విజయవాడ

కుబేరుడి గర్వభంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణపతి శివపార్వతుల కొడుకు. ఆ విషయం మనందరికీ తెలుసు కదా! పొట్టిగా ఏనుగు తలతో, పెద్దపెద్ద చెవులతో బొద్దుగా, ముద్దుగా ఉంటాడు. ఒకరోజు గణపతి తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. అతనికి ఉన్న రెండు దంతాల్లో ఒకటి విరిగిపోయింది. కోపం వచ్చి ఆటలు ఆపేసి ఇంటికి వచ్చేశాడు. మిగిలినవాళ్లు కూడా ఆడటం ఆపేశారు. గణపతికి రుచిగా ఉండే ఆహారం తినాలనిపించింది. స్నేహితులు అతనికి రకరకాల పిండివంటలు, పండ్లు తీసుకొచ్చి పెట్టారు. గణపతి అవి తనకి చాలవని, ఇంకా కావాలని పేచీ పెట్టాడు. స్నేహితులు మాత్రం అంతకంటే ఏం చెయ్యగలరు?
అన్ని లోకాల్లోకి పేద్ద ధనవంతుడు కుబేరుడు. అతడికి ఎంత సంపద ఉందో ఎవరికీ తెలియనంత గొప్ప ధనవంతుడు. తనతో సమానమైన ధనవంతుడు ఇంకెవరూ లేరని గర్వపడుతూ ఉండేవాడు. అందరూ తన దగ్గరికి వచ్చి తమకు కావలసినవి అడిగి తీసుకెళ్లాలని అనుకునేవాడు. రాజులు, పెద్ద ధనవంతులు కూడా అప్పుడప్పుడు కుబేరుడి దగ్గరికి సహాయం కోసం వెళ్లేవారు. అలా వచ్చేవాళ్లకి కుబేరుడు తప్పకుండా సహాయపడేవాడు. కుబేరుడు తన దగ్గరున్న సంపదని దాచుకోకుండా మంచి పనుల కోసం ఖర్చుపెట్టేవాడు. పెద్దపెద్ద దేవాలయాలు, భవంతులు కట్టించేవాడు. ఉత్సవాలు నిర్వహించి సంతర్పణలు చేసేవాడు. రాజులకి, గొప్పవాళ్లకి తగిన బహుమతులు ఇచ్చేవాడు. పేదవాళ్లకి సహాయపడేవాడు. ఎన్ని రకాలుగా ఖర్చుపెట్టినా అతడి సంపద పెరుగుతూనే ఉండేది. ఇంకా ఎలా ఖర్చుపెట్టాలా? అని ఆలోచించి చివరికి దేవుళ్లని భోజననానికి పిలుద్దామనుకున్నాడు. తను చాలా గొప్ప ధనవంతుడని అందరికీ తెలియాలన్నది అతడి కోరిక.
కుబేరుడికి ఇష్టమైన దేవుడు శివుడు. ఆయన ఇచ్చిన వరం వల్లే కుబేరుడు అంత ధనవంతుడయ్యాడు. అందుకని కుబేరుడు శివుణ్ణి, అతడి కుటుంబాన్ని భోజనానికి పిలవాలని అనుకున్నాడు.
ఒకరోజు కైలాసం వెళ్లి శివుణ్ణి పూజించి ‘పరమేశ్వరా! నువ్వు నాకు ఇచ్చిన సంపదలకి కృతజ్ఞుణ్ణి. ఇప్పుడు నేను అందరికంటే ధనవంతుణ్ణి. నేను ధనవంతులకి, పేదవాళ్లకి అందరికీ సహాయం చేశాను. ఇప్పుడు అందరూ ననే్న పొగుడుతున్నారు’ అంటూ విన్నవించాడు.
కుబేరుడు చెప్పిందంతా విని శివుడు ‘చాలా బాగుంది. నేను కూడా ఇదంతా విన్నాను. సరే! ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావో అదికూడా చెప్పు’ అన్నాడు. కుబేరుడు ‘దేవా! నేను నిన్ను, నీ కుటుంబాన్ని, నీ స్నేహితుల్ని మా ఇంటికి భోజనానికి రమ్మని పిలుద్దామని వచ్చాను. నేను లోకంలో ఉన్న ముఖ్యులందర్నీ పిలుస్తున్నాను. వాళ్లందరూ నిన్ను కలుసుకుని, సత్కరిద్దామని అనుకుంటున్నారు’. అన్నాడు. శివుడు చిరునవ్వు నవ్వి ‘నాకు రావడానికి వీలుపడదు. నేను రాకుండా నా భార్య వస్తుందని నేననుకోను. పిల్లలు వాళ్ల అమ్మ లేకుండా ఎక్కడికీ రారు’ అన్నాడు. కుబేరుడు చాలా నిరుత్సాహపడ్డాడు. శివుడి కాళ్లమీద పడ్డాడు. ‘దేవా! నువ్వు రాకపోతే మిగిలన వాళ్లు నా గురించి ఏమనుకుంటారు? నేను నిన్ను పిలవడానికి ఇక్కడికి వస్తున్నానని అందరికీ చెప్పి వచ్చాను. నేను నిన్ను ఏదడిగినా నువ్వు కాదనవని అనుకుంటున్నారు’ అన్నాడు. ‘నేను నీకు వేరే మార్గం చెప్తాను. నా కొడుకు గణపతిని నీ ఇంటికి భోజనానికి పంపిస్తాను’ అన్నాడు శివుడు. అందుకు కుబేరుడు ఒప్పుకున్నాడు. తన ఇంటిలో భోజనం పెట్టడానికి ఒక రోజుని నిర్ణయించుకుని గణపతికి చెప్పి ఇంటికి తిరిగి వచ్చాడు.
కుబేరుడు ప్రపంచంలో ఎప్పుడూ, ఎక్కడా జరగని విధంగా సంతర్పణ ఏర్పాటు చేశాడు. పెద్ద భోజనశాల కట్టించాడు. కొత్తగా పెద్ద వంటగదులు ఏర్పరిచాడు. వెండి గినె్నలు, బంగారంతో కంచాలు చేయించాడు. పదార్థాలన్నీ ప్రత్యేకంగా, రుచిగా ఉండేలా వండించడం కోసం అన్నిరకాల ఆహార పదార్థాలు తెప్పించి సామానుల గదిలో పెట్టించాడు. వందలకొద్ది వంటవాళ్లని, పనివాళ్లని పెట్టాడు. కుబేరుడు రాజుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని, గొప్ప ధనవంతుల్ని, వారి స్నేహితుల్ని, ఇంకా ప్రపపంచంలో ఉన్న ముఖ్యులైన ఎంతోమందిని భోజనానికి ఆహ్వానించాడు. సంతర్పణ రోజు రానేవచ్చింది. ఆహ్వానం అందుకున్న వారు ఒక్కొక్కరే రావడం మొదలుపెట్టారు. రాజులు, రాణులు, రాజకుమారులు, రాజకుమార్తెలు రంగురంగుల దుస్తులు, విలువైన ఆభరణాలు ధరించి వచ్చారు. కుబేరుడు అందర్నీ లోపలికి ఆహ్వానించి వారికోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి గదులు చూపించాడు. ఆరోజు కుబేరుడు, అతడి కుటుంబ సభ్యులు కూడా అందరికన్నా విలువైన దుస్తులు, ఆభరణాలు ధరించారు. వాళ్లంతా గణపతి కోసం ఎదురు చూస్తున్నారు. గణపతి కూడా తనకి చెప్పిన సమయానికి వచ్చేశాడు.
కుబేరుడు తన ఇంటికి భోజనానికి వచ్చిన గణపతిని గౌరవంగా, వినయంగా, ఆత్మీయతతోను ఆహ్వానించాడు. వచ్చిన అతిథుల్ని ఒక్కొక్కర్నీ గణపతికి పరిచయం చేద్దామనుకున్నాడు. కానీ, తనకి చాలా ఆకలిగా ఉందని, మొదట భోజనం పెట్టమని గణపతి కోరాడు. కుబేరుడు గణపతిని ఎక్కువ కాంతినిచ్చే చిన్నచిన్న దీపాలతో, తియ్యటి సువాసనలతో, మంద్రస్థాయిలో వినిపించే సంగీతంతో, అందంగా పర్చిన తివాచీతో, కమ్మటి నేతి వాసనలతో రుచిగా వండి పెట్టిన వెండి, బంగారు పాత్రలతో, రకరకాల