆడదంటే అక్కందాం.. చెల్లందాం
అనకుంటే చెల్లం!
నిర్భయ చట్టముంది
వినకుంటే
‘చెరసాల’ మూల్యముంది
ఉరికంబమూ ఉంది
మన మనుగడకే సిగ్గుగా..!?

- పులివర్తి శ్రీనివాస్
గుంటూరు
చరవాణి : 98856 52296

కాకలు తీరిన కవితా తరంగిణి

వెంటాడే కవులు

‘సహ్యభూభృత్కులస్వామి దల వోచి
లాలించి పెంచు గారాల కూన
శ్రీశైల శిఖరాగ్ర చిన్మూర్తియై వెల్గు
శ్రీమన్మహాదేవు చెలిమి కత్తె
అమరేశ్వరస్వామి యాస్థాన నర్తకీ
సముదాయనృత్త శిక్షాప్రదాత్రి
ఇంద్రకీలాచలంబెక్కి లోకంబేలు
కనకదుర్గమ్మకు ననుగుజెల్లి
కాకుళక్షేత్రమున నాంధ్రకైటభారి
యంఘ్రి యుగ్మము సేవించునమలచరిత
కర్షకాంధ్ర ప్రజానీక కల్పవల్లి
నిక్కమగుతల్లి కృష్ణవేణీమతల్లి!’
ఇది కృష్ణానదీ వర్ణనం. మన ఆంధ్రదేశంలో వరికీ, సిరికీ విరియై విరాజిల్లిన గోదావరీ వర్ణనం ప్రాచీనాధునికాంధ్ర కావ్యాల్లో విరివిగా కనిపిస్తున్నప్పటికీ కృష్ణానదీ వర్ణన కూడా తక్కువగా మాత్రం ఏమీ లేదు అనే విషయాన్ని ఈ సీస పద్యం చాటిచెబుతోంది. ఈ పద్యం ‘కాకతీయ తరంగిణి’ అనే పేరుగల కాకతీయ రాజుల చరిత్ర ప్రధానేతివృత్తంగా కలిగిన పదిహేను తరంగాల ప్రౌఢమాధురీ మహిమాత్మకమైన పద్యకావ్యం లోనిది. కవి - ‘సాహిత్య విద్యాప్రవీణ’ శ్రీ యార్లగడ్డ వేంకట సుబ్బారావుగారు. గుంటూరు జిల్లాకు చెందినవారు.
తీర్థయాత్రలు చేస్తున్న గణపతిదేవ చక్రవర్తికి సోమనామాత్యుడు నాగార్జునాద్రిని, పలనాటి గాథాసీమను పరిచయాత్మకంగా వర్ణించి చెబుతూ ధాన్యకటకం - అమరావతీ ప్రాంతానికి చేరి ‘ఇచ్చటి దేవదేవుడమరేశ్వరుడాశ్రీత కల్పశాఖియై యిచ్చు సమస్త సంపదలన’ని నేటి నవ్యాంధ్ర రాజధానిని భువన మోహన దృశ్యంగా కళ్లకు కట్టిస్తూ కృష్ణవేణీ తరంగిణి వైభవాన్ని సీసంలో కవితా రసాయనాత్మకంగా పోతపోశారు. ‘సహ్యపర్వత ప్రాంతంలో పుట్టి పెరిగిన గారాల కూన!’