మిర్చిమసాలా

బాబు సెటైర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీరియస్‌గా చర్చ జరుగుతున్నపుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేసే సెటైర్లు అప్పటికే బిగిసిపోయినట్టుండే అధికారులు, నేతల్లో ఉత్సాహాన్ని నింపుతుంటాయి. గతంలో సైతం వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించినపుడు ఒక కలెక్టర్ జన్మభూమిలో వచ్చిన సమస్యలు ఎన్ని అంటే ఆరు లక్షలు అని చెప్పారు. ఎన్ని పరిష్కరించారు అంటే 50వేలు అని సమాధానం వచ్చింది. మిగిలినవి ఎప్పటిలోగా పరిష్కరిస్తారు అనగానే కలెక్టర్ రేపటిలోగా అని సమాధానం ఇచ్చారు. దాంతో వీడియోకాన్ఫరెన్స్‌లో ఉన్న అందరిలో నవ్వులు విరిశాయి. ఈ మధ్య ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంపై ఎమ్మెల్యేలతో జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో కూడా బాబు నవ్వులు పూయించారు. పెనమలూరు ఎమ్మెల్యే, గన్నవరం ఎమ్మెల్యేలు సొంత టెక్నాలజీ వాడుతున్నారని సెటైర్లు వేశారు. తెనాలి ఎమ్మెల్యే ఎక్కడా అనగానే ఢిల్లీ వెళ్లారని చెప్పగా అయితే నేను అడిగానని చెప్పండి అని వ్యాఖ్యానించారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే ప్రస్తావన వచ్చేసరికి కుమారస్వామిలా కష్టపడకుండా వినాయకుడిలా చేద్దామని చూస్తున్నావా అని వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఆయన జోకులు నేతలకు చురకల్లా తగిలాయి.
- బి వి ప్రసాద్
*
దారి తప్పిన మంత్రి..!
అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎవరైనా ఏదైనా అంశంపై మాట్లాడుతున్నప్పుడు, ఇంకా ఏవేవో అంశాలనూ ప్రస్తావిస్తుంటే పాలక పక్షం, మంత్రులు లేదా స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ చర్చ జరుగుతున్న అంశంలోకి రావాలని సూచిస్తుంటారు. కాగా ‘కెసిఆర్ కిట్స్’పై అసెంబ్లీలో జరిగిన చర్చకు వైద్య శాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి సమాధానమిస్తూ పర్యావరణం, పరిశుభ్రత గురించి, మంచి నీరు, గండి పేట నీరు ఇలా చెప్పుకుంటూ పోతుంటే సభ్యులు నవ్వాపుకోలేకపోయారు. వెంటనే బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్‌రెడ్డి కల్పించుకుని ‘మీ కెసిఆర్ కిట్స్‌లో మిషన్ భగీరథ, పర్యావరణం ఇన్నీ ఉన్నాయా?, ఇంకా రెండు పడకల గదుల నిర్మాణం గురించి లేదా?’ అని ప్రశ్నించడంతో స్పీకర్‌తో సహా సభ్యులంతా నవ్వారు. మంత్రిగారు దారి తప్పారు, కిట్స్ సబ్జెక్ట్‌లోకి రమ్మనండి అని కిషన్‌రెడ్డి అనడంతో సభ్యులంతా మరోసారి గొల్లుమని నవ్వారు.
- వి. ఈశ్వర్ రెడ్డి
*
వైకాపా బహిష్కరణ స్కోరెంత?!
త్వరలో జరగనున్న రాష్ట్ర శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార పక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, నాయకులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు. ఈనేపథ్యంలో శాసనసభ స్పీకర్ జారీచేసిన బులెటిన్ ప్రకారం మొత్తం 175 మంది సభ్యుల్లో టిడిపి తరపున 104 మంది, వైకాపా తరపున 67 మంది, బిజెపి తరపున నలుగురు సభ్యులు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైకాపా సభ్యుల్లో నలుగురు మంత్రులు సహా 21 మంది రేపటి సమావేశాలకు హాజరు కాబోతుంటే దీనిపై రభస ఏల? అంటూ విస్మయం వ్యక్తపరుస్తున్నారు!
కొసమెరుపు: పార్టీ ఫిరాయించిన ఈ 21 మందిపై స్పీకర్ వేటు వేయలేదనే కారణంతోనే అసెంబ్లీ బహిష్కరణ జరగబోతోంది.
- నిమ్మరాజు చలపతిరావు
*
నిజాలు.. పుకార్లు
ఎన్నికలు మరో ఏడాదిన్నరలోవచ్చేస్తున్నాయ్. సాధారణంగా ఎన్నికల సమయంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి రాజకీయ పార్టీ నేతలు గెంతుతుంటారు.తెలంగాణలో మాత్రం ఎన్నికల వేడి కొట్టొచ్చినట్లు కనపడరుతోంది. టిడిపి యంగ్ టర్క్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి మారారు. ఆయన అనుచరులు కూడా పార్టీని ఫిరాయించేశారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీ ఉన్న టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ కాంగ్రెస్‌లోకి వచ్చేస్తారని కొన్ని టీవీలు ప్రచారం చేశాయి. దీంతో కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, తనకు వైఎస్‌ఆర్ జన్మ ఇస్తే, కెసిఆర్ పునర్జన్మ ఇచ్చారన్నారు. ఇంకా రానున్న రోజుల్లో రాజకీయనేతలు పార్టీలు మారడం ఖాయం. కాని కొంత మంది పార్టీ మారుతారో లేదో తెలియదు కాని, సామాజిక, ప్రసార మాధ్యమాలు ఫలానా వారు పార్టీ మారడం ఖాయమంటూ అటు వీక్షకులకు కాలక్షేపం కల్పిస్తాయి. పార్టీ మారకూడదనే వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తాయనడం నిర్వివాదాంశం.
- శైలేంద్ర

*
రేవంత్ ఏమైతడు!
టిటిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డిపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు. రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌లో ఏమి పోస్టు వస్తుందని ఒక కార్యకర్త పార్టీ సీనియర్ నాయకుడిని అడగితే ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో అమితంగా చక్కర్లు కొడుతుంది.
కార్యకర్త: రేవంత్‌రెడ్డికి పిసిసి అధ్యక్షుని పోస్టు ఇస్తారా?
నాయకుడు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉండగా ఆయనకెలా ఇస్తారు.
కార్యకర్త: మరి సిఎల్‌పి పోస్టు ఇస్తారా?
నాయకుడు: జానారెడ్డి ఉండగా ఆయనకెలా ఇస్తారు?
కార్యకర్త: పోనీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సిఎం అవుతాడా?
నాయకుడు: ఆ పోస్టుపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎప్పుడో దస్తీ వేసారు తెలియదా?
కార్యకర్త: మరి ఇంతకు రేవంత్‌రెడ్డి ఏమైతడన్నా?
నాయకుడు: ఏమైతడు... కోడంగల్‌కు మాజీ ఎమ్మెల్యే అయితడు.
కార్యకర్త: ...!?
- వెల్జాల చంద్రశేఖర్