విశాఖపట్నం

నిర్మల హృదయుడు (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘డాక్టర్ రిపోర్ట్స్ వచ్చాయా?’’ అడిగాడు రఘురాం.
‘‘వచ్చాయి. అదీ...’’ నసిగాడు.
‘‘్ఫర్వాలేదు చెప్పండి! విని తట్టుకోగల శక్తి నాకుంది’’ అన్నాడు రఘురాం.
‘‘మీ వెన్నుముక దెబ్బతింది. మీరు వైవాహిక జీవితానికి పనికిరారు’’ చెప్పాడు డాక్టర్.
రఘురాంకి మిన్ను విరిగి మీద పడినట్లు అయింది. అయినా తమాయించుకుని ‘‘బై డాక్టర్’’ అంటూ బయటికి వచ్చేసేడు.
‘అమ్మకు ఈ విషయం ఎలా చెప్పడం? ఇప్పటికే తనని పెళ్లి చేసుకోమని పదేపదే పోరుతోంది. ఆమె మాటను తను జవదాటుతూ వచ్చాడు. ఇప్పుడీ పరిస్థితిలో ఇక వివాహం ఎలా చేసుకోను? ఏ ఆడపిల్ల గొంతు కోయను’ అనుకున్నాడు.
అన్యమనస్కంగానే ఇంటికి చేరుకున్నాడు.
‘‘ఏరా నాయనా! ఆఫీసుకి సెలవు పెట్టావా?’’ కొడుకుని చూడగానే అడిగారు మీనాక్షిగారు.
‘‘అవునమ్మా బ్యాంకు పని ఉంది’’ నోటికొచ్చిన అబద్ధం చెప్పేసాడు రఘురాం.
‘‘సరే వడ్డిస్తాను. భోజనం చేసి రెస్టు తీసుకో’’ అందామె.
రఘురాం చేస్తున్న ఉద్యోగానికి అప్పుడప్పుడు టూర్ మీద పై ఊరికి వెళ్లాల్సి వచ్చేది. రాత్రి కూడా అక్కడ ఉండిపోయే పరిస్థితి వచ్చేది ఒక్కోసారి.
అలాగే ఒకరోజు టూర్‌కి వెళ్లాడు. అది పల్లెటూరు. రాత్రికి వెయిటింగ్ రూంలో ఉండి తెల్లవారుజామున బండికి వెళ్లాలనుకున్నాడు. నాలుగు గంటలకే లేచి బ్రష్ చేసుకుని చాయ్ తాగి అక్కడే ఉన్న ప్లాట్‌ఫారం మీద కూర్చున్నాడు. అతనికి తల్లి మాటలు గుర్తుకొచ్చాయి. ‘రఘూ నీకు పిల్లనిస్తామని ఎందరో వస్తున్నార్రా. నాకు కులం, గోత్రం వంటి పట్టింపులు లేవు. చక్కని పిల్లని చేసుకో చాలు. కోడల్ని చూడకుండానే మరణిస్తానని భయంగా ఉంది’ అన్న తల్లి మాటలు గుర్తుకొచ్చి రఘురాం కళ్లు చిప్పిల్లాయి.
కానీ తనేం చేయగలడు? ఈ పరిస్థితిలో తనెలా వివాహం చేసుకోగలడు? అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తున్న రఘురాంకి దూరంగా పట్టాలపై వేగంగా వెళ్లిపోతున్న ఆకారం ఒకటి కనిపించింది.
‘ఎవరా మనిషి?’ అనుకున్నాడు రఘురాం.
దిగ్గున లేచి గబగబా అటు వెళ్లాడు. ఎవరో తరుముతున్నట్లు వెళ్లిపోతున్న ఆ ఆకారం వెనుక సడి కావడంతో నడక వేగం మరింత పెంచి దూరంగా సాగిపోవడం మొదలుపెట్టింది.
