విజయవాడ

సామాజిక స్పృహ ధార ‘యశోధర’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక యుగంలో బహుళ జనాదరణ పొందిన ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగు సాహిత్యంలోకి వచ్చిన వాంజ్మయ ప్రక్రియ ‘నవల’. సాంఘిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని అనేక మంది నవలా రచయితలు మంచి నవలల్ని రాశారు. సాంఘిక నవలల తర్వాత ప్రముఖ స్థానాన్ని ఆక్రమించినవి చారిత్రాత్మక నవలలు. చరిత్రను ఆధారంగా చేసుకొని వచ్చినవే ఈ నవలలు. వీటిలో ఊహకి చోటులేదు, సత్యానికే చోటు. ఈ కోవకు చెందిన చారిత్రాత్మక నవలే ‘యశోధర’.
ఈ నవలను 2006లో అక్టోబరు 14న తొలిసారి ఆవిష్కరించారు. యశోధరకు సంబంధించిన చరిత్ర ఇప్పటివరకు పూర్తిస్థాయిలో లేకపోవటంతో ఆ లోటును భర్తీచేయటానికా అన్నట్లు యశోధర చరిత్రను తవ్వితీసి, ఒక చారిత్రాత్మక నవలగా అందించారు డా. గూటం స్వామి. యశోధర చరిత్రను నవలగా రూపొందించటంలో డా. స్వామి ముందుచూపు ప్రశంసనీయం. ఆయన కృషికి తార్కాణంగా కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారం (2014) పొంది రూ.10వేలు నగదు బహుమతి అందుకొని చరిత్ర సృష్టించింది ‘యశోధర’.
యశోధరను ప్రధాన పాత్రగా చేసుకొని రాసిన నవల ఇది. ప్రతి పురుషుని అభివృద్ధి వెనుక ఒక స్ర్తిమూర్తి త్యాగం ఉంటుందనేది జగద్విదితమే. సిద్ధార్థుడు పరివ్రాజకుడై, జ్ఞానోదయుడై, అఖండ విశ్వానికి జ్ఞానసూర్యుడిగా వెలుగొందటానికి అర్ధాంగిగా యశోధర సహకారం, త్యాగం అసాధారణమైనవి.
శాక్యవంశీయుడైన దండపాణి ముద్దుల తనయ యశోధర, స్వయంవరంలో సిద్ధార్థుని భర్తగా పొంది, జీవితం ఆనందంగా సాగుతున్న దశలో సిద్ధార్థుడు వరివ్రాజం స్వీకరించాలని నిర్ణయించుకున్న విషయం తెలుసుకుని, నిరుత్సాహ పడకుండా సర్వమానవాళి సౌభాగ్యాన్ని, సమాజ సంక్షేమాన్ని ఆశించి, భర్తకు తన నమ్మతిని తెలిపిన వీరపత్ని, ధీరవనిత.
సిద్ధార్థుని నిష్క్రమణం తర్వాత మానవ సహజమైన దుఃఖాన్ని దిగమింగి, అతని గుణగుణాలను గుర్తు చేసుకుంటూ చివరికి బుద్ధుని బోధనల ప్రభావంతో మహిళా వరివ్రాజికయై సిద్ధిపొందింది. సిద్ధార్థుని అర్ధాంగిగా, బుద్ధుని అంతేవాసిగా జీవించిన మహోన్నత త్యాగశీలి యశోధర మహిళాలోకానికే ఆదర్శనీయురాలు. బౌద్ధ జగత్తులోనే ఆదర్శ భిక్షుణిగా జీవనం సాగించిన యశోధర త్యాగనిరతిని పఠనీయంగా అక్షరబద్ధం చేశారు డా. గూటం స్వామి.