.. ఇలా అనడంలో ఓ చమత్కారం ఉంది. ‘గారాల కూన’ శబ్దాన్ని అటూ ఇటూ కొద్దిగా మారిస్తే ‘రాగాల కూన’ అవుతుంది. తరంగాల సవ్వడులతో ఆ నది నిజంగా రాగాల కూనయే ఎప్పటికీ. శ్రీశైల ప్రాంతంలో శివునికి చెలిమికత్తెగా ఆ ప్రాంతానికి అనుకూలంగా ఆయన కనుసన్నల్లో మెలగుతూ ప్రవహిస్తోందన్నమాట. ఎందుకంటే ఈశ్వరుడంటే ప్రభువని గదా అర్థం. అందువల్ల చెలిమికత్తెగా ఉంది కృష్ణవేణి. అమరేశ్వరస్వామి ఆస్థానంలో నృత్య విద్యా శిక్షకురాలిగా తోచింది కవికి - ఈ నది. ఇక కనకదుర్గాదేవికి చెల్లెలుగా విరాజిల్లుతోంది ఇంద్రకీలాద్రిపై విజయవాడలో కాదు - విజయాలవాడలో! ఆంధ్ర విష్ణువు పాదపద్మాలను సేవించే భక్తురాలిగా పరిఢవిల్లుతోంది. కర్షకులకు, ఇతరాంధ్ర జనులకు కల్పవల్లి - ఈ కృష్ణవేణీమతల్లి. ఈ వర్ణనలో కృష్ణవేణి రాగాల కూనగా, చెలిమికత్తెగా, నాట్య విద్యా శిక్షకురాలిగా, అనుంగు చెల్లెలుగా, భక్తురాలిగా ఉల్లేఖించటం చేత ఇది ఉల్లేఖాలంకారం. ఒక నదిలో కవి ఇక్కడ అనేక మానవత్వాకృతుల్ని దర్శించి, అందంగా ప్రదర్శించారు. కవి వర్ణనాత్మక ప్రతిభకిది నిదర్శనం. ఆ తర్వాత గణపతిదేవ చక్రవర్తి తన ఇద్దరు దేవేరులతో కృష్ణానదీ ప్రాంతాల్లో క్రీడించినప్పటి వర్ణన పద్యంలో ముక్తపదగ్రస్తాలంకార శోభ, నిశిత ప్రకృతి పరిశీలనా నైపుణి అక్షరాక్షరంలోనూ సీసకాంతులై వెల్లివిరిశాయి.
‘ఏటి లంకల లేఁత బీటి పచ్చిక మేయు
కోడెదూడల మేనికొమరుగాంచి
కొమరుఁ బోండ్ల దలించి గొంతెత్తి పాడెడి
పల్లెపాటల మేలివలనెఱింగి
వలఁబడ్డమేటి చేపలఁబట్టి నావపై
దరులఁ జేర్చుజాలరులఁ జూచి
జాలరుల్ గట్టిన పోలికఁబూగుత్తి
కదుపులనొప్పు పూఁబొదల విడిసి
పొదలు చెఱకుఁ దోటలఁ దోఁచు పొలుపులరసి!
పొలిచెఁ భూముల్ని దొరవిండ్లమోపులనుచు
మేలమాడుచు గణపతి మెలఁత జంట!
