విశాఖపట్నం

జ్ఞానజ్యోతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నళినీ నళినీ’’ అదే పనిగా పిలుస్తున్నారు సూర్యనారాయణమూర్తిగారు పెద్ద కోడల్ని.
‘‘అబ్బబ్బ తినేస్తున్నారీ ముసలాయన. ఎప్పుడు పీడ విరగడ అవుతుందో కానీ చాకిరీ చెయ్యలేక ఛస్తున్నాను’’ విసుక్కుంటూనే మామగారి దగ్గరికి వెళ్లింది నళిని.
‘‘అమ్మా నళినీ... కోపగించుకోకమ్మా. ఏం చేయను చెప్పు మంచం పట్టిన వాడిని. ఏదో అలా పిలుస్తుంటాను. నాకంటే ముందుగా దాన్ని తీసుకుపోయి నాకు అన్యాయం చేసాడా భగవంతుడు’’ నిస్సహాయంగా చెప్పారు ఆయన.
ఆయన ఒకప్పుడు పేరు మోసిన క్రిమినల్ లాయర్. ఆయన గురించి తెలియని వారుండేవారు కాదు. అప్పట్లో ఆయన ఇల్లు వచ్చేపోయే వాళ్లతో నిత్యం కళకళలాడుతూ ఉండేది. భార్య యశోదమ్మ ఇంటికి వచ్చిన వారికి కాఫీలు, టీలు, టిఫిన్లు, భోజనాలు పెడుతూనే ఉండేది. ఖర్చులకు వెనుకాడేవారు కాదు ఆ దంపతులు.
మూడేళ్ల కిందట యశోదమ్మ బాత్రూంలో పడిపోయిన సందర్భంలో ఆమె కాలుపై కంటా విరిగిందన్నారు. కట్టు వేశారు డాక్టర్లు. ఆమె మంచం పట్టినట్లే ఇంచుమించు. ఆనాటి నుండి ఆవిడ బాధంతా భర్త గురించే. ‘నేను బతికి ఉండుగానే ఆయనకి కోడలు ఏమీ అమర్చడం లేదు. ఇక నేను పోతే ఆయన్ని పట్టించుకునే అతీగతీ చూసేవారు ఉండరని ఎంతగానో బెంగపడిపోయింది యశోదమ్మ.
హైదరాబాదులో ఉన్న ఇద్దరు కొడుకులలో ఒకరి వద్దనైనా ఉందామంటే వాళ్లు ఈ కోడల్ని మించిపోయే రకాలు. ఎందుకంటే రెండవ కొడుకు లాయరు. మూడవ కొడుకు ఇంజనీరు. ఎటొచ్చీ ఇక్కడున్న పెద్ద కొడుకే కాణీ సంపాదన లేనివాడు కాబట్టి ఈ మాత్రం అయినా పలుకుతోంది.
అంతులేని ఆలోచనలతో మంచంలో నిస్సహాయంగా ఉండి లోలోన కుమిలిపోతూనే ఉంది యశోదమ్మ. ఆ భార్యాభర్తల అనుబంధం అటువంటిది.
‘‘నేను పసుపు కుంకుమలతో మీ చేతుల మీదుగా పోవాలనే నా ఆశ. నన్ను క్షమించండి’’ అంటూ ఆవిడ ఓ రోజు అర్ధంతరంగా కన్ను మూసింది.
రెట్టింపు ఉత్సాహంతో, మెలకువలతో, ఎనలేని తెలివితేటలతో ఎంతటి క్లిష్టమైన కేసునైనా సునాయాశంగా వాదించగలిగే మూర్తిగారు భార్య పోయిన రోజు నుండి ఆ నల్లకోటు ముట్టనని ఒట్టు పెట్టుకుని వృత్తికి స్వస్తి చెప్పి ఏదో అవసరానికి తప్ప ఇల్లు కదలడం మానేశారు.
కర్మకాండ ముగిసిన తర్వాత ఈ స్థలం మారితే మీకు కొంత మనశ్శాంతి ఉంటుంది. మాతో వచ్చి నా దగ్గర కొన్నాళ్లు ఉందురు గాని బయలుదేరండి నాన్నగారు’’ అని రెండవ కొడుకు రామన్ ఎంతో బలవంతం చేశాడు. అయినా అతనికి ఇష్టం లేకపోయింది.
