బిజినెస్

అమ్మకానికి యమునా ఎక్స్‌ప్రెస్‌వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశించిన రాబడి రాకపోవడమే కారణం
60 వేల కోట్ల అప్పుల్లో జెపీ గ్రూపు
‘మింట్’ వార్తాపత్రిక వెల్లడి

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా-ఆగ్రా మధ్య 165 కిలోమీటర్ల పొడవున ఆరు లైన్లతో ఏర్పాటు చేసిన యమునా ఎక్స్‌ప్రెస్‌వేను జెపీ గ్రూపు అమ్మకానికి పెట్టినట్లు ప్రముఖ వార్తాపత్రిక ‘మింట్’ వెల్లడించింది. దాదాపు 13 వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై 2012 ఆగస్టు నుంచి రాకపోకలు ప్రారంభమైన విషయం తెలిసిందే. జైప్రకాష్ పవర్ వెంచర్స్, జైప్రకాష్ అసోసియేట్స్, జెపీ ఇన్‌ఫ్రాటెక్ సంస్థలతో కూడిన జెపీ గ్రూపు ఇప్పటికే 60 వేల కోట్ల రూపాయల రుణ భారంతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేను అమ్మేయాలని ఆ గ్రూపు తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యకరమైనది కాదు. యమునా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు మొత్తం ఖర్చులో ఉత్తరప్రదేశ్‌లోని ఐదు ల్యాండ్ పార్శిల్స్ కూడా ఇమిడి ఉన్నాయని, ఈ భూముల్లో జెపీ గ్రూపు ఐదు టౌన్‌షిప్పులను అభివృద్ధి చేస్తోందని, కనుక ఈ రోడ్డు ప్రాజెక్టును అమ్మేయడం జెపీ ఇన్‌ఫ్రాటెక్‌కు ‘కష్టతరమైన’ వ్యవహారమేనని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మేబ్యాంక్ పేర్కొంది.
యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో వాహనాల రాకపోకలు ఆశించిన విధంగా లేకపోవడంతో ఈ ప్రాజెక్టు ద్వారా రావలసిన రాబడి అంచనాల కంటే ఎంతో తక్కువగా ఉందని, ఈ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా టోల్ రూపంలో 1000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని గతంలో భావించగా, ప్రస్తుతం 200 కోట్లకు మించి ఆదాయం లభించడం లేదని మేబ్యాంక్ వివరించింది. అయితే జెపీ గ్రూపు ఈ ప్రాజెక్టును అమ్మకానికి పెట్టిన విషయం తమకు తెలియదని మేబ్యాంక్ యాజమాన్యం స్పష్టం చేసింది.
ఆగ్రాలో తాజ్‌మహల్‌ను సందర్శించేందుకు ప్రయాణ సమయం తగ్గుతుండటంతో పర్యాటకుల నుంచి యమునా ఎక్స్‌ప్రెస్‌వేకి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఈ రోడ్డుపై పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరగడంతో దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన రహదారిగా యమునా ఎక్స్‌ప్రెస్‌వే అపఖ్యాతిని మూటగట్టుకుంది. 2012లో ఈ రోడ్డుపై 275 ప్రమాదాలు జరగ్గా 2013లో 896 ప్రమాదాలు, 2014లో 771 ప్రమాదాలు, ఈ ఏడాది జూలై మధ్య నాటికి 319 ప్రమాదాలు జరగడమే ఇందుకు కారణం.