విజయవాడ

విశ్వాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోజు ఆదివారం కావడంతో పార్కు అంతా పిల్లల కేరింతలు, ఆటపాటలతో ఎంతో సందడిగా ఉంది. తండ్రితో కలిసి పార్కుకు వచ్చిన రాజేష్ తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఆటల్లో పిల్లలకు సమయం తెలియదు కదా! సాయంత్రం ఆరు గంటలు దాటింది. ఆడి ఆడీ అలసిపోయిన రాజేష్ తండ్రి దగ్గరకు వచ్చి ‘నాన్నా..! ఆట అయిపోయింది, ఇక ఇంటికి పోదామా?’ అన్నాడు.
‘సరే! పద’ అంటూ కొడుకుతో సహా స్కూటర్ దగ్గరకు చేరుకున్నాడు శేఖర్. పార్కు ఇంటికి దగ్గరే అయినా కొడుకును స్కూటర్‌పైనే తీసుకొచ్చాడు. వాళ్లిద్దరూ స్కూటర్ దగ్గరకు చేరేసరికి చిన్న కుక్కపిల్ల ఒకటి దాని చుట్టూ తిరుగుతూ, అక్కడే తచ్చాడుతోంది. అది చూడటానికి తెల్లగా, ముద్దుగా ఉంది. దాన్ని చూసిన రాజేష్ ఆనందానికి అవధుల్లేవు. ఎందుకంటే రాజేష్‌కు కుక్కపిల్లలంటే చాలా ఇష్టం. దాన్ని చూస్తూనే ‘నాన్నా! నాన్నా..! ఈ కుక్కపిల్లని మనం ఇంటికి తీసుకుపోదాం. ఎంత ముద్దుగా ఉన్నదోకదా!’ అన్నాడు.
‘తప్పురా! అది చాలా చిన్నపిల్ల. వాళ్లమ్మ నుంచి దూరంగా తీసుకుపోతే ఉంటుందా? చెప్పు! అమ్మను వదిలిపెట్టి నువ్వుంటావా?’ వద్దంటూ సున్నితంగా చెప్పాడు శేఖర్.
‘అమ్మో! నేనుండలేను’ అన్నాడు రాజేష్.
‘మరయితే అదికూడా అంతే కదా!’ అన్నాడు శేఖర్.
‘సరే!’ అంటూ దానికి తన దగ్గరున్న రెండు బిస్కెట్లు పెట్టాడు రాజేష్. ఆ కుక్కపిల్ల వాటిని గబగబా తినేసింది. అది చూసిన రాజేష్ ఆనందంతో దానికి మరో రెండు బిస్కట్లు పెట్టి తండ్రితో కలిసి ఇంటికి చేరాడు.
తీరా ఇంటిదగ్గర స్కూటర్ దిగేసరికి వాళ్లకు కనబడేంత దూరంలో కుక్కపిల్ల పరిగెత్తుకొస్తూ కనిపించింది. దాన్ని చూసిన రాజేష్ ఆనందం పట్టలేక ‘నాన్నా.. అదిగో! అటు చూడు. ఆ కుక్కపిల్ల మనతో వచ్చేసింది’ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి, దాన్ని రెండు చేతులతో ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొచ్చాడు.
వాళ్లు రావడం చూసిన రాధ రాజేష్ చేతుల్లోని కుక్కపిల్లను చూసింది. ‘దీన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు’ అడిగింది కొడుకుని.
రాజేష్ పార్క్ దగ్గరి జరిగిందంతా తల్లికి చెప్పాడు.
‘పాపం! దానికి ఎవ్వరూ లేరమ్మా. మా వెనకాలే అది మనింటికి వచ్చేసింది. దీన్ని మనం పెంచుకుందామమ్మా!’ అని గోముగా అడిగాడు.
‘సరే కానీ!.. వద్దన్నా నువ్వు వినవుగా’ అన్నది రాధ.
తల్లి ఒప్పుకోవటంతో రాజేష్‌కు ఎక్కడలేని సంతోషం అనిపించింది.
ఆరోజు నుంచి వాడికి దానితోడిదే లోకం అయింది. దానికి ‘ప్రిన్స్’ అని పేరు పెట్టాడు. స్కూలుకు వెళ్లే సమయం తప్ప ఆ కుక్కపిల్లతోనే ఆటా, పాటా.. అన్నీ. ప్రిన్స్ కూడా రాజేష్ ఇంట్లో ఉంటే క్షణం వదిలిపెట్టేది కాదు.
రాజేష్ స్కూలుకు వెళ్లేటప్పుడు అది గేటుదాకా రావాల్సిందే. మళ్లీ స్కూలు నుండి వచ్చేటప్పటికి సాయంత్రానికి గేటు దగ్గరే ఎదురుచూస్తూ ఉండేది. రాజేష్ రాగానే కాళ్లకు చుట్టుకుని ‘కుయ్యో.. కుయ్యో’మంటూ వాడి చుట్టూ తిరిగి గోలచేసేది.