‘‘వద్దు నాన్నా. నాకు సెల్ ఉంది. మీకూ ఉన్నాయి. రోజూ మీరు ఫోన్ చేస్తుండండి. మీ అమ్మ పోయిన ఈ ఇంట్లోనే నేను పోవాలి. పెద్దన్నయ్య మోహన్, కోడలు ఉన్నారు కదా. నన్ను ఇబ్బంది పెట్టొదు’’ అని వాళ్లకి నచ్చజెప్పి పంపించేశారు.
మనిషి ఏ స్థితిలో ఉన్నా ఆగనిది, ఆపలేనిది కాలం ఒక్కటే. యశోదమ్మ సంవత్సరీకం దగ్గర పడింది. ఆ ఖర్చంతా మేం ఇద్దరం భరిస్తాం అని కొడుకులిద్దరూ ఎంత చెప్పినా మూర్తిగారు సమ్మతించలేదు.
‘‘మీరిద్దరూ పెట్టగలరని, పెద్దవాడు మోహన్ అందుకు ఆర్థిక పుష్టిలేని వాడనీ నాకు తెలుసు. కానీ మీ అమ్మ కార్యం నా సంపాదనతోనే చేయనివ్వండి బాబూ’’ అని వాళ్లని వారించారు.
పెద్దవాడు మోహన్ చేత యశోదమ్మ కార్యం నిమిత్తం బ్యాంకు నుండి డబ్బు తెప్పించి ఉంచారు మూర్తిగారు. అందరినీ ఆహ్వానించి అతి ఘనంగా చేయించారు. తన భార్య పుణ్యస్ర్తిగా చనిపోవడం చాలా అదృష్టం చేసుకుందనే అనుకున్నారు. వెంటనే అనిపించింది భార్య లేని భర్తల బతుకులు ఈ పెద్ద వయసులో తల్లికి దూరమైన చంటి పిల్లాడిలా ఉంటుందని. కళ్లు చెమర్చాయి.
నేను ఎవరికీ అన్యాయం చేయలేదు కొడుకులు రామన్, అశోక్‌లను ఉద్దేశించి అన్నారు.
‘‘అమ్మ బంగారం ముగ్గురు కోడళ్లకి ఇచ్చేస్తాను. నా పేరున ఉన్న డబ్బు మీకు ముగ్గురికీ తర్వాత ఇస్తాను. ఇంక ఈ ఇల్లు ఎవరికి ఇవ్వాలనేది నేనింకా నిర్ణయించుకోలేదు. పెద్దవాడి ఇద్దరు కొడుకుల పేరు రాద్దామనుకుంటున్నాను. అమ్ముకునే అర్హత పెద్ద మనుమడికే ఉంటుందని వీలు రాద్దామనుకుంటున్నాను. ఎందుకంటే దీనిపై వచ్చే అద్దెతోనైనా పెద్దాడి కొడుకుల చదువులు పూర్తవుతాయి. తండ్రిలా కాకుండా వాళ్లయినా చదివి మంచిగా సెటిల్ అవుతారని’’ అన్నారు కొడుకుల వైపు చూస్తూ.
తండ్రి చెప్పిన ఆస్తి వివరాలు విని అంత డబ్బు తెచ్చుకుంటున్న వారైనా అంత ఇంటిని అన్నయ్య పిల్లలకే రాయాలనుకోవడం, కొంచెం ఈర్ష్యను కలిగించింది వాళ్ల మనసుల్లో. అయినా ఎవరూ బయటపడలేదు.
తన వయసును కూడా చేసుకునే టైము లేకుండా కోర్టు, కేసులు, క్లయింట్లు అంటూ హుషారుగా తిరిగే తనకి పిల్లలందరూ వెళ్లిపోయాక భార్య లేకపోవడంతో వయసు బాగా పైబడినట్లుగా అయిందేమిటి అనుకున్నారు మూర్తిగారు.