రఘురాం కూడా నడక వేగం పెంచి అనుసరించాడు.
అలా కొంచెం దూరం వెళ్లాక ఆ ఆకారం భుజం పట్టుకుని ఆపాడు.
తలమీదుగా కప్పుకున్న ముసుగును తొలగించి చూడాడు.
ఆశ్చర్యం... ఆ ఆకారం ఒక మహిళ. దాదాపు పాతికేళ్ల వయసు ఉంటుంది.
‘‘వదలండి... నన్ను వెళ్లనివ్వండి’’ అంటూ దూరంగా జరిగింది. ఆమె చేతిలో రోజుల పసికందు కూడా ఉంది.
‘‘ఎవరు మీరు? ఇంత చీకట్లో పట్టాలపై ఎక్కడికి వెళుతున్నారు?’’ అడిగాడు రఘురాం.
‘‘చనిపోయే వారికి చీకటి, వెలుతురు ఒకటే. నన్నాపకండి. నా దారిన నన్ను పోనివ్వండి’’ మొండిగా అందామె.
‘‘మీరు చావడానికి వీల్లేదు. భగవంతుడు మనిషిని పుట్టించింది బలవంతంగా చావడానికి కాదండీ! మీరెందుకు పసిపాపతో సహా చావాలనుకుంటున్నారో చెప్పండి’’ అన్నాడు రఘురాం.
‘‘బ్రతకడానికి అవకాశం లేక’’ అంది.
‘‘ప్రతి మనిషికీ సమస్యలుంటాయి. దానికి చావే పరిష్కారం కాదు. అలా అయితే ప్రపంచమే స్మశానం అవుతుంది. ఇంతకీ ఏమిటి మీ సమస్య. చెప్పండి... నాకు చేతనైన సాయం చేస్తాను’’ అన్నాడు రఘురాం.
ఆమె కొన్ని క్షణాలు ఆగి... చెప్పడం మొదలుపెట్టింది.
‘‘అందరిలాగే నేనూ పెళ్లి చేసుకుని కోటి ఆశలతో అత్తింట అడుగుపెట్టాను. నా అన్నవాళ్లు ఎవరూ నాకు లేరు. ఉన్న ఒక్కగానొక్క మేనమామ పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నాడు. అత్తింట్లో నాకు అగచాట్లు తప్పలేదు. పెళ్లి అయిన తర్వాత వరుసగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. వారిని నా అత్తింటి వారు అమ్మేసుకున్నారు. మళ్లీ మూడవసారి కూడా ఆడపిల్లే పుట్టడంతో నా భర్త, అత్త అంతా కలసి నన్ను ఇంట్లో నుండి బయటికి వెళ్లగొట్టారు. ఇటువంటి పరిస్థితిలో నాకు చావు కాక మరేం పరిష్కారం ఉంటుంది. అందుకే చావాలనుకుంటున్నాను. నా పాపని అనాథను చేయలేక దాన్నీ నాతో పాటే తీసుకుపోవాలని అనుకుంటున్నాను’’ అందామె.
ఆమె అలా చెప్పగానే రఘురాం మదిలో ఒక ఆలోచన మెదిలింది. ‘ఈమెకు ఎవరూ దిక్కులేదు. నాకు ఎలాగూ పిల్లలు పుట్టే యోగం లేదు కనుక పెళ్లి చేసుకోలేను. ఈమెని ఆదరించి తీసుకెళితే ఇద్దరి సమస్యకీ పరిష్కారం దొరికినట్లే కదా’
‘‘చూడండీ! మీరు అంగీకరిస్తే మీ సమస్యకి నేను ఒక పరిష్కారం చెబుతాను’’ అంటూ తన మనసులో మాట చెప్పాడు.
అంతా విని ఆమె ఒక క్షణం ఆలోచించింది.
