విజయవాడ

భావిభారత పౌరులారా..( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది మేము రోజూ కాలేజీకి వెళ్లేదారి. కాలేజీ బస్సు సరిగ్గా ఉదయం 8 గంటలకే బయలుదేరుతుంది. ఒక పెద్ద ఫ్లైవోవరు మీదుగా వెళ్లాలి. దాని కింది నుంచి రైళ్లు పరుగెడుతూ వుంటాయి. ఆ రైలు కట్ట పక్కనే ఒక గుడి వుంది. ఉదయం వేళ కాబట్టి గుడిగంటలు మైకులో బాగా వినిపిస్తూ వుంటాయి. ఈ ఫ్లైఓవరు మీద ట్రాఫిక్ రద్దీగా వుండటం వల్ల అన్ని మోటారు వాహనాలు మెల్లగానే వెళ్లాలి. అందువల్ల అన్ని శబ్దాలు బాగానే వినిపిస్తాయి. ఆ బ్రిడ్జి పక్కనే ఒక ఐదు అంతస్తుల అపార్టుమెంట్ వుంది. దానికి కొద్ది దూరంలో అంటే సుమారు ఒక ఫర్లాంగ్ దూరంలో ఆ బ్రిడ్జి దాటగానే డౌన్‌లో బస్సు ఆగుతుంది. అక్కడ కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు రోజూ ఆ బస్సు ఎక్కుతూ వుంటారు. ఆ అపార్టుమెంట్ నాలుగో అంతస్తు నుంచి ప్రతిరోజూ ఒక పెద్దాయన బస్సులో ప్రయాణించే మా ఇంజనీరింగ్ విద్యార్థులకు చేతులూపుతూ ‘హాయ్’ చెప్తుంటారు. ఆయనతో పాటు ఒక పెద్దావిడ కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ వుంటుంది. మాకు చూడటానికి చాలా ఆనందంగా ఉంటుంది. ఇలా చూస్తూ చూస్తూ ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో ప్రవేశించాము.
మాకు మా కాలేజీ చదువు ఎంత ముఖ్యమో ఆ పెద్దాయన్ని చూడటం కూడా అంతే ప్రధానం. ఆ తాతగారు కనిపించని రోజు ఏదో తక్కువైనట్లుగా ఫీలవుతాం.
‘ఏమోయ్ లక్ష్మీ! ఆ పెద్దాయన తలనెరిసి, ముఖాన పెద్ద బొట్టు కూడా పెట్టుకుంటాడు.. ఆయన నీకేమైనా తెలుసా?’ అని అడిగింది ఆనందంగా రాధ.
‘నాకు తెలియదు. మన స్టూడెంట్స్‌లో ఎవరికైనా తెలుసేమో! అందుకేనేమో మన వాళ్లందరికీ చెయ్యూపుతూ ఉంటాడు’ బదులిచ్చింది లక్ష్మి.
మా బస్సులో వచ్చే స్టూడెంట్స్ అందరినీ అడిగాము. ఆ పక్క సెంటరులో ఎక్కే కుర్రాళ్లను కూడా అడిగాం. తెలియదంటే తెలియదన్నారు. కానీ మా పిల్లలందరూ ఆయనకు ప్రతిగా చేతులూపి శుభాకాంక్షలు తెలుపుతూ వుంటారు.