నవల సామాజిక చైతన్యం కలిగించేదిగా ఉండాలనేది జగమెరిగిన సత్యం. ఈ నవలలో కొన్ని సామాజికాంశాలను కవి స్పృశించారు. వివాహ వయస్సు వచ్చింది, వివాహం చేయాలన్న తన తండ్రితో యశోధర ‘నాకింకా బాల్యాన్ని అనుభవించాలని, తండ్రిచాటు బిడ్డగా జీవించాలని ఉంది. వివాహం చేసుకొని మిమ్ముల్ని విడిచి వెళ్లిపోతే మీ ఆలనాపాలనా ఎవరు చూస్తారు? మీ సేవ చేసుకునే భాగ్యం కొనే్నళ్లైనా దయచేయమ’ని ఒక కుమార్తెగా తన ధర్మాన్ని నిర్వర్తించింది. అలాగే భర్త పట్ల, అత్తమామల పట్ల, చివరికి కుమారుని పట్ల కూడా తన ధర్మాన్ని బాధ్యతనెరిగి సక్రమంగా నిర్వర్తించింది.
‘్భగవాన్! ఉదాత్తమైన ధర్మానందాన్ని అందించినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జీవన సాగరాన్ని మీద్వారా అధిగమించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు డెబ్బది ఎనిమిది సంవత్సరాలు వచ్చాయి. ఈ కట్టెను వదలి కన్నుమూద్దామని ఉంది’ అని అంటూ భర్త అనుమతి కోరి తనువు చాలించింది యశోధర.
ఎంతటివారైనా కూతురుని ఒక అయ్యచేతిలో పెట్టడం లోక సహజం. ‘అది సృష్టి ధర్మమని, ఆ ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తించటం తప్పేకాదు, నేరమవుతుందని, చక్కని వరుణ్ణి వెదికి వివాహం చేస్తానని’ యశోధర తండ్రి తన ధర్మాన్ని తనూ సక్రమంగా నిర్వర్తించాడు. తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ- ఈ అయిదుగురినీ ఎవరైతే పూజిస్తారో వారే ఈ భూమీద ధర్మాత్ములని, తండ్రి మాట శిరసా వహించమని సిద్ధార్థునితో పెంచిన తల్లియైన ‘ప్రజాపతి’ చెప్పి తన ధర్మాన్ని నిర్వర్తించింది.
పార్థసారథియైన ‘చెన్నుడు’ విలువిద్యా ప్రదర్శన నుండి వెనుతిరిగి వెళతానన్న సిద్ధార్థునితో ‘యుద్ధంలో వెన్నుచూపని వాడే ధీరుడని, జరగవలసిన కార్యం మధ్యలో ఆపివేయడం మీ వంశానికి మాయని మచ్చని, ఇలాంటి పుత్రుని ఎందుకు కన్నామా? అని తల్లీ, తండ్రీ క్షోభిస్తారని, అంతా గేలిచేస్తారని చెప్పి తన ధర్మాన్ని నిర్వర్తించాడు. రథసారథి పట్ల తల్లిదండ్రుల పట్ల భార్య, పిల్లవాడు, ప్రజల పట్ల సిద్ధార్థుడు తన ధర్మాన్ని నిర్వర్తించి చరిత్రకెక్కాడు.