‘‘మీ అవసరాన్ని ఆసరా చేసుకుని నేనిలా అనడంలేదు. మీకు ఇష్టం లేకపోతే మరో రకంగా ఆలోచిద్దాం’’ అన్నాడు రఘురాం.
‘‘లేదు మీ ఆలోచన బాగుంది. అలాగే చేద్దాం’’ అంది ఆమె.
* * *
‘‘ఏరా రఘూ! ఇదేనా రావడం? నా నుండి తప్పించుకుందామని అలా తిరుగుతున్నావా?’’ రఘురాం ఇంటికి వెళ్లగానే అడిగింది తల్లి.
‘‘అది కాదు అమ్మ. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. నువ్వా పిల్లని అంగీకరిస్తావో లేదో అని చెప్పలేదు’’ అన్నాడు రఘురాం.
‘‘అదేంట్రా నేనెందుకు ఒప్పుకోను? ఏదీ నా కోడలు పిల్ల?’’ అందామె ఆతృతగా.
‘‘కోడలితో పాటు మనవరాలు కూడా’’
‘‘ఆరి భడవా! నా దగ్గర ఇంత నాటకం ఆడతావా? ఏరీ వాళ్లు?’’ అంది.
‘‘అదిగో’’ ఆటోలో కూర్చున్న వాళ్లని చూపించాడు.
రఘురాం తల్లి వెళ్లి వాళ్లని తీసుకుని వచ్చింది.
‘‘నీ పేరేమిటమ్మా!’’
‘‘వైదేహి’’ చెప్పింది మీనాక్షి కాళ్లకి నమస్కరించి.
‘‘చక్కటి పేరు. చక్కటి జంట. ఈడూజోడు’’ అంది మీనాక్షి.
కోడల్ని, మనవరాల్ని దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్లింది.
రఘురాం, మీనాక్షిలు వైదేహిని, ఆమె పాపని కంటికి రెప్పలా చూసుకోవడం మొదలుపెట్టారు.
కడుపుకి పట్టెడన్నం పెట్టని అత్తగారు, ఆదరణే చూపని భర్త గుర్తుకొచ్చారు ఆమెకి. క్రూరమృగాలను విష జంతువులను సృష్టించిన సృష్టికర్తే ఆహ్లాదకరమైన ప్రకృతిని, అందమైన పశు, పక్ష్యాదులను సృష్టించాడు. అది ఆయనకే సాధ్యం అనుకంది వైదేహి.
నరక కూపం లాంటి అలాంటి ఇంటి నుండి స్వర్గతుల్యమైన ఇటువంటి ఇంట్లో ఓ ఉన్నతమైన స్థానం ప్రసాదించాడు దేవుడు. భగవంతుడిలాంటి రఘురాం. అతనికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలదు?
ఆమె పాపకు కృష్ణ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు.
ఆమె చక్కగా చదువుతూ పెరిగి పెద్దదయింది.
తల్లిదండ్రులు, నాయినమ్మల పెంపకంలో పెద్ద చదువులు చదివి డాక్టర్ అయింది.
‘‘నానమ్మా! ఇక నీ ముడుకు నొప్పులు, కాళ్లనొప్పులు హుష్‌కాకి’’ మీనాక్షితో అంది కృష్ణ వాటేసుకుని.
‘‘నా బంగారుకొండ! అందుకే నిన్ను డాక్టరీ చదవమన్నాను’’ అంటూ మనవరాలిని ముద్దాడింది మీనాక్షి.