సడన్‌గా ఒకరోజు ఆయన కనిపించలేదు. ఏదైనా పని మీద ఉన్నాడేమో అనుకున్నాం. వరుసగా పదిహేను, ఇరవై రోజులు గడిచిపోయాయ్. కానీ ఆయన జాడ లేదు.
అయ్యో! ఏమయ్యాడో పాపం. చాలా పెద్దవాడు, మంచివాడిలా కనిపిస్తూ ఉంటాడు. ఆ బిల్డింగ్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అక్కడ నుంచున్నట్లే అనిపిస్తుంది. ఎంత ఆశ్చర్యం? ఇంతలో ఎంత మార్పు?. మా బస్సు మేడ వద్దకు రానే వచ్చింది. మా అనుమానానికి తగ్గట్టు, తాతగారి ఫ్లాటులో సుమారు పదిహేను ఇరవై మంది ఉంటారు.. గుంపుగా కనిపించారు. ఎందుకో ఆందోళనగా అనిపించింది నాకు. చాలా బాధనిపించింది.
‘లక్ష్మీ! నా అనుమానం నిజమేనా? తాతగారికి ఏమైందో పాపం. ఆయన్ను చూస్తే మా తాతయ్యను చూసినట్లే ఉంటుంది. ఈరోజు లేచి ఎవరి ముఖం చూశానో ఏమో’ అని బాధపడుతూ అంది రాధ.
ఏమైనా, ఈరోజు కాలేజీ పోయినా సరే, తాతగారింటికి వెళ్లి రావలసిందే! అని డౌనులో ఉన్న బస్టాపులో దిగారు లక్ష్మి, రాధ. వారితో పాటు ఇద్దరు మగపిల్లలు కూడా బస్సు దిగారు. వీళ్లంతా మంచి స్నేహితులు. ఒకరి కష్టసుఖాలు మరొకరితో చెప్పుకుంటూ ఉంటారు. ‘మీకు తోడుగా మేము కూడ వస్తున్నాం’ అన్నారు మగపిల్లలు. ఆ నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు అపార్టుమెంట్‌కు బయలుదేరారు. మధ్యలో వారి మనస్సులో ఎన్నో ఆలోచనలు.
‘అసలు ఆయన ఎవరు? ఆయనకు, మనకు ఏమిటి సంబంధం? మనమెందుకు అక్కడికి వెళ్లటం?’ అని అనుకుంటూ అయినా ఏం జరిగిందో తెలుసుకుందామనే ఉత్సుకతతో ఉన్నారంతా.
‘ఆయన భార్యని ఏమని పలకరించాలో, ఏమిటో? జీవితం అంటే ఇంతే కాబోలు!’ అని వేదాంత ధోరణిలో ఆలోచిస్తున్నారు అందరూ.
ఎదురుగా వస్తున్న ఒక పెద్ద మనిషిని అడిగారు. ‘ఏమండీ... ఆ బిల్డింగులో అంతమంది జనం గుమికూడి ఉన్నారు? ఏం జరిగింది’?.
‘ఏమో నాకు తెలియదు. ఎవరో చార్‌ధామ్ యాత్రకు వెళ్లారట’ అంటూ గబగబా వెళ్లిపోయాడు ఆయన.
‘అయ్యో! మేమనుకున్నది నిజమే అయి వుంటుంది. చార్‌ధామ్ యాత్రలో చాలామంది యాత్రికులు ప్రకృతి వైపరీత్యానికి గల్లంతయ్యారని, కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రపంచమంతా నివాళులర్పించారు’ అని అనుకుంటూ బిల్డింగు లోపలికి ప్రవేశించారు వాళ్లు. నాలుగో అంతస్థులో లిఫ్ట్ దిగారు.