దాంతో కోడలు భోజన సదుపాయం చేయక రెండు అప్పడాల్లాంటి రొట్టెలు చేసి పడేస్తుంటే తినలేక ఒక రోజు తిన్నట్లు ఒకరోజు తినకుండా చేస్తున్నారు. శరీరంలో శక్తి హరించుకుపోయి రోజురోజుకీ కుంగిపోతున్నారు. కరవు తీరా ఏడవాలని ఉన్నా మగాడిగా ఆ పని చేయలేకపోతున్నారు.
ఒకరోజు తనకి చాలా సన్నిహితుడు భాస్కరరావు మూర్తిగారిని కలవడానికి వచ్చారు.
ఇద్దరూ పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు. భాస్కరరావు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఆత్రుతపడసాగాడు. అటు ఇటు చూసి ‘‘మూర్తిగారూ మీరు ఏయే బ్యాంకుల్లో ఎఫ్‌డిలు అవీ దాచారో, ఎంత సొమ్ము దాచారో అవన్నీ తీసేసారట. మీ పెద్దబ్బాయి జాయింట్ అకౌంట్ పెట్టడం వలన మీ అబ్బాయే మెచ్యూర్ అవగానే ఈ పని చేశారట. బ్యాంకులో ఉద్యోగి ఒకాయన నాకు చెప్పి మీకు తెలియజేయమన్నారు’’ అనగానే మూర్తిగారి గుండె తట్టుకోలేకపోయింది.
‘‘మీరు బయటికి వెళ్లడం మానేసి మీ పెద్ద కొడుకుని నమ్మారు. నమ్మకాన్ని వమ్ము చేశాడు’’ అన్నాడు భాస్కరరావు.
అతని మాటలు విని మూర్తిగారు ఖంగుతిన్నారు.
‘బతికినంత కాలం వాడు, వాడి పిల్లల గురించే ఆలోచించాను. ఎందుకిలా చేశాడు’ పరిపరి విధాలా బాధపడ్డారు మూర్తిగారు.
ఎప్పటిలా ఉదయం అయింది. కానీ రోజులా నళినీ అంటూ అదే పనిగా కోడల్ని పిలిచే మూర్తిగారు పిలవలేదు. నళిని వెళ్లి చూసింది. ఆయన శరీరం చల్లగా తగిలింది. ఆయన హఠాత్తుగా చనిపోవడం ఎవరూ తట్టుకోలేకపోయారు.
కొడుకులు వచ్చారు.
మూర్తిగారి స్నేహితుడు భాస్కరరావు విషయం తెలిసి వచ్చాడు. కొడుకులు అతన్ని పట్టుకుని ఏడ్చారు.
భాస్కరరావు వాళ్లని కూర్చోబెట్టి ‘‘మీ నాన్న చివరిలో రాసిన వీలు వినిపించాలి. అంతా వినండి’’ అన్నాడు.
అంతా ఆసక్తి వినసాగారు.
‘‘నాకున్న ఈ ఇల్లు అదే నా స్థిరాస్థి, నేను సంపాదించిన, నా కష్టార్జితం ఒక కాలేజీకి ఇచ్చేస్తున్నాను. ఆ కాలేజీని వాళ్లు నా పేరుతోనే నడుపుతున్నారు. ఆ రాతకోతలు అయిపోయాయి. కనుక ఈ ఇంటిపై నా కొడుకులు, కోడళ్లు, మనుమలకు ఎలాంటి హక్కు లేదు అని రాతపూర్వకంగా తెలియజేస్తున్నాను’’ అంటూ చదవడం ముగించాడు భాస్కరరావు.
అది విని పెద్ద కొడుకు మోహన్, అతని భార్య ఖంగు తిన్నారు. ఎందుకిలా రాశారన్న రహస్యం స్నేహితుడు భాస్కరరావుకు తప్ప కొడుకులు ఎవరికీ అంతుబట్టలేదు.
తండ్రిని మోసం చేసిన తనయుడు, తనయుడికి శిక్ష వేసిన తండ్రి’ అనుకున్నారు ఇరుగుపొరుగు.
మూర్తి విద్యా సంస్థలు నెలకొని ఆ ఊరి విద్యార్థులకు జ్ఞానజ్యోతిని అందిస్తున్నాయి నిరంతరం.