రఘురాం బయట వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. కృష్ణ ఫ్రెండ్స్‌ని కలిసి వస్తానని వెళ్లింది. ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఎండ మండిపోతోంది. ఆ వ్యక్తి నీరసంగా నడవలేనట్లు అక్కడే తచ్చాడడం చూసి రఘురాం అతనికి మంచినీళ్లు ఇచ్చాడు.
ఆ వ్యక్తి రఘురాం వాళ్ల అరుగు మీద కూర్చున్నాడు.
రఘురాం కాఫీ తెమ్మని భార్యకి కేకేసి చెప్పాడు.
ఆ వ్యక్తి వివరాలు అడిగి తెలుసుకున్నాడు.
ఇంతలో బయటికి వెళ్లిన కృష్ణ ఇంటికి వచ్చింది.
‘‘మీ అమ్మాయా?’’ రఘురాంని అడిగాడు ఆ వ్యక్తి.
‘‘అవును’’ అన్నాడు రఘురాం.
‘‘చక్కగా ఉంది’’
‘‘మీకెంత పిల్లలు?’’
‘‘నాకా అదృష్టంలేదు లెండి. భార్యను, పుట్టిన బిడ్డను చేజేతులా దూరం చేసుకున్నాను. మళ్లీ పెళ్లి చేసుకున్నా సంతాన యోగం కలగలేదు. వారి ఉసురే నాకు శాపమై నా జీవితాన్ని బలి తీసుకుంది’’ అన్నాడా వ్యక్తి.
ఇంతలో వైదేహి కాఫీ తీసుకుని వచ్చింది.
ఆమెని చూసిన ఆ వ్యక్తి ‘సందేహం లేదు ఆమె ఆమె. తను చేజేతులా దూరం చేసుకున్న రత్నం’ అనుకున్నాడు. కళ్లు మూతలు పడినట్లు అయింది అతనికి.
‘‘మీరు కాఫీ తాగుతుండండి. నేను లోపలికి వెళ్లి వస్తాను’’ అన్నాడు రఘురాం. అతనికి భోజనం ఏర్పాటు చేయిద్దామని అనుకున్నాడు.
తిరిగి బయటికి వచ్చేసరికి అతను అక్కడ లేడు. కాఫీ కూడా తాగలేదు.
‘‘పాపం ఎవరో దిక్కూమొక్కూ లేని వ్యక్తి. కాఫీ కూడా తాగకుండా వెళ్లిపోయాడు’’ వైదేహితో అన్నాడు రఘురాం.
రఘురాంతో అతను మాట్లాడుతున్నప్పుడే వైదేహి అతన్ని తన భర్తగా గుర్తించింది. రఘురాం మాట కాదనలేక కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. అతని రూపం ఆమె మదిలో నుండి ఎప్పుడో తొలగిపోయింది.
దైవంలాంటి రఘురాం బొమ్మ ఆమె మదిలో పవిత్రంగా, నిర్మలంగా చోటు చేసుకుంది. అతడే ఆమె ఆరాధ్యదైవం.
‘‘ఏమిటలా ఆలోచిస్తున్నావు? అతను కాఫీ కూడా తాగకుండా వెళ్లిపోయాడంటే నీకు బాధగా లేదా?’’ అన్నాడు రఘురాం.
‘‘అనిపించినా అనిపించకపోయినామనమేం చెయ్యగలం చెప్పండి? ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది. పుణ్యం కొద్దీ ఫలం... పూజ కొద్దీ వరం’’ అంది.
అతనికి ఆమె లాజిక్ అర్థం కాలేదు.
కాని వైదేహికి, కాఫీ కూడా తాగకుండా వెళ్లిపోయిన అతడికి తెలుసు కారణం. కాని నిస్వార్థపరుడు, నిర్మల హృదయుడు అయిన రఘురాంకి తెలియదు అసలు కారణం.