మగ్గిన తాజా పండ్లతో నిండి ఉన్న అందంగా అలంకరించిన భోజనశాలకి తీసుకొచ్చాడు. గణపతి కింద కూర్చుని తినడం మొదలుపెట్టాడు. బాగా ఆకలిగా ఉన్నాడేమో.. తనకోసం పెట్టిన ఆహారాన్ని మొత్తాన్ని తినేశాడు. పళ్లాలన్నీ మళ్లీ నింపారు. వెంటనే మళ్లీ అంతా ఖాళీ చేసేశాడు. మళ్లీమళ్లీ గినె్నల్ని నింపుతూనే ఉన్నారు. గణపతి ఖాళీ చేస్తూనే ఉన్నాడు. పెట్టినదాన్ని పెట్టినట్టు గణపతి తినేస్తూనే ఉన్నాడు. అంతే వేగంగా సేవకులు వడ్డిస్తూనే ఉన్నారు. కుబేరుడు సేవకుల్ని త్వరగా వడ్డించమన్నాడు.
సేవకులు వంటగదికి, భోజనశాలకి మధ్య పరుగులు పెడుతూ ఇంకా ఇంకా తెచ్చి అక్కడ పెడుతున్నారు. ఖాళీ అయిన గినె్నల్ని అంతకంటే వేగంగా తీసేస్తున్నారు. వాళ్లు ఎంత తెచ్చిపెట్టినా గణపతికి ఆకలి తీరలేదు. వేల మంది కోసం తయారుచేసిన ఆహారమంతా అయిపోయింది. కానీ గణపతి ఇంకా పెట్టమని అడుగుతున్నాడు. కుబేరుడు ఇంకా వంటలు చెయ్యమని సేవకులను ఆజ్ఞాపించాడు. గణపతి లేచి నిలబడి ‘వండి పెట్టేదాకా ఆగలేనని, తనకి ఆకలిగా ఉంద’ని చెప్పాడు. కుబేరుడు ‘వెంటనే చేయించేస్తానని, కూర్చోమ’ని బతిమాలాడు. గణపతి ఆకలికి ఆగలేక వంటగదిలోకి వెళ్లి వండనివి, వండినవీ అన్నీ తినేశాడు. వంట కోసం దాచిపెట్టినవి కూడా తినేశాడు. బయటకి వచ్చి కుబేరుణ్ణి ‘తనకి ఇంకా ఆకలి వేస్తోందని, తినడానికి ఏదైనా పెట్టమ’ని అడిగాడు. కుబేరుడు నిస్సహాయంగా నిలబడిపోయాడు. గణపతి కుబేరుడి భవనంలోకి వెళ్లి కనిపించనవన్నీ తినేశాడు. అన్ని గదుల్లోకి వెళ్లి అతడు దాచుకున్న వెండి, బంగారం వంటి వస్తువుల్ని కూడా తినేశాడు. ఇంక తినడానికి ఏదీ దొరకలేదు. గణపతి కుబేరుడి వైపు చూసి ‘నాకు తినడానికి ఏదైనా పెడతావా? నిన్ను తినెయ్యమంటావా?’ అని అడిగాడు. అతడి మాటలకి కుబేరుడు భయపడి పరుగెట్టడం మొదలుపెట్టాడు. అతడి వెనుక గణపతి పరుగెట్టాడు. ముందు కుబేరుడు, కొంచెం దూరంలో గణపతి పరుగెడుతున్నారు. పరుగెత్తి పరుగెత్తి చాలాసేపటికి కైలాసం చేరుకున్నారు. తనని రక్షించమని ఏడుస్తూ శివుణ్ణి ప్రార్థించాడు కుబేరుడు.
శివుడు ప్రత్యక్షం కాగానే పాదాల దగ్గర పడిపోయాడు కుబేరుడు. శివుడు కుబేరుణ్ణి చూసి ‘ఏం జరుగుతోంది ఇక్కడ?’ అని అడిగాడు. గణపతి వెంటనే ‘తండ్రీ! కుబేరుడు నాకు సరిపడినంత ఆహారం పెట్టలేదు. ఇంకా నా ఆకలి తీరలేదు’ అని చెప్పి లోపలికి వెళ్లిపోయాడు. తనతో సమానమైన ధనవంతులు లేరు.. అనే గర్వంతో తను చేసిన పనికి క్షమించమని కుబేరుడు శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు కుబేరుడి వైపు ప్రేమతో చూశాడు. కుబేరుడు తన పట్టాణానికి తిరిగి వెళ్లిపోయాడు.