లోపలి నుండి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. వీరంతా ఆశ్చర్యంగా వింటున్నారు.
‘తాతగారూ..! మీరు క్షేమంగా తిరిగి వచ్చారు. అదృష్టవంతులండీ’ అంటున్నారు ఎవరో.
‘కాదమ్మా! అందరూ అదృష్టవంతులే. ఎందుకంటే అక్కడ ప్రాణాలు విడిచినవారు కూడా అదృష్టవంతులే. ఒక పుణ్యక్షేత్రం, పుణ్యతీర్థం చార్‌ధామ్‌లో మరణించాలనుకుంటే మరణం సంభవిస్తుందా? భగవంతుడు తన భక్తులందరినీ సమాన దృష్టితో, ప్రేమతో చూస్తాడు. అలాకాకపోతే వాడు భగవంతుడు ఎలా అవుతాడు. అయితే బతికి తిరిగి వచ్చినవాళ్లు ఇంకా కొంత పుణ్యం సంపాదించుకోటానికి, మానవ కల్యాణానికి తోడ్పడడానికి తిరిగి వాళ్ల ప్రదేశాలకు పంపాడు. అంతే! అందుకే మనమెప్పుడూ భగవత్ సేవలోనే తరించాలి. జనన, మరణాలు ఎవ్వరి ఆధీనంలోనూ వుండవు. మన బిల్డింగుపై నుంచుని కాసేపు చూడండి. ఆ బ్రిడ్జి మీద నిరంతరం ప్రయాణించే వాహనాలతో ఎంత రద్దీగా ఉందో? అలాగే సృష్టి రహస్యం కూడా అంతే. పుట్టినవారు.. మరణించేవారు..! ఇది నిరంతరం సాగే ప్రక్రియ. ఈ జనన మరణాల రహస్యం గొప్ప వేదాంతులకు కూడా అంతుపట్టదు. అందుకే పుట్టిన ప్రతివాడు జన్మ సార్థకం చేసుకుని భగవంతునికి చేరువ కావడానికి ప్రయత్నించాలి’ అని చెప్తున్నారు పెద్దాయన.
వారి మాటలు విన్న మాకు ఆశ్చర్యం, ఆనందం కలిగింది. లోపలికి వెళ్లిన మమ్ముల్ని ‘ఎవరమ్మా మీరు? ఎక్కడ నుంచి వచ్చారు?’ అని అడిగారు తాతగారు. జరిగిన విషయం అంతా చెప్పాం.
‘సంతోషం నాయనా. మీరు మధ్యలో బస్సు దిగి వచ్చారా? మీ యువకులంతా భావిభారత పౌరులు. ఈ దేశంలో అవినీతి, అక్రమాలకు తావులేకుండా చూడాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. నా ఇద్దరు మనవళ్లు రవి, చంద్రులు మీ కెఎల్ యూనివర్సిటీలోనే చదువుతున్నారు. వాళ్లతో పాటు మా కారులోనే వెళ్లండి. మీకు టైం కలిసి వస్తుంది. నాకు చదువుకునే పిల్లలంటే సంతోషం. అందుకే మీకు రోజూ హాయ్ చెప్తుంటాను’ అన్న తాతగారి ఆశీస్సులందుకుని వారి పిల్లలతో పాటే వారి కార్లోనే కాలేజీకి చేరాము.