- శివాని,
శృంగవరపుకోట,
సెల్ : 08966266384.
***

పుస్తక సమీక్ష
--
ప్రపంచాన్ని కళ్లకు కట్టిన
‘జ్వలించిన రాగాలు’

తడియారని కవిత్వాన్ని అందిస్తున్న శ్రీమతి సోమిశెట్టి స్వర్ణలత మూడవ రచన ‘జ్వలించిన రాగాలు’ కవితా సంపుటి పాఠకులను అలరించేలా రచించబడింది. ఎదలను తాకే సన్నివేశ రూపకల్పన ఈమె కవిత్వంలో రూపుదిద్దుకుని దృశ్యమానమయింది. 58 కవితల సమాహారం ఈ జ్వలించిన రాగాలు.
ఇందలి కవిత్వాన్ని పరిశీలిస్తే భావోద్వేగాల నడుమ నలిగే బంధాలు కొనవూపిరితో కన్నీటి చుక్కలై ముక్కలై పడుతున్న రక్తకన్నీరు రాతిశిలలైన మనుషులకేం వినిపిస్తుంది? అంటున్న కవిత్వం హృదయాన్ని తాకుతుంది. మనిషి మదిలో తాత్విక చింతనను రగిలిస్తుంది.
‘బిడ్డ భూమీద’ కవితలో బిడ్డ బాహ్య ప్రపంచాన్ని పరికరించే వేళ అడ్డం తిరిగితే, శ్వాసని నిలిపి, రుధిరపు చుక్కల్ని, అగ్నిహోత్రంలో వేస్తూ వేడుకుంటుంది. తానొక సంజీవిని వృక్షమై నిలవాలని, ఈ పంక్తుల్లో రామాయణ గాథ నాటి సన్నివేశం గుర్తుకొచ్చి పరవశింపజేస్తుంది. కవిత్వంలో బిగి ఉంది, జిగి ఉంది.
మొదటి లేఖ చదివిన క్షణం సంపెంగ పరిమన్ఘిల కొలనులో, పరువాలన్నీ, అభ్యంగన స్నానానికి సిద్ధమయ్యాయి. నిర్జీవమైన మది పొరలు తీపి కోతకు గురై, విరహామృతాన్ని సేవిస్తున్నాయి. యువతను ఉద్దేశించి ‘లక్ష్యం’ కవితలో నీ గమనం ఉక్కు స్తంభంలా ఉండాలి. ఆల్చనల బిగువు సడలకుండా ఉండాలి. నీ లక్ష్యం కరవాలమై అసాంఘిక శక్తుల్ని సర్రున కోసేయాలన్న సందేశం యువతను, నవతలో నింపి నాట్యం చేయిస్తుంది. కర్తవ్యాన్ని గుర్తు చేసే కదలికనిస్తుంది.
మస్తిష్కంలో నిస్త్రాణంగా పడి ఉన్న జ్ఞాపకాల పుస్తకాన్ని, చెమ్మగిల్లిన మనసుతో హత్తుకుంటున్నాను, ఏ పేజీని తిరగేసినా, తడి ఆరని తమకమే, పలకరిస్తుందన్న ‘తల పండిన అనుభవాలు’ కవిత కదం తొక్కి కవాతు చేస్తుంది. ‘నేటి మహిళ’ కవితలో అత్తవారింట సూటిపోటి మాటలు, సూదుల్లా గుచ్చుకుంటున్నా, తన వ్యక్తిత్వాన్ని గోడకు వేలాడదీస్తుంది. ఇంటా బయటా భూచక్రంలా తిరుగుతూ, భూమాతలా, మమతలు పంచుతుంది. కవిత్వం వాస్తవానికి అద్దం పడుతుంది. మహిళకు మార్గదర్శకాన్నిస్తుంది. అలాగే ‘అమ్మ’ కవిత బాగుంది. ఈ కావ్యానికి ఆచార్య ఎన్. గోపితో పాటు పలువురు పేరుపడ్డ కవులు ముందు మాటలు రాశారు. కవయిత్రి ప్రస్తుతం నోయిడా (ఉ.ప్ర.)లో ఉంటూ తెలుగు భాషను ఇనుమడింపజేస్తున్నారు.
- చెళ్లపిళ్ల సన్యాసిరావు,
సెల్ : 9293327394