గూడి కృష్ణాతరంగిణిఁ గ్రీడసలిపె!’
ఈ పద్యం మొదటి పాదంలో చివర ‘కొమరుగాంచి’ శబ్దం ఉంది. మొదటి పాదంలో వదిలివేసిన ఆ ‘కొమరు’ శబ్దంతో ‘కొమరుఁబోండ్ల దలించి’ అని రెండవ పాదాన్ని ఆరంభించారు. అలాగే ‘వలను’ పదంతో ఈ పాదం ముగిసింది. ‘వలబడ్డ’ అని మూడవ పాదాన్ని ఆరంభించారు. ఇలా చివరిదాకా అచ్చతెలుగు పదాలతో ముక్తవదగ్రస్తాలంకారాన్ని ప్రయోగించారీ కవి. గణపతిదేవ చక్రవర్తి తన భార్యలతో వైవద్యంలో కృష్ణానదీ విహార క్రీడ గావిస్తే, ఈ కవి కృష్ణానదీ వర్ణన ద్వారా శబ్దాలంకార క్రీడ జరిపారు.
‘కాలసమ్రాట్టు మొగసాల గంటపగిది
వేద పాఠంబునకుఁ బూనువిప్రుభంగి
ఱెక్కలల్లార్చి మెడనిట్ట నిక్కిఁజూచి
కొక్కొరోకో యనుచుఁ గూసెఁ గోడిపుంజు!
నవమతరంగంలో తేటతెల్లం చేయబడిన కోడికూత వర్ణనాత్మకమైన తేటగీతి ఇది. కాలసమ్రాట్టు యొక్క మొగసాలలోని గంటగా కోడికూతను పోల్చడం కవి ప్రతిభకు తార్కాణం. కోడిపుంజునకు కాలజ్ఞమనే పేరుంది. ఇందులో కోడికూత ధ్వనియే కాదు సమయపాలనా నియమాన్ని చాటే ధ్వని ధోరణి ఉంది. రెక్కలల్లార్చడం, మెడ చాచడం కాళ్లూ - చేతులూ విదుల్చుకోవడం వంటి సహజ ధర్మాలను గుర్తు చేస్తున్నాయి. ‘వివుభ్రంగి’ అంటే ఇక్కడ విప్రవటువు భంగి అని గౌణంగా అర్థం చెప్పుకోవాలి. పాలకురికి సోమనాథుని కావ్యాల్లోని కోడికూత వర్ణన స్ఫూర్తి ఇందులో ఉన్నా యార్లగడ్డ వారిదైన స్వభావోక్త్యలంకారాత్మక ఉపమాలంకార నిరూపణ ప్రతిభ స్పష్టంగానే కనిపిస్తోంది.
‘జనని జన్మభూమి స్వర్గలోకము కంటె
మిన్నయనెడి భ్రాంతినున్న కతన
పురముజొచ్చినాడఁ బూవులమ్మిన చోటఁ
గట్టెలమ్మి బ్రదుకు గడుపుటెట్లు?’ అన్న గణపతి దేవ స్వగతోక్తి పద్యంలో చక్కని దేశభక్తి సూక్తి, తెలుగు సామెత ఉన్నాయి. ఇంతకీ కాకలు తేరిన కవితా తరంగిణి - శ్రీ యార్లగడ్డ వారి ‘కాకతీయ తరంగిణి’.