- లక్కరాజు వెంకట పూర్ణచంద్రరావు,
చరవాణి : 9346978829
****

పుస్తక పరిచయం
***
వెలుగులు విరజిమ్ముతున్న ‘చిరుదీపాలు’
చిరుదీపాలు (రెక్కలు)
రచయత్రి : డాక్టర్ పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి
కాపీలకు : వంశీ పబ్లికేషన్స్,
వంశీ నర్సింగ్ హోమ్,
ఇందిరా భవన్ రోడ్,
నెల్లూరు - 524 001
చరవాణి : 94402 79594

సాంకేతిక విప్లవం విజృంభించి పాఠకులను వీక్షకులుగా మారుస్తున్న ఈరోజుల్లో అన్నం తిననని పేచీపెట్టే పాపాయిలను తల్లి బుజ్జగించి, బతిమాలి గోరుముద్దలు తినిపించినట్లు సాహిత్యానికి దూరమవుతున్న పాఠకులకు కవులు, కవయిత్రులు తినిపించే గోరుముద్దలు - మినీ కవితలు, హైకూలు, నానీలు, రెక్కలు.
సుగమ్‌బాబుగారు రూపొందించిన కవితా ప్రక్రియ ‘రెక్కలు’. పంచదారతో తయారైన ప్రతి పదార్థం మధురంగా ఉన్నట్లు కవిత్వ పరిమళం అద్దిన ప్రతి ప్రక్రియా మనోహరంగా ఉంటుంది. ‘చిరుదీపాలు’ పేరుతో బహుముఖ ప్రజ్ఞాశాలి డా. జయప్రదగారు ఎగరేసిన రెక్కల చప్పుడును కొద్దిగా ఆస్వాదిద్దాం.
స్వాతంత్య్రం కోసం/ వీరుల రక్తం/ నేలను/ తడిపింది - యోధులు ధృవతారలు.
‘కాకిలా కలకాలం బతికేకన్నా హంసలా ఆరు నెలలు బతికితే చాలు’. అంటారు. దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించిన భగత్‌సింగ్ వంటి వీరులు ధృవతారలే కదా.. అంటారు జయప్రద.
బిడ్డలు/ అమెరికాలో/ కన్నవాళ్లు/ కుక్కిమంచంలో - కొరివి స్థానంలో ఇన్‌సినరేటర్స్.
తాము తిన్నా, తినకపోయినా బిడ్డలు ఉన్నత స్థానాల్లో జీవించాలని రెక్కలు ముక్కలు చేసుకుని బిడ్డలను అమెరికా పంపుతారు అమ్మానాన్నలు. వాళ్లక్కడ డాలర్ల నీడలో సర్వసుఖాలూ అనుభవిస్తూ కన్నవాళ్లను మరచిపోయి, కనీసం వాళ్లు మరణించినప్పుడైనా రావడంలేదు. కన్నవాళ్లకిక ఇన్‌సినరేటర్సే గతి అవుతున్నాయి అంటూ అర్ద్రంగా వర్ణించారు జయప్రద ఈ రెక్కను.
పబ్‌లు/ పానశాలలు/ హైకల్చర్ - ల్యాబ్ రిపోర్టులోనే రిజల్ట్!
అవినీతి, అక్రమాలతో అడ్డంగా సంపాదించిన ధనమదంతో కళ్లు నెత్తికెక్కి పబ్‌లను, పానశాలలను పావనం చేస్తున్న హైకల్చర్ గాళ్ల భవిష్యత్తు దాక్కునేది ల్యాబ్ రిపోర్టుల్లోనే. ఎన్ని సుఖవ్యాధులు సంక్రమించాయో, ఎన్ని అవయవాలు పట్టుతప్పాయో.. చేతులు కాలాకనే కదా ఆకులు పట్టుకునేది.. అంటూ నిర్మొహమాటంగా చెప్పారు ఈ రెక్కలో.
అబద్ధాలు/ నాతో చెప్పు/ నీతో నువ్వు/ చెప్పుకోకు - ఎదగనీయదు ఆత్మవంచన.
‘డాంబికాలు పరులతో పలికితే నవ్వుకుని వదిలేయవచ్చు. తానూ నమ్మితే.. నగుబాటు కాక తప్పదు’ అంటూ అద్భుతంగా చెప్పారు.
భగవంతుడి మీద/ భారం వేసేవాడు/ తన మీద తనకే/ నమ్మకం లేనివాడు - అపజయం అల్లంత దూరంలోనే!
‘కార్యనిర్వహణకు అవిరళ కృషి చేయక, గాలిలో దీపం పెట్టి, దేవుడా! నీదే భారం.. అనేవాడు విజయాన్ని ఎప్పటికీ అందుకోలేడు’ అన్న నిజాన్ని అలవోకగా చెప్పారు ఈ రెక్కలో జయప్రదగారు.
కఠిన శిల ఉత్తమ శిల్పకారుడి చేతిలో కరుణ చిందించే దేవతామూర్తిగా రూపొందినట్లు, ప్రక్రియ ఏదైనా ప్రతిభావంతుల చేతిలో ప్రకాశించినట్లు జయప్రద గారి రెక్కలు జీవనసారాన్ని నింపుకుని ఆహ్లాదంగా పరమళిస్తున్నాయి.
వైద్యం వృత్తిగా, సాహితీసేవ ప్రవృత్తిగా కొనసాగుతున్న జయప్రదగారు నిరంతర కార్యశీలి. కథారచయిత్రిగా, కవయిత్రిగా, నవలాకారిణిగా, ఇంకా అనేకవిధాలా వెలుగొందుతున్నారీమె. ఈమె వైద్యశాలలో శిశువులు ఉద్భవించి తల్లిదండ్రులను ఆనందపరవశులను చేస్తే ఈమె హృదయశాలలో ప్రభవించిన కవితా కనె్నలు మాత్రం పాఠక లోకాన్నంతా పరవశుల్ని చేస్తాయి. జయప్రదగారు ఇలాంటి చిరుదీపాలు మరెన్నో వెలిగించాలని ఆకాంక్షిస్తూ..