రాజేష్ కూడా దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. తనతో పాటు బిస్కెట్లు, పాలు, అన్నింటిలో దానికి వాటా ఇచ్చేవాడు. దానితోనే ఆడుకునేవాడు. అదికూడా రాజేష్‌ను క్షణం కూడా వదిలేది కాదు. రాజేష్ గదిలోనే ఒక మూలన పడుకునేది. రాజేష్ చిన్ని ప్రపంచంలో ఆ కుక్కపిల్ల విడదీయరాని నేస్తమయింది.
ఇలా కాలం గడుస్తుండగా ఒకరోజు స్కూల్లో ఆడుకుంటూ రాజేష్ కిందపడ్డాడు. ఒళ్లంతా మట్టి. మోచేతులు, మోకాళ్లు కొట్టుకుపోయి నెత్తుటి చారికలతో ఇంటికి వచ్చాడు.
అలా వచ్చిన రాజేష్‌ను చూసి రాధ చాలా కంగారుపడిపోయింది. జరిగిన విషయాన్ని ఆతృతగా కొడుకు ద్వారా తెలుసుకుంది. జరిగినదానికి చాలా బాధపడింది.
రాజేష్ అలా రావటానికి కారణం తెలియని ప్రిన్స్, ఏమి జరిగిందో అర్థంకాక అతని చుట్టూ తిరుగుతూ పదేపదే అరవసాగింది. దానికళ్ల వెంట నీళ్లు కారుతున్నాయి.
ఆరోజు సాయంకాలానికి రాజేష్‌కు ఒళ్లు వెచ్చబడింది. శేఖర్, రాధ పిల్లవాడిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు.
డాక్టర్ పరీక్షించి మందులిచ్చారు. రెండు రోజుల్లో జ్వరం తగ్గుతుంది, విశ్రాంతి అవసరమని అన్నారు.
వాళ్లు ఇంటికి వచ్చేటప్పటికి ప్రిన్స్ గుమ్మంలోనే ఉంది. రాగానే వాళ్ల చుట్టూ తిరుగుతూ అరవసాగింది. రాజేష్ చేతుల్లోకి తీసుకోగానే అరుపులు మానేసి ఒద్దికగా కూచుంది.
రాజేష్‌కి ఆరోజు వచ్చిన జ్వరం రెండు రోజులదాకా తగ్గలేదు. ఆ రెండు రోజులు ప్రిన్స్ తిండి కూడా మానేసి రాజేష్ మంచం పక్కనే కదలకుండా కూర్చుంది.
మూడోరోజుకు జ్వరం తగ్గిన రాజేష్ మంచం మీద నుంచి లేచి టిఫిన్ తిని, పాలు తాగాడు. తరువాత ప్రిన్స్‌కు పాలుపోశాడు. తోకాడించుకుంటూ వచ్చి పాలు తాగిన ప్రిన్స్ ఇల్లంతా ఆనందంతో గంతులు వేసింది.
దాని పరుగులు, సంబరం చూసిన రాధ, శేఖర్ కూడా ఎంతో సంతోషించారు.
మళ్లీ రాజేష్, ప్రిన్స్ పూర్వంలాగానే ఇల్లంతా సందడి చేస్తున్నారు. వాళ్ల ఆటపాటలతో ఇల్లంతా గంతులేస్తున్నారు.
ఒకరోజు రాత్రి రాజేష్ తండ్రి దగ్గర పడుకున్నాడు. శేఖర్ అతనితో ఏవో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ ‘రాజేష్.. చూశావా! నీకు జ్వరం వచ్చిన రెండు రోజులు ప్రిన్స్ కూడా ఏమీ తినలేదు పాపం. దిగులుగా నీ మంచం పక్కనే కూచుంది. నీకు జ్వరం తగ్గి నువు లేవంగానే దాని ఉత్సాహం రెట్టింపయ్యింది కదూ!’ అన్నాడు.
‘అవును నాన్నా!’ అన్నాడు రాజేష్.
ఆరోజు నువ్వు పార్కులో దానికి రెండు బిస్కెట్లు పెట్టి ఆకలి తీర్చావు. దానితో అది నీ వెంట మనింటికి వచ్చి మనతో కలిసిపోయింది. నీ పట్ల ఎంత స్నేహంగా ఉంటోందో చూడు!’ అన్నాడు శేఖర్.
‘అవును’ అన్నాడు రాజేష్.
నీకు బాగోలేక నువ్వు తినకపోతే అది నీతోపాటు పస్తుంది. ఎవరైనా మనకు హాని చెయ్యబోయినా మనల్ని రక్షిస్తోంది. అందుకే కుక్క విశ్వాసం కలిగిన జంతువని అంటారు. కుక్కకున్న విశ్వాసం సృష్టిలో ఏ జీవికీ లేదని పెద్దలంటారు’ చెప్పాడు శేఖర్.
‘నిజమే నాన్నా! మనం కూడా మనకు సాయపడిన వారిపట్ల స్నేహభావంతో మెలగటంతోనే మన గొప్పతనం తెలుస్తుంది కదా!’.. ఒక ఆదర్శమేదో అర్థమైనవాడిలా సమాధానమిచ్చాడు రాజేష్.

డా.మైలవరపు లలితకుమారి, గుంటూరు. చరవాణి: 99595 10422