డా. రామడుగు వేంకటేశ్వరశర్మ,
గుంటూరు, సెల్: 9866944287

జ్ఞానానికి ఆధ్యాత్మికతను జోడించిన
నాలో నేను

పుస్తక పరిచయం

అక్షరాన్ని తోడ్కొని జీవితాన్ని నడపడం, అక్షరం తోడుగా జీవనం గడపడం. రెండూ అరుదైనివే కాని మెరుగైనవి. వాటి ఊతంతో జీవితం అంతా ఆశావహం అవుతుంది. అలా ఆశావహం చేసుకొని జీవితాన్ని గడిపి అనుభవంతో సంపాదించిన జ్ఞానానికి ఆధ్యాత్మికతను జోడించి వివిధ విషయాల మీద సంగతుల మీద ఆకుండి రాధాకృష్ణమూర్తి కలం నుంచి వచ్చిన వ్యాస పరపర ‘నాలోనేను’.
ఆయన స్వవిషయాలు ఇవన్నీ. అంటే ఆయన అనుభవించి ఆయన ఎదుర్కొని ఆనందించి ఎరుక పరిచినవి. ఎందుకంటే మనసును జయించారు కనుక. మనసును నిజంగా జయించగలమా. ఆ ప్రశ్న మనకేకాదు మహాభారతంలో అర్జునుడికి వచ్చింది. అశాంతికి లోనై గింగిరాలు కొట్టేస్తుంది. అల్లకల్లోలం చేసేస్తుంది. భయంకరంగా క్షోభకు గురిచేసేస్తుంది మనసు. మరి దాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలో వివరించారు. అన్ని అంగాల్లానే మనసు కూడా ఇంద్రియమే. అయితే ఫలానాగా గుర్తించలేము రూపం లేదు కాబట్టి. కాని సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు. సముద్ర తరంగాలు అవి మనసులో పుట్టి మనసులోనే లీనమవుతాయి కాని సంకల్పాలు కార్యరూపం ధరిస్తే వికల్పాలు మాత్రం దానిలోనే లీనమైపోతాయని చక్కని వివరణ ఇచ్చారు. యమ నియమములు అభ్యాసిస్తే స్వాధీనపర్చుకోవడం వల్ల సులభమవుతుందంటారు. ‘మనసును జయించడం ఎలా?’ అనే శీర్షికలో. ఈ సువిశాల ప్రపంచంలో మనిషొకడు. అతని చుట్టూ ఆ మనుషులే. మరి వారి అవసరాల్లో ఈ మనిషి తన అవసరాల్లో ఆ మనషులు సహకరించుకుంటేనే సంఘం లేదా సమాజం. ఆనాటి సాంఘిక న్యాయం ఏమీ ఆశించకుండా సాయపడేది. ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మాల్ని స్వచ్ఛందంగా పాటించడం వల్ల మనుగడ మంచిగా వెళ్లింది. ఈనాడు డబ్బుతోనే ప్రధానం. ప్రతి పనికి డబ్బు ఆధారం అయిపోయింది. పరిస్థితులు మారిపోయాయి. ఖర్చుకు వెనుకాడని పరిస్థితులు తెచ్చేసుకున్నాం. మనిషి అవసరాన్ని గుర్తించకపోవడం వల్ల ఈ దుస్థితి. నలుగుర్ని మంచి చేసుకొని నాలుగు కాలాలు మేలు పొందటానికి పూర్వం ఆలోచించేవారు. మానవ జీవితం చిన్నది. మనిషి దిగులుకి నిరాశ నిస్పృహకు గురికాకుండా ఉండటానికి మనిషిలోని శక్తి, సాయం ఊరట లాంటి సద్వినియోగపరిచే వాటిని ‘ఆ నలుగురితోనూ’.. అంటూ చర్చించారు. ‘మాయ’ అనే విషయాన్ని మహాద్భుతంగా చెప్పారు. చాలా చిన్న కధలో తెలిసిన దానే్న సులభపరిచి తెలిపారు. జీవాత్మ పరమాత్మ కలయికను ఇద్దరి మిత్రుల స్నేహంలోకి మార్చి ‘మాయ’ ఎక్కడ ఆటంకపరుస్తుందో, ఎవరి ఆధీనంలో ఉంటుందో ‘దీని మర్మం తెలుసా మీకు?’