- కోపూరి పుష్పాదేవి,
విజయవాడ.
చరవాణి : 9440766375
***

చిన్న కథ
**
అదృష్టవంతురాలు

ఆటో దిగి సూట్‌కేసుతో వచ్చిన చెల్లెలు సుభద్రని ప్రశ్నార్థకంగా చూశాడు మురళి.
‘ఆయనతో నేనింక కలిసి బ్రతకలేను. ఎన్ని పిచ్చివేషాలు వేసినా భరించాను. వంటావిడకి నేను సేవలు చేయాలిట. అది ప్రెగ్నెంట్‌ట.
‘దానికి నువ్వు సేవలు చేయడం ఏమిటీ? వింతగా వుంది’ నేను ఆయనకి సపర్యలు చేయలేక చక్కగా టివి సీరియల్స్ చూస్తూ.. ఆయన పనులకి, ఇంటిని చక్కదిద్దటానికి మణిని పనిలో పెట్టుకున్నాను.
దాన్ని అన్నిటికీ వాడేసుకున్నారు. నాలుగేళ్లయినా.. నాకు పిల్లలు లేరు కనుక దానికి పుట్టేవాడే వంశోద్ధారకుడు కాబట్టి మణికి ఎటువంటి కష్టం కలగకుండా చూసుకోమని ఆర్డర్. అయ్యో సముద్రపు అలలు- ఇసుక దిబ్బలు సీరియల్ వచ్చే టైమయింది. అది పెట్టన్నయ్యా అంటూ సోఫాలో సెటిలయింది సుభద్ర.
ఆడపడచు మాటలేవీ రాధకి అర్థం కాలేదు. సుభద్ర సీరియల్‌లో మునిగిపోయాక రాధకి అన్నీ వివరించాడు.
వాడు ఇష్టపడ్డాడని దాన్ని వాడికిచ్చివేసి తప్పు చేశాను. సుభద్రకి నువ్వు పని నేర్పలేదు. కాలేజీకెళ్లిరావడం. టివి చూడటం అక్కడ మీ అన్నయ్య కూడా దాని ప్రవర్తనకి బాధపడి నాతో చెప్పుకుని ఏడ్చాడు. నేను మణిని పంపాను. దాన్ని తోసుకుని వాడు బెడ్‌రూంలోకి పోతున్నా ఒక్కసారి వాళ్ల వంక చూసి టివి చూడటంలో మునిగిపోయేదిట. భర్త చెప్పేది ఆశ్చర్యంగా వింటుంది రాధ.
రేపో మాపో దాని భర్త వచ్చి తీసుకుపోతానని చేప్పేడుట. ‘అది మా ఆయనతో... అంటూ ఎంత చెప్పినా నేను మాత్రం మడికట్టుకు కూర్చున్నానా? రెండేళ్లయింది దాన్ని విడిచి వెళ్లి దాని శరీరం మైలపడినా మనసు నాదే అన్నాడుట. ఆకలేస్తే హోటల్లో తింటాం టిఫిన్. అలా అని ఇంటి భోజనాన్ని వదులుకుంటామా? అన్నాడుట. దాన్నిబట్టి దాన్ని వాడు ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలిసిందట. రెండు నెలలకి ఇరవై వేలకి దానిని నాతో నటించడానికి ఒప్పించాను. అదింక