రాష్ట్రీయం

మీ మైండ్‌సెట్ మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్పొరేట్ ఆస్పత్రుల తీరుపై గవర్నర్ ఆగ్రహం

పేదలను దోచుకునే వైఖరికి స్వస్తి చెప్పండి
అనవసరంగా పరీక్షలు చేయడం తగదు
గ్రామీణ ప్రాంతాలపై నిర్లక్ష్యం ఎందుకు?
డాక్టర్ల వైఖరిని దునుమాడిన నరసింహన్
చికిత్స వ్యయం నియంత్రణపై సదస్సు నిర్వహిస్తానని వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 12: గవర్నర్ నరసింహన్ కార్పొరేట్ ఆస్పత్రుల వైఖరిపై మండిపడ్డారు. పేదప్రజలను దోచుకునే వైఖరిని ఇకనైనా విడనాడాలని హితవు చెప్పారు. ఎంబిబిఎస్ చదివిన డాక్టర్లు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. డాక్టర్లు మానవతా దృక్పథంతో ఉండాలన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులు కమర్షియల్ మైండ్‌సెట్ నుంచి బయటపడాలని సూచించారు. శనివారం ఇక్కడ బంజారాహిల్స్‌లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రీసెర్చి ఇనిస్టిట్యూట్‌లో రెండు రోజుల 13వ అఖిల భారత కేన్సర్ కేర్ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో గొప్పదని, రోగి పరిస్ధితిని అర్ధం చేసుకుని సానుభూతి చూపించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఔదార్యం అనేది మందుల కన్నా ఎక్కువగా రోగాన్ని తగ్గిస్తుందన్నారు. పేషెంట్లకు ధైర్య వచనాలు చెప్పేందుకు కూడా డాక్టర్లు సమయం వెచ్చించడం లేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని వేధిస్తున్న ఐదు భయంకర వ్యాధులను గుర్తించి వాటిని సమూలంగా నిర్మూలించడానికి కార్పొరేట్ ఆసుపత్రులు తమ సామాజిక బాధ్యత నిధి నుంచి నిధులు కేటాయించాలని సలహా ఇచ్చారు. పెరిగిపోతున్న చికిత్స వ్యయాన్ని నియంత్రించడంపై తాను స్వయంగా త్వరలోనే రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ ఆసుపత్రులతో సదస్సును ఏర్పాటు చేస్తానన్నారు. ఇప్పటికైనా కార్పొరేట్ ఆసుపత్రులు రోగుల చికిత్సకయ్యే ఖర్చును పారదర్శకంగా అందరకూ తెలిసే విధంగా పద్ధతులను అవలంబించాలన్నారు. చక్కెర వ్యాధి లేని ఒక వ్యక్తికి చక్కెర వ్యాధి ఉందా లేదా తెలుసుకునేందుకు వారం రోజుల్లో 28 పరీక్షలు చేస్తున్న విషయం విచారకరమన్నారు. అనవసరంగా వైద్య పరీక్షలు నిర్వహించడం తగదన్నారు. వైద్యులు నైతిక నియమావళిని పాటించాలన్నారు. వైద్యులు దేవుడితో సమానమని, రోగులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని చెప్పారు.బసవ తారకం ఆసుపత్రి కార్యనిర్వాహకులు ఆర్‌పి సింగ్ మాట్లాడుతూ 1,85,000 మందికి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. క్యాన్సర్ కేర్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ జెకె సింగ్ మాట్లాడుతూ సాలీనా పది లక్షల మంది కొత్త క్యాన్సర్ రోగులు నమోదవుతున్నారన్నారు. బిఐఏసిహెచ్ డైరెక్టర్ డాక్టర్ టిఎస్ రావు, ప్రధాన కార్యదర్శి రేణు సైగల్ పాల్గొన్నారు. దేశ, విదేశాల నుంచి క్యాన్సర్ నిపుణులు ఈ సదస్సుకు హాజరయ్యారు. (చిత్రం) బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రీసెర్చి ఇనిస్టిట్యూట్‌లో 13వ అఖిల భారత కేన్సర్ కేర్ సదస్సును జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న గవర్నర్ నరసింహన్