లో తెలియజెప్పడం బావుంది.
తన ప్రారంభ వ్యాసంతోనే హత్తుకొనేలా రాసి మనల్ని మంత్రుముగ్ధుల్ని చేయటమేకాదు రచయిత వ్యాఖ్యలకు దాసోహమైపోతాం. పని ప్రారంభపు ఎత్తుగడకు ఈ వ్యాసం చక్కని ఉదాహరణ. త్రికరణ శుద్ధిగా తలపెడితే ఆ పని ఎంత సజావుగా పూర్తవుతుందో ప్రయోజనమవుతుందో వివరించిన వ్యాసం ‘శ్రీకృష్ణార్జునులు మన అంతరంగంలోనే’ అంటూ భగవద్గీతలోని కృష్ణార్జునుల్ని సంకల్పశక్తి క్రియాశక్తిగా అభివర్ణించి మంచి పోలికతో మన మనసులోకి గీత యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేశారు. మనలోని ఈ రెండు శక్తులు సంకల్ప, క్రియాశక్తులు ఏకమైతే మానవ సమాజం సర్వాంగ సుందరమన్నది రచయిత ఆశ. సంసారపు సైకాలజీని చాలా సరసంగా చెప్పారు. ఏళ్ల నాటి వైవాహిక అనుభవం. ఆచరణాత్మక అనుభవ పూర్వక సిద్ధాంతం బాగా ఆకట్టుకునే విషయం. అన్యోన్యత ఎంత రాణించి రసరమ్యత తెచ్చిందో ఆయన జీవన విధానం తెలుపుతుంది. అపేక్షపూర్వక అనుబంధం వారిది. ఇలా ఎందుకు ప్రస్తావించానంటే రచయిత రాధాకృష్ణమూర్తి సహచరి యెడబాటు వలన కలిగిన వెసులుబాటు ఈ అద్భుత రచనలకు అవకాశం ఇచ్చింది. ఆమె సాంగత్యంలో ఎనె్నన్ని ఆనంద సంతోషకర విషయాలు రసాత్మకం అయ్యాయో తెలుస్తుంది. పరిశీలనాత్మక దృష్టి నుంచి ఎంతో వివేచించి చెప్పిన మనోవిశే్లషణాత్మక వ్యాసం ‘ఆలుమగల సైకాలజీ’ శాస్త్రంగా ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు అన్వయించబడుతుందో చెప్పారు. ఆత్మ సంబంధ శాస్త్రం ఆప్యాయతానురాగాలు ఆత్మీయ బంధాలు ఎంత అవసరమో ఆలుమగలకు ఈవ్యాసం అంత అవసరం.
మనసు మీదే మనిషి ఆధారపడతాడు. ఇంద్రియాలన్నీ మనసు ఆధీనంలోనే ఉంటాయి. ఇంద్రియాలు కేవలం విషయ సేకరణకు పనిచేస్తాయి. అయితే దాని ద్వారా కలిగిన ఫలితాన్ని సుఖంగానో, దుఃఖంగానో అనుభవించేది మాత్రం మనసంటారు. మనసుకు తోచింది మనిషి చేసుకుంటూ పోతుంటే ఇబ్బందులుంటాయి. జ్ఞాన సముపార్జనతో జీవిత భవిష్యత్‌కు మార్గాన్ని నిర్దేశిస్తుంది. అయితే ఆ మనసు ఎక్కడుంటుంది? అది ఏం చేస్తాది అంటూ ప్రశ్నించి తర్కించి ఓ చక్కని ఉపకారాన్నిచ్చారు ‘ఎక్కడుందీ మనసు?’ వ్యాసంతో. మనసుకు పెత్తనం ఇస్తే? మనసుని కంట్రోల్ చేసి అదుపులో పెట్టే బుద్ధి అనే పరికరం ఒకటి ఉంటుందంటున్నారు. అదేమిటో తెలుసుకోవటానికి మరి తప్పక చదివితేనే కదా తెలుస్తుంది.