వెళ్లిపోతుందట. సుభద్రకి చివరి షాక్ ఇచ్చాను. దానికి బుద్ధి చెప్పి పంపమని అదొచ్చే ముందు ఫోన్ చేశాడు మీ అన్నయ్య. ఇప్పుడు నాలుగు రోజులు నిన్ను మాటలతో, చేతలతో హింసిస్తాను. చక్కగా నటించాలి నువ్వు. నన్ను చూసి అది అసహ్యించుకుని నా భర్త దేవుడంటూ వాళ్లింటికి వెల్లిపోవాలి- తెలిసిందా’ అన్నాడు.
ఆడపడుచుని చక్కదిద్ది అన్న కాపురాన్ని చక్కదిద్దటానికి సిద్ధపడింది రాధ.
ఇక ప్రతిరోజు ఏదోవంకన అన్నయ్య వదిన్ని అనే మాటలు, అప్పుడప్పుడు చెయ్యి చేసుకోవడం చూసిన సుభద్ర అన్నని చీదరించుకుంది. ‘నా భర్త దేవుడు. ఆయన ముఖంలో కోపం గానీ, చిరాకు గానీ ఎన్నడూ చూడలేదు. ఎప్పుడు- ఆయన పెదవులపై చిరునవ్వే. ఇలాంటివాడిని నువ్వేలా భరిస్తున్నావు వదినా. చూస్తుంటే నాకు చాలా బాధగా వుంది. నేనిక్కడ వుండలేను. సాయంత్రం మా ఆయన దగ్గరకి వెళ్లిపోతాను అంది సుభద్ర.
‘మరి మా అన్నయ్య ఆ మణితో...’
‘అదంతా అబద్ధం వదినా... మీ అన్నయ్య శ్రీరామచంద్రుడని నాకు తెలుసు. నాకు బుద్ధి చెప్పడానికే మణితో నాటకం మొదలెట్టారు. ఎప్పటికీ నన్ను వదులుకోరు. నీకిక్కడ వుండటం బాధగా వుంటే నా దగ్గరకి వచ్చేయ్ వదినా. మీ అన్నయ్య ఏమీ అనరు’ అంది జాలిగా చూస్తూ.
‘నాలుగు దెబ్బలు వేస్తే భర్తను వదిలివేస్తావా? అని మావాళ్లు నన్ను మాటలతో చంపేస్తారు. అన్నయ్య అసలొప్పుకోడు. ముందు నువ్వు వెళ్లు. సహనంతో నా సంసారాన్ని నేనే సరిచేసుకుంటాను. అన్నా వదినల్ని ఆరాధనగా చూసింది సుభద్ర. అన్నయ్య చాలా అదృష్టవంతుడు మంచి భార్య దొరికింది. ‘అనయ్యా వదిన్ని బాధపెట్టకు. ఆమె కన్నీరు ఇంటికి మంచిది కాదు’ అని అన్న వంక ఈసడింపుగా చూస్తూ ఆటో ఎక్కింది సుభద్ర.
ఆటో అటు వెళ్లగానే ఫోన్ చేశాడు బావమరిదికి ‘సుభద్ర దారిలోకి వచ్చింది. ‘నీ దగ్గరకి బయలుదేరింది. జాగ్రత్తగా చూసుకో దానిని. నా ముఖం చూసి..’ చిన్నగా చెపుతున్న భర్తను చూసి.
‘నేను చాలా అదృష్టవంతురాలిని’ అనుకుంది రాధ.
- చావలి నాగ శ్యామల, విజయవాడ.
***