- పుష్ప గుర్రాల,
విజయనగరం.

పుస్తక సమీక్ష

పద్యకవుల
అభినందన కావ్యం - ఆరాధన
వేములపాడు, ప్రకాశం జిల్లాకు చెందిన ఉన్నం జ్యోతివాసు అధ్యాపకత్వం వహిస్తూ పద్య కవిత్వ రచనలో మంచి పట్టు సాధించి ఎన్నో కావ్యాలను ఆవిష్కరించారు. ఆంధ్ర సాహిత్య వనమునందు అలుపు లేక విహరించెడి కవిని నేను/అని సగర్వంగా చెప్పుకునే జ్యోతివాసు మాటల్లో నాదు ఉద్యోగ నిర్వహణమ్ము తప్ప/లేదు వేరె వ్యాసంగము లేశమైన/ ఇంటి పెత్తనమంత వహింప నాన్న/ పుస్తకాల పురుగునయి పొదలచుం/నన్నాడు.
కవిత్వానికి పరమార్థం మానవత్వమని, వట్టి నీతి చెప్పినన్ చాలదని సాటి కవులను హెచ్చరిస్తాడీ కవి. కవి తన సొంత ఊరును ప్రేమిస్తూ ఇలా ప్రస్తావిస్తాడు - పంచుకొనుటె తప్ప/ ఉంచుకొనుట యెరుంగనిది సుమ్ము/ నన్ను కన్న ఊరు వెన్నను బురుడొంచు వేములపాడును/ప్రేమ తోడనే స్మరించు కొందు/ జాషువా మహాకవి గురించి నీవు లేని లోటు ఈ భారతాంబకు, ఎవరు పూడ్చగలరని వాపోతాడిలా ‘నీదు పద్యమును బోలిన పద్యము కానరాదు నా కనులకు, దివ్వెతో కవి దుకాణములందున దేవులాడినన్’. తన జీవితాంతం ఆంధ్ర భాషా సేవకంకితం చేసిన బ్రౌను దొరకి అంజలి ఘటిస్తాడీ కవి. తిరుపతి వేంకట, జంట కవులను స్మరిస్తాడు. అమర లోకంలోనున్న కల్పవృక్షం, ముసలిదైనందున దేవరాజు ఆహ్వానంపై రామాయణ కల్పవృక్షాన్నిందించిన ఘనత విశ్వనాథ సత్యనారాయణ కవిదనని సహస్ర ఫణాలతో, శత సహస్ర రుగ్మతలను తొలగిస్తూ సామాజిక స్పృహను జాతికందించే కినె్నరసాని, ఏకవీర వంటి అసంఖ్యాక రచనలనందించిన రసరాట్ కవి సామాట్‌వ్రి, నీవేయని నినదించి వందన శతమ్ములందించాడీ కవి. గుండ్లకమ్మ కథా కావ్యమందించిన నాగభైరవ కవిని, యువ కవులను తట్టి లేపి వారికి కొత్త ఊపిరిలు నింపిన బీరం సుందరకవిని, తన గురువులైన జాను పండితుని, తనకి ఛందోబంధరీతుల్ని కవిత్వ పటుత్వ మర్మాన్ని తెలిపిన గాడేపల్లి కవిని, దీపాల పిచ్చయ్యశాస్ర్తీని, గండపెండేర భూషణార్హులు గరికిపాటి కవీంద్రుని స్మరించి అంజలించిన సంస్కార రసహృదయమీ కవిది.
పద్య కవిత్వంలో ఇంతటి ధారాశుద్ధి, రచనా పటిమ, శైలీ సౌకుమార్యం, భావ వ్యక్తీకరణ కనబరిచిన జ్యోతివాసు మరిన్ని కావ్యాలతో అలరించాలని కోరుకుందాం.