- భమిడిపాటి బాలాత్రిపురసుందరి,
విజయవాడ, చరవాణి : 9440174707
----

చిన్న కథ

ఏప్రిల్ ఫూల్

‘ఏమిటీ ఏకంగా సూట్‌కేస్‌తో వచ్చేశావు? మావాడికి జెల్ల కొట్టేశావా? వాడేం పాపం చేశాడు?’ అడిగాడు చెల్లి రాధను మురళి.
‘కాలేజీ డేస్‌లో కావ్య అనే అమ్మాయిని ప్రేమించాడట. అది పెళ్లి మానుకుని ఈయన గారి కోసం పరితపిస్తోందట. నన్ను త్యాగం చెయ్యమని..’ వెక్కివెక్కి ఏడుస్తున్న చెల్లిని నవ్వుతూ చూశాడు.
అన్నగారి వంక అనుమానంగా చూస్తూ ‘అసలు నేను గొడవపడి వచ్చానని నీకెలా తెలుసు. నీ నవ్వు చూస్తుంటే నాకేదో అనుమానంగా వుంది. ఆ అమ్మాయి రాసిన ఉత్తరం తీసుకొచ్చా. నువ్వు కూడా చదువు. నేనొచ్చే లోపలే నీకన్ని విషయాలు ఫోన్‌చేసి వుంటాడు ఈడియట్’ అంది రాధ.
‘అబ్బా వాడిని అలా తిట్టకే! వాడి నవలకి ముగింపు చెప్పమని అడిగితే.. తాళి కన్నా ప్రేమ గొప్పదని, భార్యని త్యాగమయి చెయ్యమని సలహా ఇచ్చావటగా’ అడిగాడు.
‘అది నవల. నిజజీవితంలో అలా ఎలా?’ అంది రాధ.
‘అభిమాన నటుడు తాగమన్న డ్రింక్ తాగుతున్నారు. శ్రీమంతుడు ఊరిని దత్తత తీసుకుంటే మరి ఆయన అభిమానులు కొందరు ఊళ్లని దత్తత తీసుకోవడం మొదలుపెట్టారు. అభిమానులు అనుసరిస్తారని తమిళ హీరో సినిమాల్లో సిగరెట్ కాల్చడం మానేశాడట. మరి అభిమాన రచయిత చెప్పాడని పెళ్లయిన వాడు కాలేజీలో ప్రేమను వెతుక్కుంటే? అందుకే రాసే ప్రతి నవల ఎంతో జాగ్రత్తగా రాయాలి రచయిత. ఈవిషయం నాతో చెప్పి- రాధకి కొద్దిగా ఆలోచించి సలహా ఇమ్మని చెప్పరా. ఇప్పుడు తను నా సెక్రటరీ కదా! అన్నాడు.. అందుకే నేనలా..
అన్న చేతిలో ఉత్తరం లాక్కుని చూసి ‘అవును ఇది నీ రైటింగే. ననె్నందుకు ఇంతలా ఏడ్పించావు?’ అడిగింది రాధ.
‘ఈరోజు ఏమిటి’? అడిగాడు నవ్వుతూ. తెల్లబోయింది నవ్య ‘ఏప్రిల్ ఫూల్’ చేశావన్నమాట. అన్నది చిరుకోపంతో. తన వెనుకవచ్చి నిలబడిన భర్తని చూసి వంటింట్లోకి పరుగెట్టింది రాధ.
- సాయిదుర్గ, విజయవాడ.

