జాతీయ వార్తలు

శాంతికి ప్రతీక ఇస్లాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగ్రవాదంపై పోరు ఏ మతానికీ వ్యతిరేకం కాదు
మానవీయ విలువల బలంతోనే ఎదుర్కోవాలి
ప్రపంచ సూఫీ ఫోరం సమావేశంలో మోదీ

న్యూఢిల్లీ, మార్చి 17: శాంతి, సామరస్యాలకు ఇస్లాం మతం ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అల్లాకు ఉన్న 99 పేర్లలో ఏదీ కూడా హింసకు ప్రతీక కాదని పేర్కొన్న ఆయన ఉగ్రవాదాన్ని అణచివేయడానికి చేపట్టే చర్యలు ఏ మతానికి వ్యతిరేకం కాదని గురువారంనాడిక్కడ జరిగిన ప్రపంచ సూఫీ ఫోరం సమావేశంలో ఉద్ఘాటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మతాన్ని ఉగ్రవాదంతో ముడిపెట్టకూడదని, వీటిని భిన్న కోణాల్లోనే చూడాలని తెలిపారు. ఉగ్రవాద అణచివేత చర్యల్ని మానవీయ శక్తులు అమానుష శక్తులపై జరిపే పోరాటంగానే పరిగణించాలన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని సమర్థించజాలమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కొన్ని ఉగ్రవాద సంస్థలు రా జ్య విధానంగా, వ్యూహంగా మారాయంటూ పాకిస్తాన్ పేరును పరోక్షంగా ప్రస్తావించారు. భిన్న రూపాలు, కారణాలను ఆలంబనగా చేసుకుని ఉగ్రవాదం పేట్రేగుతోందన్నారు. ఈ కారణాలు ఎలాంటివైనా ఉగ్రవాద ధోరణులు గర్హనీయమన్నారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడానికి శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారని, ఇంకొన్ని శక్తులు సరిహద్దుల్లేని సైబర్ ప్రపంచంలో స్ఫూర్తిని పొందుతున్నాయని తెలిపారు. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలన్న అంశాన్ని చర్చించేందుకు అఖిల భారత ఉలేమా, ముషాయిఖ్ బోర్డు ఈ సమావేశాన్ని నిర్వహించింది. ఏ మతాన్నయితే పరిరక్షిస్తున్నామని ఉగ్రవాదులు చెప్పుకుంటారో ఆ మతమే వారి చర్యల వల్ల ధ్వంసమవుతుందన్నారు. వీరి చర్యల వల్ల మాతృ దేశానికే ఎక్కువ నష్టమని, అయితే ఈ ధోరణులు మొత్తం ప్రపంచానే్న అభద్రతా కూపంలోకి నెట్టేస్తాయని మోదీ పేర్కొన్నారు. మతం పేరుతో ఉగ్రవాదాన్ని వ్యాపింపచేసే శక్తులు అన్ని మతాలకు వ్యతిరేకమేనన్నారు.
సైనిక, దౌత్య, నిఘా మార్గాల్లో కాకుండా అన్ని మతాల సందేశాల సారాంశ బలంతో, మానవీయ విలువల శక్తితోనే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 20దేశాలకు చెందిన ఆధ్యాత్మిక వేత్తలు, తత్వవేత్తలు, విద్యావేత్తలు సహా రెండు వందల మంది ప్రతినిధులు హాజరయ్యారు.
(చిత్రం) న్యూఢిల్లీలో గురువారం జరిగిన ప్రపంచ సూఫీ ఫోరం సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