విద్య మీద ఓ చక్కని వ్యాసం ‘చదువంటే చదవడమేనా’ అని మన జీవితాల మీద వేసి చురక అది. నిజంగా ఏం చదువుకుంటున్నాం! జీవితాలు చదవడం లేదు. జీవన విధానాలు తెలుసుకోవడంలేదు. స్కూళ్లు, కాలేజీల్లో చదివే లౌకికమైన చదువులు నిజమైనవి కావంటారు. మానవతా విలువల్ని పెంచి పోషించేవే అసలు సిసలు చదువులంటారు. సరియైన విద్యకు క్రమబద్ధమైన సాధన, అలాగే నిరంతర కృషి, శ్రద్ధ, భక్తి అవసరమంటారు. సత్యమే దైవమంటారు. నిజంగా దృష్టిపెట్టాల్సిన విషయాలను చాలావాటిని స్పృజించారు. ఇంకా వీటిలో చాలా మంచి విషయాలు చెప్పే వ్యాసాలున్నాయి. జీవించటానికో స్ఫూర్తినిచ్చే పుస్తకం జీవన పద్ధతులు మెరుగుపర్చటానికి ఉద్దేశించిన జీవన సత్యమార్గాలు వీటిలో పుష్కలంగా ఉన్నాయి. భారతీయ తాత్వికతను, మన ఆధ్యాత్మికశక్తిని అనేక సంఘటనలతో, సంగతులతో మిళితం చేసి జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవాలో చెప్పారు. 73 వ్యాసాలతో సర్వాంగ సుందరంగా ‘రాధాకృష్ణుల’ ముఖచిత్రంతో తీర్చిదిద్దిన ఘనత డాక్టర్ చర్ల మృదుల గారికి దక్కుతుంది. భగవద్గీతను చదవలేని వారికి, మనల్ని మనం కనుగొనటానికి మనమెవరిమో తెలుసుకొనటానికి ఈ పుస్తకం దోహదపడుతుంది. శ్లోకాలు, అర్థాలు ప్రతి పదార్థాలుగా కాకుండా భగవత్ సారాన్ని వ్యాసాలుగా సులభ ‘గీత’గా అందించారు. పుస్తకం ముందుమాట ‘స్వగతం’లో చెప్పినట్టు విశ్రాంతి జీవితం ఉద్యోగ బాధ్యత నుంచి తెరిపినిస్తే ఆయన అధ్యాపక జీవితం విద్యార్థికే కాదు వినే శ్రోత నుంచి చదివే పాఠకుని వరకు ఎంత విషయ జ్ఞానం అవసరమో అంతవరకే అందించి సఫలీకృతం చేయడానికి తోడ్పడింది. ‘నాలో నేను’ శీర్షిక చాలా బాగుంది. అయితే ‘మనలో ఆయన’గా నిలిచిపోయిన రచన. ముందు నుంచి రచనా రంగంలోకి రాకపోవడం మన దురదృష్టకరం. ఆ లోటును సంపూర్ణం చేయటానికి మనలోని మరిన్ని ఉత్తమ గుణాలు ఆవాహనం చేయటానికి మరెన్నో మంచి రచనలు చేస్తారని ఆశిద్దాం. నూరేళ్లు ఆయుష్షు నింపుకొని నిండు నూరేళ్లు నిలిచే పుస్తకాలు రావాలని కోరదాం.