- చెళ్లపిళ్ల సన్యాసిరావు,
సెల్ : 9293327394.

యుక్తి, ఉపాయాలతో నిండిన కథా సంపుటి
శివ్వాం ప్రభాకరం ‘బంగారు చేప’

బాలలకు ఇష్టమైనవి కథలు. కథలనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది కాకమ్మ కథలు. శివ్వాం ప్రభాకరం కాకిని ప్రధాన పాత్ర చేసుకుని అటువంటి కథలను రాశారు. కాకినైతే, కాకమ్మ ప్రేమ, చెడు స్నేహం, తల్లిప్రేమ కథల్లో కాకి ప్రధాన పాత్రగా కనిపిస్తుంది. ఇందులో కాకినైతే కథ పిల్లల్లో సోమరితనం పోగొట్టి కష్టించడం నేర్పే కథగా రాయబడింది.
ఇక జంతువుల కథలనగానే టక్కున గుర్తుకొచ్చేది నక్క. ఇతివృత్తంగా రాయబడ్డ కథలు. నక్క సలహా, నక్క చదువు. ఎలుగుబంటి గర్వభంగంలోనూ నక్క పాత్ర ఉంది. ఇందులో నక్క సలహా సింహానికి బుద్ధి చెప్పేదిగా ఉంది. నక్క చదువు, నక్కపై ఉన్న చెడ్డపేరు వలన చదువులో అవరోధం కలగడం ముఖ్యాంశాలు. ఎలుగుబంటి గర్వభంగం పాము-చీమల కథను గుర్తుకు తెస్తుంది.
సంకలన శీర్షిక బంగారు చేప జాలి, భూతదయను కేంద్రంగా చేసుకుని రాయబడ్డాయి. గంగా నదికి తోడుగా భగీరథుడు సృష్టించిన తల్లి చేప, పిల్ల చేప వలలో చిక్కుతాయి. వాటిని జాలరి విడిచిపెట్టడంతో కథ ముస్తుంది. కథ చదివిన వారు జాలరి మంచితనాన్ని మెచ్చుకోక మానరు.
ఇందులో తాబేలు కుందేలు పందెం కథను తాబేలు గెలవడానికి కంగారు వేసిన ఎత్తుగడ, మంచి యుక్తి తెలుసుకోవాలంటే కథను చదవాల్సిందే. ఇక మానవపాత్రల ఇతివృత్తంగా గల కథల్లో రాజదర్బారు, తల్లి ప్రోత్సాహం, ప్రజాతీర్పు, గానగంధర్వుడు, గుడ్లవ్యాపారి, తాతా మనవడు ముఖ్యమైనవి. ప్రభుత్వ పథకాలైన వినియోగదారుల చట్టం, విద్యా హక్కు చట్టం వంటి వాటిపై కథలున్నాయి.
మొత్తం మీద ఈ సంపుటిలో 21 కథలున్నాయి. నవచేతన పబ్లిషింగ్ హౌస్ వారు ముద్రించారు. కథలు, సచిత్రాలుగా, చిన్న వాఖ్యాలతో, ఉత్కంఠగా చదివించేలా ఉన్నాయి కథలు.