మనోగీతికలు
**
నీ జతలో..

కాంక్షల ద్వారాలు తెరచి
ఊహల ఉయ్యాలలూగి
సురాగాల స్వరాలు అల్లి
ఒక్కటిగా పెనవేసుకుపోనీ
నీ జతలో నన్ను దాగిపోనీ
ఎంతటి మనోజ్ఞ మాధుర్యాలో
జగతిన మన ఛాయల క్రీడలు
ప్రకృతి సాక్షిగా మైమరచిపోనీ
ఎడారిలో వనాలు పుష్పించనీ
కడలిలో గగనాలు కరిగిపోనీ
ప్రణయ వెల్లువలో కలసిపోనీ
జాగు ఓర్వగలేని బంధమైపోనీ
ప్రాణాలన్నీ ముడివేసుకుపోనీ
నదీ నదాలు సంతసాలు తెలుపనీ
పర్వత రాజాలు కుంగి కృశించనీ
అగ్నిశిఖలై ఘడియలన్నీ మండిపోనీ
సౌరభాల ఊపిర్లు గాలిలో మిళితమైపోనీ
ఆత్మానంద అనురాగాలావిర్లు కానీ
ఆకాశాన మేఘాల కదంబమాల కట్టనీ
చినుకులు తాగి మట్టిరేణువులు వేణువులూదనీ
ఒక్కసారి అనుభూతుల అశ్వాలు విడువనీ
తామరాకు దోసిట్లో మంచులా ముద్దాడనీ
తడిఆరక శత సహస్రకాలాలు చెప్పుకోనీ
దాహం తీర్చే చెలమలా పొంగిపోనీ
ఈ పయనం ఇలానే.. ఇలానే..
కవన ప్రవాహమైపోనీ..!
- షేక్ బషీరున్నీసా బేగం,
గుంటూరు.
చరవాణి : 9985193970

కషాయంలో అమృతం

ఆవేదనలోనూ ఆనందముంటుంది
అనుభవించే హృదయం ఉంటే
తప్పు నుండి ఒప్పు నేర్చుకో
చీకటిలో వెలుగు చూడు కుంగిపోకు
కషాయంలో అమృతం దాగి ఉంది
ద్వేషం నుండే ప్రేమ పుడుతుంది
అశాంతిలోనే శాంతి వెదుకు
అలసటలో సుఖం పొందు
స్వల్పంలో అధికం ఉంటుంది
విత్తులో మహావృక్షంలాగ
స్వార్థంలో స్వల్పకాలిక సంతోషం
నిస్వార్థంలో శాశ్వతానందం
ఇది గ్రహించినవాడె నరుడు
లేనివాడు పామరుడు
ఇది సత్యం, నిత్యం - ఇదే దైవం
ఇదే కావాలి మనిషికి తత్త్వం
మానవజాతికి కావాలి
మహత్తర సందేశం
- కలవకొలను రాజేంద్రకుమార్,
గుంటూరు.

స్వప్నాల సముద్రం

బతుకు విషాదానందాల
గుణపాఠాల జీవనయాగమై
నిల్చిపోనీ ఈవేళ
కలకాలం రసరాగమై
సాగనీయ్ అక్షరాక్షరం
ప్రతిధ్వనించనీయ్
భువనమై సకలముల్
ప్రతి వేకువలో వెనె్నల
ప్రవాహమై సాగనీయ్
ఉదయరాగమై ఒక వేణువు
మధుర సంగీతమై
అణువణువు మధుర
సమాధిలోకి రానీ
సామాన్యుని మేలుకొల్పే
జానపదుల సంగీతమై
అమృతవర్షిణిగా
ప్రతి ఎదలో మారుమోగే
జనజాతరల జావళీల
కళారూపాల కూడలవ్వనీయ్
ప్రతి అణువణువు శిరసెత్తితే
అంగాంగం నవరస భంగిమలై
నర్తించనీయ్
మణిమయ స్తంభాల అద్భుత
సౌఖ్యమేడలై నిలవనీయ్
ప్రతి రాత్రి వెనె్నల వేడుకల పాటలవ్వనీయ్
కళాకారుల మనోఆకాశం నిండా
నక్షత్ర తోరణాలతో విహారం కానీయ్
జీవితమంతా విషాదానందాలను దాటి
ఒకానొకరోజు వెలుగు వాకిలిలో
జీవన సుఖశాంతి తీరాలను దాటి
మరువలేని చిరకాల స్వప్న సముద్రమంతా
సాకారమూర్తుల నిలవాలనే వాంఛ నిజంకానీ..!
- డా. సిహెచ్ ఆంజనేయులు,
ఖమ్మం.
చరవాణి : 7702537453
***

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com