- రవికాంత్, సెల్: 9642489244

దేవుడు మామయ్య

‘దేవుడు మామయ్య వచ్చాడు రండర్రా’ కేకపెట్టింది భ్రమరాంబ.
పిట్టగోడ దగ్గర పక్కింటామెతో కబుర్లు చెపుతున్న పెద్దకోడలు సుమతి ‘మా అత్తగారి తమ్ముడు వచ్చాడు. సొంత తమ్ముడు కాదు, పిన్నికొడుకు. చాలా మంచివారు’ చెప్పింది.
‘ఆయన పేరు దేవుడా?’ అడిగింది ఆశ్చర్యంగా పక్కింటామె.
‘కాదు! నిజంగా ఆయన పేరేమిటో నాకు తెలియదు. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచీ ఈయన ఆరు నెలలకోసారి రావడం చూస్తున్నాను. మా అత్తగారి చేత, మాచేత తనకు ఇష్టమైనవన్నీ చేయించుకు తింటుంటారు. వెళ్లేటప్పుడు పిల్లల చేతుల్లో ఒక కొత్త రూపాయి నోటు పెడుతుంటాడు. కోటీశ్వరుడు. మరి అందుకే ఆయనకి అందరం కలిసి ‘పీనాసి మామయ్య’ అని పేరు పెట్టేశాం. అందరం చాటుగా తిట్టుకునేవాళ్లం’ చెప్పింది సుమతి.
‘కొనే్నళ్ల తరువాత మేము అద్దెకుండే ఈ ఇంటిని కొనేసి మా పేర రాయించాడు. అందరం ఆశ్చర్యపోయాం. ఆయన్ని తిట్టుకున్నందుకు పశ్చాత్తాపపడి కాళ్లమీద పడిపోయి క్షమాపణ కూడా చెప్పుకున్నారు మావారు, మా మరిది. అప్పట్లో 10 లక్షల రూపాయలకు కొన్న ఈ ఇల్లు ఖరీదు ఇప్పుడు కోటిన్నర. సొంత ఇల్లు వుంది కనుకనే ఇంటి అద్దె అంటూ ప్రతినెలా డబ్బు పొదుపు చేసి ఆడపిల్ల పెళ్లి చేశాం. ఈ నగరంలో సొంత ఇల్లంటే మాటలా? మా అబ్బాయికి భాష్యం స్కూల్లో 10వేలు జీతం అయినా ఈ ఇల్లు చూసే పిల్లనిచ్చామని మా వియ్యపురాలు మొన్న నవ్వుతూ అనేసింది కూడా.
అందుకే పిల్లలూ, పెద్దలూ అందరికీ ఆయన ‘దేవుడు మామయ్య’. మా పిల్లలు కూడా తాతయ్య అని ఒక్కరూ పిలవరు. ‘అందరికీ మామయ్యే’ అంది నవ్వుతూ.
‘మాక్కూడా ఇలాంటి మామయ్య ఒకరుంటే ఎంత బాగుండు. ప్రతినెలా 8వేలు అద్దె కట్టాల్సి వస్తున్నపుడు చాలా బాధపడతాం. కానీ ఈరోజుల్లో సొంత ఇల్లు కొనడమనేది ఒక కలే’ అంటూ నిట్టూర్చింది పక్కింటావిడ.
‘మీ ఆస్తి మేమే. మీ సుఖాలు త్యాగం చేసి మమ్మల్ని పెద్ద చదువులు చదివించారు. నాన్నగారు రిటైరవగానే మా దగ్గరకి వచ్చేయండి’ అని అబ్బాయన్నాడు. ‘ఓపిక వున్నంతవరకూ ఎవరి దగ్గరకీ వచ్చేది లేదు. మీ అమ్మ వంట కూడా చెయలేని రోజు వస్తామ’ని అన్నారాయన చెప్పింది.
హాల్లో దేవుడు మామయ్య చుట్టూ చేరి కబుర్లు చెపుతున్న ఆ కుటుంబ సభ్యులు అందరినీ చూస్తూ.. ‘కృష్ణవంశీ సినిమా చూస్తున్నట్లు వుంది’ అంది నవ్వుతూ.
‘నిజమే! వస్తాను. పెద్దకోడలేదీ? అని అడిగేస్తారు ఆయన’ అంటూ హడావుడిగా వెళుతున్న సుమతిని ముచ్చటగా చూసింది పక్కింటామె.
- పి వసంత, విజయవాడ.

ఇప్పుడు ‘ఆడపిల్లలు’ కాదు!