***

మినీకథ
***

కాత్యాయిని

‘‘బామ్మా బాగున్నారా?’’ ఆటకు వెళుతున్న మున్నీ కాత్యాయినిగారిని చూసి పలకరించింది.
మున్నీ కాత్యాయిని వారింటి పక్కనుండే వారి పాప.
‘‘బాగున్నాను. ఆటకా?’’ ప్రశ్నించారు కాత్యాయినిగారు.
‘‘అవును’’ అంటూ తుర్రుమంది మున్నీ.
కాత్యాయినిగారికి అంతా కావాలి. అందరూ తనవాళ్లే అనుకుంటారు ఆవిడ.
వచ్చేపోయే పెద్దలు, పిన్నలు అందరితోనూ కలివిడిగా మాట్లాడతారు. వారిని పలకరించి, యోగక్షేమాలు విచారిస్తారు. వాళ్లు కూడా ఆమె పట్ల ఆప్యాయంగా ఉంటారు.
కాత్యాయినిగారికి ఆరుగురు కొడుకులు. మొదటి ఇద్దరు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. తర్వాతి ముగ్గురు కొడుకులు అదే వూళ్లో ఉద్యోగాలు చేస్తూ వేరింట కాపురాలు ఉంటున్నారు. చివరి కొడుకు మాత్రం తల్లి దగ్గరే ఉంటున్నాడు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు.
కాత్యాయినిగారి భర్త పరంధామయ్యగారు తహశీల్దార్‌గా పని చేసి పదవీ విరమణ చేశారు. ఆయన పెన్షనే ఇప్పుడు కాత్యాయినిగారికి వస్తుంది.
ఉండడానికి ఆరుగురు కొడుకులున్నా వాళ్లెవరూ ఆమెని కనీసం చూడడానికి కూడా రారు.
ఆమె కూడా వారి దగ్గరకి వెళ్లరు.
అంతా అదే అంటారు ఆమెతో ‘పాపం మీకు అందరూ కొడుకులే అయినా సుఖం లేదు. ఒక్క కొడుకు కూడా తీసుకెళ్లి సుఖపెట్టడు’ అని సానుభూతి చూపుతుంటారు.
దానికి కాత్యాయినిగారు నవ్వుతూ ఆ విషయాన్ని దాటేస్తుంటారు.
ఆమె ఆఖరు కొడుకు సరిగ్గా చదువుకోకపోవడం వల్ల మంచి ఉద్యోగం రాలేదు. తల్లి చెంతనే ఉంటాడు.
ఒకరోజు కాత్యాయిని స్నేహితురాలు ఆమెని చూడడానికి వచ్చింది. ఆమాట ఈ మాట అయ్యాక ‘‘అంత మంది కొడుకులు ఉండి నువ్వు చిన్నోడితో ఇలా ఒంటరిగా ఉండడం ఏమిటి? వాళ్లు నిన్ను చూడకపోతే మేమంతా లేమా? వాళ్లని నిలదీస్తాం. తల్లి, తమ్ముడి బాగోగులు చూడకుండా పెళ్లాల కొంగు పట్టుకుని తిరుగుతుంటే ఎలా?’’ అందామె.
దానికి కాత్యాయిని నవ్వి ‘‘నువ్వు అపోహ పడుతున్నావు. నా వయసు ఆడవాళ్లలో చాలా మంది కంటే నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. పిల్లలు చూడక అనాథాశ్రమాల్లో, దేవాలయాల అరుగుల మీద, ఎక్కడో ఏ చెట్టు కిందో నేను లేను. దేవుడులాంటి నా భర్త వల్ల సంక్రమించిన నాలుగు పెన్షన్ రాళ్లతో నేనూ, నా చిన్నకొడుకు భుక్తికి లోటు లేకుండా గడిచిపోతుంది. ఈ మాత్రం ఆధారం కూడా లేని వాళ్లెంతో మంది కదా. వారి కంటే నేను మంచి స్థాయిలోనే ఉన్నాను కదా. నేను ఈ విషయంలో సంతోషంగానే ఉన్నాను. ఇందుకు నేను సదా ఆ భగవంతుడికి కృతజ్ఞురాలనై ఉంటాను’’ అన్నారు.
ఆ మాటకి ఆమె స్నేహితురాలు ‘అంతేలే’ అన్నట్లు చిన్నగా తల పంకించింది.
- గంటి కృష్ణకుమారి,
బాబామెట్ట, విజయనగరం
సెల్ : 9441567395.
***

మనోగీతికలు
**
కాలింగ్ బెల్!

మెరుపులాంటి
ఆలోచన రావడం
అదృష్టమే!
దానిని ఆచరణలోకి
తీసుకురావడం
తలపుల తలుపులు
తెరవడం!