- కిలపర్తి దాలినాయుడు,
సెల్ : 9491763286.

యాత్రాదర్శిని
శ్రీశైలం
ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లాలో శ్రీశైలం పురాతనమైన మందిరం. ఎత్తయిన పర్వతశ్రేణి, దట్టమైన అడవుల మధ్య అలరారుతున్న పవిత్రమైన ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో కొలువుదీరి ఉన్న భ్రమరాంబ, మల్లికార్జుజనుని దర్శించుకోవడానికి కుటుంబ సభ్యులతో బయలుదేరాను నేను.
మెలికలు తిరిగిన ఘాట్‌రోడ్డు పైన టాటా సుమో ముందుకు దూసుకుపోతుంటే రోడ్డుకి వైపులా ఉన్న లోయల్లో కనిపిస్తున్న దట్టమైన, ఎత్తయిన వృక్ష సంపదను, ప్రకృతి రమణీయతను అవలోకిస్తున్న నేను ఒకింత భావోద్వేగానికి గురై ఆలోచిస్తున్నాను.
‘‘ఎక్కడికి వచ్చినా మీ రచయిత బుద్ధి పోగొట్టుకోరు’’ అంది శ్రీమతి. అప్పటికే మా కారు గుడి దగ్గరకి చేరుకుంది. ఎత్తయిన కొండల మీద విశాలమైన ఆ మందిరాన్ని అపురూపంగా, ఆశ్చర్యంగా అవలోకిస్తున్నాను నేను. మందిరం ముఖద్వారం దగ్గరే శృంగేరీపీఠం, దానికి ఇరువైపులా ఎత్తుగా రాతి స్తంభాలతో కట్టబడిన ఎత్తయిన అరుగులు. మీదపై కప్పు, అరుగుల మీద ఆశీనులై విశ్రాంతి తీసుకుంటున్న భక్తులను చూస్తున్నాను. ఆ అరుగులు శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టబడినవి.
మందిరం బయట అరుగు మీద కూర్చుని ఓ బామ్మగారు తన మనవరాలితో శ్రీశైలం గురించి చెబుతోంది. బయటికి వచ్చిన నేనూ వింటున్నాను ఆవిడ చెబుతున్నది. ‘‘శ్రీశైల పుణ్యక్షేత్రం ఎన్నో ఆలయాలు, కుండలాలు, తీర్థాలు, నదులతో కూడిన అద్భుతమైన పుణ్యక్షేత్రం. ప్రాచీన కాలంలో ఇక్కడ మహా మనులు, రుషులతోను, సిద్ధులు, యోగులతోను నిండి ఉండేదట. శివపార్వతులు అలిగి వెళ్లిపోయిన తమ కుమారుడు కుమార స్వామిని వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వచ్చారట. అక్కడ కుమారుడిని చూసి ఆనందభరితులయ్యారట. అక్కడి వాతావరణానికి, ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులై కుమార స్వామితో పాటు అక్కడే ఉండిపోయారట. అమ్మవారు భ్రమరాంబికాదేవిగా స్థిరనివాసం ఏర్పరచుకుంటే శంకరుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిసినాడట. ఈ క్షేత్రాన్ని కృతయుగంలో హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో పాండువులు, కలియుగంలో జగద్గురు శంకరాచార్యులు, ఆచార్య నాగార్జునుడు, శ్రీకృష్ణదేవరాయలు, చత్రపలి శివాజీ దర్శించుకున్నారట. ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలం రెండవది’’ అని బామ్మగారు చెప్పారు.
కొండ మీద కూడా గుంపులు గుంపులుగా మనుష్యులు, నివాస స్థలాలు, రోడ్లు, ఆ రోడ్లకు ఇరువైపులా బొమ్మల కొలువుల్లా పేర్చిన వివిధ వస్తువులు, పూజా సామగ్రి అమ్మే దుకాణాలు ఉన్నాయి. అక్కడే యాత్రికకులు భోజనం, ఫలహారం చేసే ఫలహార శాలలు, యాత్రికులు బస చేయడానికి తగిన వసతి భవనాలు ఉన్నాయి. అంతా చూస్తుండగా నాకు అక్కడక్కడా మద్యం బాటిళ్లు కనిపించి మనసు బాధగా మూలిగింది. పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశంలో తులసివనంలో గంజాయి మొక్కలా ఏమిటీ మద్యం బాటిళ్లు అనుకున్నాను. ‘‘ ఇక్కడున్న గిరిజనులు మద్యం తాగి బాటిళ్లు ఇక్కడ పారేస్తారు’’ మా కారు డ్రైవర్ చెప్పాడు.
ఈ మధ్య చాలా పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారాలు, మాంసం, మద్యం సేవించడం ఎక్కువవుతున్నట్లు పేపర్లలో చదివాను. టివిల్లో చూశాను. చాలా బాధ అనిపించింది.
ఏదో విధంగా యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యాము మేము.
దారిలో తేనె అమ్ముతూ గిరిజన మహిళలు కనిపించారు.
‘‘ఆ తేనె కొనకండి. అది కల్తీ తేనె’’ అన్నాడు డ్రైవరు.
‘‘లేదు లేదు! కిందటి సారి వచ్చినప్పుడు నేను కొన్నాను. మంచిదే’’ మాతో వచ్చిన బంధువు అన్నాడు.
కొండ దిగి వస్తున్న సమయంలో అవే లోయలు, అదే వృక్ష సంపద, అవే ప్రకృతి అందాలు. అయితే వెళుతున్న సమయంలో ఆ ప్రకృతి అందాలను ఆస్వాదించిన నేను తిరిగి వస్తున్న సమయంలో ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనందించలేకపోతున్నాను. ఏదో తెలియని అసంతృప్తి, నిరాశ. బాధగా మూలిగింది నా మనసు.