------

వెంటాడే కవులు

వసివాడని ‘(నా) కవనం’
‘చల్లనివాడు, చంద్రికల జల్లెడివాడు, సుధారసంబు బల్
పెల్లుగ గల్గువాడు, కడువెల్లనివాడు, నిశీధిలో ప్రవ
ర్తిల్లెడువాడు, గీష్పతి సతిన్ కలగించినవాడు - అందుకే
నల్లని మచ్చవాడు - ఇకనైనను ఆతడెవండొ చెప్పరే!’
ఓ పొడుపు కథలా లేదూ! ఈ పద్యం. ఆ నల్లని మచ్చ వాడెవడనుకుంటున్నారు? ఆకాశంలోని చంద్రుడే! చంద్రునిలోని నల్లమచ్చకు కారణాన్ని ఈ పద్యంలోనే చెప్పి, అటువంటి వాడెవరో చెప్పండి అని ప్రశ్న వేయడంలోనే చమత్కారం ఉంది. గీష్పతి సతిన్ కలగించాడు. అదే అతనిలోని నల్లమచ్చ. అంటే గురువైన బృహస్పతి భార్య తారతో సంగమించడమే కారణం. అది పరమ దోషం గదా! పద్యాన్ని చూడండి - ఎంత హాయిగా, కమ్మగా నడిపారో? ప్రతిరోజూ మనం మాట్లాడుకున్నంత తేలిక భాషలో సాగినట్లుగా లేదూ! ఈ పద్యాన్ని చదివిన వెంటనే మనకు పోతనగారి భాగవతంలోని ‘నల్లనివాడు, పద్మనయనంబులవాడు..’ అన్న పద్యం గుర్తుకు రావడం లేదూ! నరసరావుపేట డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర విభాగంలో ఉపన్యాసకులుగా పనిచేసి, సుమారుగా పాతిక సంవత్సరాల క్రితమే రిటైరై ‘కళకున్నది నిత్య వనం’ అన్నట్లగా నేటికీ క్షేమంగా పద్య కవిత్వాన్ని రాస్తున్నారు శ్రీ ప్రయాగ కృష్ణమూర్తిగారు. వీరు బోధించినది ప్రకృతి శాస్త్రం కాబట్టి తమ పేరును సరదాగా ‘ప్ర.కృ.తి’ అని పెట్టుకున్నారు. ప్రకృతి - అంటే ప్రయాగ కృష్ణమూర్తి - చమత్కారంగా లేదూ.. ఆయన కలం పేరు! ఈ పద్యం వెలువడడానికి నేపథ్యాన్ని తమ ‘నా కవనం నా కవనం’ అన్న కావ్యంలో ఇలా స్టోరీ టెక్నిక్‌తో తెలిపారు.
మా.నా.రావు (మారేమళ్ల నాగేశ్వరరావు) గారని ప్రయాగ వారికి హైస్కూల్‌లో సహాధ్యాయి. వీరు తర్వాత ఎ.సి కాలేజీలో తెలుగు లెక్చరర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ‘యామినీ పూర్ణతిలకము’ మున్నగు పద్య కావ్యాలు రాశారు. ఈ మానా-రావు గారు ఆంధ్రా యూనివర్సిటీలో బి.ఏ (ఆనర్స్) చదువుతున్నప్పుడు ప్రయాగవారిని విశాఖకు పిల్చారు. ఓ సాయంత్రం సముద్ర తీరంలో కూర్చున్నారు. ఉదయిస్తున్న చంద్రుణ్ణి చూశారు. ప్రయాగ వారి కోరికపై చంద్రునిలో నల్లమచ్చను గురించి ‘గగన మండలమది కాదు నోంబురాశి; కావు చుక్కలు - నవఫేన ఖండములవి; కుముద పతికాడు - అది చుట్టుకొన్న పాము; మచ్చగాదది