- గుడిమెట్ల గోపాలకృష్ణ
అరసవిల్లి
సెల్ : 8977474958.
----

అమ్మ చీర కొంగు

పసిపాప పాలు తాగినా
చంటిబిడ్డ బువ్వ తిన్నా
ఆమె వెంటనే నోటిని తడుముతూ
బుజ్జిగాడు లాల పోసినా
వాడి చిట్టి దేహానికి
వెచ్చని స్పర్శను అందిస్తూంది
కమ్మని బంధంగా అల్లుకుంటూ
వేసవి ఉక్కపోతలో
చల్లని పవనాన్ని అందిస్తుంది
నిద్రపోతున్న బుడతలకు
ప్రక్కన నేనున్నాను అనే
భరోసాను కల్పిస్తూ
అమృత ప్రతిఫల
దృశ్యరూప కావ్యమైన
‘అమ్మ’ ప్రేమను
అందించే తొలి వరప్రసాదం
అమ్మ చీరకొంగు!

- పెయ్యల శ్రీనివాసరావు,
అలికాం గ్రామం, శ్రీకాకుళం.
సెల్ : 8886423116.
---

కష్టజీవికి
ముందు వెనుక!
ఒక్కొక్క అక్షరం
ఒక్కొక్క వరమాల
శ్రామికుడ్ని వధించింది!
ఒక్కొక్క అక్షరం
ఒక్కొక్క అణుబాంబై
కాప్టిలిజాన్ని పేల్చివేసింది!
ఒక్కొక్క అక్షరం
ఒక్కొక్క ప్రస్థానమై
కుళ్లు రాజకీయాలను
తూర్పార బట్టింది!
ఒక్కొక్క అక్షరం
ఒక్కొక్క అగ్నికణమై
రాజ్యం బూజును
నుసినుసిగా మార్చింది!
ఒక్కొక్క అక్షరం
సిరిసిరిమువ్వై
నికృష్ట సమాజపు గుండెపై
నృత్యం చేసింది
ఒక్కొక్క అక్షరం
ప్రణవనాదమై
అంతటా ఆహ్లాదం
కురిపించింది
ఆ అక్షరాలను
మేలుదారులు పట్టించిన
మరో ప్రపంచపు బాటసారి
ఇంకెవ్వరు...
రెండక్షరాల శ్రీశ్రీ!

- కిలపర్తి దాలినాయుడు,
సాలూరు,
సెల్ : 9491763261.
---

బ్రతుకు చిహ్నాలు

నా పెరటి తోటలో పూల మొక్కలనె్నటినో
ప్రేమతో పెంచాను ఏపుగా ఎదిగిన
గులాబి మొక్కలు పూలెన్నో పూసాయి
సొగసుల్తో మెరిసాయి పిలుపైనా లేకుండా
అనుమతైనా లేక తుమ్మెద బాలలు
నా తోటలో కొచ్చె తుమ్మెద బాలలతో
నా గులాబీలన్నీ కౌగిళ్లలో - జారి
ఊయాలలూగాయి మధువునందించాయి
తోటమాలిని నన్ను తోసిపారేసాయి
ఉయాదనే్న వచ్చి తోట తిలకించగా
నా గులాబీలన్ని రేకులై రాలాయి
మోసపోయిన మహిళ బ్రతుకు చిహ్నాలుగా

- విద్వాన్ ఆండ్రకవిమూర్తి,
అనకాపల్లి
---

చూపు

నేటి కుర్రకారు చూపు లక్షలవైపే గాని
లక్షణమైన పిల్లవైపు కాదు!
(వి)నాయకుల చూపు
పదవుల వైపేగాని ప్రజల
కష్ట సుఖాలవైపుకాదు!
తల్లిదండ్రుల చూపు సంపాదనవైపే గాని
పిల్లల భవితవైపు కాదు!
గురువుల చూపు సంపాదనవైపేగాని
విద్యార్థుల భవితవైపు కాదు!
యువతరం చూపు వెర్రి - మొర్రి
ఫ్యాషన్ల వైపే గాని
బంగారంలాంటి భవితవైపు కాదు!
- కాళ్ల గోవిందరావు,
ఆమదాలవలస-532185
సెల్ : 9550443449.

----
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.