హితోక్తి

తల్లిదండ్రులు కొడుకులతో సమంగా కూతుళ్లని చదివిస్తున్నారు. పెళ్లికాగానే పెళ్లాంచాటు మొగుడుగా కొడుకు మారిపోతున్నాడు. భార్య అనుమతి లేకుంటే తల్లితో మట్లాడటానికి కూడా భయపడే స్థితి.
ఇక ఆడపిల్ల మంచి ఉద్యోగం సంపాదించి తన ఉన్నతికి కారణమైన తల్లిదండ్రులను గౌరవంగా చూసుకుంటోంది. దానికి అంగీకరించని భర్తనైనా వదుకోడానికి సిద్ధపడుతోంది. ‘్భర్యాభర్తలు సమానం. కానీ భర్త కొద్దిగా ఎక్కువ’.. అని ముళ్లపూడి వారు అన్నట్లు ‘ఆస్తి సమంగా ఇవ్వకుండా వాడికిచ్చిన దానిలో సగమే నాకిచ్చారు. సమంగా ఇస్తేనే బాధ్యత తీసుకుంటా. లేకుంటే మీ బాధ్యత నాకులేదు’! అంటూ ఇంటివారమ్మాయి అరుపులు. ఆడపిల్లలకి గిరాకీ పెరిగాక పెళ్లి చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. నాకంటే రెండు లేక నాలుగేళ్లు పెద్దవాడైతే సరే ఏడెనిదిదేళ్ల పెద్దవాడిని నేను చేసుకోనంటోంది. చెల్లి పెళ్లి చేసేసరికి అన్నకి మూడు పదులు దాటడం, నచ్చిన పిల్లని కోడలిగా చేసుకోవాలనే అత్తల ఆరాటంతో కొడుకు వయసు పెరిగిపోవడంతో ఎక్కడ చూసినా పెళ్లికాని ప్రసాదులే.
అబ్బాయిలు అయోమయంలో పడిపోతున్నారు. ‘ఇన్నాళ్లూ వరకట్నం కావాలని వాళ్లని ఏడిపించాం. దానికిప్పుడు వాళ్లు పగ తీర్చుకుంటున్నారు!’ అని అబ్బాయిల గోల. ఇప్పుడు యువతరం అభిప్రాయాలు త్వరత్వరగా మారిపోతున్నాయి. వాళ్ల పెళ్లి విషయంలో స్వేచ్ఛ ఇవ్వండి వారికి. ‘మన సంప్రదాయం కాదనీ, అటేడు తరాలు.. ఇటేడు తరాలు’ అనీ విసిగించకండి.
చిన్న జీతగాడైనా సొంత ఇల్లు వున్న వారిని పెళ్లి చేసుకోడానికి వెనుకాడకండి. ఎందుకంటే ఇప్పుడు ఇంటి అద్దెకి జీతంలో నాలుగోవంతు కావాలి. సొంత ఇల్లు కావాలనుకునే వారు సర్వీసు మొత్తం జీతంలో కటింగ్ చేస్తే తప్ప ఇల్లు అమరని పరిస్థితి. తమ అవసరాలు తగ్గించుకుని డబ్బు వెనకేసి కొడుక్కి ఇల్లు అమర్చినా పెళ్లాయాక కొడుకులే కృతజ్ఞత తగ్గి ‘నీ వయసు వారితో ఆశ్రమంలో హాయిగా గడపు’ అని అంటున్నాడు. మనవలు, మనవరాళ్లతో హాయిగా కబుర్లు చెపుతూ చరమాంకం గడపాలనుకునే సీనియర్ సిటిజన్లు కొడుకుల మాటలకి వేదన చెంది ‘ఇలాంటి వారి కోసమా మనం అన్ని త్యాగాలు చేసి ఇల్లు కొన్నది’ అని వాపోతున్నారు. పెళ్లి శుభలేఖల్లో చివర ‘మీ ఆగమనాభిలాషులు’ అంటూ తల్లిదండ్రుల పేరేసేవారు. ఇప్పుడులా చేయడంలేదు. ఇక కొడుకులైతే ప్రేమించి పెళ్ళాడుతూ ‘మా పెళ్లికి రండి’ అంటూ శుభలేఖల్లో వాళ్ల పేర్లే తప్ప తల్లిదండ్రుల పేర్లు వేయడం లేదు కొందరు. మన సంప్రదాయం ప్రకారం తాతలు, పెదనాన్నలు, బాబాయిలూ, పిన్నులు అందరి పేర్లు చివర వేయించి వారిని గౌరవించి, ఆనందంగా వారి దీవెనలు అందుకోవాలి. ఈ సంప్రదాయాన్ని విడువకండి. ‘పెద్దల ఆశీస్సులే రక్ష’ అని గుర్తుంచుకుంటారు కదూ!

- లోకపావని, విజయవాడ.

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007.

email: merupuvj@andhrabhoomi.net