శయనించు మధువిరోధి’ అని తేటగీతిని ఆశువుగా చెప్పారు. అది ‘బిల్హణీయ’మన్న సంస్కృత కావ్య పద్యానికి అనువాదమని కూడా చెప్పారు - మానా రావు గారు. అది ఆకాశం కాదు సముద్రమనీ, అవి నక్షత్రాలు కావు నీటి నురగ సుక్కలనీ, చంద్రుడు కాడు చుట్టుకున్న పామనీ, మచ్చగాదు - ఆదిశేషునిపై శయనించిన విష్ణువనీ మా.నా.రావు గారి పద్యం. ఆ సందర్భంలోనే ప్రయాగవారు పై రీతిగా ఉత్పలమాల పద్యాన్ని చెప్పి పఠితలను రసప్రయాగలో ముంచెత్తారు.
ఇలాగే ‘నా కవనం నా కవనం’ అన్న కావ్యంలో కథా నేపథ్యాన్నీ, పద్యాన్నీ ఇలా తెలిపారు. ఓసారి ఎవరో ఒకాయన ‘అమ్మ రవికను దాగిన గుమ్మలెవరు?’ అని ప్రశ్నించారట. వెంటనే ప్రయాగ వారి మిత్రుడు ముదిగొండ శివానందం గారనే ఆయన ‘అమ్మ అంటే శారదాంబ అనీ, రవికను దగిన గుమ్మలు అంటే సంగీత సాహిత్యాలనీ’ ఠక్కున సమాధానం చెప్పారట. ఆయనే ప్రయాగవారికోసారి ‘రవికను దాగి యుండె పదిలంబుగ ఇద్దరాజులెవ్వరో?’ అని సమస్యను ఇచ్చారట. వెంటనే ప్రయాగవారు
‘రవికను దాగియుండె పదిలంబుగ ఇద్దరు రాజులెవ్వరో
వివరణ జేయుమంచునను పెద్దయొకండడుగంగ వెంటనే
సవినయ పద్ధతిన్ మదిని సంతస మందుచు సాహసించి నే
రవి -కవియంచు దెల్పితివి - రాజులు వీరె యటంచు చెప్పితిన్‌ఁ’
అని పూరించారు. ఇక్కడ రవిక అంటే ఆడవాళ్లు తొడుక్కునేది కాదనీ, ‘రవిక’ అనే పదంలో రెండు శబ్దాలున్నాయనీ, అవి ‘రవి-కవి’అనీ, ఇంతకీ ‘రవిక’ అనే శబ్దంలో సూర్యుడూ, చంద్రుడూ అనే ఇద్దరు రాజులున్నారనీ చమత్కారంగా పూర్తిచేశారు - ప్రయాగవారు.
అలాగే ‘చప్పట్ల’కు ఏకవచనం లేనట్లే ‘్భగవంతుడి’కి బహువచనం లేదని చమత్కారంగా ఓచోట చెప్పారు. ఇలా తమ జీవితంలో జరిగిన కొన్ని సన్నివేశాలను చక్కని కథా నేపథ్యంతో, తమ పద్యాలనూ, సందర్భాన్ని బట్టి ఇతరుల పద్యాలనూ పేర్కొన్నారు ‘నా కవనం - నా కవనం’ అనే గ్రంథంలో. పఠితులకు ఆనంద వికాసాన్ని కలిగించారు ప్రయాగ కృష్ణమూర్తిగారు - కాదండోయ్ - ప్రయాగ వేంకట రాధాభగవాన్ మోహన గోపాల బాలశ్రీ కృష్ణమూర్తిగారు. ఇదీ వీరి అసలు పేరు. చాలా పెద్దపేరండోయ్ వీరిది. వీరు శ్రీ వేంకట రమణ శతకము, అష్టావధానాలలో సమస్యాపూరణము, గణిత శాస్తప్రరంగా శత సమస్యల శతకం (వచనంలో) ఇత్యాది గ్రంథాలను రాసి నిజంగానే పెద్ద పేరు పొందారు. ఇంతకీ ఈ ‘నా కవనం’ వసివాడని నవ (నా) కవనమే!