దొరికిన దానితోనే తృప్తి పడటం, దానిపైనే ఇష్టాన్ని చూపటం మంచిదనే విషయం సిద్ధార్థుని ద్వారా చెప్పిస్తాడు రచయిత. ‘మనం తినటం కోసం బ్రతుకుతున్నామా! బ్రతకడం కోసం తింటున్నామా?’ అని సిద్ధార్థుడు యశోధరను ప్రశ్నించినప్పుడు.. ‘తినటం కోసం బ్రతకటంలో స్వార్థం ఉంది. బ్రతకటం కోసం తినటంలో త్యాగం ఉంది. స్వార్థం, త్యాగం రెండూ భిన్నధృవాలు. మనిషి త్యాగాన్ని కోరుకోవాలి. స్వార్థం విడిచి పెట్టాలి’ అని బదులిస్తుంది. దుఃఖం అజ్ఞానం వల్ల కలుగుతుందని, దుఃఖాన్ని ఉపసంహరించుకొని ధర్మదీక్షా మార్గంలో పయనించమని తన తల్లికి ఉద్బోధ చేస్తాడు బుద్ధుడైన సిద్ధార్థుడు. ‘స్వప్నాల నుండి విముక్తుడవై, సత్యమార్గానే్వషివై, శక్తిమంతుడవై, ధర్మపథాన్ని అనుసరించినట్లైతే శాశ్వతానందాన్ని పొందగలవ’ని తన తండ్రికి హితబోధ చేస్తాడు బుద్ధుడు. బల్లి వచ్చి పుట్టలోని పురుగును మింగటం, పామువచ్చి బల్లిని మింగటం, డేగ పాముని ఎగరేసుకుపోయే దృశ్యాలను చూసిన సిద్ధార్థుడు సకల ప్రాణాలకూ ఏదో ఒక దుఃఖం, భయం అవరించివున్నట్లే బలవంతులు బలహీనుని పీక్కుతింటున్నారని గ్రహించాడు.
‘పుట్టటం, చావటం చాలా భయానకమైనవి. దాన్నుంచి తప్పించుకునే మార్గం కోసమే నా అనే్వషణ, ఆందోళన’ అని చెబుతాడు బుద్ధుడైన సిద్ధార్థుడు. జీవులను హింసించరాదని ఈ నవల ద్వారా మనకు తెలుస్తుంది. నోరున్న జీవులకే కాదు, నోరులేని మూగజీవాలకు రక్షణ కల్పించాలన్న సిద్ధార్థుని అభిప్రాయంతో యశోధర ఏకీభవిస్తుంది. ‘చంపేవాడిని చంపేవాడు ఇంకొకడు ఉంటాడని, విజేతనూ జయించేవాడు ఇంకొకడు ఉంటాడని, దోచుకొనేవాడిని ఇంకొకడు దోచుకుంటాడ’ని శాక్య సంఘాన్ని ధిక్కరించి సిద్ధార్థుడు శాంతిని కోరాడు. హింసని వ్యతిరేకించి దేశ బహిష్కరణను కోరుకున్నాడు. ‘ప్రజల దుఃఖాలను రూపుమాపడం కోసం అందరూ కృషి చేయాలని, మీ దుఃఖాన్ని తీర్చటానికే సన్యసిస్తున్నానని, బాధలూ, దుఃఖాల నుండి విముక్తి పొందటానికి తాను ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నానని, ప్రతిజ్ఞ పూనానని’ తన తల్లికి, భార్యకు, ప్రజలకు తెలియజేసి నమ్మిన సిద్ధాంతానే్న కడవరకూ ఆచరించి చూపి ఆదర్శంగా నిలిచిన కారణజన్ముడు బుద్ధుడుగా మారిన సిద్ధార్థుడు. బుద్ధుని కరుణరస పూరితమైన చరిత్రను ఎంతోమంది కవులు కావ్యాలుగా రాశారు. తల్లిదండ్రులను ప్రేమించే ప్రేమమూర్తిగా, అత్తమామల పట్ల ఆదరణ - కర్తవ్య నిర్వహణ చేసి, భర్త అడుగుజాడల్లో జీవితాంతం వరకూ నడిచిన భార్యగా, కుమారునికి మంచి తల్లిగా తన జన్మను చరితార్థం చేసుకున్న యశోధర హృదయాన్నీ, జీవితాన్నీ వెలికితీయాలని రచయిత చేసిన ప్రయత్నం, అతనికున్న సామాజిక స్పృహ అనిర్వచనీయం. ఇలాంటి చారిత్రాత్మక నవలను రచించిన డా. గూటం స్వామి జన్మ ధన్యం.
బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
email: merupuvj@andhrabhoomi.net

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

- డా. చుక్కా యశోద, విజయవాడ. చరవాణి : 9440850447