- గూడూరు
గోపాలకృష్ణమూర్తి,
పాల్‌నగర్,
విజయనగరం-3.
సెల్ : 7382445284.

మనోగీతికలు

హైకూలు
పదవే ముఖ్యం
పార్టీలు అశాశ్వతం
వదలకు సౌఖ్యం
వృథా పోనీయరు
ప్రజా ప్రతినిధులు
సదా సంపాదనే!
దీపం ఉండగానే
ఇల్లు చక్కబెట్టేరు
మన పెద్దోళ్లు!

శ్రీమాన్ శ్రీకాశ్యప,
సింహాచలం.
సెల్ : 9985520479.

మూగబోయిన
ప్రపంచం
ఎనె్నన్నో చెట్లు
లెక్కలేనన్ని కొమ్మలు
కొమ్మకొమ్మకు వసంత కోయిలలు
రెమ్మరెమ్మకు అతిథి ఆహ్వానాలు
సందు సందుకు
గువ్వల కాపురాలు
అదో అందమైన వౌన ప్రపంచం
కష్టమన్న వాడికి కాసేపు సేదదీర్చి
ఆకలన్న వాడికి
కమ్మని ఫలాలు పంచి
బతకనన్న వాడికి
బతుకుతెరుపు చూపించి
జీవించడమంటే తెలియని వాడికి
జీవిత పరమావధి నేర్పుతుంది
అదో ప్రకృతి విద్యాలయం!

- మజ్జి పాపినాయుడు,
సెల్ : 9100475182.

పారిశుద్ధ్య కార్మికులు
అ.వె. మలిన దేహాలనుచు
వెలితి చేయవద్దురా
శుభ్రపరచువారు శుద్ధ జనులు
మలినమెల్ల కడుగు
మహనీయ మూర్తులు
చెత్తలెత్తు గొప్ప చిత్తయుతులు!
రైతు
అ.వె. మట్టి కారు
చెమట వెట్టిచాకిరీ చేసి
కష్టమైన పనిని ఇష్టపడుచు
చేయు అన్నదాత చెడ్డమంచోడులే
రామరామ రైతు చల్లగుండ!