- డా. రామడుగు వేంకటేశ్వరశర్మ
గుంటూరు
సెల్: 9866944287

------

మనోగీతికలు

సాధిస్తాను ..
నేను సాధిస్తాను
నా విజయాన్ని
ఎన్ని కష్టాలెదురైనా
ఎన్ని నష్టాలెదురొచ్చినా
నేను వెనుదిరగను
పెద్దలందరినీ
ఉపాధ్యాయులను
గౌరవించటం ద్వారా ..
నేను సాధిస్తాను
నా విజయాన్ని
తల్లిదండ్రులను
స్నేహితులను
ప్రేమించటంలో
దేశాన్ని పూజించటంలో
నేను సాధిస్తాను
నా విజయాన్ని!
అనాధలు, పేదలకు
సహాయం చేయటంలో
నేను సాధిస్తాను నా విజయాన్ని
నా లక్ష్యం ధ్యేయం ఒక్కటే
అదే నా విజయం
బలంతో, జ్ఞానంతో, ఆత్మవిశ్వాసంతో
నేను సాధిస్తాను
నా విజయాన్ని!

- కె శిరీష, 8వ తరగతి
ఆత్మకూరు, గుంటూరు జిల్లా.
---

ఆరని దీపాలు

అప్పుడే వికసిస్తున్న
లేత పూమొగ్గలా
ఈ పుడమి పైకి వస్తూ
బుడిబుడి అడుగుల
ముచ్చటయిన నడకతో
ప్రపంచాన్ని తిరుగుతూ
రావాలనే ఆశతో
బంగారు భావి భవిష్యత్‌ను
ఆకాంక్షిస్తూ
ఎదురుచూస్తున్న
పసి జీవితాల్లో
కాంతిని వెదజల్లేలా
వెలిగించాలీ
ఆరని దీపాలు!

పెయ్యల శ్రీనివాసరావు,
మచిలీపట్నం, కృష్ణా జిల్లా.
చరవాణి : 8886423116
---

విశ్వమానవాళి ఉలిక్కిపడిన వేళ!

ప్రతిరేరుూ నాకు నిద్రలేని రాత్రే!
బలవంతంగా నిద్రను ఆహ్వానిస్తే
కంటిపొరల మాటున నీ రూపం
ఉలిక్కిపడి నిద్రలేస్తే
కళ్లముందు ఊహాజనిత నీ స్వరూపం
ఎన్నిరోజులు గడిచాయో లెక్కించలేదు
నీ రూపం మాత్రం నా అంతరంగంలో
స్థిరచిత్రంగా ముద్రపడింది!
బంగారు తండ్రీ..
నీ మరణం
విశ్వం ఒడిలో
ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది!
మధ్యధరా సముద్రం అంచున
శాశ్వత నిద్రలో సైతం
ముద్దులొలుకుతోన్న నీ మోమును చూసి
భూగోళం అశ్రుధారలు స్రవించింది
ప్రపంచాధినేతల గుండెలు
కరిగి కన్నీరు ఉప్పొంగ
పంతాలకు పట్టింపులకు మంగళం పలికి
ఐరోపా ఖండం ఆపన్న హస్తమందించింది
మూడేళ్ల నీ జీవనయానం
మహత్తరమైన మార్పుకు నాంది పలికింది
మళ్లీ ఎప్పుడు పుడతావు నాన్నా!?
ఈసారి నీ పుట్టుక
మరో అద్భుతాన్ని ఆవిష్కరించాలి
దుర్మార్గాన్ని రూపుమాపి
తీవ్రవాదాన్ని అంతం చేసి
హింసను మట్టుబెట్టి
ప్రపంచం నడిబొడ్డున
శాంతి పతాకను ఎగరేయాలి!
(మూడేళ్ల సిరియా చిన్నారి
అయలాన్ మృతికి నివాళిగా..)

- విడదల సాంబశివరావు, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా.
చరవాణి : 98664 00059

----

పవిత్ర భారతావనిలో..

అనేక మంది మహనీయులు
ఐనారు వారిపుడు కీర్తిశేషులు
అయినా వారి కీర్తిపతాకం
నిలిచిపోయింది ఆచంద్రార్కం
ఎదుర్కొన్నాడు మొగలారుూ ఊపు
వీరుడు ఉదయపూరు రాణాప్రతాపు
వలదన్నాడు విగ్రహారాధన
వంగదేశపు ఆణిముత్యం రాజారామ్మోహన్
స్వాతంత్య్రం నా జన్మహక్కంటూ
పోరాటం సాగించాడు తిలకు
కలలో మెదిలాడు సర్దార్ వల్లభాయ్ పటేలు
నిజాం వారసులకు
ఇప్పటికీ ఆయనంటే హడలు
సత్యాహింసలను బోధించాడు గాంధీ
అఖిల ప్రజలకు జాతిపితగా వెలుగొంది
కమ్మని కవితలను అందించింది సరోజిని
తిరుగులేని చాచానెహ్రూ ధరించింది రోజాని
మన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేశాడు
స్వామి వివేకానంద
ఆధ్యాత్మిక శక్తిగా భాసిల్లాడు
మహర్షి అరవింద
ప్రాణం వుంటుంది చెట్లకూ అని
ఎల్లరకూ చాటాడు జగదీష్ చందు
ఇందరిని కన్న భారతదేశం
ఔన్నత్యం వర్ణించటం ఎవరి తరం?

బిఆర్‌సి మూర్తి,
విజయవాడ.
చరవాణి : 7893328410

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com