- చావలి శేషాద్రి
సోమయాజులు,
పాచిపెంట, విజయనగరం జిల్లా.
సెల్ : 9032496575.

భారత్ వెలగాలి!
భారత్ వెలగాలి నలుదిశలా
ప్రపంచ దేశాలకు ఆదర్శం కావాలి
తల్లి భరతమాత ముద్దుబిడ్డలుగా
మనమంతా కలసి నడవాలి
ఐక్యతతో అభివృద్ధిపథాన
సాగిపోతూ దేశఖ్యాతిని చాటాలి
స్వార్ధం వీడి సహనంతో సాగాలి
కవులు, కర్షకులు, సైనికులు
అందరూ అపురూప భారతావని
ఉద్దీపనకు చేరుూ చేరుూ కలపాలి

- బాబు,
విశాఖపట్నం.
సెల్ : 9502 937 180

ఏకాంతం కోసం
బతుకు బండి
పరిగెడుతున్న వేళ
నావి కాని క్షణాలు
చేతి వేళ్ల సందుల్లోంచి జారిపోతున్నాయి!
గుప్పెడు క్షణాలలో
పిడికిలితో పట్టుకుని
ఆత్మీయంగా
హృదయాల్ని సాకించాలనుకుంటే
ఒక్కొక్క క్షణమూ
వేదనా జల్లుల్ని కురిపిస్తూనే ఉన్నాయి
ప్రతిక్షణం
ఆర్థిక పరమవుతున్న వేళ
ఏకాసిని క్షణాలైనా
విశ్రమించనీయదు ఈ దేహాన్ని
కమ్మని కలలోనైనా
సేద తీరాలని
కృత్రిమంగా దేహాన్ని
నిద్రలోకి పంపాలనుకుంటే
అణువణువు అలజడులతో
కలవరపడుతూనే ఉంది
నాలో చెలరేగే భావనలు
నా ఈ ఏకాంత ప్రియత్వాన్ని
ఆహ్వానిస్తున్నప్పుడు
ఉకనిపిస్తాయి ఆ క్షణాలు ఊరిస్తూ!
అప్పుడు నా దిగులు మది
చల్లని వెనె్నలంత ప్రశాంతతో
ప్రతిక్షణాలు అలరారాలన్న ఆరాటం
ఎదలోతుల్ని పెల్లుబికి
నన్ను నేనుగా ఆవిష్కరిస్తుంది!

- ఆర్.కె. చౌదరి,
సెల్ : 9440 14 34 88.

భరతగీతిక
మంచుతెరలను తొలగించి
ప్రభాతరాగం ఆలపిస్తూ
వెలుగు జిలుగుల
కాంతి రేఖలు
పుడమి తల్లిని తాకుతుంటే
పసిడికాంతుల పైరులన్నీ
ప్రణవనాదం ఆలపిస్తూ
వేదభూమిలో వేగుచుక్కలా
విజ్ఞానకాంతుల
వెలుగు రేఖలు
దశదిశల చీకటి
చెదరగొడుతూ
భరతమాత ముద్దు తనయులు
విశ్వమంతా
భరతగీతిక నాలపించి
మాత రుణమును తీర్చనెంచిరి
ముదము నిండిన మదులతో
వీరసైనిక రక్తతర్పణం
భరతమాతకు నుదుటి తిలకం
త్యాగం, ప్రేమ, కరుణ
కలగలిపిన గొప్పతనం
అదే భరతమాత
ముద్దుతనయుల ధీరగుణం

- మండా శ్రీ్ధర్,
శ్రీకాకుళం.
సెల్ : 9493309030.
---

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

email: merupuvsp@andhrabhoomi.net